ఆర్మీలో ‘జై శ్రీరామ్‌’, ‘జై బజరంగబలి’ నినాదాలు ఎందుకు? | Why Does Indian Army Take the Name of Lord Ram and Bajrang Bali Every Day | Sakshi
Sakshi News home page

Indian Army: ఆర్మీలో ‘జై శ్రీరామ్‌’, ‘జై బజరంగబలి’ నినాదాలు ఎందుకు?

Published Wed, Jan 31 2024 1:39 PM | Last Updated on Wed, Jan 31 2024 2:47 PM

Why Does Indian Army Take the Name of Lord Ram and Bajrang Bali Every Day - Sakshi

ప్రపంచంలోని ఐదు అత్యంత శక్తివంతమైన సైన్య బలగాలలో భారత సైన్యం ఒకటిగా గుర్తింపు పొందింది. ఇండియన్ ఆర్మీలో అనేక రెజిమెంట్లు ఉన్నాయి. ప్రతి రెజిమెంట్‌కు దాని సొంత యుద్ధ నినాదాలు ఉన్నాయి. ‘వార్ క్రై’ అంటే యుద్ధ సమయంలో సైనికునికి స్ఫూర్తినిచ్చే, ఉత్సాహభరితమైన నినాదాలు. అవి శత్రువును తరిమికొట్టేందుకు ప్రేరణ కల్పిస్తాయి. 

సైనికులలో ఉత్సాహాన్ని నింపడానికి పలు రెజిమెంట్లు జై శ్రీ రామ్, బజరంగబలి కీ జై, దుర్గా మాతా కీ జై అంటూ నినాదాలు చేస్తాయని తెలిస్తే  ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. ఈ రెజిమెంట్‌లలో బ్రిటీష్ కాలం నుంచి ‘జై శ్రీరామ్’ అనే యుద్ధ నినాదం వినిపిస్తే వస్తోంది. నాడు బ్రిటిషర్లుకూడా దీనికి అభ్యంతరం చెప్పలేదు. మతపరమైన యుద్ధ నినాదాలు సైనికులలో మరింత ఉత్సాహాన్ని నింపుతాయని బ్రిటీషర్లు కూడా భావించారు. 

భారత సైన్యం (ఆర్మీ), వైమానిక దళం, నావికాదళాల యుద్ధ నినాదం ఒకటే. అదే ‘భారత్ మాతా కీ జై’.. అయితే ప్రతి రెజిమెంట్‌కు ఒ‍క్కో ప్రత్యేక నినాదం ఉంది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

రాజ్‌పుతానా రైఫిల్స్
రాజ్‌పుతానా రైఫిల్స్ సైన్యంలోని పురాతన రైఫిల్ రెజిమెంట్. ఇది 1921 సంవత్సరంలో ఏర్పడింది. ఆ సమయంలో ఇది బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ పరిధిలో ఉంది. ‘రాజా రామచంద్ర కీ జై’ అనేది ఈ రెజిమెంట్ నినాదం.

టెరిటోరియల్ ఆర్మీ
టెరిటోరియల్ ఆర్మీ అనేది భారత సైన్యానికి సహాయక సైనిక సంస్థ. భారత సైన్యానికి సేవలను అందించడం దీని పని. ఇది 1949, అక్టోబర్ 9న ఏర్పడింది. ‘జై శ్రీరామ్‌’ అనేది టెరిటోరియల్ ఆర్మీ నినాదం.

కుమావూ రెజిమెంట్
కొన్ని రెజిమెంట్లు ‘బజరంగబలి’ పేరుతో యుద్ధ నినాదాలు చేస్తాయి. వాటిలో ఒకటి కుమావూ రెజిమెంట్. ఇది 1922లో ఏర్పాటయ్యింది. ‘కాళికా మాతా కీ జై, బజరంగబలి కీ జై, దాదా కిషన్ కీ జై’ అనేవి కుమావూ రెజిమెంట్ యుద్ధ నినాదాలు. 

బీహార్ రెజిమెంట్
బీహార్ రెజిమెంట్ సైన్యంలోని పురాతన పదాతిదళ రెజిమెంట్. ఇది 1941లో ఏర్పడింది. దీని ప్రధాన కార్యాలయం బీహార్‌లోని దానాపూర్‌లో ఉంది. ఈ రెజిమెంట్ 2020లో గాల్వాన్ వ్యాలీలో చైనీస్ ఆర్మీని మట్టి కరిపించింది. ‘జై బజరంగబలి’ అనేది బీహార్ రెజిమెంట్ నినాదం.

జమ్మూ కాశ్మీర్ రైఫిల్స్
జమ్మూ కాశ్మీర్ రైఫిల్స్ భారత సైన్యానికి చెందిన సైనిక బృందం. ఇది 1821లో ఏర్పడింది. ‘దుర్గా మాతా కీ జై' అంటూ జమ్మూ కాశ్మీర్ రైఫిల్స్ యుద్ధ నినాదాలు చేస్తుంటుంది. 

గర్వాల్ రైఫిల్స్
గర్వాల్ రైఫిల్స్ బెంగాల్ ఆర్మీ ఆధ్వర్యంలో 1887లో స్థాపితమయ్యింది. ఇది బెంగాల్ ఆర్మీకి చెందిన 39వ రెజిమెంట్. ఆ తర్వాత ఇది బ్రిటిష్ ఆర్మీలో భాగమైంది. స్వాతంత్య్రానంతరం ఇది ఇండియన్ ఆర్మీ రెజిమెంట్‌గా మారింది.దీని యుద్ధ నినాదం ‘బద్రీ విశాల్ కీ జై’. 

జాట్ రెజిమెంట్
జాట్ రెజిమెంట్ ఒక పదాతిదళ రెజిమెంట్. స్వాతంత్ర్యం తరువాత ఈ రెజిమెంట్‌కు ఐదు యుద్ధ గౌరవాలు లభించాయి. ఈ రెజిమెంట్ ఎనిమిది మహావీర్ చక్ర, ఎనిమిది కీర్తి చక్ర, 39 వీర్ చక్ర, 170 సేన పతకాలను అందుకుంది. ‘జాట్ బల్వాన్, జై భగవాన్’అనేది దీని యుద్ధ నినాదం.

డోగ్రా రెజిమెంట్
డోగ్రా రెజిమెంట్ 1922లో ఏర్పడింది. డోగ్రా రెజిమెంట్‌కు చెందిన నిర్మల్ చందర్ విజ్ జనవరి 1, 2003న ఆర్మీ చీఫ్‌గా నియమితులయ్యారు. 2005 వరకు ఈ పదవిలో కొనసాగారు. ‘జ్వాలా మాతా కీ జై’ అనేది ఈ రెజిమెంట్ యుద్ధ నినాదం. 

ఇదే కాకుండా పంజాబ్ రెజిమెంట్, సిక్కు రెజిమెంట్, సిక్కు లైట్ పదాతిదళాల 'జో బోలే సో నిహాల్, సత్ శ్రీ అకల్’అనే నినాదాలు చేస్తాయి. దీనితో పాటు పంజాబ్ రెజిమెంట్ ‘బోలో జ్వాలా మాతా కీ జై’ అనే నినాదాన్ని అందుకుంటుంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement