పీడీపీ చీఫ్ మెహబూబా వ్యాఖ్య
జమ్మూ: జమ్మూ కశ్మీర్‌లోని పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ చీఫ్, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రజల మనసుల్ని విషపూరితం చేస్తూ మోదీ సర్కార్ అప్రజాస్వామికంగా పాలిస్తోందని మెహబూబా ఆగ్రహం వ్యక్తంచేశారు. పాకిస్తాన్‌లో ఒకప్పటి సైనిక నియంత జనరల్ ముహమ్మద్ జియా ఉల్ హక్ పాలనా.. మోదీ సర్కార్ పరిపాలనా ఒక్కటే అని తీవ్ర ఆరోపణలు చేశారు.
ఆర్టికల్ 370ని రద్దుచేసి జమ్మూకశ్మీర్‌కున్న ప్రత్యేక రాష్ట్ర ప్రతిపత్తి హోదాను తొలగించిన మోదీ సర్కార్‌పై జమ్మూకశ్మీర్ యువత ఐక్యంగా పోరాడాలని మెహబూబా పిలుపునిచ్చారు. బుధవారం ఆమె జమ్మూలో నిర్వహించిన ఒక బహిరంగ సభలో మాట్లాడారు. ‘ పాక్‌లో ఒక శ్రీలంక జాతీయుడిని అమానుషంగా కొట్టి చంపేస్తే ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ వెంటనే స్పందించి కఠిన చర్యలకు పూనుకున్నారు. కానీ, భారత్‌లో మూకదాడికి పాల్పడి ప్రాణాలను హరిస్తున్న వారికి పూలదండలతో సత్కరిస్తున్నారు.
ప్రజాస్వామ్యం, రాజ్యాంగా న్ని ఖూనీ చేస్తున్నారు. నాటి జియా ఉల్ హక్ పాలనకు, నేటి మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్‌కు తేడా ఏముంది? రెండూ ఒక్కటే’ అని మెహబూబా అన్నారు. ‘ భారత్‌ను, ముస్లింలను విడదీస్తున్నారని నాడు పాక్ వ్యవస్థాపకుడు ముహమ్మద్ అలీ జిన్నాపై అందరూ పగతో రగలిపోయారు. ఇప్పుడు భారత్‌లో ఎందరో జిన్నాలు ఉద్భవించారు. వారంతా భారతస్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొనని పార్టీకి చెందిన వారే’ అని బీజేపీని మెహబూబా పరోక్షంగా విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment