జమ్మూ: పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(పీడీపీ) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తీజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందుత్వ ఒక వ్యాధి అని, అది హిందూవాదాన్ని అప్రతిష్ట పాలుచేస్తోందని విమర్శించారు. మైనార్టీలపై దాడులు, వేధింపులు, హత్యలకు హిందుత్వ కారణమని మండిపడ్డారు. ఓటు బ్యాంకును బలోపేతం చేసుకోవడానికి బీజేపీ హిందుత్వ కార్డును వాడుకుంటోందని ధ్వజమెత్తారు.
ఈ మేరకు ఇల్తీజా ఆదివారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ‘‘రామ నామం జపించడానికి నిరాకరించినందుకు ఓ ముస్లిం బాలుడిని చెప్పులతో కొట్టారు. ఘోరంగా జరుగుతున్నా అడ్డుకోకుండా నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయినందుకు శ్రీరాముడు సిగ్గుతో ఉరి వేసుకోవాలి. హిందుత్వ ఒక వ్యాధి. దాంతో కోట్లాది మంది భారతీయులు బాధలు పడుతున్నారు’’ అని ధ్వజమెత్తారు. బాలుడిని కొట్టిన వీడియోను షేర్‌చేశారు.
అనంతరం ఆమె జమ్మూలో మీడియాతో మాట్లాడారు. హిందుత్వ, హిందూయిజం మధ్య చాలా వ్యత్యాసం ఉందన్నారు. హిందుత్వ అనేది విద్వేషాన్ని వ్యాప్తి చేస్తుందన్నారు. భారతదేశం హిందువులదే అని బోధిస్తుందని చెప్పారు. హిందుయిజం మాత్రం ఇస్లాం మతం తరహాలోనే లౌకికవాదాన్ని, సామరస్యాన్ని ప్రబోధిస్తుందని వివరించారు. హిందుత్వ అనే వ్యాధిని నయం చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.
జైశ్రీరామ్ అనే నినాదం రామరాజ్యం స్థాపనకు సంబంధించింది కాదని అన్నారు. మూకదాడుల సమయంలో ఆ నినాదం వాడుకుంటున్నారని చెప్పారు. ఇదిలా ఉండగా, ఇల్తీజా ముఫ్తీ వ్యాఖ్యలపై జమ్మూకశ్మీర్ బీజేపీ మాజీ అధ్యక్షుడు రవీందర్ రైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు గానీ ఇతరుల మతపరమైన మనోభావాలను గాయపర్చే హక్కు ఎవరికీ లేదని తేల్చిచెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment