
ఏ చిన్న ఇన్ఫెక్షన్ లేదా ఏ ఆరోగ్య సమస్య వచ్చినా చాలామంది అడపదడపా యాంటీబయాటిక్ టాబ్లెట్లు వేసుకుంటూ ఉంటారు. కానీ గర్భవతుల విషయంలో వాళ్లు ఇలా చేయడం ఎంతమాత్రమూ సరికాదు. ఎందుకంటే యాంటీబయాటిక్స్ మాత్రమే కాకుండా డాక్టర్ సలహా సూచన లేకుండా ఏ టాబ్లెట్‌ను కూడా గర్భవతులు వాడకూడదు. ఆ టాబ్లెట్స్ వాళ్లకు ఎంతో కీడు తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది.
గర్భవతులు యాంటీబయాటిక్స్ వాడితే ఆ దుష్ప్రభావం కడుపులోని బిడ్డపై పడి... ఆ చిన్నారికి ఎన్నో రకాల కీడు జరిగే అవకాశముంటుంది. ఉదాహరణకు కాబోయే తల్లులు యాంటీబయాటిక్స్ వాడితే... అవి బిడ్డ ఎముకల ఎదుగుదలకు అవరోధంగా పరిణమించవచ్చు. దాంతో బిడ్డ అవయవ నిర్మాణంలోనే లోసాలు (అనటామికల్ అబ్‌నార్మాలిటీస్) వచ్చి, కొన్ని అవకరాలు వచ్చే అవకాశముంది.
కాబోయే తల్లి స్ట్రెప్టోమైసన్ వాడటం వల్ల బిడ్డకు వినికిడి లోపాలు వచ్చే అవకాశాలుంటాయి. తల్లులు వాడే టెట్రాసైక్లిన్ అనే యాంటీబయాటిక్ కారణంగా బిడ్డ దంతాలకు రావాల్సిన సహజమైన రంగు రాక΄ోవచ్చు. కొన్ని సందర్భాల్లో బిడ్డకు వచ్చే ఆ దంతాలు తమ సహజమైన మెరుపును కోల్పోవచ్చు. సల్ఫోనమైడ్స్ అనే యాంటీబయాటిక్స్ కారణంగా బిడ్డ పుట్టిన నెలలోపే వారికి కామెర్లు రావచ్చు.
అయితే ప్రెగ్నెన్సీలో సైతం తీసుకోదగిన కొన్ని సురక్షితమైన యాంటీబయాటిక్స్ కూడా ఉంటాయి. అంటే... గర్భవతి ఏ త్రైమాసికంలో ఉందో దాన్ని బట్టి కొన్ని యాంటీబయాటిక్స్‌ను గర్భవతులకు సురక్షితంగా వాడుకోదగ్గవి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అందువల్ల గర్భిణికి యాంటీబయాటిక్స్ వాడాల్సిన పరిస్థితి వస్తే డాక్టర్ల పర్యవేక్షణలో వాటిని వాడాల్సి ఉంటుంది. అలాంటివి వాడుకోవచ్చు.
(చదవండి: సమ్మర్‌లో వర్కౌట్‌లు చేసేటప్పుడూ..బీ కేర్‌ఫుల్ ..!)