న్యూఢిల్లీ: పాకిస్తాన్ భూభాగం బాలాకోట్‌లో జైషే మహ్మద్ ఉగ్రవాదుల శిక్షణా శిబిరంపై జరిపిన వైమానిక దాడిలో వాటిల్లిన నష్టంపై అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ ఐఏఎఫ్ అందుకు సంబంధించిన ఆధారాల్ని కేంద్రానికి సమర్పించినట్లు తెలిసింది. ఫిబ్రవరి 26న తాము జారవిడిచిన బాంబుల్లో 80 శాతం అనుకున్న లక్ష్యాల్ని తాకినట్లు వైమానిక దళం పేర్కొంది. సంబంధించిన ఉపగ్రహ, రాడార్ చిత్రాలను సేకరించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దాడులకు వైమానిక దళం వార్‌హెడ్లను ఉపయోగించినట్లు తెలిసింది.
ఈ వివరాల్ని బుధవారం కొన్ని చానెళ్లు ప్రసారం చేశాయి. బాంబులు ఉగ్రవాదుల ఆవాసాల పైకప్పులను చీల్చుకుంటూ వెళ్లి అంతర్గతంగా అపార నష్టం మిగిల్చినట్లు ఐఏఎఫ్ వర్గాలు వెల్లడించాయి. పుల్వామా దాడికి ప్రతీకార చర్యగా జరిపిన వైమానిక దాడిలో 350 మంది ఉగ్రవాదులు హతమైనట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. కానీ నష్టం అంత తీవ్రస్థాయిలో లేదని కొన్ని మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. అటవీ ప్రాంతంలో చెట్లు దెబ్బ తినడం తప్ప పెద్దగా నష్టమేమీ కలగలేదని పాకిస్తాన్ ప్రకటించుకుంది.
కాగా, భారత వైమానిక దళం దాడి తరువాత జైషే మహ్మద్ భవనాలకు అనుకున్నంత భారీ నష్టం జరగలేదని ప్లానెట్ ల్యాబ్స్ అనే అమెరికన్ ప్రైవేటు సంస్థ ఓ ఉపగ్రహ చిత్రం విడుదలచేసింది. ఈ విషయాన్ని రాయిటర్స్ వార్తా సంస్థ వెలుగులోకి తెచ్చింది. బాలాకోట్ ఆపరేషన్‌పై రాజకీయ పార్టీలు సందేహాలు వ్యక్తం చేస్తూ ఎందరు ఉగ్రవాదులు హతయ్యారో అధికారిక సమాచారం వెల్లడించాలని ప్రభుత్వంపై ఒత్తిడితెస్తున్నాయి. వైమానిక దళ చర్యను రాజకీయం చేస్తున్నారంటూ అధికార, ప్రతిపక్షాలు పరస్పరం విమర్శలు గుప్పించుకున్నాయి. ఈ నేపథ్యంలో వైమానిక దాడులతో నెరవేరిన లక్ష్యాలపై ఆధారాలతో వైమానిక దళం ప్రభుత్వానికి నివేదిక అందించడం గమనార్హం.
12 పేజీల విస్పష్ట ఛాయాచిత్రాలు..
బాలాకోట్‌లో జారవిడిచిన బాంబులు లక్ష్యానికి దూరంగా పడ్డాయన్న ఆరోపణల్ని తప్పని నిరూపిస్తూ వైమానిక దళం సమగ్ర వివరాల్ని క్రోడీకరించింది. దాడి తర్వాత జైషే శిబిరానికి వాటిల్లిన నష్టాన్ని అంచనా వేసేందుకు ఈ సమాచారాన్ని సేకరించినట్లు తెలిసింది. భారత గగనతలంలో ఎగురుతున్న విమానం తీసిన 12 పేజీల విస్పష్ట ఛాయాచిత్రాలు, రాడార్ ఇమేజ్‌లను కేంద్రానికి అందజేసినట్లు విశ్వసనీయవర్గాల తెలిపాయి. దాడిలో మిరాజ్ విమానాలు ఇజ్రాయెల్ స్పైస్ బాంబుల్ని అత్యంత కచ్చితత్వంతో జారవిడవగా, అందులో 80% అనుకున్న లక్ష్యాల్ని తాకాయని తెలిపాయి. మిగిలిన 20% బాంబుల విజయ శాతం కచ్చితంగా ఎంతని అంచనా వేయలేకపోయామని చెప్పాయి.
Comments
Please login to add a commentAdd a comment