దేవాలయాలు కూల్చి.. శౌచాలయాలు | Chandrababu Govt Construction of toilets at various places of Temples demolition sites | Sakshi
Sakshi News home page

దేవాలయాలు కూల్చి.. శౌచాలయాలు

Published Wed, Jan 6 2021 4:12 AM | Last Updated on Wed, Jan 6 2021 9:58 AM

Chandrababu Govt Construction of toilets at various places of Temples demolition sites - Sakshi

కృష్ణానది ఒడ్డున శనైశ్చరాలయం కూల్చివేత (ఫైల్‌)

సాక్షి, అమరావతి: చోరీ చేసి పరిగెడుతున్న దొంగ సడెన్‌గా వెనక్కి తిరిగి... దొంగ!! దొంగ!! అని అరిస్తే? యజ్ఞయాగాల్ని భగ్నం చేసిన దయ్యాలు వేదాలు వల్లిస్తే? సేమ్‌ టు సేమ్‌ చంద్రబాబు నాయుడి తీరులానే ఉంటుంది.  అధికారంలో ఉన్న ఐదేళ్లూ దేవాలయాలపై దౌర్జన్యకాండ సాగించిన చంద్రబాబు ఇప్పుడు రాష్ట్రంలో దేవాలయాలకు రక్షణ లేదంటూ మత రాజకీయానికి దిగడం ఇలాంటిదే. మేనిఫెస్టోను భగవద్గీతలా భావిస్తూ అమలు చేస్తున్న ప్రభుత్వాన్ని వేరే రకంగా ఇబ్బంది పెట్టలేక మత విద్వేషాలకు దిగుతుండటం... సీఎం జగన్‌ చెప్పినట్లు కలియుగానికి క్లయిమాక్స్‌ లాంటిదే. ఎందుకంటే 2016 కృష్ణా పుష్కరాల వేళ చంద్రబాబు చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. ప్రజోపయోగ కార్యక్రమాలకు వేరే స్థలాలున్నా పట్టించుకోకుండా... విజయవాడలో దేవాలయాలను అడ్డగోలుగా కూల్చేసి, కొన్నిచోట్ల అదే స్థానంలో టాయిలెట్లు కట్టించిన ఘనత ఆయనది. విజయవాడ సుందరీకరణ పేరిట బాబు నేతృత్వంలో అప్పట్లో... కృష్ణా నది కరకట్టపై ఇబ్రహీంపట్నం మొదలు కంకిపాడు వరకూ ఉన్న 42 ఆలయాల్ని కిరాతకంగా పెకలించి హిందువుల మనోభావాలతో ఆడుకున్నారు.  విజయవాడ మధ్యలో ఉన్న దేవాలయాల్ని రోడ్ల విస్తరణ పేరిట తొలగించేశారు. అప్పట్లో దీనిపై కొందరు స్వాములు, విజయవాడ వాసులు పెద్దఎత్తున ఆందోళనలు చేయగా... వారిని అణచివేసి వేధింపులకు గురిచేశారు. 

ఇప్పటికీ దర్శనమిస్తున్న టాయిలెట్లు 
విజయవాడ వన్‌టౌన్‌లోని గణపతిరావు రోడ్డు వద్ద ఉన్న దాసాంజనేయస్వామి ఆలయాన్ని కూల్చి అక్కడ టాయిలెట్లు కట్టించారు. ఒకప్పుడు గుడి గంటలు, భజనలతో ఎంతో ఆహ్లాదకరంగా ఉన్న ఈ ఆధ్యాత్మిక ప్రాంతం ఇప్పుడు టాయిలెట్లకు నెలవయింది. 
– ప్రకాశం బ్యారేజీ నుంచి కనకదుర్గ వారధి వరకూ ఉన్న దేవాలయాలను పడగొట్టి అక్కడా టాయిలెట్లు పెట్టించారు. 
– ప్రకాశం బ్యారేజీ ఆప్రాన్‌కు వెళ్లే మార్గంలో ఉండే భూగర్భ వినాయకుడి గుడిని కూల్చి దాన్ని ఖాళీగా వదిలేశారు. 
– దీనికి ఎదురుగా రోడ్డుకి అటువైపున కాలువ పక్కనున్న దక్షిణముఖ దాసాంజనేయస్వామిని కూలగొట్టి పుష్కరాల సమయంలో టాయిలెట్లు పెట్టించారు. 
– అలాగే, సీతమ్మవారి పాదాల వద్ద ఉన్న ఆంజనేయస్వామి గుడిని తొలగించి అప్పట్లో స్నానాలు చేసే ప్రాంతంగా మార్చేశారు.
– ఆర్టీసీ కాంప్లెక్స్‌కి ఎదురుగా ఉన్న సాయిబాబా గుడి, బ్రహ్మంగారి గుడిని కూల్చి పద్మావతి ఘాట్‌ను విస్తరించి షాపులు పెట్టారు. ఇప్పుడు అదంతా ఫుడ్‌కోర్టుగా మారింది. 
– భవానీపురం స్వాతి థియేటర్‌ రోడ్డులో కనకమహాలక్ష్మి దేవాలయాన్ని పడగొట్టి ఖాళీగా వదిలేయగా ఇప్పుడు అక్కడ టిఫిన్‌ బళ్లు, చికెన్‌ బళ్లు నడుపుతున్నారు. 
– ఇక కబేళా వద్ద గంగానమ్మ గుడిని కూలగొట్టగా ఇప్పుడక్కడ ఆటోలు నిలుపుతున్నారు. 

అర్థరాత్రిళ్లు పొక్లెయిన్లతో దౌర్జన్యాలు 
అప్పట్లో ఈ గుళ్లను అర్థరాత్రిళ్లు పొక్లెయిన్లతో వచ్చి ఎకాఎకీన పడగొట్టేశారు. ఉదయం గుడికి వెళ్లి దర్శనం చేసుకుందామనుకున్న వారికి కూల్చిన శిథిలాలే కనిపించేవి. గుడుల నిర్వాహకులకు కనీసం సమాచారం ఇవ్వకుండా రాత్రిళ్లు కూల్చేసేవారు. గుళ్లలో ఉన్న విగ్రహాలు, హుండీలు కూడా కనపడేవి కావు. విగ్రహాలకున్న బంగారు, వెండి ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులు ఏమయ్యాయో ఇప్పటికీ ఎవ్వరికీ తెలియదు. కనీసం విగ్రహాలనైనా వెనక్కివ్వాలంటూ స్థానికులు కొందరు నాటి టీడీపీ ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోలేదు. కొన్ని దేవాలయాలకు నష్టపరిహారం ఇస్తామని చెప్పి ఆ తర్వాత పట్టించుకోలేదు. దేవదాయ శాఖ ఆధీనంలో ఉన్న ఆలయాలను సైతం ఆ శాఖకు తెలియకుండా ఉన్నట్టుండి కూల్చివేశారు. 

అప్పట్లో హిందువులకు దారుణ అవమానాలు
నగర సుందరీకరణ పేరిట చంద్రబాబు సాగించిన ఈ అరాచకాలపై అప్పట్లో దేశవ్యాప్త ఆందోళన రేగింది. మఠాధిపతులు, స్వాములు భారీ సభ పెట్టి చంద్రబాబు హిందూ వ్యతిరేక చర్యలను ఖండించారు. విజయవాడలో స్థానికులు ఆందోళనలు చేయగా వారిని అణచివేసి అక్కడి టీడీపీ నాయకుల ద్వారా బెదిరించారు. దేవాలయాలతో బాబు ఆడిన ఈ రాక్షస క్రీడలో హిందువులు అప్పట్లో దారుణ అవమానాలకు గురయ్యారు. అప్పటి ఆయన ప్రభుత్వంలో బీజేపీకి చెందిన ఎమ్మెల్యేనే దేవదాయ శాఖ మంత్రి కావటం గమనార్హం. ఇన్ని దారుణాలు చేసిన చంద్రబాబు ఇపుడు హిందువుల ప్రతినిధిగా... ఎక్కడో ఊళ్లలో, మారుమూలనున్న గుళ్లలో జరుగుతున్న ఘటనలపై ఉద్యమానికి దిగటం చూస్తే ఎవ్వరికైనా ఈ రాజకీయ గెరిల్లా యుద్ధానికి తెగబడుతున్నది ఆయనేనని తెలియకమానదు. 

విగ్రహాలతోపాటు నగలూ మాయం
2016లో రాత్రికి రాత్రి పొక్లెయిన్‌తో కనకమహాలక్ష్మి దేవాలయాన్ని దౌర్జన్యంగా పడగొట్టారు. అమ్మవారి విగ్రహం కూడా కనపడనీయలేదు. బంగారు కిరీటాలు, మంగళసూత్రం, వెండి వస్తువులు కూడా ఎత్తుకెళ్లిపోయారు. కనీసం విగ్రహం ఇవ్వాలని వేడుకున్నా ఎవరూ పట్టించుకోలేదు. గుడి ఉన్న చోట ఇప్పుడు టిఫిన్‌ బళ్లు పెడుతున్నారు. ఇంతకన్నా దారుణం ఉంటుందా?
– తిరుపతి సురేష్, కనకమహాలక్ష్మి దేవాలయం నిర్వాహకుడు, విజయవాడ

ఎంత మొత్తుకున్నా వినకుండా కూల్చేశారు
2016లో టీడీపీ ప్రభుత్వం కావాలని గుళ్లన్నీ కూల్చేసింది. కానీ, ఇప్పుడు దేవాలయాలపై జరుగుతున్న దాడులు ఎక్కడో మారుమూలనున్న ప్రాంతాల్లో జరుగుతున్నాయి. ప్రభుత్వమే అలా చేయిస్తోందన్న చంద్రబాబు విమర్శల్లో అర్థమేమైనా ఉందా?
– ద్రోణంరాజు రవికుమార్, బ్రాహ్మణ సమాఖ్య జాతీయ నాయకుడు, విజయవాడ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement