శ్రీనగర్: జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఆఖరి రోజైన శుక్రవారం కూడా ఆందోళనల మధ్యే కొనసాగింది. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరుగుతున్న చర్చకు బీజేపీ సభ్యులు అడ్డుపడ్డారు. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని పునరుద్ధరించాలంటూ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలంటూ నినాదాలతో హోరెత్తించారు. గొడవకు దిగిన ఎమ్మెల్యేలను స్పీకర్ ఆదేశాలతో మార్షల్స్ బలవంతంగా బయటకు తీసుకెళ్లారు.
లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు సమాధానమిస్తూ శుక్రవారం సీఎం ఒమర్ అబ్దుల్లా.. జమ్మూకశ్మీర్‌కు పూర్తి రాష్ట్ర హోదా పునరుద్ధరణ ప్రక్రియను కేంద్రం త్వరలోనే ప్రారంభిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర పాలిత ప్రాంత హోదాతో పరిమిత అధికారాలతో అభివృద్ధిని, శాంతిభద్రతలను సాధించలేమని చెప్పారు. సమావేశాల సందర్భంగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన బీజేపీ శాసనసభా పక్షం నేత సునీల్ శర్మతోపాటు ఆ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలపై ఎన్‌సీ ఎమ్మెల్యే సజ్జాద్ షహీన్, మరొకరు హక్కుల తీర్మానం ప్రవేశపెట్టారు. వీటిని పరిశీలించి చర్యలు తీసుకుంటానని స్పీకర్ రథేర్ చెప్పారు. అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment