సాక్షి, న్యూఢిల్లీ : కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఓ టెర్రరిస్టు దాడిలో 44 మంది సైనికులు మరణించడం ఎవరు ఎప్పటికీ పూడ్చలేని లోటు. ఎదను తన్నుకుంటూ పెల్లుబికి వచ్చిన కన్నీళ్లను భారత జాతి కొద్ది కాలానికి మరచిపోవచ్చు. కానీ వారి కుటుంబాలు ఎప్పటికీ మరచి పోలేవు. ఇంతటి విషాధాన్ని మిగిల్చిన దారుణ సంఘటనకు ప్రత్యక్షంగా టెర్రరిస్టులు, పాకిస్థాన్ కారణం కావచ్చు. పరోక్షంగా మనం అంటే, మన వ్యవస్థ, ఇంటెలిజెన్స్ విభాగం, అధికార యంత్రాంగం, విధాన నిర్ణేతలు కారణం కాదా? మన వ్యవస్థలు పటిష్టంగా ఉండి ఉంటే ఇంతటి దారుణాన్ని నిలువరించి ఉండేవాళ్లం కాదా?!
మొదటి వైఫల్యం
80 వాహనాలను, 2,500 మంది సైనికులను ఒకేసారి గణతంత్ర దినోత్సవం పరేడ్‌లాగా ఎక్కడైనా పంపిస్తారా ? అందుకు అనుమతిస్తారా ? సైన్యం ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలి వెళ్లాలంటే విడతలుగా, జట్టు జట్టుగా వెళ్లాలని సైనిక నిబంధనావళే తెలియజేస్తోంది. ఉగ్రవాదుల అలజడి ఎక్కువగా ఉన్న దక్షణ కశ్మీర్ రోడ్డులో అంత మంది సైనికులు ఒక్కసారి ఎందుకు వెళ్లారు ? వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేక జాతీయ రహదారి మూసుకుపోయినందున రెండు రోజుల పాటు జమ్మూలో సైనికులు నిలిచి పోవాల్సి వచ్చిందని సైనిక అధికారులు చెబుతున్నారు. అలాంటప్పుడు వాతావరణం అనుకూలించగానే కొంత మందిని విమానాల ద్వారా, మరి కొంద మందిని వాహనాల ద్వారా పంపించ వచ్చుగదా? అలా ఎందుకు చేయలేదు ? విమానాలకు ఖర్చు ఎక్కువవుతుందనా?
రెండో వైఫల్యం
సైనిక వాహనాలకు మధ్య పౌర వాహనాలను చొచ్చుకొని రావడం వల్ల ఐఈడీ పేలుడు పదార్థాలతో నిండిన వాహనం రావడాన్ని సకాలంలో గుర్తించలేక పోయామని సైనిక అధికారులు చెబుతున్నారు. పౌర వాహనాలను ఎందుకు అనుమతించారు ? రాజకీయ నాయకుల కాన్వాయ్ పోతుంటే పౌర వాహనాలను నిలిపివేస్తారుగానీ, దేశాన్ని రక్షించే సైన్యం పోతుంటే నిలిపివేయరా ? వారి ప్రాణం పోయాక సాల్యూట్ కొడితే ఏం లాభం? (నా గుండె కూడా మండుతోంది)
ఇంటెలిజెన్స్ వైఫల్యం
త్వరలో ఆత్మాహుతి దాడి జరిగే అవకాశం ఉందంటూ ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన సీఆర్‌పీఎఫ్‌కు ఇంటెలిజెన్స్ వర్గాలు సాధారణ హెచ్చరిక జారీ చేసిందట. ఎక్కడ జరుగుతుందో, ఎప్పుడు జరుగుతుందో, ఎవరు జరుపుతారో? మాత్రం ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పలేక పోయాయి, కనుక్కోలేక పోయాయి. ఆత్మాహుతి దాడి గురించి ఎక్కడ ఉప్పందిందో అక్కడి నుంచి అనువనువు శోధించుకుంటూ వస్తే ఎక్కడో ఓ చోట దాడికి కుట్ర జరగుతోందన్న విషయాన్ని కచ్చితంగా తెలుసుకుని ఉండేవారు. బాంబర్ 350 కిలోల పేలుడు పదార్థాలను అక్రమంగా సేకరిస్తున్నప్పుడు కనుక్కునే అవకాశం ఉండింది. వాహనంతో సైనిక వాహన శ్రేణిని ఢీకొన్న ఆత్మాహుతి బాంబర్‌కు, కుట్ర దారులకు మధ్య చివరి వరకు సమాచార మార్పిడి జరిగి ఉంటుంది. మధ్యలో సమాచారాన్ని ట్రేస్ చేసి పట్టుకోక పోవడమూ వైఫల్యమే.
ఆర్‌వోపీ వైఫల్యం
సైన్యం ఓ చోటు నుంచి మరో చోటుకు వెళుతున్నప్పుడు ‘రోడ్ ఓపెనింగ్ పార్టీ’ లేదా ‘ఆర్‌వోపీ’ క్లియరెన్స్ తప్పనిసరి. ఎక్కడైన మందు పాతరలు ఉన్నాయా, ఎక్కడయినా శత్రువులు పొంచి ఉన్నారా? ఎక్కడైన అనుమానాస్పద పరిస్థితులు ఉన్నాయా? అన్న అంశాలను తేల్చుకోవడానికి ఆరోవోపీ సిబ్బంది ముందుగా వెళుతుంది. ఆ సిబ్బందికి బాధ్యత వహిస్తున్న అధికారి అనుమతి ఇస్తేనే సైన్యం కదలాల్సి ఉంటుంది. ఇక్కడ ఆర్‌వోపీ తనిఖీ చేసిందా ? లేదా ? తనిఖీ చేయకుండానే అనుమతి ఇచ్చిందా? తేల్చాలి. పేలుడు పదార్థాలతోపాటు కాల్పులు కూడా వినిపించాయని సీఆర్‌పీఎఫ్ ఐజీ తెలిపారు. అదే నిజమయితే ఆర్‌వోపీ తన విధులను నిర్వర్తించడంలో పూర్తిగా విఫలం అయినట్లే (ఉగ్ర మారణహోమం)
సైన్యానికి పూర్తి స్వేచ్ఛ
పుల్వామా మారణ హోమంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ ఇప్పటి నుంచి సైన్యానికి పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నాం అని ప్రకటించారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే కశ్మీర్‌లో మిలిటెన్సీ పెరిగిందని, సైనికులపై దాడులు పెరిగాయని గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఆయన అధికారంలోకి రాగానే సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చి ఉండాల్సింది. కశ్మీర్‌లో రాష్ట్ర ప్రభుత్వం కూడా లేదు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం హయాంలోనే ఆ రాష్ట్రం నడుస్తోంది. అలాంటప్పుడు విధానపర లోపం కేంద్రానిదే అవుతుంది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావతం కాకుండా ఉండాలంటే పాకిస్థాన్ పీచమణచడమే కాదు, ఈ వైఫల్యాలన్నింటికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఎంత కన్నీరు కారిస్తే ఏం లాభం?!?
Comments
Please login to add a commentAdd a comment