మెహబూబా ముఫ్తీ
న్యూఢిల్లీ: పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ నేత మెహబూబా ముఫ్తీ కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఇటీవల విడుదలైన ‘ది కశ్మీర్ ఫైల్స్’ మూవీని కేంద్ర ప్రభుత్వం కావాలని అధికంగా ప్రమోట్ చేస్తోందని దుయ్యబట్టారు. కశ్మీర్ పండిట్ల బాధను కూడా తమకు అనుకూలంగా ఓ ఆయుధంగా మార్చుకుంటుందని తీవ్రస్థాయిలో ఆరోపించారు. ఆ సినిమాను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న తీరును గమనిస్తే.. వారి(బీజేపీ) దురుద్దేశం ఏంటో స్పష్టంగా తెలుస్తోందని అన్నారు.
కశ్మీర్ ఫైల్స్ సినిమా పేరులో రెండు వర్గాలను ఉద్దేశపూర్వకంగా చీల్చడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. పాత గాయాలను మాన్పి, రెండు వర్గాల మధ్య అనుకూల వాతావరణాన్ని సృష్టించడానికి బదులు వాటిని చీల్చడానికే తెరలేపుతోందని మండిపడ్డారు.
అంతకు ముందు ఈ సినిమాపై జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా స్పందించారు. కశ్మీరీ పండిట్ల వలసలకు కారణమైన దోషులను గుర్తించడానికి.. ఆ సంఘటన ఎందుకు జరిగిందో తెలుసుకోవడానికి నిజాయితీగా దర్యాప్తు జరిపించాలని అన్నారు. ఆ సమయంలో గవర్నర్‌గా ఉన్న జగ్‌మోహన్ బతికి ఉంటే వాస్తవాన్ని చెప్పేవారని అబ్దుల్లా పేర్కొన్నారు. ప్రతి సినిమా.. కథను ఒక ప్రత్యేకమైన రీతిలో చిత్రీకరిస్తుందని, సినిమా ఖచ్చితమైన సత్యాన్ని చిత్రీకరించడం చాలా ముఖ్యమని తెలిపారు.
ఇదిలా ఉండగా, కశ్మీరీ పండిట్ల సంక్షేమం కోసం బీజేపీ ప్రభుత్వం ఏమీ చేయడం లేదని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. బీజేపీ ద్వేషాన్ని పెంచుతూ లాభం పొందుతోందని మండిపడుతోంది. 1990లో కశ్మీర్ లోయ నుంచి కశ్మీరీ పండిట్ల వలసల నేపథ్యంలో తెరకెక్కిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ను శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించిన విషయం తెలిసిందే. అదే విధంగా సినిమా సత్యాన్ని సరైన రూపంలోకి తెచ్చిందని, చరిత్రను ఎప్పటికప్పుడు సరైన సందర్భంలో అందించాలని ప్రధాని మోదీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment