
సాక్షి, న్యూఢిల్లీ: ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకశ్మీర్ పునర్వ్యస్థీకరణ నేపథ్యంలో ఉగ్రవాదులు భారత్‌లో భారీ విధ్వంసానికి కుట్ర పన్నుతున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. అమెరికా మాదిరే భారత్‌లో కూడా 26/11 తరహా దాడులు చేసేందుకు పథకం పన్నుతున్నారని ఇంటిలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. జమ్మూకశ్మీర్‌లో ఆత్మాహుతి దాడితోపాటు దేశవ్యాప్తంగా 30 చోట్ల పేలుళ్లకు కుట్ర పన్నినట్లు సమాచారం. ఈ క్రమంలో ఇప్పటికే 10 మంది జైషే ఉగ్రవాదులు భారత్‌లో చొరబడినట్లు నిఘా వర్గాలు తెలిపాయి. ఇంటిలెజన్స్ వర్గాల హెచ్చరికల నేపథ్యంలో పఠాన్ కోట్, జమ్మూకశ్మీర్, శ్రీనగర్‌లో ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించారు. రాష్ట్రాలను అప్రమత్తం చేయడమే కాక.. భద్రతను కట్టుదిట్టం చేయాలని సూచించాయి.