ది పుల్వామా కేస్: కశ్మీర్ గడ్డపై నెత్తుటి మరక | Ismail‌ Article on Pulwama attack February 14, 2019 | Sakshi
Sakshi News home page

ది పుల్వామా కేస్: కశ్మీర్ గడ్డపై నెత్తుటి మరక

Published Sat, Feb 12 2022 9:27 PM | Last Updated on Sat, Feb 12 2022 9:49 PM

Ismail‌ Article on Pulwama attack February 14, 2019 - Sakshi

ఉత్తర భారతదేశంలోని... జమ్మూ-కాశ్మీర్ రాష్ట్రం. దక్షిణ కాశ్మీర్‌లోని పుల్వామా హైవే... సమయం... మద్యాహ్నం 3గంటల 30నిమిషాలు. సీఆర్పీఎఫ్ జవాన్లను తీసుకు వెల్తున్న కాన్వాయ్‌పై ఒక్కసారిగా ఆత్మాహుతి దాడి జరిగింది. బ్లూకలర్ కార్... వేగంగా దూసుకువచ్చి జవాన్లు వెలుతున్న బస్సులోకి దూసుకుపోయింది. అంతలోనే ఒక్కసారిగా భారీ పేలుడు జరిగింది.. పేలుడు ధాటికి జవాన్లు ప్రయాణిస్తున్న బస్సులు తునాతునకలై పోయాయి. అందులో ఉన్న వారి మృతదేహాలు చెల్లాచెదురైపోయాయి. అసలేం జరిగిందో అర్ధం అయ్యేలోపు... జరగాల్సిన దారుణం జరిగిపోయింది.

కనీవిని ఎరుగని రీతిలో జరిగిన ఈ దాడితో ఒక్కసారిగా దేశం ఉలిక్కిపడింది. భద్రతా దళాల మీద జరిగిన భయంకర దాడి తరువాతి కాలంలో దేశభద్రత, రాజకీయ అంశాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. పుల్వామా దాడి ఒక ఆత్మాహుతి దాడి. కారుణలో పెద్ద ఎత్తున పేలుడు పదార్ధాలు కూర్చి ఆ కారును భద్రతా దళాల వాహనాలతో ఢీకొట్టడం ఈ మొత్తం దాడిలో కీలకం. ఈ దాడి ఎలా జరిగింది ఇంత పెద్ద ఎత్తున ఏవిధంగా పేలుడు పదార్ధాలు దేశంలోకి వచ్చాయనేది కూడా విచారణ సంస్థలను విస్మయానికి గురిచేశాయి. ఈ దాడిలో పాల్గొన్నది స్థానిక కశ్మీరీ ఉగ్రవాదులా లేక పాకిస్థాన్ నుంచి వచ్చిన సీమాంతర ఉగ్రవాదులా అనేది ఈ కేసులో చాలాకాలం మిస్టరీగా ఉండింది. 40మంది జవాన్లను పొట్టనబెట్టుకున్న ఈ దాడి విచారణను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ ఎన్‌ఐఏకు అప్పగించారు. 

పుల్వామా.. దక్షిణ కాశ్మీర్‌లో ఉన్న పట్టణం గుండా వెళుతున్న హైవే అటు జమ్మూను ఇటు కాశ్మీర్‌ను కలుపుతుంది. చలికాలంలో ముఖ్యంగా నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున మంచుక కురవడం వల్ల... హైవేపై రాకపోకలు ఆగిపోతాయి. అటు జమ్మూ నుంచి కాశ్మీర్‌లో ఉన్న భద్రతా దళాలకు నిత్యావసరాల నుంచి అమ్యునేషన్ ఏది పంపాలన్నా ఈహైవే ద్వారానే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. 2019లో కూడా జమ్మూలోని సీఆర్పీఎఫ్‌ క్యాంప్‌లో ఉన్న జవాన్లను కాశ్మీర్‌కు పంపేందుకు అధికారులు సన్నాహాలు చేశారు.  ముఖ్యంగా సెలవుల మీద వెళ్లివచ్చిన జవాన్లు ముందుగా జమ్మూలోని క్యాంప్‌లో రిపోర్ట్ చేస్తారు... ఆ తరువాత వారు ఒకేసారిగా కాశ్మీర్‌లోని క్యాంప్‌లకు భారీ భద్రత మధ్య కాన్వాయ్‌లో వెళతారు. అయితే 2019 జనవరి15 తరువాత కాశ్మీర్‌లో భారీగా మంచు కురిసింది దీంతో దాదాపు 20రోజుల పాటు జవాన్లను తరలించడం సాధ్యం కాలేదు. ఫిబ్రవరి 5వ తేదీన జవాన్ల కాన్వాయ్ వెళ్లేందుకు ఏర్పాటు చేసినా... మంచు కారణంగా అది ఫిబ్రవరి 14కు వాయిదా పడింది. గతంలో కాశ్మీర్‌లో వ్యవహారలను చూసే బీఎస్ఎఫ్‌ స్థానంలో సీఆర్పీఎఫ్‌ సిబ్బందికి ఆ బాధ్యతలు అప్పగించారు.

ఆ తరువాత సీఆర్పీఎఫ్ జమ్మూ కాశ్మీర్‌లో భద్రతా వ్యవహారాలను పర్యవేక్షిస్తోంది. ఫిబ్రవరి 14న తెల్లవారు జామున 4గంటల ప్రాంతంలో జమ్మూ నుంచి భారీగా జవాన్లను తీసుకుని వాహనాలు కాశ్మీర్‌కు బయలుదేరాయి. మొత్తం 78వాహనాల్లో 2547మంది సీఆర్పీఎఫ్ జవాన్లు... జమ్మూ నుంచి కాశ్మీర్‌లో ఉన్న క్యాంపుకు వెలుతున్నారు. జమ్మూ-కాశ్మీర్‌ను కలిపే టన్నెల్‌ వద్దకు మద్యాహ్నం సమయానికి జవాన్ల కాన్వాయ్ చేరుకుంది. టన్నెల్ నుంచి పూర్తిగా బుల్లెట్ ప్రూఫ్ వాహనాలలోనే జవాన్ల తరలింపు జరగాలి. ఇది స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్. భద్రతా కారణాల దృష్ట్యా కాశ్మీర్‌లో భద్రతా దళాలు పూర్తిగా బుల్లెట్ ప్రూఫ్ కాన్వాయ్‌లోనే ప్రయాణించాలి. అయితే భారీగా జవాన్లు ఉండటంతో... సరిపోయినన్ని బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు టన్నెల్ వద్దరు రాలేదు. దీంతో చాలామంది జవాన్లు... సాధారణ బస్సుల్లోనే కూర్చుండి అక్కడి నుంచి ప్రయాణం కొనసాగించారు. 2019ఫిబ్రవరి 14 రోజున మద్యాహ్నం 2గంటల  సమయంలో పుల్వామా హైవేపై పోలీసుల హడావిడి ప్రారంభం అయింది. ఏరియా డామినేషన్ పార్టీ పూర్తిగా హైవే తమ ఆధీనంలోకి తీసుకుంది. జవాన్లు ఆ ఏరియా దాటిపోయే వరకు హైవేపై ఇతర వాహనాలను అనుమతించరు. ఇది ఎప్పుడూ ఉండే ప్రొసీజర్. దాదాపు 3గంటల 15నిమిషాల సమయంలో సీఆర్పీఎఫ్ జవాన్ల బస్సులు పుల్వామా సరిహద్దులోకి చేరుకున్నాయి. 3గంటల 30నిమిషాలకు పుల్వామా పట్టణాన్నిదాటి కాన్వాయ్ ముందుకు కదులుతోంది. అంతలోనే రెండు ఒక బ్లూకలర్ మారుతి కారు సర్వీస్ రోడ్డు నుంచి హైవే మీదకు వెళ్లే మార్గం దగ్గర నుంచి ఒక్కసారిగా కాన్వాయ్‌లోని బస్సుల మీదకు దూసుకుపోయింది. వెంటనే భారీ పేలుడు జరిగింది.. పేలుడు ధాటికి బస్సు పూర్తిగా తునాతునకలైంది. 

ఒక్కసారిగా ఊహించని విధంగా భారీ పేలుడు జరగడంతో అసలేం జరిగిందో ఎవరికి అర్ధం కాలేదు. వెంటనే ముందు బస్సులో ఉన్న జవాన్లు కన్ఫ్యూజన్‌లో కాల్పులు జరిపారు. అయితే వెంటనే తేరుకుని ఎవరూ లేరని గ్రహించి క్షతగాత్రుల వద్దకు చేరుకున్నారు. పేలుడు తీవ్రత దాదాపు 10కిలోమీటర్ల వరకు వినిపించింది. బస్సు నామరూపాల్లేకుండా ధ్వంసం అయింది చాలామంది జవాన్ల శరీర భాగాలు ముక్కలు ముక్కలైపోయాయి.  హైవే పక్కన ఎలాంటి నివాస జనావాసాలు లేవు. అయితే హైవే కింది భాగంలో  నివాస ప్రాంతం ఉంది. పేలుడు తరువాత వెంటనే తేరుకున్న అధికారులు సహాయంకోసం  దగ్గరలోనే ఉన్న ఆసుపత్రితో పాటు ఆర్మీ క్యాంపుకు సమాచారం అందించారు. అక్కడి చేరుకున్న అధికారులు ఆ భీతావాహ దృష్యాలను చూసి స్థబ్దులైపోయారు. చనిపోయిన జవాన్ల మృతదేహాలు చేసి అధికారుల కళ్లు చెమర్చాయి. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు... చనిపోయిన వారి మృతదేహాల భాగాలను భద్రపరిచారు. దాదాపు 200మీటర్ల వరకు జవాన్ల మృతదేహాలు... చేతివేళ్లు.. కాలి ముక్కలు విసిరివేసినట్లు పడ్డాయి. ఆ భాగాలను బాక్సుల్లో అమర్చి...ఆర్మీ  బేస్ క్యాంపుకు తరలించారు. 

పుల్వామా వార్త టీవీ స్క్రీన్‌లను తాకగానే .. దేశవ్యాప్తంగా ప్రజలు ఆ దృశ్యాలను చూసి తీవ్ర ఆవేదనకు గురయ్యారు. దేశవ్యాప్తంగా ఒక్కసారిగా ఈ దాడి మీద తీవ్రమైన ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తాయి. ఈ సంఘటన జరిగిన 15నిమిషాల్లోనే బాంబుదాడి జరిపింది తామేనంటూ జైషే మహమ్మద్‌ ఒక వీడియో విడుదల చేసింది. మహమ్మద్‌ దాడికి పాల్పడింది తామే అంటూ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో అదిల్ అహ్మద్ దార్‌ అని చెప్పుకున్న ఒ ఉగ్రవాది ఎమ్‌-4 కార్బైన్ గన్‌ , ఒక పిస్టల్ పట్టుకుని కనిపించాడు. ఆదిల్ వెనకాల  జైషే మహమ్మద్ జెండా ఉంది. ఈ దాడికి పాల్పండింది తానేనని చెప్పుకున్న దార్... గతంలో జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ చేసిన దాడుల గురించి చెప్పుకొచ్చాడు.  ఈ వీడియో విడుదల కాగానే భద్రతాదళాలతో పాటు ప్రభుత్వంపై తీవ్రమైన ఒత్తిడిపెరిగింది. ఆత్మాహుతి దాడి చేసి ఆ వెంటనే వీడియో విడుదల చేయడం ద్వారా ఉగ్రవాద అనుకూల ప్రాపగాండాను విస్తరింపజేయాలనే కుట్ర జరిగింది. దాడిలో ఎంత మంది జవాన్లు చనిపోయారనే వార్తను సీఆర్పీఎఫ్ ధృవీకరించక ముందే జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ తన వెబ్‌సైట్‌ అల్‌ఖలమ్‌లో 40మంది జవాన్లు చనిపోయారని ఖచ్చితమైన మృతుల సంఖ్యను ప్రకటించింది. దీంతో పేలుడు జరిగిన తరువాత ఎప్పటికప్పుడు సమాచారం పాకిస్థాన్‌కు వెలుతుందనే విషయాన్ని నిఘావర్గాలు గుర్తించాయి. 

పేలుడు తీవ్రత... భారీగా జవాన్లు చనిపోవడంతో... కేంద్రం వెంటనే ఈ కేసును జాతీయ విచారణ సంస్థ ఎన్‌ఐఏకు అప్పగించింది. ఎన్‌ఐఏ జమ్మూకాశ్మీర్ చీఫ్‌...రాకేశ్‌ బల్వాల్‌ ఈ కేసు విచారణ అధిపతిగా నియమితులయ్యారు. వెంటనే రాకేశ్‌ సంఘటనా స్థలానిక వెళ్లి పరిశీలించారు. దాదాపు 200మీటర్ల దూరం వరకు పడి ఉన్న వాహన శకలాలు, ఇతర సాక్ష్యాధారాలను సేకరించారు.  రెండవ రోజు పేలుడు జరిగిన ప్రాంతానికి సెంట్రల్ ఫొరెన్సిక్ సైన్స్ లాబరేటరి, నేషనల్ బాంబ్ డాటా సెంటర్, ఎన్ఐఏ బాంబ్ స్క్వాడ్, ఎన్ఎస్జీ సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. సంఘటనా స్థలం నుంచి పేలుడుకు ఉపయోగించిన కారు ముక్కలను సేకరించారు. కారు ఇంజిన్ కు సంబంధించిన కొన్ని భాగాలను సేకరించి దాని ఛాసిస్ నెంబర్ గుర్తించే ప్రయత్నం చేశారు. అయితే ఆ కారు తయారీకి సంబంధించిన నెంబర్లను ముందుగానే జాగ్రత్తగా తొలగించినట్లు అధికారులు గుర్తించారు. వెంటనే ఫిబ్రవరి 18న మారుతీ కంపెనీకి చెందిన ఇంజనీర్ల టీమ్ విచారణ సంస్థలకు సహకరించడానికి ఢిల్లీ నుంచి కాశ్మీర్కు చేరుకుంది. మారుతీ ఇంజనీర్స్ కారు ఇంజన్ పూర్తిగా ఓపెన్ చేసి అందులో ఉన్న కారు ఇంజన్ బ్యాచ్ నెంబర్ గుర్తించగలిగారు. ఆ నెంబర్ సహాయంతో  దాడికి వాడిన కారు మారుతి ఈకో మోడల్ గా తేల్చారు. దాని మోడల్ నెంబర్ ద్వారా ఇది 25జనవరి 2011రోజున తయారైనట్లు... ఆరోజు తయారైన 7ఈకో కార్లలో ఒక్కటి మాత్రమే కాశ్మీర్లో అమ్ముడైనట్లు గుర్తించారు.

