
దేశానికి పెన్సిల్ ఉత్పత్తికి కావాల్సిన 90 శాతం కలప ఇక్కడి నుంచే
85 దేశాలకు ఎగుమతులు
మార్చి 30 జాతీయ పెన్సిల్ దినోత్సవం
ఏపీ సెంట్రల్ డెస్క్: జమ్ము కశ్మీర్‌లోని పుల్వామా జిల్లా ఓఖూ గ్రామం పెన్సిల్ విలేజ్ ఆఫ్ ఇండియాగా వినుతికెక్కింది. దేశం నుంచి పెన్సిల్ ఉత్పత్తికి కావాల్సిన 90 శాతం ముడి కలప ఇక్కడి నుంచే కంపెనీలకు ఎగుమతవుతోంది. పెన్సిళ్ల తయారీకి అవసరమైన కలపను ఒకప్పుడు చైనా, జర్మనీ నుంచి ఇక్కడివారు దిగుమతి చేసుకునేవారు. ఇప్పుడా అవసరం లేకుండా స్థానికంగా లభించే కలపను సమర్థవంతంగా నియోగించుకుంటున్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో తమదైన ముద్ర వేసుకుంటున్నారు. మార్చి 30 జాతీయ పెన్సిల్ దినోత్సవం. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం పాఠకుల కోసం.
ప్రధాని ప్రస్థానంతో వెలుగులోకి..
దేశ ప్రధాని నరేంద్రమోదీ తన మనసులోని భావాలను ఆవిష్కరించే మన్ కీ బాత్ (mann ki baat) లో పెన్సిల్ విలేజ్ ఆఫ్ ఇండియాగా ఓఖూను అభివర్ణించారు. దీంతో ఈ గ్రామం వెలుగులోకి వచ్చింది. పుల్వామా జిల్లాలోని ఈ గ్రామం పెన్సిల్ తయారీకి ప్రధాన కేంద్రంగా గుర్తింపుపొందింది. దేశాన్ని విద్యావంతులుగా తీర్చిదిద్దడంలో పుల్వామా కీలక భూమిక పోషిస్తోందని, విద్యార్థులు తమ హోంవర్క్ చేయడం, నోట్స్ రాసుకోవడంలో పెన్సిల్ (Pencil) వినియోగించినప్పుడల్లా పుల్వామా జిల్లా స్ఫురణకు వస్తుందని మన్ కీ బాత్ ప్రసంగంలో కితాబిచ్చారు.
దిగుమతుల నుంచి ఎగుమతుల దాకా..
1960 నుంచి ఇక్కడ పరిశ్రమల ప్రస్థానం ప్రారంభమైంది. మొదట్లో పెన్సిల్ తయారీకి దియోదార్ కలపను వినియోగించేవారు. 1992లో ఇక్కడి ప్రభుత్వం దియోదార్ వినియోగాన్ని నిషేధించడంతో చైనా, జర్మనీ దేశాల నుంచి కలపను దిగుమతి చేసుకునేవారు. అయితే ఇది వ్యయ ప్రయాసలతో కూడినది కావడంతో ప్రత్యామ్నాయానికి అన్వేషించారు. అలాంటి సమయంలో ఇక్కడ లోయల్లో లభించే పోప్లర్ కలప వీరికి వరంలా మారింది. ఆ కలపతో పెన్సిల్ పలకలను తయారుచేయడం మొదలెట్టారు. పోప్లర్ కలప పెన్సిల్ నాణ్యతను పెంచడంతో దిగుమతుల దశ నుంచి ఎగుమతి చేసుకునే స్థాయికి చేరింది. యూఏఈ, మెక్సికో, నేపాల్, పోలాండ్, ఫ్రాన్స్, భూటాన్, యూకే, బెల్జియం, మారిషస్, లెబనాన్, మాల్దీవులు, గ్రీక్, శ్రీలంక, బంగ్లాదేశ్ తోపాటు 85 దేశాలకు ఎగుమతి చేస్తున్నారు.
నిరుద్యోగుల కల్పతరువు... ఓఖూ
ఓఖూ... పుల్వామా జిల్లాకు చెందిన ఓ మారుమూల గ్రామం. ప్రపంచ స్థాయి మార్కెట్లో ఒకటిగా వెలుగొందుతోంది. గతంలో ముడి కలపను జమ్ము, చండీగఢ్‌లో ముక్కలుగా చేసి తెప్పించేవారు.స్థానిక ప్రభుత్వం వీరికి ఆధునికతను అందుబాటులోకి తీసుకురావడంతో పెన్సిల్ పలకలను ఇక్కడే తయారు చేస్తున్నారు. పెన్సిల్ రూపకల్పనకు అవసరమైన పలకలను ఎండబెడతారు. ఇవి బాగా ఆరాక ఒక్కో పెట్టెలో 800 పలకల లెక్కన ప్యాక్ చేస్తారు. నటరాజ్, అప్సర, హిందూస్థాన్ పెన్సిళ్ల తయారీ కర్మాగారాలకు ఇక్కడి నుంచే కలప వెళ్తోంది. ఏనాటికైనా కశ్మీర్ లోనే పూర్తిస్థాయి పెన్సిల్ ప్లాంట్ అందుబాటులోకి రావాలని, ప్రపంచ స్థాయిలో పెన్సిల్ ఉత్పత్తిలో దేశాన్ని అగ్రగామిగా నిలపాలన్నది ఓఖూ గ్రామస్తుల ఆకాంక్ష.
చదవండి: వర్క్ షేరింగ్.. హ్యాపీనెస్ లోడింగ్