
నాకు ఇప్పుడు తొమ్మిదవ నెల. వర్క్‌లో బిజీగా ఉండి ఏ జాగ్రత్తా సరిగ్గా తీసుకోలేదు. నార్మల్ డెలివరీ కావాలని ఉంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
– నిర్మల, నల్గొండ
నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు పెంచుకోవటానికి ప్రెగ్నెన్సీ అంతా కూడా పోషకాహారాలు తీసుకోవాలి. రెగ్యులర్‌గా వ్యాయామం చెయ్యాలి. ఈ రోజుల్లో చాలా చోట్ల చైల్డ్ బర్త్ ప్రిపరేషన్ క్లాసెస్ అని అవుతున్నాయి. అవి హాజరైతే మంచిది. మొదటి ప్రెగ్నెన్సీలో ఈ సలహాలు పాటిస్తే సులభంగా నార్మల్ డెలివరీ అవుతుంది. ఒకవేళ మీరు బిజీగా ఉండి క్లాసెస్ హాజరు కాలేకపోయినా, తొమ్మిదవ నెలలో అయినా పోషకాహార నిపుణుడిని కలసి సమత్యులమైన ఆహారం ఏమి తీసుకోవాలో తెలుసుకోండి.
పండ్లు, కూరగాయలు, ఫైబర్, పానీయాలు ఎక్కువ తీసుకోవాలి. ప్రినేటల్ విటమిన్ టాబ్లెట్స్ రోజూ తీసుకోవాలి. ఇప్పుడైనా రెగ్యులర్‌గా వాకింగ్, స్విమ్మింగ్ లేదా ప్రీనేటల్ యోగా చెయ్యండి. దీనితో సత్తువ పెరుగుతుంది. కెగల్ వ్యాయామాలు అని పెల్విక్ ఫ్లోర్ స్ట్రెంతెనింగ్ అయేవి మీకు ఆన్‌లైన్‌లో కూడా వీడియోస్‌లో నేర్పిస్తారు. అవి తొమ్మిదవ నెల నుంచి డెలివరీ తరువాత కూడా పాటించండి. పెరినియల్ మసాజ్ కూడా కొంతమందికి సూచిస్తాం.
మీ గైనకాలజిస్ట్‌ని కలిసినప్పుడు దీని గురించి కనుక్కోండి. సరైనంత నిద్ర కూడా అవసరం. బేబీ కదలికలని జాగ్రత్తగా ట్రాక్ చేసుకోండి. స్క్వాట్స్, బర్తింగ్ బాల్ వ్యాయామాలతో బేబీ తల కిందకి వచ్చే అవకాశాలు, సులభ కాన్పు అయ్యే అవకాశాలు పెరుగుతాయి. మీరు ఇవి అన్నీ పాటించవచ్చా లేదా అని స్కాన్ రిపోర్ట్ చూసి మీ డాక్టర్ నిర్ణయిస్తారు.
నాకు మొదటి ప్రెగ్నెన్సీలో అసలు వాంతులు లేవు. సులభంగా నార్మల్ డెలివరీ అయింది. ఇప్పుడు రెండో ప్రెగ్నెన్సీలో చాలా వాంతులు అవుతున్నాయి. ఏమీ తినటం లేదు మందులు సేఫ్ కాదని వేసుకోవాలను కోవటం లేదు. బేబీ గ్రోత్ ఏమయినా ఎఫెక్ట్ అవుతుందా మళ్లీ నార్మల్ డెలివరీ అవుతుందా?
– భ్రమర, గుంటూరు.
ప్రెగ్నెన్సీలో వికారం, వాంతులు అనేవి చాలా సాధారణం. ప్రెగ్నెంట్ హార్మోన్స్ వలన ఈ మార్పులు అవుతాయి. ఐదవనెలకి హార్మోన్స్ తగ్గడంతో వాంతులు తగ్గుతాయి. వాంతులు ఎక్కువ అవుతున్నప్పుడు దానిని హైపెరెమెసిస్ అంటారు. దీని వలన మీకు డీహైడ్రేషన్ ఎక్కువ ఉంటుంది. సరైన ఆహారం లేనందు వలన పోషాకాహార లోపం ఉంటుంది.
కానీ, బేబీ శరీరంలోని స్టోర్స్ నుంచి బేబీకి పోషకాలు అందుతాయి. కాబట్టి, బిడ్డ ఎదుగుదలకు ప్రభావం ఉండదు. మీ డెలివరీ ప్రాసెస్ కూడా దీని వలన ఎఫెక్ట్ అవదు. మళ్లీ నార్మల్ డెలివరీకి ఈ వాంతుల వలన ఏమీ సమస్య ఉండదు. మీరు మందులు వాడొద్దు అనుకుంటే డైట్‌లో ఈ మార్పులు చేసుకోవాలి. డ్రై టోస్ట్ లేదా ప్లేన్ బిస్కెట్స్ ఉదయం తీసుకోవాలి. తక్కువ కొవ్వు, ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఆహారం భోజనంలో తీసుకోవాలి.
కొంచెం కొంచెం ఎక్కువ సార్లు తీసుకోవాలి. బ్రెడ్, రైస్ తీసుకోవచ్చు. పానీయాలు కనీసం రెండు నుంచి మూడు లీటర్ల వరకు నెమ్మదిగా సిప్ చేస్తూ తాగాలి. ఎండబెట్టిన అల్లం లేదా ఎండబెట్టిన ఆమ్లా నములుతున్నా వాంతులు తగ్గుతాయి. విశ్రాంతి కూడా ఎక్కువ తీసుకోవాలి. మీకు వాంతి వచ్చే ఆహారం, వాసనలకు దూరం ఉండండి. ఇవన్నీ ప్రయత్నించినా తగ్గకపోతే, మందులు తప్పకుండా తీసుకోవాలి.
డాక్టర్ భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్‌స్టెట్రీషియన్, హైదరాబాద్
(చదవండి: Summer Weight Loss Tips: బరువు తగ్గేందుకు బెస్ట్ సీజన్..! ఎలాంటి ఫుడ్ తీసుకోవాలంటే..)