
మీడియా సమావేశంలో మాట్లాడుతున్న మెహబూబా, ఫరూక్, ఒమర్ అబ్దుల్లా
శ్రీనగర్: స్వతంత్ర ప్రతిపత్తిని తిరిగి సాధించడమే లక్ష్యంగా జమ్మూకశ్మీర్‌లోని ప్రధాన రాజకీయ పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి. గత ఏడాది ఆగస్టు 5వ తేదీ నాటికి ముందు పరిస్థితిని జమ్మూకశ్మీర్‌లో పునరుద్ధరించాలనీ, దీనిపై సంబంధిత పక్షాలన్నిటితో కేంద్రం చర్చలు జరపాలని డిమాండ్ చేశాయి. గురువారం నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా నివాసంలో జరిగిన ఈ భేటీకి పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ, పీపుల్స్ కాన్ఫరెన్స్ చైర్మన్ సజాద్ లోనె, పీపుల్స్ మూవ్‌వెంట్ నేత జావెద్ మిర్, సీపీఎం నేత యూసఫ్ తారిగామి హాజరయ్యారు.
దాదాపు 2 గంటలపాటు కొనసాగిన ఈ సమావేశం అనంతరం ఫరూక్ అబ్దుల్లా మీడియాతో మాట్లాడారు. ‘పీపుల్స్ అలయెన్స్ ఫర్ గుప్కార్ డిక్లరేషన్’గా తమ కూటమికి పేరు పెట్టామన్నారు. జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌లకున్న ప్రత్యేక హోదాతోపాటు, కశ్మీర్ ప్రత్యేక రాజ్యాంగాన్ని సాధించుకుంటామన్నారు. తమ కూటమి భవిష్యత్ కార్యాచరణపై త్వరలోనే వెల్లడిస్తామన్నారు. జేకేపీసీసీ చీఫ్ గులాం అహ్మద్ మిర్ ఈ సమావేశానికి హాజరుకాలేదు.
Comments
Please login to add a commentAdd a comment