శ్రీనగర్: జమ్మూకశ్మీర్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ(పీడీపీ) అధినేత్రి మెహబూబా ముఫ్తీ(60)కి గృహ నిర్బంధం నుంచి దాదాపు 14 నెలలకు విముక్తి లభించింది. మంగళవారం రాత్రి ఆమెను విడుదల చేసినట్లు జమ్మూకశ్మీర్ యంత్రాంగం ఒక ప్రకటనలో తెలిపింది. గత ఏడాది ఆగస్టులో కేంద్రం.. కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ను రద్దు చేసిన నేపథ్యంలో ముందు జాగ్రత్తగా మెహబూబాతోపాటు పలువురు నేతలను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మొదట్లో ఆమెను ఐపీసీ 107, 151 సెక్షన్ల కింద అరెస్టు చేశామన్న యంత్రాంగం అనంతరం వివాదాస్పద పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ కేసు నమోదు చేసింది. దీని ప్రకారం ఎలాంటి విచారణ లేకుండా 3 నెలల పాటు నిర్బంధంలో కొనసాగించేందుకు వీలుంటుంది. గత ఏడాది ఆగస్టు 5వ తేదీన మెహబూబాను అదుపులోకి తీసుకుని చెష్మా షాహి అతిథి గృహంలో కొంతకాలం, ఎంఏ లింక్ రోడ్డులోని మరో అతిథి గృహంలో మరికొంతకాలం ఉంచారు. అక్కడి నుంచి ఆమెను సొంతింట్లోనే గృహ నిర్బంధంలో ఉంచారు.
ప్రభుత్వ చర్యను సవాల్ చేస్తూ మెహబూబా కుమార్తె ఇల్తిజా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును సెప్టెంబర్ 29వ తేదీన విచారించిన అత్యున్నత న్యాయస్థానం..ఇంకా ఎంతకాలం మెహబూబాను నిర్బంధంలో ఉంచుతారని కేంద్రం, కశ్మీర్ యంత్రాంగాన్ని ప్రశ్నించింది. రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఈ గడువు ముగియనున్న క్రమంలో ఆమెను ప్రభుత్వం విడుదల చేయడం గమనార్హం. ఈ పరిణామంపై మెహబూబా కుమార్తె ఇల్తిజా స్పందించారు. ‘మెహబూబా ముఫ్తీ అక్రమ నిర్బంధం ఎట్టకేలకు ముగిసింది. ఈ కష్ట కాలంలో నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. మీ అందరికీ రుణ పడి ఉంటాను’అని తన తల్లి ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. ట్విట్టర్ ఖాతాను ఇకపై తన తల్లే ఉపయోగిస్తారని తెలిపారు.
ఎందరో యువకులు ఇంకా జైళ్లలోనే మగ్గుతున్నారనీ, వారందరికీ న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. మెహబూబాకు విముక్తి కలిగినందుకు జమ్మూకశ్మీర్ రాష్ట్ర మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా సంతోషం వ్యక్తం చేశారు. ఇంతకాలంపాటు ఆమె నిర్బంధం కొనసాగడం ప్రజాస్వామ్యం ప్రాథమిక నియమాలకే విరుద్ధమన్నారు. ఒమర్, మెహబూబా వంటి నేతలు కేంద్రానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినందునే వారిని నిర్బంధంలో ఉంచినట్లు హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా గతంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఎదుట సమర్థించుకున్నారు. కాగా, ఈ నెల 16వ తేదీన మెహబూబా మీడియాతో మాట్లాడతారని పీడీపీ ప్రతినిధి ఒకరు తెలిపారు.
పీడీపీ చీఫ్ మెహబూబాకు విముక్తి
Published Wed, Oct 14 2020 4:15 AM | Last Updated on Wed, Oct 14 2020 8:34 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment