న్యూఢిల్లీ: బాలాకోట్ వైమానిక దాడిలో తమవైపు పెద్దగా నష్టం జరగలేదని చెప్పుకుంటున్న పాకిస్తాన్‌ది వట్టి బుకాయింపేనని తేటతెల్లమైంది. ఫిబ్రవరి 26న భారత వైమానిక దళం ఉగ్ర శిబిరాలపై బాంబులు జారవిడిచిన తరువాత పాకిస్తాన్ ఆర్మీ రంగంలోకి దిగి ముష్కరుల మృతదేహాల్ని కాల్చివేసి సమీపంలోని నదిలో పడేసిందని ప్రత్యక్ష సాక్షి ఒకరు వెల్లడించాడు. భారత వైమానిక దళం దాడి ఆనవాళ్లను కప్పిపుచ్చుకునేందుకు పాకిస్తాన్ చేసిన ప్రయత్నాల్ని అతడు పూసగుచ్చాడు. సుమారు 3 నిమిషాల వ్యవధి గల ఆ వీడియోను రిపబ్లిక్ టీవీ తాజాగా వెలుగులోకి తెచ్చింది.
ఆధారాల్ని మాయం చేసేందుకు బాలాకోట్ గ్రామానికి వచ్చిన పాకిస్తాన్ ఆర్మీ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి వారి ఫోన్లు లాక్కున్నట్లు తెలిసింది. దాడికి సంబంధించి ఎలాంటి వీడియోలు, ఫొటోలు బయటికి రాకుండా ఇంటర్నెట్ సేవల్ని కూడా నిలిపేసినట్లు వీడియోలో ఉంది. బాలాకోట్ దాడి తరువాత ఉగ్రవాదులకు భయం పట్టుకుందని, వారంతా అఫ్గానిస్తాన్–వజీరిస్తాన్ సరిహద్దులోకి పారిపోయారని ప్రత్యక్ష సాక్షి అందులో చెప్పారు. బాలాకోట్ సమీప నివాసిగా భావిస్తున్న సదరు వ్యక్తి ఈ దాడిలో మొత్తం ఎందరు హతమయ్యారో వెల్లడించకున్నా అందులో కొందరు తనకు తెలుసని, వారి చరిత్రతో సహా పేర్లు చదివి వినిపించాడు. వీడియోలో చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..
అమానవీయంగా వ్యవహరించిన సైన్యం..
భారత వైమానిక దళం మిగిల్చిన నష్టాన్ని కప్పిపుచ్చుకునేందుకు పాకిస్తాన్ ఆర్మీని రంగంలోకి దింపారు. బాలాకోట్‌ను పూర్తిగా తమ అదుపులోకి తీసుకున్న సైన్యం స్థానికులను భయపెట్టింది. వారి మొబైల్ ఫోన్లను లాక్కుంది. గాయపడిన ఉగ్రవాదుల పట్ల అమానవీయంగా వ్యవహరిస్తూ వారికి చికిత్స అందించడానికి వైద్యులను కూడా అనుమతించలేదు. వైద్యం అందించాలని వారు ఎంతో ప్రాధేయపడినా కనికరించలేదు. కార్ల నుంచి తీసిన పెట్రోల్‌తో చాలామటుకు శవాల్ని మూకుమ్మడిగా తగలబెట్టారు.
మరి కొన్నింటిని సంచుల్లో చుట్టి సమీపంలోని కున్హర్ నదిలో పడేశారు. మృతిచెందిన ఉగ్రవాదుల్లో చాలా మంది జైషే సభ్యులే. ప్రాణాలతో బయటపడిన వారిని వెంటనే అఫ్గానిస్తాన్–వజీరిస్తాన్ సరిహద్దుకు తరలించారు. ఈ దాడితో ఐఎస్‌ఐ, జైషే సభ్యులను భయం పట్టుకుంది. ఫొటోలు, వీడియోలు బయటికి రాకుండా నివారించేందుకు అక్కడ మొబైల్, ఇంటర్నెట్ సేవల్ని నిలిపేశారు. అయినా కొన్ని చిత్రాలు వెలుగుచూశాయి. పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్ర శిబిరాలపై భారత్ ఇలాగే దాడికి దిగుతూ ముష్కరులను చంపుతూ ఉంటే, మాకు త్వరలోనే ఉగ్రవాదం బెడద తొలగిపోతుంది.
అక్కడ 263 మంది ఉగ్రవాదులు
భారత యుద్ధవిమానాలు దాడికి దిగడానికి ఐదు రోజుల క్రితం బాలాకోట్ శిబిరంలో 263 మంది ఉగ్రవాదులు ఉన్నట్లు తెలిసింది. ఆ సమయంలో ముష్కరులకు శిక్షణ ఇచ్చేందుకు 18 మంది సీనియర్ కమాండర్లు అక్కడే ఉన్నట్లు టైమ్స్ నౌ మీడియా తెలిపింది. ప్రాథమిక శిక్షణకు 83 మంది, అడ్వాన్స్ శిక్షణకు 91 మంది, ఆత్మాహుతి దాడిలో శిక్షణకు 25 మంది ఆæ శిబిరానికి వచ్చినట్లు వెల్లడించింది. మరో 18–20 మంది దాకా వంటగాళ్లు, క్షురకులు, ఇతర సిబ్బంది ఉన్నట్లు పేర్కొంది.
బాలాకోట్‌లో 263 మంది ఉగ్రవాదులు ఆవాసం పొందుతున్నట్లు ధ్రువీకరించుకున్న తరువాతే వైమానిక దళం దాడికి దిగిందని తెలిపింది. అక్కడ 300 ఫోన్లు క్రియాశీలకంగా ఉన్నాయని కేంద్ర హోం శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, వైమానిక దాడిలో కనీసం నలుగురు పాకిస్తాన్ సైనికులు కూడా మృత్యువాతపడినట్లు తెలిసింది. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)పోలీసులు, బాలాకోట్ మత గురువులకు ఫోన్‌చేయగా భారత వైమానిక దళం బాంబులు జారవిడిచిన సంగతి నిజమేనని చెప్పినట్లు ఇండియా టుడే టీవీ తెలిపింది.
శవాలు కాల్చి.. నదిలో పడేసి!
Published Tue, Mar 12 2019 3:34 AM | Last Updated on Tue, Mar 12 2019 3:34 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment