
సూరత్: ఉగ్రవాదాన్ని ప్రేరేపించడం పాకిస్తాన్ విడనాడాలని, లేకుంటే ఆ దేశం ముక్కలు కాకుండా ఎవరూ అడ్డుకోలేరని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. విధి నిర్వహణలో నేలకొరిగిన 122 మంది అమర సైనికుల కుటుంబాలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘పాకిస్తాన్‌ను వేరే ఎవరూ విడదీయాల్సిన అవసరం లేదు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం ఆపకుంటే ఆ దేశం తనంత తానే ముక్కలవుతుంది’అని వ్యాఖ్యానించారు. భారత్‌లో మైనారిటీలు సురక్షితంగా ఉన్నారు..ఉంటారు అని స్పష్టం చేశారు. మతం, కులం ప్రాతిపదికన దేశం చీలిపోదని తెలిపారు.
మన సైన్యం సరిహద్దుల్లో అప్రమత్తంగా ఉందని, నియంత్రణ రేఖను దాటి వచ్చే పాక్ సైనికులు మళ్లీ తిరిగి వెళ్లలేరని స్పష్టం చేశారు. అందుకే పాక్ ప్రధాని ఇమ్రాన్ తమ ప్రజలను ఎల్‌వోసీ దాటి వెళ్లవద్దని హెచ్చరించారన్నారు. శుక్రవారం ముజఫరాబాద్‌లో జరిగిన సభలో ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ..‘నేను చెప్పే వరకు ఎల్‌వోసీ దాటి వెళ్లకండి’అంటూ ప్రజలను కోరడంపై ఆయన పైవిధంగా వ్యాఖ్యానించారు. ఆర్టికల్ 370 రద్దును జీర్ణించుకోలేని పాక్ ఐరాసను పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించిందని, అయితే ఆ దేశాన్ని అంతర్జాతీయ సమాజం నమ్మబోదన్నారు. అనంతరం మంత్రి రాజ్‌నాథ్..మారుతీ వీర్ జవాన్ ట్రస్ట్ తరఫున ఒక్కో వీర సైనికుని కుటుంబానికి రూ.2.5 లక్షల సాయం అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment