యూపీ సహా హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో రాముడే ప్రచారాస్త్రం
మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, బిహార్, రాజస్థాన్‌ల నుంచి
2 కోట్ల మంది భక్తులను అయోధ్యకు తీసుకెళ్లిన బీజేపీ
హిందూత్వ వాదాన్ని ముందుపెట్టి ప్రచారాన్ని హోరెత్తిస్తున్న కాషాయదళం
రామాయణం ఫేమ్ అరుణ్ గోవిల్ పోటీ చేస్తున్న
మీరట్ నుంచే ప్రచారం మొదలుపెట్టిన ప్రధాని మోదీ
పశి్చమబెంగాల్ సహా దక్షిణాది రాష్ట్రాల్లోనూ రాముడి ఫోటోలతోనే ప్రచారాలు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలో ముచ్చటగా మూడోసారి విజయకేతనాన్ని ఎగురవేసేందుకు అస్త్రశ్రస్తాలన్నీ సంధిస్తున్న కాషాయ దళం..హిందీ రాష్ట్రాలతో సహా అనేక రాష్ట్రాల్లో అయోధ్య రామమందిర నిర్మాణ అంశాన్ని ప్రచారాస్త్రంగా మారుస్తోంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందునుంచే రాముడే ఈసారి తమ ఎన్నికల బ్రాండ్ అంబాసిడర్ అని ప్రకటించిన బీజేపీ నేతలు..ఇప్పుడే రాముడి చిత్రాలనే ముందుపెట్టి, రామరాజ్యం నినాదాలిస్తూ, హిందూత్వ ఎజెండాతో ఎన్నికల పోరును పరుగులు పెట్టిస్తున్నారు. ప్రతిపక్షాలపై రామబాణాన్ని ఎక్కుపెట్టి దమ్ముంటే తమ విజయాన్ని ఆపాలని సవాల్ విసురుతున్నారు.
హిందీ బెల్ట్‌లో ‘రాముడే’ అజెండా..
అయోధ్యలో రామమందిరంలో ఈ ఏడాది జనవరిలో రామ్‌లల్లా ప్రాణప్రతిష్ట సమయంలోనే లోక్‌సభ ఎన్నికలపై ‘జై శ్రీరామ్’ నినాదం తీవ్ర ప్రభావం చూపుతుందనే వ్యాఖ్యానాలు మొదలయ్యాయి. దేశంలోని 80 శాతం హిందువుల భావోద్వేగాలతో ముడిపడిన రామమందిర నిర్మాణాన్ని పూర్తి చేయడం ద్వారా హిందూత్వ భావజాలం పట్ల తనకున్న నిబధ్దతను బీజేపీ రుజువు చేసుకుందనే వాదనలు, విశ్లేషణలు వచ్చాయి.
ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి రావాలన్న ఆహా్వనాన్ని కాంగ్రెస్ సహా మెజార్టీ ప్రతిపక్షాలు తిరస్కరించడం దీనికి మరింత రాజకీయాన్ని పులిమాయి. ఈ అంచనాలకు తగ్గట్లుగానే ప్రస్తుతం హిందీ భాష మాట్లాడే రాష్ట్రాల్లో రాముడే ఎన్నికల ప్రచారాస్త్రంగా మారాడు. ముఖ్యంగా ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, జార్ఖండ్, హరియాణా, హిమాచల్‌ప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో రామాలయం, రామరాజ్యం అన్న అంశాల చుట్టూ రాజకీయం నడుస్తోంది. ఈ రాష్ట్రాల్లో మొత్తంగా 218 లోక్‌సభ స్థానాలుండగా, గత ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే 166 స్థానాలను గెలుపొందించింది.
ఒక్క యూపీలోనే 80 స్థానాలకు గానూ ఒంటిరిగా, 62, మిత్రపక్షాలతో కలిసి 64 సీట్లు సాధించింది. ప్రస్తుత ఎన్నికల్లో యూపీలో సొంతంగా 70 సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీన్ని సాధించే క్రమంలో హిందుత్వ భావాజాలన్ని మరింత విస్తృతం చేసే క్రమంలో 80 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గం నుంచి కనీసంగా 10 వేల మందికి ఉచితంగా అయోధ్య రాముడి దర్శనం కలి్పంచింది. ప్రత్యేక రైళ్లు, బస్సులు ఏర్పాటు చేసి వృధ్దులు, మహిళలు, యువతను పెద్ద ఎత్తున ఆకర్షించింది.
దర్శనం అనంతరం భక్తుల తిరుగు ప్రయాణ ఏర్పాట్లతో పాటు, వారి వారి ప్రాంతాలకు తిరిగి రాగానే స్థానిక ప్రజలు స్వాగతం పలికేలా, ఈ సందర్భంగా ప్రసాదం, అక్షింతల వితరణ జరిపేలా కార్యక్రమాలు నిర్వహించింది. ఈ తరహా కార్యక్రమాలనే హిందీ భాష మాట్లాడే అన్ని రాష్ట్రాల నుంచి కొనసాగించి సుమారు 2 కోట్ల మంది భక్తులకు ఉచితంగా రాముడి దర్శనం కలి్పంచింది. ఇది ప్రస్తుత ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపుతోంది. దీనికి తోడు యావత్ భారతావణిని విశేషంగా అలరించి రామాయణం టీవీ సీరియల్ ఫేమ్ అరుణ్ గోవిల్‌ను మీరట్ నుంచి రంగంలోకి దింపడమే గాక, ప్రధాని మోదీ తన తొలి ఎన్నికల ప్రచార సభను అక్కడి నుంచే ఆరంభించి, తన ప్రచారాస్త్రం రాముడని చెప్పకనే చెప్పారు.
ఇక మధ్యప్రదేశ్‌లో బీజేపీ హిందుత్వ కార్డును ఎదుర్కోవడానికి కాంగ్రెస్ అగ్రనేత కమల్‌నాథ్ తనను తాను హనుమంతుడి భక్తుడిగా ప్రకటించుకుంటూ ముందుకు వెళుతున్నారు. ఎక్కడ రామాలయం కనిపిస్తే అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. చత్తీస్‌గఢ్‌లో బీజేపీ ప్రచారాన్ని తట్టుకునేందుకు తమ ప్రభుత్వ హయాంలోనే రామాయణ, కౌసల్య ఉత్సవాలను ఘనంగా నిర్వహించామని,. రాముడు, సీత బసచేసిన అన్ని ప్రదేశాలను అభివృద్ధి చేసే లక్ష్యంతో రామ్ వాన్ గమన్ టూరిజం సర్క్యూట్‌ను ప్రారంభించామని కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటోంది.
మిగతా రాష్ట్రాల్లోనూ ఆయనే..
హిందీ మాట్లాడే రాష్ట్రాలతో పాటు పశి్చమబెంగాల్, తమిళనాడు, తెలంగాణ, మహారాష్ట్రలోనూ రాముడి ఆలయం, రామరాజ్యం చుట్టూతే ఎన్నికలు ప్రదక్షిణం చేస్తున్నాయి. రాముడి ఆలయ ప్రారంభోత్సవానికి ముందు ప్రధాని మోదీ తమిళనాడు రామేశ్వరంలోని శ్రీరామనాధస్వామి ఆలయం, శ్రీరంగంలోని రంగనాధ స్వామి ఆలయం, ధనుష్‌కోఠి ఆలయాలను దర్శించారు. హిందూత్వ అజెండాతో బీజేపీ ప్రచారాన్ని ముందు పెట్టడంతో అక్కడి అధికార డీఎంకే దీన్ని ఎదుర్కొనేందుకు సనాతన ధర్మానికి తాము వ్యతిరేకమని ప్రచారం చేస్తోంది. ఆ పార్టీ నేత డి.రాజా ఒకడుగు ముందుకేసి ‘జై శ్రీరామ్ నినాదాన్ని తమిళనాడు అంగీకరించదు.
బీజేపీ ఐడియాలజీ ఇక్కడ పనిచేయదు’ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను బీజేపీ తప్పుపట్టి తన స్టైల్‌లో ప్రచారం చేస్తోంది. ఇక పశి్పమ బెంగాల్‌లో ప్రచారం అంతా రాముడి చుట్టూ తిరుగతోంది. రామనవమి సందర్భంగా ప్రతి వార్డు, బూత్, మండల, జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, హనుమాన్ మందిరాల్లో పూజలు సహా రాష్ట్ర వ్యాప్తంగా 5 వేల కార్యక్రమాలు నిర్వహించింది. బీజేపీ చేస్తున్న ప్రచార హోరుకు తలొగ్గిన ఆ రాష్ట్ర ప్రభుత్వం తొలిసారి రామనవమికి సెలవుగా ప్రకటించింది. మొత్తం మీద రామనామమే ఎన్నికల బాణంగా బీజేపీ తమ ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment