కశ్మీర్‌లో పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ (పీడీపీ)కి కంచుకోటగా పేరుపడ్డ శ్రీగుఫ్వారా–బిజ్‌బెహరా నియోకజవర్గంపై ఇప్పుడందరి దృష్టి కేంద్రీకృతమైంది. జమ్మూకశ్మీర్ అసెంబ్లీకి తొలిదశలో.. సెప్టెంబరు 18న పోలింగ్ జరగనున్న 24 నియోజకవర్గాల్లో బిజ్‌బెహరా ఒకటి. పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ ఈసారి పోటీకి దూరంగా ఉండటంతో బిజ్‌బెహరా నుంచి ఆమె కూతురు ఇల్తిజా బరిలోకి దిగారు.
దక్షిణ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఉన్న ఈ నియోజకవర్గంలో కేవలం ముగ్గురే పోటీపడుతున్నారు. మాజీ ఎమ్మెల్సీలు బషీర్ అహ్మద్ షా (నేషనల్ కాన్ఫరెన్స్), సోఫీ మొహమ్మద్ యూసుఫ్ (బీజేపీ)లతో రాజకీయాలకు కొత్తయిన ఇల్తిజా తలపడుతున్నారు. 37 ఏళ్ల ఇల్తిజా విజయం సాధిస్తే.. 1996 నుంచి పీడీపీకి కంచుకోటగా బిజ్‌బెహరాపై పీడీపీ, ముఫ్తీ కుటుంబం పట్టు మరింత పెరుగుతుంది.
మాజీ సీఎం, పీడీపీ వ్యవస్థాపకుడు ముఫ్తీ మొహమ్మద్ సయీద్ తన సుదీర్ఘ రాజకీయ ఇన్నింగ్స్‌కు బిజ్‌బెహరా నుంచే శ్రీకారం చుట్టారు. 1962లో గులామ్ సాధిక్ నేతృత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్ చీలికవర్గం నుంచి 1962లో బిజ్‌బెహరా ఎమ్మెల్యేగా సయీద్ విజయం సాధించారు. ఇల్తిజా తల్లి మెహబూబా ముఫ్తీ కూడా బిజ్‌బెహరా నుంచే రాజకీయ అరంగేట్రం చేశారు. కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై గెలిచారు.
తండ్రి ముఫ్తీ మొహమ్మద్ సయీద్ కాంగ్రెస్‌ను వీడి పీడీపీని స్థాపించడంతో మెహబూబా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. సీనియర్ ముఫ్తీకి నమ్మకస్తుడైన అబ్దుల్ రెహమాన్ భట్ బిజ్‌బెహరా నుంచి వరుసగా నాలుగుసార్లు గెలిచారు. చివరిసారిగా జమ్మూకశ్మీర్‌కు 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ భట్ బిజ్‌బెహరాలో నెగ్గారు. ఈసారి సీనియర్ నాయకుడైన భట్‌పై నమ్మకంతో ఆయనకు షాంగుస్– అనంత్‌నాగ్ పశి్చమ సీటును పీడీపీ కేటాయించింది.
ఎన్‌సీ ప్రత్యేక దృష్టి
పీడీపీ కోటను బద్ధలు కొట్టాలని నేషనల్ కాన్ఫరెన్స్ పట్టుదలగా ఉంది. ఎన్‌సీ అభ్యర్థి బషీర్ అహ్మద్ షా తండ్రి అబ్దుల్‌గనీ షా 1977–1990 దాకా బిజ్‌బెహరాకు ప్రాతినిధ్యం వహించారు. పలుమార్లు ఓటమి పాలైనా ఎన్‌సీ ఇక్కడ బషీర్‌నే నమ్ముకుంటోంది. 2009–1014 మధ్య కాంగ్రెస్‌తో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపినపుడు బషీర్‌ను ఎమ్మెల్సీని చేసింది. పీడీపీ– ఎన్‌సీ మధ్య సంకుల సమరంలో ఓట్లు చీలి తాము లాభపడతామని బీజేపీ అభ్యర్థి యూసుఫ్ భావిస్తున్నారు. బీజేపీలో చేరడం నిషిద్ధంగా పరిగణించే కాలంలో కమలదళం తీర్థం పుచ్చుకున్న యూసుఫ్‌ను పీడీపీ–బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడినపుడు ఎమ్మెల్సీని చేశారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment