బిహార్‌ టైమ్‌ వస్తుందా? | Sakshi Guest Column On Bihar Assembly Elections, Women Voters | Sakshi
Sakshi News home page

బిహార్‌ టైమ్‌ వస్తుందా?

Oct 30 2025 12:18 AM | Updated on Oct 30 2025 12:18 AM

Sakshi Guest Column On Bihar Assembly Elections, Women Voters

బిహార్‌ జనాభాలో దాదాపు పాతిక శాతం మంది వలసపోక తప్పని స్థితిలో ఉన్నారు. రాష్ట్రంలో వస్తూత్పత్తి పరిశ్రమ ఒక్కటి కూడా పెద్దది లేకపోవడం ఉద్యోగాలు కొరవడటానికి ప్రధాన కారణం. ప్రస్తుత ఎన్నికల ప్రచా రంలో ఉద్యోగావకాశాలు ప్రధానాంశంగా మారాయంటే ఆశ్చర్యపోవాల్సింది ఏమీ లేదు.

విశ్లేషణ

మొదట, మనం 20వ శతాబ్దపు చివరి దశాబ్దంలోకి వెళదాం. ఒకరోజు ఇద్దరు సహోద్యోగులతో కలిసి పట్నా నుంచి ధన్‌బాద్‌కు వెళ్తున్నాను. శీతకాలంలో సూర్య కాంతి కూడా మసకగానే ఉంది. అపుడు నా కంటపడిన దృశ్యాన్ని తలచుకుంటే ఇప్పటికీ నా మనసు కలుక్కుమంటూనే ఉంటుంది. చీర చుట్టుకున్న ఓ మహిళ గజగజ వణికిస్తున్న చలిలో ఒక మురికి కుంటలోకి దిగబోతోంది. స్నానం చేసిన తర్వాత కట్టుకునేందుకు, బహుశా మరో చీర లేదనుకుంటా! రోడ్డు మీద వెళుతున్న వాహనాలలోని వ్యక్తులు ఆమె వంక చూపులు సంధిస్తున్నారు. ఆమె సంకోచాన్ని నేను అర్థం చేసుకున్నాను. అటువైపు చూడకుండా ఉండే ప్రయత్నంలో ఉన్నాను. కానీ, ఆ తర్వాత చూసిన దృశ్యం మా ఇబ్బందిని మరింత పెంచింది. ఆమె నెమ్మదిగా తుంటిపై కూర్చుని అదే కుంటలోని నీటితో నోటిని పుక్కిలించడం మొదలుపెట్టింది. 

కాలం తెచ్చిన మార్పు
ఆ తర్వాత కాలగతిలో ఎన్నో పరిణామాలు సంభవించాయి. బిహార్‌ రెండు రాష్ట్రాలుగా పునర్వ్యవస్థీకృతమైంది. ధన్‌బాద్‌ ఇపుడు జార్ఖండ్‌లో భాగమైంది. బిహార్‌ మహిళల స్థితిగతులలో సమూలమైన మార్పు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం, సమాజం రెండింటి ప్రమేయం... మహిళలు పెద్ద అంగ వేసేందుకు సాయ పడిందని ప్రభుత్వ డేటా సూచిస్తోంది. బిహార్‌లో మహిళా అక్షరాస్యత రేటు 2000 సంవత్సరంలో 33%గా ఉన్నది నేడు 73.91%కి చేరినట్లు అంచనా. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో వనితలకు 35% రిజర్వేషన్‌ కల్పించడంతో, కార్యాలయాల్లో పురుషులు–మహిళల నిష్పత్తి మెరుగుపడింది. నేడు పోలీసు శాఖలో మహిళలు 37%గా ఉన్నారు. అలాగే, మహిళా ఉపాధ్యాయుల సంఖ్య 2,61,000గా ఉంది. బిహార్‌ స్త్రీలు నేడు కలం, పిస్తోలు రెండింటినీ ఝళిపి స్తున్నారు. 

ఇక క్రియాశీల స్వయం సహాయక బృందాలు బిహార్‌లో 10.6 లక్షల మేరకు ఉంటాయి. వీటి ద్వారా 1.45 కోట్ల మంది మహిళలు తమ వ్యక్తిగత ఆర్థిక విజయాలను సాధిస్తున్నారు. తమ కలలను సాకారం చేసుకునేందుకు ఈ మహిళలు బ్యాంకుల నుంచి మొత్తం రూ. 15,000 కోట్ల రుణాన్ని స్వీకరించారు. రుణాలను తీర్చడంలో కూడా వారి రికార్డు పురుషుల కన్నా మెరుగ్గా 99%గా ఉంది. మనకు 1980లు, 1990ల నాటి దురదృష్టకర దృశ్యాలు ఇపుడు కనిపించకపోవడానికి అదే కారణం. గడచిన 2015, 2020 ఎన్నికల్లో 60% మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వారు ఒక శక్తిమంతమైన ఓటు బ్యాంకుగా రూపుదిద్దుకున్నారని అది సూచి స్తోంది. ప్రతి రాజకీయ పార్టీ వారిని బుట్టలో వేసుకునేందుకు ప్రయత్నించడానికి అదే కారణం. అయితే, ఇదంతా నాణానికి ఒక వైపు మాత్రమే! 

ఒక్క పరిశ్రమా లేక...
మహిళా సాధికారత ఉన్నప్పటికీ, వారి కుమారులు, భర్తలు, కుటుంబంలోని ఇతర సభ్యులు పొట్ట చేతపట్టుకుని వలసపోక తప్పని పరిస్థితులు నేటికీ ఉన్నాయి. ఈ నిస్సహాయ స్థితి నేపథ్యంలో అభివృద్ధికి సంబంధించిన అన్ని సంకేతాలూ వెలతెల పోతున్నాయి. 

రాష్ట్రంలో వస్తూత్పత్తి పరిశ్రమ ఒక్కటి కూడా పెద్దది లేక పోవడం  ఉద్యోగాలు కొరవడటానికి ప్రధాన కారణం. రాష్ట్రంలో వ్యవసాయ కమతాల పరిమాణం కూడా కుంచించుకుపోతోంది. తరచూ అతివృష్టి, అనావృష్టితో పెద్ద సంఖ్యలో రైతులు వ్యవసాయా నికి దూరం జరుగుతున్నారు. ప్రస్తుతం సాగుతున్న భారీ మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో తనకంటూ చెప్పుకోతగినవి రాష్ట్రానికి పెద్దగా ఏమీ లేవు. 

చిన్న, మధ్య తరహా పరిశ్రమలు కుప్పుకూలుతున్నాయి. వస్తూత్పత్తి, మౌలిక వసతుల కల్పన రంగాల నుంచే దేశంలో 80% ఉద్యోగావకాశాలు వస్తున్న సంగతిని మరచిపోకూడదు. వీటన్నింటి వల్ల దాదాపు 3 కోట్ల మంది అంటే రాష్ట్ర జనాభాలో దాదాపు పాతిక శాతం  ఉపాధి నిమిత్తం వలసపోక తప్పని స్థితిలో ఉన్నారు. ప్రస్తుత బిహార్‌ ఎన్నికల ప్రచారంలో ఉద్యోగావకాశాలు ప్రధానాంశంగా మారాయంటే ఆశ్చర్యపోవాల్సింది లేదు. 

వలసలు ఆగేనా?
ఛఠ్‌ పూజ కోసం గ్రామాలకు తిరిగి వచ్చిన వారితో మాట్లాడిన వాటిల్లో కేవలం రెండు ఉదంతాల గురించి ప్రస్తావిస్తాను. వారి బాధ మొత్తం బిహారీ యువత ఆవేదనకు అద్దం పడుతుంది. బెంగళూరులోని ఒక చాక్లెట్‌ ఫ్యాక్టరీలో మాధేపురాకు చెందిన గంగారామ్‌ పనిచేస్తున్నారు. బిహార్‌ వదిలి ఎందుకు బయటకు వెళ్ళి పోవాల్సి వచ్చిందని అడిగినప్పుడు – ‘‘బిహార్‌లో ఒక్క ఫ్యాక్టరీ కూడా లేదు. ఏ పనీ దొరకదు. పొట్ట నింపుకొని, కుటుంబాన్ని పోషించుకునేందుకు మేం బయటకు వెళ్ళక తప్పింది కాదు. బయటకు వెళ్ళాలనే ఉద్దేశం మాకేమీ లేదు. 

ఇక్కడే పని దొరికితే మేం ఇల్లు విడిచి ఎందుకు వెళతాం?’’ అని ఆయన అన్నారు. తదు పరి ప్రశ్న కోసం ఎదురు చూడకుండా గంగారామ్‌ ఇంకా ఇలా చెప్పారు: ‘‘సంపాదించాల్సిన వయసు రాగానే మేం రాష్ట్రం విడిచి పెట్టేస్తున్నాం. దాంతో కుటుంబంతో, సమాజంతో మా అనుబంధాలు బలహీనమవుతున్నాయి. రెండేళ్ళ కొకసారి మేం ఇంటి ముఖం చూస్తున్నాం. తిరిగి బయలుదేరుతున్నపుడు, ఎన్నాళ్ళు ఇలా అయినవాళ్ళకి దూరంగా ఉంటాం అనిపిస్తుంది. వేరే రాష్ట్రా లలో మాకు మంచి మర్యాద కూడా దక్కదు’’.

కొత్త ప్రభుత్వం నుంచి ప్రజలు ఏమి కురుకుంటున్నారనే ప్రశ్నకు ముంబయిలో ఉద్యోగం చేస్తున్న సంజయ్‌ చంద్రవంశీ ఇలా చెప్పారు: ‘‘ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేసినా వారు తమ శక్తియుక్తులన్నింటినీ, రాష్ట్రంలో ఉద్యోగావకాశాలు కల్పించడంపై పెట్టాలి. బిహార్‌లో ఫ్యాక్టరీలు నెలకొంటే, నాలాంటి లక్షల మంది ఢిల్లీ, ముంబయి, సూరత్‌ లేదా బెంగళూరు వంటి చోట్లకు వెళ్ళా ల్సిన అవసరం ఉండదు. మేం ఉన్నచోటే ఉద్యోగం దొరక్కపోవచ్చు కానీ, కనీసం రాష్ట్రంలో ఉంటాం కదా!’’ 

రోటీ ఔర్‌ రోజ్‌గార్‌ (తిండి, ఉద్యోగం) అని గొంతు చించుకుంటున్న నాయకులు, ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత, నిర్మాణాత్మక వైఖరిని చేపడతారా? శుష్క వాగ్దానాల బదులు, పరిష్కారాల కోసం బిహారీలు ఎదురు చూస్తున్నారు. చాలా కాలం క్రితం, పట్నాలో ఓ యువతి నన్ను అడిగింది: ‘క్యా అబ్‌ బిహార్‌ కీ బారీ హై?’ (ఈసారైనా బిహార్‌ వంతు వస్తుందా?) వెలుగు కోసం బిహార్‌ ఎదురు చూపులు కొనసాగుతూనే ఉన్నాయి.


శశి శేఖర్‌
వ్యాసకర్త సీనియర్‌ సంపాదకుడు
(‘ద హిందుస్థాన్‌ టైమ్స్‌’ సౌజన్యంతో) 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement