
అత్యంత దుస్థితిలో పాక్
మందుగుండుకూ దిక్కు లేదు
పహల్గాం ఉగ్రదాడిపై భారత్ ప్రతీకార చర్యలతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరవుతోంది. ఏ క్షణాన ఎలా విరుచుకుపడుతుందోనని బిక్కుబిక్కుమంటోంది. దీటైన ప్రతిస్పందన, అవసరమైతే అణుబాంబులు అంటూ పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా లోలోపల మాత్రం వణికిపోతోంది. భారత్‌ను ఎలాగోలా నిలువరించండంటూ అరబ్ దేశాలను బామాలుతోంది. ఇందుకు కారణాలు లేకపోలేదు. పాక్ సాయుధ సన్నద్ధత, ఆయుధ సంపత్తి అత్యంత దారుణంగా ఉన్నట్టు అక్కడి మీడియానే చెబుతోంది. ఇప్పటికిప్పుడు భారత్‌తో యుద్ధానికి తలపడాల్సి వస్తే పాక్ కేవలం నాలుగు రోజులు మాత్రమే ఎంతో కొంత పోరాడగలదని, తర్వాత చేతులెత్తేయడం మినహా మరో మార్గం లేదని తెలుస్తోంది.
నిండుకున్న మందుగుండు
భూతల యుద్ధంలో కీలకమైన శతఘ్నులు, మోరా్టర్లు, తుపాకుల్లో వాడే అన్నిరకాల మందుగుండూ పాక్ వద్ద దాదాపు ఖాళీ అయినట్టు తెలుస్తోంది. సైన్యం వద్ద కేవలం నాలుగు రోజులకు సరిపడే నిల్వలు మాత్రమే ఉన్నాయి. పాక్‌కు ప్రధానంగా మందుగుండు సరఫరా చేసే సంస్థలు ఇప్పుడు గాజా, ఇజ్రాయెల్ యుద్ధం, ఉక్రెయిన్ యుద్ధాలకు మందుగుండు సరఫరాలో బిజీగా ఉన్నాయి. దాంతో పాక్ అవసరాలను తీర్చే నాథుడే లేకుండా పోయాడు.
అంతర్జాతీయంగా మందుగుండుకు ఇప్పుడున్న డిమాండ్ నేపథ్యంలో వాటిని కొనే స్తోమత, ఆర్థిక బలం కూడా పాక్‌కు లేవు. దీనికితోడు దేశీయంగా మందుగుండు, ఆయుధాలను తయారు చేసే పాక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ తీవ్ర ముడిసరుకుల కొరతను ఎదుర్కొంటోంది. పైగా దాని సాంకేతికత పాత తరానిది కావడంతో పెద్దగా పనికొచ్చే పరిస్థితి కూడా లేదు. ఉక్రెయిన్‌తో గత ఒప్పందం మేరకు ఆ దేశానికి పాక్ ఇటీవలి దాకా భారీగా మందుగుండు సరఫరా చేసింది. తీరా ఇప్పుడు సొంత అవసరాలకు సరిపడా నిల్వల్లేక తెగ తిప్పలు పడుతోంది. యుద్ధమే వస్తే ప్రస్తుత మందుగుండు నిల్వలు 96 గంటల్లోపే ఖాళీ అవుతాయని పాక్‌లోని విశ్వసనీయ సైనిక వర్గాలు వెల్లడించాయి.
హోవిట్జర్లకూ మందుగుండు కొరతే
పాక్ ఎం109 హోవిట్జర్లలో ఉపయోగించే 155 ఎంఎం షెల్స్, బీఎం–21 మలి్టపుల్ రాకెట్ లాంచింగ్ వాహనాల్లో వాడే 122 ఎంఎం రాకెట్లకు కూడా తీవ్ర కొరత ఏర్పడింది. ఉక్రెయిన్ యుద్ధం మొదట్లో ఆ దేశానికి పాక్ 155 ఎంఎం షెల్ మందుగుండు ఎడాపెడా ఎగుమతి చేసింది. దాంతో వాటి నిల్వలు భారీగా తగ్గిపోయాయి. మౌంటెడ్ గన్ సిస్టమ్(ఎంజీఎస్) వ్యవస్థలో వాడే మందుగుండునూ ఉక్రెయిన్‌కు భారీగా ఇచ్చేసింది. అవీ తగ్గిపోవడంతో గాబరా పడుతోంది. ఈ పరిస్థితుల్లో భారత్ గనుక అధునాతన ఆయుధాలతో సరిహద్దు దాటి వస్తే నిలువరించేందుకు శతఘ్నులు మందుగుండుతో సిద్ధంగా లేవని మే 2న జరిగిన పాక్ స్పెషల్ కోర్ కమాండర్స్ భేటీలో సైన్యాధికారులు ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
కాలూచేయీ కూడదీసుకుంటూ...
అందుబాటులో ఉన్న కొద్దిపాటి మందుగుండును వీలైనంతగా భారత సరిహద్దులకు పాక్ తరలిస్తోంది. అక్కడ ఇప్పటికే మందుగుండు నిల్వ చేసి పెట్టుకుందని విశ్వసనీయ సమాచారం. మందుగుండు కొరతను గతంలో కూడా పాక్ ప్రభుత్వ వర్గాలే ఒప్పుకున్నాయి. యుద్ధం వస్తే ఎదుర్కోవడానికి సరిపడా ఆయుధాలు కూడా లేవని నాటి పాక్ ఆర్మీ చీఫ్ ఖమర్ జావేద్ బజ్వా వాపోయారు. దీర్ఘకాలం పాటు యుద్ధం చేయడం పాక్ దళాలకు అసాధ్యమని కుండబద్దలు కొట్టారు. గగనతలంలో యుద్ధ విమానాలు, డ్రోన్లతో ఎంతగా పోరాడినా భూభాగాన్ని కాపాడుకోవడమే యుద్ధాల్లో కీలకం. కానీ నేవీ, ఎయిర్‌ఫోర్స్‌తో పోలిస్తే పాక్ ఆర్మీ పాటవం, సన్నద్ధత అత్యంత అధ్వానమని తెలుస్తోంది. – సాక్షి, నేషనల్ డెస్క్