
బిహార్ ఓటరు తుది జాబితా విడుదల చేసిన ఈసీ
7.89 కోట్ల నుంచి 7.42 కోట్లకు తగ్గిన రాష్ట్ర ఓటర్లు
రాజధాని పట్నాలో కొత్తగా 1.63 లక్షల మంది
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మంగళవారం ఎన్నికల కమిషన్ రాష్ట్ర ఓటర్ల తుది జాబితాను విడుదల చేసింది. ముసాయిదా జాబితాలో 7.89 కోట్ల మంది ఓటర్లుండగా, తుది జాబితాలో ఓటర్ల సంఖ్య 7.42 కోట్లకు తగ్గింది. అంటే, ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్‌ఐఆర్) ముగిశాక 47 లక్షల మంది పేర్లు తొలగింపునకు గురయ్యాయి.
ఎస్‌ఐఆర్‌లో భాగంగా ప్రచురించిన ముసాయిదా ఓటరు జాబితాపై అందిన అభ్యంతరాలు, దరఖాస్తులను ఇందులో పరిగణనలోకి తీసుకున్నామని ఈసీ తెలిపింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టిన అనంతరం తుది ఓటరు జాబితాను 30.09.2025న విడుదల చేసినట్లు బిహార్ చీఫ్ ఎలక్టోరల్ అధికారి ఫేస్‌బుక్ పేజీలో ప్రకటించారు. voters. eci. gov. in అనే లింకుపై క్లిక్ చేయడం ద్వారా ఓటర్లు జాబితాలో తమ పేర్లను చూసుకోవచ్చని పేర్కొన్నారు.
జూన్ 24వ తేదీన విడుదల చేసిన రాష్ట్ర జాబితాలో 7.90 కోట్ల ఓటర్లున్నారు. పేర్కొన్న చిరునామాలో లేకపోవడం, వేరే చోటుకు వెళ్లిపోవడం, మృతి చెందడం వంటి కారణాలతో 65 లక్షల మందిని తొలగించాక ఆగస్ట్ ఒకటో తేదీన విడుదల చేసిన ముసాయిదాలో 7.24 కోట్లకు తగ్గాయి. తుది జాబితాలో 21.53 లక్షల ఓటర్ల పేర్లను కొత్తగా చేర్చి, 3.66 లక్షల పేర్లను తొలగించారు.
దీంతో, సెప్టెంబర్ 30న విడుదల చేసిన ఫైనల్ లిస్టులో ఓటర్ల సంఖ్య 7.42 కోట్లుగా ఉంది. అయితే, తమ పరిధిలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముసాయిదా జాబితాతో పోలిస్తే 1.63 లక్షల మంది ఓటర్లు కొత్తగా చేరారని, మొత్తం ఓటర్ల సంఖ్య 48.15 లక్షలకు చేరుకుందని పట్నా జిల్లా యంత్రాంగం వెల్లడించింది. పట్నా జిల్లాలో 22.75 లక్షల మంది మహిళా ఓటర్లున్నట్లు వివరించింది. అత్యధికంగా దిఘా నియోజకవర్గంలో 4.56 లక్షల మంది మహిళా ఓటర్లు ఉన్నారని తెలిపింది.
వివాదాస్పదంగా ఎస్‌ఐఆర్
బిహార్‌లో దాదాపు 22 ఏళ్ల తర్వాత చేపట్టిన ఎస్‌ఐఆర్ ప్రక్రియపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేయడం తెల్సిందే. ఓటరు జాబితాను అధికార ఎన్డీయేకు అనుకూలంగా మార్చుకునేందుకే ఈసీతో కలిసి బీజేపీ ఈ విధానాన్ని తీసుకువచ్చిందని సుప్రీంకోర్టుకు సైతం వెళ్లాయి. ఓట్ చోరీ జరిగిందని ఆరోపిస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ కలిసి రాష్ట్రంలో ఓటర్ అధికార్ యాత్రను సైతం చేపట్టారు. అధికార పక్షం, ఈసీ మాత్రం ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించాయి.
4న పట్నాకు ఈసీ
ఓటరు జాబితా ఖరారు కావడంతో ఎన్నికల నిర్వహణకు ఈసీ సమాయత్త మవుతోంది. ఇందులో భాగంగా, ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, కమిషనర్లు ఎస్ ఎస్ సంధు, వినీత్ జోషిలతో కలిసి అక్టోబర్ 4, 5వ తేదీల్లోపట్నా వెళ్లి ఎన్నికల సన్న ద్ధతను సమీక్షించనున్నారు. పౌరసంఘాలు, రాజకీ య పార్టీల నేతలు, అధికారులతో సమావే శమవనున్నారు. అంతకుముందు ఎన్నికల పరిశీలకులతో 3న సమావేశం ఏర్పా టు చేశారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల తేదీల ను 6, 7వ తేదీల్లో ఎన్నికల సంఘం త్వరలోనే ప్రకటించే అవకాశాలు కన్పిస్తున్నాయి.
ఇదీ చదవండి:
తమిళనాట పట్టుకోసం బీజేపీ ఎత్తు