special statas
-
మణిపూర్‌లో భీకర హింస
ఇంఫాల్: మణిపూర్‌లో హింస ప్రజ్వరిల్లింది. తమకు షెడ్యూల్డ్ కులాల(ఎస్టీ) హోదా కల్పించాలని రాష్ట్ర జనాభాలో 53 శాతం ఉన్న మైతీ వర్గం డిమాండ్ చేయడం అగ్గి రాజేసింది. గిరిజనులు భగ్గుమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఇళ్లు, దుకాణాలు, వాహనాలకు నిప్పుపెట్టారు. ప్రార్థనా మందిరాలపై దాడి చేశారు. గిరిజనేతరులతో ఘర్షణకు దిగారు. ఈ హింసాకాండలో పలువురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి 55 పటాలాల సైన్యంతోపాటు అస్సాం రైఫిల్స్ జవాన్లను ప్రభుత్వం గురువారం రంగంలోకి దించింది. మరో 14 పటాలాల సైన్యాన్ని సిద్ధంగా ఉంచినట్లు అధికారులు వెల్లడించారు. మైతీ వర్గం అధికంగా ఉన్న దక్షిణ ఇంఫాల్, కాక్చింగ్, థౌబాల్, జిరిబామ్, బిష్ణుపూర్ జిల్లాలతోపాటు గిరిజన ప్రాబల్యం కలిగిన చురాచాంద్‌పూర్, కాంగ్పోక్పీ, తెంగౌన్పాల్ జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. రాష్ట్రవ్యాప్తంగా మొబైల్ ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. చురాచాంద్‌పూర్, మంత్రిపుఖ్రీ, లాంఫెల్, కొయిరంగీ, సుగ్ను తదితర ప్రాంతాల్లో అస్సాం రైఫిల్స్ జవాన్లు ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించారు. సమస్మాత్మక ప్రాంతాల్లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్(ఆర్ఏఎఫ్) సిబ్బంది మోహరించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్.బీరెన్ సింగ్‌తో ఫోన్లో మాట్లాడారు. తాజా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రమంతటా పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఎప్పుడేం జరుగుతుందో తెలియక అందోళన చెందుతున్నారు. అధికారులు ఇప్పటిదాకా 9,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బాధితులకు ఆశ్రయం కల్పిస్తున్నారు. ఘర్షణలను నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం ‘కనిపిస్తే కాల్చివేత’ ఉత్తర్వులు జారీ చేసింది. అక్రమ వలసల వల్లే.. మైతీలు ప్రధానంగా మణిపూర్ లోయలో నివసిస్తున్నారు. మయన్మార్, బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసల కారణంగా తాము ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నామని, తమకు ఎస్టీ హోదా కల్పించాలని వారు కోరుతున్నారు. వలసదారుల నుంచి గిరిజనులకు చట్టప్రకారం కొన్ని రక్షణలు ఉన్నాయి. మైతీలకు ఎస్టీ హోదాపై రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సును నాలుగు వారాల్లోగా కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని గత నెలలో మణిపూర్ హైకోర్టు సూచించింది. దీనిపై గిరిజనులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అపార్థం వల్లే అనర్థం: సీఎం రాష్ట్రంలో శాంతి భద్రతలకు ప్రజలంతా సహకరించాలని ముఖ్యమంత్రి ఎన్.బీరెన్ సింగ్ విజ్ఞప్తి చేశారు. అమాయకులు మృతి చెందడం, ఆస్తులు ధ్వంసం కావడం బాధాకరమని పేర్కొన్నారు. కేవలం అపార్థం వల్లే ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగిందని చెప్పారు. రాష్ట్రంలో శాంతిని నెలకొల్పేందుకు అన్ని చర్యలూ చేపట్టామని తెలిపారు. మణిపూర్‌లో హింసాకాండపై పొరుగు రాష్ట్రం మిజోరాం ముఖ్యమంత్రి జోరాంథాంగా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో త్వరగా శాంతి నెలకొనాలని ఆకాంక్షించారు. గిరిజన సంఘీభావ యాత్ర గిరిజనేతరులైన మైతీ వర్గానికి ఎస్టీ హోదా కల్పించాలన్న డిమాండ్‌ను వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా 10 జిల్లాల్లో ఆల్ ట్రైబల్ స్టూడెంట్ యూనియన్ మణిపూర్(ఏటీఎస్యూఎం) ఆధ్వర్యంలో గిరిజనులు బుధవారం ‘గిరిజన సంఘీభావ యాత్ర’ నిర్వహించారు. ఈ సందర్భంగా మైతీలకు, గిరిజనులకు నడుమ ఘర్షణ మొదలయ్యింది. రాత్రికల్లా తీవ్రస్థాయికి చేరింది. హింస చోటుచేసుకుంది. తొలుత చురాచాంద్‌పూర్ జిల్లాలో మొదలైన ఘర్షణ, హింసాకాండ క్రమంగా రాష్ట్రమంతటికీ విస్తరించింది. -
అసాధ్యాలను సుసాధ్యం చేసిన మోదీ: అమిత్ షా
సిమ్లా: ఆర్టికల్ 370 రద్దు, రామ మందిర నిర్మాణం సహా గతంలో అందరూ అసాధ్యమని భావించిన వాటిని నరేంద్ర మోదీ ప్రభుత్వం సుసాధ్యం చేసి చూపిందని హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రం సిర్మౌర్ జిల్లాలో శనివారం జరిగిన బీజేపీ ఎన్నికల ర్యాలీలో మంత్రి ప్రసంగించారు. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దవుతుందని మీలో ఎవరైనా ఊహించారా? అంటూ హాజరైన వారినుద్దేశించి ఆయన ప్రశ్నించారు. జవహర్ లాల్ నెహ్రూ తీసుకువచ్చిన ఆర్టికల్ 370ను గురించి ఎవరైనా ప్రశ్నిస్తే కాంగ్రెస్ నాయకులు మిన్నకుండి పోతారని ఎద్దేవా చేశారు. అయోధ్యలో మందిర నిర్మాణం అసాధ్యమని కాంగ్రెస్ పెదవి విరిస్తే తాము బృహత్ రామాలయం పనులను ప్రారంభించామని చెప్పారు. ‘వంశ రాజకీయాలకు ప్రధాని మోదీ ముగింపు పలికారు. ఢిల్లీలోని రాజ్‌పథ్‌కు కర్తవ్యపథ్గా పేరు పెట్టి, సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు’అని అమిత్ షా అన్నారు. ప్రపంచంలోని ఆర్థిక వ్యవస్థల్లో 11వ స్థానంలో ఉన్న భారత్.. మోదీ నాయకత్వంలో ఐదో స్థానానికి చేరుకుందని ఆయన పేర్కొన్నారు. -
ఏపీకి ప్రత్యేక హోదా కోసం రాజ్యసభలో ఎంపీ విజయసాయిరెడ్డి పోరాటం
-
వైఎస్ఆర్సీపీ కృషి వల్లే ప్రత్యేక హోదా పరిశీలిస్తోంది: ఎమ్మెల్యే అంబటి
-
త్రిసభ్య కమిటీ అజెండాలో కీలక అంశాలు
-
కేంద్ర హోంశాఖ అజెండాలో ప్రత్యేకహోదా
-
ఏపీ ప్రత్యేక హోదా అంశం: చర్చలకు రావాలని కేంద్ర హోంశాఖ ఆహ్వానం
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ ఎంజెండాలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చారు. ఈ మేరకు ఏపీ ప్రత్యేక హోదా అంశంపై ఈ నెల 17న చర్చలకు రావాలని రాష్ట్రానికి కేంద్ర హోం శాఖ ఆహ్వానం పంపించింది. కేంద్ర హోం శాఖ జాయింట్ సెక్రటరీ నేతృత్వంలో ఏపీ, తెలంగాణ ఉన్నతాధికారులతో త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసింది. త్రిసభ్య కమిటీలో ఏపీ నుంచి ఎస్ఎస్ రావత్, తెలంగాణ నుంచి రామకృష్ణా రావు ఉన్నారు. ఈ నెల 17న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమై 9 అంశాలపై చర్చ జరుపుతారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని పార్లమెంట్లో వైఎస్సార్సీపీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చిన విషయం తెలిసిందే. ఇటీవలే ప్రధాని నరేంద్రమోదీని కలిసి ఏపీ సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అదే విధంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రధాని మోదీకి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పలుమార్లు విజ్ఞప్తి చేసిన సంగతి విదితమే. ప్రత్యేక హోదా ఇవ్వాలని వైఎస్సార్ కాంగెస్ పార్టీ చాలా రోజులుగా డిమాండ్ చేస్తూ వస్తోంది. జనవరి మొదటివారంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రధాని మోదీని కలిసి ఏపీ ప్రత్యేక హోదాతో పాటు, రాష్ట్ర విభజన సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. త్రిసభ్య కమిటీ ఎజెండాలో 9 అంశాలు... ఎజెండా1: ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజన ఎజెండా 2: ఏపీ- తెలంగాణ మధ్య విద్యుత్ వినియోగ సమస్యపై పరిష్కారం ఎజెండా 3: పన్ను అంశాలపై తలెత్తిన వివాదాల పరిష్కారం ఎజెండా 4: రెండు రాష్టాలకు సంబంధించిన బ్యాంకులో ఉన్న నగదు, డిపాజిట్లు ఎజెండా 5: ఏపీఎస్సీఎస్సీఎల్, టీఎస్సీఎస్సీఎల్ మధ్య నగదు ఖాతాల విభజన ఎజెండా 6: ఏపీ-తెలంగాణ మధ్య వివిధ వనరుల పంపిణీ ఎజెండా 7: ఉత్తరాంధ్ర, రాయలసీమ వెనుకబడిన 7 జాల్లాలకు ప్రత్యేక గ్రాంట్లు ఎజెండా 8: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఎజెండా 9: రెండు రాష్ట్రాలకు సంబంధించిన పన్ను రాయితీలు -
విభజన చట్టంలోని హామీలన్నీ అమలు చేయాలి: మోపిదేవి
