
గతేడాది 3,077 మందికి క్షయ నిర్ధారణ
బాధితులు 6 నుంచి 9 నెలలు మందులు వాడాల్సిందే
నిర్లక్ష్యం చేస్తే మొండి వ్యాధిగా రూపాంతరం
నేడు క్షయ వ్యాధి అవగాహన దినం
కర్నూలుకు చెందిన 45 ఏళ్ల మహిళ క్షయ వ్యాధితో కోలుకోలేక కన్నుమూసింది. మందులపై సరైన అవగాహన లేక మొదట్లో కాస్త బాగా అనిపించగానే మందులు మానేసింది. ఆమెకు షుగర్ కూడా ఉండటంతో వ్యాధి తిరగబెట్టి ఎండీఆర్ టీబీగా రూపాంతరం చెందింది. తర్వాత మందులు వాడినా కోలుకోలేక మృతిచెందింది. ఈ మందులు ఎలా వాడాలో వైద్యులు, సిబ్బంది అవగాహన కలి్పంచకపోవడం వల్లే ఆమె కన్నుమూయాల్సి వచ్చింది.
– కర్నూలు(హాస్పిటల్)
ఎంతో మంది క్షయ వ్యాధికి మందులు వాడుతూ మధ్యలో ఆపేసి, ఆ తర్వాత మొండి టీబీతో మరణిస్తున్నారు. క్షయ బాధితులు మొదటిసారి మందుల వాడకం ప్రారంభించగానే కొందరికి కడుపులో తిప్పుతుంది. ఇందుకోసం కొందరు వైద్యులు గ్యాస్ట్రబుల్ మందులు ఇస్తారు. మరికొందరికి తీవ్ర ఆకలి అవుతుంది. ఇంకొందరికి రెండు నెలలు మందులు వాడగానే ఆరోగ్యం కుదుట పడుతుండటంతో బాగైందని భావించి మందుల ప్రభావానికి భయపడి మానేస్తున్నారు. కానీ మందులు మధ్యలో ఆపకూడదని, కచ్చితంగా 6 నుంచి 8 నెలలు వాడాలని చెప్పేవారు లేరు. గతంలో లాగా డాట్స్ విధానంలో ఇచ్చే మందుల పద్ధతి కూడా ఇప్పుడు లేకపోవడంతో రోగుల్లో తీవ్రత పెరిగిపోతోంది. నేడు వరల్డ్ టీబీ డే (ప్రపంచ క్షయ వ్యాధి అవగాహన దినం) సందర్భంగా ప్రత్యేక కథనం.
జిల్లాలో ప్రతి 2 లక్షల నుంచి 2.5 లక్షల జనాభాకు ఒక టీబీ యూనిట్ చొప్పున 9 యూనిట్లు ఏర్పాటయ్యాయి. ఇందులో ఒక సీనియర్ టీబీ సూపర్‌వైజర్, సీనియర్ ల్యాబ్ సూపర్‌వైజర్ విధులు నిర్వహిస్తున్నారు. రోగులను పర్యవేక్షించేందుకు ప్రతి సూపర్‌వైజర్‌కు ఒక మోటార్ సైకిల్ ఇచ్చారు. దీంతో పాటు ప్రతి పీహెచ్‌సీలో ఎక్స్‌రే యూనిట్లు ఉన్నాయి. వీటి ద్వారా క్షయ నిర్ధారణ చేయవచ్చు. గతేడాది 78,368 మందికి పరీక్షలు చేయగా 3,077 మందికి క్షయ నిర్ధారణ అయ్యింది. గత కేసులతో కలుపుకొని మొత్తం 4,571 మందికి చికిత్స అందిస్తున్నారు. వీరికి జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు 6 నుంచి 8 నెలల పాటు ఉచితంగా అందిస్తారు. గతేడాది క్షయ నుంచి కోలుకోలేక 104 మంది మరణించారు.
వ్యాధినిర్దారణ ఇలా !
రెండు వారాలకు మించి దగ్గ, సాయంత్రం వేళల్లో జ్వరం, దగ్గితే గళ్ల పడటం, బరువు తగ్గడం, ఆకలి తగ్గడం, ఉమ్మిలో రక్తం పడటం వంటి లక్షణాలుంటే క్షయగా అనుమానించి సమీప ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్ష చేయించుకోవాలి. రోగి గళ్లను వైద్య సిబ్బంది సేకరించి మైక్రోస్కోప్, ట్రూనాట్, సీబీ నాట్ మిషన్‌ల ద్వారా నిర్దారిస్తారు.
పెరుగుతున్న ఎండీఆర్‌టీబీ కేసులు
క్షయవ్యాధిలో మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ టీబీ (ఎండీఆర్‌టీబీ) కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. క్షయ మందులపై అవగాహన లేక చాలా మంది కోర్సు మధ్యలోనే మానేస్తున్నారు. దీనివల్ల వ్యాధి తిరగబెట్టి మరింత మొండిగా తయారవుతోంది. అప్పుడు సాధారణ టీబీ మందులు పనిచేయవు. వారికి ఖరీదైన ఎండీఆర్ టీబీ మందులు ఇవ్వాల్సి ఉంటుంది. వీటి ఖరీదు రూ.2 లక్షల దాకా ఉంటుంది. ఈ మందులకు కూడా లొంగకపోతే బెడాక్విలిన్ అనే రూ.18 లక్షల విలువైన 11 నెలల కోర్సు మందును ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఎండీఆర్ టీబీ రోగులు 135 మంది ఉండగా, బెడాక్విలిన్ మందులు వాడే వారు 52 మంది ఉన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత మందులతో పాటు రోగి పోష కాహారం కోసం నెలకు రూ.వెయ్యి అందిస్తున్నారు.
నిక్షయ్ మిత్ర ద్వారా సరుకులు
నిక్షయ్ మిత్ర ద్వారా కో–ఆపరేటివ్, కార్పొరేట్, ప్రజాప్రతినిధులు, దాతల ద్వారా క్షయ రోగులకు అవసరమైన పోషకాహార కిట్లను అందిస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాలో 129 సంస్థలు రిజిస్టర్ కాగా 2,117 మంది క్షయ రోగులను దత్తత తీసు కుని 12,045 పోషకాహార ప్యాకెట్లను అందజేశారు.
నేడు అవగాహన సదస్సు
ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవాన్ని పురస్కరించుకుని కర్నూలులో ఈ నెల 24వ తేదీన ర్యాలీ నిర్వహించనున్నారు. కర్నూలు మెడికల్ కాలేజీలోని ఓల్డ్ క్లినికల్ లెక్చరర్ గ్యాలరీలో అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తున్నారు. క్షయ వ్యాధిపై వైద్య, ఫార్మసీ విద్యార్థులకు నిర్వహించిన క్విజ్, వ్యాసరచన పోటీల విజేతలకు బహుమతుల ప్రదానం చేయనున్నారు.
క్షయను తగ్గించడమే లక్ష్యం
జిల్లాలో ప్రస్తుతం ప్రతి 3 వేల మందికి పరీక్ష చేయగా 170 దాకా కేసులు బయటపడుతు న్నాయి. ఈ సంఖ్యను 50లోపు తగ్గించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఒకరి నుంచి మరొకరికి వ్యాధి సోకకుండా చర్యలు తీసుకుంటు న్నాం. వ్యాధిసోకిన వారి ఇంట్లో అందరికీ టీబీ ప్రీవెంటివ్ థెరపీ కింద ఆరు నెలల పాటు మందులు ఉచితంగా ఇస్తున్నాం. ఇటీవల పెద్దవారికి కూడా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది.
–డాక్టర్ ఎల్.భాస్కర్, జిల్లా క్షయ నియంత్రణాధికారి, కర్నూలు
Comments
Please login to add a commentAdd a comment