Jaish-e-Mohammed terrorists
-
కశ్మీర్లో భారీ ఉగ్ర కుట్ర భగ్నం
జమ్మూ/శ్రీనగర్: కశ్మీర్లో భారీస్థాయి దాడులు జరిపేందుకు ఉగ్రవాదులు పన్నిన కుట్రను భద్రతా బలగాలు భగ్నం చేశాయి. జమ్మూ శివారులో గురువారం జరిగిన ఎదురుకాల్పుల్లో జైషే మొహమ్మద్‌కు చెందిన నలుగురు ఉగ్రవాదులు హతం కాగా, ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. ఉగ్రవాదులు పాకిస్తాన్‌కు చెందిన వారనీ, స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు అవరోధం కలిగించడమే వీరి లక్ష్యంగా భావిస్తున్నట్లు జమ్మూ పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్(ఐజీపీ) ముకేశ్ చెప్పారు. జమ్మూ హైవేపై నగ్రోటా ప్రాంతంలోని బాన్ టోల్‌ప్లాజా వద్ద అనుమానాస్పదంగా కనిపించిన బియ్యం ట్రక్కును తనిఖీ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. ట్రక్కు డ్రైవర్ వెంటనే దిగి పారిపోగా, ట్రక్కులో బియ్యం బస్తాల మాటున దాక్కున్న ఉగ్రవాదులు గ్రెనేడ్లు విసరుతూ, కాల్పులు ప్రారంభించారు. దీంతో పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలు ఆ ట్రక్కును చుట్టుముట్టి, దీటుగా స్పందించారు. ఈ కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతం కాగా, ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. ట్రక్కు నుంచి 11 ఏకే రైఫిళ్లు, 24 మేగజీన్లు, 3 పిస్టళ్లు, 35 గ్రెనేడ్లను స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు భారీగా మందులు, పేలుడు సామగ్రి, వైర్ల బండిళ్లు, ఎలక్ట్రానిక్ సర్క్యూట్లు లభ్యమయ్యాయి. కశ్మీర్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా కేంద్రప్రభుత్వం ప్రకటించిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈనెల 28వ తేదీన, డిసెంబర్ 22న జిల్లా అభివృద్ధి మండళ్లకు జరగనున్న ఎన్నికల ప్రక్రియకు అవరోధం కలిగించేందుకు పాక్ ప్రయత్నిస్తోందని చెప్పారు. ఈ ప్రయత్నాలను భగ్నం చేసేందుకు తాము అత్యంత అప్రమత్తతతో పనిచేస్తున్నామన్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అభ్యర్థులు, పార్టీల నేతలకు వేర్వేరుగా భద్రత కల్పించడం కష్టసాధ్యమైనందున, వారు వెళ్లే ప్రాంతాల్లో భద్రతా చర్యలను పెంచామన్నారు. -
భారత్‌లోకి 10మంది జైషే ఉగ్రవాదులు
సాక్షి, న్యూఢిల్లీ: ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకశ్మీర్ పునర్వ్యస్థీకరణ నేపథ్యంలో ఉగ్రవాదులు భారత్‌లో భారీ విధ్వంసానికి కుట్ర పన్నుతున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. అమెరికా మాదిరే భారత్‌లో కూడా 26/11 తరహా దాడులు చేసేందుకు పథకం పన్నుతున్నారని ఇంటిలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. జమ్మూకశ్మీర్‌లో ఆత్మాహుతి దాడితోపాటు దేశవ్యాప్తంగా 30 చోట్ల పేలుళ్లకు కుట్ర పన్నినట్లు సమాచారం. ఈ క్రమంలో ఇప్పటికే 10 మంది జైషే ఉగ్రవాదులు భారత్‌లో చొరబడినట్లు నిఘా వర్గాలు తెలిపాయి. ఇంటిలెజన్స్ వర్గాల హెచ్చరికల నేపథ్యంలో పఠాన్ కోట్, జమ్మూకశ్మీర్, శ్రీనగర్‌లో ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించారు. రాష్ట్రాలను అప్రమత్తం చేయడమే కాక.. భద్రతను కట్టుదిట్టం చేయాలని సూచించాయి. -
శవాలు కాల్చి.. నదిలో పడేసి!
న్యూఢిల్లీ: బాలాకోట్ వైమానిక దాడిలో తమవైపు పెద్దగా నష్టం జరగలేదని చెప్పుకుంటున్న పాకిస్తాన్‌ది వట్టి బుకాయింపేనని తేటతెల్లమైంది. ఫిబ్రవరి 26న భారత వైమానిక దళం ఉగ్ర శిబిరాలపై బాంబులు జారవిడిచిన తరువాత పాకిస్తాన్ ఆర్మీ రంగంలోకి దిగి ముష్కరుల మృతదేహాల్ని కాల్చివేసి సమీపంలోని నదిలో పడేసిందని ప్రత్యక్ష సాక్షి ఒకరు వెల్లడించాడు. భారత వైమానిక దళం దాడి ఆనవాళ్లను కప్పిపుచ్చుకునేందుకు పాకిస్తాన్ చేసిన ప్రయత్నాల్ని అతడు పూసగుచ్చాడు. సుమారు 3 నిమిషాల వ్యవధి గల ఆ వీడియోను రిపబ్లిక్ టీవీ తాజాగా వెలుగులోకి తెచ్చింది. ఆధారాల్ని మాయం చేసేందుకు బాలాకోట్ గ్రామానికి వచ్చిన పాకిస్తాన్ ఆర్మీ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి వారి ఫోన్లు లాక్కున్నట్లు తెలిసింది. దాడికి సంబంధించి ఎలాంటి వీడియోలు, ఫొటోలు బయటికి రాకుండా ఇంటర్నెట్ సేవల్ని కూడా నిలిపేసినట్లు వీడియోలో ఉంది. బాలాకోట్ దాడి తరువాత ఉగ్రవాదులకు భయం పట్టుకుందని, వారంతా అఫ్గానిస్తాన్–వజీరిస్తాన్ సరిహద్దులోకి పారిపోయారని ప్రత్యక్ష సాక్షి అందులో చెప్పారు. బాలాకోట్ సమీప నివాసిగా భావిస్తున్న సదరు వ్యక్తి ఈ దాడిలో మొత్తం ఎందరు హతమయ్యారో వెల్లడించకున్నా అందులో కొందరు తనకు తెలుసని, వారి చరిత్రతో సహా పేర్లు చదివి వినిపించాడు. వీడియోలో చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే.. అమానవీయంగా వ్యవహరించిన సైన్యం.. భారత వైమానిక దళం మిగిల్చిన నష్టాన్ని కప్పిపుచ్చుకునేందుకు పాకిస్తాన్ ఆర్మీని రంగంలోకి దింపారు. బాలాకోట్‌ను పూర్తిగా తమ అదుపులోకి తీసుకున్న సైన్యం స్థానికులను భయపెట్టింది. వారి మొబైల్ ఫోన్లను లాక్కుంది. గాయపడిన ఉగ్రవాదుల పట్ల అమానవీయంగా వ్యవహరిస్తూ వారికి చికిత్స అందించడానికి వైద్యులను కూడా అనుమతించలేదు. వైద్యం అందించాలని వారు ఎంతో ప్రాధేయపడినా కనికరించలేదు. కార్ల నుంచి తీసిన పెట్రోల్‌తో చాలామటుకు శవాల్ని మూకుమ్మడిగా తగలబెట్టారు. మరి కొన్నింటిని సంచుల్లో చుట్టి సమీపంలోని కున్హర్ నదిలో పడేశారు. మృతిచెందిన ఉగ్రవాదుల్లో చాలా మంది జైషే సభ్యులే. ప్రాణాలతో బయటపడిన వారిని వెంటనే అఫ్గానిస్తాన్–వజీరిస్తాన్ సరిహద్దుకు తరలించారు. ఈ దాడితో ఐఎస్ఐ, జైషే సభ్యులను భయం పట్టుకుంది. ఫొటోలు, వీడియోలు బయటికి రాకుండా నివారించేందుకు అక్కడ మొబైల్, ఇంటర్నెట్ సేవల్ని నిలిపేశారు. అయినా కొన్ని చిత్రాలు వెలుగుచూశాయి. పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్ర శిబిరాలపై భారత్ ఇలాగే దాడికి దిగుతూ ముష్కరులను చంపుతూ ఉంటే, మాకు త్వరలోనే ఉగ్రవాదం బెడద తొలగిపోతుంది. అక్కడ 263 మంది ఉగ్రవాదులు భారత యుద్ధవిమానాలు దాడికి దిగడానికి ఐదు రోజుల క్రితం బాలాకోట్ శిబిరంలో 263 మంది ఉగ్రవాదులు ఉన్నట్లు తెలిసింది. ఆ సమయంలో ముష్కరులకు శిక్షణ ఇచ్చేందుకు 18 మంది సీనియర్ కమాండర్లు అక్కడే ఉన్నట్లు టైమ్స్ నౌ మీడియా తెలిపింది. ప్రాథమిక శిక్షణకు 83 మంది, అడ్వాన్స్ శిక్షణకు 91 మంది, ఆత్మాహుతి దాడిలో శిక్షణకు 25 మంది ఆæ శిబిరానికి వచ్చినట్లు వెల్లడించింది. మరో 18–20 మంది దాకా వంటగాళ్లు, క్షురకులు, ఇతర సిబ్బంది ఉన్నట్లు పేర్కొంది. బాలాకోట్‌లో 263 మంది ఉగ్రవాదులు ఆవాసం పొందుతున్నట్లు ధ్రువీకరించుకున్న తరువాతే వైమానిక దళం దాడికి దిగిందని తెలిపింది. అక్కడ 300 ఫోన్లు క్రియాశీలకంగా ఉన్నాయని కేంద్ర హోం శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, వైమానిక దాడిలో కనీసం నలుగురు పాకిస్తాన్ సైనికులు కూడా మృత్యువాతపడినట్లు తెలిసింది. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)పోలీసులు, బాలాకోట్ మత గురువులకు ఫోన్‌చేయగా భారత వైమానిక దళం బాంబులు జారవిడిచిన సంగతి నిజమేనని చెప్పినట్లు ఇండియా టుడే టీవీ తెలిపింది. -
మేము ఆ లెక్కలు వేయం
కోయంబత్తూర్: పాకిస్తాన్ భూభాగం బాలాకోట్‌లో జైషే మహ్మద్ ఉగ్ర శిబిరాలపై జరిపిన దాడిలో ఎంత మంది ఉగ్రవాదులు అంతమయ్యారన్న విషయంలో ఎడతెగని చర్చ నడుస్తున్న వేళ వైమానిక దళ చీఫ్ బీఎస్ ధనోవా సోమవారం స్పందించారు. వైమానిక దాడుల్లో చోటుచేసుకున్న నష్టం వివరాల్ని ప్రభుత్వమే వెల్లడించాలని, మృతుల సంఖ్యను తాము లెక్కించమని చెప్పారు. నిర్దేశించుకున్న లక్ష్యాన్ని ఛేదించామా? లేదా? అన్నదే తమకు ముఖ్యమన్నారు. పుల్వామా దాడికి ప్రతీకార చర్యగా ఫిబ్రవరి 26న పాక్‌లోని ఖైబర్ ఫక్తున్ఖ్వా ప్రావిన్సులో జైషే శిక్షణశిబిరాలపై భారత వైమానిక దళం బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడిలో 350 మంది ఉగ్రవాదులు హతమయ్యారని ప్రభుత్వ వర్గాలు తెలపగా, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా 250 మంది మరణించారని చెప్పారు. ఉగ్రవాదులకు వాటిల్లిన నష్టం తక్కువేనని మీడియాలో కొన్ని కథనాలు వచ్చాయి. ఇప్పటి దాకా ఈ విషయంలో ఎలాంటి అధికారిక సమాచారం బయటకురాలేదు. ఈ నేపథ్యంలో కోయంబత్తూరులో జరిగిన మీడియా సమావేశంలో ధనోవా మాట్లాడారు. ‘ వైమానిక దాడిలో ఎందరు చనిపోయారో మేము లెక్కించం. ఆ సమయంలో అక్కడ ఎందరున్నారన్న దానిపై ఆ సంఖ్య ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వమే ఆ వివరాలు ప్రకటించాలి’ అని అన్నారు. బాంబులు లక్ష్యానికి దూరంగా జారవిడిచారని వచ్చిన వార్తల్ని ఖండించారు. అది నిజమైతే పాక్ అంత తీవ్రంగా ఎందుకు స్పందిస్తుందని ఆయన అన్నారు. అభినందన్ ఫిట్‌గా ఉంటేనే.. పాకిస్తాన్ నిర్బంధం నుంచి విడుదలైన వింగ్ కమాండర్ అభినందన్ పూర్తి ఫిట్నెస్ సాధించాకే యుద్ధ విమానం నడుపుతారని ధనోవా చెప్పారు. కూలిపోయిన మిగ్ విమానం నుంచి ప్రాణాలతో బయటపడిన అభినందన్‌కు అవసరమైన అన్ని వైద్య పరీక్షలు చేస్తున్నామని, ఆయన మళ్లీ విమానం నడుపుతాడా? లేదా? అన్నది మెడికల్ ఫిట్‌నెస్‌పై ఆధారపడి ఉంటుందన్నారు. ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేస్తున్న రఫేల్ యుద్ధ విమానాలు సెప్టెంబర్ నాటికి వైమానిక దళానికి అందుతాయని చెప్పారు. బాలాకోట్ దాడి సమయంలో రఫేల్ విమానాలు అందుబాటులో ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలపై స్పందించేందుకు నిరాకరించారు. పాకిస్తాన్ ఎఫ్–16 యుద్ధ విమానాల వాడకంపై అమెరికాతో ఎలాంటి ఒప్పందం కుదుర్చుకుందో తనకు తెలియదని, ఒకవేళ ఆ విమానాన్ని దాడులకు వాడొద్దని అందులో ఉంటే, ఒప్పందం ఉల్లంఘనకు గురైనట్లేనని పేర్కొన్నారు. పాకిస్తాన్ దాడుల్ని తిప్పికొట్టేందుకు వినియోగించిన మిగ్–21 విమానం అత్యంత అధునాతనమైనదని తెలిపారు. పోఖ్రాన్లో ‘బాలాకోట్’కు రిహార్సల్! పుల్వామాలో ఉగ్ర దాడి తరువాత ప్రతీకార చర్య తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఈ రెండింటి మధ్య నిర్వహించిన సైనిక కసరత్తు కార్యక్రమంలో కొన్ని మార్పులు జరిగినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 14న ఉగ్రదాడిలో 40 మంది జవాన్లు అసువులుబాసిన సంగతి తెలిసిందే. ఇది జరిగిన రెండు రోజుల తరువాత రాజస్తాన్‌లోని పోఖ్రాన్లో ‘వాయుశక్తి’ పేరిట వైమానిక దళం విన్యాసాలు నిర్వహించింది. ఉగ్రమూకలపై ప్రతీకారం తీసుకునేందుకు సన్నద్ధమయ్యేలా ఈ కార్యక్రమంలో కొన్ని మార్పులు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వాయుశక్తి కార్యక్రమం షెడ్యూల్ అంతకుముందే ఖరారైనా, పుల్వామా ఘటనకు వైమానిక దళం ద్వారా ప్రతీకారం తీర్చుకోవాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఐఏఎఫ్ అధికారులకు సమాచారం అందినట్లు భావిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఒక రిహార్సల్‌లా ఉపయోగించుకుని పుల్వామా ఘటనకు కారణమైన జైషే మొహమ్మద్ ఉగ్ర సంస్థపై దాడులకు పాల్పడాలని ప్రణాళికలు రచించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి సంకేతాలు రాగానే భారత్–పాక్ నియంత్రణ రేఖ అవతలి వైపున గగనతలంలో దాడులు నిర్వహించేలా వాయుశక్తి కార్యక్రమంలో మార్పులు జరిగినట్లు తెలిసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు తగిన సమయంలో ప్రతీకార చర్యకు దిగుతామని వైమానిక దళ చీఫ్ బీఎస్ ధనోవా ఈ సందర్భంగా ప్రకటించడం ఈ వాదనలకు బలం చేకూరుస్తోంది. నాడు బాలాకోట్ శిబిరంలో 300 మొబైల్స్ యాక్టివ్ బాలాకోట్‌లో మృతి చెందిన ముష్కరులకు సంబంధించిన సాక్ష్యాధారాలు చూపించాలని రాజకీయ పక్షాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ది నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఎన్టీఆర్వో) ఆసక్తికర విషయాలను వెల్లడించింది. బాలాకోట్‌లో జైషే మహమ్మద్ ఉగ్రవాద స్థావరాలపై దాడులకు దిగడానికి ముందు ఆ ప్రదేశంలో నిఘా ఉంచగా 300 మొబైల్ ఫోన్లు పనిచేస్తున్నట్టుగా తమకు సిగ్నల్స్ అందాయని, అంటే ఆ సమయంలో స్థావరంలో అందరు ఉగ్రవాదులు ఉన్నట్టుగా తమకు అర్థమైందని ఆ సంస్థ అధికారి తెలిపారు. ‘ఫిబ్రవరి 26న భారత వాయుసేన నుంచి దాడులకు గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే ఆ ప్రాంతం మొత్తాన్ని సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి జల్లెడ పట్టాం. దాదాపుగా 300 మొబైల్స్ అక్కడ వాడుతున్నట్టుగా మాకు సిగ్నల్స్ అందాయి. ఇదే విషయాన్ని వైమానిక దళం దృష్టికి తీసుకువెళ్లాం. దీంతో ఐఏఎఫ్ జవాన్లు మొదట ఆ ఫోన్ సిగ్నల్స్‌ని నాశనం చేశారు. ఆ తర్వాత వెయ్యి కేజీల బరువైన బాంబుల్ని ప్రయోగించారు’ అని ఆ అధికారి చెప్పారు. ‘దాడులకు ముందు ఎన్టీఆర్వో, భారత నిఘా కూడా ఉగ్రవాద స్థావరాల్లో ఉన్న సదుపాయాలపై ఒక అంచనాకు వచ్చింది. ఆ తర్వాతే దాడులకు దిగింది’ అని అధికారి వివరించారు. -
కశ్మీర్లో ముగ్గురు మిలిటెంట్లు హతం
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు జైషే మహ్మద్ మిలిటెంట్లు హతమయ్యారు. ఆ వెంటనే సంఘటనా స్థలంలో మిలిటెంట్లు పెట్టిన బాంబులు పేలడంతో ఏడుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. లారూ ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కున్నారన్న సమాచారం అందడంతో ఆదివారం భద్రతా బలగాలు అక్కడ తనిఖీలను ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య చోటుచేసుకున్న ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు చనిపోయారని పోలీస్ అధికారులు వెల్లడించారు. ఎన్కౌంటర్ ముగిశాక భద్రతాదళాలు పాక్షికంగా అక్కడి నుంచి వెనుదిరగ్గా, పౌరులు సంఘటనాస్థలంలో గుమిగూడారు. అప్పటికే అక్కడ మిలిటెంట్లు పెట్టిన బాంబులు పేలడంతో ఏడుగురు మృత్యువాతపడగా, పలువురు గాయాలపాలయ్యారని అధికారులు చెప్పారు. అనంతరం, భద్రతా బలగాలు, స్థానిక యువకుల మధ్య తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్నాయి. అల్లర్లను అదుపుచేసేందుకు పోలీసులు బలప్రయోగానికి దిగడంతో పదుల సంఖ్యలో పౌరులు గాయపడ్డారు. మరోవైపు, రాజౌరీ జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద ఇద్దరు పాకిస్తాన్ చొరబాటుదారులను భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. ఇరువర్గాల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు భారత సైనికులు కూడా మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. -
పార్లమెంటుకు బాంబు బూచి
న్యూఢిల్లీ: అసలే జైషే మహ్మద్ ఉగ్రవాదులు ఢిల్లీలోకి ప్రవేశించారన్న ఇంటెలి జెన్స్ హెచ్చరికలతో.. అప్రమత్తంగా ఉన్న దేశరాజధాని పోలీసులను.. మంగళవారం ఓ ఫోన్‌కాల్ పరుగులు పెట్టించింది. పార్లమెంటు సమీపంలో బాంబు పెట్టినట్లు ఓ ఆకతాయి ఫోన్ కాల్ చేయటంతో ఢిల్లీలో పోలీసులు పరుగులు పెట్టారు. ఈశాన్య ఢిల్లీలోని జ్యోతి నగర్‌నుంచి వచ్చిన ఈ కాల్‌ను విశ్లేషించిన పోలీసులు.. కాల్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.