hindutva
-
హిందుత్వ ఒక వ్యాధి: ఇల్తీజా
జమ్మూ: పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(పీడీపీ) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తీజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందుత్వ ఒక వ్యాధి అని, అది హిందూవాదాన్ని అప్రతిష్ట పాలుచేస్తోందని విమర్శించారు. మైనార్టీలపై దాడులు, వేధింపులు, హత్యలకు హిందుత్వ కారణమని మండిపడ్డారు. ఓటు బ్యాంకును బలోపేతం చేసుకోవడానికి బీజేపీ హిందుత్వ కార్డును వాడుకుంటోందని ధ్వజమెత్తారు. ఈ మేరకు ఇల్తీజా ఆదివారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ‘‘రామ నామం జపించడానికి నిరాకరించినందుకు ఓ ముస్లిం బాలుడిని చెప్పులతో కొట్టారు. ఘోరంగా జరుగుతున్నా అడ్డుకోకుండా నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయినందుకు శ్రీరాముడు సిగ్గుతో ఉరి వేసుకోవాలి. హిందుత్వ ఒక వ్యాధి. దాంతో కోట్లాది మంది భారతీయులు బాధలు పడుతున్నారు’’ అని ధ్వజమెత్తారు. బాలుడిని కొట్టిన వీడియోను షేర్చేశారు. అనంతరం ఆమె జమ్మూలో మీడియాతో మాట్లాడారు. హిందుత్వ, హిందూయిజం మధ్య చాలా వ్యత్యాసం ఉందన్నారు. హిందుత్వ అనేది విద్వేషాన్ని వ్యాప్తి చేస్తుందన్నారు. భారతదేశం హిందువులదే అని బోధిస్తుందని చెప్పారు. హిందుయిజం మాత్రం ఇస్లాం మతం తరహాలోనే లౌకికవాదాన్ని, సామరస్యాన్ని ప్రబోధిస్తుందని వివరించారు. హిందుత్వ అనే వ్యాధిని నయం చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. జైశ్రీరామ్ అనే నినాదం రామరాజ్యం స్థాపనకు సంబంధించింది కాదని అన్నారు. మూకదాడుల సమయంలో ఆ నినాదం వాడుకుంటున్నారని చెప్పారు. ఇదిలా ఉండగా, ఇల్తీజా ముఫ్తీ వ్యాఖ్యలపై జమ్మూకశ్మీర్ బీజేపీ మాజీ అధ్యక్షుడు రవీందర్ రైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు గానీ ఇతరుల మతపరమైన మనోభావాలను గాయపర్చే హక్కు ఎవరికీ లేదని తేల్చిచెప్పారు. -
NCERT Textbooks: ఆ పదాలు తొలగింపు
న్యూఢిల్లీ: పాఠశాల పాఠ్యపుస్తకాల్లో బాబ్రీ మసీదు కూల్చివేత, గుజరాత్ అల్లర్లలో ముస్లింల హత్య, హిందూత్వ తదితర పదాలు, వాక్యాలను తొలగిస్తున్నట్లు జాతీయ విద్యాపరిశోధనా, శిక్షణా మండలి(ఎన్సీఈఆర్టీ) పేర్కొంది. పాఠ్యపుస్తకాల్లో కాలానుగుణంగా చేయాల్సిన మార్పుల్లో భాగంగా ఈ సవరణలు చేపట్టినట్లు ఎన్సీఈఆర్టీ తెలిపింది. ఆరి్టకల్ 370 రద్దుకు సంబంధించిన అంశంలో పాక్ ఆక్రమిత జమ్మూకశ్మీర్(పీఓకే) అనే పదానికి బదులు ఆజాద్ పాకిస్తాన్ అనే పదాన్ని చేర్చారు. పుస్తకాల నుంచి కొన్ని పాఠ్యాంశాల తొలగింపుపై ఎన్సీఈఆర్టీ స్పందించింది. ‘‘ పుస్తకాల ఆధునీకరణలో జరిగే సాధారణ ప్రక్రియ ఇది. నూతన విద్యా ప్రణాళిక కింద చేసే కొత్త పాఠ్యపుస్తకాల తయారీకి దీనితో ఏ సంబంధం లేదని అధికారులు స్పష్టంచేశారు. ఇతర తరగతుల పుస్తకాలతోపాటు 11, 12 తరగతుల రాజనీతి శాస్త్రం, సామాజిక శాస్త్ర పాఠ్యపుస్తకాల్లో ఈ మార్పులు చేశారు. 11వ తరగతిలో లౌకికవాదం అనే 8వ చాప్టర్లో ‘‘ 2002 గుజరాత్ గోధ్రా అల్లర్ల తర్వాత వేయికిపైగా ఊచకోతకు బలయ్యారు. ఇందులో ముస్లింలే ఎక్కువ’’ అనే వాక్యంలో ముస్లింలు అనే పదం తొలగించారు. అల్లర్ల ప్రభావం అన్ని మతాలపై ఉన్న కారణంగా ఒక్క మతాన్నే ప్రస్తావించడం సబబు కాదని ఎన్సీఈఆర్టీ భావించింది. 12వ తరగతి రాజనీతిశాస్త్రం పుస్తకంలోని ‘స్వాతంత్య్రం నుంచి భారత రాజకీయాలు’ చాప్టర్లో కొత్తగా ఆరి్టకల్ 370 రద్దును జతచేశారు. 8వ చాప్టర్లో ‘‘ 1992 డిసెంబర్లో బాబ్రీ మసీదు కూల్చివేతతో ఎన్నో విపరిణామాలు జరిగాయి. ఇది బీజేపీ, హిందూత్వ వ్యాప్తికి దారితీసింది’’అన్న వాక్యాలకు బదులు ‘ శతాబ్దాలనాటి రామజన్మభూమి ఆలయ వివాదం దేశ రాజకీయాలనే మార్చేసింది’’ అని మార్చారు. ఇందులో హిందూత్వ పదాన్ని తొలగించారు. -
‘నేను కూడా హిందూనే’.. హిందుత్వంపై సీఎం కీలక వ్యాఖ్యలు
బెంగళూరు: హిందుత్వ సిద్ధాంతం, హిందూ ధర్మం వేరువేరని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. హిందుత్వ సిద్ధాంతంపై (ఐడియాలజీ) ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ వైపు మైనారిటీ ఓట్లు కోల్పోకుండా.. మరోవైపు మోడరేట్ హిందూ ఓట్లు దక్కించుకునేందుకు రాజకీయ వ్యూహంగా 'సాఫ్ట్ హిందుత్వ'ను పావుగా వాడుకుంటున్నారని మండిపడ్డారు. హిందుత్వలో సాఫ్ట్ హిందుత్వ, హార్డ్ హిందుత్వ అంటూ ఏం ఉండవని తెలిపారు. బెంగళూరులో కాంగ్రెస్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 'హిందుత్వ అంటే హిందుత్వనే. నేను హిందువునే. హిందుత్వం, హిందు అనేవి వేర్వేరు. మనం రాముడిని ఆరాధించలేదా? వాళ్లు (బీజేపీ) మాత్రమే రాముడిని పూజిస్తున్నారా? మన గ్రామాల్లో రామ మందిరాలు నిర్మించలేదా? మనం రాముడి భజనలు చేయలేదా? ' అని సిద్ధరామయ్య ప్రశ్నించారు. డిసెంబర్ చివరి వారంలో భజనలు జరుగుతుంటాయని, తమ గ్రామంలోనూ అలాంటి వేడుకలు జరిగేవని సిద్ధరామయ్య తెలిపారు. ఆ కార్యక్రమాల్లో తాను కూడా పాల్గొనేవాడినని చెప్పారు. కేవలం బీజేపీ వాళ్లే హిందువులా?.. మనం కాదా? అని మండిపడ్డారు. సిద్ధరామయ్య గత ఫిబ్రవరిలోనూ విపక్ష నేతగా ఉన్నప్పుడు ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. హిందుత్వ అనేది రాజ్యాంగవిరుద్ధమని, హిందుత్వ, హిందూ ధర్మం వేర్వేరని అన్నారు. తాను హిందూ మతానికి వ్యతిరేకం కాదని, తాను హిందువునని, కానీ మనువాదం, హిందుత్వకు వ్యతిరేకినని చెప్పారు. హత్యలను ఏ మతం సమర్ధించదని, కానీ హిందుత్వ మద్దతుదారులు హత్యలు, వివక్షను సమర్ధిస్తారని ఆరోపణలు చేశారు. తాను రామాలయాన్ని ఎప్పుడూ వ్యతిరేకించలేదని, కానీ రాజకీయ ప్రయోజనాలకు దానిని వాడుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నానని వ్యాఖ్యానించారు. మరో నాలుగు నెలల్లో లోక్‌సభ ఎన్నికలు, వచ్చే జనవరి 22న అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవం ఉన్న నేపథ్యంలో హిందుత్వపై సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. సిద్ధరామయ్య వ్యాఖ్యలకు బీజేపీ నేత అశ్వత్ నారాయణ్ కైంటర్ ఇచ్చారు. సిద్దరామయ్య, కాంగ్రెస్‌కు భారత్/ హిందుత్వానికి సంబంధించిన అంశాలపై అసలు స్పష్టతే లేదని విమర్శించారు. కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలు చేస్తుందని ఆరోపించారు. హిందూత్వం గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదన్నారు. చదవండి: మానవ అక్రమ రవాణా.. ఎయిర్ ఇండియా సిబ్బంది, ప్రయాణికుడి అరెస్టు Karnataka CM @siddaramaiah accuses BJP of "Fake Hindutva." Says, "Some people talk about soft Hindutva. Hindutva is Hindutva. Hindu and Hindutva are different. Haven’t we built Ram temples in our villages? Don’t we worship Rama? Aren’t we Hindus?” Siddaramaiah also pitches for… pic.twitter.com/RrkhHjVIF4 — Pinky Rajpurohit 🇮🇳 (@Madrassan_Pinky) December 28, 2023 -
Rajasthan Assembly polls: రాజస్థాన్ ఎవరిదో!
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పర్వం ముగింపునకు వస్తోంది. మిజోరం, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పోలింగ్ ఇప్పటికే ముగియగా కీలకమైన రాజస్థాన్ లో ప్రచార పర్వానికి గురువారం సాయంత్రంతో తెర పడింది. శనివారం పోలింగ్ జరగనుంది. అధికార కాంగ్రెస్, బీజేపీ రెండూ గెలుపుపై ధీమాగా ఉన్నా యి. ఏడు హామీలకు తోడు ప్రజాకర్షక పథకాలు కచ్చితంగా గట్టెక్కిస్తాయని ముఖ్య మంత్రి అశోక్ గెహ్లోత్ నమ్ముతున్నారు. దారుణంగా క్షీణించిన శాంతిభద్రతలు కచ్చితంగా సర్కారు పుట్టి ముంచుతాయని, మోదీ మేనియాకు హిందూత్వ కార్డు తోడై ఘనవిజయం సాధించి పెడుతుందని బీజేపీ అంటోంది. నవంబర్ 30న తెలంగాణలో పోలింగ్ ముగిశాక డిసెంబర్ 3న ఐదు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు జరిగి ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో రాజస్తాన్‌లో గత మూడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఓసారి చూస్తే... 2008పరిశీలకులతో పాటు అందరి అంచనాలనూ తలకిందులు చేస్తూ అధికార బీజేపీ అనూహ్యంగా ఓటమి చవిచూసింది! కాంగ్రెస్ మరోసారి విజయబావుటా ఎగరేసింది. గెహ్లోత్ మళ్లీ సీఎం అయ్యారు. ప్రజల ఆదరణ బీజేపీకే ఉన్నట్టు దాదాపుగా అన్ని సర్వేల్లోనూ తేలినా ఆ పార్టీ ఓడిపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ముఖ్యమంత్రిగా వసుంధరా రాజె సింధియా అనుసరించిన లోప భూయిష్టమైన ఎన్నికల వ్యూహమే ఇందుకు ప్రధాన కారణమని పరిశీలకులు అభిప్రాయపడ్డారు. ఆమె అహంకారపూరిత ప్రవర్తన, సీనియర్లకు ప్రా ధాన్యం ఇవ్వకపోవడం, అభ్యర్థుల ఎంపికలో ఒంటెత్తు పోకడలు పార్టీని ముంచాయంటూ విమర్శలు వెల్లు వెత్తాయి. మొత్తం 200 స్థానా లకుగాను కాంగ్రెస్ 96 చోట్ల నెగ్గగా బీజేపీ 78 స్థానాలకు పరిమితమైంది. కాంగ్రెస్‌కు 36.8 శాతం ఓట్లు పోలవగా బీజేపీకి 34.3 శాతం పడ్డాయి. ఇతరులకు 21 శాతం ఓట్లు పోలవడం బీజేపీ విజయావ కాశాలను గట్టిగా దెబ్బకొట్టింది. ఎందుకంటే 2003 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్‌కు ఓట్లు కేవలం ఒక్క శాతం మాత్రమే పెరిగాయి. బీజేపీ ఏకంగా 5 శాతానికిపైగా ఓట్లను నష్టపోయింది! ఇక బీఎస్పీ 7.6 శాతం ఓట్లతో 6 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. 2013 ఆనవాయితీని కొనసాగిస్తూ బీజేపీ ఘనవిజయం సాధించింది. వసుంధరా రాజె మళ్లీ ముఖ్యమంత్రి పీఠమెక్కారు. రాష్ట్ర చరిత్రలోనే రికార్డు స్థాయిలో బీజేపీ 163 సీట్లలో నెగ్గింది. కాంగ్రెస్ కేవలం 21 స్థానాలకు పరిమితమై ఘోర పరాభవం మూటగట్టుకుంది. రాష్ట్ర చరిత్రలో ఒక ప్రధాన పార్టీకి లభించిన అత్యల్ప స్థానాలు ఇవే! 1998 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 33 సీట్లొచ్చాయి. బీజేపీ 45.2 శాతం ఓట్లు సాధించగా కాంగ్రెస్‌కు 33.1 శాతం దక్కాయి. గుజ్జర్ నేత కిరోరీసింగ్ బైన్స్లా దన్ను కాంగ్రెస్‌కు పెద్దగా కలిసిరాలేదు. ఎప్పుడూ ఆదరించే మేవార్ ప్రాంతం ఈసారి బీజేపీకే జై కొట్టడంతో ఆ పార్టీ తేరుకోలేకపోయింది. 34 ఎస్సీ స్థానాల్లో కాంగ్రెస్ ఒక్కటి కూడా నెగ్గలేకపోవడం విశేషం. 25 ఎస్టీ సీట్లలో నాలుగే గెలిచింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా ప్రధానంగా తెరపైకి వచ్చిన నరేంద్ర మోదీ మేనియానే బీజేపీ ఘన విజయానికి కారణమని సీఎం అశోక్ గెహ్లోత్ అంగీకరించడం విశేషం! బీఎస్పీ సగం అసెంబ్లీ సీట్లు కోల్పోయి మూడింటికే పరిమితమైంది. 2018 ప్రభుత్వాలను పడగొట్టే ధోరణి మరోసారి కాంగ్రెస్‌కు గెలుపు కట్టబెట్టింది. పీసీసీ చీఫ్‌గా యువ నేత సచిన్ పైలట్ అంతా తానై ఎన్నికల బాధ్యతలను చూసుకున్నారు. పార్టీ విజయంలో ఒకరకంగా కీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్ నెగ్గితే ఆయనే ముఖ్యమంత్రి అవుతారన్న ప్రచారం పార్టీకి బాగా లాభించింది. 100 సీట్లతో పార్టీ ఘనవిజయం సాధించింది. 2013లో 59 ఎస్సీ, ఎస్టీ స్థానాలు నెగ్గిన బీజేపీ ఈసారి కేవలం 21 స్థానాలకు పరిమితమైంది. ఆళ్వార్, దౌసా, సవాయ్ మధోపూర్, టోంక్, ధోల్పూర్, కరౌలీ జిల్లాల్లోనైతే ఒక్క ఎస్సీ, ఎస్టీ స్థానం కూడా నెగ్గలేకపోయింది. ఫలితాల అనంతరం పైలట్ సీఎం అవుతారని అంతా భావించారు. కాంగ్రెస్ అధిష్టానం అనూహ్యంగా పాత కాపు మరోసారి గెహ్లోత్‌కే చాన్స్ ఇచ్చింది. రెండేళ్ల అనంతరం అవకాశమిస్తామంటూ పైలట్‌ను అనునయించి డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టింది. మాట నిలుపుకోకపోవడంతో 2020లో ఆయన తిరుగుబాటు చేసినా రాహుల్‌గాంధీ జోక్యంతో రాజీ పడ్డారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
న్యూ ఇండియాలోకి ‘పరకాల ప్రవేశం’!
‘క్రూకెడ్ టింబర్ ఆఫ్ హ్యుమానిటీ’ అనే పాశ్చాత్య భావన ఒకటి ఉంది. అందులోని ‘హ్యుమానిటీ’ స్థానంలో ‘న్యూ ఇండియా’ను చేర్చి రాసిన పుస్తకం ‘ది క్రూకెడ్ టింబర్ ఆఫ్ న్యూ ఇండియా: ఎస్సేస్ ఆన్ ఎ రిపబ్లిక్ ఇన్ క్రైసిస్’. ‘క్రూకెడ్ టింబర్ (వంకర వృక్షం) ఆఫ్ హ్యుమానిటీ’ అంటే మానవ జన్మలోని అపరిపక్వత. అదే విధంగా మోదీ భారత్‌లో ‘హిందూత్వ’ ఒక అపరిపక్వత అని ఈ పుస్తకం సంకేతపరచడం ఆసక్తికరం. యాదృచ్ఛికాలు అన్నవి వట్టి అర్థరహిత మైన సంభవాలేనా లేక వాటి వెనుక గొప్ప అంతరార్థం ఏదైనా ఉండి ఉంటుందా అని నేను తరచూ ఆలోచిస్తూ ఉంటాను. ఒకటేదైనా మనం అర్థం చేసుకోలేనిది, లేదా కనీసం గ్రహించలేనిది దీర్ఘకాలానంతరం దానికై అదే బహిర్గతం అవుతుంది. గతవారం జరిగింది అటువంటిదే అయివుండే అవకాశం ఉంది. చూద్దాం, ఈ మాటను మీరు ఒప్పుకుంటారేమో! ఇటీవల నేను పరకాల ప్రభాకర్‌ను ఆయన తాజా పుస్తకం ‘ది క్రూకెడ్ టింబర్ ఆఫ్ న్యూ ఇండియా: ఎస్సేస్ ఆన్ ఎ రిపబ్లిక్ ఇన్ క్రైసిస్’పై ఇంటర్వ్యూ చేశాను. ప్రధానమంత్రి మీద, భారతీయ జనతాపార్టీని ఆయన రూపాంతర పరచిన వైనం మీద చురుక్కుమనిపించే విమర్శ ఆ పుస్తకం. ప్రభాకర్ ఏమిటన్నది మీరు కనుగొన్నప్పుడు ఆ చురక మరింత స్పష్టంగా దృగ్గోచరం అవుతుంది. ఇంటర్వ్యూ చేసిన మరునాడే బీజేపీకి కర్ణాటకలో పరాభవం ఎదురైంది. దక్షిణాదిన ఆ పార్టీకి ఉన్న ఏకైక రాష్ట్రం హిందుత్వ ముఖం మీదే తలుపులు వేసేసింది. పోయిన ఆదివారం ‘విముక్త’ బెంగళూరులో ప్రభాకర్ పుస్తకానికి ఆవిష్కరణ జరిగింది. ప్రభాకర్ అనే వ్యక్తి ఇదీ అని చెప్పాలన్నది నా ఉద్దేశం కాదు. ఒక వ్యక్తిగా ఆయన గురించి ఆయననే మాట్లాడనివ్వడం మంచిది. మన ఆర్థిక వ్యవస్థ గురించి ఆయన ఇలా అంటారు: ‘‘దేశ ఆర్థిక యాతనలు మోదీ పాలనలోని విస్మయకరమైన అసమర్థతల వల్ల తలెత్తినవి. ఆయన పాలన చక్కటి ఆలోచనాపరత్వాన్ని, పొందిక గుణం కలిగిన ఆర్థిక తత్వాన్ని జతపరచలేకపోయింది.’’ ‘‘ఇష్టానుసారం అధికారాన్ని అపరిమితంగా ఉపయోగించడానికి అలవాటు పడింది. ప్రజాస్వా మ్యాన్ని సమస్యాత్మకం చేసింది.’’ ఫలితంగా, ‘‘1975–77 ఎమర్జెన్సీ తర్వాతెన్నడూ లేని భయం సమాజంలో నేడొక కఠినమైన ప్రత్యక్ష వాస్తవం అయింది’’ అని ప్రభాకర్ ఈ పుస్తకంలో రాశారు. ప్రభాకర్ నిక్కచ్చిగా, నిర్దయగా విషయాన్ని తేల్చేస్తారు. ‘‘మన ప్రజాస్వామ్యం సంక్షోభంలో ఉంది. మన సామాజిక నిర్మాణం బల హీనం అయింది. మన ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో ఉంది. మనం చీకటి యుగాలకు తిరోముఖం పడుతున్నాం’’ అంటారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలలో హిందూత్వ – అలాగే హిందూత్వపై ప్రతిస్పందించడంలో విపక్షాల అసమర్థత, ప్రాసంగికతను కలిసి ఉన్నా యని ఆయన చెప్పారు. ‘‘దేశ రాజకీయ అగ్రగణ్యతల దిగు వన దాగి ఉన్నమూల ప్రవృత్తులు; సామాజిక, సాంస్కృతిక అభద్రతలను తారుమారు చేయగల నైపుణ్యంపై హిందూత్వ అభివృద్ధి చెందుతుందని అన్నారు. మన గుణగణాలలోని చీకటి కోణాలకు ఇది ఒక విజ్ఞప్తి అని ప్రభాకర్ ఈ పుస్తకం గురించి నాతో అన్నారు. మొన్నటి ఎన్నికల ప్రచారం ముగింపు రోజుల్లో ప్రధాని జై బజరంగబలీ అంటూ ఓటింగ్ మీటను నొక్కమని కర్ణాటక ప్రజల్ని కోరడం వెనుక ఆయన నేర్పు, నర్మగర్భత ఉన్నాయని అనేకమంది విశ్వసిస్తున్నారు. పనితీరులోని వైఫల్యం, అవినీతిలో గడించిన ఖ్యాతి కారణంగా కర్ణాటక ఎన్నికల్లో బీజేపీకి ఎదురైన ఘోర పరాజయం మీద ప్రభాకర్ తీర్మానాలు స్పష్టతను కలిగి ఉన్నాయి. ‘‘బీజేపీ ప్రస్తుత ఓటమి, తిరిగి అధికారాన్ని సాధించుకోలేక పోవడం అన్నవి పనితీరు వల్ల కాదు. హిందూత్వ గుర్తింపునకు ఆ పార్టీ దృఢ వైఖరిని కలిగి ఉండటం వల్ల, హిందూయేతరులను వేరుగా చూడటం వల్ల’’ అని ఆయన అన్నారు. అధికారాన్ని నిలబెట్టుకునేందుకు బీజేపీ జై బజరంగ బలీ అన్నదే తప్ప, మంచి పాలనను ఇస్తానని అనలేదు. మనమిప్పుడు ప్రతిపక్షాల గురించి ప్రభాకర్ రాసిన చోటుకు వద్దాం. ‘‘బీజేపీయేతర రాజకీయ వర్గ వైఫల్యమే నేడు మన దేశం సూత్రరహితమైన సౌధంగా మారడానికి ప్రధాన కారణం. బీజేపీనీ, ఆ పార్టీ పరివారాన్నీ సైద్ధాంతికంగా వ్యతిరేకించే రాజకీయ పార్టీలే అత్యంత ప్రభావవంతమైన ఈ సవాలును ఎదుర్కొని ఉండాల్సింది. కానీ వారు తమ దృష్టి, వ్యూహం, శక్తికి సంబంధించిన స్థిరమైన వైఫల్యాలతో మనల్ని ఓడిపోయేలా చేశారు’’ అన్నారాయన. ఆ వైఫల్యాలను ప్రతిపక్షాలు ఎలా అధిగమిస్తున్నాయనే దానికి కర్ణాటకలో మొన్నటి కాంగ్రెస్ ఎన్నికల ప్రచారమే మొదటి నిదర్శ నమని నేను భావిస్తున్నాను. దృష్టిపరంగా ఆ పార్టీ... ఓటర్ల నిజమైన సమస్యలకు సంక్షేమాన్ని హామీని, సానుభూతితో కూడిన ప్రతిస్పంద నను అందించింది. వ్యూహాత్మకంగా... హిందూ వ్యతిరేకి అని ఆ పార్టీపై ప్రధాని చేసిన ఆరోపణలను తిప్పికొట్టకుండా దాట వేసింది. శక్తి పరంగా అక్షరాలా ఉత్తేజాన్ని నింపింది. దీనిని ప్రభాకర్ అంగీ కరిస్తారని చెప్పగలను. ప్రచారం చరమాంకానికి చేరుకోగానే కాంగ్రెస్ గంభీరంగా, దృఢ నిశ్చయంతో చెవిని నేలకు ఆన్చి (సమగ్ర విషయ సేకరణ జరిపి), ప్రజలపై దృష్టి సారించింది. బీజేపీ ఇందుకు విరుద్ధంగా ఉత్కంఠంగా, నిరాశాపూరితంగా, కొన్నిసార్లు ఉన్మాదంగా కనిపించింది. ఇందుకు కారణం హిందూత్వ వెనకంజ వేయడమేనా? ఉనికి కోసం పోరాడుతుండటమేనా? లేదంటే, ఓటర్లకు కావలసిందేమిటో కాంగ్రె స్కు తెలిసి ఉండటం వల్లనా? ఇప్పుడు నేను పేర్కొన్న సంఘటనల క్రమం, వాటి ఆసక్తికరమైన కాలానుక్రమణిక కేవలం యాదృచ్ఛికం అని అనిపిస్తున్నాయా? లేదా విధివశాత్తూ జరిగినవిగా తోస్తున్నాయా? నిజాయతీగా ఒప్పుకుంటు న్నాను. నేను చెప్పలేను. అయితే ప్రధానమంత్రి, ప్రతిపక్షాలు... ప్రభా కర్ రాసిన ఈ పుస్తకాన్ని చదవాలని నేను కోరుకుంటున్నాను. వాళ్లకు ఈ పుస్తకం ఒక హెచ్చరిక... అలాగే పాఠం కూడా! కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
గుజరాత్, హిమాచల్ ఫలితాలు; వాస్తవాలు గ్రహించాల్సింది ఎవరు?
డిసెంబర్ 8న వెలువడిన గుజరాత్ శాసనసభ ఎన్నికల ఫలితాలు వివిధ కోణాల నుంచి చారిత్రకంగా విశేష ప్రాధాన్యం కలిగి ఉంటాయి. ఆ రాష్ట్ర చరిత్రలో ఒకే రాజకీయ పార్టీకి 156 శాసనసభ స్థానాలు లభించడం మొదలు, వరసగా ఏడవసారి అధి కారంలోకి రావడం వరకు ఐదారు కీలక అంశాలు ఉన్నాయి. ఈ ఫలితాలతో పాటే వెలువడిన హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర సంప్రదాయాన్ని పునరావృతం చేశాయి. అక్కడ ఒక పార్టీకి రెండుసార్లు వరసగా అధికారం ఇచ్చే పద్ధతి లేదు. 25 స్థానాలకు పరిమితమైన బీజేపీ, 40 స్థానాలు సాధించిన కాంగ్రెస్‌కు అధికారం అప్పగిస్తున్నది. ఓడిన పార్టీల నేతల నోటి నుంచి వచ్చే మొదటిమాట గెలుపోటములు రాజకీయాలలో సహజం. యాపిల్ సాగు శాసించే హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలలో బీజేపీకీ, కాంగ్రెస్కీ ఓట్లలో తేడా ఒక శాతం కంటే తక్కువ. దీనితో బీజేపీ ఓడినా గెలిచినట్టే. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఘనతలు బీజేపీ అండతో పోరాడిన ప్రధాని నరేంద్ర మోదీవే. ఈ ఫలితాలు చూసిన తరువాత తప్పక వేసుకోవలసిన ప్రశ్న ఈ ఎన్నికల నుంచి వాస్తవాలు గ్రహించవలసిన వారు నిజంగా ఎవరు? బీజేపీ వ్యతిరేకత తప్ప మరొక ఎజెండా జోలికిపోని రాజకీయ పార్టీలా? ప్రజా తీర్పు ప్రజాతీర్పే, బీజేపీ పట్ల మా గుడ్డి వ్యతిరేకత మాదే అన్న ధోరణిలో ఉండిపోతున్న మేధావులూ, ఉదారవాదులా? మేం ప్రజాతీర్పును గౌరవిస్తున్నామంటూ రాజకీయ పార్టీలు చూపిస్తున్న కనీస మర్యాదను మేధావులుగా, ఉదారవాదులుగా చలామణీ అవుతున్నవారు చూపిస్తున్నారా అంటే సమాధానం దొరకదు. వీరందరి అభిమతం ప్రజాస్వామ్య పరిరక్షణే కావచ్చు. దానిని శంకించనక్కర లేదు. కానీ ప్రజాతీర్పును గౌరవించడం దగ్గర బీజేపీ యేతర శిబిరం ప్రదర్శిస్తున్న ఆత్మహత్యాసదృశమైన వైఖరి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయలేదు. వీరు ఒక రాజకీయ పార్టీ మీద, ఒక దేశ సార్వభౌమాధికారం మీద విమర్శల విషయంలో ఉండవలసిన లక్ష్మణరేఖను విస్మరిస్తున్నారు. ముస్లింల మీద జరిగిన కొన్ని దాడులను చూపిస్తూ హిందూ మెజారిటేరియన్ వాదాన్ని అంతర్జాతీయంగా రుద్దాలన్న ప్రయత్నం పట్ల సాధారణ భారతీ యులు ఆగ్రహంతో ఉన్నారని 2019 లోక్‌సభ ఎన్నికలు, తాజా గుజరాత్ ఎన్నికలలో రికార్డు స్థాయి ఫలితాలు చెప్పాయి. ఈ మేధావులు కష్టపడి నిర్మిస్తున్న హిందూ మెజారిటేరియన్ సిద్ధాంతం ముస్లింలకు రక్షణ కల్పించేది కాదు. నిజానికి మైనారిటీలకు అనాలి. కానీ వీరు మైనారిటీ అంటే కేవలం ముస్లింలు అనే అభిప్రాయాన్ని కలిగిస్తున్నారు. ఇదే హిందూ ఫోబియాకు జన్మనిచ్చింది. అది బీజేపీకి ఉపయోగపడుతోంది. సాధారణ హిందువు, సాధారణ ముస్లిం కోరుకునేది శాంతినే! పీఎఫ్ఐ లాంటి పచ్చి హిందూ, భారత వ్యతిరేక సంస్థల ప్రభావంలో పడినవారు తప్ప సాధారణ ముస్లింలు మత కల్లోలాలను కోరుకోరు. బీజేపీ పాలనలో నిస్సందేహంగా మత కల్లోలాలు లేవు. ఢిల్లీ మత కల్లోలాలు, దసరా సందర్భంగా జరిగిన తాజా అలజడులు పీఎఫ్ఐ వంటి సంస్థల కారణంగానే జరిగాయి. అది ఇంటెలిజెన్స్ సమాచారం కూడా. ఆ వర్గం నుంచి ఒక్క అభ్యర్థిని కూడా నిలపకున్నా, గుజరాత్ తాజా ఫలితాల ప్రకారం ముస్లింలు అత్యధికంగా ఉన్న 19 నియోజక వర్గాలలో 17 బీజేపీకి దక్కాయి. బీజేపీ పట్ల తమకు గుడ్డి వ్యతికత అయితే లేదని వారే ప్రకటించినట్టయింది. గుజరాత్ శాసనసభలో ముస్లింల సంఖ్య తగ్గడం ఇవాళ్టి పరిణామం మాత్రం కాదు. 1980 సంవత్సరంలో జరిగిన ఎన్నికలలో 12 మంది ముస్లింలు చట్టసభకు వెళ్లారు. అప్పుడే కాంగ్రెస్ ΄పార్టీ ‘ఖామ్’ పేరుతో ఒక ఓటుబ్యాంక్ సమీకరణను తెర మీదకు తెచ్చింది. అదే క్షత్రియ, హరిజన్, ముస్లిం, ఆదివాసీ, ముస్లిం సమీకరణ. గడచిన ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థులు మహమ్మద్ జావెద్ ఫిర్జాదా, ఘియాజుద్దీన్ షేక్, ఇమ్రాన్ ఖెడావాలా గెలిచారు. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ ఆరుగురు ముస్లింలను అభ్యర్థులుగా నిలిపింది. వీరిలో ఖెడావాలా మాత్రమే బీజేపీ, ఎఐఎంఐఎం సవాళ్లను ఎదుర్కొని సభలో ప్రవేశించ బోతున్నారు. గుజరాత్‌తో సంబంధం లేకున్నా, ఈ ఎన్నికలతో పాటే జరిగిన రాంపూర్ (ఉత్తరప్రదేశ్) నియోజకవర్గ ఉప ఎన్నిక ఫలితం గురించి చెప్పడం అసందర్భం కాబోదు. ముస్లింలు అధిక సంఖ్యలో ఉండే ఈ నియోజకవర్గంలో ఏడు దశాబ్దాలుగా ముస్లిం అభ్యర్థులే గెలుస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆజంఖాన్ మీద క్రిమినల్ కేసులు, అరెస్టు తదితర కారణాలతో పదవి రద్దయింది. దీనితో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇప్పుడు సమాజ్‌వాదీ పార్టీ తరఫున అసీమ్ రజా బరిలో ఉండగా, బీజేపీ అభ్యర్థిగా ఆకాశ్ సక్సేనా నిలిచారు. సక్సేనా 33,000 భారీ ఆధిక్యంతో సమాజ్‌వాదీ అభ్యర్థిని ఓడించారు. గుజరాత్ మోర్బీ వంతెన కూలిన ఘటన, దానితో 135 దుర్మరణం పాలైన సంగతిని ఒక వర్గం మీడియా మృతుల మీద సానుభూతిగా కంటే, బీజేపీకి వ్యతిరేకాస్త్రంగానే భావించినట్టు కనిపిస్తుంది. ఆ ఘటన బీజేపీ గెలుపు మీద ప్రభావం చూపుతుందని ప్రచారం చేసింది. ఆ జిల్లాలో (మోర్బీ) మూడు అసెంబ్లీ నియోజక వర్గాలు మోర్బీ, టంకారా, వాంకనెర్ ఉన్నాయి. వీటిని 2017 ఎన్నికలలో కాంగ్రెస్ గెలిచింది. కానీ ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీ ఈ స్థానాలను గెలుచుకుంది. బీజేపీ విజయాన్ని... కాంగ్రెస్ ఓట్లు చీల్చడం, హిందూత్వ వంటి అసహజ విశ్లేషణలతో తక్కువ చేయడానికి ప్రయత్నించడం కూడా ప్రజాస్వామ్యాన్ని గౌరవించడం కానేకాదు. మరి హిమాచల్‌లో జరిగిన దానిని ఏమనాలి? బీజేపీ ఓటును ‘ఆప్’ చీల్చినందునే కాంగ్రెస్ గెలిచిందంటే ఒప్పుకుంటారా? బీజేపీని ప్రస్తుతం ప్రజలు ఆదరిస్తున్నారు. దీనిని అంగీకరించడమంటే... బీజేపీని బలోపేతం చేయడం కాదు, ప్రజా తీర్పును గౌరవించడం! ఆ పార్టీని సిద్ధాంతపరంగా వ్యతిరేకించడమనేది రాజ్యాంగ హక్కు. ఈ రెండింటినీ గుర్తించాలి. ఆర్టికల్ 370 రద్దు, ఉమ్మడి రస్మృతి, పౌరసత్వ సవరణ చట్టం వీటన్నిటికీ రాజ్యాంగ ఆమోదం ఉంది. కానీ వీటన్నిటి లోనూ మైనారిటీ వ్యతిరేకతనే మేధావులు వెతకడానికి ప్రయత్నించారు. దేశ ప్రయోజనాల కోసం ఏ అడుగు వేసినా, ఏది చేసినా బీజేపీని బోనులో నిలబెట్టే ప్రయత్నం మానడం లేదు. మెజారిటీ ప్రజల మౌనాన్ని వీరు అలుసుగా తీసుకుంటున్న మాట కూడా వాస్తవం. ఆ మౌనం వెనుక ఏమున్నదో ఇప్పటికే ఎన్నో పర్యాయాలు రుజువైంది. బీజేపీని ఓడించడానికి అవాస్తవాలను జాతీయంగా, అంతర్జాతీయంగా కూడా ప్రచారం చేయడం సాధారణ ప్రజలకీ, యువతరానికీ కూడా మింగుడు పడడం లేదు. పీఎఫ్ఐ, కొందరు మౌల్వీలు చేస్తున్న హిందూ వ్యతిరేక, భారత వ్యతిరేక వ్యాఖ్యలను ఖండించడం దగ్గర మేధావులు, ఉదారవాదులు ప్రదర్శిస్తున్న ఊదాసీన వైఖరి, సెలెక్టివ్ పంథా కూడా మైనారిటీలకూ, మెజారిటీలకూ మధ్య అగాధాన్ని తగ్గించడానికి బదులు పెంచుతోందన్న స్పృహ వారికి లేదు. ఇప్పుడు అయోధ్య అంశం లేదు. జ్ఞానవాపి, మధుర ఎన్నికల అంశాలుగా లేవు. అయినా బీజేపీ రికార్డు విజయం సాధించింది. కారణం సంక్షేమ పంథా. షాహీన్ బాగ్కీ, బీజేపీ వ్యతిరేక రైతు ఉద్యమానికీ ఇచ్చిన గౌరవం ఒక గిరిజన మహిళను రాష్ట్రపతి పీఠం మీద కూర్చోబెట్టినప్పుడు మేధావులు ఎందుకు ఇవ్వలేకపోయారన్న ప్రశ్న సగటు భారతీయుడిని ఎప్పటికీ తొలుస్తూనే ఉంటుంది. పరిణామాలను పక్షపాతం ఆధారంగా విశ్లేషించడం కాదు, ప్రజాతీర్పులు, ప్రజల అభిప్రాయాల కోణం నుంచి చూడాలి. అప్పుడే ప్రజాస్వామ్యానికి విలువ! రాజకీయ పార్టీ మీద ఆగ్రహం వ్యవస్థల మీద, ఆ వ్యవస్థలకు సంబంధించిన విలువల మీద ఆగ్రహంగా మారకూడదు. (క్లిక్ చేయండి: విమర్శను ఆహ్వానించే స్ఫూర్తి లేదా?) - డాక్టర్ గోపరాజు నారాయణరావు సీనియర్ జర్నలిస్ట్ -
భారత్‌ను ఒంటరిని చేస్తారు జాగ్రత్త!
‘నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందన్న’ నానుడి అక్షరాలా నిజమని నూపుర్ శర్మ అనుచిత వ్యాఖ్యల ఉదంతం స్పష్టం చేస్తోంది. ఆమె నోటి దురుసు వల్ల ఇవ్వాళ భారతదేశం అనేక ముస్లిం దేశాల నుంచి తీవ్రమైన నిరసనలను ఎదుర్కోవలసివచ్చింది. బీజేపీ ప్రభుత్వం కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని ఇచ్చే రాజ్యాంగంలోని 370 ఆర్టికల్ రద్దు చేయడం, పౌరసత్వ సవరణ చట్టం తేవడం, హిందుత్వ వాదులు హిజాబ్ పేరుతో ముస్లిం అమ్మాయిలపైన వివక్షను ప్రదర్శించడం వంటి అనేక కారణాల వల్ల ఆయా దేశాల్లో గూడుకట్టుకున్న అసంతృప్తి వెళ్లగక్కడానికి ఈ వ్యాఖ్యలు తక్షణ కారణంగా పనిచేశాయి. ఈ ప్రపంచం చాలా చిన్నది. ఏ దేశం కూడా తనంతట తానుగా మనుగడ సాగించలేదు. అందుకే సహజీవనం, శాంతి, సామరస్య విధానాలు తప్పనిసరి. ‘‘ఎవరైనా తన మనసులో పెంచుకున్న ద్వేషం సహజంగా మనిషిలో ఉండే విచ క్షణను దెబ్బతీస్తుంది. తన మాటలు, చేతలు తన శత్రువు కన్నా తనకే ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తాయి. అవి తన ఉనికికే ప్రమాదాన్ని తెచ్చి పెడతాయి. వ్యక్తుల స్థాయిని బట్టి దాని పరిణామాలు ఉంటాయి.’’ గౌతమబుద్ధుడు కోపం, ద్వేషం గురించి చేసిన చాలా బోధనలలో ఈ విషయాన్ని సుస్పష్టంగా వివరించారు. సుత్తనిపాతంలోని కోకాలిక సుత్తం, అంగత్తర నికాయలోని ద్వేష సుత్తం, సంయుక్త నికాయలోని సుందరిక సుత్తంలో సోదాహరణంగా దీన్ని వివరించారు. మనుషుల్ని ప్రేమ, స్నేహం, కరుణల ద్వారా గెలుచుకోవాలేగానీ, ద్వేషంతో గెలవ లేరని కూడా బుద్ధుడు తన జీవితకాలంలో నిరూపించారు. ఇన్ని శతాబ్దాల తరువాత సరిగ్గా తథాగతుడి ఈ మాటలు ఇప్పుడు అక్షరాలా నిజమని రుజువవుతున్నది. ఇటీవల మహమ్మద్ ప్రవక్తపై భారతీయ జనతాపార్టీ (బీజేపీ) జాతీయ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు అటువంటి పరిస్థితులను సృష్టించాయి. ఉత్తర ప్రదేశ్‌లోని కాశీనగరంలో జ్ఞానవాపి మసీదులో శివలింగం ఉందన్న విషయంపై జరిగిన టెలివిజన్ చర్చలో నూపుర్ శర్మ ముస్లింల మనోభావాలను గాయపరిచే విధంగా మాట్లాడటం తీవ్ర వివాదానికి తెరతీసింది. భారత్‌లోని ముస్లింలకు సంబంధించిన ఏ వివాదంలోనూ తలదూర్చక సహనం వహించిన దేశాలు సైతం ఈ సందర్భంలో తమ అసంతృప్తిని విస్పష్టంగా వ్యక్తం చేశాయి. కొన్ని దేశాల్లో భారతదేశ వస్తువులను కొనరాదని తీర్మానించేలా వివాదం తారా స్థాయికి చేరింది. నిజానికి ఈ నిరసన ఈ సంఘటనతో బయటకు వచ్చినప్పటికీ, భారత దేశంలో మైనారిటీలపై, ప్రత్యేకించి ముస్లింలపై బాబ్రీ మసీదు కూల్చివేత నుంచి ఇప్పటివరకూ జరిగిన అనేక ఘటనలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లింలను తీవ్రమైన ఆందోళనకు గురిచేశాయి. అయితే నూపుర్ ఉదంతంతో వాళ్ళ అసంతృప్తి ఒక్కసారిగా బయటకు వచ్చింది. అంతేకానీ ఇది ఈ ఒక్క సంఘటన ఫలితం కాదు. బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత గోద్రా అల్లర్లు కూడా ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. ఇక్కడ ఒక మతం, మరొక మతంపై ద్వేషాన్ని ప్రకటించడం కాదు. ఇది ఒక రాజకీయ వ్యూహం. మెజారిటీగా ఉన్న హిందువుల ఓట్లను గెలుచు కోవడానికీ, వాళ్ళను తమవైపు తిప్పుకోవడానికీ ముస్లింలపై ద్వేషాన్ని నూరిపోశారు. ఇది ఉత్తర భారతదేశంలో చాలా విస్తృతంగా జరిగింది. ముస్లిం దండ యాత్రల వల్ల పశ్చిమ, ఉత్తర భారతదేశంలోని ప్రజలు చరిత్రలో ఇబ్బందులు ఎదుర్కొన్న మాట వాస్తవం. అయితే బీజేపీ అధికారం కోసం ప్రయత్నాలు మొదలు పెట్టిన తర్వాత ఆ ‘చరిత్ర’ను అడ్డు పెట్టుకొని రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తోంది. ఉత్తర ప్రదేశ్‌లో ఈ ధోరణి అధికంగా కనిపిస్తుంది. అయోధ్య సమస్య ఇందుకు మంచి ఉదాహరణ. మతం మనోభావాలకు సంబంధించిన సమస్య. గుజరాత్లో సైతం అటువంటి ప్రయత్నమే జరిగింది. హిందూ కులాల్లో ముస్లింల పట్ల ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకోవడానికి నిత్యం ఏదో ఒక వివాదాన్ని ముందుకు తీసుకువస్తున్నారు. గోసంరక్షణ, లవ్ జిహాద్ల పేరుతో చాలా చోట్ల భౌతిక దాడులు జరిగాయి. ఆవు మాంసం తిన్నాడనే నెపంతో అనేక దాడులు... చివరకు ప్రాణాలే తీసిన దారుణాలను ఈ దేశమే కాదు ప్రపంచ దేశాలూ ప్రత్యక్షంగా చూశాయి. కశ్మీర్ సమస్య పరిష్కారం పేరుతో 370 ఆర్టికల్ రద్దు, పౌరసత్వ సవరణ చట్టం, హిజాబ్ పేరుతో ముస్లిం అమ్మాయిలపైన వివక్షను ప్రదర్శించడం కూడా ముస్లింలను అభద్రతకు గురిచేసింది. ఇవన్నీ అంతర్జాతీయ స్థాయిలో కూడా భారత దేశంలో ప్రజలకు మత పరమైన స్వేచ్ఛ లేకుండా పోయిందని అనుకునేట్టు చేశాయి. సరిగ్గా ఇదే నేపథ్యం నుంచి మనం ముస్లిం దేశాల, సంస్థల నిరసనను చూడాల్సి ఉంటుంది, అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచంలోని ముస్లిం దేశాలు అనుసరించే వైఖరి భారత దేశ ఆర్థిక పురోగతిపై, రాజకీయ సుస్థిరతపై, సామాజిక సామరస్యంపై ప్రభావం చూపనున్నదనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రపంచంలోని 50 దేశాల్లో ముస్లింల జనాభా చాలా ఎక్కువ. దాదాపు 30 దేశాల్లో 90 శాతం ముస్లిం జనాభా ఉంది. 20 దేశాల్లో 50 శాతం పైగానే ముస్లిం జనాభా ఉంది. మధ్య ఆసియా, గల్ఫ్, ఆఫ్రికా లోని చాలా దేశాల్లో ముస్లిం ప్రభుత్వాలు ఉన్నాయి. వీటన్నింటితో భారత దేశానికి మంచి ఆర్థిక సంబంధాలున్నాయి. అంతేకాకుండా కేవలం గల్ఫ్‌లో 89 లక్షల మంది భారతీయులు ఉపాధి, ఉద్యోగాలు కలిగి ఉన్నారు. వాళ్ళ బతుకు మీద, భద్రత మీద కూడా దీని ప్రభావం ఉండబోతుందనడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు. ఒక నెల క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు బీజేపీ దేశంలోని ముస్లింల పట్ల చూపుతున్న వ్యతిరేకత, ద్వేషం గల్ఫ్ లోని కార్మికులు, ఉద్యోగుల భద్రత మీద వ్యతిరేక ప్రభావం చూపు తుందని హెచ్చరించిన విషయంలో నూరు శాతం వాస్తవం ఉంది. మన ఆర్థిక వ్యవస్థ గల్ఫ్ మీద అధికంగా ఆధారపడి ఉంది. పన్నెండు ముస్లిం దేశాలు భారతదేశం వైఖరిని తీవ్రంగా తప్పుపట్టాయి. ఇందులో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, ఇరాన్, ఇండోనేషియా లాంటి దేశాలున్నాయి. ముఖ్యంగా గల్ఫ్‌లోని ఆరు బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లతో భారత్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. ఇండియా ఈ దేశాలకు చేస్తున్న ఎగుమతుల్లో బియ్యం, గేదె మాంసం, మసాలాలు, సముద్రపు ఉత్పత్తులు, పండ్లు, కూరగాయలు, చక్కెర లాంటి ఉత్పత్తులు ముఖ్యమైనవి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో భారత దేశానికి వ్యాపార సంబంధాలు చాలా పటిష్టంగా ఉన్నాయి. అంతేకాకుండా, భారతదేశం వినియోగించే పెట్రోల్, డీజిల్, ఉత్ప త్తుల్లో 60 శాతం కేవలం గల్ఫ్ దేశాల నుంచే దిగుమతి అవుతున్నాయి. ఇప్పుడు ఈ సంబంధాలు దెబ్బతినే పరిస్థితి తలెత్తింది. అలాగే బీజేపీ దాని అనుబంధ సంస్థలూ, ఆ పార్టీ అధికారంలో ఉన్న చోట క్రైస్తవులపై కూడా వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నారు. గత ఆరేడేళ్ళలో కొన్ని వేల క్రైస్తవ స్వచ్ఛంద సంస్థలు విదేశాల నుంచి సేవాకార్యక్రమాల కోసం సేకరిస్తున్న నిధులను నిలిపివేశారు. కొన్ని వందల క్రైస్తవ మత బోధకులపై నిర్బంధాలు అమలయ్యాయి. గల్ఫ్ మినహా క్రైస్తవ సమాజం ప్రపంచ వ్యాప్తంగా ఉంది. ఇతర మతాల పట్ల, అక్కడి ప్రజల పట్ల సామరస్య పూర్వకంగా వ్యవహరించకపోతే భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రమా దంలో పడే అవకాశాలున్నాయి. అంతే కాకుండా, అంతర్గతంగా అశాంతి పెరిగి అల్లర్లు జరిగే అవకాశం ఉంది. అది రాజకీయ అస్థిరతకు దారితీస్తుంది. నూపుర్ శర్మ సంఘటన తర్వాత జరిగిన పరిణామాలు ఒక హెచ్చరిక లాంటివి. ఈ నేపథ్యంలో... ప్రజాస్వామ్య యుతంగా, రాజ్యాంగ బద్ధంగా, సెక్యులర్ వ్యవస్థ రక్షణకు పూనుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఏ ప్రభుత్వమైనా మనుగడ సాగించా లంటే మత సామరస్యం పాటించక తప్పదన్నది నిర్వివాదాంశం. అదే విషయాన్ని నూపుర్ వివాదం స్పష్టం చేసింది. దీంతో ఈ ప్రపంచం చాలా చిన్నదన్న విషయం కూడా రుజువైంది. ఏ దేశం కూడా తన సొంతంగా, తనంతట తానుగా మనుగడ సాగించలేదు. అందుకే పరస్పర సహకారం, సహజీవనం, శాంతి, సామరస్యం లాంటి విధానాలు అవసరమవుతున్నాయి. ఇటీవల ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ ముస్లింలు ఈ దేశపు పౌరులే, వారిని ద్వేషించ కూడదని చెప్పిన మాటలు చేతల్లోకి రావాలి. వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్: 81063 22077 -
‘ఇళ్లు తగలబెట్టే హిందూత్వ కాదు..ఇంట్లో పొయ్యి వెలిగించే సిద్ధాంతం’
సాక్షి, ముంబై: ఇరువర్గాల మధ్య మత ఘర్షణలు సృష్టించి ఇళ్లకు నిప్పంటించే హిందుత్వం తమది కాదని, ఇంట్లో పొయ్యి వెలిగించే హిందుత్వమని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఉద్ఘాటించారు. ముంబైలోని బాంద్రా–కుర్లా–కాంప్లెక్స్ (బీకేసీ) మైదానంలో శనివారం సాయంత్రం జరిగిన బహిరంగసభలో ఉద్ధవ్ ఠాక్రే ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా గత కొద్ది నెలలుగా రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులు, ప్రతిపక్ష బీజేపీ నేతల వ్యవహార శైలి, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వ్యాఖ్యలు, లౌడ్స్పీకర్లు, హనుమాన్ చాలీసా పఠనంపై మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) చీఫ్ రాజ్ ఠాక్రే మహావికాస్ ఆఘాడి ప్రభుత్వంపై చేస్తున్న వ్యాఖ్యలకు, ఆరోపణలకు సభ ద్వారా ఒకేసారి ధీటుగా సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ఉద్ధవ్ మాట్లాడుతూ, కాశ్మీర్లో పండితులను హతమారుస్తున్నారు. అక్కడ వారికి భద్రతలేదు. కానీ ఇక్కడ ఊరికే తిరుగుతూ రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు, వ్యాఖ్యలు చేసే వారికి మాత్రం కేంద్రం వై–ప్లస్ భద్రతా ఎలా కల్పిస్తుందని రాజ్ ఠాక్రే పేరు ఉచ్ఛరించకుండా పరోక్షంగా ప్రశ్నించారు. కాషాయ రంగు క్యాప్ (టోపీ)లు ధరించిన వారిని హిందూత్వవాదులంటున్నారు. మరి ఆర్ఎస్ఎస్ క్యాప్‌ల రంగు నల్లగా ఎలా ఉంటుందని నిలదీశారు. బాబ్రీ మసీదు కూల్చిన సమయంలో శివసేన ఎక్కడుందని మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. ఒకసారి పాత వీడియోలు చూడాలని హితవు పలికారు. బాబ్రీ మసీదు కూల్చడానికి దేవేంద్ర ఫడ్నవీస్ పైకెక్కే ప్రయత్నం చేస్తే ఆయన బరువుకే అదే కూలుతుందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. మేం ఓపిక, సంయమనం పాటిస్తున్నామంటే అసమర్ధులమని దాని అర్ధం కాదు... మా జోలికి వస్తే దయా దాక్షిణ్యం చూపించకుండా వచ్చిన దారిలోనే పరుగెత్తిస్తామని సీఎం హెచ్చరించారు. మా ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు.. మహావికాస్ ఆఘాడీ ప్రభుత్వం ఎక్కువ రోజులు కొనసాగదని, త్వరలోనే కూలిపోతుందని కొద్ది నెలలుగా బీజేపీ నాయకులు ప్రచారం చేస్తున్నారని, కానీ మా ప్రభుత్వం పూర్తిగా ఐదేళ్లు కొనసాగుతుందని, మరో 20 ఏళ్ల వరకు మహావికాస్ ఆఘాడి ప్రభుత్వమే రాష్ట్రాన్ని ఏలుతుందని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే స్పష్టం చేశారు. కరోనా గడ్డుకాలంలో సైతం పేదలకు ఉచితంగా ‘శివ్ భోజన్’ థాలి (రైస్ ప్లేట్) అందించిన ఘనత మా ప్రభుత్వానికే దక్కిందన్నారు. ఆ పథకం ఇప్పటికీ కొనసాగుతుంది. ఇలాంటి ప్రయత్నం ఏ రాష్ట్ర పభుత్వం చేయలేదని గుర్తు చేశారు. వెనకాముందు ఆలోచించకుండా అనుచిత వ్యాఖ్యలు చేయడమే ధ్యేయంగా పెట్టుకున్నారని బీజేపీపై నిప్పులు చెరిగారు. ప్రస్తుతం సభ జరుగుతున్న స్ధలంలో అంటే బీకేసీ మైదానంలో బుల్లెట్ ట్రైన్‌ను తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దేశంలో మొదటి బుల్లెట్ ట్రైన్ అహ్మదాబాద్–ముంబై మధ్య నడిపే ప్రతిపాదన సిద్ధమైతోంది. ఈ బుల్లెట్ ట్రైన్ ఎవరికి కావాలి? ఇది ముంబైని విడగొట్టేందుకు చేస్తున్న కుట్ర అని ఉద్ధవ్ ఆరోపించారు. ఈ సందర్భంగా సభా వేదికపై పర్యావరణ శాఖ మంత్రి ఆదిత్య ఠాక్రే, ఎంపీ సంజయ్ రావుత్, ఏక్నాథ్ షిందే, సుభాష్ దేశాయ్, అరవింద్ సావంత్, లీలాధర్ ఢాకే, అనీల్ పరబ్, వినాయక్ రావుత్, గులాబ్రావ్ పాటిల్, పలువురు ఎంపీలు, మంత్రులు ఉన్నారు. కాగా, మహావికాస్ ఆఘాడి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ ఠాక్రే ప్రమాణ స్వీకారం చేసిన తరువాత బహిరంగ సభ జరగడం ఇదే ప్రథమం. దీంతో పార్టీ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేశాయి. కొన్ని ఎకరాల బీకేసీ మైదానమంతా అభిమానులు, కార్యకర్తలతో కిక్కిరిసిపోయింది. పార్కింగ్ స్థలంలో చోటు లభించకపోవడంతో రోడ్లపై ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. దీంతో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడానికి పోలీసులకు తలప్రాణం తోకకు వచ్చింది. సభ పూర్తిగా విజయవంతం కావడంతో శివసేన కార్యకర్తలు, నేతలు సంతోషం వ్యక్తం చేశారు. ముంబైని మహారాష్ట్ర నుంచి విడదీసే కుట్ర ఫడ్నవీస్ వ్యాఖ్యలను బట్టి దేశ ఆర్థిక రాజధాని ముంబైని రాష్ట్రం నుంచి విడగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోందని, కానీ వారి ప్రయత్నాలను తిప్పి కొట్టనిదే రాష్ట్ర ప్రజలు, శివసైనికులు ప్రశాంతంగా ఉండరని హెచ్చరించారు. రాజ్ ఠాక్రేను మున్నాబాయి ఎంబీబీఎస్ చిత్రంలో సంజయ్ దత్తో ఆయన పోల్చారు. రాజ్ ఠాక్రే మున్నాబాయి లాంటి వాడని, ఆయన మెదడులో కెమికల్ సమస్య రావడంవల్లే రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నాడని పేరు ఉచ్ఛరించకుండా ఆరోపించారు. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత ప్రభుత్వం ఏర్పాటు చేసే విషయంలో శివసేన, బీజేపీ మధ్య విభేదాలు తలెత్తాయి. చివరకు మిత్రపక్షాలుగా ఉన్న ఇరు పార్టీలు విడిపోయాయి. అక్టోబర్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసే సమయంలో ఎదురైన చేదు అనుభవాల గురించి ఉద్ధవ్ వివరించారు. తెల్లవారుజామున ఎన్సీపీతో కలిసి బీజేపీ ప్రభుత్వం ఎలా ఏర్పాటు చేసిందో అందరికీ తెలిసిన విషయమేనన్నారు. ‘మీరు చేస్తే తప్పు లేదు. మేం చేస్తే మోసమా’ అంటూ అన్ని పార్టీలను నిలదీశారు. మీలాగా మేం గుట్టుచప్పుడు కాకుండా రాత్రికి రాత్రే ప్రమాణ స్వీకారం చేయలేదని, బహిరంగంగా అందరి సమక్షంలో ప్రభుత్వం ఏర్పాటుచేసి ప్రమాణ స్వీకారం చేశామని ఉద్ధవ్ గుర్తు చేశారు. అప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసి ఉంటే నేడు బీజేపీ–ఎన్సీపీ చెట్టాపట్టాలేసుకుని రాష్ట్రాన్ని ఏలేవారని దుయ్యబట్టారు. అధికారం లేకపోయేసరికి బీజేపీ నేతలు మతితప్పి ఇష్టమున్నట్లు ఆరోపణలు, వ్యాఖ్యలు చేస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో తామెన్నడూ అలా వ్యవహరించలేదన్నారు. అలా వ్యవహరించడం శివసేన సంస్కృతి కాదని, ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇలా ప్రవర్తించడం నేర్పలేదని స్పష్టం చేశారు. శివాజీ ఏలిన మహారాష్ట్ర ప్రతిష్టను చెడగొట్టే ప్రయత్నం కొందరు చేస్తున్నారని అన్నారు. బీజేపీ వ్యతిరేకులపై కేంద్రం ఈడీ, సీబీఐ దాడులు చేయిస్తోంది. ఇప్పుడు అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం వెనుకపడ్డారు. ఒకవేళ దావుద్ బీజేపీలో చేరితే మంత్రి పదవి కూడా ఇచ్చేందుకు వెనకాడరని ఆయన ధ్వజమెత్తారు. హిందూత్వాన్ని అడ్డుపెట్టుకుని ప్రజలను రెచ్చగొడుతున్న నాయకుల ముసుగులను తొలగిస్తామని హెచ్చిరించారు. -
ప్రకాశ్‌రాజ్‌కు బెదిరింపు లేఖ.. ‘మీపై నేరుగా దాడిచేసి పోలీసులకు లొంగిపోతా’
శివాజీనగర/బెంగుళూరు: బహుభాషా నటుడు ప్రకాశ్ రాజ్, సాహితీవేత్త వీరభద్రప్పతో పాటు 16 మంది కర్ణాటక సాహితీవేత్తలకు బెదిరింపు లేఖలు వచ్చాయి. ‘జై హిందూ దేశం, జై సహిష్ణు’పేరుతో వచ్చిన ఈ లేఖల్లో ‘మీపై నేరుగా దాడిచేసి పోలీసులకు లొంగిపోతా’అని ఉంది. దీనిపై వీరభద్రప్ప, పలువురు రచయితలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు భద్రత పెంచాలని కోరారు. తాను హిందువును కాదని, లింగాయత్‌ను అని వీరభద్రప్ప ఇటీవల ఓ కార్యక్రమంలో ప్రకటించారు. చదవండి👉🏻 చింతన్ శిబిర్ వేళ కాంగ్రెస్‌కు షాక్.. సీనియర్ నేత సునీల్ జాఖడ్ గుడ్‌బై -
అప్పుడే మోదీకి సపోర్ట్ చేశాం: సీఎం ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
ముంబై: గుజరాత్లో గోద్రా అల్లర్ల తరువాత అప్పటి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీకి శివసేన వ్యవస్థాపక అధ్యక్షుడు బాల్ ఠాక్రే మద్దతుగా నిలిచారని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే గుర్తు చేశారు. ఈ మేరకు ఆదివారం సీఎం ఓ సభలో మాట్లాడుతూ.. ‘గోద్రా అల్లర్ల తరువాత మోదీ హఠావో ప్రచారం జోరుగా సాగింది. ఆ సమయంలోనే ఆద్వానీ ఓ ర్యాలీ కోసం ముంబై వచ్చారు. అప్పుడు బాలా సాహెబ్‌తో మాట్లాడుతూ.. మోదీని తొలగించాల్సి ఉంటుందా అని అడిగారు. దీనిపై బాలా సాహెబ్ స్పందిస్తూ.. లేదు అతని జోలికి వెళ్లకండి. ‘మోదీ గయాతో గుజరాత్ గయా’(మోదీ పోతే, గుజరాత్ పోయినట్లే) అని తెలిపారు. మోదీ ప్రధానమంత్రి అవుతారని ఊహించలేదు. కానీ మేము హిందుత్వానికి మద్దతు ఇచ్చాం’ అని ఆనాటి రోజులను గుర్తు చేసుకున్నారు. ఇప్పటికి కూడా మోదీతో సత్సంబంధాలు ఉన్నాయని, కానీ దానర్థం పొత్తు పెట్టుకుంటామని కాదని స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం మహారాష్ట్రలో మసీదుల్లో లౌడ్ స్పీకర్లు, హనుమాన్ చాలీసా పారాయణం వంటి వివాదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీంతో హిందుత్వంపై శివసేన వైఖరిపై ప్రశ్నలు లేవనెత్తుతున్న నేపథ్యంలో ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖల్యు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. చదవండి: ఒక్క అవకాశం ఇవ్వండి.. అలా చేయకుంటే తరిమికొట్టండి: కేజ్రీవాల్ బీజేపీ ప్రభుత్వం కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. ఈడీ, సీబీఐ వంటి ఏజెన్సీలు పశ్చిమ బెంగాల్‌లాగే మహారాష్ట్రలో త్వరలో ప్రతిఘటనను ఎదుర్కోవచ్చని తెలిపారు. ‘ప్రతిదానికి ఓ పరిమితి ఉంటుంది. పశ్చిమ బెంగాల్ వెళ్లాలంటే కేంద్ర ఏజెన్సీలు భయపడుతున్నాయి. ఇతర రాష్ట్రాలలో కూడా ఈ పరిస్థితి రాకూడదు. కేంద్ర ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్ర సంస్థలను ఉపయోగించుకోకూడదు. రాజకీయ నాయకులు చేసిన దానికి అధికారులు భయపడుతున్నారు. ప్రధాని దేశం మొత్తానికి. ఆయన దేశ శత్రువులతో పోరాడాలి. అదే విధంగా మహారాష్ట్ర నవ నిర్మాణ సేన చీఫ్ రాజ్ ఠాక్రేపై సీఎం విరుచుకుపడ్డారు. కొంతమంది ఎప్పటికీ జెండాలు మారుస్తూనే ఉంటారని విమర్శించారు. ‘ముందుగా వారు మరాఠీయేతరులపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఇప్పుడేమో హిందువేతరులపై దాడులు చేస్తున్నారు. ఇది మార్కెటింగ్ కాలం. ఇది పని చేయకుంటే ఇంకొకటి. లౌడ్ స్పీకర్ల విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఒక మతం గురించి చెప్పిందని నేను అనుకోను. మార్గదర్శకాలు అన్ని మతాలకు వర్తిస్తాయి’ అని సీఎం ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యానించారు. చదవండి: 118 ఏళ్ల వ్యక్తి ఆరోగ్య రహస్యం ఏంటో తెలుసా.. చాక్లెట్, ఓ గ్లాస్ వైన్ -
యోగి ఆదిత్యనాథ్ అసలు పేరు తెలుసా?
లక్నో: యోగి ఆదిత్యనాథ్.. దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌కు వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా ఎన్నికైన నాయకుడు. బీజేపీని మరోసారి విజయతీరాలకు చేర్చిన నేతగా ఆయన పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. బీజేపీలో ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యామ్నాయం యోగియే అన్న ప్రచారం సైతం ఇప్పటికే ఊపందుకుంది. హిందుత్వ నినాదానికి ‘పోస్టర్ బాయ్’గా, ఫైర్‌బ్రాండ్ లీడర్‌గా గుర్తింపు పొందిన యోగి ఆదిత్యనాథ్ తరచుగా ముస్లిం వ్యతిరేక వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంటారు. మఠాధిపతి నుంచి ముఖ్యమంత్రి పీఠం వరకూ ఆయన ప్రస్థానం నిజంగా ఆసక్తికరం. ► యోగి ఆదిత్యనాథ్ అసలు పేరు అజయ్‌సింగ్ బిస్త్. ► ఉమ్మడి ఉత్తరప్రదేశ్‌లో పౌరీ గర్వాల్ జిల్లాలోని పాంచుర్ (ప్రస్తుత ఉత్తరాఖండ్)లో 1972 జూన్ 5న ఠాకూర్ సామాజికవర్గంలో జన్మించారు. తండ్రి ఆనంద్‌సింగ్ బిస్త్ ఫారెస్ట్ రేంజర్‌గా పనిచేశారు. నలుగురు అన్నదమ్ములు, ముగ్గురు అక్కాచెల్లెళ్లలో యోగి రెండో సంతానం. ► 1990లో ఇల్లు విడిచి వెళ్లిపోయారు. రామమందిర నిర్మాణ ఉద్యమంలో చేరారు. చురుగ్గా కార్యకలాపాలు సాగించారు. ► గోరఖ్‌పూర్‌లోని గోరఖ్‌నాథ్ ఆలయ పీఠాధిపతి మహంత్ అవైద్యనాథ్కు ప్రియ శిష్యుడిగా మారారు. ► అవైద్యనాథ్ మరణం తర్వాత 2014లో గోరఖ్‌నాథ్ ఆలయ మఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటికీ పీఠాధిపత్యం ఆయనదే. ► పీఠాధిపతిగా ఉంటూ బీజేపీపై విమర్శలు చేసేందుకు కూడా ఆదిత్యనాథ్ వెనకాడలేదు. హిందుత్వ సిద్ధాంతాన్ని బీజేపీ నిర్వీర్యం చేస్తోందంటూ తూర్పారబట్టేవారు. అయినా యోగిపై ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతలు అభిమానం ప్రదర్శించేవారు. ► ‘హిందూ యువవాహని’ పేరిట యోగి సొంతంగా ఒక సేనను తయారు చేశారు. అందులో భారీగా కార్యకర్తలను చేర్చుకున్నారు. ► స్వగ్రామంలోనే ప్రాథమిక విద్య పూర్తి చేశారు. హేమావతి నందన్ బహుగుణ గర్వాల్ వర్సిటీ నుంచి మ్యాథ్స్‌లో బ్యాచ్లర్స్ డిగ్రీ అందుకున్నారు. 1998లో సొంత గ్రామంలో స్కూలు నెలకొల్పారు. ► గురువు అవైద్యనాథ్ మార్గదర్శకత్వంలో 1998లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ► 28 ఏళ్ల వయసులోనే గోరఖ్‌పూర్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆ లోక్‌సభలో అత్యంత పిన్నవయస్కుడు ఆయనే. ► 1998, 1999, 2004, 2009, 2014ల్లో ఐదుసార్లు గోరఖ్‌పూర్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ► 2017 ఎన్నికల్లో యూపీలో ఘనవిజయం సాధించిన బీజేపీ యోగిని అనూహ్యంగా సీఎంగా ఖరారు చేసింది. 2017 మార్చి 19న యూపీ 21వ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేశారు. తర్వాత ఎమ్మెల్సీగా గెలుపొందారు. ► హిందుత్వ ప్రతినిధిగా తన ప్రతిష్టను మరింత పెంచుకొనేలా యోగి పలు నిర్ణయాలు తీసుకున్నారు. యూపీలో గోవధపై ఉక్కుపాదం మోపారు. అక్రమ కబేళాలను మూసేయించారు. ► లవ్ జిహాద్‌ను అరికట్టడమే లక్ష్యంగా బలవంతపు మత మార్పిడులకు వ్యతిరేకంగా తొలుత ఆర్డినెన్స్, ఆ తర్వాత బిల్లు తెచ్చారు. ► అవినీతి, అక్రమాలకు దూరంగా నిజాయితీపరుడైన నాయకునిగా ప్రజల్లో చెరగని ముద్ర వేశారు. ► సీఎం పదవి నుంచి యోగిని తప్పించాలని బీజేపీ భావిస్తున్నట్లు గతేడాది బాగా విన్పించినా నిజం కాదని తేలింది. ► ఈ ఎన్నికల్లో గోరఖ్‌పూర్ అర్బన్ నుంచి తొలిసారిగా అసెంబ్లీకి పోటీ చేసి లక్షకు పైగా ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. -
అమిత్ షా సవాల్‌కి సై.. బీజేపీతో పొత్తుపై ‘మహా’ సీఎం సంచలన వ్యాఖ్యలు
ముంబై: ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలన్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సవాలును స్వీకరిస్తున్నట్లు శివసేన చీఫ్, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాకరే చెప్పారు. పార్టీ వ్యవస్థాపకుడు బాల్ థాకరే జన్మదిన వేడుకల్లో ఆయన ఆదివారం పాల్గొన్నారు. బీజేపీకి మిత్రపక్షంగా ఉండడం వల్ల శివసేనకు 25 సంవత్సరాలు వృధాగా పోయాయనే ఇప్పటికీ నమ్ముతున్నానన్నారు. మహారాష్ట్రకు బయటకూడా శివసేన కార్యకలాపాలను విస్తరిస్తామని, జాతీయస్థాయికి ఎదుగుతామని చెప్పారు. బీజేపీ ఎదుగుదలలో సేనలాంటి పలు ప్రాంతీయ పార్టీల సహకారం ఉందని, ఆసమయంలో చాలాచోట్ల బీజేపీకి కనీసం డిపాజిట్లు వచ్చేవికాదని గుర్తు చేశారు. హిందుత్వకు అధికారమివ్వాలనే బీజేపీతో పొత్తుపెట్టుకున్నామని, అంతేకానీ అధికారం కోసం తామెప్పుడూ హిందుత్వను వాడుకోలేదని ఉద్దవ్ చెప్పారు. బీజేపీ అనుకూలవాద హిందుత్వ చేస్తుందని ఆయన విమర్శించారు. రాజకీయ అధికారం కోసమే బీజేపీ కాశ్మీర్లో పీడీపీతో, బీహార్‌లో జేడీయూతో పొత్తు పెట్టుకుందన్నారు. సేన, అకాలీదళ్ లాంటి పాత మిత్రులు పోవడంతో ఎన్డీఏ పరిధి తగ్గిందన్నారు. ఎన్సీపీ, కాంగ్రెస్‌తో తమ పొత్తును ఆయన సమర్ధించుకున్నారు. బీజేపీ మిత్రపక్షాలను వాడుకొని వదిలేస్తుందన్నారు. తాము బీజేపీని వదిలేశాము కానీ హిందుత్వను కాదని చెప్పారు. ఎప్పటికైనా ఢిల్లీ గద్దెను చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, ఎన్సీపీలు బీజేపీలాగా కాదని, వ్యవస్థలను గౌరవిస్తాయని చెప్పారు. బాల్ ధాకరే జన్మదినోత్సవం రోజునే శివసేన ఆవిర్భవించింది. దీంతో పార్టీ, పార్టీ వ్యవస్థాపకుడి జన్మదిన వేడుకలను కలిపిజరుపుతారు. పార్టీ నిర్మాణాన్ని మరింత పటిష్టం చేయాలని శివసైనికులకు ఉద్దవ్ పిలుపునిచ్చారు. ఇటీవలే ఉద్దవ్ వెనుముక సర్జరీ చేయించుకున్నారు. తన ఆరోగ్యంపై బీజేపీ చేస్తున్న విమర్శలను ఆయన తోసిపుచ్చారు. -
హరిద్వార్ ధర్మసంసద్ ప్రసంగాలపై కేసు నమోదు
డెహ్రాడూన్: మైనారిటీలకు వ్యతిరేకంగా విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన వసీం రజ్వీ అలియాస్ జితేంద్ర నారాయణ్ త్యాగి, తదితరులపై కేసు నమోదైంది. వారిపై ఐపీసీ 153 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు హరిద్వార్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ రకీందర్‌సింగ్ తెలిపారు. అదేవిధంగా, గత వారం హరిద్వార్‌లో ధర్మసంసద్ నిర్వహించి న, ప్రసంగించిన వారిపై చర్యలు తీసుకోవా లని టీఎంసీ ప్రతినిది సాకేత్ గోఖలే జ్వాలాపూర్లో ఫిర్యాదు చేశారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు గర్హనీయం హిందుత్వవాదం పేరుతో కొందరు చేస్తున్న ద్వేషపూరిత వ్యాఖ్యల ద్వారా హింస జరుగుతోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. దానికి అన్ని మతాలు మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఆయన శుక్రవారం ట్వీట్ చేశారు. హింసను ప్రేరేపిస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు. మాజీ ప్రధానిని హత్య చేయాలని పిలుపునివ్వడం, వివిధ మతాల మధ్య చిచ్చు పెట్టే కుట్ర చేయడం హీనమైన చర్యన్నారు. రాజ్యాంగాన్ని ధిక్కరించేలా ఆ వ్యాఖ్యలున్నాయని ఆమె ట్వీట్ చేశారు. -
దేశంలో ఇక్కట్లకు హిందుత్వే కారణం
అమేథి: దేశంలో ధరల పెరుగుదల, బాధలు, విచారాలన్నింటికీ హిందుత్వే ప్రత్యక్ష కారణమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. 2019లో ఓటమి అనంతరం శనివారం ఆయన రెండో మారు అమేథిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఒక ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు. భారత్‌లో హిందుత్వవాదుల వల్లే అనేక సమస్యలు వస్తున్నాయని దుయ్యబట్టారు. ‘హిందువులు, హిందుత్వవాదులకు మధ్య పోరు నడుస్తోంది. హిందువులు సత్యాగ్రహంపై నమ్మకం ఉంచగా, హిందుత్వవాదులు సత్తాగ్రహ్(రాజకీయ దురాశ)ను నమ్ముతున్నారు’ అని అన్నారు. పార్టీ నేత ప్రియాంక గాంధీతో కలిసి అమేథిలో ఆయన ఆరు కి.మీ.ల పాదయాత్రలో పాల్గొన్నారు. ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. నిరుద్యోగితపై మోదీ మాట్లాడరని, గంగలో మునకలు మాత్రం వేస్తారని ఎద్దేవా చేశారు. ‘హిందువులు కోట్లాదిమంది తోటివారితో కలిసి గంగలో స్నానాలు చేస్తుంటే, హిందుత్వ మాత్రం ఒంటరిగా గంగలో మునుగుతోంది’ అన్నారు. కనీసం తోటి నాయకులకు తనతో కలిసి గంగాస్నానం ఆచరించే అవకాశాన్ని మోదీ ఇవ్వలేదన్నారు. కీలక అంశాల పైనుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ప్రభుత్వం మార్కెటింగ్ వ్యూహాలు అవలంబిస్తోందని విమర్శించారు. గాంధీ హిందూ కాగా, గాడ్సే హిందుత్వ వాది అని విమర్శించారు. మోదీకి వ్యాపారవర్గాలపై ప్రేమ అని, నోట్ల రద్దు, సాగు చట్టాలు, జీఎస్టీ వంటివన్నీ వారి ప్రయోజనాల కోసమే తెచ్చారని దుయ్యబట్టారు. 2004 నుంచి అమేథిలో గెలుస్తూ వస్తున్న రాహుల్‌ను 2019లో స్మృతీ ఇరానీ ఓడించారు. నాటి ఎన్నికల్లో రెండు చోట్ల పోటీచేసిన రాహుల్ కేరళలోని వయనాడ్‌లో గెలుపొందారు. -
నేను నికార్సైన హిందువును.. హిందూత్వవాదిని కాదు: రాహుల్
జైపూర్: భారత్ హిందువుల దేశమని, ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని ఆరాటపడే హిందూత్వవాదులది కాదని కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. దేశంలో ద్రవ్యోల్బణానికి, ప్రజల కష్టాలకు హిందూత్వవాదులే కారణమని దుయ్యబట్టారు. వారికి అధికారమే పరమావధి అని ధ్వజమెత్తారు. ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా రాజస్తాన్ రాజధాని జైపూర్‌లో ఆదివారం కాంగ్రెస్ నిర్వహించిన భారీ ర్యాలీలో రాహుల్ ప్రసంగించారు. ప్రధానిమోదీపై విరుచుకుపడ్డారు. మోదీ, ఆయన సంపన్న మిత్రులు కలిసి గత ఏడేళ్లలో దేశాన్ని నాశనం చేశారని ఆరోపించారు. హిందూ, హిందూత్వ వేర్వేరు పదాలు అని చెప్పారు. రెండు ప్రాణుల్లో ఒకే ఆత్మ ఉండనట్లుగానే, రెండు పదాలకు ఒకే అర్థం ఉండదని వ్యాఖ్యానించారు. మహాత్మాగాంధీ హిందువు, గాడ్సే హిందూత్వవాది అని అన్నారు. 2014 నుంచి భారత్‌లోని హిందూత్వవాదులు ఇదే సిద్ధాంతం పాటిస్తున్నారని విమర్శించారు. తాను నికార్సైన హిందువునని, హిందూత్వవాదిని కాదని తేల్చిచెప్పారు. హిందూత్వవాదులు నిక్షేపంగా ఉన్నారు హిందూత్వవాదులను మరోసారి తరిమికొట్టాలని, దేశంలో హిందువుల పరిపాలనను పునఃప్రతిష్టించాలని ప్రజలకు రాహుల్ పిలుపునిచ్చారు. õ దేశంలో 20 కంపెనీలే 90 శాతం కార్పొరేట్ లాభాలను కొల్లగొడుతున్నాయని ఆరోపించారు. తమ పార్టీ ర్యాలీని కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధులు కూడా కార్పొరేట్ల బానిసలేనని అన్నారు. దేశానికి వెన్నుముక అయిన రైతుల రుణాలను కాంగ్రెస్ ప్రభుత్వాలు రద్దు చేశాయని, మోదీ ప్రభుత్వం మాత్రం రైతులకు హిందూత్వవాది కాబట్టే మోదీ రైతులను వెనుక నుంచి పొడిచాడని చెప్పారు. రైతన్నలు ఎదురుతిరిగితే హిందూత్వవాది తోకముడిచి, క్షమాపణ చెప్పడం ఖాయమన్నారు. అనంతరం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ వాద్రా మాట్లాడుతూ..70 ఏళ్లలో కాంగ్రెస్ కష్టపడి నిర్మించిన దేశాన్ని కార్పొరేట్ మిత్రులకు అమ్మేసేందుకు మోదీ సర్కారు కుతంత్రాలు సాగిస్తోందని ఆరోపించారు. ర్యాలీలో కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ కూడా పాల్గొన్నారు. కానీ, ప్రసంగించలేదు. రాజస్తాన్ Ðసీఎం గహ్లోత్, చత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేల్ హాజరయ్యారు. కాగా, ఈ ర్యాలీ వద్దకు పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ ఆలస్యంగా చేరుకున్నారు అదానీ, అంబానీకే అచ్ఛే దిన్ మంచి రోజులు(అచ్ఛే దిన్) వస్తాయంటూ దేశ ప్రజలకు మోదీ హామీ ఇచ్చారని, కానీ ఆ మంచి రోజులు అదానీకి, అంబానీకి మాత్రమే వచ్చాయని రాహుల్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అయినా ఆ తప్పు అదానీ, అంబానీది కాదని, వారికి దోచిపెట్టే ప్రధానిది అని అన్నారు. మోదీ నిర్వాకాలతో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయిందని విమర్శించారు. కేవలం ఇద్దరు ముగ్గురు పారిశ్రామికవేత్తలు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు సృష్టించలేరని అన్నారు. లక్షలాది చిన్న, మధ్య తరహా వ్యాపారవేత్తలు, రైతులే ఆ పని చేయగలరని చెప్పారు. మోదీ పాలనలో అసంఘటిత రంగం పూర్తిగా కునారిల్లిందన్నారు. లద్దాఖ్, అరుణాచల్‌లో భారత్ భూభాగాన్ని చైనా ఆక్రమిస్తే, అలాంటిదేమీ లేదని ప్రధాని బుకాయిస్తున్నారని చెప్పారు. -
సల్మాన్ ఖుర్షీద్ ఇంటిపై దాడి
డెహ్రాడూన్: కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ ఇంటిపై సోమవారం దుండగులు దాడి చేసి, నిప్పు అంటించారు. ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్లో ఉన్న తన ఇంటిపై దాడి జరిగిందని, సంబంధిత ఫొటోలు, వీడియోలను ఆయన సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు. ఇటీవల ఆయన ఆయోధ్యపై రచించిన పుస్తకంలో ‘హిందూత్వ’కు, తీవ్రవాద సంస్థలకు సారూప్యత ఉందంటూ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర వివాదం రాజుకున్న విషయం తెలిసిందే. కాగా, ఇంటిపై దాడి చేసిన వ్యక్తుల చేతుల్లో బీజేపీ జెండాలు ఉన్నాయని ఖుర్షీద్ పేర్కొన్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఆయన ఇంటి కిటికీలు ధ్వంసం అయ్యాయని, ఓ డోర్‌కు దుండగులు నిప్పు పెట్టారని నైనిటాల్ ఎస్పీ జగదీశ్ చంద్ర వివరించారు. ఈ దాడితో సంబంధం ఉన్న 21 మంది దుండగులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ దాడిలో ఖుర్షీద్ కుటుంబసభ్యులకు ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని పేర్కొన్నారు. ఇంటిపై జరిగిన దాడిని కాంగ్రెస్ సీనియర్ నేతలు శశిథరూర్, దిగ్విజయ్ సింగ్ తదితరులు తీవ్రంగా ఖండించారు. -
హిందూయిజం, హిందూత్వ వేర్వేరు
వార్ధా/న్యూఢిల్లీ: హిందూయిజం, హిందూత్వ పదాల మధ్య చాలా వ్యత్యాసం ఉందని, అవి రెండూ వేర్వేరు అని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ చెప్పారు. ఒక ముస్లింని, సిక్కుని కొట్టమని హిందూమతం ఎక్కడా చెప్పలేదని, కానీ హిందూత్వ ఆ పని చెయ్యమంటోందని విమర్శించారు. హిందూమతాన్ని అనుసరిస్తూ ఉంటే హిందూత్వ అన్న కొత్త పదం ఎందుకు పుట్టుకొచ్చిందని ప్రశ్నించారు. మహారాష్ట్రలో వార్ధాలోని సేవాగ్రమ్ ఆశ్రమంలో నాలుగు రోజుల పాటు జరగనున్న ఏఐసీసీ శిక్షణా తరగతుల్లో శుక్రవారం ఆన్లైన్ ద్వారా రాహుల్ గాంధీ మాట్లాడారు. ‘హిందూయిజానికి, హిందూత్వకి ఉన్న తేడాలేంటి? ఆ రెండూ ఒకటేనా? ఒక్కటే అయితే రెండింటికి ఒక్కటే పేరు ఉండాలి కదా! అందుకే అవి రెండూ వేర్వేరు. ఒక ముస్లింని, సిక్కుని కొట్టమని హిందూమతం ఎప్పుడూ చెప్పలేదు. నేను ఉపనిషత్తులు చదివాను. హిందూ మత గ్రంథాలు చదివాను. అందులో ఎక్కడా అలా లేదు. కానీ వారిని కొట్టమని హిందూత్వ చెబుతోంది’’ అని రాహుల్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం, మన జాతి సిద్ధాంతం ఒకటేనని, అదొక విలువైన రత్నమన్నారు. అందులో ఎంతో శక్తి నిక్షిప్తమై ఉందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఎల్ల ప్పుడూ సజీవంగా, మహత్తర చైతన్యంతో ఉంటుందని చెప్పుకొచ్చారు. కానీ బీజేపీ దానిని కనిపించకుండా చేస్తూ మీడియాని అడ్డం పెట్టుకొని హిందూత్వని విస్తరిస్తోందని ఆరోపించారు. దేశంలో ప్రస్తుతం ఉన్నవి కాంగ్రెస్ సిద్ధాంతం, ఆరెస్సెస్ సిద్ధాంతాలేనని, బీజేపీ పనిగట్టుకొని విద్వేషాలు నూరిపోస్తోందంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హిందూ మతంపై ఎందుకంత ద్వేషం: బీజేపీ హిందూత్వకు సంబంధించి రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఎదురు దాడికి దిగింది. హిందూమతంపై కాంగ్రెస్ నేతలు ద్వేషాన్ని నూరి పోస్తున్నారని విమర్శించింది. రాహుల్ ఆదేశాల మేరకే సల్మాన్ ఖుర్షీద్, శశిథరూర్, చిదంబరం వంటి నేతలు హిందూ మతాన్ని లక్ష్యంగా తప్పుడు ప్రచారం సాగిస్తున్నారని బీజేపీ ప్రతినిధి సంబిత్ పాత్రా ఆరోపించారు. -
కమ్యూనిస్ట్‌లు ఐడియాలజిస్ట్‌లు.. హిందువులు తత్వవేత్తలు: రాంమాధవ్
సాక్షి, హైదరాబాద్: బీజేపీ నేత రాంమాధవ్ రచించిన ‘ది హిందుత్వ పరాదిమ్’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం ఫోరమ్ ఫర్ నేషనల్ థింకర్స్ హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో జరిగింది. పుస్తకాన్ని రిటైర్డ్ జస్టిస్ రఘురాం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాంమాధవ్ హిందుత్వం గురించి మంచి పుస్తకాలు రాస్తారన్నారు. సరళమైన భాషలో ప్రజలకు అర్థమయ్యే విధంగా ఉంటాయని రఘురాం అన్నారు. ఈ పుస్తకంలో అనేక అంశాలు తానను ఆకట్టుకున్నాయన్నారు. రాంమాధవ్ మాట్లాడుతూ కార్ల్‌మార్క్స్' కమ్యూనిస్ట్ భావజాలాన్ని వ్యాప్తి చేశారన్నారు. హిందుయిజం శంకరాచార్యులు, గాంధీ లాంటి వ్యక్తులను తయారు చేసిందన్నారు. ‘‘సావర్కర్ పితృభూమి అన్నారు. నేను మాతృభూమి అంటున్నాను. కమ్యూనిస్ట్‌లు ఐడియాలజిస్ట్‌లు.. హిందువులు తత్వవేత్తలు. హిందుత్వం, హిందుయిజం, ఇండియా అన్నీ ఒక్కటేనని’’ రాంమాధవ్ అన్నారు. -
దేవాలయాలు కూల్చి.. శౌచాలయాలు
సాక్షి, అమరావతి: చోరీ చేసి పరిగెడుతున్న దొంగ సడెన్‌గా వెనక్కి తిరిగి... దొంగ!! దొంగ!! అని అరిస్తే? యజ్ఞయాగాల్ని భగ్నం చేసిన దయ్యాలు వేదాలు వల్లిస్తే? సేమ్ టు సేమ్ చంద్రబాబు నాయుడి తీరులానే ఉంటుంది. అధికారంలో ఉన్న ఐదేళ్లూ దేవాలయాలపై దౌర్జన్యకాండ సాగించిన చంద్రబాబు ఇప్పుడు రాష్ట్రంలో దేవాలయాలకు రక్షణ లేదంటూ మత రాజకీయానికి దిగడం ఇలాంటిదే. మేనిఫెస్టోను భగవద్గీతలా భావిస్తూ అమలు చేస్తున్న ప్రభుత్వాన్ని వేరే రకంగా ఇబ్బంది పెట్టలేక మత విద్వేషాలకు దిగుతుండటం... సీఎం జగన్ చెప్పినట్లు కలియుగానికి క్లయిమాక్స్ లాంటిదే. ఎందుకంటే 2016 కృష్ణా పుష్కరాల వేళ చంద్రబాబు చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. ప్రజోపయోగ కార్యక్రమాలకు వేరే స్థలాలున్నా పట్టించుకోకుండా... విజయవాడలో దేవాలయాలను అడ్డగోలుగా కూల్చేసి, కొన్నిచోట్ల అదే స్థానంలో టాయిలెట్లు కట్టించిన ఘనత ఆయనది. విజయవాడ సుందరీకరణ పేరిట బాబు నేతృత్వంలో అప్పట్లో... కృష్ణా నది కరకట్టపై ఇబ్రహీంపట్నం మొదలు కంకిపాడు వరకూ ఉన్న 42 ఆలయాల్ని కిరాతకంగా పెకలించి హిందువుల మనోభావాలతో ఆడుకున్నారు. విజయవాడ మధ్యలో ఉన్న దేవాలయాల్ని రోడ్ల విస్తరణ పేరిట తొలగించేశారు. అప్పట్లో దీనిపై కొందరు స్వాములు, విజయవాడ వాసులు పెద్దఎత్తున ఆందోళనలు చేయగా... వారిని అణచివేసి వేధింపులకు గురిచేశారు. ఇప్పటికీ దర్శనమిస్తున్న టాయిలెట్లు విజయవాడ వన్‌టౌన్‌లోని గణపతిరావు రోడ్డు వద్ద ఉన్న దాసాంజనేయస్వామి ఆలయాన్ని కూల్చి అక్కడ టాయిలెట్లు కట్టించారు. ఒకప్పుడు గుడి గంటలు, భజనలతో ఎంతో ఆహ్లాదకరంగా ఉన్న ఈ ఆధ్యాత్మిక ప్రాంతం ఇప్పుడు టాయిలెట్లకు నెలవయింది. – ప్రకాశం బ్యారేజీ నుంచి కనకదుర్గ వారధి వరకూ ఉన్న దేవాలయాలను పడగొట్టి అక్కడా టాయిలెట్లు పెట్టించారు. – ప్రకాశం బ్యారేజీ ఆప్రాన్‌కు వెళ్లే మార్గంలో ఉండే భూగర్భ వినాయకుడి గుడిని కూల్చి దాన్ని ఖాళీగా వదిలేశారు. – దీనికి ఎదురుగా రోడ్డుకి అటువైపున కాలువ పక్కనున్న దక్షిణముఖ దాసాంజనేయస్వామిని కూలగొట్టి పుష్కరాల సమయంలో టాయిలెట్లు పెట్టించారు. – అలాగే, సీతమ్మవారి పాదాల వద్ద ఉన్న ఆంజనేయస్వామి గుడిని తొలగించి అప్పట్లో స్నానాలు చేసే ప్రాంతంగా మార్చేశారు. – ఆర్టీసీ కాంప్లెక్స్‌కి ఎదురుగా ఉన్న సాయిబాబా గుడి, బ్రహ్మంగారి గుడిని కూల్చి పద్మావతి ఘాట్‌ను విస్తరించి షాపులు పెట్టారు. ఇప్పుడు అదంతా ఫుడ్‌కోర్టుగా మారింది. – భవానీపురం స్వాతి థియేటర్ రోడ్డులో కనకమహాలక్ష్మి దేవాలయాన్ని పడగొట్టి ఖాళీగా వదిలేయగా ఇప్పుడు అక్కడ టిఫిన్ బళ్లు, చికెన్ బళ్లు నడుపుతున్నారు. – ఇక కబేళా వద్ద గంగానమ్మ గుడిని కూలగొట్టగా ఇప్పుడక్కడ ఆటోలు నిలుపుతున్నారు. అర్థరాత్రిళ్లు పొక్లెయిన్లతో దౌర్జన్యాలు అప్పట్లో ఈ గుళ్లను అర్థరాత్రిళ్లు పొక్లెయిన్లతో వచ్చి ఎకాఎకీన పడగొట్టేశారు. ఉదయం గుడికి వెళ్లి దర్శనం చేసుకుందామనుకున్న వారికి కూల్చిన శిథిలాలే కనిపించేవి. గుడుల నిర్వాహకులకు కనీసం సమాచారం ఇవ్వకుండా రాత్రిళ్లు కూల్చేసేవారు. గుళ్లలో ఉన్న విగ్రహాలు, హుండీలు కూడా కనపడేవి కావు. విగ్రహాలకున్న బంగారు, వెండి ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులు ఏమయ్యాయో ఇప్పటికీ ఎవ్వరికీ తెలియదు. కనీసం విగ్రహాలనైనా వెనక్కివ్వాలంటూ స్థానికులు కొందరు నాటి టీడీపీ ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోలేదు. కొన్ని దేవాలయాలకు నష్టపరిహారం ఇస్తామని చెప్పి ఆ తర్వాత పట్టించుకోలేదు. దేవదాయ శాఖ ఆధీనంలో ఉన్న ఆలయాలను సైతం ఆ శాఖకు తెలియకుండా ఉన్నట్టుండి కూల్చివేశారు. అప్పట్లో హిందువులకు దారుణ అవమానాలు నగర సుందరీకరణ పేరిట చంద్రబాబు సాగించిన ఈ అరాచకాలపై అప్పట్లో దేశవ్యాప్త ఆందోళన రేగింది. మఠాధిపతులు, స్వాములు భారీ సభ పెట్టి చంద్రబాబు హిందూ వ్యతిరేక చర్యలను ఖండించారు. విజయవాడలో స్థానికులు ఆందోళనలు చేయగా వారిని అణచివేసి అక్కడి టీడీపీ నాయకుల ద్వారా బెదిరించారు. దేవాలయాలతో బాబు ఆడిన ఈ రాక్షస క్రీడలో హిందువులు అప్పట్లో దారుణ అవమానాలకు గురయ్యారు. అప్పటి ఆయన ప్రభుత్వంలో బీజేపీకి చెందిన ఎమ్మెల్యేనే దేవదాయ శాఖ మంత్రి కావటం గమనార్హం. ఇన్ని దారుణాలు చేసిన చంద్రబాబు ఇపుడు హిందువుల ప్రతినిధిగా... ఎక్కడో ఊళ్లలో, మారుమూలనున్న గుళ్లలో జరుగుతున్న ఘటనలపై ఉద్యమానికి దిగటం చూస్తే ఎవ్వరికైనా ఈ రాజకీయ గెరిల్లా యుద్ధానికి తెగబడుతున్నది ఆయనేనని తెలియకమానదు. విగ్రహాలతోపాటు నగలూ మాయం 2016లో రాత్రికి రాత్రి పొక్లెయిన్‌తో కనకమహాలక్ష్మి దేవాలయాన్ని దౌర్జన్యంగా పడగొట్టారు. అమ్మవారి విగ్రహం కూడా కనపడనీయలేదు. బంగారు కిరీటాలు, మంగళసూత్రం, వెండి వస్తువులు కూడా ఎత్తుకెళ్లిపోయారు. కనీసం విగ్రహం ఇవ్వాలని వేడుకున్నా ఎవరూ పట్టించుకోలేదు. గుడి ఉన్న చోట ఇప్పుడు టిఫిన్ బళ్లు పెడుతున్నారు. ఇంతకన్నా దారుణం ఉంటుందా? – తిరుపతి సురేష్, కనకమహాలక్ష్మి దేవాలయం నిర్వాహకుడు, విజయవాడ ఎంత మొత్తుకున్నా వినకుండా కూల్చేశారు 2016లో టీడీపీ ప్రభుత్వం కావాలని గుళ్లన్నీ కూల్చేసింది. కానీ, ఇప్పుడు దేవాలయాలపై జరుగుతున్న దాడులు ఎక్కడో మారుమూలనున్న ప్రాంతాల్లో జరుగుతున్నాయి. ప్రభుత్వమే అలా చేయిస్తోందన్న చంద్రబాబు విమర్శల్లో అర్థమేమైనా ఉందా? – ద్రోణంరాజు రవికుమార్, బ్రాహ్మణ సమాఖ్య జాతీయ నాయకుడు, విజయవాడ -
‘మతమార్పిడులకు ఆరెస్సెస్ ఎందుకు అనుమతించాలి?’
సర్వేజనాః సుఖినో భవంతు, సర్వే సంతు నిరామయ!.. సర్వే భద్రాణి పశ్యంతు, మాకశ్చిత్ దుఃఖ మాప్నియా!! లోకః సమస్తా సుఖినో భవంతు... అంటే సర్వజనులు ఎలాంటి బాధలు లేకుండా సుఖశాంతులతో జీవించాలని హిందుత్వం అభిలాషిస్తుంది. అంటే భారతీయులో, హిందువులో మాత్రమే సుఖ శాంతులతో జీవించాలని హిందుత్వం కోరుకోవడం లేదు. ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ ఆనందంగా జీవించాలనే విశాల దృక్పథాన్ని ప్రబోధించేది హిందుత్వం. కాబట్టే 1983లో చికాగో (అమెరికా)లో జరిగిన సర్వమత సమ్మే ళనంలో స్వామి వివేకానంద హిందుత్వం గొప్పతనాన్ని చాటి చెప్పిన తర్వాత ఎంతోమంది క్రైస్తవ మత ప్రబో ధకులు తమ అభిప్రాయాలను మార్చుకున్నారు. ఇటీవల సాక్షి దినపత్రికలో ప్రొ. కంచ ఐలయ్య రాసిన ‘మరి మతం మారితే అభ్యంతరమేల?’ అనే వ్యాసం (అక్టోబర్ 10, 2019) చదివిన తర్వాత ఆయన వైఖరి సమాజంలో భేద భావాలు పెంచే విధంగా ఉండటంతో నేను కొన్ని వాస్త వాలు తెలియజేయాలని ఈ వ్యాసం రాస్తున్నాను. విదేశీయులెందరో ముఖ్యంగా పాశ్చాత్యులు హిందు త్వంలోకి మారి హిందూ ఆరాధనా పద్ధతులు ఆచరిం చడం, హిందూ దేవుళ్లను పూజించడం సాధారణమైంది. అందుకే ఆరెస్సెస్, విశ్వహిందూ పరిషత్, ఇస్కాన్ లాంటి సంస్థలెన్నో విదేశాల్లో ప్రాచుర్యం, ప్రజాదరణ పొందుతు న్నాయి. ఎంతోమంది విదేశీయులు భారతీయ విధానంలో వివాహాలు చేసుకోవడం కూడా మనందరికీ తెలిసిందే. ఇలా ఆచరిస్తున్న వారెవ్వరినీ ఇంకెవరో ప్రలోభపెట్టో, మోసం చేసో, మరే విధంగానైనా ఒత్తిడి చేసో హిందుత్వ విధానాలు ఆచరింప జేయట్లేదనేది అక్షర సత్యం. ఇక కంచ ఐలయ్య పేర్కొన్న ఆరెస్సెస్ పుస్తకం విష యానికి వస్తే అందులో అలాంటి విషయాలెన్నో ఉన్నా కేవలం క్రైస్తవ మహిళల అక్షరాస్యత అంశాన్ని మాత్రమే తీసుకొని తన భావాలకు అనుగుణంగా వక్రీకరించి రాయ డం ఆయన హ్రస్వ దృష్టిని సూచిస్తోంది. హిందుత్వం ఎక్కడ మంచి ఉన్నా తనలో ఇనుమడింపజేసుకుంటుంది. అలాగే ఆరెస్సెస్ కూడా. అందుకే 1925లో విజయదశమి రోజు కేవలం 10–18 మంది చిన్నపిల్లలతో కలిసి డా. హెడ్గేవార్ నాటిన విత్తు క్రమపద్ధతిలో పెరిగి మొక్క అయి, వృక్షమై, ప్రస్తుతం వట వృక్షమై విశ్వవ్యాప్తమైంది. అలాంటి ఆరెస్సెస్ గతంలో కూడా ఎన్నో మంచి విషయాలను లోకానికి తెలియజేసింది. వాటిని కూడా ఆయన పేర్కొంటే బాగుండేది. క్రిస్టియానిటీ స్త్రీ–పురుష అసమానత్వానికి చెందిన అనేక అడ్డంకులను దాటుకుంటూ వచ్చింది అని రాశారు. అందులో నూటికి నూరుపాళ్లు నిజం ఉంది. తప్పులేదు. కానీ హిందుత్వంలో స్త్రీ పురుష అసమానత్వం అనే ఆలో చనే లేదు. కాబట్టే ‘యత్ర నార్యన్తు పూజ్యతే రమంతే తత్రదేవతా’ అంటే ఎక్కడ నారీమణులు పూజింపబడ తారో అక్కడే దేవతలు విహరిస్తారు అని హిందుత్వం స్పష్టంగా ప్రబోధిస్తుంది. త్రిమూర్తులే కాదు. భారతీయు లంతా భూమిని భూదేవిగా, భారతమాతగా, గంగానదిని గంగామాతగా, ప్రకృతిని ప్రకృతి మాతగా పిలుస్తారు. అంటే స్త్రీని తల్లిగా భావించి గౌరవించడం, పూజించడం ఒక్క హిందుత్వంలోనే ఉంది. అంటే పురుషుడికంటే ఉన్న తమైన స్థానంలో అనాదిగా మహిళలు గౌరవింపబడుతు న్నది భారతదేశంలోనే. అంతేకాదు సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ రంగనాథ్ మిశ్రా ఒక సంద ర్భంలో భారత దేశంలో మహిళల పరిస్థితిని గురించి వివ రిస్తూ, పురుషుల కంటే ఉన్నత స్థానంలో ఉన్నారని, కాబట్టి స్త్రీ పురుష అసమానత్వం అనేది భారతదేశంలోని మహి ళలకు వర్తించదనడం భారత్‌లో మహిళలకు ఉన్న గౌరవ ప్రతిష్టలను తెలియజేస్తుంది. బ్రిటిష్ పరిపాలనకు పూర్వం భారత్‌లో అక్షరాస్యత అధికంగా ఉండేది. ప్రతి ఒక్కరికి గురుకులాలు అందుబాటులో ఉండేవి. బ్రిటిష్‌వారు ఇక్కడి విద్యా వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేశారు. వేద విజ్ఞానాన్ని నాశనం చేశారు. గణితంలో కీలకమైన ‘0’ (సున్నా)ని కను గొన్నది భారతీయుడే. ప్రపంచంలో తొలిసారిగా ప్లాస్టిక్ సర్జరీ చేసింది శుశ్రూతుడు కాగా, ఆర్యభట్ట పేరు గడించిన ఖగోళ శాస్త్ర వేత్త అనే విషయం మనకు తెలిసిందే. బ్రిటిష్ వారి కాలం నుంచి క్రిస్టియన్ మిషనరీలు భారతదేశంలో విద్యా వ్యవస్థను విచ్ఛిన్నం చేసి మత మార్పి డులకు పాల్పడ్డారు. వారి పాపకార్యం ఇప్పటికీ కొనసాగు తోంది. నిరక్షరాస్యులైన, అమాయకులైన దళితులను, గిరి జనులను, ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడి కష్టాల్లో ఉన్న వారిని వివిధ రకాలుగా ప్రలోభపెట్టి, మోస పూరిత విధానాలతో వారిని క్రైస్తవులుగా మారుస్తున్నది నిజం కాదా? భారత రాజ్యాంగంలో ప్రతిపౌరుడూ తనకి ష్టమైన మతాన్ని, పూజా విధానాన్ని ఆచరించే అవకాశం ప్రాథమిక హక్కుల్లో స్పష్టంగా పేర్కొంది. క్రైస్తవుల్లో అక్షరాస్యత ఎక్కువుంటే అందరూ క్రైస్తవులుగా మారితే తప్పేంటి? ఆరెస్సెస్ ఇందుకు అంగీకరించాలి. దేశంలో ఉన్న మత మార్పిడుల నిషేధ చట్టాలన్నీ తొలగించాలంటున్నారు. మతమార్పిడులకు ఆరెస్సెస్ ఎందుకు అనుమతించాలి. ఆరెస్సెస్ ప్రారంభం నాటి నుంచి నేటి వరకు స్పష్టమైన, భారతదేశానికి అవసరమైన విధానాలనే ఆచరిస్తుంది, తెలి యజేస్తుంది. ఈ దేశంలో ఉంటూ, ఈ దేశ సంపదను దోచుకుతింటూ విదేశాలకు జైకొట్టే, విదేశీ శక్తుల చేతుల్లో కీలుబొమ్మలుగా మారిన దేశ వ్యతిరేకులెవరైనా, వారు క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా చివరికి హిందువు లైనా ఆరెస్సెస్సే కాదు దేశభక్తులెవరూ సహించరు. ప్రతి వ్యక్తిలో, ప్రతి మతంలో, ప్రతి వ్యవస్థలో, ప్రతి విషయంలో మంచి చెడులుండటం సహజం. అలాగే క్రైస్తవంలో ఉన్న ఒకే ఒక మంచి విషయాన్ని పట్టుకొని మిగిలిన మతాలవారు క్రైస్తవంలోకి రావాలనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. చరిత్రలో ఎన్నో ఆటుపోట్లకు లోనై కూడా ఇప్పటికీ అజరామరంగా విరాజిల్లుతున్న, అత్యున్నతమైన జీవన విధానాన్ని అందిస్తున్న హిందుత్వం లోకే క్రైస్తవులు (గతంలో వీరంతా హిందువులే) తిరిగి వస్తే తప్పేంటి? కంచ ఐలయ్య లాంటి వారు మతం మారినంత మాత్రాన హిందువులుగా మరణించిన వారి పూర్వీకుల ఆత్మలు ఘోషించవా? ఇప్పటికైనా మతం మారాలనుకునే ప్రతి ఒక్కరూ వారి పూర్వీకుల మతం పరిస్థితి ఏంటి? అనే విషయం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. (ప్రొఫెసర్ కంచ ఐలయ్య 10–10–2019(గురువారం) సాక్షి సంచికలో రాసిన వ్యాసానికి స్పందన) వ్యాసకర్త: శ్యాంసుందర్ వరయోగి, సీనియర్ జర్నలిస్ట్, ఫౌండర్ అండ్ మేనేజింగ్ ట్రస్టీ రాఘవ్స్ ఫౌండేషన్, హైదరాబాద్ చదవండి: మరి మతం మారితే అభ్యంతరమేల? -
800 ఏళ్ల క్రితమే ‘జై శ్రీరామ్’
సాక్షి, న్యూఢిల్లీ : 17వ లోక్‌సభకు ఎన్నికైన ప్రతిపక్ష పార్లమెంట్ సభ్యులు ప్రమాణ స్వీకారానికి వెళుతున్నప్పుడు జూన్ 18వ తేదీన పాలకపక్ష బీజేపీ సభ్యులు ‘జై శ్రీరామ్’ అంటూ వారిని హేళన చేసిన విషయం తెల్సిందే. ముఖ్యంగా ముస్లిం ఎంపీలు ప్రమాణ స్వీకారానికి వెళుతున్నప్పుడు వారిలా అనుచితంగా ప్రవర్తించారు. అదే రోజు అస్సాంలో ఓ ముస్లిం బృందంపై, జార్ఖండ్‌లో ఓ ముస్లిం యువకుడిపై అల్లరి మూకలు దాడులు చేసి వారి చేత ‘జై శ్రీరామ్’ అనిపించారు. ఆ దాడిలో గాయపడ్డ జార్ఖండ్ యువకుడు మరణించారు. ఆ తర్వాత రెండు రోజులకు కోల్‌కతాలో సహృఖ్ హాల్దర్ అనే 26 ఏళ్ల యువకుడిపై కూడా ఓ మూక దాడి చేసి ఆయన చేత కూడా ‘జై శ్రీరామ్’ అనిపించారు. ఇంతకు ఈ ‘జై శ్రీరామ్’ ఏ భాషా పదం, దాని అర్థం ఏమిటీ ? ఎప్పటి నుంచి అది వాడుకలోకి వచ్చింది ? రాజకీయాల్లోకి ఎప్పుడు చొరబడింది? ‘జై శ్రీరామ్’ అనేది హిందీ పదం. ‘శ్రీరాముడికి జయము కలగాలి’ అన్నది అర్థం. హిందూ దేవుళ్లలో ప్రసిద్ధి చెందిన దేవుళ్లలో రాముడు ఒకరు. గత మూడు దశాబ్దాలుగా హిందూత్వ రాజకీయాల్లో ఈ పదం ఎక్కువగా వినిపిస్తోంది. హిందువుల సమీకరణకు ఓ చిహ్నంగా, ఓ నినాదంగా ‘జై శ్రీరామ్’ను ఉపయోగిస్తున్నారు. సంస్కృత పండితుడు షెల్డాన్ పొలాక్ 1993లో రాసిన ‘రామాయణ అండ్ పొలిటికల్ ఇమాజినేషన్ ఇన్ ఇండియా’ అధ్యయన పత్రం ప్రకారం క్రీస్తు శకం 12వ శతాబ్దానికి ముందు రాముడు కేవలం పూజించడానికే పరిమితం అయ్యారు. 12వ శతాబ్దంలో దేశవ్యాప్తంగా రాముడి గుళ్లు వెలిశాయి. వాటిని సందర్శించిన భక్తులు ‘జై శ్రీరామ్’ అంటూ నినాదాలు చేయడం ప్రారంభమైంది. క్రీస్తు శకం 1001లో మొహమ్మద్ ఘజనీ దాడులు చేయడం, దాని పర్యవసానంగా ఢిల్లీలో 1206లో తొలి సుల్తాన్ రాజ్యం ఏర్పడింది. అందుకని ఆ కాలంలో రాముడి గుళ్లు పెరిగాయి. అంటే 800 ఏళ్ల క్రితమే ‘జై శ్రీరామ్’ పుట్టిందన్నమాట. 16వ శతాబ్దంలో అన్ని ప్రాంతీయ భాషల్లోకి రామాయణం పుస్తకాలు అనువాదం అవడంతో రాముడు మరింతగా ప్రజల హృదయాల్లోకి చొచ్చుకుపోయారు. దాదాపు అదే సమయంలో ‘రామచరిత్మానస్’ అవధి భాషలో వెలువడింది. దుష్ట శక్తులను ఎదుర్కొనగల శక్తి రాముడికి మాత్రమే ఉందనే నమ్మకం ప్రజల్లో పెరిగింది. సమాజంలోని దుర్మార్గులను రావణుడితో పోల్చడం ప్రారంభమైంది. 17వ శతాబ్దంలో మరాఠీలో వచ్చిన రెండు రామాయణం పుస్తకాల్లో ఒకదాట్లో అప్పటి మొగల్ చక్రవర్తి ఔరంగజేబును రావణుడితో పోల్చగా, మరో పుస్తకంలో ఔరంగజేబును రావణుడి సోదరుడు కుంభకర్ణుడితో పోల్చారు. ఆధునిక రాజకీయాల్లోకి బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా దేశ స్వాతంత్య్రం కోసం పోరాడుతున్నప్పుడు జాతిపిత మహాత్మా గాంధీ తమకు ‘రామరాజ్యం’ కావాలన్నారు. కానీ రాజకీయంగా రాముడి ప్రస్తావన అంతకుముందే ప్రారంభమైంది. 1920లో అవద్‌లో బాబా రామచంద్ర నాయకత్వాన జరిగిన రైతు ఉద్యమంలో రామ పదం మరింత ప్రాచుర్యం పొందింది. సీతా–రామ్ పేరిట అభివాదం మహారాష్ట్రకు చెందిన బాబా రామచంద్ర ఫిజీలో పారిశ్రామిక కార్మికుడిగా పనిచేసి భారత్‌కు వచ్చారు. ఆయన అసలు పేరు శ్రీధర్ బల్వంత్ జోధపుర్కార్. ఆయన తులసీదాస్ రామాయణాన్ని చదవి స్ఫూర్తి పొందారు. రైతుల సమస్యలు ఆలకిస్తూ ఆయన ఆ రమాయణంలోని అంశాలను వారికి చెబుతుండేవారు. దాంతో ఆయనకు బాబా రామచంద్ర అనే పేరు వచ్చింది. ఆయన వద్దకు వచ్చే రైతులందరూ ఆయనకు సలాం చెప్పేవారు. సలాం అంటే దిగువ స్థాయి వారు, ఎగువ స్థాయి వారికి చెప్పేదని, తమందరం సమానం కనుక ఇక నుంచి కలుసుకున్నప్పుడు ‘సీతా–రామ్’ అని చెప్పుకుందామని చెప్పారు. అది అప్పట్లో పెను తుపానులా రైతులందరికి పాకింది. రైతులెవరు కలుసుకున్నా ‘సీతా–రామ్’ అంటూ అభివాదం చేసుకునేవారు. నాడు రైతుల సమీకరణకు కూడా అది ఎంతో ఉపయోగపడింది. రైతులను సమీకరించాలన్నా ‘సీతా–రామ్’ అంటూ గట్టిగా అరచేవారు. దాని నుంచి ‘జై సియా–రామ్’ నినాదం పుట్టుకొచ్చింది. అది కాస్త బీజేపీ చేపట్టిన రామజన్మ భూమి ఆందోళన సందర్భంగా ‘జై శ్రీరామ్’గా మారిందని జర్నలిస్ట్, రచయిత అక్షయ ముకుల్ తాను రాసిన ‘రైజ్ ఆఫ్ హిందూత్వ’ పుస్తకంలో పేర్కొన్నారు. 1980 దశకంలో ఈ నినాదం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఎల్కే అద్వానీ రథయాత్ర సందర్భంగా ‘జై శ్రీరామ్’ నినాదాలతో మత ఘర్షణలు చెలరేగాయి. 1987లో రామానంద సాగర్ తీసిన ‘రామాయణ్’ టెలివిజన్ సీరియల్ బాగా పాపులర్ అవడమూ తెల్సిందే. -
ఏనాటి నుంచో ఈనాటి ‘ఈ బంధం’
సాక్షి, న్యూఢిల్లీ : భారత దేశంలో రాజకీయాలకు, మతానికి మధ్యనున్న తెర క్రమంగా తొలగిపోతోంది. ఇక మనది లౌకిక రాజ్యాంగం అనడానికి వీల్లేకుండా అర్థం మారిపోతోంది. పొరుగునున్న భూటాన్ దేశం మత రాజకీయ వ్యవస్థకు స్వస్తి చెప్పి ప్రజాస్వామ్య వ్యవస్థ వైపు అడుగులు వేస్తే అందుకు పూర్తి విరుద్ధంగా భారత్ లౌకికవాద ప్రజాస్వామ్య వ్యవస్థకు స్వస్తి చెప్పి మత వ్యవస్థ వైపు అడుగులు వేస్తోంది. భారత తొలి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ రాజకీయాలకు మతానికి మధ్య ఆమడ దూరం ఉండాలని భావించి అలా ఉంచేందుకు ప్రయత్నించారు. రాజకీయ నాయకులు స్వాములను, సాధువులను సందర్శించుకొని వారి ఆశీర్వాదం తీసుకోవడంతో మొదలైన రెండింటి మధ్య బంధం, స్వాములనే ఎన్నికల్లో నిలబెట్టి, వారి ఆదేశాలను ఆచరించే స్థాయికి పెనవేసుకుపోయింది. పీఠాలు, పీఠాధిపతుల వద్దకే కాకుండా రాజకీయ నాయకులు కర్ణాటకలోని మఠాలు, పంజాబ్, హర్యానాలోని డేరాలను కూడా సందర్శిస్తుంటే వారే ఏ రాజకీయ పార్టీకి ఓటేయాలో ప్రజలకు సూచించే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు భారతీయ జనతాపార్టీ అయినా, కాంగ్రెస్ పార్టీ అయినా మత రాజకీయాలను ఆచరించక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కడికెళ్లినా దేవాలయాలను సందర్శిస్తుంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శివాలయాలు తిరుగుతూ క్షీరాభిషేకాలు చేస్తున్నారు. పీవీ నరసింహారావు ప్రభుత్వంలో రాజ్యాంగేతర శక్తిగా కేంద్రంలో చంద్రస్వామి నిర్వహించిన పాత్రను మనం మరచిపోలేం. యోగా గురువు రామ్‌దేవ్, ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్‌లు బీజేపీకి మద్దతుగా 2014 సార్వత్రిక ఎన్నికల్లో నిర్వహించిన పాత్ర తెల్సిందే. ఆ ఎన్నికల సందర్భంగా వారు సూచించిన అభ్యర్థులకు కూడా బీజేపీ టిక్కెట్లు ఇచ్చింది. బీజేపీ తూర్పు ఢిల్లీ పార్లమెంట్ సభ్యుడు మహేశ్ గిరి ఇంతకుముందు ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ ఫౌండేషన్ ఇంటర్నేషనల్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఎన్నికల రాజకీయాల కోసం మతాలను ఉపయోగించుకోవడం ఇటు భారతీయ జనతా పార్టీకి, అటు శిరోమణి అకాలీ దళ్‌కు కొత్త కాదు. బీజేపీ హిందూ మత పార్టీ అని, అలాంటప్పుడు హిందూత్వ ఎజెండాను దాచుకోవాల్సిన అవసరం లేదని ఇటీవల ఓ ప్రైవేటు కార్యక్రమంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా వ్యాఖ్యానించారు. బీజేపీ తరఫున పోటీ చేసి విజయం సాధించిన గోరక్నాథ్ మఠం పీఠాధిపతి ఆదిత్యనాథ్ యోగి, అటు పీఠాధిపతిగా, ఇటు యూపీ ముఖ్యమంత్రిగా రెండు పదవులు నిర్వహిస్తున్నారు. అందుకేనేమో పాపం! ప్రజల సమస్యలను పట్టించుకోవడానికి సమయం దొరకడం లేదు. ఉమాభారతి నుంచి మొదలు పెడితే సాధ్వీ నిరంజన్ జ్యోతి, స్వామి ఆదిత్యనాథ్ వరకు, సాక్షి మహరాజ్ నుంచి సత్పల్ మహరాజ్ వరకు బీజేపీలో స్వాములు జాబితా చాంతాడులా పెరిగిపోతోంది. మొన్న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఐదుగురు హిందూ గురువులను పిలిపించి ఏకంగా మంత్రి హోదాను కల్పించారు. నర్మదా నది ప్రాంతంలో జల వనరులను, అడవులను రక్షించాల్సిన ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం వారితోని ఓ కమిటీని వేశారు. నర్మదా నది వెంట అక్రమ మైనింగ్‌ను అరికట్టకపోతే తాను రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తానని హెచ్చరించిన నామ్‌దేవ్ దాస్ త్యాగి అలియాస్ కంప్యూటర్ బాబుకు నలుగురితోపాటు మంత్రి పదవి ఇవ్వడం గమనార్హం. నవంబర్ 28వ తేదీన మధ్యప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో బాబాలను మంచి చేసుకోవడం మంచిదని మన శివరాజ్ సింగ్ చౌహాన్ భావించారు. ఢిల్లీలో నవంబర్ 4,5 తేదీల్లో అఖిల భారతీయ సంత్ సమితి ఏర్పాటు చేసిన సమ్మేళనానికి 124 తెగలకు చెందిన మూడువేల మంది సాధువులు హాజరై అయోధ్యలో రామాలయాన్ని నిర్మించాలని తీర్మానించడంతోపాటు ఎన్నికల్లో బీజేపీకి ఓటేయాలని పిలుపునిచ్చారు. 2019, మే నెలలో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో 2019, జనవరి–మార్చి మధ్యన జరుగనున్న మహా కుంభమేళాకు ఎంత డబ్బయినా ఖర్చుపెట్టి అత్యంత ఆర్భాటంగా నిర్వహించాలని పాలకపక్షం బీజేపీ నిర్ణయించినట్లు తెల్సింది. భూటాన్‌లో ఒకప్పుడు ప్రభుత్వానికి దిశానిర్దేశం చేసే స్థాయిలో బౌద్ధ మతం ఉండేది, ప్రభుత్వ వ్యవహారాల్లో కూడా బౌద్ధ గురువులు జోక్యం చేసుకునేవారు. 2008లో భూటాన్‌లో తొలిసారిగా ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరిగాయి. నాటి నుంచి అక్కడ మత గురువులు ఎన్నికల్లో పోటీ చేయడమే కాదు, ఎన్నికల వ్యవహారాల్లోనే జోక్యం చేసుకోవడం లేదు. వారికి ఓటు వేసే హక్కు కూడా లేదు. రాజకీయాలకు మతం అతీతంగా ఉండాలనే దృష్టితో మత గురువులు రాజకీయాలకు గుడ్‌బై చెప్పారు. ఆ దేశానికి భిన్నంగా మన మత గురువులు రాజకీయాల్లోకి వస్తున్నారు. మున్ముందు పార్లమెంట్లో వీరి సంఖ్య పెరిగితే ‘జై శ్రీరామ్’ నినాదాలతో పార్లమెంట్ హాలు మారుమోగి పోవచ్చు. ఇక అక్కడ ప్రార్థనలు, పూజలు కూడా మొదలు వెడితే ప్రజలు కూడా ఎంచక్కా భక్తి ఛానళ్లను కట్టేసి పార్లమెంట్ ఛానల్‌ను చూస్తూ పారవశ్యంతో తరించవచ్చు. -
కొడుకునో.. బిడ్డనో సీఎం చేసేందుకే!
సాక్షి, హైదరాబాద్: కొడుకునో, బిడ్డనో సీఎం చేసేందుకు సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా విమర్శించారు. 2019లో సార్వత్రిక ఎన్నికలతోపాటు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తే ప్రధాని మోదీ ప్రభంజనంలో కొట్టుకుపోతామనే అభద్రతా భావంతోనే కేసీఆర్ ముందస్తు నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. కానీ.. కేసీఆర్ ఆశలు నెరవేరవన్నారు. తెలంగాణలో బీజేపీ రాజకీయ శక్తిగా ఎదగబోతోందని.. ఇందులో ఏమాత్రం సందేహం లేదన్నారు. బుధవారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరిగిన కార్యక్రమంలో హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, భువనగిరి, నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గాల బూత్ కమిటీ అధ్యక్షులు, కార్యదర్శులు, నాయకులకు దిశానిర్దేశం చేశారు. కుటుంబం కోసం కేసీఆర్ పని చేస్తే, బీజేపీ దేశం కోసం పని చేస్తోందన్నారు. ముందస్తు ఎన్నికలతో ప్రజలపై పడుతున్న ఆర్థిక భారానికి కేసీఆర్ ఏం సమాధానం చెబుతారని షా ప్రశ్నించారు. కార్యకర్తలే మన బలం 11 కోట్ల మంది కార్యకర్తలతో ప్రపంచంలోని అతిపెద్ద పార్టీగా ఉన్న బీజేపీకి ప్రధానితోపాటు 15 మంది సీఎంలు ఉన్నారని అమిత్ షా గుర్తుచేశారు. అయితే కేరళ, ఒడిశా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బీజేపీ గెలిస్తేనే సంపూర్ణ విజయం సాధించినట్లు అవుతుందని ఆయన కార్యకర్తలకు సూచించారు. ఒవైసీని సంతృప్తి పరిచేందుకే తెలంగాణ విమోచనదినాన్ని నిర్వహించడం లేదని టీఆర్ఎస్పై మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వ పగ్గాలు చేపట్టాక 2019 సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచనదినాన్ని అధికారికంగా నిర్వహించుకుందామన్నారు. బూత్ స్థాయిలో చేయాల్సిన 23 పనులను 15 రోజుల్లో చేస్తే అద్భుతమైన ఫలితాలు సాధిస్తామన్నారు. కార్యకర్తల శ్రమతోనే బీజేపీ ఈ స్థాయికి ఎదిగిందన్నారు. 1% ఓటింగ్ కూడా లేని మణిపూర్‌లో అధికారంలోకి వచ్చామని గుర్తుచేశారు. ‘అస్సాం, త్రిపుర, మణిపూర్ కన్నా ఇక్కడ బీజేపీ బలంగా ఉంది. అక్కడే గెలిచాం. ఇక్కడ గెలవలేమా?’ అని అమిత్ షా కార్యకర్తల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో మైనారిటీలకు 12% రిజర్వేషన్లు ఇస్తే బీసీలు, దళితులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ పూర్తి వ్యతిరేకమన్నారు. కేసీఆర్ వాస్తవాలు మాట్లాడు యూపీఏ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో 13వ ఆర్థిక సంఘం ద్వారా తెలంగాణకు రూ.16,500 కోట్లు ఇస్తే.. మోదీ ప్రభుత్వంలో 14వ ఆర్థిక సంఘం రూ.1,15,105 కోట్లు ఇచ్చిందన్నారు. వాటికి అదనంగా సర్వశిక్షా అభియాన్ తదితర పథకాల కింద మొత్తంగా తెలంగాణకు కేంద్రం రూ.2.30 లక్షల కోట్లు ఇచ్చిందని వెల్లడించారు. ‘కేసీఆర్ వాస్తవాలు మాట్లాడు. తెలంగాణపై మోదీ వివక్ష చూపుతున్నారంటూ అబద్ధాలు చెబుతున్నావ్. ముందు.. కేంద్రం ఇచ్చిన నిధులను దేనికి ఖర్చుచేశారో చెప్పాలి’ అని షా డిమాండ్ చేశారు. రోడ్ల నిర్మాణానికే రూ.40 వేల కోట్లకు పైగా నిధులను కేంద్రం ఇచ్చిందన్నారు. ‘ప్రధాన మంత్రికి పేరు వస్తుందనే కారణంతోనే.. పేదవాడికి రూ. 5 లక్షల విలువైన వైద్యాన్ని ఉచితంగా అందించే ‘ఆయుష్మాన్ భారత్’ బీమా పథకాన్ని రాష్ట్రంలో కేసీఆర్ అమలు చేయడం లేదు. ఇంతకంటే మరో అన్యాయం ఉంటుందా? ఉజ్వల పథకాన్ని సరిగ్గా అమలు చేయడం లేదు. రాష్ట్రంలో పేదలకు, రైతులకు అందాల్సిన కేంద్ర పథకాలను దూరం చేస్తున్నారు. కేసీఆర్ మావన హక్కులను హరిస్తున్నారన్నారు’ అని షా ఆరోపించారు. హైదరాబాద్‌లో రోహింగ్యాలు అక్రమంగా నివాసం ఉంటు న్నా.. కేసీఆర్ వారి గురించి పట్టించుకోవడం లేదన్నారు. బీజేపీతోనే సుపరిపాలన: లక్ష్మణ్ తెలంగాణకు బీజేపీ మాత్రమే సుపరిపాలన అందిం చగలుగుతుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పేర్కొన్నారు. టీడీపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో.. నియంతృత్వ కుటుంబ పరి పాలనను ప్రజలు చూశారని.. వాటి నుంచి విముక్తి కోసం, మార్పు కోసం బీజేపీకి అధికారం ఇవ్వాలన్నారు. పోలింగ్ బూత్‌లో గెలుపే.. అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో గెలుపునకు పునాది వేస్తుందన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఇన్‌చార్జీగా వచ్చిన కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు స్వాగతం పలికారు. కాగా, అమిత్ షా సమక్షంలో కాంగ్రెస్ పార్టీ నాగర్ కర్నూల్ నేత దిలీప్ ఆచారి, కొత్తగూడెం ప్రజారాజ్యం మాజీ నేత కుంచె రంగా కిరణ్ బీజేపీలో చేరారు. హిందుత్వ అజెండాతోనే ముందుకు అసెంబ్లీ ఎన్నికల్లో హిందుత్వ అజెండాతోనే ముందుకెళ్లాలని బీజేపీ శ్రేణులకు ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం రాత్రి.. 119 నియోజకవర్గాల సమన్వయకర్తలు, ఇంచార్జీలతో ఆయన సమావేశమయ్యారు. వచ్చే ఎన్నికల్లో గెలుపుకోసం అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. -
‘నేను ఈ దేశంలో ఉండకూడదా’
తిరువనంతపురం : దేశంలో హిందుస్తాన్ తాలిబన్ కార్యక్రమాలను బీజేపీ ప్రారంభిస్తోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్‌నేత శశి థరూర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే హిందూ పాకిస్తాన్‌గా దేశాన్ని మారుస్తుందని ఇటీవల పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కేరళలో మంగళవారం ఓ కార్యక్రమంలో థరూర్ మాట్లాడుతూ.. ‘బీజేపీకి చెందిన వారు నన్ను పాకిస్తాన్‌కి వెళ్లమంటున్నారు. నన్ను పాకిస్తాన్ వెళ్లమని చెప్పే అధికారం వారికి ఎవరిచ్చారు. నేను నా దేశంలో ఉండకూడదా. నేను వారిలాంటి హిందువును కాదు’ అంటూ వ్యాఖ్యానించారు. కేరళలో తన కార్యాలయంపై బీజేపీ యువ మోర్చా కార్యకర్తలు దాడికి పాల్పడట్లు థరూర్ ఆరోపిస్తున్నారు. తనను దేశం విడిచి వెళ్లామని బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారని తెలిపారు. 2019లో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చి దేశాన్ని హిందూ దేశంగా మారుస్తారని ఇటీవల శశి థరూర్ పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. -
‘వీడియోలే హత్యకు పురిగొల్పాయి’
సాక్షి, బెంగళూరు : ప్రముఖ జర్నలిస్టు గౌరీ లంకేశ్ హత్యలో సుదీర్ఘ దర్యాప్తు అనంతరం ప్రత్యేక విచారణ బృందం(సిట్) అధికారులు ముగ్గురు కీలక నిందితులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కాగా హత్యకు ముందు నిందితులు నిర్వహించిన కార్యకలాపాలకు సంబంధించి సిట్ అధికారుల పలు సంచలన విషయాలు వెల్లడించారు. జాతీయ మీడియా వివరాల ప్రకారం... అనుమానితుడు అమోల్ కాలే నుంచి స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్క్‌లో హిందుత్వకు వ్యతిరేకంగా మంగళూరులో గౌరీ లంకేశ్ మాట్లాడిన వీడియోలను గుర్తించామని సిట్ అధికారులు తెలిపారు. ఈ వీడియోలను నిందితుడు వాగ్మారే డౌన్లోడ్ చేశాడని సిట్ అధికారులు పేర్కొన్నారు. గౌరీ లంకేశ్ ప్రసంగాలకు సంబంధించిన వీడియోలను పదే పదే చూస్తూ.. తుపాకీ, పెట్రోల్ బాంబ్ పేల్చడం వంటి విషయాల్లో వాగ్మారే శిక్షణ పొందాడని తెలిపారు. ఈ వీడియోలే గౌరీ హత్యకు పురిగొల్పాయని అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా అమోల్ కాలే డైరీలో గౌరీ లంకేశ్‌తో పాటు మరో 36 మంది ప్రముఖులను హత్య చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అతడు డైరీలో రాసుకున్నాడని పేర్కొన్నారు. ఈ ఆపరేషన్ కోసం 50 మంది కరుడుగట్టిన హిందుత్వవాద షూటర్లను కూడా రిక్రూట్మెంట్ చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ విషయాలను కోడ్ భాషలో రాసుకున్నటు సిట్ అధికారులు తెలిపారు. హిందుత్వకు వ్యతిరేకంగా మాట్లాడిన గౌరీ లంకేశ్‌ను ఎలాగైనా హత్య చేయాలని నిర్ణయించుకున్నట్లు కేసులో ప్రధాన నిందితుడు నవీన్ కుమార్ అంగీకరించినట్లు వారు పేర్కొన్నారు. గౌరీ లంకేశ్ హత్యకోసం వాగ్మారే 3 వేల రూపాయలు అడ్వాన్స్‌గా తీసుకున్నట్లు, హత్యకు ముందు రోజు 10 వేల రూపాయలు తీసుకున్నారని విచారణలో వాగ్మారే చెప్పినట్లు సమాచారం. కాగా గౌరీ లంకేశ్ హత్య కేసును వాదించడానికి స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా శ్రీశైల వదావదాగిని కర్ణాటక ప్రభుత్వం నియమించింది.