Balakote
-
పుల్వామా దాడికి ఐదేళ్లు... ఆ రోజు ఏం జరిగింది?
2019, ఫిబ్రవరి 14.. సరిగ్గా ఐదేళ్ల క్రితం జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్రదాడి జరిగింది. ఇది భారతదేశంలో జరిగిన అతిపెద్ద ఉగ్రవాద దాడుల్లో ఒకటి. ఈ దాడిలో 40 మంది భారత జవాన్లు వీరమరణం పొందారు. ఈ దాడి తర్వాత పాకిస్తాన్‌కు భారత్ గుణపాఠం చెప్పిన తీరు గతంలో ఎన్నడూ జరగలేదు. పుల్వామా దాడికి ప్రతీకారం తీర్చుకునే దిశగా పాక్‌పై భారత్ కఠిన చర్యలు అవలంబించింది. సర్జికల్ స్ట్రైక్ రూపంలో బదులు తీర్చుకుంది. పాకిస్తాన్లోకి ప్రవేశించిన భారత సైన్యం పాక్ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. ఇంతకీ ఐదేళ్ల క్రితం ఫిబ్రవరి 14న పాక్ ఎటువంటి దాడికి పాల్పడిందో, దానికి భారత్ ఎలా ప్రతీకారం తీర్చుకుందో ఇప్పుడొకసారి గుర్తుచేసుకుందాం. ఐదేళ్ల క్రితం ఇదేరోజున సీఆర్పీఎఫ్ కాన్వాయ్ జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి గుండా వెళుతోంది. సైనికులు ఉన్న ఈ కాన్వాయ్‌లో అధికంగా బస్సులు ఉన్నాయి. కాన్వాయ్ పుల్వామా వద్దకు చేరుకోగానే అటువైపు నుంచి వచ్చిన ఓ కారు కాన్వాయ్‌లోని ఓ బస్సును ఢీకొంది. బస్సును ఢీకొన్న ఆ కారులో పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు ఉన్నాయి. దీంతో వెంటనే పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు వీరమరణం పొందారు. పుల్వామాలో ఉగ్రదాడి అనంతరం భారత్.. పాకిస్తాన్‌కు తగిన గుణపాఠం చెప్పేందుకు కఠిన చర్యలు అవలంబించింది. ఫలితంగా పాకిస్తాన్‌కు తీవ్ర నష్టం వాటిల్లింది. 2019, ఫిబ్రవరి 26న భారత వైమానిక దళం పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లోకి ప్రవేశించి వైమానిక దాడులతో పాక్‌లోని ఉగ్రవాదుల శిబిరాలను ధ్వంసం చేసింది. దీంతో ఫిబ్రవరి 27న పాకిస్తాన్ వైమానిక దళం జమ్మూ, కాశ్మీర్‌లోకి చొరబడి భారతదేశంపై వైమానిక దాడులకు పాల్పడింది. దీనికి ప్రతిస్పందనగా భారత వైమానిక దళం దాడులు చేపట్టిన సమయంలో భారత్‌కు చెందిన యుద్ధ విమానం ‘మిగ్-21’ పాకిస్తాన్ సైన్యం దాడికి గురై, అక్కడే పడిపోయింది. ఈ నేపధ్యంలో పాకిస్తాన్ సైనికులు ‘మిగ్-21’ పైలట్ అభినందన్ వర్థమాన్‌ను పట్టుకున్నారు. 2019, మార్చి ఒకటిన అమెరికాతో పాటు ఇతర దేశాల ఒత్తిడి మేరకు పాకిస్తాన్ సైన్యం అభినందన్ వర్థమాన్‌ను విడుదల చేసింది. పుల్వామా ఉగ్రదాడి అనంతరం భారత్ అప్పటివరకూ పాక్‌తో ఉన్న అన్ని వాణిజ్య సంబంధాలను రద్దు చేసుకుంది. ఫలితంగా పాకిస్తాన్ ఆర్థికంగా తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. పాకిస్తాన్‌ను బ్లాక్‌లిస్ట్‌లో చేర్చేందుకు మనీలాండరింగ్‌పై ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్)ను కూడా భారత ప్రభుత్వం కోరింది. -
సరిహద్దుకు ఎటువైపైనా దీటైన జవాబివ్వగలం
ససరాం: దేశ సరిహద్దుకు లోపల, వెలుపలా రక్షణ సన్నద్ధత, సామర్థ్యం విషయంలో భారత్‌కు తిరుగులేదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ పునరుద్ఘాటించారు. బాలాకోట్‌లో ఉగ్రస్థావరంపై వైమానిక దాడులు, పాక్ ఆక్రమిత కశ్మీర్ భూభాగంపై సర్జికల్ దాడులే భారత సత్తాకు సాక్ష్యాలన్నారు. బిహార్‌లోని రోహ్తాస్ జిల్లాలో ఓ ప్రైవేట్ విశ్వవిద్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణకు దిగినపుడు భారతీయ విద్యార్థులు చిక్కుకుపోయారని తెల్సి మోదీ వెంటనే రష్యా, ఉక్రెయిన్, అమెరికా అధ్యక్షులతో ఒక్కటే మాట చెప్పారు. అంతే. నాలుగు గంటలపాటు యుద్ధం స్తంభించింది. విద్యార్థులను వెనక్కి తెచ్చేశాం. మోదీ ఘనత చూసి ప్రపంచమే నోరెళ్లబెట్టింది’ అని అన్నారు. -
చైనా, పాక్ భాష
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చైనా వ్యాఖ్యలపై రాజకీయ రగడ కొనసాగుతోంది. అరుణాచల్‌లోని తవాంగ్‌లో భారత జవాన్లను చైనా సైనికులు కొట్టారని రాహుల్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. రాహుల్ నిరంతరం చైనా, పాకిస్తాన్ భాష మాట్లాడుతూ ఉంటారని బీజేపీ అధ్యక్షుడు నడ్డా ఆరోపించారు. శనివారం నడ్డా మీడియాతో మాట్లాడారు. రాహుల్‌ను కాంగ్రెస్ నుంచి వెంటనే బహిష్కరించాలని డిమాండ్ చేశారు. సర్జికల్ దాడులు, బాలాకోట్ వైమానిక దాడులపై గతంలో రాహుల్ సందేహాలు వ్యక్తం చేశారని, ఇవన్నీ చూస్తుంటే ఆయనకున్న దేశభక్తి ప్రశ్నార్థకంగా మారిందన్నారు. రాహుల్ తన వ్యాఖ్యలతో సైనికుల నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీస్తున్నారని మండిపడ్డారు. పార్టీని ఖర్గే తన నియంత్రణలోకి తీసుకొని రాహుల్‌ని పార్టీ నుంచి బహిష్కరించాలన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు చైనా కమ్యూనిస్టు పార్టీతో అవగాహన ఒప్పందం చేసుకున్నారని, అందుకే ఆ దేశ భాష రాహుల్ మాట్లాడుతూ ఉంటారని ఆరోపించారు. ఆర్మీపై రాహుల్‌కు నమ్మకం లేదని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆరోపించారు. -
బాలాకోట్ హీరో అభినందన్‌కు గ్రూప్ కెప్టెన్ ర్యాంక్
న్యూఢిల్లీ: దాయాది దేశం పాకిస్తాన్‌కు చెందిన ఎఫ్–16 యుద్ధవిమానాన్ని కూల్చిన భారత వాయుసేన పైలట్, వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌కు ‘గ్రూప్ కెప్టెన్’ ర్యాంక్ దక్కనుంది. సంబంధిత ప్రక్రియ అధికారికంగా పూర్తయ్యాక ఆయనకు ఆ ర్యాంక్ ఇవ్వాలని భారత వాయుసేన నిర్ణయించిందని సంబంధిత వర్గాలు బుధవారం వెల్లడించాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని బాలాకోట్‌లో జైషే మొహమ్మద్ ఉగ్ర సంస్థకు చెందిన ఉగ్రవాదుల శిక్షణ శిబిరంపై భారత వాయుసేన విమానాలు మెరుపుదాడి చేసిన సంగతి తెల్సిందే. ఈ దాడిలో చాలా మంది ఉగ్రవాదులు హతమయ్యారు. 2019 ఫిబ్రవరి 27న భారత దాడి తర్వాతి రోజునే పాకిస్తాన్ తన వాయుసేన దళాలను ప్రతిదాడి కోసం భారత్ వైపునకు పంపింది. వీటిని తిప్పికొట్టేందుకు భారత వాయుసేన బలగాలు గగనతలంలో ముందుకు దూసుకెళ్లాయి. ఈ క్రమంలో వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ తాను నడుపుతున్న మిగ్–21 బైసాన్ వాయుసేన యుద్ధవిమానంతో పాక్ ఎఫ్–16 యుద్ధవిమానాన్ని కూల్చేశారు. చదవండి: (చిన్న రాష్ట్రంలో పెద్ద పోరు.. గోవా.. ఎవరిది హవా?) -
బాలాకోట్ ఆపరేషన్: లాంగ్ రేంజ్ స్టైక్
ఢిల్లీ: ఉగ్రవాదుల పీచమణిచేందుకు భారత సైన్యం నిర్వహించిన బాలాకోట్ ఆపరేషన్‌కు రెండేళ్లు పూర్తయ్యాయి. పుల్వామా ఉగ్ర దాడికి ప్రతీకారంగా 2019 ఫిబ్రవరి 26న భారత వైమానిక దళానికి(ఐఏఎఫ్) చెందిన ఫైటర్ జెట్లు నియంత్రణ రేఖను(ఎల్ఓసీ) దాటి, పాకిస్తాన్ భూభాగంలోని బాలాకోట్‌లో ఉగ్రవాద స్థావరాలపై బాంబుల వర్షం కురిపించాయి. ఈ ఘటనలో ఉగ్రవాదులకు భారీగా నష్టం వాటిల్లింది. బాలాకోట్ ఆపరేషన్ రెండో వార్షికోత్సవం సందర్భంగా భారత వైమానిక దళం తాజాగా ప్రయోగాత్మకంగా లాంగ్ రేంజ్ స్ట్రైక్ నిర్వహించింది. ప్రాక్టీస్ టార్గెట్‌ను విజయవంతంగా ఛేదించినట్లు అధికార వర్గాలు శనివారం తెలిపాయి. బాలాకోట్ ఆపరేషన్ చేపట్టిన స్క్వాడ్రన్ బృందమే ఈ లాంగ్ రేంజ్ స్ట్రైక్‌లో పాల్గొనడం విశేషం. చదవండి: బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్: ‘కోతి ఖతమైంది’ -
బాలాకోట్ దాడి: సంచలన విషయాలు వెల్లడి
ఇస్లామాబాద్: దాయాది దేశం కుట్ర పన్ని చేసిన పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది భారత సీఆర్పీఎఫ్ సైనికులు అసువులు బాసిన సంగతి తెలిసిందే. ఇందుకు ప్రతీకారంగా భారత్ బాలకోట్ ఉగ్రస్థావారలపై ఎయిర్ స్ట్రైక్స్ నిర్వహించింది. ఇక నాటి దాడిలో దాదాపు 300 మంది ఉగ్రవాదులు మరణించినట్లు కేంద్రం ప్రకటించింది. అయితే ప్రతిపక్షాలు మాత్రం ఇవ్వన్ని గాలి మాటలే.. అంతమంది చనిపోతే.. రక్తం ఎక్కడ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ మాజీ దౌత్యవేత్త ఓ టీవీ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్నాయి. (చదవండి: దేశమంతా శోకంలో ఉంటే నీచ రాజకీయాలా?) ఓ ఉర్దు చానెల్ డిబెట్లో పాక్ దౌత్యవేత్త ఆఘా హిలాలీ మాట్లాడుతూ.. ‘భారతదేశం అంతర్జాతీయ సరిహద్దును దాటి.. ప్రతీకార చర్యలకు పూనుకుంది. ఈ ఘటనలో కనీసం 300 మంది మరణించారు. ఇందుకు మేం బదులు తీర్చుకుంటాం. కానీ మా లక్ష్యం వేరు. మేం వారి హై కమాండ్ని టార్గెట్ చేశాం. అది మా చట్టబద్ధమైన లక్ష్యం. ఇక మేం సర్జికల్ దాడులు జరిగాయి కానీ ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని ప్రకటించాం. వారు ఎంత నష్టం కలిగించారో.. మేం కూడా అంతే నష్టం వారికి కలగజేస్తాం. ఎక్కువ చేయం’ అంటూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్నాయి. -
బాలాకోట్ దాడులపై రెండో సినిమా..
యదార్థ సంఘటనల ఆధారంగా సినిమాలు తీయడంలో బాలీవుడ్ దర్శకనిర్మాతలు ముందంజంలో ఉంటారు. సినిమాలు తీయడమే కాకుండా వారి రికార్డులు వారే తిరగరాసుకుంటారు. ఈ క్రమంలో హిందీలో తాజాగా మరో యదార్థ ఘటనల ఆధారంగా ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. జమ్ము కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఫిబ్రవరి 14న సీఆర్పీఎఫ్ జవాన్లే లక్ష్యంగా ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు. దీనికి ప్రతీకారంగా పాకిస్తాన్‌లోని బాలాకోట్ లోని ఉగ్రవాద స్థావరాలపై భారత వైమానిక దళాలు మెరుపు దాడులు చేసిన విషయం తెలిసిందే. దీనినే కథాంశంగా తీసుకొని సినిమా తీయనున్నట్లు బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ప్రకటించారు. భూషణ్ కుమార్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు ట్విటర్ ద్వారా వెల్లడించారు. ‘కేదార్నాథ్’ దర్శకుడు అభిషేక్ కపూర్ ఈ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు చేపట్టనున్నాడని తెలిపారు. ఈ భారత సైన్య పోరాటాన్ని వెండితెరపై ఆవిష్కరిస్తున్నామని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నామని భూషణ్ కుమార్ తెలిపారు. భారత ఆర్మీ ధైర్యసాహసాలకు ప్రతీకగా ఈ సినిమా నిర్మితమవుతుందన్నారు. జమ్ము కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఫిబ్రవరి 14న సీఆర్పీఎఫ్ జవాన్లే లక్ష్యంగా ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు. దీనికి ప్రతీకారంగా భారత్ ఫిబ్రవరి 26న పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో బాంబులు వర్షం కురిపించి ఉగ్రవాదుల శిబిరాలను నేలమట్టం చేసింది. అయితే ఆ సమయంలో భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ పాకిస్తాన్ చేతికి చిక్కగా, అనూహ్య పరిణామాల తర్వాత తిరిగి భారత్‌కు చేరుకున్నాడు. ఆయన ధైర్యసాహసాలను మెచ్చిన భారత ప్రభుత్వం అభినందన్‌కు ‘వీర్‌చక్ర’ పురస్కారాన్ని అందించింది. ఈ ఘటనను ఆధారంగా చేసుకుని ‘బాలాకోట్- ది ట్రూ స్టోరీ’ సినిమా తీస్తానని ప్రముఖ నటుడు, నిర్మాత వివేక్ ఒబెరాయ్ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో దాదాపు ఒకే ఘటనపై రెండు రకాల సినిమాలు రానున్నట్లు తెలుస్తోంది. A story that celebrates the accomplishments of The Indian Air Force🇮🇳#2019BalakotStrike @PMOIndia @DefenceMinIndia @IAF_MCC #SanjayLeelaBhansali @itsBhushanKumar @AbhisheKapoor #MahaveerJain, @PragyaKapoor_ @Tseries @gitspictures @SundialEnt @prerna982 pic.twitter.com/A5Oh8xpMyB — BhansaliProductions (@bhansali_produc) December 13, 2019 -
పాక్ మ్యూజియంలో అభినందన్ బొమ్మ
కరాచీ: భారత్‌పై విషప్రచారం చేయడంలో ఏ అవకాశాన్నీ వదులుకోని పాకిస్తాన్ మరో దుశ్చర్యకు పాల్పడింది. కరాచీలోని పాకిస్తాన్ వైమానికదళ యుద్ధ మ్యూజియంలో భారత వైమానికదళ వింగ్‌కమాండర్ వర్ధమాన్ బొమ్మను ప్రదర్శించింది. వర్ధమాన్ చుట్టూ పాక్‌సైనికులు చుట్టుముట్టి ఉండగా, ఎడమ పక్క ఒక టీ కప్పును కూడా ఉంచింది. ఫిబ్రవరిలో జరిగిన బాలాకోట్ వైమానిక దాడుల సమయంలో వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ పాకిస్తాన్ యుద్ధ విమానాలను వెంబడించాడు. ఈ ప్రక్రియలో అతను నడుపుతున్న యుద్ధవిమానం పాకిస్తాన్ భూభాగంలో కూలిపోయింది. అతను సురక్షితంగా బయటపడినప్పటికీ పాక్ సైన్యం అతన్ని అదుపులోకి తీసుకుంది. రెండు రోజుల అనంతరం అభినందన్‌ను తిరిగి భారత్‌కు అప్పగించింది. ఈ ఘటనపై అప్పట్లో సామాజిక మాధ్యమాల్లోనూ పాకిస్తాన్ వ్యంగ్య ప్రచారాన్ని చేసింది. తాజాగా అభినందన్ బొమ్మను మ్యూజియంలో ప్రదర్శించింది. దీనిని పాకిస్తాన్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకుడు అన్వర్‌లోధీ ట్విట్టర్లో పోస్టు చేశారు. ‘అభినందన్ బొమ్మ చేతిలో ఒక టీ కప్పు ఉంచితే బొమ్మకు మరింత పరిపూర్ణత వచ్చేది’అని లోధీ వ్యాఖ్యానించాడు. అభినందన్ పాకిస్తాన్ అదుపులో ఉన్నప్పుడు పాక్ సైన్యం విడుదల చేసిన ఒక వీడియోలో అభినందన్ టీ తాగుతున్నట్టుగా చూపించడంతో లోధీ ఈ వ్యాఖ్యలు చేశారు. -
బాలాకోట్‌లో మకాం వేసిన సూసైడ్ బాంబర్లు!
న్యూఢిల్లీ : పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో మళ్లీ ఉగ్ర కార్యకలాపాలు మొదలైనట్టు వెలువడిన వార్తా కథనాలు నిజమేననిపిస్తున్నాయి. సుమారు 45 నుంచి 50 మంది జైషే మహమ్మద్ ఉగ్రవాదులు శిక్షణ పొందుతున్నారని హోంశాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. వారిలో సూసైడ్ బాంబర్లు కూడా ఉన్నట్టు తెలిపారు. కశ్మీర్లో అలజడి సృష్టించేందుకు పాకిస్తాన్ కుట్రలు చేస్తోందని.. దానిలో భాగంగానే బాలోకోట్‌లో ఉగ్ర శిబిరాలు తెరుచుకున్నాయని చెప్పారు. ఆర్టికల్ 370 రద్దుతోనే కశ్మీర్లో హింస చెలరేగిందని ప్రపంచాన్ని నమ్మించేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. (చదవండి : ‘బాలాకోట్’ దాడులపై మళ్లీ అనుమానాలు) ఇక కశ్మీర్లో దాడులకు పాల్పడేందుకు జైషే ఉగ్రవాదులు రెక్కీ కూడా నిర్వహించారని నిఘా వర్గాలకు సమాచారం అందినట్టు తెలుస్తోంది. అయితే, ఉగ్రమూకల్ని ఎదుర్కోవడానికి ఆర్మీ సిద్ధంగా ఉందని, వారికి ఎలాంటి అడ్డంకులు లేవని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఇక పుల్వామా దాడికి సమాధానంగా భారత వైమానికదళం దాడుల్లో బాలాకోట్‌లోని ఉగ్రవాద శిబిరాలు ధ్వంసమైన సంగతి తెలిసిందే. దాంతో 6 నెలలుగా అక్కడ మానవ సంచారం తగ్గిపోయింది. అయితే, భారత సైనికాధిపతి బిపిన్‌రావత్ నెలరోజుల క్రితం మాట్లాడుతూ.. బాలాకోట్‌లో ఉగ్రవాద శిబిరాలను పాకిస్తాన్ ఇటీవలే తిరిగి ప్రారంభించిందని వ్యాఖ్యానించారు. మంచు కరుగుతున్న ప్రాంతాల గుండా, మంచు తక్కువగా ఉన్న ప్రాంతాలైన జమ్మూ కశ్మీర్‌లోని ఉత్తర భాగంనుంచి భారత్‌లోకి చొరబడేందుకు 500 మంది ఉగ్రమూకలు వేచిఉన్నారనీ, ఈ సంఖ్య సమయానుకూలంగా మరవచ్చుననీ రావత్ చెప్పారు. (చదవండి : భారత్ ప్రకటనపై పాక్ ఆగ్రహం) -
భారత్ ప్రకటనపై పాక్ ఆగ్రహం
ఇస్లామాబాద్: బాలాకోట్ ఉగ్రశిబిరాలపై భారతవైమానిక దళాల దాడితో ధ్వంసమైన పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ ఉగ్ర స్థావరాలు తిరిగి ప్రారంభమయ్యాయని భారత సైనికాధిపతి బిపిన్‌రావత్ చేసిన వ్యాఖ్యలను పాకిస్తాన్ ఖండించింది. అంతర్జాతీయ సమాజాన్ని తప్పుదోవ పట్టించేందుకు భారత్ ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తోందంటూ ఆ దేశ విదేశాంగ కార్యాలయం మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. కశ్మీర్లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘన నుంచి దేశ ప్రజలను, ప్రపంచ దేశాల దృష్టిని మళ్లించేందుకు ఢిల్లీ ఇలాంటి కార్యక్రమాలకు ఒడిగడుతోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత్ చేసిన ప్రకటనకు ఎలాంటి ఆధారాలు లేవని పాక్ స్పష్టం చేసింది. పుల్వామా దాడికి సమాధానంగా భారత వైమానికదళం దాడుల్లో ధ్వంసమైన బాలాకోట్ ఉగ్రవాద శిబిరాలను పాకిస్తాన్ ఇటీవలే తిరిగి ప్రారంభించిందని బిపిన్‌రావత్ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఏడు నెలలక్రితం బాలాకోట్‌పై భారత్ దాడితో ఉగ్రవాదులు అక్కడినుంచి వెళ్ళిపోయారని తెలిపారు. తిరిగి మళ్ళీ పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు బాలాకోట్‌లో తమ కార్యకలాపాలను ప్రారంభించారని ఆయన వెల్లడించారు. గతంలో జరిపిన దాడికి మించి ఈసారి దాడులు చేసే అవకాశముందన్నారు. మంచుకరుగుతున్న ప్రాం తాల గుండా, మంచు తక్కువగా ఉన్న ప్రాంతాలైన జమ్మూ కశ్మీర్‌లోని ఉత్తరభాగంనుంచి భారత్‌లోకి చొరబడేందుకు 500 మంది ఉగ్రమూకలు వేచిఉన్నారనీ, ఈ సంఖ్య సమయానుకూలంగా మరవచ్చుననీ రావత్ స్పష్టం చేశారు. -
‘బాలాకోట్’ దాడులపై మళ్లీ అనుమానాలు
సాక్షి, న్యూఢిల్లీ : ఈ ఏడాది మొదట్లో పాకిస్థాన్‌లోని బాలాకోట్‌లోకి భారత వైమానికి దళం చొచ్చుకుపోయి ధ్వంసం చేసిన ఉగ్రవాద శిబిరాన్ని ఉగ్రవాదులు ఇటీవల పునుద్ధరించుకున్నారని భారత సైనిక చీఫ్ బిపిన్ రావత్ సోమవారం చేసిన వ్యాఖ్యలపై పలు అనుమానాలు రేగుతున్నాయి. అసలు ఆ రోజున ఉగ్రవాదుల శిబిరం ఏ మేరకు ధ్వంసమయింది? అన్న అనుమానం నేడే కాదు, దాడులు జరిగిన రోజే కలిగాయి. అంతకుముందు, ఆ తర్వాత అంతర్జాతీయ శాటిలైట్లు తీసిన చిత్రాలను కూడా కొన్ని ఆంగ్ల వెబ్సైట్లు ఉదహరిస్తూ భారత వైమానిక దళం దాడులు గురితప్పాయని ఆరోపించాయి. ఆ ఆరోపణలను, ఆ విమర్శలను భారత ప్రభుత్వ వర్గాలు నిర్ద్వంద్వంగా ఖండించాయి. తాజాగా చెన్నైలోని సైనిక అధికారుల శిక్షణా అకాడమీలో బిపిన్ రావత్ మాట్లాడుతూ నాడు భారత ధ్వంసం చేసిన ఉగ్రవాదుల శిబిరాన్ని వారు మళ్లి పునరుద్ధరించుకొని కార్యకలాపాలు సాగిస్తున్నారని చెప్పడం ఎంత మేరకు నిజం? పాకిస్థాన్‌లోని టెర్రరిస్టులకు కోలుకోని దెబ్బపడిందని, బాలాకోట్‌లోని వారి శిబిరాన్ని సమూలంగా నాశనం చేశామంటూ నాడు ప్రభుత్వ వర్గాలు ప్రకటించడంలో నిజం లేదా? ఈ రెండు నిజం అవడానికి ఆస్కారం లేదు. అలాంటప్పుడు ఒక్కటే నిజం కావాలి? 2016లో భారత సైనికులు పాకిస్థాన్ భూభాగంలోకి చొచ్చుకుపోయి సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా టెర్రరిస్టు లాంఛింగ్ పాడ్లను ధ్వంసం చేసినట్లు చెప్పారు. అప్పుడు కూడా సైనిక వర్గాలుగానీ, ప్రభుత్వ వర్గాలుగానీ అందుకు సరైన సాక్ష్యాలు చూపించలేక పోయాయి. మళ్లీ ఈసారి కూడా బాలాకోట్ లాంటి దాడులు జరిపి భారత సైనిక వర్గాలు నెగ్గుకు రావాలంటే చాలా కష్టం. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న రాజ్యాంగంలోని 370వ అధికరణను రద్దు చేసిన నేపథ్యంలో భారత్, పాక్ దేశాల మధ్య ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల కారణంగా పాక్ సరిహద్దుల్లో పాక్ సైనిక భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోపక్క కశ్మీర్ మిలిటెంట్లు ఉగ్రదాడులకు అవకాశాలు వెతుకుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో భారత్ సర్జికల్ దాడులు నిర్వహించలేదు. (చదవండి: బాలాకోట్ ఉగ్రశిబిరం మొదలైంది) -
బాలాకోట్ ఉగ్రశిబిరం మొదలైంది
చెన్నై: బాలాకోట్ ఉగ్రశిబిరాలపై భారతవైమానిక దళాల దాడితో ధ్వంసమైన పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ ఉగ్ర స్థావరాలు తిరిగి ప్రారంభమయ్యాయని భారత సైనికాధిపతి బిపిన్‌రావత్ చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో వెల్లడించారు. పుల్వామా దాడికి సమాధానంగా భారత వైమానికదళం దాడుల్లో «ధ్వంసమైన బాలాకోట్ ఉగ్రవాద శిబిరాలను పాకిస్తాన్ ఇటీవలే తిరిగి ప్రారంభించిందని ఆయన తెలిపారు. పుల్వామాలో భారత సైనిక వాహనంపై ఉగ్రవాదుల దాడి 40 మంది భారత సైనికులను పొట్టనపెట్టుకున్న సంగతిని ఆయన గుర్తుచేశారు. ఏడు నెలలక్రితం బాలాకోట్‌పై భారత్ దాడితో ఉగ్రవాదులు అక్కడినుంచి వెళ్ళిపోయారని తెలిపారు. తిరిగి మళ్ళీ పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు బాలాకోట్‌లో తమ కార్యకలాపాలను ప్రారంభించారని ఆయన వెల్లడించారు. గతంలో జరిపిన దాడికి మించి ఈసారి దాడులు చేసే అవకాశముందన్నా రు. మంచుకరుగుతున్న ప్రాం తాల గుండా, మంచు తక్కువగా ఉన్న ప్రాంతాలైన జమ్మూ కశ్మీర్‌లోని ఉత్తరభాగంనుంచి భారత్‌లోకి చొరబడేందుకు 500 మంది ఉగ్రమూకలు వేచిఉన్నారనీ, ఈ సంఖ్య సమయానుకూలంగా మరవచ్చుననీ బిపిన్ రావత్ స్పష్టం చేశారు. కశ్మీర్ లోయలో ఏదో జరుగుతోందని కొందరు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారనీ, కానీ కొన్ని ప్రాంతాలకే పరిమితమైన ఆంక్షలను క్రమంగా ఎత్తివేస్తున్నామనీ, ఇప్పుడిప్పుడే అక్కడి పరిస్థితి చక్కబడుతోందనీ ఆయన వెల్లడించారు. నియంత్రణ రేఖ వెంబడి మోహరించిన సైన్యం ఉగ్రవాదులను చొరబాట్లను తీవ్రంగా అడ్డుకుంటోందనీ అయితే అంతర్జాతీయ సరిహద్దుల్లోని కొన్ని ప్రాంతాలను ఉగ్రవాదులు తమ కార్యకలాపాలకు ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నట్టు బిపిన్ రావత్ ఆరోపించారు. కాగా, కథువా జిల్లాలో 40 కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు సైన్యం ప్రకటించింది. కశ్మీర్లో ముగ్గురు ఉగ్రవాదుల అరెస్ట్ జమ్ము: బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతల హత్య సహా నాలుగు ఉగ్రవాద ఘటనలతో సంబంధమున్న ముగ్గురు హిజ్బుల్ ముజాహిదీన్ ముష్కరులను పోలీసులు అరెస్టు చేశారు. కిష్త్వార్ జిల్లాకు చెందిన నిస్సార్ అహ్మద్ షేక్, నిషాద్ అహ్మద్, ఆజాద్ హుస్సేన్‌లు కలిసి బీజేపీ నేత అనిల్ పరిహార్, ఆయన సోదరుడు అజిత్ పరిహార్‌లను గత ఏడాది కాల్చి చంపారు. ఏప్రిల్ 9వ తేదీన ఆర్ఎస్ఎస్ నేత చందర్‌కాంత్ శర్మ, ఆయన అంగరక్షకుడిని కాల్చి చంపారని జమ్మూ జోన్ పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ ముకేశ్ సింగ్ వెల్లడించారు. హింసాత్మక ఘటనలకు పాల్పడిన అనంతరం వీరంతా షేక్ హుస్సేన్ ఇంట్లో తలదాచుకునే వారని ముకేశ్ వెల్లడించారు. మరోవైపు, జమ్మూ కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి చొరబాటుదారులను అడ్డుకునేందుకు భారత రక్షణ బలగాలకు పూర్తి స్థాయి అధికారాలు కట్టబెట్టారు. ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారం భారత్‌లోని కీలకమైన నగరాలను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆర్మీని బలగాలను అలర్ట్ చేసినట్లు పేర్కొన్నారు. -
భారతీయుడిగా అది నా బాధ్యత
ఈ ఏడాది ఫిబ్రవరిలో పాకిస్తాన్లో జరిగిన బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ సంఘటనలు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌ను పాకిస్తాన్ ఎయిర్‌పోర్స్ బృందం అరెస్టు చేయడం, తర్వాత పాకిస్తాన్ అతన్ని విడిచిపెట్టేలా భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవడం.. ఫైనల్‌గా అభినందన్ తిరిగి భారత్‌కు రావడం.. ఇలా అన్ని విషయాలను దేశ ప్రజలు చాలా ఆసక్తితో గమనించారు. ఇప్పుడు ఈ విషయాలనే వెండితెరపై చూపించబోతున్నారు బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్. ‘‘బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ సంఘటనల ఆధారంగా సినిమా తీయడానికి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విభాగం నాకు అనుమతులు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఒక భారతీయుడిగా, దేశ భక్తుడిగా, మన ఆర్మీ బలగాల సమర్థతను ఈ సినిమా ద్వారా మరోసారి గుర్తు చేయాలనుకుంటున్నాను. పుల్వామా ఎటాక్స్, బాలాకోట్ ఎయిర్‌స్ట్రైక్స్ ఘటనలకు చెందిన వార్తలను నేను ఫాలో అవుతూనే ఉన్నాను. తమ ఆర్మీ, ఇంటెలిజెన్సీ ఇండస్ట్రీస్, పొలిటికల్ లీడర్స్ గురించి హాలీవుడ్ ఫిల్మ్‌మేకర్స్ గొప్పగా చెప్పుకుంటారు. మనం ఎందుకు అలా చేయకూడదు? అందుకే ఈ ప్రయత్నం’’ అన్నారు వివేక్. ఈ చిత్రానికి ‘బాలాకోట్: ది ట్రూ స్టోరీ’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానుంది. హిందీ, తమిళ, హిందీ భాషల్లో వచ్చే ఏడాది ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. ఇంకా నటీనటుల ఎంపిక జరగాల్సి ఉంది. జమ్ము కశ్మీర్, ఢిల్లీ, ఆగ్రా ప్రాంతాల్లో చిత్రీకరణ ప్లాన్ చేశారు. మరి.. ఈ సినిమాలో వివేక్ నటిస్తారా? లేక కేవలం నిర్మాతగానే వ్యవహరిస్తారా? అనేది మాత్రం తెలియాల్సి ఉంది. -
‘పాక్ విమానాన్ని కూల్చడం నేను చూశాను’
న్యూఢిల్లీ: వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ పాకిస్తాన్‌కు చెందిన ఎఫ్-16 విమానాన్ని కూల్చివేయడాన్ని తాను చూసినట్లు స్క్వాడ్రన్ లీడర్ మింటీ అగర్వాల్ తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్రం మింటీకి ‘యుద్ధ్ సేవా’ పతకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. యుద్ధ సమయాల్లో అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించినందుకు గానూ ఆమెకు ఈ పురస్కారం దక్కింది. ఈ అవార్డు పొందనున్న తొలిమహిళ రక్షణ అధికారి మింటీనే కావడం విశేషం. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..‘అభినందన్ వర్ధమాన్ ఎఫ్-16 యుద్ధ విమానాన్ని కూల్చేయడం నా స్క్రీన్ నుంచి చూశాను. ఆ సమయంలో ఆయనకు వాతావరణ పరిస్థితుల గురించి తెలియజేస్తున్నాను. బాలాకోట్ స్థావరాలపై విజయవంతంగా దాడులు జరిపాం. శత్రువులను నుంచి స్పందన వస్తుందేమోనని ఎదురు చూస్తున్నాం. పాక్ దాడి చేస్తే.. తిప్పి కొట్టేందుకు మేం కూడా సిద్ధంగా ఉన్నాం. అపాయం తలపెట్టే దురుద్దేశంతోనే పాక్ విమానం భారత గగన తలంలోకి ప్రవేశించింది. కానీ అప్పటికే మన పైలెట్లు, కంట్రోలర్లు, ఇతర బృందం నుంచి గట్టిపోటీ ఎదురయ్యే సరికి వారి మిషన్ ఫెయిలైంది’ అని తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి 26న బాలాకోట్ దాడి జరిగిన మరుసటి రోజు ఫిబ్రవరి 27న పాకిస్థాన్ విమానాలు మన దేశంపై దాడికి ప్రయత్నించాయి. ఆ సమయంలో పాక్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఎఫ్-16ను అభినందన్ తన మిగ్ విమానంతో కూల్చివేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మిగ్ కూడా కూలిపోవడంతో అభినందన్ పాక్ ఆక్రమిత కశ్మీర్లో దిగారు. అక్కడి స్థానికులు ఆయనను పట్టుకుని పాక్ సైనికులకు అప్పగించారు. మూడు రోజుల తర్వాత పాక్ అభినందన్‌ను విడిచిపెట్టింది. దాయది చెరలో ఉన్నప్పుడు ధైర్య సాహసాలు ప్రదర్శించినందుకు గానూ వర్ధమాన్‌కు కేంద్రం ‘వీర్ చక్ర’ ప్రకటించారు. -
ఎయిరిండియాకు భారీ ఊరట
పాకిస్తాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తన గగనతలం మీదుగా భారత విమానాల రాకపోకలకు అనుమతినిస్తూ పాక్ ఆంక్షలను ఎత్తివేసింది. భారత్‌కు చెందిన అన్ని విమానయాన సంస్థలను తన గగనతలంలో ప్రయాణించడానికి అనుమతినిస్తున్నామని పాకిస్తాన్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు ఎయిర్ మెన్ (నోటామ్) నోటీసు జారీ చేసింది. మంగళవారం రోజు తెల్లవారుజామునుంచి ఏటీఎస్ (ఎయిర్ ట్రాఫిక్ సర్వీస్) మార్గాల్లో అన్ని రకాల విమాన సర్వీసులకు తక్షణమే అవకాశం కల్పిస్తుందని పేర్కొంది. తాజా నిర్ణయంతో ప్రభుత్వ రంగ విమాయాన సంస్థ ఎయిరిండియా భారీ ఊరట కలగనుంది. మరోవైపు గగనతల ఆంక్షలను ఎత్తివేయడానికి పాక్ నోటామ్ జారీచేయడం భారత అధికారులు సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. వెంటనే సవరించిన నోటామ్‌ను జారీ చేసింది. తద్వారా సాధారణ విమాన ట్రాఫిక్ కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయని వెల్లడించినట్టు సమాచారం. భారత వైమానిక దళం (ఐఎఎఫ్) దాడుల తరువాత పాకిస్తాన్ గగనతలం మూసివేయడంతో సుమారు 491 కోట్ల రూపాయల భారీ ఆర్థిక నష్టాన్ని చవిచూసిన ఎయిర్ ఇండియాకు ఈ నిర్ణయం పెద్ద ఉపశమనం కలిగించగలదని భావిస్తున్నారు. పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ జూలై 3 న రాజ్యసభలో సమర్పించిన గణాంకాల ప్రకారం ప్రైవేటు విమానయాన సంస్థలు స్పైస్ జెట్, ఇండిగో, గో ఎయిర్ వరుసగా రూ .30.73 కోట్లు, రూ .25.1 కోట్లు, రూ .12.1 కోట్లు నష్టపోయాయి. అటు పాకిస్తాన్ కూడా మూసివేత నిర్ణయానికి భారీ మూల్యాన్నే చెల్లించుకుంది. ఏదైనా ఒక దేశం గగనతలం మీది నుంచి రాకపోకలు సాగించే విమానాలు వాటి బరువు, ప్రయాణించే దూరాన్ని బట్టి ఆ దేశానికి కొంతమొత్తం చెల్లించాల్సి ఉంటుంది. పాకిస్తాన్ మీదుగా ప్రయాణించే బోయింగ్ 737 విమానానికి అయితే 580 డాలర్లు, ఎయిర్‌బస్ 380కి అయితే అంతకంటే పెద్ద మొత్తంలో ఆ దేశ సివిల్ ఏవియేషన్‌కు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అయితే మూసివేత తర్వాత దాదాపు రూ.688 కోట్ల (100 మిలియన్ డాలర్లు) మేర నష్టపోయింది. పుల్వామా ఉగ్రదాడి, బాలాకోట్ దాడుల నేపథ్యంలో పాకిస్తాన్ తన గగనతలాన్ని మూసివేసిన సంగతి తెలిసిందే. -
ఆ షాక్ నుంచి తేరుకోని పాకిస్తాన్
సాక్షి, న్యూఢిల్లీ : పుల్వామా దాడికి ప్రతిగా భారత వైమానిక దళం చేపట్టిన బాలాకోట్ మెరుపు దాడుల ప్రభావం నుంచి పాకిస్తాన్ ఇంకా తేరుకోలేదు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత మెరుపు దాడుల నేపథ్యంలో అప్రమత్తమైన పాకిస్తాన్ అధికారులు సరిహద్దు ప్రాంతంలో వారి గగనతలాన్ని మూసివేయగా, భారత సరిహద్దుల వెంబడి పాక్ తన సేనలను మోహరించింది. నూతన రక్షణ వ్యూహాల్లో భాగంగా పాక్ సేనలు వ్యూహాత్మక స్ధావరాల్లో సాయుధ వాహనాలను మోహరించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఫిబ్రవరి 26న వైమానిక దళం బాలాకోట్‌లో మెరుపు దాడులు చేసినప్పటి నుంచి పాకిస్తాన్ సైన్యం అప్రమత్తమైందని సమాచారం. భారత్ యుద్ధ విమనాలను సరిహద్దు పోస్టుల నుంచి మళ్లిస్తేనే తమ గగనతలాన్ని ఓపెన్ చేస్తామని పాకిస్తాన్ అధికారులు ఇటీవల తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. -
బాలాకోట్ నుంచి బిచాణా ఎత్తేశారు!
