
ప్రపంచంలోని ప్రమాదకరమైన విమానాశ్రయాల్లో లుక్లా విమానాశ్రయం ఒకటి. నేపాల్‌లో ఉన్న దీనిని టెన్జింగ్–హిల్లరీ విమానాశ్రయంగా కూడా పిలుస్తారు. సముద్ర మట్టానికి దాదాపు 2,860 మీటర్ల (9,383 అడుగులు) ఎత్తులో ఉన్న ఈ విమానాశ్రయం చుట్టూ ఎత్తైన పర్వతాలు, లోయలు ఉన్నాయి. లుక్లా విమానాశ్రయం రన్‌వే కేవలం 527 మీటర్ల (1,729 అడుగులు) పొడవు మాత్రమే ఉంటుంది.
అందుకే ఇక్కడ ల్యాండింగ్, టేకాఫ్ అనేవి పెద్ద సాహసమనే చెప్పుకోవాలి. వాతావరణ పరిస్థితులు కూడా తరచుగా మారుతూ ఉంటాయి. దట్టమైన పొగమంచు, బలమైన గాలులు విమానాల రాకపోకలను మరింత ప్రమాదకరంగా మారుస్తాయి.
ఆధునిక ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలు లేకపోవడం కూడా ఈ ప్రమాదకరమైన పరిస్థితులకు కారణం. సాహసికులు, పర్వతారోహకులకు లుక్లా విమానాశ్రయం ఎంతో ప్రత్యేకంగా నిలుస్తుంది. మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకోవడానికి ఇదే ప్రధాన మార్గం. లేదంటే అనేక రోజుల పాటు నడవాల్సి ఉంటుంది. చిన్న విమానాలు, హెలికాప్టర్లు మాత్రమే ఇక్కడ ల్యాండ్ కాగలవు.
(చదవండి: నిన్న పిజ్జా మేకర్.. నేడు ఫ్యాషన్ మోడల్..! అంతర్జాతీయ ఫ్యాషన్ పత్రికలు..)