సాక్షి, న్యూఢిల్లీ: విభజన చట్టంలోని హామీలన్నీ కేంద్రం అమలు చేయాలని వైఎస్సార్సీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ అన్నారు. మంగళవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలు ఆమోదించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇన్నాళ్ళు తాము కేంద్ర ప్రభుత్వం స్పందిస్తుందని వేచి చూశామని.. ఇక ఆలస్యం చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదన్నారు. తమ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కరోనా నియంత్రణలో ఏపీ ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టిందన్నారు. ఒకే రోజు రికార్డు స్థాయిలో 13 లక్షల మందికి వ్యాక్సినేషన్ చేసి జాతీయ స్థాయిలో రికార్డు సృష్టించామన్నారు. ఇచ్చిన డోసుల కంటే అత్యధిక మందికి వ్యాక్సినేషన్ ప్రక్రియ జరిగిందన్నారు. కరోనా కష్ట కాలంలో ప్రజలను అనేక మార్గాల్లో ప్రభుత్వం ఆదుకుందని వివరించారు. టీడీపీ ఎంపీ.. రాజ్యసభలో అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని.. టీడీపీ ప్రచారం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని మోపిదేవి దుయ్యబట్టారు. -
రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీల ఆందోళన
సాక్షి, న్యూఢిల్లీ: ప్రత్యేక హోదాపై రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీలు ఆందోళన చేశారు. ఛైర్మన్ పోడియం వద్దకు వైఎస్సార్సీపీ ఎంపీలు దూసుకెళ్లారు. కేంద్రానికి వ్యతిరేకంగా ఫ్లకార్డులతో నినాదాలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదాపై చర్చించాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ ఎంపీల ఆందోళనతో రాజ్యసభ రేపటికి వాయిదా పడింది. కాగా, ప్రత్యేక హోదాపై వెంటనే చర్చ జరపాలంటూ.. సభా నియమ నిబంధనలలోని రూల్ 267 కింద రాజ్యసభ చైర్మన్‌కు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నోటీసు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంపై రాజ్యసభలో వెంటనే చర్చ చేపట్టాలని ఆయన కోరారు. రాజ్యసభలో ఈ రోజు నిర్వహించే ఇతర వ్యవహారాలన్నింటిని పక్కన పెట్టి రూల్ 267 కింద ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై చర్చను ప్రారంభించాలని ఆయన నోటీసులో కోరారు. ఈ అంశం ఎందుకు అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్నదో విజయసాయి రెడ్డి తన నోటీసులో క్లుప్తంగా వివరించారు. -
కశ్మీర్లో ప్రధాన పార్టీల కూటమి
శ్రీనగర్: స్వతంత్ర ప్రతిపత్తిని తిరిగి సాధించడమే లక్ష్యంగా జమ్మూకశ్మీర్‌లోని ప్రధాన రాజకీయ పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి. గత ఏడాది ఆగస్టు 5వ తేదీ నాటికి ముందు పరిస్థితిని జమ్మూకశ్మీర్‌లో పునరుద్ధరించాలనీ, దీనిపై సంబంధిత పక్షాలన్నిటితో కేంద్రం చర్చలు జరపాలని డిమాండ్ చేశాయి. గురువారం నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా నివాసంలో జరిగిన ఈ భేటీకి పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ, పీపుల్స్ కాన్ఫరెన్స్ చైర్మన్ సజాద్ లోనె, పీపుల్స్ మూవ్‌వెంట్ నేత జావెద్ మిర్, సీపీఎం నేత యూసఫ్ తారిగామి హాజరయ్యారు. దాదాపు 2 గంటలపాటు కొనసాగిన ఈ సమావేశం అనంతరం ఫరూక్ అబ్దుల్లా మీడియాతో మాట్లాడారు. ‘పీపుల్స్ అలయెన్స్ ఫర్ గుప్కార్ డిక్లరేషన్’గా తమ కూటమికి పేరు పెట్టామన్నారు. జమ్మూకశ్మీర్, లద్దాఖ్లకున్న ప్రత్యేక హోదాతోపాటు, కశ్మీర్ ప్రత్యేక రాజ్యాంగాన్ని సాధించుకుంటామన్నారు. తమ కూటమి భవిష్యత్ కార్యాచరణపై త్వరలోనే వెల్లడిస్తామన్నారు. జేకేపీసీసీ చీఫ్ గులాం అహ్మద్ మిర్ ఈ సమావేశానికి హాజరుకాలేదు. -
ముఫ్తీని కలిసిన ఫరూఖ్, ఒమర్
శ్రీనగర్: పద్నాలుగు నెలల నిర్బంధం తరువాత విడుదలైన జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీని, మాజీ ముఖ్యమంత్రులు ఫరూఖ్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లాలు శ్రీనగర్‌లోని ఆమె నివాసంలో కలిసి, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఫరూఖ్ అబ్దుల్లా గురువారం ఏర్పాటు చేసిన గుప్కర్ డిక్లరేషన్ సమావేశానికి హాజరుకావాల్సిందిగా పీడీపీ నాయకురాలు ముఫ్తీని కోరామని, అందుకు ఆమె సమ్మతించినట్లు ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు. ఆగస్టు 4, 2019న జరిగిన అఖిల పక్ష సమావేశం గుప్కర్ డిక్లరేషన్ తీర్మానాన్ని ఆమోదించింది. కేంద్ర ప్రభుత్వం జమ్మూకశ్మీర్ స్వయం ప్రతిపత్తిని రద్దు చేస్తూ, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల ఏర్పాట్లను వ్యతిరేకిస్తూ, కశ్మీర్ స్వయం ప్రతిపత్తి, ప్రత్యేక హోదాను, గుర్తింపులను కాపాడుకోవడానికి ఐక్యంగా పోరాడాలని కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి ఒక రోజు ముందు జరిగిన సమావేశంలో అన్ని పార్టీలూ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించాయి. ఈ యేడాది ఆగస్టులో సమావేశమైన పార్టీలు తమ పోరాటాన్ని కొనసాగించాలని నిర్ణయించాయి. ఈ నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించడానికి గురువారం ఏర్పాటు చేయనున్న సమావేశానికి అన్ని పార్టీలను ఫరూఖ్ అబ్దుల్లా ఆహ్వానించారు. నిర్బంధం నుంచి విడుదలైన ముఫ్తీ మాట్లాడుతూ గత ఏడాది ఆగస్టు 5న అప్రజాస్వామికంగా, రాజ్యాంగ విరుద్ధంగా మన నుంచి లాగేసుకున్న జమ్మూకశ్మీర్‌ని తిరిగి సాధించుకోవడానికి ప్రతిజ్ఞ పూనాలని అన్నారు. -
ఆర్టికల్ 371 జోలికి వెళ్లం
గువాహటి: ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 371 జోలికి వెళ్లబోమని హోంమంత్రి అమిత్ షా తెలిపారు. అక్రమంగా ఒక్క వలసదారున్ని కూడా దేశంలోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. ఆదివారమిక్కడ జరిగిన ఈశాన్య రాష్ట్రాల మండలి (ఎన్ఈసీ) 68వ ప్లీనరీ సమావేశంలో అమిత్ షా మాట్లాడారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక అధికారాలు కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత, ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక అధికారాలు కల్పించే ఆర్టికల్ 371ని కూడా కేంద్రం రద్దు చేస్తుందన్న ప్రచారం జరుగుతోందని తెలిపారు. ‘దీనిపై నేను ఇదివరకే పార్లమెంటులో స్పష్టతనిచ్చాను. నేడు 8మంది ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమక్షంలో మరోసారి చెబుతున్నా. కేంద్రం ఆర్టికల్ 371 జోలికి వెళ్లదు’ అని పునరుద్ఘాటించారు. ఆర్టికల్ 370ని తాత్కాలికంగా ఏర్పాటు చేసినందునే దాన్ని రద్దుచేశామని, అయితే ఆర్టికల్ 371 మాత్రం ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక అధికారాలు కల్పిస్తుందని, ఈరెండింటి మధ్య చాలా తేడా ఉందని షా వివరించారు. ఎన్ఆర్సీ గురించి మాట్లాడుతూ..అక్రమ చొరబాటుదారులను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించకూడదన్న విధానానికి కట్టుబడి ఉన్నామన్నారు. ఈశాన్య ప్రాంతంలోని వివిధ రాష్ట్రాల మధ్య ఉన్న సరిహద్దు వివాదాలకు ముగింపు పలకాల్సిన అవసరముందని షా అభిప్రాయపడ్డారు. -
ఆర్టికల్ 370 రద్దును ప్రతిఘటిస్తాం
ఇస్లామాబాద్: జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిప త్తిని కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ను రద్దు చేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయాన్ని పాకిస్తాన్ ఖండించింది. ఐరాస తీర్మానాలకు వ్యతిరేకంగా భారత్ తీసుకున్న నిర్ణయంపై అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళతామని తెలిపింది. కశ్మీరీలకు మద్దతు కొనసాగిస్తామని పేర్కొంది. తాజా పరిణామంతో రెండు అణ్వస్త్ర దేవాల మధ్య సంబంధాలు మరింత క్షీణిస్తాయని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు. భారత్ ప్రకటన ఐరాస తీర్మానాలకు వ్యతిరేకమని అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ పేర్కొన్నారు. ఈ విషయమై చర్చించేం దుకు ఆయన మంగళవారం ప్రత్యేకంగా పార్లమెంట్ ఉభయసభల సంయుక్త సమా వేశం ఏర్పాటు చేశారు. పలు కశ్మీరీ సంఘాలు, సంస్థలు ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్ కార్యాలయం ఎదుట ప్లకార్డులతో నిరసన తెలిపాయి. నీలం లోయలో భారత్ బాంబు దాడులతో తీవ్రంగా దెబ్బతిన్న సరిహద్దు ప్రాంతాలను విదేశీ ప్రతినిధుల బృందం సందర్శించనుందని పాక్ అధికారులు తెలిపా రు. నియంత్రణ రేఖ వెంబడి పౌరులే లక్ష్యంగా భారత్ చేసిన క్లస్టర్ బాంబులతో తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. ఈ విదేశీ బృందంలో చైనా, బ్రిటన్, ఫ్రాన్సు, టర్కీ, జర్మనీ దౌత్యాధి కారులు ఉంటారన్నారు. అయితే, పాక్ ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. అవి అబద్ధాలు, మోసమని పేర్కొంది. ‘అణ్వస్త్ర’ దేశాల మధ్య సంబంధాలు క్షీణిస్తాయి: ఆర్టికల్–370 రద్దుతో అణ్వస్త్ర పాటవ ఇరుగుపొరుగు దేశాల మధ్య సంబంధాలు మరింత దిగజారుతాయని ఇమ్రాన్‌ఖాన్ తెలిపారు. మలేసియా ప్రధాని మహతీర్ మహమ్మద్‌తో కలిసి మీడియాతో మాట్లాడుతూ ఆయన... కశ్మీర్ హోదాను మార్చడం అన్యాయం, ఐరాస తీర్మానాల ఉల్లంఘన. భారత్ చర్యతో అణ్వస్త్ర పాటవ దేశాల మధ్య సంబంధాలు మరింత దిగజారుతాయి’ అని తెలిపారు. కశ్మీర్లో పరిస్థితులను నిశితంగా గమనిస్తుంటామని, పాక్‌తో చర్చలు జరుపుతుంటామని మలేసియా ప్రధాని మహతీర్ పేర్కొన్నారని పాక్ మీడియా తెలిపింది. వచ్చే నెలలో న్యూయార్క్‌లో జరిగే ఐరాస సమావేశాల సందర్భంగా ప్రధాని ఇమ్రాన్‌తో భేటీ ఉంటుం దని కూడా ఆయన తెలిపారని పేర్కొంది. కశ్మీరీలకు మద్దతు కొనసాగిస్తాం కశ్మీర్‌పై భారత్ తీసుకున్న ఏకపక్ష, చట్ట విరుద్ధ చర్యను అడ్డుకునేందుకు సాధ్యమైన అన్ని ప్రయత్నాలను చేస్తామని పాక్ పేర్కొంది. విదేశాంగ శాఖ ఈ మేరకు ఒక ప్రకటన చేసింది. ‘భారత ప్రభుత్వ నిర్ణయం జమ్మూకశ్మీర్‌తోపాటు, పాకిస్తాన్ ప్రజలకు కూడా ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. భారత్ తీసుకునే చట్ట విరుద్దమైన చర్యలను ప్రతిఘటించేందుకు ఈ వివాదంతో సంబంధం ఉన్న పాకిస్తాన్ శాయశక్తులా ప్రయత్నిస్తుంది. కశ్మీర్ ప్రజల స్వయం నిర్ణయాధికారానికి దౌత్యపరమైన రాజకీయ, నైతికమద్దతును కొనసాగిస్తామని మరోసారి స్పష్టం చేస్తున్నాం’ అని తెలిపింది. కాగా, జమ్మూకశ్మీర్ పరిణామాలపై చర్చించేందుకు మంగళవారం పాక్ పార్లమెంట్ ప్రత్యేకంగా సమావేశం కానుంది. అంతర్జాతీయ సమాజానికి వివరిస్తాం కశ్మీర్ విషయంలో భారత్ చర్యలను ఐరాస, ఇస్లామిక్ దేశాల సహకార సంస్థ (ఓఐసీ)తోపాటు మిత్రదేశాలు, అంతర్జా తీయ మానవ హక్కుల సంఘాల దృష్టికి తీసుకెళతామని పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మూద్ ఖురేషి తెలిపారు. త్వరలో ఇక్కడ పర్యటించనున్న అమెరికా ప్రతిని ధులకు కూడా ఈ విషయం తెలియ పరుస్తాం’ అని ట్విట్టర్లో పేర్కొన్నారు. ‘కశ్మీర్‌పై ఐరాస పలు తీర్మానాలు చేసింది. కశ్మీర్‌ను ఐరాస వివాదాస్పద ప్రాంతంగా గుర్తించిందన్న విషయాన్ని మాజీ ప్రధాని వాజ్‌పేయి కూడా అంగీకరించారు’ అని ఆయన అన్నారు. ‘కశ్మీరీలకు పాక్ మద్దతు ఇకపై నా కొనసాగుతుంది. భారత్ నిర్ణయం తప్పని చరిత్రే రుజువు చేస్తుంది’ అని వ్యాఖ్యానించారు. భారత్ నిర్ణయం అక్కడి ప్రజల అభిప్రాయంపై ఎలాంటి ప్రభావం చూపబోదు అన్నారు. -
ఏపీ ప్రజలకు మోదీ ద్రోహం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్(ఏపీ)కి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం ద్వారా ప్రధాని మోదీ ఏపీ ప్రజలకు నమ్మక ద్రోహం చేస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. ఏపీలో కొత్తగా ఏర్పడిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రత్యేకహోదాపై కృతనిశ్చయంతో పోరాడుతుందన్న నమ్మకం తనకు ఉందని కాంగ్రెస్ ప్రధాన అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా అన్నారు. ఉమ్మడి ఏపీకి చెందిన మాజీ ప్రధాని పీవీ దేశానికి చేసిన సేవలకు గుర్తుగా ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలనీ, ఆయనకు మనం ఇచ్చే ఘనమైన నివాళి అదేనని సుర్జేవాలా అన్నారు. గత ప్రధాని మన్మోహన్ రాజ్యసభలో ఇచ్చిన ఆ హామీని అమలు చేయకపోవడం ద్వారా రాజ్యాంగ విధానాలను మోదీ తుంగలో తొక్కుతున్నారని మండిపడ్డారు. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటన చేసే ముందు జైట్లీసహా ఇతర బీజేపీ సీనియర్ నేతలతో చర్చిస్తే వారు సమ్మతించారని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇచ్చే విషయం అసలు పరిశీలనలోనే లేదని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులోనే చెప్పడాన్ని ఆయన ప్రస్తావిస్తూ ఇది కోట్లాదిమంది ఏపీ ప్రజలకు బీజేపీ చేసిన సిగ్గుమాలిన నమ్మక ద్రోహమేనని సుర్జేవాలా అన్నారు. మోదీ తమ మాటనిలబెట్టుకుంటారని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు వేచిచూస్తున్నారనీ, మాట నిలుపుకోవాల్సిన సమయం ఇప్పుడు వచ్చిందని సుర్జేవాలా పేర్కొన్నారు. -
ప్రత్యేక హోదా ఉద్యమకారులపై కేసులు ఎత్తివేత
సాక్షి, కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : జిల్లాలో ప్రత్యేక హోదా ఉద్యమం మొదటి నుంచి ఉద్ధృతంగా సాగింది. రాజకీయ పార్టీలు, విద్యార్థి, యువజన, ప్రజా సంఘాల నాయకులు ఏపీకి ప్రత్యేక హోదా, వెనుకబడిన రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ కోసం ఉద్యమించారు. పోలీసులు అలాంటి వారిపై సీఆర్పీసీ 151, బైండోవర్ తదితర సెక్షన్ల కింద దాదాపు 250 మందిపై కేసులు నమోదు చేశారు. ఇందులో వైఎస్ఆర్సీపీ, సీపీఎం, సీపీఐ, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ తదితర సమన్వయ నాయకులున్నారు. వైఎస్ఆర్సీపీ అదనపు రాష్ట్ర కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డిపై త్రీటౌన్ పోలీసు స్టేషన్లో క్రిమినల్ కేసు కూడా నమోదు చేశారు. 2014లో ఏపీకి ప్రత్యేక హోదా కోసం చేసిన ఉద్యమంలో 45 మంది వైఎస్ఆర్సీపీ నాయకులపై కేసులు పెట్టారు. అదే సమమంలో సీపీఎం నాయకులు 20, సీపీఐ 10, ఎస్ఎఫ్ఐ 5, ఏఐఎస్ఎఫ్ 5 మందిపై కేసులు నమోదు చేశారు. 2016లో జరిగిన రాష్ట్ర బంద్‌లో కూడా 25 మంది వైఎస్ఆర్సీపీ, 15 మంది సీపీఎం, 10 మంది సీపీఐ, 10 మంది ఏఐవైఎఫ్ వారిపై కేసులు పెట్టారు. 2017లో సీపీఎం ఇచ్చిన బంద్‌లో దాదాపు 80 మందిపై కేసులు పెట్టారు. 2018 ఫిబ్రవరి 22వ తేదీన సీపీఎం కలెక్టరేట్ ముట్టడిలో 20 మందిపై కేసులు నమోదయ్యాయి. హర్షం వ్యక్తం చేసిన సీపీఐ ప్రత్యేక హోదా ఉద్యమకారులపై నమోదైన కేసులు ఎత్తివేయడంపై సీపీఐ జిల్లా కార్యదర్శి కె.గిడ్డయ్య మంగళవారం ఓ ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. అప్పట్లో సీఎంగా ఉన్న చంద్రబాబునాయుడు ప్రత్యేక హోదా ఉద్యమకారులపై కేసులు పెట్టి వేధించారని, అందుకే ఆయనను ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టారన్నారు. భవిష్యత్‌లో ప్రత్యేక హోదా ఉద్యమం కోసం ప్రభుత్వం చేసే పోరాటాలకు సీపీఐ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని, అన్ని పార్టీలకు కలుపుకుని పోరాటం చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రణాళికలు రూపొందించాలని కోరారు. -
‘న్యాయ్’కు నిధులు దొంగ వ్యాపారుల నుంచే..
బొకాఖత్/లఖింపూర్(అస్సాం): ‘న్యాయ్’పథకానికి అవసరమైన నిధులను ప్రధాని మోదీకి సన్నిహితులైన దొంగ వ్యాపారవేత్తల నుంచి రాబడతామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ తెలిపారు. బుధవారం ఆయన అస్సాంలోని బొకాఖత్, లఖింపూర్ ప్రాంతాల్లో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడారు. ‘ప్రజల అకౌంట్లలో డబ్బు జమ చేస్తామంటూ మోదీ ఇచ్చిన హామీ ..అంబానీల వంటి కొందరు ధనిక వ్యాపారవేత్తలకే మేలు చేశారు. గత నాలుగేళ్లుగా ప్రధాని మోదీ ద్వారా పొందిన అనిల్ అంబానీ వంటి దొంగ వ్యాపారవేత్తల నుంచి న్యాయ్ పథకానికి కావాల్సిన నిధులను రాబడతాం. పేదలు ముఖ్యంగా మహిళల అకౌంట్లలో జమ చేస్తాం’అని అన్నారు. విదేశాల్లో భారతీయులు దాచిన నల్లధనాన్ని వెనక్కి తీసుకువచ్చి రూ.15 లక్షలు చొప్పున ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాలో జమ చేస్తామన్న ప్రధాని మోదీ హామీ వట్టిదేనంటూ హత్యా నేరంలో నిందితుడైన బీజేపీ చీఫ్ అమిత్‌షాయే కొట్టిపారేశారని పేర్కొన్నారు. ధనికులకు మాత్రమే వాచ్మెన్(చౌకీదార్లు) ఉంటారనీ, వారికి మాత్రమే ప్రధాని కాపలాదారు అయ్యారని ఎద్దేవా చేశారు. ‘బీజేపీ పాలనలో దేశంలో నిరుద్యోగిత తీవ్రంగా పెరిగిపోయింది. వివాదాస్పద పౌరత్వ సవరణ బిల్లును అమల్లోకి రాకుండా చేస్తాం. ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక హోదాను పునరుద్ధరించి, ఉత్పత్తి కేంద్రంగా మార్చేందుకు ప్రత్యేక పారిశ్రామిక విధానాన్ని అమలు చేస్తాం. మోదీ, బీజేపీ వణికిపోతున్నారు కాంగ్రెస్ ప్రకటించిన కనీస ఆదాయ భద్రత పథకాన్ని(న్యాయ్) చూసి మోదీ, బీజేపీ వణికిపోతున్నారని ఆ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా విమర్శించారు. ఈ విషయంలో ప్రధాని మోదీ నిరాశ, నిస్పృహకు గురయ్యారన్నారు. ‘న్యాయ్’ను కాంగ్రెస్ పార్టీ ‘మాగ్నాకార్టా’గా ఆయన అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను అన్నివర్గాలు స్వాగతించాయన్నారు. ఎన్నికల్లో ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేని నేతలు ఇతర పార్టీలు ఇచ్చే హామీలపై విమర్శలు చేసే నైతిక హక్కును కోల్పోతారని స్పష్టం చేశారు. నేడు వయనాడ్‌లో నామినేషన్ కోజికోడ్: కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానానికి రాహుల్ గురువారం నామినేషన్ వేయనున్నారు. ఉదయం 11 గంటలకు కోజికోడ్ నుంచి హెలికాప్టర్లో వయనాడ్‌కు వెళ్లి నామినేషన్ దాఖలు చేస్తారని, ఆయన వెంట సోదరి ప్రియాంకగాంధీ ఉంటారని సీనియర్ నేత ముకుల్ వాస్నిక్ చెప్పారు. బుధవారం రాత్రి 8.30 గంటలకు రాహుల్ కోజికోడ్‌కు చేరుకుంటారు. దక్షిణాది రాష్ట్రాలను కూడా కాంగ్రెస్ కలుపుకుపోతుందనే భరోసా ప్రజల్లో కల్పించేందుకే వయనాడ్ నుంచి బరిలోకి దిగుతున్నట్లు రాహుల్ ప్రకటించారు. -
హోదా కంటే ప్యాకేజీయే కావాలన్నారు
సాక్షి, నర్సీపట్నం: ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీనే సంజీవిని అన్నారని బీజేపీ మహిళామోర్చా జాతీయ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో టీడీపీ సర్కార్ నాశనం చేసిందని మండిపడ్డారు. మంగళవారం నర్సీపట్నం వచ్చిన ఆమె విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక ప్యాకేజీని చంద్రబాబు కోరడంతోనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి వేల కోట్ల రూపాయలు విడుదల చేసిందన్నారు. రాష్ట్రాన్ని అడ్డుగోలుగా విభజించిన కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా ఇస్తామనడంలో అర్థంలేదన్నారు. రాష్ట్ర విభజన సమయంలోనే ప్రత్యేక హోదా ఇచ్చి ఉండాల్సిందన్నారు. ఓట్ల తొలగింపుపై వచ్చిన ఫారం–7 దరఖాస్తుల అంశాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది అధిష్టానమే నిర్ణయిస్తుందని చెప్పారు. దేశంలో అవినీతిరహిత పాలన అందించిన ఘనత ప్రధానమంత్రి నరేంద్రమోదీకి దక్కిందన్నారు. పాకిస్తాన్ భూభాగంలో ఉన్న ఉగ్రవాద స్థావరాలపై భారత సైనికులు దాడులు చేసి 130 కోట్ల మంది భారతీయుల సత్తా చాటారన్నారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు పొన్నగంటి అప్పారావు, అసెంబ్లీ నియోజకవర్గం కన్వీనర్ కాళ్ల సుబ్బారావు పాల్గొన్నారు. -
చిత్తశుద్ధి పోరాటం మాదే
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పోరాటం చేస్తుందని ఆ పార్టీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ప్రత్యేక హోదా విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆది నుంచి పోరాటం చేస్తుందన్నారు. నిరాహారదీక్షలు మొదలు సభలు, సమావేశాలు నిర్వహించిందన్నారు. హోదా వస్తేనే రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందని పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆది నుంచి రాష్ట్ర ప్రజలకు కళ్లకు కట్టినట్లు వివరిస్తున్నారన్నారు. ప్రత్యేక హోదా అక్కర్లేదు.. ప్యాకేజీనే కావాలని పదే పదే చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు ప్లేటు ఫిరాయించాడని బాలినేని విమర్శించారు. ప్రత్యేక హోదా కావాలని రాష్ట్ర ప్రజలు ముక్తకంఠంతో కోరుకుంటున్నారన్నారు. ఈ విషయాన్ని గమనించిన చంద్రబాబు ఇప్పుడు యూటర్న్ తీసుకున్నాడని బాలినేని చెప్పారు. బాబుకు రాష్ట్ర ప్రయోజనాలపై చిత్తశుద్ధి లేదన్నారు. హోదా వచ్చే వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్ని పక్షాలు, ప్రజాసంఘాలను కలుపుకొని పోయి ఉద్యమం చేస్తుందన్నారు. హోదా సాధనే లక్ష్యమన్నారు. ఈ విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. ప్రజల నమ్మకాన్ని కోల్పోయిన చంద్రబాబు ఇప్పుడు హోదా అంటూ డ్రామాలాడుతున్నారని బాలినేని విమర్శించారు. హోదా ఉద్యమంలో పాల్గొనడంతో పాటు సహకరిస్తున్న అందరికీ బాలినేని కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా ప్రజలు కరువుతో అల్లాడిపోతున్న ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. జిల్లాలోని 56 మండలాల్లో 55 మండలాలు కరువు కింద ప్రకటించినా రైతులకు పైసా పరిహారమివ్వడం లేదన్నారు. తక్షణం పరిహారం అందించి రైతులను ఆదుకోవాలని బాలినేని డిమాండ్ చేశారు. ఒక వైపు కరువుతో అరకొర పంటలు పండినా ఆ సరుకును కూడా గిట్టుబాటు ధర ఇచ్చి ప్రభుత్వం కొనే పరిస్థితి లేకుండాపోయిందన్నారు. జిల్లాలో రైతుల వద్ద ఉన్న శనగలు, కందులను తక్షణం ఎంఎస్పీ ధరకు ప్రభుత్వం కొనుగోలు చేయాలని బాలినేని డిమాండ్ చేశారు. వేసవి నేపథ్యంలో పశ్చిమ ప్రాంతంతో పాటు మిగతా ప్రాంతాల్లోనూ తాగునీటి ఇబ్బందుల్లేకుండా అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని బాలినేని కోరారు. కరువు నేపథ్యంలో పశువులకు సబ్సిడీ గ్రాసాన్ని అందించాలని డిమాండ్ చేశారు. అవసరమైతే సాగర్ నుంచి జలాలను తెప్పించి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను పూర్తిగా నింపాలని ఆయన కోరారు. -
ప్రధాని దిష్టిబొమ్మ దహనానికి టీడీపీ యత్నం
సాక్షి, శ్రీకాకుళం జిల్లా : ప్రత్యేక హోదాకోసం రోజురోజుకు ఆందోళనలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇవ్వాలంటూ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు శిరీష బుధవారం ప్రధాని దిష్టి బొమ్మను దహనం చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఆమెతో పాటు మరో వందమంది టీడీపీ నాయకుల్నిపోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో పోలీస్‌స్టేషన వద్ద టీడీపీ నాయకులు ఆందోళన చేపట్టారు. -
చంద్రబాబు నిజాయితీని నిరూపించుకోవాలి : ఆళ్ల నాని
సాక్షి, ఏలూరు : ఏపీ సీఎం చంద్రబాబునాయుడికి చిత్తశుద్ధి ఉంటే వైఎస్సార్ సీపీ అవిశ్వాస తీర్మానానికి మద్దతిచ్చి నిజాయితీని నిరూపించుకోవాలని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు పార్లమెంట్ అధ్యక్షుడు ఎమ్మెల్సీ ఆళ్ల నానీ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదాపై రోజుకో మాట మాట్లాడే చంద్రబాబు కపట నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. నియోజక వర్గాల పెంపుకు కేంద్రం అంగీకరించినా చంద్రబాబు ప్రత్యేక హోదా వద్దంటారని విమర్శించారు. జగన్‌కు ప్రజల్లో పెరుగుతున్న మద్దతును చూసి చంద్రబాబు ప్రత్యేక హోదాపై మనసు మార్చుకున్నారని ఆళ్ల నాని అన్నారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే వైఎస్ఆర్సీపీకి మద్దతిచ్చి నిజాయితీని నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. -
హోదా కోసం ‘అనంత’లో భిక్షాటన
ఎస్కేయూలో అర్ధనగ్న ప్రదర్శన అనంతపురం ఎడ్యుకేషన్ /ఎస్కేయూ : రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో సోమవారం అనంతపురం నగరంలో అర్ధనగ్నంగా భిక్షాటన చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు బండి పరుశురాం, రాష్ట్ర ప్రధానకార్యదర్శి మద్దిరెడ్డి నరేంద్రరెడ్డి మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామని 2014 ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన బీజేపీ, టీడీపీ ఈరోజు ఐదు కోట్ల ఆంధ్రులను మోసం చేశాయన్నారు. ప్రత్యేకప్యాకేజీ ఇస్తామని ప్రధాని నరేంద్రమోదీ ప్రకటిస్తే అందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వాగతిస్తున్నామని చెప్పడం సిగ్గుచేటన్నారు. ఈ ప్యాకేజీ వల్ల ముఖ్యమంత్రి, ఆయన అనుచరులకు లబ్ధి తప్ప ప్రజలకు ఎలాంటి ఉపయోగమూ లేదన్నారు. కార్యక్రమంలో విద్యార్థి విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శులు లోకేష్‌శెట్టి, పెద్దన్న, సాకే నవీన్, నాయకులు మున్నా, షారుఖాన్, నాని, రిజ్వాన్, షకీల్ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో వారం రోజులుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. సోమవారం విద్యార్థి జేఏసీ నాయకులు అర్ధనగ్నప్రదర్శన నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎంపీలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి ప్రత్యేక హోదా ఉద్యమంలో కలిసిరావాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్ విద్యార్థి విభాగం నాయకులు క్రాంతికిరణ్, భానుప్రకాష్ రెడ్డి, జయచంద్రా రెడ్డి, పి.హేమంత్ కుమార్, ఏ. శ్రీనివాసులు, ఎన్ఎస్యూఐ నాయకులు పులిరాజు, బీసీ విద్యార్థి సంఘం నాయకులు జయపాల్ యాదవ్, కె.మల్లిఖార్జున, ఎస్ఎఫ్ఐ నాయకులు బాలరాజు, ఏఐఎస్ఎఫ్ నాయకులు వీరనారప్ప, ఎంఎస్ఎఫ్ నాయకులు జగదీష్ తదితరులు పాల్గొన్నారు.