న్యూఢిల్లీ: పాకిస్తాన్లో ఉగ్రవాద సంస్థలు ప్రస్తుతం అఫ్గానిస్తాన్ సరిహద్దుల్లోకి మకాం మార్చాయి. పాక్‌లోని బాలాకోట్ ఉగ్ర శిక్షణ శిబిరంపై ఫిబ్రవరిలో భారత వైమానిక దళం దాడులు జరిపిన విషయం తెలిసిందే. ఈ దాడుల అనంతరం ఉగ్రసంస్థలు తమ మకాంను అఫ్గానిస్తాన్‌లోకి మార్చేశాయి. జైషే మొహమ్మద్, లష్కరే తోయిబా సంస్థలు కునార్, నంగర్హార్, నూరిస్తాన్, కాందహార్‌లలో శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేశాయి. దీంతో భారత నిఘా వర్గాలు కాబూల్, కాందహార్‌లలో ఉన్న దౌత్య కార్యాలయాలను అప్రమత్తం చేశాయి. అఫ్గాన్ తాలిబన్, హక్కానీ నెట్‌వర్క్‌తో చేతులు కలిపిన జైషే మొహమ్మద్, లష్కరే తోయిబాలు పాక్–అఫ్గాన్ సరిహద్దు డ్యూరాండ్ రేఖ వెంబడి శిక్షణ శిబిరాలను నెలకొల్పి, ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 14వ తేదీన కశ్మీర్‌లోని పుల్వామాలో జైషే మొహమ్మద్ ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి ప్రతీకారంగా అదే నెలలో భారత వైమానిక దళం బాలాకోట్‌పై బాంబు దాడులు జరిపింది. అంతర్జాతీయ ఒత్తిడులకు లొంగిన పాక్ ప్రభుత్వం ఈ నెల మొదటి వారంలో లష్కరే తోయిబాకు చెందిన 15 మంది నేతలను అదుపులోకి తీసుకుంది. అయితే, ఇవన్నీ కంటి తుడుపు చర్యలేనని భారత్ అంటోంది. నిర్దిష్టమైన చర్యలతో ఉగ్రమూకలను కట్టడి చేయాలని కోరుతోంది. మరోవైపు, పాక్ ఉగ్ర సంస్థలకు దన్నుగా ఉంటోందంటూ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్(ఎఫ్ఏటీఎఫ్) సంస్థ ఆర్థిక సాయం నిలిపివేసింది. దీంతో ఆర్థికంగా కుంగిపోయిన పాక్‌పై ఒత్తిడి తీవ్రమైంది. ఈ నేపథ్యంలోనే ఉగ్ర సంస్థలు పాక్ నుంచి తమ మకాంను అఫ్గానిస్తాన్‌కు మార్చాయని భారత్ నిఘా వర్గాలు అంటున్నాయి. అయితే, ఈ పరిణామంతో అఫ్గాన్ రాజధాని కాబూల్‌తోపాటు కాందహార్‌లో ఉన్న భారత దౌత్య కార్యాలయాలకు ఉగ్ర ముప్పు పెరిగిందని హెచ్చరిస్తున్నాయి. జైషే మొహమ్మద్ ఉగ్రవాదులతోపాటు, పేలుడు పదార్థాలు అమర్చిన వాహనాలతో కాబూల్ ఎంబసీపై కారివరి గుల్ అనే ఉగ్ర సంస్థ దాడులకు దిగే ప్రమాదముందని అనుమానిస్తున్నాయి. కాందహార్‌లోని ఇండియస్ ఎంబసీపై తాలిబన్లు కూడా దాడులకు పాల్పడే ప్రమాదముందని అంటున్నాయి. తాలిబన్, హక్కానీ నెట్‌వర్క్‌లు జైషే మొహమ్మద్ అధిపతి మసూద్ అజార్‌కు ఆశ్రయం కల్పించేందుకు ఫిబ్రవరిలో ముందుకు వచ్చినా పాక్‌లోని భావల్పూర్లో సైనిక రక్షణ మధ్య ఉండటమే శ్రేయస్కరమని అతడు ఆ ఆఫర్‌ను తిరస్కరించాడు. అంతేకాకుండా, కాబూల్, కాందహార్ల్లో ఉన్న భారత కార్యాలయాలపై ఈ ఉగ్ర సంస్థలు నిఘా వేసి ఉంచాయి. జనవరిలో సెదిక్ అక్బర్, అతావుల్లా అనే ఇద్దరు ఉగ్రవాదులను అఫ్గాన్ బలగాలు అదుపులోకి తీసుకుని, విచారించగా ఈ విషయాలన్నీ బయటకు వచ్చాయి. అమెరికా బలగాలకు ముప్పు లష్కరే తోయిబా కూడా తన అనుచరులను నంగర్హార్, నూరిస్తాన్, కునార్, హెల్మండ్, కాందహార్ ప్రావిన్సుల్లోని శిక్షణ శిబిరాలకు తరలించింది. పెషావర్‌లో ఉన్న సభ్యుల మకాంను కాబూల్‌కు మార్చింది. తాలిబన్ సాయంతో విధ్వంసక, విద్రోహ చర్యలపై శిక్షణ ఇస్తోంది. మరోవైపు, అఫ్గానిస్తాన్‌లో ఉన్న 300 మంది జైషే మొహమ్మద్ ఉగ్రవాదులతో అమెరికా, సంకీర్ణ బలగాలకు ముప్పు ఉననట్లు అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ కూడా తన నివేదికలో పేర్కొంది. తాలిబన్, ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఖైబర్–పక్తున్వా మధ్య రాజీ కుదర్చడంలో జైషే మొహమ్మద్ పాత్ర ఉందని తెలిపింది. -
నిఘా కోసం చైనా డ్రోన్లు
పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని బాలాకోట్‌లో జైషే ఉగ్రవాద శిక్షణ శిబిరంపై భారత వైమానిక దళం మెరుపుదాడి చేయడంతో పాకిస్తాన్‌కు రక్షణ పరంగా తన వైఫల్యాలేమిటో తెలిసి వచ్చింది. దాంతో భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్తపడుతోంది. భారత్ విషయంలో ఇంత వరకు అనుసరిస్తున్న వ్యూహాలను మార్చుకుంటోంది. సైనిక స్థావరాల వద్ద భద్రతను పటిష్టం చేయడం, సరిహద్దులో నిఘాను పెంచడం వంటి చర్యలు తీసుకుంటున్నట్టు భారత నిఘా వర్గాలు పసిగట్టాయి. ఏ మాత్రం దొరక్కుండా, రాడార్లకు కూడా చిక్కకుండా భారత్ దాడి చేయడం, ఆ తర్వాత భారత్‌పై దాడికి చేసిన యత్నం విఫలమవడాన్ని పాక్ సైన్యం జీర్ణించుకోలేకపోతోందని భారత నిఘావర్గాల భోగట్టా. అత్యాధునిక ఆయుధాలు, నిఘా వ్యవస్థలను సత్వరమే సమకూర్చుకోవాలని, సరిహద్దులో నిఘాను పెంచాలని నిర్ణయించింది. వాస్తవాధీన రేఖ, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లలో నిఘాకోసం మరిన్ని డ్రోన్లను ఉపయోగించాలని, వాటిని చైనా నుంచి కొనాలని నిర్ణయించింది. అలాగే, సరిహద్దులో చైనా తయారీ మధ్యంతర క్షిపణులను మోహరించాలని కూడా ఆలోచిస్తోంది. అత్యాధునిక రైన్బో డ్రోన్లు, యూఏవీల కొనుగోలుకు చైనాతో ఒప్పందాలు కుదుర్చుకుంది. మరోవైపు ఉగ్ర సంస్థలకు కూడా జాగ్రత్తలు చెబుతోంది. ఆయుధాలను బహిరంగంగా ప్రదర్శించవద్దని, వాస్తవాధీన రేఖకు దూరంగా శిబిరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించినట్టు నిఘా వర్గాల సమాచారం. అలాగే, ఉగ్రవాదులంతా పాక్ సైనిక యూనిఫాంలు లేకుండా బయట తిరగవద్దని కూడా స్పష్టం చేసింది. భారత్‌పై దాడుల కోసం ఉగ్రవాదుల కన్సార్టియం ఏర్పాటుకు ఐఎస్ఐ ప్రయత్నిస్తోందని తెలిసింది. ఇందుకోసం జైషే, హఖానీ, తాలిబన్, ఐసిస్ వంటి ఉగ్ర సంస్థల మధ్య సమావేశాలు ఏర్పాటు చేస్తోందని నిఘా వర్గాలు పసిగట్టాయి. -
‘బాలాకోట్ తర్వాత పాక్ ఆ దుస్సాహసం చేయలేదు’
సాక్షి, న్యూఢిల్లీ : బాలాకోట్ వైమానిక దాడుల అనంతరం పాకిస్తాన్ ఎన్నడూ వాస్తవాధీన రేఖ (ఎల్ఓసీ)ను దాటలేదని ఐఏఎఫ్ చీఫ్ బీరేందర్ సింగ్ ధనోవా పేర్కొన్నారు. భారత వైమానిక దళం తన సైనిక ఆశయం నెరవేర్చడంలో విజయవంతమవగా, పాకిస్తాన్ విఫలమైందని స్పష్టం చేశారు. పాక్ యుద్ధ విమానాలు ఎల్ఓసీని అతిక్రమించలేదని తెలిపారు. మన సైనిక స్ధావరాలపై దాడులు తలపెట్టాలన్న పాకిస్తాన్ కుట్ర ఫలించలేదని చెప్పారు. వారు (పాక్) మన గగనతలంలోకి రాలేదని అదే మన విజయమని పేర్కొన్నారు. పాకిస్తాన్ తన గగనతలాన్ని మూసివేయడం వారి సమస్యని, మన ఆర్థిక వ్యవస్ధకు విమాన ట్రాఫిక్ కీలకమని ఎయిర్‌ఫోర్స్ ఇప్పటివరకూ పౌరవిమాన ట్రాఫిక్‌ను నిలువరించలేదని ఆయన గుర్తుచేశారు. పాక్‌తో ఉద్రిక్తతల ప్రభావం పౌర విమానయానంపై పడకుండా వ్యవహరించామని చెప్పారు. కాగా పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో భారత వైమానిక దళం పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో మెరుపు దాడులు చేపట్టి ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేసిన సంగతి తెలిసిందే. -
పాక్‌ను వెంటాడుతున్న బాలాకోట్
ఇస్లామాబాద్ : బాలాకోట్ దాడుల భయం పాకిస్తాన్‌ను వెంటాడుతోంది. ప్రతీకార దాడులపై ఆందోళనతో పాటు అంతర్జాతీయ సమాజం నుంచి ఒత్తిళ్లకు తలొగ్గిన పాక్ పీఓకేలో ఉగ్రవాద శిబిరాలపై ఉక్కుపాదం మోపింది. భారత్ చెబుతున్న వివరాల ప్రకారం పీఓకేలో ముజఫరాబాద్, కోట్లి ప్రాంతాల్లో ఐదేసి చొప్పున, బర్నాలాలో ఒక క్లస్టర్ సహా 11 ఉగ్రవాద శిబిరాలు తమ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. కోట్లీ, నికైల్ ప్రాంతంలో లష్కరే తోయిబా నిర్వహిస్తున్న కొన్ని శిబిరాలు మూతపడ్డాయి. పాలా, బాగ్ ప్రాంతంలో జైషే మహ్మద్ నిర్వహిస్తున్న ఉగ్ర శిబిరాలు కూడా మూతపడగా, కోట్లి ప్రాంతంలో హిజ్బుల్ ముజహిదీన్ ఉగ్ర శిబిరం షట్‌డౌన్ అయింది. మరోవైపు ముజఫరాబాద్, మిర్పూర్ ప్రాంతాల్లోని ఉగ్ర శిబిరాలు కూడా మూతపడ్డాయని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ఇక ఇండో-పాక్ సరిహద్దు వెంబడి భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించే టెర్రర్ లాంచ్‌ప్యాడ్స్ కూడా చురుకుగా లేవని సమాచారం. బాలాకోట్ వైమానిక దాడుల అనంతరం భారత్‌లోకి పీఓకే నుంచి చొరబాట్ల ప్రయత్నాలు పెద్దగా సాగడం లేదని అధికారులు చెబుతున్నారు. -
నాడు 170 మంది ఉగ్రవాదులు హతం
న్యూఢిల్లీ: బాలాకోట్‌లోని జైషే ఉగ్రస్థావరంపై భారత వాయుసేన(ఐఏఎఫ్) చేసిన దాడిలో ఎవ్వరూ చనిపోలేదని బుకాయిస్తున్న పాకిస్తాన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఏడాది ఫిబ్రవరి 26న తెల్లవారుజామున ఐఏఎఫ్ చేపట్టిన వైమానికదాడిలో 130 నుంచి 170 జైషే ఉగ్రవాదులు చనిపోయారని ఇటాలియన్ జర్నలిస్ట్ ఫ్రాన్సెక్సా మారినో తెలిపారు. ఐఏఎఫ్ దాడిలో ఘటనాస్థలిలోనే భారీ సంఖ్యలో ఉగ్రవాదులు చనిపోగా, మరికొందరు చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారని వెల్లడించారు. ఈ దాడిలో గాయపడ్డ ఉగ్రమూకలకు పాక్ మిలటరీ డాక్టర్లు వైద్యం చేశారని పేర్కొన్నారు. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ మారినో రాసిన కథనాన్ని ‘స్ట్రింగర్ ఆసియా’ అనే వెబ్సైట్ ప్రచురించింది. మృతుల కుటుంబాలకు పరిహారం.. ఫిబ్రవరి 26 తెల్లవారుజామున ఐఏఎఫ్ యుద్ధవిమానాలు బాలాకోట్‌లోని ఉగ్రస్థావరంపై బాంబుల వర్షం కురిపించాయని మారినో తెలిపారు. ‘ఈ దాడిలో 11 మంది శిక్షకులు సహా 170 మంది వరకూ చనిపోయారు. దాడి జరిగిన కొద్దిసేపటికే అక్కడకు చేరుకున్న పాక్ ఆర్మీ క్షతగాత్రులను షింకియారీ ప్రాంతంలో ఉన్న హర్కతుల్ ముజాహిదీన్ క్యాంప్‌కు తరలించింది. స్థానికుల సమాచారం ప్రకారం ఇంకా 45 మంది ఉగ్రవాదులు ఇక్కడ చికిత్స పొందుతున్నారు. కోలుకున్నవారిని ఆర్మీ అదుపులోకి తీసుకుంది. ఈ మొత్తం విషయం బయటకు పొక్కకుండా జైషే నేతలు మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించారు. ఇప్పుడు జైషే క్యాంపును తాలిమున్ ఖురాన్(మదర్సా)గా మార్చేశారు. ప్రస్తుతం స్థానిక పోలీసులకు కూడా ఇక్కడ అనుమతి లేదు’ అని చెప్పారు. అవసరమైతే బాలాకోట్‌లో భారత జర్నలిస్టులను అనుమతిస్తామని పాక్ ప్రకటించిన నేపథ్యంలో మారినో ఈ కథనం రాయడం గమనార్హం. -
బాలాకోట్ ఎటాక్ : న్యూ ట్విస్ట్
బీజేపీ సర్కార్ ప్రచారాస్త్రంగా మలుచుకున్న బాలాకోట్ వైమానిక దాడిపై న్యూటిస్ట్ ఒకటి వెలుగులోకి వచ్చింది. ఫిబ్రవరి 26న భారత వాయుసేన జరిపిన దాడిని ఇటలీకి చెందిన ఓ జర్నలిస్ట్ తాజాగా ధ్రువీకరించారు. ఈ దాడిలో 130-170 మంది వరకు జైషే మహ్మద్ ఉగ్రవాదులు చనిపోయారని ఇటలీ జర్నలిస్ట్ ఫ్రాన్సెస్కా మెరినో ఒక వివరణాత్మక కథనాన్ని వెలువరించి సంచలనం రేపారు. పాకిస్తాన్ ఈ విషయంలో వాస్తవాలను దాచిపెట్టి ప్రపంచాన్ని మోసం చేయాలని చూస్తోందని ఆమె మండిపడ్డారు. ఖాళీ ప్రదేశంలో దాడి చేసినట్లు పాకిస్తాన్ పేర్కొందనీ, ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లలేదంటూ కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసిందని తన కథనంలో మెరినో ఆరోపించారు. అయితే భారత వైమానిక దళం జేఈఎం శిక్షణా శిబిరాన్ని నాశనం చేశారని పేర్కొన్నారు. బాలాకోట్‌లోని ఉగ్రవాద శిబిరంలో జైషే మహ్మద్ సంస్థ శిక్షణా శిబిరంలో జరిగిన వైమానిక దాడిలో 170 మంది చనిపోయారన్నారు. వీరిలో ఉగ్రవాద శిక్షణ ఇచ్చేవారు, బాంబులు తయారు చేసేవారు ఉన్నారని పేర్కొన్నారు. ఫిబ్రవరి 26న 3 నుంచి 4 గంటల సమయంలో భారత వైమానిక దళం దాడి ఘటన వెంటనే షిన్‌కిరి బేస్ క్యాంపు వద్ద పాకిస్థాన్ తమ బలగాలను మొహరించిందన్నారు. పాకిస్తాన్ సైన్యమే క్షతగాత్రులను ఆసుపత్రిలకు తరలించి ఆర్మీలోని వైద్యుల ద్వారా చికిత్స అందించిందని తెలిపారు. ఇప్పటికీ గాయపడ్డ 45 మంది మిలిటరీ క్యాంపులో చికిత్స పొందుతున్నారని, వీరు ప్రస్తుతం సైన్యం నియంత్రణలోనే ఉన్నారని ఆమె వెల్లడించారు. అంతేకాదు దాడిలో చనిపోయిన తీవ్రవాదుల కుటుంబాలను సందర్శించిన జెఈఎం నాయకులు సంఘటన గురించి మాట్లాడకుండా ఉండేందుకు డబ్బులిచ్చారని తెలిపారు. కాగా సార్వత్రిక ఎన్నికల వేళ ఉగ్ర శిబిరాలపై వైమానిక దాడుల అంశం చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇటలీకి చెందిన జర్నలిస్టు కథనం ప్రాధాన్యతను సంతరించుకోనుంది. ప్రధానంగా విపక్షాలు బాల్కోట్ ఉదంతంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తూ ఆధారాలు చూపాలని డిమాండ్ చేస్తున్నతరుణంలో ఈ కథనం వెలువడటం గమనార్హం. -
‘బాలాకోట్ వైమానిక దాడుల గురించి తెలియదు’
చంఢీగడ్ : బాలీవుడ్ నటుడు, బీజేపీ నాయకుడు సన్నీ డియోల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన బాలాకోట్ ఉగ్రదాడుల గురించి తనకు తెలియదని వ్యాఖ్యానించారు. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో సన్నీ డియోల్ పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ నుంచి బీజేపీ తరఫున ఎన్నికల బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో భాగంగా.. సన్నీ డియోల్ ఈ వ్యాఖ్యలు చేశారు. బాలకోట్లో భారత వాయుసేన జరిపిన వైమానిక దాడుల గురించి తనకు ఎక్కువగా తెలియదన్నారు. అంతేకాక భారత్ - పాక్ మధ్య నెలకొన్ని ఉద్రిక్త పరిస్థితులు గురించి కూడా తనకు అంతగా అవగాహన లేదన్నారు. కానీ ఈ ఎన్నికల్లో విజయం సాధించి.. దేశానికి సేవ చేయాలని భావిస్తున్నట్లు సన్నీ డియోల్ తెలిపారు. గురుదాస్‌పూర్ నుంచి మీరు విజయం సాధిస్తారా అని ప్రశ్నించగా.. ఏమో.. ప్రస్తుతానికి ఏం చెప్పలేనన్నారు సన్నీ డియోల్. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మీద ప్రశంసల వర్షం కురిపించారు సన్నీ డియోల్. గత ఐదేళ్లుగా నరేంద్ర మోదీ దేశానికి చాలా సేవ చేశారని పొగిడారు. అయితే ఈ ఎన్నికల్లో గెలుపు కోసం తాను మోదీ ప్రజాదరణ మీద ఆధారపడనని స్పష్టం చేశారు సన్నీ డియోల్. ఒకవేళ ఈ ఎన్నికల్లో గెలిస్తే.. తాను కూడా ప్రజల్లో మంచి పేరు సంపాదించుకుంటానని సన్నీ డియోల్ పేర్కొన్నారు. -
ప్రతిపక్షాలపై ‘వీడియో’ అస్త్రాలు
న్యూఢిల్లీ: బాలాకోట్ ఉగ్రవాద స్థావరాలపై సైన్యం దాడులను ప్రశ్నిస్తూ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలకు దీటుగా సమాధానం చెప్పేందుకు బీజేపీ యానిమేటెడ్ వీడియోలను రూపొందించింది. రాహుల్, ఇతర ప్రతిపక్షాల విమర్శలకు సమాధానంగా ప్రధాని మోదీని హీరోగా చూపుతూ క్రీడా నేపథ్యంలో తయారుచేసిన వీడియోలను ఆదివారం బీజేపీ విడుదల చేసింది. క్రికెట్, కబడ్డీ, చెస్ ఆటల క్లిప్పింగ్‌లను ఈ వీడియోలకోసం తీసుకున్నామని, పార్టీ అధికారిక ట్విట్టర్ సైట్లో ప్రకటించారు. దాదాపు అన్ని వీడియోలలోనూ మోదీ హీరోగా, ప్రతిపక్షాలపై ఒంటరిగా, అజేయంగా పోరాడుతున్నట్టుగా రూపొందించారు. క్రికెట్ నేపథ్యంలో రూపొందించిన ఒక వీడియోలో మోదీ సిక్సర్ కొట్టి మ్యాచ్ గెలిపించినట్టుగా, ప్రతిపక్షాలు అంపైర్‌ను ఆ విజయానికి సాక్ష్యం చూపమని అడుగుతున్నట్టుగా ఉంది. ఈ వీడియోను ట్యాగ్చేస్తూ అరుణ్ జైట్లీ ‘భారత్ విజయానికి ఎవరు సాక్ష్యాలు అడుగుతారు, అపజయానికి కారణాలు వెతుక్కునే వారే ఈ విజయానికి రుజువులు కావాలని అడుగుతారు’అని చెప్పారు. కబడ్డీ వీడియోలో ప్రతిపక్షాలన్నింటినీ మోదీ ఒక్కడే మట్టి కరిపించినట్టుగా ఉంది. ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని ఓటర్లకు సులభంగా అర్థమయ్యేలా చెప్పడమే లక్ష్యంగా వీటిని తయారుచేసినట్లు బీజేపీ తెలిపింది. -
‘పాక్ సైన్యానికి.. స్థానికులకు హానీ జరగలేదు’
న్యూఢిల్లీ : బాలాకోట్ దాడి వల్ల పాక్ సైన్యానికి.. స్థానికులకు ఎలాంటి హాని జరగలేదని కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ దాడి వల్ల మాకు చిన్న గాయం కూడా కాలేదని పాకిస్తాన్ ప్రచారం చేసుకుంటున్న నేపథ్యంలో సుష్మా స్వరాజ్ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. బీజేపీ మహిళా కార్యకర్తలతో సమావేశమైన సుష్మా స్వరాజ్ ఈ సందర్భంగా బాలాకోట్ దాడిలో పాకిస్తాన్ సైన్యానికి గానీ, స్థానికులకు గానీ ఎలాంటి హాని జరగలేదని పేర్కొన్నారు. ‘భద్రతా బలగాలను కేవలం జైషే ఉగ్ర స్థావరాల మీద దాడి చేయడానికి మాత్రమే అనుమతించారు. ఎందుకంటే పుల్వామా దాడికి పాల్పడింది జైషే ఉగ్రవాదులు కాబట్టి.. వారి స్థావరాలను నాశనం చేయాలని ఆదేశించారు. దాని ప్రకారమే మన బలగాలు ఉగ్ర స్థావరాలపై దాడి చేసి వెనుతిరిగాయ’ని ఆమె పేర్కొన్నారు. అంతేకాక మనపై శత్రువులు దాడి చేస్తే మనం కూడా ప్రతి దాడి చేసి ఆత్మరక్షణ చేసుకోగలమని ప్రపంచానికి చాటి చెప్పడం కోసమే ఈ దాడులకు పాల్పడ్డాం అని వివరించారు. ఈ దాడులను ప్రపంచ దేశాలు కూడా సమర్థించాయని పేర్కొన్నారు. -
తొలిదశ ఎన్నికల వేళ పాక్ అనూహ్య నిర్ణయం
ఇస్లామాబాద్ : పుల్వామాలో భారత్ సీఆర్పీఎఫ్ జవాన్ల మీద జరిగిన దాడికి ప్రతీకారంగా.. బాలాకోట్‌లోని జైషే ఉగ్ర స్థావరాలపై భారత్ వైమనిక దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో దాదాపు 300 మంది ఉగ్రవాదులు హతమయ్యారని భారత్ ఆరోపిస్తుండగా.. పాక్ మాత్రం ఎలాంటి నష్టం వాటిల్లలేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో పాక్ తొలిసారి భారత్ వైమానిక దాడులు జరిపిన బాలాకోట్ పరిసర ప్రాంతంలో సందర్శించడానికి అంతర్జాతీయ మీడియాను అనుమతించింది. భారత్ వైమనిక దాడి చేసిన 43 రోజుల తర్వాత.. భారత్‌లో తొలి దశ ఎన్నికల పోలింగ్‌కు ముందు పాక్ ఈ పర్యటనకు అనుమతించడం పట్లా సర్వత్రా ఉత్కంఠతకు తెర తీసింది. పలు అంతర్జాతీయ మీడియా సంస్థలకు చెందిన వ్యక్తులతో పాటు.. వివిధ దేశాల దౌత్యవేత్తలు.. భద్రతా బలగాలకు చెందిన దాదాపు 24 మంది పర్యటనలో పాల్గొన్నారని సమాచారం. పాక్ అధికారులు వీరందరిని దాడి జరిగినట్లుగా చెప్పబడుతున్న ప్రాంతానికి తీసుకెళ్లారు. భారత వైమానకి దళం దాడి జరపిన ప్రాంతం ఉగ్రవాద శిబిరం కాదని.. అది ఒక మదర్సా అని పాక్ ప్రభుత్వం పేర్కొంది. ఈ మదర్సాలో దాదాపు 130 దాకా విద్యార్థులున్నట్లు సమాచారం. అంతేకాక ఈ దాడిలో ఎటువంటి ప్రాణ నష్టం వాటిల్లలేదని తెలిపింది. ఈ నేపథ్యంలో పాక్ ఆర్మీ అధికారి ఒకరు.. ‘అంతర్జాతీయ మీడియాతో పాటు భారత్‌కు చెందిన జర్నలిస్టులు.. దౌత్యవేత్తలు, భద్రతా సిబ్బంది బాలాకోట్ ప్రాంతాన్ని సందర్శించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 26న భారత వైమానిక దళం ఇక్కడ దాడులకు పాల్పడింది. భారత్ చెప్పుకున్నట్లుగా ఇక్కడ ఎలాంటి ఉగ్ర సంస్థలు లేవు. భారత్ నియమాలను ఉల్లఘించి వైమానిక దాడి జరిపింది ఓ మదర్సా మీద. వాస్తవ పరిస్థితులను తెలుసుకొండి. భారత్ చేస్తున్న అబద్దపు ప్రచారాన్ని నమ్మకండి’ అంటూ ట్వీట్ చేశారు. A group of international media journalists mostly India based and Ambassadors & Defence Attachés of various countries in Pakistan visited impact site of 26 February Indian air violation near Jabba, Balakot. Saw the ground realities anti to Indian claims for themselves. pic.twitter.com/XsONflGGVP — Maj Gen Asif Ghafoor (@OfficialDGISPR) April 10, 2019 -
భారత్ మళ్లీ దాడి చేయాలని చూస్తోంది
ఇస్లామాబాద్: ఏప్రిల్ 16 నుంచి 20వ తేదీల మధ్య పాక్‌పై దాడి చేసేందుకు భారత్ ప్రయత్నాలు చేస్తోందంటూ నిఘా వర్గాల సమాచారం అందిందని పాక్ విదేశాంగ మంత్రి చెప్పారు. ఫిబ్రవరి 26వ తేదీన పాక్ భూభాగంలోని బాలాకోట్‌పై భారత్ జరిపిన బాంబు దాడిపై అంతర్జాతీయ సమాజం మౌనంగా ఉండటాన్ని ఆయన తప్పుపట్టారు. పాక్ మంత్రి ప్రకటనను భారత్ ఖండించింది. ఈ ప్రాంతంలో యుద్ధభయాన్ని పెంచడమే పాక్ ఉద్దేశమని భారత విదేశాంగ శాఖ తెలిపింది. ‘పాక్ మంత్రి చేసిన బాధ్యతారహిత, అవమానకర ప్రకటన. యుద్ధభయాన్ని పెంచడమే పాక్ ఉద్దేశం. భారత్‌లో ఉగ్రదాడులకు పాల్పడాలంటూ అక్కడి ఉగ్ర సంస్థలకు పిలుపునిచ్చేందుకే ఇలాంటి ఎత్తులు వేస్తోంది’ అని భారత్ ప్రకటించింది. -
బ్రేకింగ్: ఏప్రిల్ 16-20 మధ్య పాక్‌పై భారత్ దాడి!
న్యూఢిల్లీ : ఈ నెల 16-20 తేదీల మధ్య మా దేశంపై దాడి చేసేందుకు భారత్ పథకం పన్నుతోందని, ఈ విషయమై తమకు విశ్వసనీయమైన నిఘా సమాచారముందని పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ చెప్పుకొచ్చారు. జమ్మూకశ్మీర్ పూల్వామాలో భారత సైనిక కాన్వాయ్ వెళుతుండగా.. జైషే మహమ్మద్‌కు చెందిన సూసైడ్ బాంబర్ తనను తాను పేల్చుకొని 40మంది జవాన్లను పొట్టనబెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనకు ప్రతీకారంగా భారత వైమానిక దళం బాలకోట్‌లోని జైషే ఉగ్రవాద స్థావరంపై దాడులు జరిపింది. ఇందుకు ప్రతిగా పాకిస్థాన్ వైమానిక దళం.. భారత గగనతలంలోకి చొచ్చుకురావడం..భారత్‌కు చెందిన మిగ్-21 విమానాన్ని కూల్చడం తెలిసిందే. ఈ దాడి నుంచి తప్పించుకున్న ఐఏఎఫ్ పైలట్ అభినందన్.. ఈ క్రమంలో దాయాది భూభాగంలో దిగడం.. భారత్ తీసుకొచ్చిన అంతర్జాతీయ ఒత్తిడితో పాక్ అతన్ని మన దేశానికి తిరిగి అప్పగించడం తెలిసిందే. ఈ క్రమంలో ఖురేషీ ఆదివారం ముల్తాన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ కొత్త పథకాన్ని రచిస్తోందని తమకు విశ్వసనీయమైన నిఘా సమాచారముందని, పాక్‌కు వ్యతిరేకంగా దాడి చేసేందుకు భారత్ సన్నాహాలు చేస్తోందని ఖురేషీ చెప్పుకొచ్చారు. ఈ దాడి ఏప్రిల్ 16-20 తేదీల మధ్య ఉండొచ్చునని తెలిపారు. పాక్‌పై తమ దౌర్జన్యాన్ని సమర్థించుకునేందుకు, దౌత్యపరంగా ఇస్లామాబాద్‌పై ఒత్తిడి పెంచేందుకు భారత్ ఈ దాడికి పూనుకుంటోందని, ఇదే జరిగితే ఉపఖండంలో శాంతి, సుస్థిరతలకు తీవ్ర విఘాతం తప్పదని ఆయన పేర్కొన్నారని డాన్ పత్రిక తెలిపింది. -
ప్రతిపక్షాలు పాక్ ప్రతినిధులు
జముయ్(బిహార్): బాలాకోట్ ఉగ్రశిబిరాలపై ఐఏఎఫ్ దాడికి రుజువులు చూపాలంటూ డిమాండ్ చేస్తున్న ప్రతిపక్షాలు భారతీయ రాజకీయ పార్టీల కంటే మించి పాక్ ప్రతినిధులుగా వ్యవహరిస్తున్నాయని ప్రధాని మోదీ ఆరోపించారు. బిహార్‌లోని జముయ్‌లో మంగళవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన కాంగ్రెస్, ఆర్జేడీ పార్టీలపై విరుచుకుపడ్డారు. ‘పాక్‌కు సాయపడేవారు, ఆధారాలు చూపాలంటూ మన సైన్యం నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసే వారు కావాలో వద్దో తేల్చాల్సింది ప్రజలే’ అని తెలిపారు. జమ్మూకశ్మీర్ రాష్ట్రానికి ప్రధాని పదవిని పునరుద్ధరించాలన్న నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా డిమాండ్‌పై ఆయన స్పందిస్తూ.. ‘ఏ దేశంలోనైనా ఒకరి కంటే ఎక్కువమంది ప్రధానులుంటారా? అని ప్రశ్నించారు. ఈ విషయంలో మహాకూటమి ప్రధాన పార్టీలు కాంగ్రెస్, ఆర్జేడీలు తమ వైఖరిని స్పష్టం చేయాలన్నారు. ‘కాంగ్రెస్ తన సొంతంగా లేదా కూటమి పార్టీగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రతిసారీ దేశంలో పాలన తిరోగమనంలో సాగుతుంది. అభివృద్ధి పడిపోతుంది. హింస, ఉగ్రచర్యలు, నల్లధనం పేరుకుపోవడం మితిమీరుతాయి’ అని ఆరోపించారు. సోషలిస్ట్ నేత జయప్రకాశ్ నారాయణ్ పేరుతో పదవీ ప్రమాణం చేసే లాలూ ప్రసాద్ వంటి నేతలు ఇప్పుడు కాంగ్రెస్ చంకనెక్కారు అంటూ ఎద్దేవా చేశారు. ఆర్ఎస్ఎస్ అజెండాను అనుసరిస్తున్న బీజేపీ దేశంలో రిజర్వేషన్లు లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తోందన్న ఆర్జేడీ ఆరోపణలపై ఆయన స్పందించారు. ‘రిజర్వేషన్లను ఎవరూ రద్దు చేయలేరు. ఆర్థికంగా వెనుకబడిన వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పించిన మా ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్ల జోలికి పోలేదు’ అని వివరించారు. ప్రతిపక్షాల నుంచి అవరోధాలు ఎదురైనప్పటికీ ఓబీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించినట్లు తెలిపారు. ‘రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ జీవించి ఉన్న కాలంలో ఆయన్ను తీవ్రంగా నిర్లక్ష్యం చేసిన కాంగ్రెస్ ఇప్పుడు ఆయనంటే ఎంతో అభిమానం ఉన్నట్లు నటిస్తోంది. మా ప్రభుత్వం అంబేడ్కర్ సేవలను గుర్తిస్తూ భారతరత్న ప్రకటించింది. ఆయనకు సంబంధించిన ఐదు ప్రాంతాలను తీర్థయాత్రా స్థలాలుగా గుర్తించి, అభివృద్ధి చేస్తోంది’ అని తెలిపారు. ప్రసంగం చివరలో ఆయన ‘మై భీ చౌకీదార్’ అంటూ ప్రజలతో నినాదం చేయించారు. -
విమానాల కూల్చివేతపై తొలిసారి ఒప్పుకున్న పాక్
ఇస్లామాబాద్: బాలాకోట్‌పై ఐఏఎఫ్ దాడి అనంతరం ఎఫ్–16 విమానాలను వినియోగించలేదని ఇప్పటిదాకా బుకాయించిన పాకిస్తాన్.. తాజాగా మాట మార్చింది. తమ ఎఫ్–16 యుద్ధ విమానాలే భారత్ విమానాలను కూల్చేశాయని మొదటిసారిగా అంగీకరించింది. పాక్ సైన్యం అధికార ప్రతినిధి మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ‘ఫిబ్రవరి 27వ తేదీన నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ వైమానిక దళం(పీఏఎఫ్) పాక్ గగనతలం నుంచే దాడులకు దిగింది. ఆ సమయంలో మా భూభాగంలోకి ప్రవేశించిన రెండు ఐఏఎఫ్ విమానాలను పీఏఎఫ్ కూల్చివేసింది. మేం మోహరించిన విమానాల్లో ఎఫ్–16లు కూడా ఉన్నాయి. ఆత్మరక్షణ కోసం ఏ విధంగానైనా స్పందించే హక్కు మాకుంది’ అని ఆయన ప్రకటించారు. ‘ఆ ఘటన గత చరిత్ర. మా వద్ద ఉన్న ఎఫ్–16 విమానాలను మాత్రం ఐఏఎఫ్ కూల్చలేదు’ అని కూడా ఆయన తెలిపారు. కానీ, గత నెలలో జేఎఫ్–17 రకం విమానాన్ని మాత్రమే వాడినట్లు గఫూరే ప్రకటించారు. బాలాకోట్‌లోని ఉగ్ర శిబిరాలపై ఐఏఎఫ్ దాడికి ప్రతీకారంగా పాక్ వైమానిక దళం కూడా దాడికి యత్నించిన విషయం తెలిసిందే. కానీ, ఈ సందర్భంగా అమెరికా తయారీ ఎఫ్–16ను ఐఏఎఫ్ కూల్చివేయడం కలకలం రేపింది. ఈ విమానాలను మూడో దేశంపై ఉపయోగించరాదని విక్రయ ఒప్పందంలో అమెరికా పేర్కొంది. కానీ, ఈ షరతులను పాక్ ఉల్లంఘించిందంటూ భారత్ అమెరికాకు సాక్ష్యాధారాలు అందజేయడం తెల్సిందే. -
‘ఫూల్స్డే నాడు.. జర భద్రం మోదీ’
సాక్షి, హైదరాబాద్: ‘మీరేం మాట్లాడాలో కొంచెం ఆలోచించుకుని మాట్లాడాల’ని ప్రధాని మోదీని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ఎగతాళి చేశారు. ‘లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీజీ ఏప్రిల్ 1న హైదరాబాద్ రానున్నారని తెలిసింది. ఆ రోజు ఫూల్స్ డే కాబట్టి, మీరు మాట్లాడే ముందు కాస్త ఆలోచించి మాట్లాడితే బాగుంటుంద’ని ఓవైసీ హితవు పలికారు. ‘ఎలాంటి ఆహ్వానం అందనప్పటికీ.. మోదీ మళ్లీ పాకిస్థాన్‌లో పర్యటించగలరు. అదే ఆయన దౌత్య విధానం. దేశ భద్రత, బాలాకోట్ వైమానిక దాడుల అంశాల ప్రస్తావనతో ఎన్నికల ప్రచారాన్ని నరేంద్ర మోదీ హోరెత్తిస్తున్నారు. కానీ, గత ఐదేళ్లలో మన రక్షణ రంగాన్ని పటిష్టపరిచే చర్యలను ఆయన చేపట్టలేదు. ఒకవేళ ఉన్నపళంగా యుద్ధం చేయాల్సివస్తే, భారత ఆర్మీ దగ్గర కేవలం 10 రోజులకు మాత్రమే సరిపోయే యుద్ధసామాగ్రి ఉందన్నది వాస్తవం కాదా?’ అని మోదీని ఓవైసీ దెప్పిపొడిచారు. -
‘బాలాకోట్’ రిపీట్‌కు పాక్ యత్నం!
న్యూఢిల్లీ: ఉగ్ర సంస్థ జైషే మహ్మద్ శిక్షణా శిబిరాలపై భారత వైమానిక దళం బాంబులు జారవిడిచిన మరుసటి రోజు అదే తరహాలో భారత భూభాగంలో దాడులకు పాకిస్తాన్ విఫలయత్నం చేసినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా అదే నెల 26న పాకిస్తాన్ భూభాగంలోని బాలాకోట్‌లో భారత వైమానిక దళం దాడులు నిర్వహించి ముష్కరులకు భారీగా నష్టం కలిగించినట్లు ప్రభుత్వ వర్గాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తరువాతి రోజు అంటే ఫిబ్రవరి 27న పాకిస్తాన్ ప్రతీకార దాడుల్ని తిప్పికొట్టే క్రమంలో వింగ్ కమాండర్ అభినందన్ పాకిస్తాన్ సైన్యానికి చిక్కారు. వార్తా సంస్థ ఏఎన్ఐ కథనం ప్రకారం..ఆ రోజు పాకిస్తాన్ సుమారు 20 యుద్ధ విమానాలతో భారత్‌పై బాలాకోట్ తరహా దాడికి ప్రయత్నించినట్లు తెలిసింది. అమెరికా నుంచి కొనుగోలు చేసిన ఎఫ్–16తో పాటు ఫ్రెంచ్ మిరాజ్–3, చైనీస్ జేఎఫ్–17 విమానాల సాయంతో సుమారు 1000 కిలోల బాంబులను పూంచ్, దాని సమీపంలోని మూడు చోట్ల భారత ఆర్మీ శిబిరాల వైపు విసిరింది. సరిహద్దుకు 50 కిలో మీటర్ల పరిధిలోని తన భూభాగం నుంచే పాకిస్తాన్ ఆర్మీ ఈ దాడులకు పాల్పడింది. అయితే భారత యుద్ధ విమానాలు సకాలంలో స్పందించడంతో పాకిస్తాన్ లక్ష్యం నెరవేరలేదు. దీంతో ఆ బాంబులను అక్కడికక్కడే వదిలి వెళ్లిపోయారని పేరు వెల్లడించడానికి ఇష్టపడని అధికారి ఒకరు చెప్పారు. కశ్మీర్‌లోని ఓ సైనిక స్థావరంపై బాంబులు జారవిడిచినప్పుడు అక్కడ ఉన్న పెద్ద చెట్టు అడ్డుకుందని తెలిపారు. ఆ సమయంలో అదే భవనంలో సీనియర్ అధికారులు ఉన్నట్లు చెప్పారు. -
‘మోదీ ఫోన్ చేసుంటే సరిపోయేది’
సాక్షి, న్యూఢిల్లీ: ‘మోదీతో నాకు మంచి పరిచయం ఉంది. బాలాకోట్ దాడులను ఉద్దేశించి నేను చేసిన వ్యాఖ్యలపై ఆయనకు అభ్యంతరాలుంటే నాకు ఫోన్ చేసుంటే సరిపోయేద’ని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సలహాదారు శ్యామ్ పిట్రోడా అన్నారు. బాలాకోట్‌లో వాయుసేన జరిపిన దాడులపై ఇటీవల పిట్రోడా చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని రాజేశాయి. ఈ వివాదానికి సంబంధించిన వ్యాఖ్యలపై మీడియా అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ.. ‘నేను చెప్పిన మాటల్ని వక్రీకరించారు. నేనొకవేళ తప్పుగా మాట్లాడి ఉంటే క్షమాపణలు అడిగేవాడ్ని. నేను గాంధీ తత్వాన్ని పాటించే గుజరాతీ కుటుంబంలో పుట్టాను. హింసను విడనాడి.. సత్యం, ప్రేమకు దగ్గరగా ఉండాలని నమ్మే సిద్ధాంతం మాది. ఒకరి మీద ఇంకొకరు బాహ్య దాడి చేయడాన్ని సమర్థించను. దాని బదులు మన అంతరంగాన్ని బలపరుచుకోవడమే మేలని నమ్ముతాను. నేను స్వతహాగా హింసను వ్యతిరేకిస్తాను. ముంబై ఉగ్రఘాతుకం తర్వాత ముష్కరులపై అప్పటి మన్మోహన్ ప్రభుత్వం ప్రతిదాడులకు దిగకపోవడాన్నీ సమర్థిస్తా.. అలాగే ఇప్పటి పుల్వామా ఘటనకు ప్రతీకారంగా బాలాకోట్‌లో మన వాయుసేన జరిపిన దాడులకూ మద్దతిస్తాను. ఈ రెండు సంఘటనలు ఆయా ప్రభుత్వాల నిర్ణయమని నేనన్నాను. ఒకసారి సర్కార్ ఏదైనా నిర్ణయం తీసుకుంటే దానికి నేను కట్టుబడి ఉంటాను. హింసతో దేన్నీ సాధించలేము. ఇవి నేను పార్టీపరంగా కాకుండా వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలు. ప్రధాని హోదాలో మోదీ అలా వ్యవహరించి ఉండాల్సింది కాదు. వీటిపై అభ్యంతరాలుంటే మోదీ నన్ను సంప్రదించి ఉండాల్సింద’ని పిట్రోడా వివరించారు. -
శవాలు కాల్చి.. నదిలో పడేసి!
న్యూఢిల్లీ: బాలాకోట్ వైమానిక దాడిలో తమవైపు పెద్దగా నష్టం జరగలేదని చెప్పుకుంటున్న పాకిస్తాన్‌ది వట్టి బుకాయింపేనని తేటతెల్లమైంది. ఫిబ్రవరి 26న భారత వైమానిక దళం ఉగ్ర శిబిరాలపై బాంబులు జారవిడిచిన తరువాత పాకిస్తాన్ ఆర్మీ రంగంలోకి దిగి ముష్కరుల మృతదేహాల్ని కాల్చివేసి సమీపంలోని నదిలో పడేసిందని ప్రత్యక్ష సాక్షి ఒకరు వెల్లడించాడు. భారత వైమానిక దళం దాడి ఆనవాళ్లను కప్పిపుచ్చుకునేందుకు పాకిస్తాన్ చేసిన ప్రయత్నాల్ని అతడు పూసగుచ్చాడు. సుమారు 3 నిమిషాల వ్యవధి గల ఆ వీడియోను రిపబ్లిక్ టీవీ తాజాగా వెలుగులోకి తెచ్చింది. ఆధారాల్ని మాయం చేసేందుకు బాలాకోట్ గ్రామానికి వచ్చిన పాకిస్తాన్ ఆర్మీ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి వారి ఫోన్లు లాక్కున్నట్లు తెలిసింది. దాడికి సంబంధించి ఎలాంటి వీడియోలు, ఫొటోలు బయటికి రాకుండా ఇంటర్నెట్ సేవల్ని కూడా నిలిపేసినట్లు వీడియోలో ఉంది. బాలాకోట్ దాడి తరువాత ఉగ్రవాదులకు భయం పట్టుకుందని, వారంతా అఫ్గానిస్తాన్–వజీరిస్తాన్ సరిహద్దులోకి పారిపోయారని ప్రత్యక్ష సాక్షి అందులో చెప్పారు. బాలాకోట్ సమీప నివాసిగా భావిస్తున్న సదరు వ్యక్తి ఈ దాడిలో మొత్తం ఎందరు హతమయ్యారో వెల్లడించకున్నా అందులో కొందరు తనకు తెలుసని, వారి చరిత్రతో సహా పేర్లు చదివి వినిపించాడు. వీడియోలో చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే.. అమానవీయంగా వ్యవహరించిన సైన్యం.. భారత వైమానిక దళం మిగిల్చిన నష్టాన్ని కప్పిపుచ్చుకునేందుకు పాకిస్తాన్ ఆర్మీని రంగంలోకి దింపారు. బాలాకోట్‌ను పూర్తిగా తమ అదుపులోకి తీసుకున్న సైన్యం స్థానికులను భయపెట్టింది. వారి మొబైల్ ఫోన్లను లాక్కుంది. గాయపడిన ఉగ్రవాదుల పట్ల అమానవీయంగా వ్యవహరిస్తూ వారికి చికిత్స అందించడానికి వైద్యులను కూడా అనుమతించలేదు. వైద్యం అందించాలని వారు ఎంతో ప్రాధేయపడినా కనికరించలేదు. కార్ల నుంచి తీసిన పెట్రోల్‌తో చాలామటుకు శవాల్ని మూకుమ్మడిగా తగలబెట్టారు. మరి కొన్నింటిని సంచుల్లో చుట్టి సమీపంలోని కున్హర్ నదిలో పడేశారు. మృతిచెందిన ఉగ్రవాదుల్లో చాలా మంది జైషే సభ్యులే. ప్రాణాలతో బయటపడిన వారిని వెంటనే అఫ్గానిస్తాన్–వజీరిస్తాన్ సరిహద్దుకు తరలించారు. ఈ దాడితో ఐఎస్ఐ, జైషే సభ్యులను భయం పట్టుకుంది. ఫొటోలు, వీడియోలు బయటికి రాకుండా నివారించేందుకు అక్కడ మొబైల్, ఇంటర్నెట్ సేవల్ని నిలిపేశారు. అయినా కొన్ని చిత్రాలు వెలుగుచూశాయి. పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్ర శిబిరాలపై భారత్ ఇలాగే దాడికి దిగుతూ ముష్కరులను చంపుతూ ఉంటే, మాకు త్వరలోనే ఉగ్రవాదం బెడద తొలగిపోతుంది. అక్కడ 263 మంది ఉగ్రవాదులు భారత యుద్ధవిమానాలు దాడికి దిగడానికి ఐదు రోజుల క్రితం బాలాకోట్ శిబిరంలో 263 మంది ఉగ్రవాదులు ఉన్నట్లు తెలిసింది. ఆ సమయంలో ముష్కరులకు శిక్షణ ఇచ్చేందుకు 18 మంది సీనియర్ కమాండర్లు అక్కడే ఉన్నట్లు టైమ్స్ నౌ మీడియా తెలిపింది. ప్రాథమిక శిక్షణకు 83 మంది, అడ్వాన్స్ శిక్షణకు 91 మంది, ఆత్మాహుతి దాడిలో శిక్షణకు 25 మంది ఆæ శిబిరానికి వచ్చినట్లు వెల్లడించింది. మరో 18–20 మంది దాకా వంటగాళ్లు, క్షురకులు, ఇతర సిబ్బంది ఉన్నట్లు పేర్కొంది. బాలాకోట్‌లో 263 మంది ఉగ్రవాదులు ఆవాసం పొందుతున్నట్లు ధ్రువీకరించుకున్న తరువాతే వైమానిక దళం దాడికి దిగిందని తెలిపింది. అక్కడ 300 ఫోన్లు క్రియాశీలకంగా ఉన్నాయని కేంద్ర హోం శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, వైమానిక దాడిలో కనీసం నలుగురు పాకిస్తాన్ సైనికులు కూడా మృత్యువాతపడినట్లు తెలిసింది. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)పోలీసులు, బాలాకోట్ మత గురువులకు ఫోన్‌చేయగా భారత వైమానిక దళం బాంబులు జారవిడిచిన సంగతి నిజమేనని చెప్పినట్లు ఇండియా టుడే టీవీ తెలిపింది. -
కొత్తనీతి.. సరికొత్త రీతి
నోయిడా: బాలాకోట్ ఉగ్రదాడిపై ఆధారాలు చూపాలంటున్న ప్రతిపక్షాలపై ప్రధాని మోదీ మరోసారి విరుచుకుపడ్డారు. ఉగ్రమూకల ఏరివేత విషయంలో యూపీఏ ప్రభుత్వం ధైర్యం, తెగువ చూపలేకపోయిందని విమర్శించారు. కానీ ఎన్డీయే ప్రభుత్వం 2016లో సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా ఉగ్రమూకలకు వారికి అర్థమయ్యే భాషలోనే గుణపాఠం చెప్పిందని వ్యాఖ్యానించారు. భారత్ ఇప్పుడు ‘కొత్తనీతి–సరికొత్త రీతి’తో ముందుకుపోతోందన్నారు. ‘2008లో జరిగిన ముంబై మారణహోమాన్ని దేశం ఎన్నటికీ మర్చిపోదు. ఆ ఉగ్రదాడులకు భారత్ వెంటనే ప్రతిస్పందించి ఉంటే ప్రపంచం మొత్తం మనకు అండగా నిలిచేది. పాక్‌లో ఉగ్రసంస్థల పాత్రపై మనదగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి. కానీ అప్పటి ప్రభుత్వం ధైర్యం, తెగువ చూపలేకపోయింది. ఉగ్రదుశ్చర్యకు ప్రతీకారం తీర్చుకోవడానికి మన భద్రతాబలగాలు సిద్ధంగా ఉన్నప్పటికీ కేంద్రం మౌనం వహించింది’ అని అన్నారు. తెల్లవారుజామునే పాకిస్తాన్ ఏడ్చింది.. పాక్‌లోని బాలాకోట్‌లో జైషే ఉగ్రస్థావరంపై భారత వాయుసేన ఫిబ్రవరి 24న దాడిచేశాక తెల్లవారుజామున 5 గంటలకు ‘మోదీ మాపై దాడి చేశాడు’ అని పాక్ ఏడుపు అందుకుంది. దాడులతో ఇబ్బందిపెడుతూనే ఉండొచ్చనీ, ఇండియా ప్రతిస్పందించదని వాళ్లు భావిస్తున్నారు. 2014కు ముందున్న రిమోట్ కంట్రోల్ ప్రభుత్వం కారణంగానే శత్రువులకు ఈ అభిప్రాయం బలంగా ఏర్పడింది. ఉడీ ఘటన తర్వాత మన బలగాలు ఉగ్రవాదుల ఇళ్లలోకి దూరి వాళ్లను హతమార్చాయి. యూపీలోని కుర్జాలో, బిహార్‌లోని బుక్సారిన్‌లో రెండు థర్మల్ విద్యుత్ కేంద్రాలను ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. 50ఏళ్ల పాత సామగ్రిని వాడటంతో విద్యుత్ ఉత్పత్తి వ్యయం యూనిట్‌కు రూ.10కు చేరుకుందని ప్రధాని తెలిపారు. కానీ సౌరశక్తి ద్వారా ఇప్పుడు యూనిట్ విద్యుత్‌ను రూ.2కే ఉత్పత్తి చేయొచ్చన్నారు. ఐదేళ్లలో మూడు దాడులు: రాజ్‌నాథ్ మంగళూరు: గత ఐదేళ్లలో భారత్ మూడు సార్లు దాడులు చేసిందని హోం మంత్రి రాజ్‌నాథ్ చెప్పారు. 2016లో ఉడి ఉగ్రవాద దాడి తర్వాత చేపట్టిన దాడి, ఇటీవల జరిపిన వైమానిక దాడుల గురించి వివరించిన రాజ్‌నాథ్ మూడో దాడి వివరాలు బయటపెట్టలేదు. శనివారం కర్ణాటక బీజేపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ఉడిలో నిద్రపోతున్న సైనికులపై ఉగ్రవాదులు దాడి జరిపి 17 మందిని చంపివేశారని, దీనికి ప్రతీకారంగా పీవోకే భారత్ తొలి మెరుపుదాడి చేసిందన్నారు. పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన ఆత్మాహుతి దాడి తర్వాత వైమానిక దాడి జరిపి జైషే ఉగ్ర శిబిరాన్ని నాశనం చేసిందన్నారు. ఈ దాడులతో భారత్ బలహీన దేశం కాదని పాకిస్తాన్‌కు గట్టి సందేశం ఇచ్చామని వెల్లడించారు. -
పాక్‌లో 22 ఉగ్ర శిబిరాలు
వాషింగ్టన్/ ఇస్లామాబాద్/జాబా: పాకిస్తాన్లో ఇప్పటికీ 22 ఉగ్రవాద శిక్షణ శిబిరాలు నడుస్తున్నాయని, వాటిలో తొమ్మిది శిబిరాలు జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందినవేనని సీనియర్ భారతీయ అధికారి ఒకరు చెప్పారు. ఈ శిబిరాలపై పాక్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వాషింగ్టన్లో ఉంటున్న ఆయన విలేకరుల సమావేశంలో అన్నారు. సరిహద్దు ఆవల నుంచి భారత దేశంలో మళ్లీ ఏమైనా ఉగ్రవాద సంబంధిత దాడులు జరిగితే ప్రభుత్వం బాలాకోట్ తరహా దాడులు చేస్తుందని ఆయన పాకిస్తాన్‌ను హెచ్చరించారు. ‘ఉగ్రవాదానికి అంతర్జాతీయ కేంద్రం పాకిస్తాన్. తీవ్రవాదులపై, తీవ్రవాద సంస్థలపై పాకిస్తాన్ నమ్మదగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది’అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఆ అధికారి అన్నారు. తన గడ్డపై 22 ఉగ్రవాద శిక్షణా శిబిరాలు నడుస్తున్నా వాటిపై ఏ చర్యా తీసుకోని పాకిస్తాన్ ప్రభుత్వం తమ దేశంలో తీవ్రవాదులు లేరని బుకాయిస్తోందని, రెండు దేశాల మధ్య యుద్ధోన్మాదాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. చట్టాలకు అనుగుణంగానే.. బాలాకోట్‌పై భారత్ దాడి ఉగ్రవాద వ్యతిరేక చర్య అని, అంతర్జాతీయ చట్టాలకు లోబడే ఈ దాడి జరిగిందని ఆయన పేర్కొన్నారు. పాక్ ప్రభుత్వం ఇటీవల పలు ఉగ్రవాద సంస్థలు, ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవడాన్ని ప్రస్తావిస్తూ.. భారత్‌లో ఉగ్రదాడి జరిగినప్పుడల్లా పాక్ ఇలాగే చేస్తుందని, ఇందులో విశేషమేమీ లేదని వ్యాఖ్యానించారు. ఉగ్రవాదులను గృహ నిర్బంధంలో ఉంచడమంటే వారికి విలాసాలు సమకూర్చడమేనని, పరిస్థితి సద్దుమణగగానే వారిని విడిచిపెడుతుందన్నారు. భారత్‌పై ఉగ్ర దాడికి పాక్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్న విషయాన్ని బాలాకోట్ దాడి ద్వారా భారత్ స్పష్టం చేసిందన్నారు. ఈ విషయంలో ట్రంప్ సర్కారు భారత్‌కు మద్దతిస్తోందన్నారు. పాక్ అభివృద్ధికి ఐఎంఎఫ్ 21 సార్లు ఆర్థిక సాయం చేస్తే ఆ దేశం ఇతర అవసరాలకు మళ్లించిందని పేర్కొన్నారు. చెట్లు కూల్చారని కేసు భారత వైమానిక దళానికి చెందిన గుర్తుతెలియని పైలట్లపై పాక్ కేసు వేసింది. బాలాకోట్‌లోని 19 చెట్లపై బాంబులు వేసి కూల్చివేసినందుకు శుక్రవారం ఈ కేసు వేసింది. జైషే మహమ్మద్ ఉగ్రసంస్థకు చెందిన శిక్షణ శిబిరంపై భారత వైమానిక దళం సర్జికల్ దాడులు చేసిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ అటవీ శాఖ ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేసిందని తెలిసింది. కాగా, బాలాకోట్‌లోని ఐఏఎఫ్ దాడి జరిపిన మదరసా, ఇతర భవనాల వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించిన మీడియా ప్రతినిధులను పాకిస్తాన్ భద్రతా బలగాలు అడ్డుకున్నాయి. దాడి జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు రాయిటర్స్‌కు చెందిన ప్రతినిధులు మూడుసార్లు ప్రయత్నించినా పాక్ బలగాలు అడ్డుకున్నాయి. అప్పటి నుంచి కూడా ఆ మదరసా ఉన్న ప్రాంతానికి వెళ్లే దారులను మూసివేశారు. -
పాకిస్తాన్‌కు భారత్ హెచ్చరిక
న్యూఢిల్లీ: సరిహద్దుల్లో పాకిస్తాన్ అదనపు బలగాల్ని మోహరించడంపై భారత్ ఆందోళన వ్యక్తం చేస్తూ జనావాస ప్రాంతాలు లక్ష్యంగా దాడులకు దిగొద్దని హెచ్చరించింది. పుల్వామా, బాలాకోట్ ఘటనల తరువాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో పాకిస్తాన్ తన బలగాలు, ఆయుధ సంపత్తిని అఫ్గానిస్తాన్ సరిహద్దుల నుంచి నియంత్రణ రేఖ వైపు తరలిస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం భారత్ స్పందిస్తూ.. పాకిస్తాన్ ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడినా తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరికలు జారీచేసింది. (ఫేక్ వీడియోతో అడ్డంగా దొరికిపోయిన పాక్) ఎల్వోసీ వెంట సామాన్య పౌరులు లక్ష్యంగా మోర్టార్ దాడులకు దిగొద్దని మంగళవారం హాట్‌లైన్ ద్వారా జరిపిన సంభాషణలో భారత అధికారులు పాక్‌ను హెచ్చరించారు. ఎల్వోసీ, అంతర్జాతీయ సరిహద్దులో నిఘాను పటిష్టం చేశారు. పాకిస్తాన్ నుంచి ఎలాంటి రెచ్చగొట్టే చర్యలు ఎదురైనా దీటుగా తిప్పికొడతామని ఆర్మీ తెలిపింది. (‘బాలాకోట్’ సాక్ష్యాలివిగో!) -
‘బాలాకోట్’ సాక్ష్యాలివిగో!
న్యూఢిల్లీ: పాకిస్తాన్ భూభాగం బాలాకోట్‌లో జైషే మహ్మద్ ఉగ్రవాదుల శిక్షణా శిబిరంపై జరిపిన వైమానిక దాడిలో వాటిల్లిన నష్టంపై అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ ఐఏఎఫ్ అందుకు సంబంధించిన ఆధారాల్ని కేంద్రానికి సమర్పించినట్లు తెలిసింది. ఫిబ్రవరి 26న తాము జారవిడిచిన బాంబుల్లో 80 శాతం అనుకున్న లక్ష్యాల్ని తాకినట్లు వైమానిక దళం పేర్కొంది. సంబంధించిన ఉపగ్రహ, రాడార్ చిత్రాలను సేకరించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దాడులకు వైమానిక దళం వార్హెడ్లను ఉపయోగించినట్లు తెలిసింది. ఈ వివరాల్ని బుధవారం కొన్ని చానెళ్లు ప్రసారం చేశాయి. బాంబులు ఉగ్రవాదుల ఆవాసాల పైకప్పులను చీల్చుకుంటూ వెళ్లి అంతర్గతంగా అపార నష్టం మిగిల్చినట్లు ఐఏఎఫ్ వర్గాలు వెల్లడించాయి. పుల్వామా దాడికి ప్రతీకార చర్యగా జరిపిన వైమానిక దాడిలో 350 మంది ఉగ్రవాదులు హతమైనట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. కానీ నష్టం అంత తీవ్రస్థాయిలో లేదని కొన్ని మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. అటవీ ప్రాంతంలో చెట్లు దెబ్బ తినడం తప్ప పెద్దగా నష్టమేమీ కలగలేదని పాకిస్తాన్ ప్రకటించుకుంది. కాగా, భారత వైమానిక దళం దాడి తరువాత జైషే మహ్మద్ భవనాలకు అనుకున్నంత భారీ నష్టం జరగలేదని ప్లానెట్ ల్యాబ్స్ అనే అమెరికన్ ప్రైవేటు సంస్థ ఓ ఉపగ్రహ చిత్రం విడుదలచేసింది. ఈ విషయాన్ని రాయిటర్స్ వార్తా సంస్థ వెలుగులోకి తెచ్చింది. బాలాకోట్ ఆపరేషన్‌పై రాజకీయ పార్టీలు సందేహాలు వ్యక్తం చేస్తూ ఎందరు ఉగ్రవాదులు హతయ్యారో అధికారిక సమాచారం వెల్లడించాలని ప్రభుత్వంపై ఒత్తిడితెస్తున్నాయి. వైమానిక దళ చర్యను రాజకీయం చేస్తున్నారంటూ అధికార, ప్రతిపక్షాలు పరస్పరం విమర్శలు గుప్పించుకున్నాయి. ఈ నేపథ్యంలో వైమానిక దాడులతో నెరవేరిన లక్ష్యాలపై ఆధారాలతో వైమానిక దళం ప్రభుత్వానికి నివేదిక అందించడం గమనార్హం. 12 పేజీల విస్పష్ట ఛాయాచిత్రాలు.. బాలాకోట్‌లో జారవిడిచిన బాంబులు లక్ష్యానికి దూరంగా పడ్డాయన్న ఆరోపణల్ని తప్పని నిరూపిస్తూ వైమానిక దళం సమగ్ర వివరాల్ని క్రోడీకరించింది. దాడి తర్వాత జైషే శిబిరానికి వాటిల్లిన నష్టాన్ని అంచనా వేసేందుకు ఈ సమాచారాన్ని సేకరించినట్లు తెలిసింది. భారత గగనతలంలో ఎగురుతున్న విమానం తీసిన 12 పేజీల విస్పష్ట ఛాయాచిత్రాలు, రాడార్ ఇమేజ్‌లను కేంద్రానికి అందజేసినట్లు విశ్వసనీయవర్గాల తెలిపాయి. దాడిలో మిరాజ్ విమానాలు ఇజ్రాయెల్ స్పైస్ బాంబుల్ని అత్యంత కచ్చితత్వంతో జారవిడవగా, అందులో 80% అనుకున్న లక్ష్యాల్ని తాకాయని తెలిపాయి. మిగిలిన 20% బాంబుల విజయ శాతం కచ్చితంగా ఎంతని అంచనా వేయలేకపోయామని చెప్పాయి. -
అస్త్రాలన్నీ ప్రయోగిస్తాం
న్యూఢిల్లీ: మరో ఉగ్రదాడి జరిగితే తిప్పికొట్టేందుకు అన్ని అస్త్రాలను సిద్ధంగా ఉంచుకుంటామని భారత్ ప్రకటించింది. పాకిస్తాన్ భూభాగంలో ఆవాసం పొందుతున్న ఉగ్రమూకలపై విరుచుకుపడే సామర్థ్యం ఉందని చాటుకోవడానికే బాలకోట్లో వైమానిక దాడులకు దిగామని స్పష్టతనిచ్చింది. జైషే మహ్మద్ శిక్షణా శిబిరంపై యుద్ధం ముగిసిందని, పాకిస్తాన్ భూభాగం నుంచి ఇంకా పనిచేస్తున్న ఉగ్ర సంస్థలపై చర్యలు తీసుకునేలా ఆ దేశంపై ఒత్తిడి పెంచడమే తమ తదుపరి లక్ష్యమని పేర్కొంది. ‘ఉగ్రవాదుల మౌలిక వసతులపై పాకిస్తాన్ కఠిన చర్యలు తీసుకునేలా ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నాలు చేస్తాం. ఆ దేశ కొత్త నాయకత్వం మాటలకు పరిమితం కాకుండా క్షేత్ర స్థాయిలో చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నాం’ అని పాకిస్తాన్ నూతన ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను ఉద్దేశించి కేంద్ర ప్రభుత్వ వర్గాలు వ్యాఖ్యానించాయి. ఫిబ్రవరి 27న భారత్‌పై వైమానిక దాడికి దిగినప్పుడు పాకిస్తాన్ ఎఫ్–16 యుద్ధ విమానాన్ని వినియోగించిన సమాచారాన్ని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అమెరికా అధికారులకు అందజేశారని భారత్ తెలిపింది. మంగళవారం దోవల్‌తో ఫోన్లో మాట్లాడిన అమెరికా భద్రతా సలహాదారు జాన్ బోల్టన్..జైషే చీఫ్ మసూద్ అజహర్‌ను నిషేధిత జాబితాలో చేర్చేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలకు మద్దతిస్తామని తెలిపారు. అలాగే, యుద్ధ విమానాలను పాకిస్తాన్ దుర్వినియోగం చేయడంపై అమెరికా దర్యాప్తు చేస్తుందని ఆశిస్తున్నామని భారత్ పేర్కొంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు మధ్యవర్తిత్వం వహించాలని పాకిస్తాన్ అన్ని దేశాలను అభ్యర్థించిందని, కానీ సమస్య ఇండో–పాక్‌ది కాదని, ఉగ్రవాదానిది అని అంతర్జాతీయ సమాజానికి అర్థమయ్యేలా చెప్పామని తెలిపింది. మసూద్ అజహర్ పాకిస్తాన్లో నివసిస్తున్నందున అతనిపై నిషేధం విధిస్తే ఆ దేశానికి ఇబ్బందులు తప్పవని వ్యాఖ్యానించింది. వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ను పాకిస్తాన్ నిర్బంధంలోకి తీసుకున్న తరువాత అన్ని దేశాలు తమకే మద్దతుగా నిలిచాయని, అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరగడంతో పాకిస్తాన్ అభినందన్‌ను వెంటనే విడుదల చేసిందని తెలిపింది. మరోవైపు, బాలాకోట్ వైమానిక దాడి నేపథ్యంలో నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దులో పాకిస్తాన్ తన బలగాలను పెంచుకుంటోంది. అంతర్జాతీయ సరిహద్దు వెంట రాడార్లను క్రియాశీలకం చేసి, ఆయుధాగారాలు ఎల్లవేళలా పనిచేయాలని ఆదేశాలిచ్చింది. భారత జలాంతర్గామిని అడ్డుకున్నాం: పాక్ నేవీ భారత జలాంతర్గామి తమ జలాల్లోకి రాకుండా నిరోధించామని పాకిస్తాన్ ప్రకటించింది. ఇందుకు సంబంధించి మార్చి 4న తీసినట్లుగా భావిస్తున్న ఓ వీడియోను విడుదల చేసింది. పాకిస్తాన్ నేవీ దళం ప్రత్యేక నైపుణ్యాలు ప్రదర్శించి విజయవంతంగా భారత జలాంతర్గామి రాకను నిలువరించిందని పేర్కొంది. శాంతియుత విధానంలో భాగంగా భారత జలాంతర్గామిని తాము లక్ష్యంగా చేసుకోకుండా విడిచిపెట్టామని పాక్ నేవీ అధికార ప్రతినిధి చెప్పారు. ఈ ఘటన నుంచి భారత్ పాఠాలు నేర్చుకుని శాంతి దిశగా నడవాలని సూచించారు. అయితే పాకిస్తాన్ ఆరోపణల్ని భారత్ ఖండించింది. పాక్ నేవీ తప్పుడు ప్రచారాన్ని పట్టించుకోమని స్పష్టం చేసింది. జాతీయ తీర ప్రాంత భద్రతకే బలగాల్ని మోహరించామని భారత నేవీ తెలిపింది. సుఖోయ్‌కి ‘స్పైస్’ సుఖోయ్–30ఎంకేఐ యుద్ధ విమానాలకు ఇజ్రాయెల్‌లో తయారైన స్సైస్–2000 రకం బాంబులను అమర్చేందుకు విమానాలకు అవసరమైన మార్పులు చేస్తున్నామని భారత వైమానిక దళ అధికార వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం మిరేజ్–2000 విమానాలకు స్పైస్–2000 బాంబులను అమర్చే వెసులుబాటు ఉంది. బాలాకోట్ దాడిలో ఈ విమానాలనే వినియోగించారు. స్పైస్–2000 బాంబులకు లేజర్ ద్వారా మార్గనిర్దేశనం చేయవచ్చు. ‘సముద్ర’ దాడుల ముప్పు ఉంది: నేవీ చీఫ్ సముద్ర మార్గం గుండా దేశంలోకి చొరబడి దాడులకు పాల్పడేందుకు ఉగ్రవాదులు శిక్షణ పొందుతున్నారని నేవీ చీఫ్ సునీల్ లాంబా వెల్లడించారు. ఇందుకు సంబంధించిన పక్కా సమాచారం తమకు అందిందని తెలిపారు. ఢిల్లీలో మంగళవారం జరిగిన ఇండో–పసిఫిక్ రీజినల్ డైలాగ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..భారత్‌ను అస్థిరపరచాలనుకుంటున్న ఓ దేశ మద్దతుతోనే పుల్వామా ఉగ్రదాడి జరిగిందని పరోక్షంగా పాకిస్తాన్‌ను దుయ్యబట్టారు. ఉగ్రవాదం అంతర్జాతీయ స్థాయికి చేరడంతో ముప్పు మరింత పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవలి కాలంలో ఆసియాలో వేర్వేరు రూపాల్లో ఉగ్రదాడులు జరిగాయని, కొన్ని ప్రాంతాలు మాత్రమే ఈ ముప్పు నుంచి తప్పించుకున్నాయని పేర్కొన్నారు. శత్రు దేశ ప్రభుత్వ మద్దతుతో కూడిన ఉగ్రవాద ముప్పు భారత్‌కు అధికంగా ఉందని హెచ్చరించారు. కాంగ్రెస్ పాక్ వెళ్లి లెక్కించుకోవచ్చు: రాజ్‌నాథ్ ధుబ్రి(అస్సాం): పాక్‌లోని బాలాకోట్‌లో చేపట్టిన వైమానిక దాడిలో ఎందరు ముష్కరులు హతమయ్యారో రేపోమాపో తెలుస్తుందని హోం మంత్రి రాజ్‌నాథ్ అన్నారు. ఈ దాడిపై విపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయని, అవసరమైతే కాంగ్రెస్ అక్కడికి వెళ్లి మృతదేహాల సంఖ్యను లెక్కించుకోవచ్చని చురకలంటించారు. వైమానిక దళం బాంబులు జారవిడవడానికి ముందు ఆ ప్రాంతంలో 300 సెల్ఫోన్లు పనిచేస్తున్నట్లు జాతీయ సాంకేతిక పరిశోధన సంస్థ(ఎన్టీఆర్వో) గుర్తించిందని తెలిపారు. ఆ సెల్ఫోన్లను చెట్లు వాడుతున్నాయా? అని ఎద్దేవా చేసిన రాజ్‌నాథ్ ఎన్టీఆర్వోను కూడా నమ్మరా? అని అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు రాజకీయాలు చేయొచ్చు కానీ, దేశ నిర్మాణానికి కాదని హితవు పలికారు. భారత్–బంగ్లాదేశ్ సరిహద్దులో అధునాత ఎలక్ట్రానిక్ నిఘా వ్యవస్థను రాజ్‌నాథ్ మంగళవారం ప్రారంభించారు. అది సైనిక చర్య కాదు చెన్నై: బాలాకోట్‌లోని ఉగ్రస్థావరాలపై జరిపిన వైమానిక దాడులపై రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ తొలిసారిగా స్పందించారు. వైమానిక దాడులు సైనిక చర్య కాదని.. ఈ దాడిలో బాలాకోట్ సహా పరిసర ప్రాంతాల్లోని సాధారణ ప్రజలెవరికీ నష్టం కలగలేదని స్పష్టం చేశారు. దాడిలో పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు, శిక్షకులు, సీనియర్ కమాండర్లు మరణించారని మాత్రమే విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే చెప్పారని, ఫలానా సంఖ్య అని వెల్లడించలేదని ఆమె గుర్తు చేశారు. దీనినే ప్రభుత్వ ప్రకటనగా భావించాలని సూచించారు. కశ్మీర్‌లోని పుల్వామా జిల్లా త్రాల్ గ్రామంలో మంగళవారం మిలిటెంట్లు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ధ్వంసమైన తమ ఇంటి వద్ద రోదిస్తున్న స్థానికులు. సుమారు 12 గంటలు కొనసాగిన ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులు హతమయ్యారు. ఒక పౌరుడికి బుల్లెట్ గాయాలయ్యాయి. నియంత్రణ రేఖ వెంట మూడు చోట్ల పాకిస్తాన్ మోర్టార్లతో దాడికి పాల్పడటంతో ఒక సైనికుడు గాయపడ్డాడు. -
ఆధారాలు కావాలా.. బాలాకోట్ వెళ్లండి!
సాక్షి, న్యూఢిల్లీ: వైమానిక దాడులపై కట్టుకథలతో బీజేపీ దేశాన్ని తప్పుదారి పట్టిస్తోందని కాంగ్రెస్ చేస్తోన్న ఆరోపణలపై బీజేపీ తీవ్రంగా మండిపడుతోంది. ఈ నేపథ్యంలో బాలాకోట్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత వైమానిక దళం చేసిన దాడులకు ఆధారాలు చూపించాలన్న కాంగ్రెస్ సీనియర్‌నేత కపిల్ సిబాల్ వ్యాఖ్యలపై కేంద్ర సమాచారమంత్రిత్వ శాఖమంత్రి రాజ్యవర్థన్ రాథోడ్ తీవ్రంగా స్పందించారు. భారత వైమానిక దళం జైషే మహ్మద్ ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసేందో లేదో తెలియాలంటే పాకిస్తాన్‌లోని బాలాకోట్‌కు వెళ్లిచూడండి అని ఘాటుగా బదులిచ్చారు. దీనిపై వారిద్దరి మధ్య ట్విటర్ వేదికగా మాటల యుద్ధం సాగింది. ‘‘గత పార్లమెంట ఎన్నికల్లో ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగాయని కాంగ్రెస్ నేతలు బ్రిటన్ వెళ్లి అక్కడ ఆధారాలు ఉన్నాయంటూ తమపై ఆరోపణలు చేశారు. ఇప్పుడు కూడా అదేవిధంగా బాలాకోట్ వెళ్లి పరిశీలించి దాడులు జరిగాయో లేదో చెప్పండి. అక్కడే సరైన ఆధారాలు దొరుకుతాయి’’ అని రాథోడ్ సమాధానమిచ్చారు. బాలాకోట్ దాడులకు సరైన అధారాలు లేవని అంతర్జాతీయ మీడియా చేస్తున్న ప్రచారం మీకు (కాంగ్రెస్) చాలా ఆనందాన్ని కలిగిస్తోందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. భారత సైన్యంపై కంటే విదేశీ మీడియాపైనే కాంగ్రెస్‌కు ఎక్కువ నమ్మకమని అన్నారు. కాగా వైమానిక దళ దాడులపై అధికార, విపక్ష పార్టీల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం జరగుతోంది. బాలాకోట్ దాడులపై న్యూయార్స్ టైమ్స్, వాషింగ్టన్ డీసీ ప్రచురించిన కథనాలకు ప్రధాని మోదీ సమాధానం ఇవ్వాలని కపిల్ సిబాల్ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. Kapil Sibal ji: You believe international media over own Intelligence agencies? You seem happy when media quoted by you says “no losses in strike”? ..and sir, for us you went to london🤦🏽♂️ to find evidence against EVMs, will you please also go to Balakot to check? https://t.co/JefbNnGdqP — Rajyavardhan Rathore (@Ra_THORe) 5 March 2019 -
250 అని అమిత్ షా ఎలా చెబుతున్నారు?
న్యూఢిల్లీ: పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం జరిపిన దాడుల్లో మరణించిన ఉగ్రవాదుల సంఖ్యపై అధికారిక ప్రకటన లేకపోవడం పట్ల అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. దాడుల్లో 250 మంది ఉగ్రవాదులు చనిపోయారన్న విషయాన్ని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా దేని ఆధారంగా చెబుతున్నారని కాంగ్రెస్ సోమవారం ప్రశ్నించింది. వైమానిక దాడులను మోదీ, బీజేపీ రాజకీయం చేసి ఎన్నికల్లో ప్రయోజనం పొందాలనుకుంటున్నాయని కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఆర్పీఎన్ సింగ్ ఆరోపించారు. రఫేల్ లేకుండా వాయుసేన బలహీనంగా ఉందన్న వ్యాఖ్యలను చేయడం ద్వారా మోదీ వాయుసేనను అవమానించారనీ, ఇందుకు ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చనిపోయిన ఉగ్రవాదుల సంఖ్యను ప్రధాని నరేంద్ర మోదీ లేదా ఆయన ప్రభుత్వం ఎందుకు వెల్లడించడం లేదనీ, అమిత్ షా మాత్రం ఆ సంఖ్య 250 అని ఎలా చెబుతున్నారని సీనియర్ కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ ప్రశ్నించారు. దాడిలో 250 మంది చనిపోయారని ఏ ఆధారాలూ చూపకుండానే అమిత్ షా చెబుతుండటాన్ని బట్టే విషయాన్ని ఎవరు రాజకీయం చేస్తున్నారో అర్థమవుతోందని సిబల్ అన్నారు. సైన్యాన్ని అవమానించకండి: బీజేపీ వైమానిక దాడులపై బూటకపు, కట్టుకథలతో దేశాన్ని తప్పుదారి పట్టించవద్దనీ, సైన్యాన్ని అవమానించవద్దని కాంగ్రెస్‌కు సోమవారం బీజేపీ విజ్ఞప్తి చేసింది. కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ మాట్లాడుతూ ‘ఉగ్రవాదులు, వారి మద్దతుదారులపై దాడులు జరుగుతోంటే కాంగ్రెస్, దాని మిత్రపక్షాలకు ఇబ్బందిగా ఉన్నట్లుంది. ఇది యాధృచ్చికమా, భాగస్వామ్యమా? సైన్యం పరాక్రమానికి సెల్యూట్ చేస్తూ దేశం మొత్తం ఒకే మాట మాట్లాడుతున్న సమయంలో, విపక్షాలు ఇలాంటి ప్రశ్నలను వేయడం దురదృష్టకరం’ అని అన్నారు. విపక్షాలది బాధ్యతారాహిత్యమనీ, ఉగ్రవాదులపై భద్రతా దళాలు తీసుకునే చర్యలను ఆ పార్టీలు స్వాగతిస్తాయన్న నమ్మకం పోయిందని నఖ్వీ పేర్కొన్నారు. రఫేల్‌ను ఎందుకు తీసుకోలేదు? దాదాపు ఐదేళ్ల పాలనలో మోదీ ప్రభుత్వం ఒక్క రఫేల్ విమానాన్ని కూడా వాయుసేనలో ఎందుకు ప్రవేశపెట్టలేదనీ, ఇన్నాళ్లూ ఏం చేశారని బీఎస్పీ అధినేత్రి మాయావతి మోదీని ప్రశ్నించారు. మోదీ, అమిత్ షాలు భద్రతా దళాలను రాజకీయ విన్యాసాల కోసం వినియోగించుకుంటున్నాయని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది. దాడిలో చనిపోయిన ముష్కరుల సంఖ్యపై సైన్యం అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ, ఆ దాడుల్లో 250 మంది చనిపోయారని అమిత్ షా అంటున్నారనీ, తద్వారా సైన్యం అబద్ధం చెబుతోందని అమిత్ షా ఉద్దేశమా అని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించారు. దేశ ఐక్యతను దెబ్బతీసేలా బీజేపీ, ఆరెస్సెస్‌లు ప్రయత్నిస్తున్నాయని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోపించారు. -
మేము ఆ లెక్కలు వేయం
కోయంబత్తూర్: పాకిస్తాన్ భూభాగం బాలాకోట్‌లో జైషే మహ్మద్ ఉగ్ర శిబిరాలపై జరిపిన దాడిలో ఎంత మంది ఉగ్రవాదులు అంతమయ్యారన్న విషయంలో ఎడతెగని చర్చ నడుస్తున్న వేళ వైమానిక దళ చీఫ్ బీఎస్ ధనోవా సోమవారం స్పందించారు. వైమానిక దాడుల్లో చోటుచేసుకున్న నష్టం వివరాల్ని ప్రభుత్వమే వెల్లడించాలని, మృతుల సంఖ్యను తాము లెక్కించమని చెప్పారు. నిర్దేశించుకున్న లక్ష్యాన్ని ఛేదించామా? లేదా? అన్నదే తమకు ముఖ్యమన్నారు. పుల్వామా దాడికి ప్రతీకార చర్యగా ఫిబ్రవరి 26న పాక్‌లోని ఖైబర్ ఫక్తున్ఖ్వా ప్రావిన్సులో జైషే శిక్షణశిబిరాలపై భారత వైమానిక దళం బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడిలో 350 మంది ఉగ్రవాదులు హతమయ్యారని ప్రభుత్వ వర్గాలు తెలపగా, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా 250 మంది మరణించారని చెప్పారు. ఉగ్రవాదులకు వాటిల్లిన నష్టం తక్కువేనని మీడియాలో కొన్ని కథనాలు వచ్చాయి. ఇప్పటి దాకా ఈ విషయంలో ఎలాంటి అధికారిక సమాచారం బయటకురాలేదు. ఈ నేపథ్యంలో కోయంబత్తూరులో జరిగిన మీడియా సమావేశంలో ధనోవా మాట్లాడారు. ‘ వైమానిక దాడిలో ఎందరు చనిపోయారో మేము లెక్కించం. ఆ సమయంలో అక్కడ ఎందరున్నారన్న దానిపై ఆ సంఖ్య ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వమే ఆ వివరాలు ప్రకటించాలి’ అని అన్నారు. బాంబులు లక్ష్యానికి దూరంగా జారవిడిచారని వచ్చిన వార్తల్ని ఖండించారు. అది నిజమైతే పాక్ అంత తీవ్రంగా ఎందుకు స్పందిస్తుందని ఆయన అన్నారు. అభినందన్ ఫిట్‌గా ఉంటేనే.. పాకిస్తాన్ నిర్బంధం నుంచి విడుదలైన వింగ్ కమాండర్ అభినందన్ పూర్తి ఫిట్నెస్ సాధించాకే యుద్ధ విమానం నడుపుతారని ధనోవా చెప్పారు. కూలిపోయిన మిగ్ విమానం నుంచి ప్రాణాలతో బయటపడిన అభినందన్‌కు అవసరమైన అన్ని వైద్య పరీక్షలు చేస్తున్నామని, ఆయన మళ్లీ విమానం నడుపుతాడా? లేదా? అన్నది మెడికల్ ఫిట్‌నెస్‌పై ఆధారపడి ఉంటుందన్నారు. ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేస్తున్న రఫేల్ యుద్ధ విమానాలు సెప్టెంబర్ నాటికి వైమానిక దళానికి అందుతాయని చెప్పారు. బాలాకోట్ దాడి సమయంలో రఫేల్ విమానాలు అందుబాటులో ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలపై స్పందించేందుకు నిరాకరించారు. పాకిస్తాన్ ఎఫ్–16 యుద్ధ విమానాల వాడకంపై అమెరికాతో ఎలాంటి ఒప్పందం కుదుర్చుకుందో తనకు తెలియదని, ఒకవేళ ఆ విమానాన్ని దాడులకు వాడొద్దని అందులో ఉంటే, ఒప్పందం ఉల్లంఘనకు గురైనట్లేనని పేర్కొన్నారు. పాకిస్తాన్ దాడుల్ని తిప్పికొట్టేందుకు వినియోగించిన మిగ్–21 విమానం అత్యంత అధునాతనమైనదని తెలిపారు. పోఖ్రాన్లో ‘బాలాకోట్’కు రిహార్సల్! పుల్వామాలో ఉగ్ర దాడి తరువాత ప్రతీకార చర్య తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఈ రెండింటి మధ్య నిర్వహించిన సైనిక కసరత్తు కార్యక్రమంలో కొన్ని మార్పులు జరిగినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 14న ఉగ్రదాడిలో 40 మంది జవాన్లు అసువులుబాసిన సంగతి తెలిసిందే. ఇది జరిగిన రెండు రోజుల తరువాత రాజస్తాన్‌లోని పోఖ్రాన్లో ‘వాయుశక్తి’ పేరిట వైమానిక దళం విన్యాసాలు నిర్వహించింది. ఉగ్రమూకలపై ప్రతీకారం తీసుకునేందుకు సన్నద్ధమయ్యేలా ఈ కార్యక్రమంలో కొన్ని మార్పులు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వాయుశక్తి కార్యక్రమం షెడ్యూల్ అంతకుముందే ఖరారైనా, పుల్వామా ఘటనకు వైమానిక దళం ద్వారా ప్రతీకారం తీర్చుకోవాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఐఏఎఫ్ అధికారులకు సమాచారం అందినట్లు భావిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఒక రిహార్సల్‌లా ఉపయోగించుకుని పుల్వామా ఘటనకు కారణమైన జైషే మొహమ్మద్ ఉగ్ర సంస్థపై దాడులకు పాల్పడాలని ప్రణాళికలు రచించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి సంకేతాలు రాగానే భారత్–పాక్ నియంత్రణ రేఖ అవతలి వైపున గగనతలంలో దాడులు నిర్వహించేలా వాయుశక్తి కార్యక్రమంలో మార్పులు జరిగినట్లు తెలిసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు తగిన సమయంలో ప్రతీకార చర్యకు దిగుతామని వైమానిక దళ చీఫ్ బీఎస్ ధనోవా ఈ సందర్భంగా ప్రకటించడం ఈ వాదనలకు బలం చేకూరుస్తోంది. నాడు బాలాకోట్ శిబిరంలో 300 మొబైల్స్ యాక్టివ్ బాలాకోట్‌లో మృతి చెందిన ముష్కరులకు సంబంధించిన సాక్ష్యాధారాలు చూపించాలని రాజకీయ పక్షాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ది నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఎన్టీఆర్వో) ఆసక్తికర విషయాలను వెల్లడించింది. బాలాకోట్‌లో జైషే మహమ్మద్ ఉగ్రవాద స్థావరాలపై దాడులకు దిగడానికి ముందు ఆ ప్రదేశంలో నిఘా ఉంచగా 300 మొబైల్ ఫోన్లు పనిచేస్తున్నట్టుగా తమకు సిగ్నల్స్ అందాయని, అంటే ఆ సమయంలో స్థావరంలో అందరు ఉగ్రవాదులు ఉన్నట్టుగా తమకు అర్థమైందని ఆ సంస్థ అధికారి తెలిపారు. ‘ఫిబ్రవరి 26న భారత వాయుసేన నుంచి దాడులకు గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే ఆ ప్రాంతం మొత్తాన్ని సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి జల్లెడ పట్టాం. దాదాపుగా 300 మొబైల్స్ అక్కడ వాడుతున్నట్టుగా మాకు సిగ్నల్స్ అందాయి. ఇదే విషయాన్ని వైమానిక దళం దృష్టికి తీసుకువెళ్లాం. దీంతో ఐఏఎఫ్ జవాన్లు మొదట ఆ ఫోన్ సిగ్నల్స్‌ని నాశనం చేశారు. ఆ తర్వాత వెయ్యి కేజీల బరువైన బాంబుల్ని ప్రయోగించారు’ అని ఆ అధికారి చెప్పారు. ‘దాడులకు ముందు ఎన్టీఆర్వో, భారత నిఘా కూడా ఉగ్రవాద స్థావరాల్లో ఉన్న సదుపాయాలపై ఒక అంచనాకు వచ్చింది. ఆ తర్వాతే దాడులకు దిగింది’ అని అధికారి వివరించారు. -
300 మంది చనిపోయారా? లేక చెట్లు కూలాయా?
న్యూఢిల్లీ: పాకిస్థాన్ బాలాకోట్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత వైమానిక దళం (ఐఏఎఫ్) జరిపిన దాడుల్లో నిజంగానే 300 మంది ఉగ్రవాదులు చనిపోయారా అంటూ ప్రతిపక్షాలు ఇదే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. భద్రతా దళాల ధైర్యసాహసాలను రాజకీయ ప్రయోజనం కోసం వాడుకుంటున్నాయని, ఆర్మీ దాడులను రాజకీయం చేస్తున్నాయని ప్రతిపక్షాలు మండిపడుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో ప్రతిపక్షాలకు తాజాగా పంజాబ్ మంత్రి, కాంగ్రెస్ నేత, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ గొంతు కలిపారు. విదేశీ శత్రు దేశంతో పోరాడుతున్నామంటూ దేశంలోని ప్రజలను మోసం చేస్తున్నారని, నిజానికి మీరు ఉగ్రవాదులను చంపారా? లేక చెట్లను కూల్చారా? ఇదంతా ఎన్నికల గిమ్మిక్కేనా అని సిద్ధూ ప్రశ్నించారు. ‘300 మంది ఉగ్రవాదులు నిజంగా చనిపోయారా? లేదా? మీ ఉద్దేశం ఏమిటి? ఉగ్రవాదులను నేలమట్టం చేయడమా? చెట్లను కూల్చడమా? ఇది ఎన్నికల గిమ్మిక్కా? శత్రుదేశంతో పోరాడుతున్నామంటూ.. దేశాన్ని మోసం చేస్తున్నారు. ఆర్మీతో రాజకీయం చేయడం మానండి. ఆర్మీ దేశమంతా పవిత్రమైనది’ అని సిద్ధూ ట్వీట్ చేశారు. -
సర్జికల్ స్ట్రైక్స్‌పై మసూద్ సోదరుడి ఆడియో..!
-
సర్జికల్ స్ట్రైక్స్‌పై మసూద్ సోదరుడి ఆడియో..!
న్యూఢిల్లీ : భారత సర్జికల్ దాడులతో ఎలాంటి నష్టం జరుగలేదని పాకిస్తాన్ చెప్తున్న మాటలు తప్పని రుజువయ్యాయి. తమపై ఐఏఎఫ్ మెరుపుదాడులు చేసింది నిజమేనని జైషే చీఫ్ మసూద్ అజార్ తమ్ముడు మౌలానా అమర్ వెల్లడించారు. సర్జికల్ స్ట్రైక్స్ జరిగిన మరుసటి రోజున జైషే సీనియర్లతో జరిగిన సమావేశంలో అమర్ మాట్లాడినట్టు ఓ ఆడియో షోషల్ మీడియా చక్కర్లు కొడుతోంది. దాని ప్రకారం.. ‘బాలాకోట్‌లోని జైషే క్యాంపులపై వైమానిక దాడులు జరిగింది నిజమే. అయితే, మార్కజ్ (జిహాద్ బోధనా కేంద్రం)పై మాత్రమే దాడులు జరిగాయి. భారత్ చెప్తున్నట్టు జైషే కీలక స్థావరాలకు ఎలాంటి నష్టం జరగలేదు. మా భూభాగంలోకి వచ్చి మరీ జిహాద్ బోధనా కేంద్రంపై భారత్ దాడులకు దిగడం తీవ్ర వేదనకు గురిచేసింది. దీంతో ప్రతీకారానికి భారత్ మంచి అవకాశం ఇచ్చింది. మాపై దాడి చేసి యుద్ధానికి కాలు దువ్వింది’ అని వ్యాఖ్యానించాడు. (మసూద్‌కు సైనిక ఆస్పత్రిలో చికిత్స) భారీ స్థాయిలో మృతులు.. కశ్మీర్‌ను రక్షించుకునేందుకు జిహాద్ శిక్షణ పొందుతున్న వారిపై ఐఏఎఫ్ బాంబులతో విరుచుకుపడిందని అమర్ తెలిపారు. తద్వారా కశ్మీర్‌లోని ముస్లింలకు భారత్ మరింత కోపం తెప్పించిందని పేర్కొన్నారు. ఇదిలాఉండగా.. మిరాజ్ జెట్ ఫైటర్స్ దాడుల్లో ‘జబా టాప్’ అనే కొండ ప్రాంతంలో చాలా మంది మరణించినట్టు వార్తలు వచ్చాయి. అక్కడ పడి ఉన్న దాదాపు 30 శవాలను తరలించేందుకు అంబులెన్సులు వచ్చాయని స్థానికులు చెప్తున్నారు. ఉగ్రవాద శిక్షణనిస్తున్న మాజీ ఐఎస్ఐ అధికారి, కల్నల్ సలీం కూడా ఈ దాడుల్లో మరణించినట్టు సమాచారం. (సరిహద్దుకు అటూ.. ఇటూ..) -
20వ స్క్వాడ్రన్..4 పైలట్లు...
యుద్ధం లేని సమయంలో తొలిసారి పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకుని పోయి బాలాకోట్‌లోని ఉగ్రవాద శిక్షణ శిబిరాలపై చేసిన మెరుపుదాడి భారత వైమానిక దళ ధైర్యసాహసాలకు ఓ ప్రతీక. మనదేశానికి చెందిన యుద్ధవిమానాలు వాస్తవాధీన రేఖను, పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను కూడా దాటి పాక్‌లోకి చొచ్చుకుపోవటంలో చూపిన తెగువను 1971 నాటి బంగ్లా యుద్ధంలోనూ మన వాయుసేన ప్రదర్శించింది. మన దేశానికి చెందిన ఓ నలుగురు యువ పైలట్లు ఇలాగే పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లి శత్రు వైమానిక స్థావరాన్ని నాశనం చేశారు . ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్క్వాడ్రన్ లీడర్ ఆర్ఎన్ భరద్వాజ్, ఫ్లైయింగ్ ఆఫీసర్లు వీకే హెబ్లే, బీసీ కరంబయ, ఫ్లైట్ లెఫ్టినెంట్ ఏఎల్ దియోస్కర్లు ఆ ఏడాది డిసెంబర్ 8న జెట్ విమానాల్లో మురిద్ వైపు దూసుకుపోయారు. పాకిస్తాన్ సరిహద్దు నుంచి 120 కిలోమీటర్ల లోపల ఉన్న మురిద్ వైమానిక స్థావరంలో నిలిపి ఉంచిన శత్రు విమానాలను ధ్వంసం చేశారు. నాటి సాహస కృత్యాలను ఫ్లైయింగ్ ఆఫీసర్‌గా పనిచేసిన బీసీ కరంబయ నెమరు వేసుకున్నారు. ఆయన మాటల్లోనే.. ఈ ఆపరేషన్‌కు నలుగురం బయల్దేరాం. ముందు రెండు, తర్వాత రెండు విమానాలు. మొదటి రెండు విమానాలు అనుకున్న ప్రకారం ముందుకెళ్లాయి. వెనకనున్న రెండు విమానాలను ముందు వాటి కంటే ఒకటిన్నర నిముషం ఆలస్యంగా బయలు దేరమన్నాం. ఆకాశంలో కాల్పుల శబ్దం వినపడింది. నేను విమానంలో రేడియో ఆన్‌చేశాను. ముందువెళ్లిన విమానం నుంచి ‘నేను ఇప్పుడే నాలుగు ఇంజన్ల విమానాన్ని షూట్ చేశాను’అని వినిపించింది. చుట్టూ చీకటిగా ఉంది. నేను మిగ్–19 ఎస్‌ను చూశానని అనుకున్నాను. (నిజానికి అది చైనా తయారీ ఎఫ్–6 విమానం, చూడ్డానికి రష్యా మిగ్–19లాగే ఉంటుంది). దియోస్కర్ మరో విమానాన్ని గుర్తించాడు. నేను కాల్పులు జరిపాను. విమానాలకు ఇంధనాన్ని నింపే ట్యాంకరుకు మంటలంటుకున్నాయి. నేను కాల్పులు జరుపుతూనే ఉన్నాను. అప్పుడు నేను భూమికి కేవలం 300 అడుగుల ఎత్తులోనే ఉన్నాను. విమానం ఊగటం మొదలుపెట్టింది. శత్రువులు నా విమానాన్ని కాల్చారని గుర్తించాను. నేను దూకేస్తున్నానని మిగతా వారికి చెప్పాను. బయటకు దూకేందుకు విమానం తలుపు తెరుస్తుండగా, శత్రువులకు యుద్ధ ఖైదీగా చిక్కకూడదని నిర్ణయించుకున్నాను. దాంతో దూకే ఆలోచనను విరమించుకుని తక్కువ ఎత్తులో ప్రయాణించసాగాను. నా విమానం రెక్క ముందు కుడి భాగం, ఇంధన ట్యాంకులు పేలిపోవడం చూశాను. అయినా విమానం ఎగురుతూనే ఉంది. విమానం బాగా ఊగిపోయింది. అవసరమైనంత ఎత్తులో నడుపుతూ ఇండస్,సట్లైజ్ నదుల్ని దాటి భారత భూభాగంలో దిగాను’’అని తన అనుభవాన్ని చెప్పారు. 1971లో కరంబయకు వీర్‌చక్ర పురస్కారం లభించింది. ఆ తర్వాత చాలా ఏళ్లకు ఆయన పదవీ విరమణ చేశారు. మురిద్‌పై దాడి చేసిన కరంబయకు కాని ఇతర పైలట్లకు కాని తామెంత గొప్ప పని చేశామో అప్పట్లో తెలియలేదు. బంగ్లాదేశ్ యుద్ధం తర్వాత 47 ఏళ్లకు వచ్చిన ఒక పుస్తకంలో వీరి సాహసోపేత ఘనకార్యాన్ని పొందుపరిచారు. పాకిస్తాన్‌కు చెందిన మాజీ ఎయిర్‌కమాండర్ ఎం.కైసర్ తుఫైల్ ‘ఇన్ ద రింగ్ అండ్ ఆన్ ఫస్ట్ ఫీట్– పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఇన్ ద 1971 ఇండో–పాక్ వార్’పేరుతో రాసిన తాజా పుస్తకంలో ఈ ఘటనను వివరించారు. భారత వైమానిక దళం 20వ స్క్వాడ్రన్‌కు చెందిన హంటర్ విమానాలు ముదిర్ స్థావరంలో ఉన్న 5ఎఫ్–86 విమానాలను నాశనం చేశాయని ఆయన పేర్కొన్నారు. అయితే, బంగ్లాయుద్ధం తర్వాత భారత రక్షణ మంత్రిత్వ శాఖ భారత వైమానిక దళంపై ప్రచురించిన పుస్తకంలో దీని గురించి ఎలాంటి ప్రస్తావన లేదు. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
‘బాలకోట్’లో భారత్ గురి తప్పిందా?!
సాక్షి, న్యూఢిల్లీ : భారత యుద్ధ విమానాలు ఫిబ్రవరి 26వ తేదీ తెల్లవారు జామున మూడున్నర గంటలకు పాకిస్థాన్ భూభాగంలోకి దూసుకుపోయి బాలకోట్‌లోని జైషే మొహమ్మద్ స్థావరంపై బాంబుల వర్షం కురిపించిందని, ఈ దాడిలో దాదాపు 350 మంది ఉగ్రవాదులు మరణించి ఉంటారని ఆ రోజే భారత సైనిక వర్గాలు ప్రకటించాయి. దాంతోని ఒక్కసారి ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడం, ఆ మరుసటి రోజు భారత సైనిక స్థావరాలపైకి పాక్ యుద్ధ విమానాలు దూసుకురావడం, వాటిని భారత యుద్ధ విమానాలు తరమి కొట్టడం, అందులో ఓ యుద్ధ విమానం కూలిపోవడం, భారత పైలట్ అభినందన్ వర్థమాన్ పాక్ సైనికులకు చిక్కడం, ఆ తర్వాత ఆయన్ని పాక్ అధికారులు వదిలేయడం తదితర పరిణామాలు చకచకా జరిగిపోయిన విషయం తెల్సిందే. (‘బాలకోట్’లో జరిగిన నష్టం ఎంత?) ఇంతకు ఇన్ని పరిణామాలకు దారి తీసిన బాలకోట్‌పై భారత యుద్ధ విమానాలు చేసిన దాడిలో ఏ మేరకు నష్టం సంభవించింది? నిజంగా అక్కడ ఉగ్ర స్థావరం ధ్వంసం అయిందా? ఎంత మంది ఉగ్రవాదులు మరణించారు? భారత వైమానిక దళానికి చెందిన పన్నెండు మిరేజ్–2000 యుద్ధ విమానాలు ఉగ్ర స్థావరంపైకి దాడికి వెళ్లాయని, వెయ్యి కిలోల బాంబులను కురిపించి వచ్చాయని, ఉగ్ర స్థావరం ధ్వంసం అయిందని భారత సైనిక వర్గాలు ప్రకటించాయి. భారత యుద్ధ విమానాలు తొందరపాటులో ఖాళీ ప్రదేశంలో బాంబులు కురిపించి వెళ్లాయని, ఎవరికి, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదంటూ అదే రోజు పాకిస్థాన్ సైనిక దళాల అధికార ప్రతినిధి మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ కొన్ని ఫొటోలను ట్వీట్ చేశారు. వాటిల్లో ఇజ్రాయెల్ తయారు చేసిన ‘స్పైస్–2000’ క్షిపణి తాలూకు రెక్క ముక్కలు కనిపించాయి. ఇతర ఫొటొల్లో ఓ చెట్టు కూలిన దృశ్యం, చిన్న మట్టిదిబ్బలో గుంత పడిన దృశ్యాలు ఉన్నాయి. పాక్ అధికార ప్రతినిధి అక్కడి వీడియో దృశ్యాలను కూడా పోస్ట్ చేశారు. వాటిలో బాంబు దాడుల గురించి స్థానికులు మాట్లాడుకోవడం, బాంబు పేలుడు వల్ల ఓ శకలం వచ్చి దురంద్ షా అనే ఓ పౌరుడు గాయపడినట్లు తెలిసింది. (‘అష్ట’దిగ్బంధనం..) అంతర్జాతీయ జల సహకారానికి సంబంధించి యునెస్కో చెయిర్‌గా నియమితులైన స్వీడన్ యుప్ప్సాలా యూనివర్శిటీలో ‘డిపార్ట్మెంట్ ఆఫ్ పీస్ అండ్ కాన్ఫ్లిక్ట్ రీసర్చ్’ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న అశోక్ స్వేన్ ట్విటర్లో పోస్ట్ చేసిన దృశ్యాలు కూడా పాక్ సైనిక అధికార ప్రతినిధి పోస్ట్ చేసిన ఫొటోలకు దగ్గరగా ఉన్నాయి. వీటిలో వాస్తవాలను తెలుసుకునేందుకు అట్లాంట కౌన్సిల్‌కు చెందిన డీఎఫ్‌ఆర్‌ల్యాబ్ (డిజిటల్ ఫోరెన్సిక్ రీసర్చ్ ల్యాబ్) శాటిలైట్ చిత్రాల ద్వారా పరిశోధించి బాంబులు పడిన చోటును గుర్తించింది. శాటిలైట్ ఫిబ్రవరి 25–27 తేదీల మధ్య రికార్డు చేసిన ఆ ప్రాంతం చిత్రాలను కూడా పోల్చి చూసింది. తద్వారా పాక్ సైనికాధికారి, అశోక్ స్వేన్ పోస్ట్ చేసిన చిత్రాలన్ని బాంబులు పడిన చోటునే చూపిస్తున్నాయని డీఎఫ్‌ఆర్‌ల్యాబ్ ధ్రువీకరించింది. (ఇంటిగుట్టు పాక్‌కు చేటు) బాంబులు పడిన చోటు బాలకోట్ పట్టణానికి పది కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ ప్రాంతాన్ని స్థానికులు ‘జాబా టాప్’ అని పిలుస్తారు. ఇది జాబా గ్రామానికి సమీపంలో ఉంది. అక్కడ ఇజ్రాయిల్ తయారీ ‘స్పైస్–2000’ క్షిపణులు ప్రయోగించినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయని, వెయ్యి కిలోల బాంబులు కురిపించిన దాఖలాలు లేవని డీఎఫ్ఆర్లాబ్ స్పష్టం చేసింది. మొత్తానికి బాంబు దాడుల్లో ఒక్కరు కూడా మరణించలేదన్న విషయం స్పష్టం అవుతోంది. ‘స్పైస్–2000’ క్షిపణలు ‘ప్రిసిషన్ గైడెడ్ మునిషన్స్ (పీజీఎం) వ్యవస్థ ఉంటుందని, అవి ఎప్పుడు గురితప్పవని, అలాంటిది బాలకోట్ లక్ష్యాన్ని ఎలా గురి తప్పిందో అర్థం కావడం లేదని డీఎఫ్‌ఆర్‌ల్యాబ్ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. (పాక్ జెనీవా ఒప్పందాన్ని ఉల్లంఘించిందా?) -
‘బాలకోట్’లో జరిగిన నష్టం ఎంత?
సాక్షి, న్యూఢిల్లీ : పాకిస్థాన్ చెరలో చిక్కిన భారత వైమానిక దళం వింగ్ కమాండర్ అభినందన వర్థమాన్‌ను సురక్షితంగా విడుదల చేయాలని పాకిస్థాన్ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడంతో ఇరు దేశాల మధ్య గత మూడు రోజులుగా నెలకొన్ని యుద్ధ మేఘాలు విడిపోయాయి. అయితే పలు చిక్కు ప్రశ్నలకు సమాధానాలు రావల్సి ఉంది. (అణు యుద్ధం వస్తే..?) 1. ఈ మూడు రోజులుగా దేశ సరిహద్దులో పాక్ నుంచి నిరంతరంగా కొనసాగుతున్న కాల్పులు, శతఘ్ని పేలుళ్లు నిలిచిపోతాయా? కాల్పులకు భయపడి ఉన్నఫలంగా సురక్షిత ప్రాంతాలకు తరలివచ్చిన సరిహద్దు గ్రామాల ప్రజలు తిరిగి తమ స్వగ్రామాలకు వెళ్లే పరిస్థితి ఉందా? కశ్మీర్ లోపల గత కొంతకాలంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు తొలగిపోతాయా? 2. పాక్ భూభాగంలోని బాలకోట్ ఉగ్ర స్థావరంపై భారత వైమానిక దాడుల వల్ల జరిగిన ధ్వంసం ఏమిటీ? ఉగ్రవాదులు ఎంత మంది చనిపోయారు ? వారు తిరిగి కోలుకొని తమ ఉగ్రశిక్షణ కేంద్రాన్ని పునరుద్ధరించుకునే అవకాశం ఉందా? భారత్ దాడితో పాక్ వైఖరిలో ఏమైనా మార్పు వస్తుందా? ఇంతటితో ఉగ్రవాదుల ఆటకట్టించేందుకు పాకిస్థాన్ ప్రభుత్వమే చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఈ విషయమై ఇరువర్గాలు ఇప్పటి వరకు ఎలాంటి వివరాలను, ఆధారాలను వెల్లడించలేదు. 3. పాక్ జెట్ యుద్ధ విమానాలు భారత భూభాగంలోకి ఎలా చొచ్చుకు రాగలిగాయి? వాటిని తరముతూ వెళ్లిన భారత యుద్ధ విమానాన్ని పాక్ సైనికులు ఎలా పడగొట్టగలిగారు? 4. బుద్గామ్‌లో ఏడుగురు మరణానికి దారితీసిన భారత సైనిక విమానం మిగ్–17 కూలిపోవడానికి కారణం ఏమిటీ? (పాక్ జెనీవా ఒప్పందాన్ని ఉల్లంఘించిందా?) 5. సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు నెలకొన్న నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలన్నీ తమ రాజకీయ కార్యకలాపాలను రద్దు చేసుకోగా, ప్రధాని నరేంద్ర సహా పాలకపక్ష బీజేపీ తమ రాజకీయ కార్యకలాపాలను ఎందుకు కొనసాగించారు? 6. అభినందన్‌ను పాక్ ప్రభుత్వం విడుదల చేయడం వెనక నిజంగా సౌదీ అరేబియా, అమెరికా ఒత్తిడి ఉందా? ఉన్నట్లయితే విదేశీ మీడియా ఈ అంశాన్ని పూర్తిగా ఎందుకు విస్మరించింది? 6. పాక్ భూభాగంపై ఉగ్రవాద శిక్షణా స్థావరాలను సమూలంగా నిర్మూలించేందుకు భారత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ? వీటన్నింటికి సమాధానం దొరకాల్సి ఉంది. (‘అష్ట’దిగ్బంధనం..) -
పాక్‌తో యుద్ధం జరుగుతుందా!
సాక్షి, న్యూఢిల్లీ : 1971 తర్వాత భారత యుద్ధ విమానాలు పాకిస్థాన్ భూభాగంలోకి వెళ్లి దాడులు జరపడం ఇదే మొదటిసారి. 1999లో జరిగిన కార్గిల్ యుద్ధం సందర్భంగా కూడా పాక్‌స్థాన్ భూభాగంలోకి భారత వైమానిక దళాలు చొచ్చుకుపోలేదు. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా మంగళవారం నాడు భారత యుద్ధ విమానాలు పాకిస్థాన్‌లోని ఖైబర్ పంఖ్తూఖ్వా రాష్ట్రంలోనికి చొచ్చుకుపోయి బాలకోట్‌లోని ఉగ్రవాద శిబిరాలపై బాంబుల వర్షం కురిపించిన విషయం తెల్సిందే. ఎదురుదాడికి సిద్ధమైన పాకిస్థాన్ యుద్ధ విమానాలు బుధవారం భారత సరిహద్దులోకి దూసుకురాగా భారత వైమానికి దళం గట్టిగా ప్రతిఘటించి ఓ పాక్ యుద్ధ విమానాన్ని కూల్చి వేసింది. మిగతా పాక్ విమానాలు వెనక్కి తిరిగి పోయాయి. ఇరు దేశాల మధ్య నెలకొన్ని ఇలాంటి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు యుద్ధానికి దారితీస్తాయా? అన్న చర్చ పలు వర్గాల్లో మొదలైంది. (‘యుద్ధం వస్తే గట్టిగా నిలబడండి’) ‘2016లో భారత వైమానిక దళం పాక్ ఆక్రమిత కశ్మీర్లోకి చొచ్చుకుపోయి సర్జికల్ స్ట్రైక్స్ జరిపాయి. అప్పుడు కూడా ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాని ఆ పరిస్థితులు యుద్ధానికి దారితీయలేదు. ఇప్పుడు భారత వైమానిక దళం రెండోసారి సర్జికల్ స్ట్రైక్స్ జరిపాయి. కాకపోతే ఈసారి పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను దాటి పాకిస్థాన్ భూభాగంలోకి చొచ్చుకుపోయి బాంబులు కురిపించింది. ఇది ప్రస్తుతానికి ప్రతీకాత్మక దాడి మాత్రమే. దాడి గురించి భారత్ చెప్పే కథనానికి, పాక్ చెప్పే కథనానికి మధ్య ఎంతో వైరుధ్యం ఉంది. ఉగ్రస్థావరాలను ధ్వంసం చేశామని, దాదాపు 350 మంది వరకు ఉగ్రవాదులు చనిపోయి ఉండవచ్చని భారత దళం చెబుతుండగా, భారత విమానాలు ఖాళీ ప్రదేశంలో బాంబులను కురిపించాయని, ఆనవాళ్లు ఇదిగో! అంటూ పాక్ దళం శకలాలను చూపిస్తోంది. ఏదేమైనా పరస్పర దాడులు కొన్ని రోజులు కొనసాగవచ్చు. (సైనికేతర, ముందస్తు దాడి చేశాం) ఇది నాన్ మిలటరీ ప్రీఎంప్టీవ్ దాడులుగా భారత విదేశాంగ శాఖ కార్యదర్శి వ్యాఖ్యానించారంటేనే యుద్ధానికి కాలుదువ్వడం కాదనేది అర్థం. తాము పాక్ సైనికులు లేదా పౌరులు లక్ష్యంగా దాడి చేయలేదని, ఉగ్రవాదుల లక్ష్యంగా దాడి చేశామని చెప్పడమే ఈ మాటల ఉద్దేశం. భారత్‌పై ఉగ్రదాడి జరిగినందుకు, మరిన్ని జరుగుతాయని తెల్సినందునే ఈ దాడి జరిపామని కూడా భారత వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయ సమాజానికి సర్ది చెప్పడం కోసం భారత వర్గాలు ఇలా మాట్లాడుతుండవచ్చు. ఒక్కసారి పాక్ సరిహద్దు రేఖను ఉల్లంఘించి లోపలకి పోయామంటే చాలు, పాక్ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించినట్లే. దీనిపై ఏ దేశం ఎలా స్పందిస్తుందో భారత్‌కు ప్రస్తుతం అనవసరం. ఏ దేశమైనా తమ రాజకీయాలు, ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొనే స్పందిస్తాయి. 2016లో మొదటిసారి సర్జికల్ స్ట్రైక్స్ భారత వైమానిక దళం జరిపిన తర్వాత సరిహద్దులో పాక్ సైనికుల కాల్పుల ఉల్లంఘనలు పెరిగాయి. కశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగాయి. ఇప్పుడు మరింత పెరగవచ్చు! ఆవేశంతోనే ఉద్రేకంతోనో ఇరు దేశాల్లోని కొంత మంది యుద్ధాన్ని కోరుకోవచ్చు. ఒక్కసారి యుద్ధం మొదలయితే అది పరిమితంగా జరుగుతుందా? పూర్తిస్థాయిలో జరుగుతుందా? అన్నది చెప్పలేం. యుద్ధం అంటే ఇరువర్గాలకు అపార నష్టం. అందుకని ఇరువర్గాల సైనికులు కూడా యుద్ధాన్ని కోరుకోరు. ప్రస్తుత పరిస్థితులు యుద్ధానికి దారితీస్తాయా, లేదా? అన్నది కూడా ఇప్పుడే చెప్పలేం. మరి కొన్ని రోజులు గడిస్తే స్పష్టత రావచ్చు!’ (ఢిల్లీలోని ‘ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్’ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, రిటైర్డ్ లెఫ్ట్‌నెంట్ జనరల్ హెచ్ఎస్ పనాగ్ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలోని అభిప్రాయాల సారాంశం ఇది) -
మరోసారి కాల్పులకు తెగబడిన పాక్
జమ్మూ: పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూ పూంఛ్ జిల్లాలోని బాలాకొట్ వద్ద పాక్ సైన్యం కాల్పులు జరిపింది. భారత శిబిరాలే లక్ష్యంగా పాక్ జరిపిన కాల్పులను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టిందని రక్షణ శాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు. గత రాత్రి 8.30 ప్రాంతంలో పాక్ సైన్యం కాల్పులు ప్రారంభించిందని చెప్పారు. దాదాపు గంటపైగా ఇరువైపులా కాల్పులు జరిపుకున్నాయని మెహతా వివరించారు. అయితే ఈ కాల్పుల్లో ఎవరికి ఎటువంటి గాయాలు కానీ ఆస్తి నష్టం కానీ సంభవించలేదని తెలిపారు.