మిమ్మల్ని సొంత వాళ్లలా చూసుకుంటాం
మిమ్మల్ని విదేశీయుల్లా పాక్ భావిస్తోంది
జమ్మూకశ్మీర్‌లో ఎన్నికల ప్రచారంలో రాజ్‌నాథ్ సింగ్
జమ్మూ/బనిహాల్: జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం రామ్‌బాన్ నియోజకవర్గంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ ఎన్నికల ర్యాలీలో మాట్లాడారు. ‘‘ ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్‌లో భద్రతా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇక్కడి యువత పిస్టల్, రివాల్వర్ పట్టుకోవడం వదిలేసి ల్యాప్‌టాప్ పట్టుకుంటున్నారు. కంప్యూటర్లు వినియోగిస్తున్నారు. బీజేపీకి మద్దతు పలికితే తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి ఇక్కడ మరింత అభివృద్ధిని సాకారం చేస్తాం. ఇక్కడి అభివృద్ధిని చూసి పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) ప్రజలు సైతం భారత్‌తో కలిసిపోతే బాగుంటుంది అని ఖచ్చితంగా అనుకుంటారు.
నాదీ గ్యారెంటీ’’ అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. పీఓకే ప్రజలను భారత్‌లో విలీనానికి పిలుపునిచ్చారు. ‘‘ పీఓకే ప్రజలకు నేను చెప్పేదొకటే. పాకిస్తాన్ మిమ్మల్ని విదేశీయుల్లా భావిస్తోంది. పాక్ ప్రభుత్వం స్వయంగా ఈ విషయం ఒప్పుకుందికూడా. ఇటీవల పాక్ అదనపు సొలిసిటర్ జనరల్ ఒక విషయంలో సమర్పించిన అఫిడవిట్‌లో పీఓకే అనేది ఎప్పటికీ పాక్‌కు విదేశీ భూభాగమే అని స్పష్టంగా పేర్కొన్నారు. మిమ్మల్ని భారత్ తన సొంత మనుషుల్లా చూసుకుంటుంది. అందుకే రండి. మాతో కలవండి’’ అని రాజ్‌నాథ్ పిలుపునిచ్చారు.
ఉగ్రవాదం ఆపేస్తే చర్చలకు సిద్ధం
జమ్మూకశ్మీర్‌లో పాక్ ఉగ్రవాదాన్ని ఎగదోయడం పూర్తిగా ఆపేస్తే ఆ దేశంతో చర్చలకు భారత్ సిద్ధమని రాజ్‌నాథ్ ప్రకటించారు. ‘‘ ఉగ్రవాదానికి మద్దతు పలకడం అనే చెడ్డపనిని పాక్ ఆపేయాలి. పొరుగు దేశాలతో సత్సంబంధాల మెరుగు కోసం ప్రతి దేశం ప్రయత్నిస్తుంది. ఎందుకంటే మనం మన మిత్రుడిని మార్చుకోగలంగానీ పొరుగు దేశాన్ని కాదుకదా. పాక్‌తో బంధం బలపడాలనే కోరుకుంటున్నాం. ముందుగా పాక్ ఉగ్రవాదాన్ని వీడాలి. ఉగ్రవాదాన్ని కశ్మీర్‌లో ఆపినప్పుడే చర్చలు పట్టాలెక్కుతాయి. ఇక్కడ ఉగ్రవాదం కోరల్లో చిక్కుకున్న వారిలో 85 శాతం మంది ముస్లింలే ఉన్నారు. ఉగ్రఘటనల్లో ముస్లింలే ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే ఉగ్రవాదం బాటలో పయనించి ప్రాణాలు పోగొట్టుకోకండి’’ అని రాజ్‌నాథ్ హితవు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment