Peoples Democratic Party
-
హిందుత్వ ఒక వ్యాధి: ఇల్తీజా
జమ్మూ: పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(పీడీపీ) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తీజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందుత్వ ఒక వ్యాధి అని, అది హిందూవాదాన్ని అప్రతిష్ట పాలుచేస్తోందని విమర్శించారు. మైనార్టీలపై దాడులు, వేధింపులు, హత్యలకు హిందుత్వ కారణమని మండిపడ్డారు. ఓటు బ్యాంకును బలోపేతం చేసుకోవడానికి బీజేపీ హిందుత్వ కార్డును వాడుకుంటోందని ధ్వజమెత్తారు. ఈ మేరకు ఇల్తీజా ఆదివారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ‘‘రామ నామం జపించడానికి నిరాకరించినందుకు ఓ ముస్లిం బాలుడిని చెప్పులతో కొట్టారు. ఘోరంగా జరుగుతున్నా అడ్డుకోకుండా నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయినందుకు శ్రీరాముడు సిగ్గుతో ఉరి వేసుకోవాలి. హిందుత్వ ఒక వ్యాధి. దాంతో కోట్లాది మంది భారతీయులు బాధలు పడుతున్నారు’’ అని ధ్వజమెత్తారు. బాలుడిని కొట్టిన వీడియోను షేర్చేశారు. అనంతరం ఆమె జమ్మూలో మీడియాతో మాట్లాడారు. హిందుత్వ, హిందూయిజం మధ్య చాలా వ్యత్యాసం ఉందన్నారు. హిందుత్వ అనేది విద్వేషాన్ని వ్యాప్తి చేస్తుందన్నారు. భారతదేశం హిందువులదే అని బోధిస్తుందని చెప్పారు. హిందుయిజం మాత్రం ఇస్లాం మతం తరహాలోనే లౌకికవాదాన్ని, సామరస్యాన్ని ప్రబోధిస్తుందని వివరించారు. హిందుత్వ అనే వ్యాధిని నయం చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. జైశ్రీరామ్ అనే నినాదం రామరాజ్యం స్థాపనకు సంబంధించింది కాదని అన్నారు. మూకదాడుల సమయంలో ఆ నినాదం వాడుకుంటున్నారని చెప్పారు. ఇదిలా ఉండగా, ఇల్తీజా ముఫ్తీ వ్యాఖ్యలపై జమ్మూకశ్మీర్ బీజేపీ మాజీ అధ్యక్షుడు రవీందర్ రైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు గానీ ఇతరుల మతపరమైన మనోభావాలను గాయపర్చే హక్కు ఎవరికీ లేదని తేల్చిచెప్పారు. -
PM Narendra Modi: కుటుంబ పార్టీలు రాజ్యాంగానికి శత్రువులు
జమ్మూ: కుటుంబ పార్టీలైన కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(పీడీపీ) భారత రాజ్యాంగానికి అతిపెద్ద శత్రువులని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. ఓటు బ్యాంక్ కోసం సమాజంలో అణగారిన వర్గాల హక్కులను కాలరాశాయని, రాజ్యాంగ స్ఫూర్తిని హత్య చేశాయని నిప్పులు చెరిగారు. ఆ మూడు పార్టీలు జమ్మూకశ్మీర్‌కు తీవ్ర గాయాలు చేశాయని ఆరోపించారు. జమ్మూకశీ్మర్ ప్రజలు తమ బిడ్డల బంగారు భవిష్యత్తు, శాంతి కోసం అవినీతి, ఉగ్రవాదం, వేర్పాటువాదం లేని మంచి ప్రభుత్వం కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. శనివారం జమ్మూలోని ఎంఏఎం స్టేడియంలో ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో మూడు కుటుంబ పార్టీలకు గట్టిగా బుద్ధి చెప్పాలని ఇక్కడి ప్రజలు నిర్ణయించుకున్నారని పేర్కొన్నారు. అవినీతి, అక్రమాలు, అరాచకాలు, ఉగ్రవాదం, వేర్పాటువాదం, రక్తపాతం, ఉద్యోగాల్లో వివక్షను జనం కోరుకోవడం లేదని తేలి్చచెప్పారు. బీజేపీ ప్రభుత్వం రావాలన్నదే వారి ఆకాంక్ష అని స్పష్టంచేశారు. మొదటి రెండు దశల పోలింగ్ ఓటర్ల మనోగతాన్ని ప్రతిబింబిస్తోందని వెల్లడించారు. బీజేపీ పూర్తి మెజార్టీతో సొంతంగా అధికారంలోకి రావడం తథ్యమని ధీమా వ్యక్తంచేశారు. పాకిస్తాన్ భాషలో మాట్లాడుతున్న కాంగ్రెస్‌ను ప్రజలు క్షమిస్తారా అని మోదీ ప్రశ్నించారు. హరియాణాలో కాంగ్రెస్ వస్తే అస్థిరతే: మోదీ హిస్సార్: హరియాణాలో పొరపాటున కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అస్థిరత తప్పదని ప్రధాని మోదీ హెచ్చరించారు. ఆ పార్టీలో అంతర్గత పోరాటం సాగుతోందని, ముఖ్యమంత్రి పదవి కోసం నేతలంతా పోటీ పడుతున్నారని చెప్పారు. బాపు(భూపీందర్ సింగ్), బేటా(దీపేందర్ సింగ్) పోటీలో ఉన్నారని తెలిపారు. శనివారం హరియాణాలోని హిసార్‌లో ఎన్నికల ప్రచార ర్యాలీలో మోదీ మాట్లాడారు. -
కశ్మీర్లో నేడే తొలి దశ
శ్రీనగర్/జమ్మూ: జమ్మూ కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల పోరు కీలక దశకు చేరింది. 7 జిల్లాల పరిధిలో 24 అసెంబ్లీ స్థానాలకు బుధవారం తొలి విడతలో పోలింగ్ జరగనుంది. వీటిలో 8 స్థానాలు జమ్మూలో, 16 కశ్మీర్ ప్రాంతంలో ఉన్నాయి. 90 మంది స్వతంత్రులతో కలిపి మొత్తం 219 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వారి భవితవ్యాన్ని 23 లక్షల పై చిలుకు ఓటర్లు బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం చేయనున్నారు. జమ్మూ కశ్మీర్లో పదేళ్ల అనంతరం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండటం విశేషం. పైగా జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదాను, ప్రత్యేక ప్రతిపత్తి కలి్పస్తున్న ఆరి్టకల్ 370ని రద్దు చేశాక జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలివి. దాంతో ప్రజల తీర్పు ఎలా ఉండనుందోనని ఆసక్తి నెలకొంది. ఉగ్ర ముప్పు నేపథ్యంలో సీఏపీఎఫ్, స్థానిక పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్ బూత్‌లకు, సిబ్బందికి అదనపు భద్రత కల్పిస్తున్నారు. సెపె్టంబర్ 25, అక్టోబర్ 1న రెండు, మూడో విడతతో పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. ఫలితాలు అక్టోబర్ 8న వెల్లడవుతాయి. పారీ్టలన్నింటికీ ప్రతిష్టాత్మకమే ప్రధాన ప్రాంతీయ పారీ్టలు నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ), పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ)తో పాటు కాంగ్రెస్, బీజేపీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. వేర్పాటువాద జమాతే ఇస్లామీ, అవామీ ఇత్తెహాద్ పార్టీ, డీపీఏపీ కూడా బరిలో ఉన్నాయి. కాంగ్రెస్, ఎన్సీ పొత్తు పెట్టుకున్నా మూడుచోట్ల స్నేహపూర్వక పోటీ చేస్తున్నాయి. మరో చోట ఎన్సీ రెబెల్ బరిలో ఉన్నారు. కశ్మీర్‌పై కాషాయ జెండా ఎగరేయజూస్తున్న బీజేపీనీ రెబెల్స్ బెడద పీడిస్తోంది. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణలో హిందూ ప్రాబల్య జమ్మూ ప్రాంతంలో సీట్లు 37 నుంచి 43కు పెరిగాయి. ముస్లిం ప్రాబల్య కశ్మీర్లో ఒక్క సీటే పెరిగింది.బరిలో ప్రముఖులు: మొహమ్మద్ యూసుఫ్ తరిగమీ (సీపీఎం) కుల్గాం నుంచి వరుసగా ఐదో విజయంపై కన్నేశారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి గులాం అహ్మద్ మీర్దూరు నుంచి మూడోసారి గెలుపుపై ఆశలు పెట్టుకున్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ నేత సకీనా (దమ్హాల్ హాజిపురా), పీడీపీ నేతలు సర్తాజ్ మద్నీ (దేవ్సర్), అబ్దుల్ రెహా్మన్ వీరి (షంగుస్–అనంత్‌నాగ్), మెహబూబా ముఫ్తీ కూతురు ఇల్తిజా (శ్రీగుఫ్వారా–బిజ్బెహరా), వహీద్ పరా (పుల్వామా) తదితర ప్రముఖులు తొలి విడతలో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.ప్రధాన సమస్యలు ఇవే...→ నిరుద్యోగం, అణచివేత, మానవ హక్కుల ఉల్లంఘన వంటివి జమ్మూ కశ్మీర్ ప్రజలు ఎదుర్కొటున్న ప్రధాన సమస్యలు. → పూర్తిస్థాయి రాష్ట్ర హోదా లభిస్తేనే సమస్యలు తీరి తమ ప్రయోజనాలు నెరవేరతాయని వారు భావిస్తున్నారు. దాంతో దాదాపుగా పారీ్టలన్నీ దీన్నే ప్రధాన హామీగా చేసుకున్నాయి. → ఆర్టికల్ 370ని తిరిగి తెస్తామని కూడా ఎన్సీ వంటి పార్టీలు చెబుతున్నాయి. విద్య, వివాహాలు, పన్నులు, సంపద, అడవుల వంటి పలు అంశాలను రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలోకి తెస్తామంటున్నాయి. → ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో కశ్మీరీలు భారీ సంఖ్యలో ఓటువేశారు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే ధోరణి కొనసాగుతుందని భావిస్తున్నారు. -
మెహబూబా వారసురాలు...కంచుకోటను నిలబెట్టేనా?
కశ్మీర్లో పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ (పీడీపీ)కి కంచుకోటగా పేరుపడ్డ శ్రీగుఫ్వారా–బిజ్బెహరా నియోకజవర్గంపై ఇప్పుడందరి దృష్టి కేంద్రీకృతమైంది. జమ్మూకశ్మీర్ అసెంబ్లీకి తొలిదశలో.. సెప్టెంబరు 18న పోలింగ్ జరగనున్న 24 నియోజకవర్గాల్లో బిజ్బెహరా ఒకటి. పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ ఈసారి పోటీకి దూరంగా ఉండటంతో బిజ్బెహరా నుంచి ఆమె కూతురు ఇల్తిజా బరిలోకి దిగారు. దక్షిణ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఉన్న ఈ నియోజకవర్గంలో కేవలం ముగ్గురే పోటీపడుతున్నారు. మాజీ ఎమ్మెల్సీలు బషీర్ అహ్మద్ షా (నేషనల్ కాన్ఫరెన్స్), సోఫీ మొహమ్మద్ యూసుఫ్ (బీజేపీ)లతో రాజకీయాలకు కొత్తయిన ఇల్తిజా తలపడుతున్నారు. 37 ఏళ్ల ఇల్తిజా విజయం సాధిస్తే.. 1996 నుంచి పీడీపీకి కంచుకోటగా బిజ్‌బెహరాపై పీడీపీ, ముఫ్తీ కుటుంబం పట్టు మరింత పెరుగుతుంది. మాజీ సీఎం, పీడీపీ వ్యవస్థాపకుడు ముఫ్తీ మొహమ్మద్ సయీద్ తన సుదీర్ఘ రాజకీయ ఇన్నింగ్స్‌కు బిజ్బెహరా నుంచే శ్రీకారం చుట్టారు. 1962లో గులామ్ సాధిక్ నేతృత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్ చీలికవర్గం నుంచి 1962లో బిజ్బెహరా ఎమ్మెల్యేగా సయీద్ విజయం సాధించారు. ఇల్తిజా తల్లి మెహబూబా ముఫ్తీ కూడా బిజ్బెహరా నుంచే రాజకీయ అరంగేట్రం చేశారు. కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై గెలిచారు. తండ్రి ముఫ్తీ మొహమ్మద్ సయీద్ కాంగ్రెస్‌ను వీడి పీడీపీని స్థాపించడంతో మెహబూబా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. సీనియర్ ముఫ్తీకి నమ్మకస్తుడైన అబ్దుల్ రెహమాన్ భట్ బిజ్బెహరా నుంచి వరుసగా నాలుగుసార్లు గెలిచారు. చివరిసారిగా జమ్మూకశ్మీర్‌కు 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ భట్ బిజ్బెహరాలో నెగ్గారు. ఈసారి సీనియర్ నాయకుడైన భట్‌పై నమ్మకంతో ఆయనకు షాంగుస్– అనంత్‌నాగ్ పశి్చమ సీటును పీడీపీ కేటాయించింది.ఎన్సీ ప్రత్యేక దృష్టి పీడీపీ కోటను బద్ధలు కొట్టాలని నేషనల్ కాన్ఫరెన్స్ పట్టుదలగా ఉంది. ఎన్సీ అభ్యర్థి బషీర్ అహ్మద్ షా తండ్రి అబ్దుల్‌గనీ షా 1977–1990 దాకా బిజ్‌బెహరాకు ప్రాతినిధ్యం వహించారు. పలుమార్లు ఓటమి పాలైనా ఎన్సీ ఇక్కడ బషీర్నే నమ్ముకుంటోంది. 2009–1014 మధ్య కాంగ్రెస్‌తో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపినపుడు బషీర్‌ను ఎమ్మెల్సీని చేసింది. పీడీపీ– ఎన్సీ మధ్య సంకుల సమరంలో ఓట్లు చీలి తాము లాభపడతామని బీజేపీ అభ్యర్థి యూసుఫ్ భావిస్తున్నారు. బీజేపీలో చేరడం నిషిద్ధంగా పరిగణించే కాలంలో కమలదళం తీర్థం పుచ్చుకున్న యూసుఫ్‌ను పీడీపీ–బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడినపుడు ఎమ్మెల్సీని చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అప్పటిదాకా పోటీచేయను
శ్రీనగర్: బీజేపీ నేతృత్వంలోని కేంద్ర సర్కార్ తొలగించిన ఆర్టికల్ 370ను పునరుద్ధరించేదాకా తాను శాసనసభ సమరంలో అడుగుపెట్టబోనని పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(పీడీపీ) చీఫ్ మెహబూబా ముఫ్తీ స్పష్టంచేశారు. జమ్మూకశ్మీర్ మాజీ సీఎం అయిన మెహబూబా బుధవారం పీటీఐకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘ రద్దయిన ఆర్టికల్‌ను పునరుద్ధరించే వరకు జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగను. ఇది సరైన నిర్ణయం కాదని నాకూ తెలుసు. కానీ ఇది భావోద్వేగంతో తీసుకున్న కఠిన నిర్ణయం. ఎన్నికైన ప్రభుత్వం ఉంటే తమ రహస్య ఎజెండా కార్యరూపం దాల్చదనే భయంతోనే బీజేపీ ప్రభుత్వం ఆ ఆర్టికల్‌ను తొలగించింది. ‘ఆర్టికల్‌ను రద్దుచేసి కశ్మీర్లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్దరించామని కేంద్రం చెబుతోంది. అసెంబ్లీ ఎన్నికల కంటే పంచాయితీ ఎన్నికలే ప్రజాస్వామ్యానికి అసలైన గీటురాయి అన్నపుడు ప్రధాని, హోం మంత్రి వంటి వేరే పదవులు ఎందుకు ? వాళ్లు ఏం చేస్తున్నట్లు ?. కశ్మీర్ ప్రజలను బలహీనపరచి తమ ముందు సాగిలపడేలా చేయాలని కేంద్రం కుట్ర పన్నింది’ అని ఆరోపించారు. -
‘కశ్మీర్ ఫైల్స్’ను ఆయుధంగా మార్చుతున్నారు: మెహబూబా ముఫ్తీ
న్యూఢిల్లీ: పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ నేత మెహబూబా ముఫ్తీ కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఇటీవల విడుదలైన ‘ది కశ్మీర్ ఫైల్స్’ మూవీని కేంద్ర ప్రభుత్వం కావాలని అధికంగా ప్రమోట్ చేస్తోందని దుయ్యబట్టారు. కశ్మీర్ పండిట్ల బాధను కూడా తమకు అనుకూలంగా ఓ ఆయుధంగా మార్చుకుంటుందని తీవ్రస్థాయిలో ఆరోపించారు. ఆ సినిమాను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న తీరును గమనిస్తే.. వారి(బీజేపీ) దురుద్దేశం ఏంటో స్పష్టంగా తెలుస్తోందని అన్నారు. కశ్మీర్ ఫైల్స్ సినిమా పేరులో రెండు వర్గాలను ఉద్దేశపూర్వకంగా చీల్చడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. పాత గాయాలను మాన్పి, రెండు వర్గాల మధ్య అనుకూల వాతావరణాన్ని సృష్టించడానికి బదులు వాటిని చీల్చడానికే తెరలేపుతోందని మండిపడ్డారు. అంతకు ముందు ఈ సినిమాపై జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా స్పందించారు. కశ్మీరీ పండిట్ల వలసలకు కారణమైన దోషులను గుర్తించడానికి.. ఆ సంఘటన ఎందుకు జరిగిందో తెలుసుకోవడానికి నిజాయితీగా దర్యాప్తు జరిపించాలని అన్నారు. ఆ సమయంలో గవర్నర్‌గా ఉన్న జగ్మోహన్ బతికి ఉంటే వాస్తవాన్ని చెప్పేవారని అబ్దుల్లా పేర్కొన్నారు. ప్రతి సినిమా.. కథను ఒక ప్రత్యేకమైన రీతిలో చిత్రీకరిస్తుందని, సినిమా ఖచ్చితమైన సత్యాన్ని చిత్రీకరించడం చాలా ముఖ్యమని తెలిపారు. ఇదిలా ఉండగా, కశ్మీరీ పండిట్ల సంక్షేమం కోసం బీజేపీ ప్రభుత్వం ఏమీ చేయడం లేదని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. బీజేపీ ద్వేషాన్ని పెంచుతూ లాభం పొందుతోందని మండిపడుతోంది. 1990లో కశ్మీర్ లోయ నుంచి కశ్మీరీ పండిట్ల వలసల నేపథ్యంలో తెరకెక్కిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ను శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించిన విషయం తెలిసిందే. అదే విధంగా సినిమా సత్యాన్ని సరైన రూపంలోకి తెచ్చిందని, చరిత్రను ఎప్పటికప్పుడు సరైన సందర్భంలో అందించాలని ప్రధాని మోదీ తెలిపారు. -
జియా ఉల్ హక్ హయాం.. మోదీ పాలన ఒక్కటే
జమ్మూ: జమ్మూ కశ్మీర్‌లోని పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ చీఫ్, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రజల మనసుల్ని విషపూరితం చేస్తూ మోదీ సర్కార్ అప్రజాస్వామికంగా పాలిస్తోందని మెహబూబా ఆగ్రహం వ్యక్తంచేశారు. పాకిస్తాన్లో ఒకప్పటి సైనిక నియంత జనరల్ ముహమ్మద్ జియా ఉల్ హక్ పాలనా.. మోదీ సర్కార్ పరిపాలనా ఒక్కటే అని తీవ్ర ఆరోపణలు చేశారు. ఆర్టికల్ 370ని రద్దుచేసి జమ్మూకశ్మీర్‌కున్న ప్రత్యేక రాష్ట్ర ప్రతిపత్తి హోదాను తొలగించిన మోదీ సర్కార్‌పై జమ్మూకశ్మీర్ యువత ఐక్యంగా పోరాడాలని మెహబూబా పిలుపునిచ్చారు. బుధవారం ఆమె జమ్మూలో నిర్వహించిన ఒక బహిరంగ సభలో మాట్లాడారు. ‘ పాక్‌లో ఒక శ్రీలంక జాతీయుడిని అమానుషంగా కొట్టి చంపేస్తే ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ వెంటనే స్పందించి కఠిన చర్యలకు పూనుకున్నారు. కానీ, భారత్‌లో మూకదాడికి పాల్పడి ప్రాణాలను హరిస్తున్న వారికి పూలదండలతో సత్కరిస్తున్నారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగా న్ని ఖూనీ చేస్తున్నారు. నాటి జియా ఉల్ హక్ పాలనకు, నేటి మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్‌కు తేడా ఏముంది? రెండూ ఒక్కటే’ అని మెహబూబా అన్నారు. ‘ భారత్‌ను, ముస్లింలను విడదీస్తున్నారని నాడు పాక్ వ్యవస్థాపకుడు ముహమ్మద్ అలీ జిన్నాపై అందరూ పగతో రగలిపోయారు. ఇప్పుడు భారత్‌లో ఎందరో జిన్నాలు ఉద్భవించారు. వారంతా భారతస్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొనని పార్టీకి చెందిన వారే’ అని బీజేపీని మెహబూబా పరోక్షంగా విమర్శించారు. -
అఫ్గాన్ నుంచి పాఠాలు నేర్చుకోండి
శ్రీనగర్: అఫ్గానిస్తాన్ పరిణామాల నుంచి భారత ప్రభుత్వం ఇప్పటికైనా పాఠాలు నేర్చుకోవాలని పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(పీడీపీ) అధ్యక్షురాలు, జమ్మూకశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ హితవు పలికారు. శనివారం కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో పార్టీ కార్యకర్తల భేటీలో ఆమె మాట్లాడారు. జమ్మూకశ్మీర్‌లోని భాగస్వామ్య పక్షాలతో కేంద్రం చర్చలు జరపాలని, 2019లో రద్దు చేసిన ప్రత్యేక ప్రతిపత్తిని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అఫ్గాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకోవడాన్ని ప్రస్తావిస్తూ తమను పరీక్షించవద్దంటూ పరోక్షంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పొరుగు దేశంలో ఏం జరిగిందో చూడండి, పరిస్థితిని అర్థం చేసుకొని చక్కదిద్దండి అని సూచించారు. సూపర్ పవర్ అమెరికా తట్టాబుట్టా సర్దుకొని అఫ్గాన్ నుంచి తోక ముడిచిందన్నారు. కశ్మీర్లో చర్చల ప్రక్రియ ప్రారంభించడానికి భారత ప్రభుత్వానికి ఇప్పటికీ అవకాశం ఉందని చెప్పారు. ఆమె వ్యాఖ్యలపై జమ్మూకశ్మీర్ బీజేపీ అధ్యక్షుడు రవీందర్ రైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్ పట్ల మెహబూబాకు దురభిప్రాయం ఉన్నట్లు కనిపిస్తోందన్నారు. -
పీడీపీ చీఫ్ మెహబూబాకు విముక్తి
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ(పీడీపీ) అధినేత్రి మెహబూబా ముఫ్తీ(60)కి గృహ నిర్బంధం నుంచి దాదాపు 14 నెలలకు విముక్తి లభించింది. మంగళవారం రాత్రి ఆమెను విడుదల చేసినట్లు జమ్మూకశ్మీర్ యంత్రాంగం ఒక ప్రకటనలో తెలిపింది. గత ఏడాది ఆగస్టులో కేంద్రం.. కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ను రద్దు చేసిన నేపథ్యంలో ముందు జాగ్రత్తగా మెహబూబాతోపాటు పలువురు నేతలను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మొదట్లో ఆమెను ఐపీసీ 107, 151 సెక్షన్ల కింద అరెస్టు చేశామన్న యంత్రాంగం అనంతరం వివాదాస్పద పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ కేసు నమోదు చేసింది. దీని ప్రకారం ఎలాంటి విచారణ లేకుండా 3 నెలల పాటు నిర్బంధంలో కొనసాగించేందుకు వీలుంటుంది. గత ఏడాది ఆగస్టు 5వ తేదీన మెహబూబాను అదుపులోకి తీసుకుని చెష్మా షాహి అతిథి గృహంలో కొంతకాలం, ఎంఏ లింక్ రోడ్డులోని మరో అతిథి గృహంలో మరికొంతకాలం ఉంచారు. అక్కడి నుంచి ఆమెను సొంతింట్లోనే గృహ నిర్బంధంలో ఉంచారు. ప్రభుత్వ చర్యను సవాల్ చేస్తూ మెహబూబా కుమార్తె ఇల్తిజా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును సెప్టెంబర్ 29వ తేదీన విచారించిన అత్యున్నత న్యాయస్థానం..ఇంకా ఎంతకాలం మెహబూబాను నిర్బంధంలో ఉంచుతారని కేంద్రం, కశ్మీర్ యంత్రాంగాన్ని ప్రశ్నించింది. రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఈ గడువు ముగియనున్న క్రమంలో ఆమెను ప్రభుత్వం విడుదల చేయడం గమనార్హం. ఈ పరిణామంపై మెహబూబా కుమార్తె ఇల్తిజా స్పందించారు. ‘మెహబూబా ముఫ్తీ అక్రమ నిర్బంధం ఎట్టకేలకు ముగిసింది. ఈ కష్ట కాలంలో నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. మీ అందరికీ రుణ పడి ఉంటాను’అని తన తల్లి ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. ట్విట్టర్ ఖాతాను ఇకపై తన తల్లే ఉపయోగిస్తారని తెలిపారు. ఎందరో యువకులు ఇంకా జైళ్లలోనే మగ్గుతున్నారనీ, వారందరికీ న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. మెహబూబాకు విముక్తి కలిగినందుకు జమ్మూకశ్మీర్ రాష్ట్ర మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా సంతోషం వ్యక్తం చేశారు. ఇంతకాలంపాటు ఆమె నిర్బంధం కొనసాగడం ప్రజాస్వామ్యం ప్రాథమిక నియమాలకే విరుద్ధమన్నారు. ఒమర్, మెహబూబా వంటి నేతలు కేంద్రానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినందునే వారిని నిర్బంధంలో ఉంచినట్లు హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా గతంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఎదుట సమర్థించుకున్నారు. కాగా, ఈ నెల 16వ తేదీన మెహబూబా మీడియాతో మాట్లాడతారని పీడీపీ ప్రతినిధి ఒకరు తెలిపారు. -
మెహబూబా ముఫ్తీకి భారీ షాక్
-
కశ్మీర్ రాజకీయాల్లో కీలక మలుపు
సాక్షి, న్యూఢిల్లీ: పీడీపీ అధినేత్రి, జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీకి భారీ షాక్ తగిలింది. పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(పీడీపీ)లో గ్రూప్ రాజకీయాలు మొదలయ్యాయి. బీజేపీతో బ్రేకప్ను జీర్ణించుకోలేని ముగ్గురు పీడీపీ ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నారు. మాజీ మంత్రి ఇమ్రాన్ అన్సారీ, మహ్మద్ అబ్బాస్ వానీ, వీరిద్దరితోపాటు మరో సీనియర్ నేత అబిద్ అన్సారీ.. మెహబూబాకు వ్యతిరేకంగా తిరుగుబాటు జెండా ఎగరేశారు. మరికొందరిని కూడగలుపుకుని ఈ రెబల్స్ కొత్త పార్టీ ఏర్పాటు నిర్ణయానికి వచ్చినట్లు స్థానిక మీడియా కథనాలు ప్రచురిస్తోంది. మెహబూబాపై వ్యతిరేకగళం... సీనియర్ నేత అబిద్ అన్సారీ.. మెహబూబా ముఫ్తీ నాయకత్వంపై తొలి నుంచే వ్యతిరేకిస్తున్నారు. దీనికితోడు తాజా రాజకీయ పరిణామాలు ఆయన స్వరాన్ని పెంచేశాయి. మరోవైపు మాజీ మంత్రి ఇమ్రాన్ అన్సారీ కూడా సోమవారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘పీడీపీని సమర్థవంతంగా నడపటంలో మెహబూబా దారుణంగా విఫలం అయ్యారు. అంతేకాదు తండ్రి ముఫ్తీ మెహబూబా కలలను కూడా ఆమె నాశనం చేశారు. పైగా ప్రభుత్వంలో కుటుంబ సభ్యుల జోక్యం ఎక్కువైపోయింది. పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీని కాస్త ఫ్యామిలీ డెమొక్రటిక్ పార్టీగా మార్చేశారు’ అని మాజీ మంత్రి ఇమ్రాన్ పేర్కొన్నారు. కాసేపటికే మరో ఎమ్మెల్యే మహ్మద్ అబ్బాస్ వానీ కూడా ఇమ్రాన్‌కు మద్ధతు ప్రకటించారు. బీజేపీతో విడిపోవటం.. ప్రభుత్వం కుప్పకూలిపోయి ముఫ్తీ రాజీనామా... మెహబూబా వైఫల్యాలని వారిద్దరూ బహిరంగంగా ప్రకటించారు. మరికొందరు అసంతృప్త నేతలతో కలిసి పీడీపీ, ఎన్సీ(నేషనల్ కాన్ఫరెన్స్) పార్టీలకు ప్రత్యామ్నాయ కూటమిని వీరు ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది. (ఆ అలవాటును మానుకోండి: బీజేపీ ఘాటు కౌంటర్) బీజేపీతో టచ్‌లో?... అయితే మాజీ మంత్రి ఇమ్రాన్ అన్సారీ మాత్రం బీజేపీ అధినాయకత్వానికి టచ్‌లో ఉన్నట్లు ఓ జాతీయ మీడియా కథనం ప్రచురించింది. ‘ఇమ్రాన్ బీజేపీ చీఫ్ అమిత్ షాతో టచ్‌లో ఉన్నారు. మరికొందరు అసంతృప్త నేతలతో ఆయన బీజేపీలో చేరేందుకు ప్రణాళిక వేస్తున్నారు. మరోవైపు ఎన్సీ-కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కూడా ఆకర్షించేందుకు బీజేపీ యత్నిస్తోంది’ అని ఆ కథనం సారాంశం. అయితే ఇమ్రాన్ మాత్రం ఆ కథనాన్ని తోసిపుచ్చారు. కశ్మీర్లో ఉగ్రవాదం పెరుగుదల, శాంతి భద్రతల హీనతను సాకుగా చూపి సంకీర్ణ ప్రభుత్వం నుంచి బీజేపీ వైదొలటంతో.. ప్రభుత్వం కుప్పకూలి ముఫ్తీ మెహబూబా సీఎం పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. మొత్తం 89 మంది సభ్యులున్న జమ్ము కశ్మీర్ అసెంబ్లీలో బీజేపీకి 25 మంది ఎమ్మెల్యేలు, పీడీపీకి 25 మంది ఎమ్మెల్యేలు ఉండగా, మ్యాజిక్ ఫిగర్‌కు కావాల్సిన సభ్యుల సంఖ్య 45. -
పీడీపీకి మద్దతుపై గవర్నర్‌కు ఎన్సీ లేఖ
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో రాజకీయం సరికొత్త మలుపు తిరిగింది. ప్రభుత్వ ఏర్పాటుపై ఎవరూ ముందుకు రాకపోవడంతో రాష్ట్ర అసెంబ్లీని సుప్తచేతనావస్థలో ఉంచి కేంద్రం రాష్ట్రపతి పాలన విధించిన నేపథ్యంలో నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో 28 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిన పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ)కి లాంఛనంగా మద్దతు ప్రకటిస్తూ గవర్నర్ ఎన్.ఎన్. వోహ్రాకు మంగళవారం లేఖ రాసింది. పార్టీ జమ్మూ ప్రొవిన్షియల్ ప్రెసిడెంట్ దేవేందర్‌సింగ్ రాణా ఈ లేఖను గవర్నర్‌కు జమ్మూలో అందజేశారు. ఈ మేరకు ఎన్సీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ‘ట్వీట్’ చేశారు. కాగా, తాజా పరిణామంపై పార్టీలో చర్చించాక స్పందిస్తామని పీడీపీ ప్రతినిధి నయీమ్ అఖ్తర్ తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటు అంశంపై ప్రస్తుతం బీజేపీతో అనధికార స్థాయిలో చర్చలు జరుగుతున్నాయన్నారు. -
బీజేపీతో దోస్తీకి సుముఖం!
కశ్మీర్లో ప్రభుత్వ ఏర్పాటుపై పీడీపీ సంకేతాలు కశ్మీర్ తీర్పు మోదీకి ఓ సవాలు, అవకాశమన్న మెహబూబా ముఫ్తీ పార్టీ ఏదైనా పీడీపీ అజెండాను గౌరవించాలని వ్యాఖ్య.. గవర్నర్‌తో భేటీ అయిన పీడీపీ నాయకురాలు జమ్మూ: జమ్మూకశ్మీర్ శాసనసభ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు.. అభివృద్ధి గురించి మాట్లాడుతున్న ప్రధాని నరేంద్రమోదీకి ఒక సవాలు, ఒక అవకాశం అని పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ అన్నారు. కశ్మీర్లో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రారంభించిన శాంతి ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాల్సి ఉందని పేర్కొన్నారు. తద్వారా.. రాష్ట్రంలో ఏకైక పెద్ద పార్టీగా అవతరించిన తమ పార్టీ బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయటంపై ఆ పార్టీతో చర్చలు జరిపేందుకు వ్యతిరేకం కాదని స్పష్టమైన సంకేతాలిచ్చారు. రాష్ట్ర గవర్నర్ ఎన్ఎన్ వోహ్రా ఆహ్వానం మేరకు మెహబూబా బుధవారం ఆయనతో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘ఎన్డీఏ ప్రభుత్వానికి ఇదో పెద్ద బాధ్యత. మోదీకి ఇదో పెద్ద బాధ్యత. జమ్మూకశ్మీర్ అనేది నెహ్రూ నుంచి నేటి వరకూ ఏ ప్రధానికైనా అతి పెద్ద సవాలుగా ఉంది. అభివృద్ధి తన స్వప్నమని, నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తానని మోదీ చెప్తున్నారు. కానీ.. క్షేత్రస్థాయిలో శాంతియుత వాతావరణం లేకుండా అభివృద్ధి జరగదు. వాజ్‌పేయి రాజకీయ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లకుండా అభివృద్ధి సాధ్యం కాదు. వాజ్‌పేయి ఒక రాజకీయ ప్రక్రియను ప్రారంభించారు. పాకిస్తాన్‌తో కాల్పుల విరమణకు అంగీకరించారు. హురియత్‌తో బేషరతు చర్చలు ప్రారంభించారు. అద్వానీ ఉప ప్రధానమంత్రిగా ఉన్నపుడు వాజ్‌పేయి పాక్‌తో చర్చలు ప్రారంభించారు. రాష్ట్రానికి ఉదార ఆర్థిక ప్యాకేజీ లభించింది. యూపీఏ సర్కారు దీనిని కొంత కాలం కొనసాగించింది.. ఆ తర్వాత నిలిపివేసింది’ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుపై అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిస్తూ.. ‘ఏ కూటమి ఏర్పాటైనా.. అది ప్రజా తీర్పును, సఖ్యత అనే సూత్రాన్ని గౌరవించాలి. దీనిని పాటించనంతవరకూ ఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా నిష్ర్పయోజనమే’ అని అన్నారు. గవర్నర్‌తో మాట్లాడిన అంశాల గురించి వెల్లడించలేదు. అయితే.. కేవలం ప్రభుత్వ ఏర్పాటు కోసం మెజారిటీని కూడగట్టుకోవటం తమ పార్టీ ప్రాధాన్యం కాదని చెప్పారు. పీడీపీకి 55 మందికి పైగా ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్తున్న మీడియా కథనాలను ఉటంకించారు. ‘భాగస్వామ్య పక్షం బీజేపీయా, ఎన్సీయా, కాంగ్రెస్సా అనేది సమస్య కాదని.. సఖ్యత కోసం పీడీపీ ఎజెండాను గౌరవించడమనేది ముఖ్యం. నాయకత్వమనేది ఈ సవాలును స్వీకరించి ప్రజాతీర్పును తలదాలిస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం 15 నిమిషాల పని’ అని పేర్కొన్నారు. ముఫ్తీ వ్యాఖ్యలను ఆహ్వానిస్తున్నాం: బీజేపీ ప్రధానమంత్రి నరేంద్రమోదీ, మాజీ ప్రధాని వాజ్‌పేయిలను ఉటంకిస్తూ పీడీపీ అధ్యక్షురాలు మెహబూబాముఫ్తీ వ్యాఖ్యలను, మీడియా ద్వారా ఇచ్చిన సంకేతాలను తాము ఆహ్వానిస్తున్నామని, అభినందిస్తున్నామని బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్ పేర్కొన్నారు. తమ రెండు పార్టీల మధ్య సమాచార సంబంధం నెలకొల్పుకున్నామని.. ముఫ్తీ చేసిన వ్యాఖ్యలు చర్చలను లాంఛనంగా ముందుకు తీసుకెళ్లేందుకు దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు. ఇదిలావుంటే.. ఎన్నికల్లో ఏకైక పెద్ద పార్టీగా అవతరించిన పీడీపీ ప్రభుత్వ ఏర్పాటుకు తొలుత చొరవ తీసుకోవాలని, ఆ తర్వాత కాంగ్రెస్ వైఖరి ఏమిటనేది చెప్తామని జమ్మూకశ్మీర్ పీసీసీ అధ్యక్షుడు సైఫుద్దీన్ సోజ్ పేర్కొన్నారు. 12వ అసెంబ్లీ ఏర్పాటుపై నోటిఫికేషన్ జమ్మూకశ్మీర్‌లో 12వ అసెంబ్లీని ఏర్పాటు చేస్తున్నట్లు నోటిఫికేషన్ విడుదలైంది. ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అనుమతితో జనవరి 20తో కాలపరిమితి తీరిపోతున్న 11వ అసెంబ్లీ స్థానంలో... 12వ అసెంబ్లీ ఏర్పాటు చేస్తున్నట్టు నోటిఫికేషన్ జారీ అయిందని న్యాయశాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నూతన సభ్యులు ప్రమాణం చేస్తారని చెప్పారు. సాధారణంగా ఇతర రాష్ట్రాల్లో అసెంబ్లీ ఏర్పాటుపై ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేస్తుంటుంది. అయితే, రాజ్యాంగం ప్రకారం జమ్మూకశ్మీర్‌లో ఆ పనిని న్యాయ శాఖ చేస్తుంది. -
‘కశ్మీర్’పై వీడని ఉత్కంఠ
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లో ప్రభుత్వం ఏర్పాటుపై ఇంకా ఉత్కంఠకు తెరపడలేదు. ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీతో జట్టు కట్టడం సహా అన్ని అవకాశాలూ తమ ముందున్నాయని పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) అధికార ప్రతినిధి నయీమ్ అక్తర్ పునరుద్ఘాటించారు. ఇతర పార్టీలతో దోస్తీకి అందుబాటులో ఉన్న అవకాశాలపై కొత్తగా ఎన్నికైన పార్టీ ఎమ్మెల్యేలతో అనధికార చర్చలు జరిగాయని ఆదివారం తెలిపారు. మరోవైపు బీజేపీతో పొత్తుపై ఎమ్మెల్యేల నుంచి వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో పీడీపీ డోలాయమానంలో పడినట్టు తెలుస్తోంది. దీంతో 12 మంది ఎమ్మెల్యేలుగల కాంగ్రెస్, 15 మంది ఎమ్మెల్యేలు గల ఎన్సీతో పీడీపీ చర్చలు జరుపుతోంది. కాగా, పీడీపీతో అంగీకారం కుదరకపోతే జనవరి 1న గవర్నర్‌తో భేటీలో తమకు 30 మంది ఎమ్మెల్యేల బలం ఉందంటూ బీజేపీ జాబితాను ఇవ్వనున్నట్టు సమాచారం. -
కాశ్మీర్లో కీలకం కానున్న కాషాయం
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటులో బీజేపీ కీలక పాత్ర పోషించనుంది. ఆ పార్టీ ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. ఆరేళ్ల ప్రభుత్వంలో మొదటి మూడు సంవత్సరాలు తమ పార్టీకీ ... అది కూడా హిందువును సీఎం అభ్యర్థిని ఎంపిక చేసి తెర మీదకు తీసుకువచ్చేందుకు బీజేపీ తన చర్యలను ముమ్మరం చేసింది. అందుకోసం ఆ పార్టీ ఇప్పటికే ఎన్సీ, పీడీపీలతో చర్చలు ప్రారంభించింది. జమ్మూ కాశ్మీర్‌లోని మొత్తం 87 అసెంబ్లీ స్థానాలకు ఇటీవల అయిదు విడతలుగా ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో పీడీపీ 28 సీట్లు, బీజేపీ 25 సీట్లు, ఎన్సీ 15 సీట్లు, కాంగ్రెస్ 12 సీట్లు, స్వతంత్ర్య అభ్యర్థులు 7 సీట్లను కైవసం చేసుకున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 44 సీట్లు అవసరమవుతాయి. అయితే రాష్ట్రంలోని ఎన్సీ, పీడీపీలు బద్ద శత్రువులు గల పార్టీలు. ఈ నేపథ్యంలో ఎన్సీ కానీ, పీడీపీ కానీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే బీజేపీతో కలవడం తప్పని సరి పరిస్థితి. దాంతో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటులో కీలక భూమిక పోషిస్తుంది. అలాగే స్వతంత్ర అభ్యర్థులుగా ఎన్నికైన ఏడుగురు కూడా కీలకంగా మారనున్నారు. కాగా ఎన్సీ, బీజేపీతో కలసి ప్రభుత్వ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అలా అయితే ఎన్ సీ, బీజేపీలు మొత్తం సభ్యుల సంఖ్య 40కు చేరుతుంది. మరో నాలుగురు సభ్యులను తమతో కలుపుకుని బీజేపీ, ఎన్సీ ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా గురువారం న్యూఢిల్లీలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, ఆర్థిక మంత్రి, అరుణ్ జైట్లీ, బీజేపీ సీనియర్ నేత రామ్ మాధవ్‌తో భేటీ అయ్యారు. జమ్మూలో ప్రభుత్వ ఏర్పాటు అంశంపై వారంతా చర్చిస్తున్నారు. అసలైతే ఒమర్ గురువారం లండన్ బయలుదేరవలసి ఉంది. కానీ ప్రభుత్వ ఏర్పాటు విషయంపై చర్చించేందుకు ఆయన తన ప్రయాణాన్ని రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. -
కుటుంబ పాలనతో కశ్మీర్ లూటీ
నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీలపై మోదీ నిప్పులు - ఎన్నికల్లో ఆ పార్టీలకు బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపు - బీజేపీని గెలిపిస్తే అభివృద్ధి మంత్రంతో ముందుకెళ్తాం - వాజ్‌పేయి కలను నెరవేరుస్తాం కిష్ట్వార్ (జమ్మూకశ్మీర్): జమ్మూకశ్మీర్‌ను గత 50 ఏళ్లుగా పాలిస్తున్న రెండు కుటుంబాలు రాష్ట్రాన్ని లూటీ చేశాయని నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీలపై ప్రధాని నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. ఐదేళ్లకు ఒకసారి చెరో కుటుంబం అధికారంలోకి వచ్చేలా చీకటి ఒప్పందం కుదుర్చుకున్నాయని ఆ పార్టీలను నడిపిస్తున్న అబ్దుల్లా, ముఫ్తీ కుటుంబాలపై పరోక్షంగా ఆరోపణలు గుప్పించారు. తొలిసారి జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ శనివారం కిష్ట్వార్ పట్టణంలోని చౌగన్ మైదానంలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎన్సీ, పీడీపీలపై విరుచుకుపడ్డారు. ‘‘రాష్ర్టంలో ఆ రెండు కుటుంబాల నుంచే నాయకులు పుడతారా? ఇతర కుటుంబాలు నాయకులను తయారు చేయలేవా? వంశ పాలనకు ఇకనైనా తెర దించాలి. ఐదు దశాబ్దాలుగా ఎన్సీ, పీడీపీలకు ఓట్లేసినా రాష్ట్రం అభివృద్ధి చెందనందుకు బాధపడుతున్న మీరు (ప్రజలు) ప్రస్తుత ఎన్నికల్లో ఆ పార్టీలకు బుద్ధి చెప్పాలి’’ అని మోదీ పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని తాకట్టులో ఉంచడం ఏ కుటుంబానికీ కుదరదని...యువత ఆకాంక్షలను అడ్డుకోవడం ఎవరికీ సాధ్యం కాదనే సందేశాన్ని కిష్ట్వార్ సభ ద్వారా యావత్ జమ్మూకశ్మీర్‌కు చాటిచెప్పాలని మోదీ ప్రజలను కోరారు. కశ్మీర్ లోయను ఇటీవల ముంచెత్తిన వరదలను ప్రస్తావిస్తూ వరద నష్టం తీవ్రతను ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం అంచనా వేయలేకపోయిందని విమర్శించారు. వరద ప్రభావిత ప్రాంతాలను తాను సందర్శించి నష్టం తీవ్రతను తెలుసుకున్నానని...అందుకే తక్షణమే రూ. వెయ్యి కోట్ల సాయాన్ని ప్రకటించానని మోదీ చెప్పారు. ఈ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే అవినీతిరహిత పాలనతో రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్తామని మోదీ హామీ ఇచ్చారు. జమ్మూకశ్మీర్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని...అభివృద్ధే తమ తారక మంత్రమని చెప్పారు. గుజరాత్లో ముస్లింలు అధికంగా నివసించే కచ్ ప్రాంతాన్ని ఆ రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు ఎంతో అభివృద్ధి చేశానని...అలాగే కశ్మీర్ లోయను సైతం అభివృద్ధి చేస్తానని మోదీ చెప్పారు. అలాగే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం, మానవత్వం, కశ్మీరీయత్ (కశ్మీరీల జాతీయవాద భావనతో కూడిన సామాజిక స్పృహ) పరిఢవిల్లాలని కలలుగన్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి స్వప్నాన్ని తాను సాకారం చేస్తానని మోదీ హామీ ఇచ్చారు. కశ్మీరీ యువత గతాన్ని మరచి నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టాలని కోరారు. యువతను తప్పుదోవ పట్టనివ్వబోమని చెప్పిన మోదీ...రాజకీయాలకు మతంతో ముడిపెట్టరాదని సూచించారు. కశ్మీరీలు ఏ మతం వారైనా కశ్మీరీలేనని, బీజేపీ ఎవరిపైనా వివక్ష చూపదన్నారు. రాష్ట్రాభివృద్ధికి అందరి మద్దతు తమకు అవసరమన్నారు. అయితే మోదీ తన ప్రసంగంలో ఎక్కడా ‘ఆర్టికల్ 370’ అంశాన్ని ప్రస్తావించకపోవడం గమనార్హం. బాలీవుడ్‌ను తిరిగి తీసుకొస్తా... భూతల స్వర్గంగా పేరుగాంచిన కశ్మీర్‌కు దూరమైన బాలీవుడ్ చిత్ర పరిశ్రమను తిరిగి తీసుకొస్తానని కశ్మీరీలకు మోదీ హామీ ఇచ్చారు. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నది పర్యాటక రంగమేనన్నారు. ఈ రంగాన్ని కశ్మీర్‌కు తిరిగి తీసుకొచ్చి దీన్ని ప్రపంచంలోనే అంతిమ పర్యాటక గమ్యంగా తీర్చిదిద్దుతానన్నారు. ఏం దోచుకున్నామో చెప్పండి: ఒమర్ రెండు కుటుంబాలు రాష్ట్రాన్ని దోచుకున్నాయంటూ ప్రధాని మోదీ చేసిన ఆరోపణలను ఎన్సీ నేత, రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తోసిపుచ్చారు. కేంద్రంలో ఆరు నెలలుగా అధికారంలో ఉన్న మోదీ సర్కారు రాష్ట్రంలో తాము ఏం దోచుకున్నామో చెప్పాలన్నారు. ఒకవేళ తాము నిజంగానే రాష్ట్రాన్ని లూటీ చేసి ఉంటే ప్రజలు తమకు మద్దతు పలికేవారా? అని సుంబల్, కంగన్లలో నిర్వహించిన బహిరంగ సభల్లో ఒమర్ ప్రశ్నించారు. మోదీ తమ పార్టీని చూసి భయపడుతున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే భారత్, పాకిస్థాన్‌లు కశ్మీర్ అంశాన్ని పరిష్కరించాల్సి ఉంటుం దన్నారు. -
కాశ్మీర్ ప్రజలు పేరు మోసిన దొంగలు: ఫరూక్
రాజకీయ నాయకులు ముందు వెనుక చూడకుండా ఏదో ఒకటి మాట్లాడేస్తారు. ఆతర్వాత దాని ఫలితం తర్వాత అనుభవించాల్సి వస్తుంది. దేశ రాజకీయాల్లో సీనియర్ రాజకీయవేత్తగా పేరున్న జమ్మూ, కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా ఇటీవల వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్య ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఫరూక్ మాట్లాడుతూ.. కాశ్మీర్ ప్రజలు దొంగలు కాదు.. పేరుమోసిన దొంగలు (మహా చోర్) అని అన్నారు. కాశ్మీర్ లోయలోని కొన్ని ప్రాంతాల్లో అక్రమ విద్యుత్ కనెక్షన్ల వినియోగించడం ద్వారా రాష్ట్ర ఆదాయానికి గండి కొట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రజలపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్ ప్రజలను దొంగలు అంటూ ఫరూక్ చేసిన వ్యాఖ్యలు కాశ్మీర్ అసెంబ్లీలో పెద్ద దూమారాన్నే లేపాయి. ఫరూక్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలు మహబూబా ముఫ్తీ ఆందోళన కార్యక్రమాలను ప్రారంభించింది. నేషనల్ కాన్ఫరెన్స్ ఇలా సిగ్గుమాలిన ప్రకటనలు ఎలా చేస్తారంటూ మహబూబా ముఫ్టీ మండిపడ్డారు.