ఇస్లామాబాద్ : పుల్వామా ఉగ్రదాడి వెనుక దాయాది దేశం పాకిస్తాన్ హస్తం ఉందన్న భారత్ అనుమానం నిజమైంది. 2019 ఫిబ్రవరి 14న కశ్మీర్‌లోని పుల్వామాలో చోటుచేసుకున్న విధ్వంసం వెనుక తామ దేశ హస్తం ఉందని పాకిస్తాన్ మంత్రి ఫవద్ చౌదరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పుల్వామ ఉగ్రదాడి తమ పనేనని ప్రకటించుకున్నారు. పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ నేతృత్వంలో సాధించిన గొప్ప విజయమని పేర్కొన్నారు. భారత్‌ను సొంతగడ్డపైనే దెబ్బతీశామని, ఇమ్రాన్ ప్రభుత్వాన్ని పొగడ్తల్లో ముంచెత్తారు. గురువారం ఆ దేశ నేషనల్ అసెంబ్లీలో మాట్లాడుతూ ఆయన ఈ ప్రకటన చేశారు. పుల్వామా ఉగ్రదాడికి భారత్‌కు చెందిన 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి.
పాకిస్తాన్‌లో నెలకొని కార్యకలాపాలు సాగిస్తున్న ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మహమ్మద్ ఈ దాడికి పాల్పడినట్టు తొలుత ప్రకటించుకుంది. అయితే అనంతరం చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈ దాడి వెనుక పాకిస్తాన్ కుట్ర ఉందని భారత నిఘా వర్గాలు ఓ అంచనాకు వచ్చాయి. తాజాగా పాక్ మంత్రి ప్రకటనతో.. భారత్ అనుమానం నిజమైంది. ఈ నేపథ్యంలో దాయాది దేశంపై భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పాక్ మంత్రి ప్రకటనపై స్పందించిన భారత విదేశాంగ శాఖ
పూల్వామా దాడి వెనుక పాక్ ఉందని ప్రపంచానికి తెలుసు. ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ బహిరంగంగానే సమర్థించుకుంటోంది. పాక్ నిజస్వరూపాన్ని ఇప్పటికైనా ప్రపంచం తెలుసుకోవాలి. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే పాకిస్తాన్‌ను క్షమించొద్దు.
Comments
Please login to add a commentAdd a comment