ఈ దాడికి వాడిన మారుతి ఈకో కారు ఛాసిస్ నెంబర్ MA3ERLF1SOO183735... కారు ఇంజిన్ నెంబర్...G12BN164140గా గుర్తించారు. విచారణలో కారు డీటేయిల్స్ తెలియగానే...  ఆ కారు యజమాని  జలీల్‌ అహ్మద్ హక్కానీను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  అయితే కారు షోరూంలో కొనుగోలు చేసిన తరువాత కొన్నిరోజులకు తాను ఆ కారును ఇతరులకు అమ్మేసినట్లు హక్కాని ఎన్‌ఐఏ అధికారులకు చెప్పాడు. పోలీసులు విచారణను మరింత లోతుగా జరిపినప్పుడు ఆ కారు తరువాతి కాలంలో దాదాపు 6గురి చేతులు మారిందని... గుర్తించారు. గతంలో కారును కొనుగోలు చేసిన 6గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణను రహస్యంగా ఉంచేందుకు కొన్నాళ్లపాటు ఆ ఆరుగురిని పోలీసులు తమ అదుపులోనే ఉంచుకున్నారు. ఇక ఈ కారు అమ్మకంలో దానిష్ అహ్మద్ లోన్ అనే బ్రోకర్ కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తించారు. ఇక అహ్మద్ లోన్‌ను విచారిస్తే ఈ కారును తన బంధువు సజ్జాద్‌ భట్‌కు అమ్మినట్లు తెలిపాడు. చివరిసారిగా మారుతి ఈకో కారును 2019 జనవరిలో 1.85లక్షలకు  సజ్జాద్‌ భట్‌కు అమ్మినట్లు బ్రోకర్ తెలిపాడు.  ఇక సజ్జాద్ భట్‌ కోసం వెళ్లిన పోలీసులు అప్పటికే అతను  పారిపోయినట్లు గుర్తించారు. దీంతో కేసు విచారణ అక్కడే ఆగిపోయింది.

ఓ వైపు కేసు విచారణ కొనసాగుతుండగా ... ఈ పేలుడు పెద్ద ఇంటెలిజెన్స్ ఫేయిల్యూర్ అని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఇంత పెద్ద ఎత్తున ఆర్డీఎక్స్ కాశ్మీర్‌లోకి ఎలా వచ్చిందనే చర్చ ప్రారంభం అయింది. అది ఎన్నికల సమయం కావడంతో కావాల్సినంత రాజకీయం జరిగింది. దీంతో విచారణను వేగవంతం చెయ్యాలనే ఒత్తిడి ఎన్‌ఐఏపై పెరిగింది. దీంతో ఏదో విధంగా కేస్‌లో బ్రేక్ త్రూ సాధించాలనే పట్టుదలతో... విచారణాధికారి బలవాల్‌ సంఘటన స్థలంలో 250మీటర్ల వరకు పోలీసులతో క్షుణ్ణంగా వెతికించాలని సంకల్పించారు.  ఆ ప్రాతంలో ఉగ్రవాదులకు మద్దతుగా ఉండే  అతివాద శక్తులున్నాయని... అక్కడ 250మీటర్లు వెతకాలంటే కుదిరే అవకాశం లేదని జమ్మూకాశ్మీర్ పోలీసులు అభ్యంతరం తెలిపారు. అయినా వెనక్కి తగ్గని బలావల్ పై అధికారులను ఒప్పించి సంఘటన జరిగిన 6రోజులకు ఫిబ్రవరి 20న బ్లాస్ట్ సైట్‌లో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు... ఈ సెర్చ్ ఆపరేషన్‌లో 400మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు, 100మంది ఎన్‌ఐఏ అధికారులు పాల్గొన్నారు.

ఉదయం నుంచి కొనసాగిన ఈ వెతుకులాటలో చనిపోయిన జవాన్ల చిన్న చిన్న శరీర భాగాలు... పేలిపోయిన వాహనాల ముక్కలు తప్ప ఏమీ లభించలేదు.అప్పటికే అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్న స్థానికులు... పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు ఇవ్వడం ప్రారంభించారు. మద్యాహ్నం తరువాత పేలుడు జరిగిన ప్రదేశం నుంచి దాదాపు 200మీటర్ల దూరంలో బలావల్‌కు మట్టిలో మెరుస్తూ ఒక తాళంచెవి కనిపించింది. 1026 నెంబర్‌తో ఉన్న కారు కీ ఎన్‌ఐఏ అధికారి బలావల్‌ చేతికి చిక్కింది. తాళంచెవి మీద ఉన్న రక్తం మరకలను ఆత్మాహుతి దాడి చేసిన ఆదిల్ ఆహ్మద్ దార్‌ రక్తం డీఎన్‌ఏతో పోల్చారు. కారుతో ఆత్మాహుతి దాడికి పాల్పడింది అహ్మద్ దార్ అధికారులు నిర్ధరించారు. ముందుగా ఈ దాడి చేసింది.. కాశ్మీరీయా లేక పాకిస్థాన్ నుంచి వచ్చి న ఉగ్రవాదా అనే విషంయపై పెద్ద చర్చ జరిగింది.  గతంలో కాశ్మీరీలు ఆత్మాహుతి దాడులు చేసిన సందర్భాలు చాలా తక్కువ. దీంతో మొదటిసారిగా ఒక కాశ్మీరి ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు గుర్తించారు. వీడియో విడుదల చేసిన ఆదిల్ అహ్మద్ దార్‌... స్వయంగా ఈ దాడి జరిపాడని పేలుడులో అతను కూడా మరణించాడని నిర్ధారణ అయింది.

దాడికి పాల్పడిన వ్యక్తి కాశ్మీర్‌లోని పుల్వామాకు చెందిన ఆదిల్ దార్‌గా తేలింది. ఇక కారు పుల్వామాకే చెందిన సజ్జాద్ భట్ కొనుగోలు చేసినట్లు కూడా నిర్దారణ అయింది. దీంతో ఇక కారు ఓనర్ సజ్జాద్ భట్‌  ఇంటిపై పోలీసులు రేడ్ చేశారు. భట్ అక్కడ లేడని... వారం రోజుల నుంచి ఇంటికి రాలేదని అతని తండ్రి తెలిపాడు. అయితే సూసైడ్ బాంబర్ ఆదిల్ దార్ చదువుకున్న సిరాజ్‌ ఉల్ ఉలుమ్ మదర్సాలోనే  భట్ కూడా చదువుకున్నట్లు పోలీసులు గుర్తించారు. జమాతే ఇస్లామీ జమ్ము-కాశ్మీర్ అనే సంస్థ ఈ మదర్సా నడుపుతోంది. వెంటనే 28ఫిబ్రవరి 2019నాడు ఈ సంస్థను కేంద్రం నిషేధించింది. ఇక ఫిబ్రవరి 25నాడు ఏకే-47పట్టుకుని సజ్జాద్ భట్ జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థలో చేరినట్లు సోషల్ మీడియాలో ఫోటోలు సర్క్యులేట్ అయ్యాయి.  దీంతో ఈ కేసులో సజ్జాద్ భట్ కీలకం అని పోలీసులు భావించారు.సజ్జాద్ భట్ కోసం వెతుకులాట ప్రారంభించిన పోలీసులకు ఎలాంటి ఫలితం లభించలేదు. దీంతో అతను పాకిస్థాన్ వెళ్లిపోయినట్లు భావించారు. కేసు మళ్లీ మొదటికొచ్చింది..  ఈ కేసులో విచారణలో పురోగతి లేదు

ఇక నెలలు గడుస్తున్నా కేసులో ఎలాంటి పురోగతి లేకపోవడంతో... ఎన్‌ఐఏ అధికారులు పుల్వామా తరువాత జరిగిన ఎన్‌కౌంటర్లపై దృష్టిసారించారు. ఎన్ఐఏ అధికారి బలావల్ ఓ ఎన్కౌంటర్ సంఘటనపై దృష్టిసారించారు. 2019 మార్చిలో నౌగామ్ పోలిస్స్టేషన్ పరిధిలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో జైషేమహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన కామ్రాన్ అనే ఉగ్రవాది హతమయ్యాడు. కామ్రాన్‌తో పాటు మరో ఉగ్రవాది కూడా ఈ ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడు.కామ్రాన్ స్థానికంగా జైష్ కమాండర్‌గా ఉన్నాడు... దీంతో చనిపోయిన రెండో ఉగ్రవాదిపై పోలీసులు పెద్దగా దృష్టిసారించలేదు. అయితే కామ్రాన్‌తో పాటు చనిపోయిన మరో ఉగ్రవాది ఆడిడాస్ జాకెట్ వెసుకుని నీట్‌గా హేయిర్‌ కట్ చేసుకుని ఉన్నాడు. సాధారణంగా కాశ్మీరీ ఉగ్రవాదులు ఇలా నీట్‌గా హేయిర్‌ కట్ చేసుకోవడంగాని గడ్డం ట్రిమ్ చేసుకోవడంలాంటివి చేయరు. దీంతో ఈ ఉగ్రవాదిపై ఎన్‌ఐఏ అధికారి బలావల్‌కు అనుమానం వచ్చింది. చనిపోయిన ఉగ్రవాది పేరు ఇద్రీస్ భాయ్ అని స్థానిక పోలీసులు చెప్పారు... ఇద్రీస్ దగ్గర ఒక ఎమ్‌-4కార్బన్‌తో పాటు పిస్టర్ రెండు సెల్‌ఫోన్‌లు దొరికినట్లు పోలీసులు తెలిపారు. రెండు ఫోన్‌లలో ఒకటి ఐఫోన్‌ కాగా మరొకటి సాంసంగ్ ఎస్‌-9 ప్లస్‌.

అయితే ఈ రెండు ఫోన్‌లు ఎన్‌కౌంటర్‌లో చనిపోకముందు ఇద్రీస్ పూర్తిగా వీటిని ధ్వంసం చేశాడని. ఈ ఫోన్‌ల నుంచి ఎలాంటి సమాచారం లభించలేదని... పోలీసులు చెప్పారు. అయితే ఈ ఫోన్‌లను పరిశీలించిన కాశ్మీర్ పోలిస్‌ సైబర్ సెల్‌ ఇందులో ఎలాంటి డేటా తీయలేకపోయామని బలావల్‌కు తెలిపారు. ఈ ఫోన్‌లను ఎలాగైనా ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌కు పంపాలని ఎన్‌ఐఏ అధికారి బలావల్ ప్రయత్నించాడు.  అయితే దీనికి రూల్స్ ఒప్పుకోవని కాశ్మీర్ పోలీసులు కరాఖండీగా చెప్పారు. అయినా పుల్వామా కేసు కొలిక్కి రావాలంటే... ఏదో ఒక బ్రేక్ త్రూ కావాలనే తపనతో ఉన్న ఎన్ఐఏ అధికారి బలవాల్‌లో అన్ని అవకాశాలను వాడుకున్నాడు.  దీంతో తనకు పరిచయమున్న కాశ్మీర్ క్యాడర్ ఐపిఎస్ అధికారిని రిక్వేస్ట్ చేసి ఆ ఫోన్‌లు స్వాధీన పరుచుకునేందుకు పర్మిషన్ తీసుకున్నాడు. వెంటనే ఆ ఫోన్‌లు ఢిల్లీలోని కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌ చేతికి అందాయి. చాలా కష్టపడి పూర్తి డేటాను వెలికితీసిన ఇంజనీర్ల టీమ్‌కు జాక్‌పాట్ తగిలింది. వెంటనే ఎన్‌ఐఏ అధికారి రాకేశ్‌కు అందులో ఉన్న డేటాను పరిశీలించడాని ఢిల్లీ వెల్లాడు. 

ఓ వైపు ఎన్ఐఏ అధికారులు ఫోన్‌లో దొరికిన సమాచారాన్ని ఫోటోలను పరిశీలిస్తున్న సమయంలో.. మరో సంఘటన జరిగింది. ఒక వాహనం జమ్మూ నుంచి కాశ్మీర్‌లోకి ఎంటర్ అవుతుండగా పోలీసులకు అనుమానం కలిగి చెక్‌పోస్ట్ దగ్గర ఆపారు. అనుమానం వచ్చిన పోలీసులు వారిని నిలదీశారు. దీంతో వారు పోలీసులపై కాల్పులు జరిపి పారిపోయేందుకు ప్రయత్నించారు. పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు అక్కడికక్కడే చనిపోయారు. మరో ఇద్దరు అడవిలోకి పారిపోయారు... వీరిని వెంబడించిన పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.  పోలీసులు అరెస్టు చేసిన వారిలో ఒకరిని సమీర్ దార్ గా గుర్తించారు. సమీర్‌ దార్‌ను విచారించిన తరువాత పుల్వామా ఆత్మాహుతి దాడిలో పాల్గొన్న ఆదిల్ దార్‌ కు ఇతను సోదరుడిగా గుర్తించారు. దీంతో రంగంలోకి దిగిన ఎన్‌ఐఏ అధికారులు పుల్వామా దాడి తరువాత వచ్చిన వీడియోను సమీర్‌దార్‌కు చూపించారు. అయితే ఆ వీడియోలో ఉన్న వ్యక్తి సూసైడ్ బాంబర్ ఆదిల్‌ దారేనని... అయితే ఆ గొంతుమాత్రం అతనిది కాదని చెప్పాడు. గతంలోనే ఆ వీడియోను పూర్తిగా పరిశీలించిన ఫొరెన్సిక్  అదికారులు ఇది డబ్బింగ్ చెప్పిన వీడియో అని చెప్పారు. చనిపోయింది సూసైడ్ బాంబర్ ఆదిల్ దార్... డీఎన్ఏ టెస్టులో ఇది నిర్ధరణ అయింది. మరి గొంతు ఎందుకు డబ్బింగ్ చెప్పాల్సి వచ్చిందో పోలీసులకు గతంలో అర్ధం కాలేదు. ఇప్పుడు విచారణలో సమీర్ ఆ గొంతు మరో ఉగ్రవాది హింజిలా జిహాదిది అని చెప్పాడు.  దీంతో ఈ హంజిలా జిహాదీ ఎవరు దానిపై పోలీసులు విచారణ జరిపారు. ఈ హంజిలా జిహాది అనే వ్యక్తి పుల్వామాకే చెందిన ఒక కార్పెంటర్ అని పోలీసుల విచారణలో తేలింది. హంజిలా ఎక్కడున్నాడని పోలీసులు సాగించిన వేటలో... ఆర్టికల్ 370రద్దు సందర్భంగా అతడని పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారని తేలింది. దీంతో పోలిసు కస్టడీలో ఉన్న హంజిలాను తీసుకువచ్చి ఎన్ఐఏ విచారణ జరిపింది. ఇంతలో ఉగ్రవాది ఇద్రీస్ ఖాన్ ఐఫోన్‌లో ఉన్న ఫోటోలు కూడా ఎన్‌ఐఏ అధికారుల చేతికి అందాయి. ఇద్రీస్‌ఖాన్‌తో పాటు హంజిలా కూడా ఫోటోల్లో ఉన్నాడు. దీంతో పోలీసులు ఇద్రీస్‌ఖాన్‌ గురించి అడిగితే హంజిలా  అతను ఇద్రీస్‌ కాదని.. పాకిస్థాన్ నుంచి వచ్చిన ఉమర్‌ ఫారూఖ్ అని చెప్పాడు. ఈ మొత్తం దాడిలో ఉమర్ ఫారూఖ్ కీలకం అని.. ఉమర్ ఫారూఖ్ సాక్ష్యాత్తూ పాకిస్థాన్లో ఉన్న మసూద్ అజ్హర్ అన్న కొడుకు అని హంజిలా చెప్పాడు.  తానే స్వయంగా సూసైడ్ బాంబర్‌ను కారులో పుల్వామా హైవే వరకు తీసుకు వెళ్లానని... బాంబు పేలుతున్న సమయంలో అక్కడే ఉన్నానని హంజిలా కథ మొత్తం చెప్పాడు.

పుల్వామా బాంబు దాడికోసం పాకిస్థాన్ కేంద్రంగా ఉన్న జైషే మహమ్మద్ అనే ఉగ్రవాద సంస్థ దాదాపు రెండేళ్లుగా రెక్కి నిర్వహించింది. దీనికోసం పాకిస్థాన్ నుంచి మౌలానా మసూద్ అజ్హర్ అన్న కొడుకు ఉస్మాన్ హైదర్ 2017లో కాశ్మీర్లోకి చొరబడ్డాడు. అయితే అతను ఆపరేషన్ పూర్తి చేయకముందే భద్రతా దళాల ఎన్‌కౌంటర్‌లోచనిపోయాడు. దీంతో మళ్లీ అతని సోదరుడు ఉమర్‌ ఫారూఖ్‌ను ఇద్రీస్ భాయ్ అనే పేరుపెట్టి పాకిస్థాన్ నుంచి కాశ్మీర్‌లోకి చొప్పించారు. ఆప్ఘనిస్తాన్‌లోని ఉగ్రవాద సంస్థల్లో శిక్షణ పొందిన ఉమర్ ఫారూఖ్‌... ఐఈడీలు తయారు చేయడంలో సిద్ధహస్తుడు. తాలిబాన్‌ క్యాంపుల్లో చాలాకాలం పాటు అమెరికా సైనికులతో పోరాడని ఉమర్ ఫారూఖ్‌... ఇండియాలో పెద్ద పేలుడు చేసే ఉద్దేశంతో కాశ్మీర్ సరిహద్దుల నుంచి ఇండియాలోకి ఎంటరయ్యాడు. వచ్చే సమయంలో తనతో పాటు పెద్ద ఎత్తున ఆర్డీఎక్స్ తెచ్చుకున్నాడు. 50లక్షల రూపాయలు హవాలాద్వారా ఈ ఆపరేషన్‌కు ఉపయోగించినట్లు సమచారం. ఇండియాకు వచ్చిన ఇద్రీస్ పుల్వామాలోని బిలాల్‌ అహ్మద్ కూచే అనే వ్యక్తి ఇంట్లో ఉన్నాడు. అక్కడే ఆదిల్ దార్‌ను పూర్తిగా సూసైడ్ బాంబర్‌గా మార్చడానికి కావాల్సిన ట్రైనింగ్ ఇచ్చాడు. ఆదిల్ దార్ ఒక చిన్న దుకాణంలో పనిచేసేవాడు... అతడికి మతమౌఢ్యం ఎక్కించడంతో పాటు ఇండియాపై విషం నింపాడు. ఇక పేలుడుకు కావాల్సిన కారును సజ్జాద్ అహ్మద్ భట్ ద్వారా కొనుగోలు చేయించాడు. ఇక తనతో పాటు తెచ్చుకున్న ఆర్డీఎక్స్‌కు తోడుగా కావాల్సిన ఎలక్ట్రికల్ వస్తువులు, అల్యూమినియం పౌడర్ సైతం అమెజాన్ నుంచి కొనుగోలు చేశారు. అవేజ్ భోలా అనే యువకుడి అమెజాన్ అకౌంట్ ద్వారా ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపించారు. ఇక కూచే అనే వ్యక్తి ఇంట్లో ఉన్నప్పుడు ఆయన కూతురు ఇన్షాజాన్‌తో ఉమర్ ఫారూఖ్ ప్రేమాయణం నడిపాడు.

ఆమెతో కలిసి దిగిన ఫోటోలు కూడా తరువాత అతని ఫోన్‌లో లభ్యమయ్యాయి. ఇక పేలుడుకు నెల రోజుల ముందే బిలాల్ అహ్మద్ కూచే ఇంట్లో ఆదిల్ దార్‌తో దాడి తరువాత విడుదల చేసే వీడియోను చిత్రీకరించారు. అయితే అందులో ఆదిల్ దార్ సరిగా మాట్లాడలేకపోవడంతో... హంజిలా జివాదీతో డబ్బింగ్ చెప్పించారు. ఈ వీడియోను పాకిస్థాన్‌కు పంపి...అక్కడ ఉన్న నాయకులతో దానిని ఓకే చేయించారు. ముందుగా ఫిబ్రవరి 5వ తేదీనే దాడి చేయాలనుకున్నా... ఆరోజు మంచు కారణంగా సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు. దీంతో బాంబులతో నింపిన కారును దాదాపు పదిరోజుల పాటు కారు కొనుగోలు చేసిన సజ్జాద్ భట్ ఇంటిదగ్గరే ఉంచారు. ఇక చివరిగా 14వ తేదీన పోలీసుల మూవ్‌మెంట్ చూసి పుల్వామా హైవేపై అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుని సూసైడ్ బ్లాస్ట్ చేశారు. కేవలం గంట ముందు పాకిస్థాన్‌లో ఉన్న మసూద్ అజ్హర్‌ సోదరుడు తన చిన్నాన్న అమ్మార్ అల్వీకి ఫోన్ చేసి దాడి చేయాలన్న విషయంపై ఉమర్ ఫారూఖ్ పర్మిషన్ తీసుకున్నాడు. చివరి నిమిషంలో ఆదిల్ దార్ పారిపోతాడనే భయంతో...అక్కడికి హంజిలా జిహాదీని తోడుగా పంపించాడు. బయట ఉండి హంజిలా జిహాది బాంబు పేలే వరకు మొత్తం ఆపరేషన్ మానిటర్ చేశాడు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న హంజిలా జిహాది... ఈ విషయాలను పోలీసులకు పూసగుచ్చినట్లు చెప్పాడు. 

ఇస్మాయిల్‌, ఇన్‌పుట్‌ ఎడిటర్‌, సాక్షిటీవీ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement