800 ఏళ్ల క్రితమే ‘జై శ్రీరామ్‌’ | Use of Ram As Political Symbol Is 800 Years Old | Sakshi
Sakshi News home page

800 ఏళ్ల క్రితమే ‘జై శ్రీరామ్‌’

Published Tue, Jul 2 2019 3:46 PM | Last Updated on Tue, Jul 2 2019 3:49 PM

Use of Ram As Political Symbol Is 800 Years Old - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : 17వ లోక్‌సభకు ఎన్నికైన ప్రతిపక్ష పార్లమెంట్‌ సభ్యులు ప్రమాణ స్వీకారానికి వెళుతున్నప్పుడు జూన్‌ 18వ తేదీన పాలకపక్ష బీజేపీ సభ్యులు ‘జై శ్రీరామ్‌’ అంటూ వారిని హేళన చేసిన విషయం తెల్సిందే. ముఖ్యంగా ముస్లిం ఎంపీలు ప్రమాణ స్వీకారానికి వెళుతున్నప్పుడు వారిలా అనుచితంగా ప్రవర్తించారు. అదే రోజు అస్సాంలో ఓ ముస్లిం బృందంపై, జార్ఖండ్‌లో ఓ ముస్లిం యువకుడిపై అల్లరి మూకలు దాడులు చేసి వారి చేత ‘జై శ్రీరామ్‌’ అనిపించారు. ఆ దాడిలో గాయపడ్డ జార్ఖండ్‌ యువకుడు మరణించారు. ఆ తర్వాత రెండు రోజులకు కోల్‌కతాలో సహృఖ్‌ హాల్దర్‌ అనే 26 ఏళ్ల యువకుడిపై కూడా ఓ మూక దాడి చేసి ఆయన చేత కూడా ‘జై శ్రీరామ్‌’ అనిపించారు.

ఇంతకు ఈ ‘జై శ్రీరామ్‌’ ఏ భాషా పదం, దాని అర్థం ఏమిటీ ? ఎప్పటి నుంచి అది వాడుకలోకి వచ్చింది ? రాజకీయాల్లోకి ఎప్పుడు చొరబడింది? ‘జై శ్రీరామ్‌’ అనేది హిందీ పదం. ‘శ్రీరాముడికి జయము కలగాలి’ అన్నది అర్థం. హిందూ దేవుళ్లలో ప్రసిద్ధి చెందిన దేవుళ్లలో రాముడు ఒకరు. గత మూడు దశాబ్దాలుగా హిందూత్వ రాజకీయాల్లో ఈ పదం ఎక్కువగా వినిపిస్తోంది. హిందువుల సమీకరణకు ఓ చిహ్నంగా, ఓ నినాదంగా ‘జై శ్రీరామ్‌’ను ఉపయోగిస్తున్నారు. సంస్కృత పండితుడు షెల్డాన్‌ పొలాక్‌ 1993లో రాసిన ‘రామాయణ అండ్‌ పొలిటికల్‌ ఇమాజినేషన్‌ ఇన్‌ ఇండియా’ అధ్యయన పత్రం ప్రకారం క్రీస్తు శకం 12వ శతాబ్దానికి ముందు రాముడు కేవలం పూజించడానికే పరిమితం అయ్యారు. 12వ శతాబ్దంలో దేశవ్యాప్తంగా రాముడి గుళ్లు వెలిశాయి. వాటిని సందర్శించిన భక్తులు ‘జై శ్రీరామ్‌’ అంటూ నినాదాలు చేయడం ప్రారంభమైంది. క్రీస్తు శకం 1001లో మొహమ్మద్‌ ఘజనీ దాడులు చేయడం, దాని పర్యవసానంగా ఢిల్లీలో 1206లో తొలి సుల్తాన్‌ రాజ్యం ఏర్పడింది. అందుకని ఆ కాలంలో రాముడి గుళ్లు పెరిగాయి. అంటే 800 ఏళ్ల క్రితమే ‘జై శ్రీరామ్‌’ పుట్టిందన్నమాట.

16వ శతాబ్దంలో అన్ని ప్రాంతీయ భాషల్లోకి రామాయణం పుస్తకాలు అనువాదం అవడంతో రాముడు మరింతగా ప్రజల హృదయాల్లోకి చొచ్చుకుపోయారు. దాదాపు అదే సమయంలో ‘రామచరిత్‌మానస్‌’ అవధి భాషలో వెలువడింది. దుష్ట శక్తులను ఎదుర్కొనగల శక్తి రాముడికి మాత్రమే ఉందనే నమ్మకం ప్రజల్లో పెరిగింది. సమాజంలోని దుర్మార్గులను రావణుడితో పోల్చడం ప్రారంభమైంది. 17వ శతాబ్దంలో మరాఠీలో వచ్చిన రెండు రామాయణం పుస్తకాల్లో ఒకదాట్లో అప్పటి మొగల్‌ చక్రవర్తి ఔరంగజేబును రావణుడితో పోల్చగా, మరో పుస్తకంలో ఔరంగజేబును రావణుడి సోదరుడు కుంభకర్ణుడితో పోల్చారు.

ఆధునిక రాజకీయాల్లోకి
బ్రిటీష్‌ పాలకులకు వ్యతిరేకంగా దేశ స్వాతంత్య్రం కోసం పోరాడుతున్నప్పుడు జాతిపిత మహాత్మా గాంధీ తమకు ‘రామరాజ్యం’ కావాలన్నారు. కానీ రాజకీయంగా రాముడి ప్రస్తావన అంతకుముందే ప్రారంభమైంది. 1920లో అవద్‌లో బాబా రామచంద్ర నాయకత్వాన జరిగిన రైతు ఉద్యమంలో రామ పదం మరింత ప్రాచుర్యం పొందింది.

సీతా–రామ్‌ పేరిట అభివాదం
మహారాష్ట్రకు చెందిన బాబా రామచంద్ర ఫిజీలో పారిశ్రామిక కార్మికుడిగా పనిచేసి భారత్‌కు వచ్చారు. ఆయన అసలు పేరు శ్రీధర్‌ బల్వంత్‌ జోధపుర్కార్‌.  ఆయన తులసీదాస్‌ రామాయణాన్ని చదవి స్ఫూర్తి పొందారు. రైతుల సమస్యలు ఆలకిస్తూ ఆయన ఆ రమాయణంలోని అంశాలను వారికి చెబుతుండేవారు. దాంతో ఆయనకు బాబా రామచంద్ర అనే పేరు వచ్చింది. ఆయన వద్దకు వచ్చే రైతులందరూ ఆయనకు సలాం చెప్పేవారు. సలాం అంటే దిగువ స్థాయి వారు, ఎగువ స్థాయి వారికి చెప్పేదని, తమందరం సమానం కనుక ఇక నుంచి కలుసుకున్నప్పుడు ‘సీతా–రామ్‌’ అని చెప్పుకుందామని చెప్పారు. అది అప్పట్లో పెను తుపానులా రైతులందరికి పాకింది. రైతులెవరు కలుసుకున్నా ‘సీతా–రామ్‌’ అంటూ అభివాదం చేసుకునేవారు. నాడు రైతుల సమీకరణకు కూడా అది ఎంతో ఉపయోగపడింది. రైతులను సమీకరించాలన్నా ‘సీతా–రామ్‌’ అంటూ గట్టిగా అరచేవారు.

దాని నుంచి ‘జై సియా–రామ్‌’ నినాదం పుట్టుకొచ్చింది. అది కాస్త బీజేపీ చేపట్టిన రామజన్మ భూమి ఆందోళన సందర్భంగా ‘జై శ్రీరామ్‌’గా మారిందని జర్నలిస్ట్, రచయిత అక్షయ ముకుల్‌ తాను రాసిన ‘రైజ్‌ ఆఫ్‌ హిందూత్వ’ పుస్తకంలో పేర్కొన్నారు. 1980 దశకంలో ఈ నినాదం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఎల్‌కే అద్వానీ రథయాత్ర సందర్భంగా ‘జై శ్రీరామ్‌’ నినాదాలతో మత ఘర్షణలు చెలరేగాయి. 1987లో రామానంద సాగర్‌ తీసిన ‘రామాయణ్‌’ టెలివిజన్‌ సీరియల్‌ బాగా పాపులర్‌ అవడమూ తెల్సిందే.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement