Antibiotics
-
ఏఎంఆర్.. యమ డేంజర్!
సాక్షి, విశాఖపట్నం: అతి సర్వత్రా వర్జయేత్... అని పెద్దలు చెప్పినట్లుగా మేలు చేస్తున్నాయని యాంటీబయాటిక్స్‌ను మితిమీరి వాడటం మానవాళి మనుగడకు ముప్పుగా మారుతోంది. అతిగా యాంటీబయాటిక్స్ వాడటం వల్ల మనుషులకు మేలు చేసే మైక్రోబ్స్‌ను నాశనం చేస్తున్నాయి. కీడు చేసే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్) పెరగడానికి కారణమవుతున్నాయి. ప్రపంచ బ్యాంక్ ఇటీవల వెల్లడించిన వివరాల ప్రకారం ఏఎంఆర్ వల్ల 2019 నుంచి ప్రపంచవ్యాప్తంగా ఏటా 49 లక్షల మంది మరణిస్తున్నారు. మన దేశంలో కూడా 2019లో ఏఎంఆర్ కారణంగా దాదాపు 3లక్షల మంది మృతిచెందారు. ఏఎంఆర్ మరణాలు ఎక్కువగా దక్షిణాసియా, లాటిన్ అమెరికా, కరేబియన్ దీవుల్లో గుర్తించారు. ఇదే పరిస్థితి కొనసాగితే 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కారక మరణాల కన్నా అధికంగా ఏఎంఆర్ మరణాలు ఏటా కోటి వరకు నమోదవుతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. తలసరి ఆదాయం, డిమాండ్‌కు అనుగుణంగా ఆహార ఉత్పత్తులను పెంచుకోవడానికి మన దేశంలో కూడా వాణిజ్య, జంతు, వ్యవసాయ ఉత్పత్తుల్లో యాంటీబయాటిక్స్ వాడకం రోజురోజుకు పెరిగిపోతోంది. దీనిని అరికట్టాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఏఎంఆర్ ముప్పును ప్రపంచమంతా కలిసికట్టుగా ఎదుర్కొనేందుకు ఈ నెల 18 నుంచి 24వ తేదీ వరకు ‘వరల్డ్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెంట్ అవేర్నెస్ వీక్’ పేరుతో అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఏమిటీ ఏఎంఆర్ ? » కంటికి కనిపించని సూక్ష్మ బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్, పారాసైట్స్ మొదలైనవి మనిషి శరీరం లోపల, బయట, చుట్టూ ఉంటాయి. వీటన్నింటినీ మైక్రోబ్స్ అని పిలుస్తారు. » కొన్ని రకాల జీవక్రియలకు మైక్రోబ్స్ అవసరం. జీర్ణకోశ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండడానికి, రోగ నిరోధక వ్యవస్థ సక్రమంగా పని చేయడానికి, ఆహారంలోని పోషకాలను శరీరం శోషించుకోవడానికి మంచి బ్యాక్టీరియాలు, వైరస్లు సహాయకారిగా ఉంటాయి. వ్యవసాయం, పరిశ్రమల్లోను వీటి ప్రాధాన్యం పెరిగింది. » ఈ మైక్రోబ్స్ కేవలం మేలు చేయడమే కాదు... కొన్ని సందర్భాల్లో మానవాళితోపాటు జంతువులు, మొక్కలకు హాని కలిగిస్తాయి. అందుకే యాంటీ మైక్రోబియల్ టీకాలను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ టీకాలు ప్రమాదకర మైక్రోబ్స్‌ను అంతం చేయడం, వాటి వ్యాప్తిని తగ్గించడం చేస్తుంటాయి. » అయితే, యాంటిబయాటిక్స్ అధికంగా వాడటం వల్ల చెడు మైక్రోబ్స్ తమ శరీరంలో ఔషధ నిరోధక శక్తిని పెంచుకుంటాయి. టీకాలకు లొంగకుండా మొండిగా మారి సూపర్ బగ్స్‌గా రూపాంతరం చెందుతాయి. అప్పుడు టీకాలు, ఔషధాలు వినియోగించినా ఎలాంటి ఫలితం కనిపించదు. దీనినే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్) అంటారు. వన్ హెల్త్ అప్రోచ్ అవసరం ఏఎంఆర్ అనేది మానవ ఆరోగ్యం, జంతువులు, వ్యవసాయం, ఆహారం, పర్యావరణం... ఇలా అన్నింటిపైనా ప్రభావం చూపిస్తోంది. ఈ విపత్తు నుంచి బయటపడాలంటే ‘వన్ హెల్త్ అప్రోచ్’ ఆధారంగా మానవ ఆరోగ్యం, జంతు ఆరోగ్య, పర్యావరణ రంగాల మధ్య సమన్వయంతో కూడిన సహకార చర్యలు అవసరం. ఈ ముప్పు నుంచి కాపాడుకునేందుకు, సమస్యను పరిష్కరించడానికి 2017లో మన దేశం జాతీయ కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. 2022లోనే ఏపీలో కూడా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశాం. – డాక్టర్ బి.మధుసూదనరావు, ఐసీఏఆర్–సీఐఎఫ్టీ ప్రిన్సిపల్ సైంటిస్ట్ ఆహారభద్రత, సుస్థిరాభివృద్ధికి ముప్పు » ప్రస్తుతం ఏఎంఆర్ మానవ ఆరోగ్యానికి, ఆహార భద్రతకు, సుస్థిర అభివృద్ధికి సైతం ముప్పుగా పరిణమించింది. » ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారం కేవలం ప్రాణనష్టంలోనే కాదు... అన్ని దేశాలను ఆర్థికంగా దిగజార్చేంత శక్తి ఏఎంఆర్‌కు ఉంది. » ఏఎంఆర్ కారణంగా 2050 నాటికి 100 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక నష్టాన్ని ప్రపంచం చవిచూస్తుందని అంచనా. » జీడీపీలో 3.5శాతం తగ్గుముఖం పట్టే ప్రమాదం ఉంది. » ఏఎంఆర్ వల్ల ప్రపంచ ఎగుమతుల్లో 3.5% వరకు తగ్గవచ్చు. » మితిమీరిన యాంటీబయాటిక్స్ వినియోగం వల్ల పశువుల ఉత్పత్తి 7.5శాతం తగ్గుతుంది. » ఇదే పరిస్థితి కొనసాగితే 2050 నాటికి 28 మిలియన్ల మంది పేదరికంలో కూరుకుపోతారు. -
ప్రాణాలతో చెలగాటమా?
దేశంలోని అత్యున్నత కేంద్రీయ ఔషధ నియంత్రణ అధారిటీ తన తాజా నివేదికలో వెల్లడించిన అంశాలు సంచలనం రేపుతున్నాయి. మనం తరచూ వాడే మందుల్లో 50కి పైగా ఔషధాల నమూనాలు ‘నిర్ణీత నాణ్యతాప్రమాణాలకు తగినట్టు లేనివి’(ఎన్ఎస్క్యూ) అంటూ నివేదిక వెల్లడించింది. జ్వరం, కడుపులో పూత లాంటి వాటికి వాడే ప్యారాసెటమాల్, పాన్–డి మందులతో సహా విటమిన్ సప్లిమెంట్లు, షుగర్ వ్యాధి మాత్రలు, యాంటీ బయాటిక్స్ సైతం ఆ జాబితాలో ఉండడం ఆందోళన కలిగిస్తోంది. నాసిరకం మందులను ఉత్పత్తి చేసినవాటిలో కొన్ని పేరున్న సంస్థల పేర్లూ ఉండేసరికి ఆందోళన రెట్టింపవుతోంది. అమాయక ప్రజల ఆరోగ్యభద్రతకై అత్యవసర చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది. అదే సమయంలో ఔషధాల తయారీకి ప్రధాన కేంద్రంగా, అంతర్జాతీ యంగా ఔషధాల ఎగుమతిలో అగ్రగామిగా, ‘ప్రపంచానికే మందుల అంగడి’గా భారతదేశానికి గుర్తింపున్న నేపథ్యంలో నాణ్యతపై మనం మరింతగా దృష్టి పెట్టాల్సి ఉందని అర్థమవుతోంది. గత ఏడాదీ 51 ఔషధాలు నాణ్యతా పరీక్షలో విఫలమయ్యాయి. ప్రభుత్వ ఔషధ విభాగం నిరుడు 1,306 నమూనాలను పరీక్షించినప్పుడు, అది బయటపడింది. నిజానికి, భారతదేశంలో ఔషధాలు, సౌందర్య ఉత్పత్తుల నాణ్యత అంశం ‘1940 నాటి ఔషధ, సౌందర్య ఉత్పత్తుల చట్టం’ కిందకు వస్తుంది. ఆ చట్టం ప్రకారమే వీటి పర్యవేక్షణ, నియంత్రణ సాగుతుంది. ఔషధ నియంత్రణ అధికారులు క్రమం తప్పకుండా మార్కెట్ నుంచి ఔషధ నమూనాలను సేకరించి, పరీక్షలు చేస్తుంటారు. చట్టప్రకారం నిర్దేశించిన ప్రమాణాలను పాటించని ఉత్పత్తుల గురించి ప్రతి నెలా నివేదిక విడుదల చేస్తారు. కేంద్రీయ ఔషధ నాణ్యతా నియంత్రణ సంస్థ (సీడీఎస్సీఓ) సర్వసాధారణంగా ఇలా పరీక్షలు జరపడం, వాటి ఫలితాలనూ – ఆ పరీక్షల్లో తప్పిన మందుల జాబితానూ ఎప్పటి కప్పుడు వెల్లడించడం కచ్చితంగా మంచిదే. అన్ని వర్గాలూ అప్రమత్తమయ్యే వీలు చిక్కుతుంది. అయితే, సామాన్య జనం నిత్యం వాడే యాంటీ బయాటిక్స్, షుగర్, బీపీల మందులు కూడా నిర్ణీత నాణ్యతా ప్రమాణాల్లో విఫలమవుతున్నట్టు ఇటీవలి నివేదికల్లో వెల్లడవడం ఆందోళన రేపుతోంది. పైగా, ప్రమాణాలు పాటించని జాబితాలోని మందులు ఎక్కువవుతూ ఉండడం గమనార్హం. తాజాగా ఈ ఆగస్టులో చేసిన పరీక్షల్లో కొన్ని రకాల సీ విటమిన్, బీ కాంప్లెక్స్ మందులూ నాసి రకమేనని తేలింది. భారతీయ ఔషధ ప్రబంధం నిర్దేశాలకు అనుగుణంగా కొన్ని మందులు ‘విలీన పరీక్ష’లో, మరికొన్ని ‘నీటి పరీక్ష’లో విఫలమైనట్టు అధికారిక కథనం. నాణ్యత మాట అటుంచితే, కొన్ని బ్యాచ్‌ల ఔషధాలు అచ్చంగా నకిలీవట! ఇది ప్రజల ఆరోగ్యానికి హానికరమే కాక, విశ్వ వేదికపై ఔషధ సరఫరాదారుగా భారతదేశ పేరుప్రతిష్ఠలకు భంగకరం కూడా! సహజంగానే పలు మందుల కంపెనీలు తాము తయారు చేస్తున్నవి అన్ని రకాలుగా నాణ్యమైనవేనంటూ ప్రతిస్పందిస్తున్నాయి. నాణ్యత లేకపోవడానికీ – నకిలీ మందులకూ చాలా తేడా ఉందనీ, దాన్ని స్పష్టంగా గుర్తించాలనీ పేర్కొంటున్నాయి. అది నిజమే కానీ, అసలు అనుమానాలే రాని రీతిలో, లోపరహితంగా మందుల తయారీ బాధ్యత ఆ రంగంలో ఉన్న తమదేనని ఆ సంస్థలు మరువరాదు. ఆ మాటకొస్తే, ఈ రంగానికి ఉన్న ప్రతిష్ఠను కాపాడేందుకు ముందుగా అవే చొరవ తీసుకోవాలి. ఔషధ రంగం మన దేశానికి అత్యంత కీలకమైనది. దేశంలో కనీసం 10 వేల దాకా ఔషధ తయారీ యూనిట్లున్నాయి. దాదాపు 200కు పైగా దేశాలకు భారత్ నుంచి మందులు సరఫరా అవుతుంటాయి. మన ఔషధ విపణి పరిమాణం దాదాపు 5 వేల కోట్ల డాలర్లు. పైగా సరసమైన ధరలకే మందులు అందిస్తున్న పేరున్న మన మార్కెట్ ప్రస్తుతం రెండంకెల వృద్ధి రేటుతో పురోగమిస్తోంది. కోవిడ్ సమయంలోనే కాక, విడిగానూ అనేక రోగాలకు టీకాలు అందించడంలో భారత్ అగ్రశ్రేణిలో నిలిచిందని పాలకులు పదే పదే చెప్పుకొస్తుంటారు. అలాంటప్పుడు మన దగ్గర తయారయ్యే ఔషధాల నాణ్యతపై మరింత అప్రమత్తత తప్పనిసరి కదా! దురదృష్టవశాత్తూ, అందులోనే మనం వెనుకబడుతున్నాం. గ్యాంబియా, ఉజ్బెకిస్తాన్ తదితర దేశాల్లో సంభవించిన బాలల మరణాలకు భారతీయ తయారీ ఔషధాలే కారణమంటూ ఆ మధ్య అంతర్జాతీయ వివాదాలు తలెత్తిన సంగతి విస్మరించలేం. అంటే బయటపడ్డ కొన్ని మందుల విషయంలోనే కాదు... మొత్తంగా ఔషధతయారీ, నాణ్యత, నియంత్రణ వ్యవస్థపై లోతుగా దృష్టి పెట్టాల్సి ఉంది. ఎగుమతి మాట దేవుడెరుగు... ముందుగా ప్రభుత్వాలకైనా, ఔషధ తయారీ సంస్థలకైనా ప్రజారోగ్య భద్రత ముఖ్యం కావాలి. అందులో ఎవరు రాజీపడినా అమాయకుల ప్రాణాలతో చెలగా టమే. అది సహించరానిది, భరించ లేనిది. అందువల్ల నాసిరకమనీ, నకిలీవనీ తెలిసిన మందులను మార్కెట్ నుంచి వెంటనే వెనక్కి రప్పించాలి. అందుకు చట్టం, తగిన విధివిధానాలు లేకపోలేదు. కానీ, వాటిని ఏ మేరకు అమలు చేస్తున్నారన్నది చెప్పలేని పరిస్థితి. అది మారాలి. అలాగే, నాణ్యతా పరీక్షల్లో లోటుపాట్లు లేకుండా చూడడం కీలకం. పరీక్షల కోసం నమూనాలను ఎప్పుడు తీసుకు న్నదీ, ఎన్ని తీసుకున్నదీ ప్రకటించడం వల్ల మరింత పారదర్శకత నెలకొంటుంది. కొత్త అనుమానా లకు ఆస్కారమివ్వకుండా పోతుంది. విదేశాల్లోనే కాక, ప్రస్తుతం స్వదేశంలోనూ ఔషధాలపై సందే హాలు ముసురుకుంటున్న వేళ ప్రపంచస్థాయి ప్రమాణాలు అందుకొనేలా మన మందుల తయారీ సాగాలి. అవసరమైతే అందుకు అంతర్జాతీయ నియంత్రణ సంస్థలతో కలసి అడుగులు వేయాలి. ఇంటా బయటా మన ఔషధాలు ఆరోగ్యభద్రతకు చిరునామా కావాలే తప్ప రోగుల నమ్మకాన్ని వమ్ము చేయకూడదు. ఎందుకంటే, మందుల విలువ కన్నా మనుషుల ప్రాణాల విలువ ఎక్కువ! -
అతి వినియోగం అనర్థమే
యాంటీ బయాటిక్స్ అతి వినియోగం కొంపముంచుతోంది. దగ్గు, జలుబు, ఇలా ఏ చిన్న అనారోగ్య సమస్యకైనా ప్రస్తుతం యాంటీ బయాటిక్స్ వాడకం పెరిగి పోయింది. దీంతో వ్యాధి కారక సూక్ష్మజీవులు రోగనిరోధక శక్తిపెంచుకుని యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్)తీవ్ర సమస్యగా మారుతోంది. ఫలితంగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్(యూటీఐ), బ్లడ్ ఇన్ఫెక్షన్, న్యూమోనియా, టైఫాయిడ్ వంటి వ్యాధులకు సాధారణ యాంటీ బయోటిక్ మందులతో చికిత్సలు కష్టతరంగా మారాయని ఐసీఎంఆర్ చెబుతోంది. ఐసీఎంఆర్‌కు చెందినఏఎంఆర్ రీసెర్చ్, సర్వైలెన్స్ నెట్వర్క్ విభాగం ఇటీవల 2023 నివేదికను విడుదల చేసింది. ఇందులో ఆందోళనకర అంశాలు వెలుగు చూశాయి. 2023 జనవరి నుంచి డిసెంబర్ మధ్య దేశ వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో 99,492 నమూనాలను విశ్లేషించి, ఆ ఫలితాల ఆధారంగా నివేదికను విడుదల చేశారు. 20 శాతం తక్కువ ప్రభావంవిశ్లేషించిన నమూనాల్లో 22,182 రక్తం, 20,026 యూరిన్, 19,360 అంటు వ్యాధులు, 17, 902 లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ మిగిలినవి ఇతర బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లకు చెందినవి. కాగా సెఫోటాక్సిమ్, సెప్టాజిడిమ్, సిప్రోఫ్లా్లక్సాసిన్, లెవోఫ్లాక్సాసిన్ వంటి కీలక యాంటీ బయాటిక్స్ బ్యాక్టీరియాతో కలిగే ఇన్ఫెక్షన్లను నయం చేయడంలో 20 శాతం తక్కువ ప్రభావాన్ని చూపినట్టు నిర్ధారించారు. ఉదాహరణకు పైపెరాసిలిన్–టాజోబాక్టమ్ ప్రభావం 2017లో 56.8 శాతం ఉండగా 2023లో 42.4 శాతానికి తగ్గింది. గ్యాస్ట్రోఎంటరైటిస్కు కారణమయ్యే సాల్మొనెల్లా టైఫీ వంటి బ్యాక్టీరియా ఫ్లూరోక్వినోలోన్ ఔషధానికి 95 శాతానికిపైగా నిరోధకతను పెంచుకుందని స్పష్టమైంది. మూత్రనాళ, ఇతర ఇన్ఫెక్షన్లలో చికిత్స కోసం వినియోగించే అమికాసిన్ ప్రభావం 2017లో 79.2 శాతం ఉండగా, 2023లో 68.2 శాతానికి పడిపోయింది. ఏఎంఆర్ ముప్పు నుంచి బయటపడటానికి తక్షణ చర్యలు అవసరమని ఈ నివేదిక నొక్కి చెప్పింది. యాంటీ బయాటిక్స్ విక్రయాలు, వినియోగంపై కఠినమైన నిబంధనలు ఉండాలని వెల్లడించింది. వ్యవసాయరంగంలోనూ యాంటీ బయాటిక్స్ దుర్వినియోగాన్ని అరికట్టాలని స్పష్టం చేసింది. ఏటా 10 లక్షల మంది మృతి యాంటీ బయాటిక్స్ అపరిమిత వినియోగం కారణంగా వ్యాధులు సోకిననప్పుడు చికిత్సల్లో అవి పని చేయక ప్రపంచంలో ఏటా 10 లక్షల మందికిపైగా మృత్యువాతపడుతున్నారు. 1990–2021 మధ్య ఈ మరణాలు సంభవించినట్టు జర్నల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లాన్సెట్‌లో ప్రచురించిన స్టడీ రిపోర్ట్‌లో పేర్కొంది. రాబోయే 25 ఏళ్లలో నాలుగు కోట్ల మంది మృత్యువాత పడే ప్రమాదం ఉన్నట్టు అంచనా వేసింది. భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ తదితర దేశాల్లో 2025–2050 మధ్య యాంటీ బయాటిక్స్‌కు లొంగని వ్యాధులతో 1.18 కోట్ల మరణాలు సంభవిస్తాయని పేర్కొంది. మానవాళి ఎదుర్కొంటున్న 10 అతిపెద్ద ఆరోగ్య సవాళ్లలో ఏఎంఆర్ ఒకటని డబ్ల్యూహెచ్‌వో సైతం ఇప్పటికే పలు మార్లు హెచ్చరించిందని గుర్తు చేసింది.- సాక్షి, అమరావతి -
పొంచి ఉన్న కోవిడ్ జేజమ్మ!
‘కోవిడ్–19 మానవాళిని మూడేళ్లు మాత్రమే ఇబ్బందులకు గురి చేసింది. దీనికి జేజమ్మలా తయారైంది యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఏఎమ్మార్). ఇది భవిష్యత్‌లో మానవాళిని నిరంతరం ఇబ్బందులకు గురి చేయనుంది. దీనివల్ల భవిష్యత్‌లో ప్రపంచం తీవ్రమైన గడ్డు పరిస్థితిని చవిచూడబోతున్నాం’ అని ఇండియన్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ అకాడమీ చైర్మన్ డాక్టర్ బుర్రి రంగారెడ్డి హెచ్చరించారు. ఈ విపత్తు నుంచి బయటపడాలంటే ప్రజలు యాంటీబయోటిక్స్ విచ్చలవిడి వినియోగం తగ్గించాలని సూచించారు. వీటిని వైద్యుల సూచనలు లేకుండా సొంతంగా వినియోగించకూడదని స్పష్టం చేశారు. వైద్యులు సైతం క్లినికల్ పరీక్షల అనంతరం,, వ్యాధి నిర్ధారణ అయ్యాక ప్రోటోకాల్స్ ప్రకారమే యాంటీబయోటిక్స్‌ను చికిత్స కోసం వాడాలన్నారు. కంటికి కనిపించకుండా చాపకింద నీరులా మానవ ఆరోగ్యానికి పెను విపత్తుగా మారుతున్న ఏఎమ్మార్ నియంత్రణ, ప్రజలు, వైద్యులు పాటించాల్సిన జాగ్రత్తలను ‘సాక్షి’తో రంగారెడ్డి పంచుకున్నారు. ఆయన భారత, ఏపీ ఏఎమ్మార్ యాక్షన్ ప్లాన్ రూపకల్పనలో సలహాదారుగా ఉన్నారు. ఏఎమ్మార్పై రంగారెడ్డి ఏమంటున్నారంటే.. –సాక్షి, అమరావతిటాప్–10లో ఇదే ప్రధానం అలెగ్జాండర్ ఫ్లెమింగ్ కనిపెట్టిన పెన్సిలిన్ ఇంజెక్షన్ 1940 దశకంలో వినియోగంలోకి వచ్చింది. ఇది ఆరోగ్య రంగం, రోగుల సంరక్షణలో విప్లవాత్మక మార్పులను తెచ్చింది. అనంతరం రకరకాల యాంటీబయోటిక్స్ తయారీ ఊపందుకుంది. వీటివల్ల సూక్ష్మ క్రిముల ద్వారా వచ్చే అనేకానేక ఇన్ఫెక్షన్లను నయం చేస్తూ బ్యాక్టీరియా వ్యాప్తిని నిరోధిస్తూ వైద్య రంగం ముందుకు వెళ్లింది. పెన్సిలిన్ కనుగొన్న సమయంలోనే దీన్ని విచ్చలవిడిగా వినియోగిస్తే బ్యాక్టీరియాలో ఒకరకమైన నిరోధకత పెరిగి మనం ఇచ్చే ఏ మందులకు పని చేయకుండా సూపర్ బగ్స్‌గా మారతాయని అలెగ్జాండర్ హెచ్చరించారు. వైద్యులు, ప్రజలు లెక్కలేనితనంతో విచ్చలవిడిగా యాంటీబయోటిక్స్‌ని వినియోగించడంతో ఏఎమ్మార్ సమస్య ఉత్పన్నం అవుతోంది.ప్రపంచ ప్రజారోగ్య రంగంలో ఎదుర్కొంటున్న టాప్–10 సమస్యల్లో ఏఎమ్మార్ ప్రధానమైందని డబ్ల్యూహెచ్‌వో సైతం హెచ్చరించింది. అతిగా యాంటీబయోటిక్స్ వినియోగంతో మనుషుల్లో సూపర్ బగ్స్ పెరిగిపోతున్నాయి. దీంతో 80 శాతం యాంటీబయోటిక్స్ పనిచేయడం లేదని ఐసీఎంఆర్, డబ్ల్యూహెచ్‌వో తేల్చాయి.అడ్వాన్స్డ్ డ్రగ్స్ సైతం 10 మందికి ఇస్తే అందులో 9 మందిలో పనిచేయడం లేదు. సెప్సిస్ వంటి జబ్బులు వచి్చనప్పుడు యాంటీబయాటిక్స్ పనిచేయక చేతులు ఎత్తేసే పరిస్థితులు చూస్తున్నాం.యాక్షన్ ప్లాన్‌ను ఆచరణలో పెట్టాలి2016లో డబ్ల్యూహెచ్‌వో ఏఎమ్మార్‌ను విపత్తుగా పరిగణించి గ్లోబల్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. దానికి అనుగుణంగా 2022లో యాక్షన్ ప్లాన్‌ను రూపొందించిన నాలుగో రాష్ట్రంగా ఏపీ నిలిచింది. ప్రస్తుత రోజుల్లో ఏదైనా జబ్బు చేస్తే వైద్యుడి దగ్గరకు వెళ్లిన ఒకటి రెండు రోజుల్లో నయమవ్వాలని ప్రజలు భావిస్తున్నారు. వైద్యులపై ఒత్తిడి తెచ్చి యాంటీబయోటిక్స్ రాయించుకుంటున్న వారు ఉంటున్నారు. లేదంటే ఆ వైద్యుడిని పనికిమాలిన వాడికింద లెక్కగడుతున్నారుమరికొందరైతే వైద్య పరీక్షలు దండగని భావించి.. నేరుగా మెడికల్ షాపులకు వెళ్లి ఫార్మాసిస్ట్ ఇచి్చన యాంటీబయోటిక్స్ వేసుకుంటున్నారు. ఈ చర్యలతో తెలియకుండానే వారి ఆరోగ్యాన్ని వారే పాడుచేసుకుంటున్నారు. చనిపోతామని తెలిసి ఏ వ్యక్తిని కావాలనే విషాన్ని కొనుక్కుని తినడు. యాంటీబయోటిక్స్ విషయంలోనూ ప్రజలు అదే విధంగా ఆలోచించాలి. రోగులు, ప్రభుత్వాలపై ఆర్థిక భారం ఏఎమ్మార్‌ను అత్యంత ప్రాధాన్యత అంశంగా ప్రభుత్వాలు, వైద్యులు పరిగణించాలి. లేదంటే ప్రజారోగ్య వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుంది. ప్రజలు, దేశాలు ఆర్థికంగానూ నష్టపోవాల్సి వస్తుంది. గతంలో చాలా పెద్దపెద్ద జబ్బలకు పెన్సిలిన్, సల్ఫర్ డ్రగ్ ఇస్తే మూడు నుంచి నాలుగు రోజుల్లో రోగి కోలుకుని ఇంటికి వెళ్లిపోయే పరిస్థితి ఉండేది. ప్రస్తుతం చాలా సందర్భాల్లో అవి పనిచేయకపోవడంతో ఒక డోస్, రెండో డోస్ అని డోస్‌ల మీద డోస్‌లు యాంటీబయోటిక్ మందులు వాడాల్సి వస్తోంది. దీంతో రోగులు, ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతోంది. చికిత్సా సమయం పెరుగుతోంది. ఒక రోగాన్ని తగ్గించడం కోసం యాంటీబయోటిక్స్‌ను డోస్‌ల మీద డోస్‌లు ఇవ్వడం శరీరంలో మరో సమస్యకు దారితీస్తోంది. జీర్ణవ్యవస్థలో ఉండే మంచి బ్యాక్టీరియా నిరీ్వర్యమై, జీర్ణకోశ వ్యాధులు ఎక్కువవుతున్నాయి. -
అలా వాడేయటం ఆరోగ్యానికి ‘యాంటీ’
సాక్షి, అమరావతి: జలుబుకు మందు వేస్తే వారానికి.. వేయకపోతే ఏడు రోజులకు తగ్గుపోతుందనేది తెలుగు నాట తరచూ వినిపించే మాటే. స్మార్ట్ ఫోన్లు వచ్చాక దగ్గు.. జలుబు.. జ్వరం.. ఒంట్లో నలతగా అనిపిస్తే వెంటనే గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారు. అందులో సూచించే మందులను మెడికల్ షాపులకు వెళ్లి కొనేస్తున్నారు. వాటిలో యాంటీ బయోటిక్స్ కూడా ఉంటున్నాయి. కొందరైతే మెడికల్ షాపులకు వెళ్లి తనకొచ్చిన నలత ఏమిటో చెప్పి నేరుగా యాంటీ బయోటిక్స్ ఇవ్వాలని అడుగుతున్నారు. ఈ అలవాటు ఆరోగ్యానికి పెనుముప్పు తెచ్చిపెడుతోంది. చాలా ప్రమాదం సుమా! యాంటీ బయోటిక్స్‌ను మితిమీరి వినియోగించడం వల్ల సూక్ష్మజీవనాశక నిరోధకత (యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్) సమస్య ఉత్పన్నం అవుతోంది. వైద్య నిపుణుల సలహా లేకుండా యాంటీ బయోటిక్స్‌ను ఇష్టారీతిన వినియోగిస్తే.. వ్యాధి కారకాలు రోగనిరోధక శక్తి పెంచుకుని.. చివరకు ఏ మందుకూ లొంగకుండా మరింత బలం పుంజుకుంటాయి. టీకాలు, ఔషధాలు ప్రయోగించినా ఫలితం లేకుండాపోతుంది. ఇలా తయారు కావటాన్ని యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్) అంటారు. ఏఎంఆర్ కారణంగా ఏటా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 లక్షల మంది మరణిస్తున్నారు. గత ఏడాది దక్షిణాఫ్రికా, యూకేలో జరిగిన ఓ అధ్యయనంలో ఈ అంశం వెల్లడైంది. కాగా.. 2050 నాటికి ఏఎంఆర్ కారణంగా మృత్యువాత పడేవారి సంఖ్య కోటికి చేరే అవకాశం ఉందని అంచనా వేశారు. ప్రపంచం ఎదుర్కొంటున్న తొలి పది ఆరోగ్య సంక్షోభాల్లో ఏంఎఆర్ ఒకటని డబ్ల్యూహెచ్‌వో సైతం స్పష్టం చేస్తోంది. ప్రి్రస్కిప్షన్ లేకుండానే.. వైద్యులను సంప్రదించకుండా.. ఎటువంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీ బయోటిక్స్ వాడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. డ్రగ్ అండ్ కాస్మొటిక్స్ చట్టం 1945లోని షెడ్యూల్ హెచ్, హెచ్1 మందులను వైద్యుడి ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయించకూడదని ఔషధ నియంత్రణా శాఖ హెచ్చరిస్తున్నా మెడికల్ షాపుల యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. మరోవైపు వైద్య శాఖ సైతం ఏంఎఆర్పై ప్రత్యేక ప్రణాళికను రచించింది. పశుసంవర్ధక, పంచాయతీరాజ్, మునిసిపాలిటీ, ఇతర శాఖలను సమన్వయ పరుచుకుంటూ ఏంఎఆర్ నియంత్రణపై ముందుకు అడుగులు వేస్తోంది. ప్రజలకు సైతం యాంటీబయోటిక్స్ వాడకంపై అవగాహన కల్పిస్తోంది. -
ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీబయాటిక్స్ వాడితే ఎంత ప్రమాదమో తెలుసా?
జ్వరం వచ్చినా, జలుబు వచ్చినా యాంటీబయాటిక్స్ తీసుకోవడం చాలామందికి అలవాటుగా మారిపోయింది. కానీ వైద్యుల సలహా లేకుండా, ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీబయాటిక్స్ తీసుకోవడం ప్రమాదకరమని మీకు తెలుసా? 564 మందిపై 2023లో నిర్వహించిన సర్వేలో 43.6శాతం మంది ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీబయాటిక్స్ ఉపయోగించారట. యాంటీబయాటిక్స్ అవసరం లేకుండా వాడినా, అదేపనిగా వాడినా అనర్థాలు తప్పవని డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ హెచ్చరించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) లెక్కల ప్రకారం ప్రపంచ పది ఆరోగ్య సంక్షోభ అంశాల్లో యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్) మొదటి పదిలో ఒకటిగా ఉన్నట్టు పేర్కొంది. డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌తోనే యాంటీబయాటిక్స్ కొనుగోలు చేయాలి అంటున్నారు డీఏసీ. ఏఎంఆర్ అంటే యాంటీ బయోటిక్స్‌ను అతిగా వాడడం వల్ల ఆ మందు వైరస్‌పై పనిచేయకుండా పోయే పరిస్థితి అని తెలిపింది. యాంటీ బయోటిక్స్‌ను ప్రజలు అవగాహన లేకుండా వాడటంతో వారి ఆరోగ్యం ప్రమాదంలో పడుతోందని డీసీఏ డైరెక్టర్ జనరల్ వీబీ కమలాసన్‌రెడ్డి తెలిపారు. యాంటీబయోటిక్స్ వాడకం అనర్థాలపై అవగాహన పెంచాలని సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. డబ్ల్యూహెచ్ఓ లెక్కల ప్రకారం 2019లో ప్రపంచ వ్యాప్తంగా 12.7 లక్షల మంది బ్యాక్టీరియల్ యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ కారణంగా మృతి చెందినట్టు తెలిపారు. యాంటీబయాటిక్స్ అతిగా వాడడం వల్ల బ్యాక్టీరియా రెసిస్టెంట్‌గా మారుతుందని, ఇది సూపర్‌బగ్ మాదిరిగా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుందని పేర్కొన్నారు డాక్టర్ సూచన మేరకు మాత్రమే యాంటీబయాటిక్స్ వినియోగించాలన్నారు. డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకుండా యాంటీబయాటిక్స్ విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
సత్తా పోతున్న సంజీవనులు!
ప్రాణాలు నిలపాల్సిన ఔషధం కాస్తా మనం చేస్తున్న తప్పుల వల్ల ఆ సామర్థ్యాన్ని కోల్పోతే? మానవాళికి అది మహా ప్రమాదమే. యాంటీ బయాటిక్స్ వినియోగంలో మనం తరచూ చేస్తున్న తప్పుల వల్ల ఆ పరిస్థితే దాపురిస్తోందని నిపుణులు మరోసారి హెచ్చరిస్తున్నారు. యాంటీ బయాటిక్స్ అతిగా వాడడం, లేదంటే నిర్ణీత మోతాదులో సరిగ్గా వాడకపోవడం వల్ల చివరకు ఆ ఔషధాలకు కొరుకుడుపడని ప్యాథోజెన్లు వృద్ధి చెందుతున్నాయి. ఆ నేపథ్యంలోనే అర్హత గల వైద్యులు రాసిచ్చిన మందుల చీటీ లేకుండా యాంటీ బయాటిక్స్‌ను విక్రయించవద్దంటూ కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా అభ్యర్థించింది. అలాగే, యాంటీ బయాటిక్స్ వాడాల్సిందిగా రాసినప్పుడు అందుకు కారణాల్ని సైతం పేర్కొనాల్సిందిగా వైద్యులకు పిలుపునిచ్చింది. యాంటీ బయాటిక్స్ వాడకంలో వివేకంతో వ్యవహరిస్తేనే, మందులకు లొంగని వ్యాధికారక జీవులను అరికట్టవచ్చని మరోసారి నొక్కిచెప్పింది. కొత్త యాంటీ బయాటిక్స్ పరిశోధన, అభివృద్ధి అనేది పరిమితంగానే ఉన్నందున ఔషధ వినియోగంపై తక్షణం అప్రమత్తం కావాలన్న సూచన అందరికీ ఓ మేలుకొలుపు. బ్యాక్టీరియా నిర్మూలనకు ఉద్దేశించిన ఔషధాలపై సదరు సూక్ష్మజీవులే విజయం సాధించడం, వాడే మందుల వల్ల అవి చావకపోగా పెరగడమనేది ఇప్పుడు ప్రపంచాన్ని వేధిస్తున్న పెద్ద సమస్య. దీనికే వైద్యపరిభాషలో ‘యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్’ (ఏఎంఆర్) అని పేరు. ఈ ఏఎంఆర్ వల్ల 2019లో ప్రపంచవ్యాప్తంగా 12.7 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఔషధాలకు నిరోధకత ఏర్పడ్డ ఇన్ఫెక్షన్లతో అదనంగా మరో 49.5 లక్షల మంది మరణించారని లెక్కలు చెబుతున్నాయి. ఏఎంఆర్ వల్ల ఇన్ఫెక్షన్ల నివారణ, చికిత్స కుంటుబడడమే కాక, దీర్ఘకాలిక అనారోగ్యం పెరిగి, ప్రాణానికి ప్రమాదవుతుంది. బలం పెరిగిన ఈ ఇన్ఫెక్షన్లకు ముకుతాడు వేయాలంటే బాగా ఖరీదైన రెండో శ్రేణి ఔషధాలే దిక్కు. వాటి ఖరీదు ఎక్కువ గనక, సామాన్యులకు చివరకు చికిత్సే అందని దుఃస్థితి. పొంచివున్న ఈ ప్రమాదానికి ఇప్పుడు కేంద్ర స్థానం మన దేశమేనట! ఇదే పరిస్థితి కొన సాగితే, 2050 నాటికి ఒక్క భారత్‌లోనే 20 లక్షల మంది చనిపోతారని అంచనా. క్యాన్సర్, రోడ్డు ప్రమాదాలు కలిపి సంభవించే మరణాల కన్నా ఈ సంఖ్య ఎక్కువ. ఇది ఆందోళనకరమైన అంశం. అరుదుగానే వాడాల్సిన వివిధ రకాల యాంటీ బయాటిక్స్‌ను పెద్ద మొత్తంలో మన దేశంలో యథేచ్ఛగా ఉపయోగిస్తున్నట్టు 2022 నాటి లాన్సెట్ అధ్యయనం తేల్చింది. వీటన్నిటి వల్లే, డాక్టర్ చీటీ లేకుండా యాంటీ బయాటిక్స్‌ను షాపుల్లో నేరుగా రోగులకు అమ్మవద్దని ఆరోగ్య శాఖ ఇప్పుడు నొక్కిచెప్పింది. ఏఎంఆర్ విజృంభించకుండా అడ్డుకొనేందుకు వీలుగా సరైన రీతిలో యాంటీ బయాటిక్స్ వినియోగాన్ని ప్రోత్సహించాలన్న ఈ ప్రయత్నం హర్షణీయం. యాంటీ బయాటిక్స్ 1945 నాటి ‘ఔషధాలు, సౌందర్య పోషకాల నిబంధనల’ ప్రకారం షెడ్యూల్ హెచ్ కిందకొస్తాయి. అంటే, రిజిస్టర్ చేసుకున్న మెడికల్ ప్రాక్టిషనర్ చీటీ రాస్తే తప్ప, వాటిని మందుల షాపుల్లో అడిగినవారందరికీ ఇవ్వరాదు. శక్తిమంతమైన యాంటీ బయాటిక్స్నైతే ‘షెడ్యూల్ హెచ్1’లో చేర్చారు. ఈ రెండు షెడ్యూల్స్‌లోని ఔషధాలను డాక్టర్ సిఫార్సుతోనే ఫార్మసీలలో విక్రయిస్తే పెద్ద చిక్కు తప్పుతుంది. ఈ నిబంధనల్ని కఠినంగా అమలు చేయాలన్నదే ఇప్పుడు ఆరోగ్యశాఖ ప్రయత్నం. ఏఎంఆర్ వల్ల మామూలు మందులు బ్యాక్టీరియాపై పని చేసే సత్తాను కోల్పోతాయనీ, ఫలితంగా సాధారణ అనారోగ్యాలు సైతం చివరకు ప్రాణాంతకంగా పరిణమిస్తాయనీ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సైతం ఇప్పటికే హెచ్చరించింది. చాప కింద నీరులా నిశ్శబ్దంగా వ్యాపిస్తున్న ఈ ఏఎంఆర్ మహమ్మారి నవజాత శిశువుల నుంచి వృద్ధుల దాకా ఏ వయసు వారికైనా, జీవితంలో ఏ దశలోనైనా ప్రాణాపాయమే. కాబట్టి, రోగికీ, వైద్యుడికీ మధ్య పరస్పర విశ్వాసం, సత్సంబంధాలు అవసరం. అప్పుడే ఔషధ వినియోగం సక్రమంగా జరుగుతుంది. నిజానికి, యాంటీ బయాటిక్స్ దుర్వినియోగమే కాక ఇతర కారణాలూ ఏఎంఆర్‌కు ఉన్నాయి. శుభ్రమైన తాగునీరు, పారిశుద్ధ్యం, జనంలో చైతన్యం లేకపోవడమూ ఏఎంఆర్‌కు దోహదం చేస్తాయని నిపుణుల మాట. దీన్ని దృష్టిలో ఉంచుకొని తాగునీరు, పారిశుద్ధ్యం, ప్రజారోగ్యంపై శ్రద్ధ చూపడం ప్రభుత్వాల తక్షణ బాధ్యత. మన దగ్గర వాడుతున్న యాంటీ బయాటిక్స్ ‘నిర్ణీత మోతాదు కాంబినేషన్’ (ఎఫ్డీసీ)లు చాలావాటికి అనుమతులు లేవు. కొన్నయితే నిషేధానికి గురైనవి. భారత్, ఖతార్, బ్రిటన్లలో అధ్యయనం జరిపిన పరిశోధకులు ఈ సంగతి తేల్చారు. ఇంకా చెప్పాలంటే, దేశవ్యాప్తంగా అమ్ముతున్న 58 శాతం యాంటీ బయాటిక్స్ ఎఫ్‌డీసీలు తమ లెక్కలో ‘సిఫార్సు చేయరాదు’ అనే జాబితాలో ఉన్నాయని డబ్ల్యూహెచ్ఓ కుండబద్దలు కొట్టింది. అలాగే, వైరల్ ఇన్ఫెక్షనా, బ్యాక్టీరియా ఇన్ఫెక్షనా అనేది నిర్ధారించకుండానే కొందరు వైద్యులు అతి జాగ్రత్తతో యాంటీ బయాటిక్స్ ఇస్తున్న కేసులూ లేకపోలేదు. మనం కళ్ళు తెరిచి, అవగాహనతో అడుగులు వేయాల్సిన సందర్భమిది. అసలంటూ ఏఎంఆర్‌పై అవగాహన పెంచేందుకు ఆరోగ్య శాఖ 2016లోనే ప్రయత్నం చేయకపోలేదు. కొన్ని మందులపై నిలువునా ‘ఎర్ర రంగు గీత’ వేయించి, డాక్టర్ చీటీ లేకుండా అవి వాడవద్దని చెప్పింది. ఎనిమిదేళ్ళలో ఆ ప్రయత్నం ఏ మేర ఫలించిందో తేల్చి, లోటుపాట్లు సరిదిద్దాలి. భారతీయ వైద్య పరిశోధనా మండలి నెలకొల్పిన ఏఎంఆర్ నిఘా, పరిశోధక వ్యవస్థను పటిష్ఠం చేయాలి. అన్నిటి కన్నా ముందుగా ఔషధ దుర్వినియోగ నివారణకై డాక్టర్లు, ఫార్మసిస్టులు, ఫార్మా కంపెనీలు, సామాన్య జనం, సర్కారు కలసికట్టుగా నిలవాలి. సంజీవనులైన ఔషధాలే సత్తా కోల్పోతున్నాయంటే, అది మన స్వయంకృతాపరాధమని గ్రహించి, ఇకనైనా మారాలి. -
డాక్టర్లు యాంటీబయాటిక్స్ రాసిస్తున్నారా? కేంద్రం కీలక సూచనలు
ఏదైనా అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్లినప్పుడు వైద్యులు రకరకాల మందులు, యాంటీబయాటిక్స్ రాసిస్తుంటారు. అయితే ఆ యాంటీబయాటిక్స్ ఎందుకు రాశారు.. ఆవశ్యకత ఏంటన్నది సామాన్యులకు తెలియదు. డాక్టరు చెప్పారు కదా చాలామంది వాడేస్తూ ఉంటారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తాజాగా వైద్యులకు పలు కీలక సూచనలు చేసింది. కారణం రాయాల్సిందే.. రోగులకు యాంటీబయాటిక్స్ సూచించడానికి గల కారణాన్ని, ఆవశ్యకతను ప్రిస్క్రిప్షన్‌లో పేర్కొనడం తప్పనిసరి చేయాలని వైద్య కళాశాలలు, వైద్య సంఘాలలోని డాక్టర్లకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అత్యవసరంగా విజ్ఞప్తి చేసింది. అలాగే ఫార్మసిస్ట్‌లు కూడా డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని, అర్హత కలిగిన డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీబయాటిక్స్ విక్రయింవద్దని డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ డాక్టర్ అతుల్ గోయెల్ కోరారు. వైద్య కళాశాలలు, మెడికల్ అసోసియేషన్ వైద్యులందరినీ ఉద్దేశించి రాసిన జనవరి 1 నాటి లేఖలో యాంటీమైక్రోబయాల్స్ దుర్వినియోగం, మితిమీరిన వాడకం డ్రగ్-రెసిస్టెంట్ పాథోజెన్స్ అభివృద్ధికి దోహదపడుతుందని డాక్టర్ అతుల్ గోయెల్ ఉద్ఘాటించారు. యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ (AMR) అనేది ప్రపంచ ప్రజారోగ్యానికి పెద్ద ముప్పుగా పరిణమించిందన్నారు. దీనివల్ల 2019లో మాత్రమే ప్రపంచవ్యాప్తంగా సుమారు 12.7 లక్షల మరణాలు సంభవించాయన్నారు. ఇవికాక అదనంగా 49.5 లక్షల మరణాలు డ్రగ్-రెసిస్టెంట్ ఇన్ఫెక్షన్లతో సంబంధం కలిగి ఉన్నాయన్నారు. -
70 శాతం రోగులకు యాంటీ బయోటిక్స్!
సాక్షి, హైదరాబాద్: యాంటీ బయోటిక్స్ వినియోగాన్ని పరిమితం చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)తో పాటు మరెన్నో వైద్య సంస్థలు సూచిస్తున్నప్పటికీ వాటి వినియోగం ఎంతమాత్రం తగ్గడం లేదు. దేశవ్యాప్తంగా 20 ప్రభుత్వ ఆసుపత్రులలో జాతీయ వ్యాధి నియంత్రణ సంస్థ (ఎన్సీడీసీ) నిర్వహించిన తాజా అధ్యయనంలో ఈ విషయం తేలింది. యాంటీ బయోటిక్స్ వినియోగాన్ని అంచనా వేయడానికి ఇప్పటివరకు దేశంలో నిర్వహించిన అతిపెద్ద మల్టీ సెంటర్ పీపీఎస్ (పాయింట్ ప్రెవలెన్స్ సర్వే)ల్లో ఇది ఒకటి. కాగా ఆసుపత్రుల్లో అడ్మిట్ అయిన 10 మంది రోగులలో ఏడుగురికి యాంటీ బయోటిక్స్‌ను సూచిస్తున్నట్టు (ప్రిస్క్రైబ్) ఈ సర్వే వెల్లడించింది. 70%లో కనీసం 5% మంది నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రకాల యాంటీ బయోటిక్స్ తీసుకుంటున్నారని వెల్లడైంది. వాచ్ గ్రూప్ యాంటీ బయాటిక్సే ఎక్కువ సాధారణంగా రోగులకు ఉపయోగించే 180 రకాల యాంటీబయోటిక్‌లను, వాటి సామర్థ్యాలకు అనుగుణంగా, వినియోగించాల్సిన తీరుతెన్నులను నిర్ధారించడానికి వాచ్ గ్రూప్ యాంటీ బయాటిక్స్, యాక్సెస్ గ్రూప్ యాంటీ బయాటిక్స్, రిజర్వ్ గ్రూప్ యాంటీ బయాటిక్స్ అంటూ మూడు కేటగిరీలుగా విభజించారు. వీటిలో అత్యధిక సామర్ధ్యం కలిగిన హయ్యర్ రెసిస్టెన్స్ పొటెన్షియల్ కిందకు వచ్చే వాచ్ గ్రూప్ తరహా యాంటీ బయాటిక్స్నే ఎక్కువగా సూచిస్తున్నారని సర్వే నిర్ధారించింది. అదే సమయంలో తక్కువ రెసిస్టెన్స్ పొటెన్షియల్ కలిగిన యాక్సెస్ గ్రూప్ రకాన్ని తక్కువగా సూచిస్తున్నట్టు వెల్లడించింది. యాక్సెస్ గ్రూప్ యాంటీ బయాటిక్స్ ప్రిస్క్రిప్షన్‌ను రెండు వెబ్సైట్లు మాత్రమే అధికంగా నమోదు చేశాయని తెలిపింది. యాంటీ బయాటిక్స్ కలపడం వల్ల ప్రతికూల ప్రభావం చాలా కేసుల్లో పాలీ ఫార్మసీ (బహుళ ఔషధాలను ఒకే సమయంలో వినియోగించడం) గమనించామని, రెండు యాంటీ బయాటిక్స్ కలపడం వలన ప్రతికూల ప్రభావాలు చూపేందుకు, ఔషధ పరస్పర చర్యల ప్రమాదాన్ని పెంచేందుకు అవకాశం ఉందని పేర్కొంది. ఈ సర్వే నివేదికను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య మంగళవారం విడుదల చేశారు. యాంటీ బయాటిక్స్ అధిక వాడకం వల్ల కలిగే హానిని దృష్టిలో ఉంచుకుని, రిజర్వ్ గ్రూప్ యాంటీ బయాటిక్స్ వినియోగం వీలైనంత తక్కువ స్థాయిలో ఉండేలా చూడాలని ఈ అధ్యయనం ఆసుపత్రులకు సిఫారసు చేసింది. -
కుక్కలకు పచ్చిమాంసం తినిపిస్తున్నారా? ఆ ఇన్ఫెక్షన్ మనుషుల్లోనూ..
ఈరోజుల్లో కుక్కల్ని పెంచుకోవడం కామన్ అయిపోయింది. విశ్వాసానికి ప్రతీకగా నిలిచే కుక్కలు బెస్ట్ స్ట్రెస్ బస్టర్‌గానూ ఉంటాయి. అందుకే చాలామంది తమ ఇంట్లో మనిషిలాగే కుక్కలను కూడా ట్రీట్ చేస్తుంటారు. కుటుంబసభ్యులకు చేసినట్లు కుక్కలకు కూడా ఘనంగా బర్త్‌డే పార్టీలు, సీమంతాలు నిర్వహిస్తుంటారు. మరికొందరైతే కుక్కలకి పెట్టకుండా ఏమీ తినరు. అయితే కొన్నిసార్లు అతి ప్రేమతో తెలియకుండానే తప్పులు చేస్తుంటారు. ఇష్టంగా తింటున్నాయి కదా అని ప్రతిరోజూ వాటికి ఆహారంలో పచ్చి మాంసం పెడుతుంటారు. దీని వల్ల మనుషులకు అనేక ఇన్ఫెక్షన్లకు దారితీస్తుందని తాజా అధ్యయనంలో బయటపడింది. కుక్కలకు పచ్చిమాంసం పెట్టడం వల్ల యాంటీ రెసిస్టెంట్ బ్యాక్టీరియాకు కారణం అవుతుందని తేలింది. యాంటీబయాటిక్స్ మన శరీరంలోని హానికరమైన బ్యాక్టీరియాను చంపేందుకు వాడతారు. కానీ మితిమీరి యాంటీబయోటిక్స్‌ను వాడితే శరీరం బాక్టీరియాను నిరోధించే శక్తిని క్రమంగా కోల్పోతుంది. అయితే కుక్కులకు పచ్చి మాంసం తినిపించడం వల్ల సిప్రోఫ్లోక్సాసిన్ నిరోధక E. కోలిని విసర్జిస్తుందని తాజాగా యూకేకు చెందిన బ్రిస్టోల్ సైంటిస్టులు జరిపిన అధ్యయనంలో తేలింది. సాధారణంగా Fluoroquinolones అనే యాంటిబయోటిక్స్‌ను మనుషులకు, పశువైద్యంలోనూ ఉపయోగిస్తారు. కుక్కలకు పచ్చి మాంసం తినిపించం వల్ల బాక్టీరియా ఏర్పడి యాంటీబయాటిక్-రెసిస్టెంట్ E. కోలితో కలుషితమవుతుందని శాస్త్రవేత్తలు తమ రీసెర్చ్‌లో కనుగొన్నారు. సుమారు 600 ఆరోగ్యకరమైన కుక్కలను పరిశీలించగా వాటి నమూనాల్లో మానుషులు, జంతువుల ప్రేగుల్లో E. coli బాక్టీరియా రకాన్ని గుర్తించారు. ఇది పరిశుభ్రత సరిగా లేని, పచ్చి మాంసం తినడం వల్ల పేరుకుపోయిందని తేలింది. దీనివల్ల యాంటిబయోటిక్స్ నిరోధం తగ్గిపోతుందని, ఫలితంగా బాక్టీరియా ఇతర శరీర భాగాలకు వ్యాపించే ప్రమాదం ఉంది. పచ్చిమాంసాన్ని కుక్కలకు స్వయంగా తినిపించం వల్ల మనుషుల్లోనూ అనేక ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. అంతేకాకుండా ఇది ప్రేగుల్లో కొన్ని సంవత్సరాల పాటు పేరుకుపోయి తర్వాత ట్రీట్మెంట్ అందివ్వడానికి సైతం కష్టమవుతుంది. సైంటిస్టులు జరిపిన అధ్యయనంలో సుమారు 7.3% గ్రామీణ కుక్కలు, 11.8% పట్టణాల్లో కుక్కల మలంలో సిప్రోఫ్లోక్సాసిన్-రెసిస్టెంట్ E. కోలి ఉన్నట్లు గుర్తించారు. వండని మాసం తినిపించడే ఈ బాక్టీరియాకు కారణమని నమూనాల్లో తేలింది. అందుకే కుక్కల నిర్వాహణలో జాగ్రత్తలు పాటించాలని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. -
చీటికి మాటికి యాంటీబయాటిక్స్ వాడుతున్నారా?మీరు డేంజర్లో ఉన్నట్లే!
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ప్రాణాలను కాపాడే యాంటీబయోటిక్స్ ఒక్కోసారి ప్రాణాంతకమవుతున్నాయి. విచ్చలవిడి వినియోగం కొంప ముంచుతోంది. ప్రతి చిన్న రోగానికీ పెద్ద మందు వేయడం శరీరానికి భారంగా మారింది. జలుబు, దగ్గు వంటి చిన్న చిన్న వాటికి కూడా ఖరీదైన, మోతాదుకు మించి యాంటీబయోటిక్స్‌ను వాడుతున్నారు. దీంతో కొన్ని రకాల బాక్టీరియా హై డోస్ (తీవ్ర మోతాదుతో కూడిన) యాంటీబయోటిక్స్కూ లొంగని పరిస్థితి ఎదురైంది. దీనివల్ల జరగాల్సిన నష్టం కంటే ఎక్కువగా జరుగుతున్నట్టు వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యాంటీబయోటిక్స్ గురించి కొన్ని నిజాలు.. ►ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఏటా రూ.240 కోట్ల విలువైన యాంటీబయోటిక్స్ వినియోగంలో ఉన్నట్టు అంచనా. ► డాక్టరు సూచించినవి కాకుండా నేరుగా కౌంటర్ సేల్ అంటే మందుల షాపు వద్దకెళ్లి వాడుతున్న వారు 30 శాతం మంది. ► ఉదాహరణకు ఒక వ్యాధి తగ్గాలంటే ఐదురోజుల కోర్సు పూర్తి చేయాలి. కానీ మూడురోజులకే జబ్బు తగ్గిందని ఆపేస్తున్నారు. ► చిన్న చిన్న జ్వరాలు, జలుబు, దగ్గు, విరేచనాలు వంటి జబ్బులకు యాంటీబయోటిక్స్ వాడేవాళ్లు ఎక్కువయ్యారు. ►యాంటీబయోటిక్స్‌కు జబ్బులు తగ్గకపోతే రోగం ముదిరి ఎక్కువ రోజులు ఆస్పత్రిలో ఉండాలి. దీనివల్ల ఆర్థికంగా చితికిపోతారు. ► ఎక్కువ వినియోగంలో ఉన్న యాంటీబయోటిక్స్...అజిత్రోమైసిన్, సెఫాక్సిమ్, సెఫడోక్సిమ్, నార్‌ఫ్లాక్సిన్, సెఫ్ట్రియాక్సోన్, ఆఫ్లాక్సోసిన్, సిప్రోఫ్లాక్సిన్, సిఫ్రాన్, సెప్ట్రాన్, మోనోసెఫ్, టాజోబ్యాక్టమ్ వంటివి. నియంత్రణ ముఖ్యం యాంటీ బయోటిక్స్ వాడేముందు డాక్టర్ ప్రిస్కిప్షన్ తప్పనిసరి. యాంటీ బయోటిక్స్ వాడేటప్పుడు కోర్సు పూర్తయ్యే వరకూ మధ్యలో మానెయ్యొద్దు. డాక్టర్ సూచించిన మోతాదే వాడాలి. మెడికల్ స్టోర్‌కు వెళ్లి మనకు మనమే యాంటీబయోటిక్ తెచ్చుకోకూడదు. చిన్న చిన్న జబ్బులకు యాంటీబయోటిక్స్ వాడటం మంచిది కాదు. యాంటీ బయాటిక్ ఎలా వాడాలి? బాధితులకు వచ్చిన వైద్య సమస్య ఆధారంగా, దాని తీవ్రతను బట్టి... దానికి ఏ తర్చహా యాంటీబయాటిక్స్ వాడాలి, అది కూడా ఎంత మోతాదులో వాడాలి, దాన్ని ఎంతకాలం పాటు వాడాలన్న విషయాలు వైద్యులకే తెలుస్తాయి. ఒకవేళ మందుల మోతాదును తక్కువగా ఇస్తుంటే... రోగకారక క్రిములు క్రమంగా యాంటీబయాటిక్స్ తమపై పనిచేయని విధంగా నిరోధకత (రెసిస్టెన్స్)ను పెంచుకోవచ్చు. అందుకే డాక్టర్లు నిర్దేశించిన మేరకు మాత్రమే, వారు చెప్పిన కాల వ్యవధి వరకే వాటిని వాడాలి.వ్యాధి తీవ్రతను బట్టి యాంటి బయాటిక్స్ వాడాల్సి ఉంది. కానీ చాలా మంది సొంత వైద్యం చేసుకుంటున్నారు. యాంటీ బయాటిక్స్ మందులు ఎక్కువగా వాడడం వల్ల కిడ్నీ, కాలేయ వ్యాధుల బారిన పడి మంచాన పడుతున్నారు. యాంటీ బయాటిక్స్ అధిక మోతాదులో వాడడం వల్ల ప్రస్తుతం కొత్త చిక్కు వచ్చి పడింది. బాక్టీరియాలు సైతం యాంటీ బయాటిక్స్ మందులకు అలవాటు పడడంతో శరీరంలో సహజ సిద్ధంగా ఉండే వ్యాధి నియంత్రణ వ్యవస్థ దెబ్బతింటుంది. ప్రమాదకర స్థాయికి యాంటీ బయాటిక్స్ వాడకం పెరిగిపోవడం వల్ల ఇప్పటికైనా నియంత్రణ చర్యలు చేపట్టాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి దేశంలోని చాలా కాంబినేషన్ యాంటీబయాటిక్స్‌ను వాడొద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది. రెండు మూడురకాలకు చెందిన యాంటీ బయాటిక్స్‌ను కలిపి (కాంబినేషన్) వాడటం సరైంది కాదని పేర్కొంది. కాంబినేషన్ మందులను కుష్టు, క్షయ వంటి వ్యాధులకు వాడాలి. కానీ మన వద్ద చిన్న చిన్న రోగాలకు కూడా కాంబినేషన్ ఔషధాలు వాడుతున్నారు. ఒకటి అవసరమైనచోట రెండు వాడటం వల్ల కూడా ఆ మందు పనిచేయని పరిస్థితి వస్తుంది లొంగకపోతే పెద్ద ప్రమాదం యాంటీబయోటిక్స్ మందులు పరిమితంగా ఉంటాయి. ఒక్కసారి ఈ మందులకు బ్యాక్టీరియా లొంగకపోతే తర్వాత కష్టం. కొత్త జబ్బులు వచ్చినప్పుడు ఈ మందులు పనిచేయవు. ఈ పరిస్థితులను అధిగమించడం చాలా కష్టమవుతుంది. పరిమిత మోతాదులో వాడాలి. – డా.సీహెచ్.ప్రభాకర్‌రెడ్డి,హృద్రోగ నిపుణులు మోతాదుకు మించి వాడితే... యాంటీబయోటిక్స్ పరిమితంగా వాడాలి. జబ్బును బట్టి డాక్టర్ ప్రిస్కిప్షన్ మేరకే కోర్సు వాడాలి. అలాగని రెండ్రోజులు వాడి వదిలేయకూడదు కూడా. పరిమిత మోతాదులో జబ్బును బట్టి వాడితేనే మంచిది. లేదంటే కొన్ని జబ్బులు మొండికేసే అవకాశం ఉంటుంది. –డా.ఫణి మహేశ్వరరెడ్డి, జనరల్ సర్జన్ -
యాంటీబయోటిక్స్ కూడా పనిచేయవా?
గుండెల నిండా హాయిగా గాలి పీల్చుకోవాలంటే భయం. మాస్కు లేకుండా ఇల్లు కదలాలంటే భయం, భయం శరీరాన్ని, మెదడుని ఆక్రమించిన కలుషిత గాలి ఇప్పుడు వ్యాధుల నుంచి బయటపడేసే సంజీవిని లాంటి యాంటీబయోటిక్స్ రెసిస్టెన్స్‌పై ప్రభావం చూపిస్తోంది. వాయు కాలుష్యంతో యాంటీబయోటిక్స్ పని చేయడం లేదని, ప్రపంచవ్యాప్తంగా ఈ కేసుల సంఖ్య పెరిగిపోతోందని తాజా అధ్యయనం హెచ్చరించింది. ఢిల్లీకి చెందిన సమత వయసు 40 సంవత్సరాలు. ఒకరోజు హఠాత్తుగా శ్వాస తీసుకోవడం కష్టమైంది. ఆస్తమా అటాక్ అయింది. ఇంట్లో ఎవరికీ లేని ఆస్తమా ఎందుకొచ్చిందా అని ఆందోళనతో ఉంటే మందులు పని చెయ్యకపోవడంతో కుటుంబ సభ్యులు బెంబేలెత్తిపోయారు. చివరికి ఆస్పత్రిలో చేరితే వైద్యులు అతి కష్టమ్మీద ఆమె ప్రాణాలు కాపాడగలిగారు. దీనికంతటికీ కారణం వాయు కాలుష్యం. వాహనాలు, పరిశ్రమలు వెదజల్లే కాలుష్యం గాల్లో కలిసిపోయి మనుషుల ఊపిరితిత్తులు, గుండె, మెదడుకి పాకుతోంది. వాయు కాలుష్యంతో శ్వాసకోశ సమస్యలు, గుండె వ్యాధులు, కేన్సర్, చివరికి ఆయుఃప్రమాణాలు క్షీణిస్తాయనే మనకి తెలుసు. ఇలాంటి ప్రాణాంతక వ్యాధులకు సంజీవనిలా ఉపయోగపడే యాంటీబయోటిక్స్ పని చేయకుండా వాయుకాలుష్యం చేస్తుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇది పెరిగిపోతే భవిష్యత్‌లో మనుషుల ప్రాణాలు ప్రమాదంలో పడతాయన్న ఆందోళనలున్నాయి. కలుషిత గాలితో వచ్చే అనర్థాల్లో తాజాగా యాంటీబయోటిక్ నిరోధకత పెరిగిపోవడం ప్రమాద ఘంటికలు మోగిస్తోందని లాన్సెట్ హెల్త్ జర్నల్ అధ్యయనాన్ని ప్రచురించింది. చైనా, యూకేకు చెందిన శాస్త్రవేత్తలు వాయు కాలుష్యం ప్రభావాలపై వివిధ సంస్థలు సేకరించిన గణాంకాల ఆధారంగా యాంటీబయోటిక్స్ పనిచేయకపోవడం అతి పెద్ద పెనుముప్పుగా మారనుందని హెచ్చరించారు. 2000 నుంచి 2018 మధ్య కాలంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూరోపియన్ ఎని్వరాన్‌మెంట్ ఏజెన్సీ, వరల్డ్ బ్యాంక్ సహా 116 దేశాల డేటాను సేకరించి అధ్యయనం చేశారు. ► గాల్లోని సూక్ష్మాతి సూక్ష్మ ధూళి కణాలు పీఎం 2.5 వల్ల యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ పెరిగిపోతోంది. గాలిలో కాలుష్యం 10శాతం పెరిగితే యాంటీబయోటిక్‌ను నిరోధించే సామర్థ్యం 1.1% పెరుగుతోంది ► ప్రపంచవ్యాప్తంగా 703 కోట్ల మంది ప్రజలు పీఎం 2.5 దు్రష్పభావాలను ఎదుర్కొంటున్నారు. ► గాల్లో పీఎం 2.5 ధూళి కణాలు మనుషుల వెంట్రుక కంటే 30 రెట్లు చిన్న కణాలతో ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా యాంటీబయోటిక్ నిరోధకతను ఇవి ఎంత ప్రభావితం చూపిస్తున్నాయన్నది అర్థం చేసుకోవడం దుర్లభంగా మారింది. ► యాంటీబయోటిక్స్ పనిచెయ్యకపోవడానికి ప్రధాన కారణం వాటిని మితి మీరి వాడడం అయినప్పటికీ వాయు కాలుష్యమూ మనుషుల శరీరంలో యాంటీబయోటిక్ నిరోధక బ్యాక్టీరియాను పెంచుతోంది. ► ఆస్పత్రులు, వ్యవసాయ క్షేత్రాలు, వ్యర్థాల శుద్ధి ప్లాంట్లు వంటి వాటి నుంచి యాంటీబయోటిక్‌లు పని చెయ్యకుండా చేసే కలుషిత గాలి ఎక్కువగా వెలువడుతున్నట్టు అధ్యయనం వివరించింది. ప్రాణం పోసే యాంటీబయోటిక్ ప్రాణమెలా తీస్తుంది? యాంటీబయోటిక్స్‌ని మితి మీరి వాడకం వల్ల శరీరంలో సహజసిద్ధమైన రోగనిరోధక వ్యవస్థ దెబ్బతింటోంది. దీనివల్ల సూపర్ బగ్స్ ఏర్పడి మంచి బ్యాక్టీరియాను తినేస్తున్నాయి. ఫలితంగా వ్యాధులు సోకినప్పుడు మందులు వేసుకున్నా పని చేయకుండా పోతున్నాయి. యాంటీబయోటిక్స్ పని చెయ్యకపోవడం వల్ల ప్రస్తుతం ఏడాదికి లక్ష మంది మరణిస్తున్నారు. 2050 నాటికి ఈ కారణంతో ప్రపంచ దేశాల్లో అత్యధికమరణాలు సంభవించే ముప్పు ఉంది. -
చీటికి మాటికీ యాంటీ బయాటిక్స్ వాడితే ఈ దుష్ప్రభావాలు తప్పవు! కిడ్నీ, లివర్..
యాంటీ బయాటిక్స్ మందుల వాడకం వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. అందుకే తప్పదంటే తప్ప వీటిని డాక్టర్లు ప్రిస్కెప్షన్గా రాయరు. కానీ వైద్యులతో సంబంధం లేకుండా ప్రజలే ఏ చిన్న ఆరోగ్యపరమైన సమస్య వచ్చినా యాంటీ బయాటిక్స్‌ను మందుల దుకాణాల్లో కొనుగోలు చేసి మింగేస్తున్నారు. ఈ వాడకం కొత్త రకం సమస్యలకు దారి తీస్తోంది. విజయనగరం ఫోర్ట్ : యాంటీ బయాటిక్స్ మందులను జనం తెగ మింగేస్తున్నారు. జిల్లాలో వీటి వినియోగం బాగా పెరిగింది. చిన్నపాటి జలుబు, దగ్గు వంటి వాటికి కూడా ప్రజలు యాంటీ బయాటిక్స్ వాడుతున్నారు. కొంతమంది ఆర్ఎంపీలు చీటికి మాటికీ యాంటీ బయాటిక్స్ ఇవ్వడంతో గ్రామీణ ప్రాంత ప్రజలు కిడ్నీ, లివర్ వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. యాంటీ బయాటిక్స్ అధిక మోతాదులో వాడడం వల్ల ప్రస్తుతం కొత్త చిక్కు వచ్చి పడింది. బాక్టీరియా లు సైతం యాంటీ బయాటిక్స్ మందులకు అలవా టు పడడంతో జ్వరాలు కూడా తగ్గక రోగులు రోజు ల తరబడి మంచాన పడి మూలుగుతున్నారు. వీటి వల్ల శరీరంలో సహజ సిద్ధంగా ఉండే వ్యాధి నియంత్రణ వ్యవస్థ దెబ్బతింటుంది. ప్రమాదకర స్థాయికి యాంటీ బయాటిక్స్ వాడకం పెరిగిపోవడం వల్ల ఇప్పటికైనా నియంత్రణ చర్యలు చేపట్టాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. చిన్న రోగాలకు కూడా.. పట్టణం, పల్లె అనే తేడా లేకుండా యాంటీ బయాటిక్స్ మందులు అ«ధికంగా వినియోగిస్తున్నారు. కొంత మంది ఆర్ఎంపీలు వద్ద తీసుకోగా, మరి కొంతమంది మందుల దుకాణాల వద్ద నేరుగా తెచ్చుకుని వాడుతున్నారు. జలుబు చేసినా.. దగ్గు వచ్చినా.. జ్వరం వచ్చినా.. తలనొప్పి, నడుం నొప్పి, చర్మ వ్యాధులు ఇలా ఏ జబ్బుకు అయినా యాంటీ బయా టిక్స్ తప్పనిసరిగా వాడేస్తున్నారు. వ్యాధి తీవ్రతను బట్టి యాంటి బయాటిక్స్ వాడాల్సి ఉంది. కానీ చాలా మంది సొంత వైద్యం చేసుకుంటున్నారు. యాంటీ బయాటిక్స్ మందులు ఎక్కువగా వాడడం వల్ల కిడ్నీ, కాలేయ వ్యాధుల బారిన పడి మంచాన పడుతున్నారు. జిల్లాలో 1200 మందుల దుకాణాలు జిల్లాలో 1200 మందుల దుకాణాలు ఉన్నాయి. ఏడాదికి సుమారు 50 లక్షలకు పైగా యాంటీ బయా టిక్స్ మాత్రలు జనం వాడుతున్నారు. వైద్యుల ప్రిస్కిప్షన్ లేకుండానే మందుల దుకాణాల్లో విచ్చల విడిగా యాంటి బయాటిక్స్ మందులు విక్రయిస్తు న్నారు. కొంత మంది నేరుగా మందుల దుకాణానికి వెళ్లి అడగగానే వీటిని ఇచ్చేస్తున్నారు. రైతులు, కూలీలు, ఒళ్లు నొప్పులు వచ్చిన వారు ప్రతీ సారి డైక్లోఫినాక్ ఇంజిక్షన్గాని లేదా యాంటీ బయాటిక్ మాత్రలుగాని మెడికల్ షాపుల్లో కొనుగోలు చేసి వాడేస్తున్నారు. వాటి వల అనర్ధాలు తెలియక తాత్కాలిక ఉపశమనం కల్గడంతో వాటినే ఆశ్రయిస్తున్నారు. ప్రిస్కప్షన్ లేకుండా మందులు అమ్మ కూడదన్న నిబంధన ఉన్నప్పటికి అమలు కావడం లేదు. ప్రమాదమే... నొప్పి నివారణ మందులు ఎక్కువగా వాడితే ప్రమాదమే. ప్లారోసిస్ వలన నొప్పులు ఎక్కువ గా ఉంటాయి. నొప్పి నివారణకు వాడే మందు లు వల్ల కిడ్నీలు పాడైపోయే ప్రమాదం ఉంది. కొన్ని రకాల యాంటీ బయాటిక్స్ ఎక్కువగా వాడడం వల్ల కిడ్నీలు పాడయ్యే ప్రమాదం ఉంది. కొన్ని రకాల ఇంజక్షన్లు కిడ్నీలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. వైద్యుని సలహా లేకుండా ఎటువంటి యాంటీ బయాటిక్స్ వాడకూడదు. – డాక్టర్ ఎస్.అప్పలనాయుడు, సూపరింటెండెంట్, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి -
నాణ్యమైన రొయ్యల ఉత్పత్తే లక్ష్యం
సాక్షి, అమరావతి: ఆక్వాసాగులో యాంటిబయోటిక్స్ వినియోగాన్ని పూర్తిగా నియంత్రించేదిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మూడున్నరేళ్లుగా ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా యాంటిబయోటిక్స్ వినియోగాన్ని 95 శాతానికిపైగా నియంత్రించగలిగారు. ఇకముందు 100 శాతం నియంత్రించేదిశగా చర్యలు చేపట్టింది. ఇందుకోసం సీడ్ నుంచి మార్కెటింగ్ వరకు దశలవారీగా యాంటిబయోటిక్స్ శాతాన్ని పరీక్షించేలా కార్యాచరణ సిద్ధం చేసింది. రాష్ట్రంలో ఏటా తొమ్మిదిలక్షల టన్నుల రొయ్యలు ఉత్పత్తి అవుతున్నాయి. లక్షటన్నులు స్థానికంగా వినియోగమవుతుండగా, లక్షన్నర టన్నులు ఒడిశా, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాలకు వెళుతున్నాయి. మిగిలిన 6.50 లక్షల టన్నులు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. దీన్లో 50 శాతం అమెరికా సంయుక్త రాష్ట్రాలకు, 30 శాతం చైనాకు, 10 శాతం వియత్నాం, థాయ్‌లాండ్ దేశాలకు, 6–8 శాతం యూరప్ దేశాలకు, మిగిలింది మిడిల్ ఈస్ట్ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. యాంటిబయోటిక్ రెసిడ్యూల్స్ మితిమీరి ఉన్నాయంటూ ఒకప్పుడు పెద్ద ఎత్తున కన్సైన్మెంట్స్ వెనక్కి వచ్చే పరిస్థితి ఉండేది. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. సర్టిఫై చేసిన సీడ్, ఫీడ్ అందించే లక్ష్యంతో ఏపీ సడా, సీడ్, ఫీడ్ యాక్టులు తీసుకురావడంతోపాటు తీరప్రాంత జిల్లాల్లో రూ.50 కోట్లతో 35 ఇంటిగ్రేటెడ్ ఆక్వాల్యాబ్‌లను ఏర్పాటు చేశారు. ఆర్బీకేల ద్వారా సర్టిఫై చేసిన సీడ్, ఫీడ్ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆర్బీకే చానల్ ద్వారా శాస్త్రవేత్తలతో అవగాహన ఆక్వాసాగు వివరాలను ఈ ఫిష్ యాప్‌లో నమోదుచేస్తూ, నాణ్యమైన దిగుబడులు లక్ష్యంగా పెద్ద ఎత్తున మత్స్యసాగుబడులు నిర్వహిస్తున్నారు. యాంటిబయోటిక్స్ వినియోగంవల్ల తలెత్తే దుష్పరిణామాలపై ఆర్బీకే చానల్ ద్వారా శాస్త్రవేత్తలతో అవగాహన కల్పిస్తున్నారు. పంటకాలంలో కనీసం నాలుగైదుసార్లు వాటర్ అనాలసిస్ టెస్ట్‌లు నిర్వహిస్తున్నారు. ఫలితంగా ఉత్పత్తి ఖర్చులు 5–7 శాతం తగ్గడమే కాదు.. పొరుగు రాష్ట్రాలు, దేశాలతో పోల్చుకుంటే రొయ్యల ఎదుగుదల 12.76 శాతం మేర పెరిగింది. మరోవైపు యాంటిబయోటిక్స్ వినియోగం గణనీయంగా తగ్గుముఖం పట్టింది. ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల నుంచి విదేశాలకు పంపే రొయ్యల్లో యాంటిబయోటిక్స్ అవశేషాలు 0.3 నుంచి 0.4 శాతం ఉంటే, మన రాష్ట్రం నుంచి వెళ్లే వాటిలో 0.2 శాతం మాత్రమే నమోదవుతున్నాయి. అవికూడా కొద్దిపాటి కన్సైన్మెంట్లలోనే. ఈక్విడార్ వంటి దేశాల్లో ప్రతి ఉత్పత్తిని టెస్ట్ చేసిన తర్వాతే విదేశాలకు ఎగుమతి చేసేందుకు అనుమతినిస్తారు. అదే మనదేశంలో ర్యాండమ్‌గా చెక్‌చేసిన తర్వాత ఎగుమతులకు అనుమతినిస్తుంటారు. వ్యాధుల నియంత్రణ పేరుతో విచ్చలవిడిగా వినియోగిస్తున్న యాంటిబయోటిక్స్ వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయి. యాంటిబయోటిక్స్ అవశేషాలుంటే ఇకనుంచి రొయ్యలను కొనుగోలు చేయబోమని ఇటీవల జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో ప్రాసెసింగ్ ఆపరేటర్లు, ఎక్స్‌పోర్టర్లు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో నూరుశాతం యాంటిబయోటిక్స్ రహిత ఉత్పత్తులుగా మన రొయ్యలను తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఈక్విడార్ తరహాలోనే నూరుశాతం తనిఖీ చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం సీడ్, ఫీడ్, ప్రాసెసింగ్ ఆపరేటర్లతోపాటు రైతుసంఘాల ప్రతినిధులతో ప్రత్యేకంగా ఓ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ కమిటీ పర్యవేక్షణలో సీడ్ నుంచి మార్కెటింగ్ వరకు దశలవారీగా యాంటిబయోటిక్స్ అవశేషాలను క్రమం తప్పకుండా పరీక్షించనుంది. ప్రస్తుత సీజన్ నుంచే ఈ కార్యాచరణ అమలు చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. యాంటిబయోటిక్స్ పరీక్షలకు అయ్యే వ్యయం రైతులపై పూర్తిగా పడకుండా సమష్టిగా భరించేలా ఏర్పాటు చేస్తోంది. యాంటిబయోటిక్స్ నియంత్రణే లక్ష్యం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు యాంటిబయోటిక్స్ వినియోగం నూరుశాతం నియంత్రణే లక్ష్యంగా కమిటీ ఏర్పాటు చేస్తున్నాం. ఈ కమిటీ రైతుల్లో అవగాహన కల్పించడమే కాదు.. సీడ్ నుంచి పట్టుబడి వరకు దశలవారీగా ప్రతి చెరువులోని రొయ్యలను పరీక్షిస్తుంది. – వడ్డి రఘురాం, అప్సడా వైస్ చైర్మన్ కమిటీ ఏర్పాటు మంచి ఆలోచన యాంటిబయోటిక్స్ వినియోగాన్ని నియంత్రించేందుకు ఉమ్మడి కమిటీ ఏర్పాటు చేయడం చాలా మంచి ఆలోచన. యాంటిబయోటిక్స్ లేని రొయ్యలను మాత్రమే ఎగుమతి చేసేందుకు ఇది ఎంతో దోహదపడనుంది. – ఐ.పి.ఆర్.మోహనరాజు, జాతీయ రొయ్యరైతుల సంఘం అధ్యక్షుడు -
ఏం ఇంట్లో చూసినా మందు గోళీలే! పారేస్తే పాతరేసినట్టే! మరేం చేయాలి?
సాక్షి, సిటీబ్యూరో: కోవిడ్‌కు ముందేమో గాని, తర్వాత ప్రతీ ఇల్లూ చిన్నపాటి క్లినిక్‌లా మారింది. వాడినా, వాడకున్నా రకరకాల మాత్రలు ఇంట్లో పేరుకుంటున్నాయి. అయితే వాడని వాటిని ఎక్కడ పడితే అక్కడ పడేయడం సరైన పనికాదంటున్నారు వైద్యులు. దానికి బదులుగా వాటిని పడేసేందుకు తొలిసారిగా డ్రాప్ బాక్స్‌లు నగరంలో అందుబాటులోకి వచ్చాయి. జలుబో, జ్వరమో మరొకటో.. చిన్నా చితకా వ్యాధులకు కూడా డాక్టర్ల నుంచి చాంతాడంత మందుల చిట్టీలు తప్పడం లేదు. ఎందుకైనా మంచిదని మనం వాటిని కొనకా తప్పడం లేదు. అయితే సాధారణంగా ఒకటి రెండు రోజులకే స్వస్థత చేకూరిన పరిస్థితిలో మందులు ఆపేసేవారే ఎక్కువ. అలాంటి వాటిలో యాంటీ బయాటిక్స్ ఎక్కువగా ఉండడం సాధారణమే. వీటిని సరైన పద్ధతిలో నిర్మూలించాలి లేదా గడువు ముగియకపోతే అవసరార్థులకు అందించాలే తప్ప ఎలా పడితే అలా పడేయవద్దని సూచిస్తున్నారు వైద్యులు. పారేస్తే.. పాతరేసినట్టే.. బెల్జియం లాంటి దేశాల్లో ముఖ్యంగా యాంటీబయాటిక్స్ విషయంలో కఠినమైన డ్రగ్ పాలసీ ఉంది. అక్కడ వీటిని హానికారక వ్యర్థాల కోవలో లెక్కిస్తారు. అవసరం ఉన్నా లేకున్నా యాంటీబయాటిక్స్ అధిక వినియోగం వల్ల ఆరోగ్యపరమైన నష్టాలొస్తాయి. ఉపయోగించనవి, అదనంగా ఉన్నవి నిర్లక్ష్యంగా పారవేయడంతో అవి నీటిలోకి చేరి కెనాల్స్ ద్వారా పంట పొలాల వరకూ చేరుతున్నాయి. దీంతో ఇది అంతిమంగా యాంటీమైక్రోబయాల్ నిరోధకత/యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ (ఏఎమ్ఆర్)కు దారి తీస్తుందని వైద్యులు అంటున్నారు. డ్రాప్ బాక్స్‌ల ఏర్పాటు.. ఈ సమస్యను పరిష్కరించే క్రమంలో నిమ్స్‌కు చెందిన క్లినికల్ ఫార్మకాలజీ అండ్ థెరప్యూటిక్స్ (సీపీటీ) విభాగం ఆస్పత్రి ఆవరణలో రెండు డ్రాప్ బాక్స్‌లను అమర్చింది. అవుట్ పేషెంట్స్ బ్లాక్‌లో, స్పెషాలిటీ బ్లాక్‌లో మరొకటి చొప్పున వీటిని ఏర్పాటు చేశారు. వీటిని చోరుల నుంచి కాపాడే క్రమంలో బాక్స్‌లకు తాళాలు వేశారు. ఆస్పత్రి సిబ్బంది మొదలుకుని, రోగులు, సంబంధీకులు ఎవరైనా సరే ఇంట్లో అనవసరంగా కొనుగోలు చేసిన, ఉపయోగించని లేదా గడువు ముగిసిన యాంటీబయాటిక్స్ ఉన్నట్లయితే ఈ డ్రాప్ బాక్స్‌లో వేయవచ్చని తద్వారా ఈ బాక్స్‌లకు వచ్చే స్పందనను అనుసరించి భవిష్యత్తులో మరిన్ని ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. భస్మం.. క్షేమం.. ‘తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇదే మొదటిది. వీటి ద్వారా హానికారక రసాయనాలు కాలుష్యానికి కారణం కాకుండా నిరోధించవచ్చు’ అని చెప్పారు నిమ్స్ డీన్ ఇన్చార్జి డైరెక్టర్ ఎన్.బీరప్ప. ‘డ్రాప్ బాక్స్‌ల ద్వారా పోగుపడిన మందులను సేకరించి వాటిని 1200 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్లో భస్మం చేయిస్తాం’ అని నిమ్స్ లెర్నింగ్ సెంటర్ ప్రొఫెసర్ సీపీటీ విభాగాధిపతి పి.ఉషారాణి చెప్పారు. -
యాంటి బయోటిక్స్ అనధికార విక్రయాలకు కళ్లెం
సాక్షి, అమరావతి: యాంటి బయోటిక్స్ విచ్చలవిడిగా వినియోగించడం ప్రాణాంతకంగా మారుతోందని వైద్య, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.టి. కృష్ణబాబు అన్నారు. ప్రపంచ దేశాలకు పెనుముప్పుగా మారుతున్న యాంటీ మైక్రోబియాల్ రెసిస్టెన్స్(ఏఎంఆర్)ను నియంత్రించేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు విజయవాడలో రెండు రోజులుగా జరుగుతున్న వర్క్‌షాప్ శనివారం ముగిసింది. ‘యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ కాల్ ఫర్ యాక్షన్’ను ఆవిష్కరించిన కృష్ణబాబు ఏఎంఆర్ యాక్షన్ ప్లాన్ల బలోపేతానికి ‘విజయవాడ డిక్లరేషన్’ను ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భావితరాలను రక్షించుకునేందుకు యాంటీ బయోటిక్స్ వినియోగం వల్ల పెరుగుతున్న ఏఎంఆర్‌ను కట్టడి చేయాలన్నారు. ఇందుకోసం యాంటి బయోటిక్స్ వినియోగాన్ని తగ్గించడంతోపాటు అనధికారిక విక్రయాలకు కళ్లెం వేయాల్సిన అవసరం ఉందన్నారు. ఏఎంఆర్ కట్టడి కోసం గ్రామ స్థాయిలో విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. ఏఎంఆర్ కట్టడి కార్యాచరణ ప్రణాళికను ప్రయోగాత్మకంగా అమలుచేసేందుకు రాష్ట్రంలోని కృష్ణా జిల్లాను కేంద్రం ఎంపిక చేసిందని తెలిపారు. గత నాలుగేళ్లుగా అమలవుతున్న ఈ ప్రణాళిక ఫలితాలను సమీక్షించి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామన్నారు. ఫెడరేషన్ ఆఫ్ ఆసియన్ బయోటెక్ అసోసియేషన్స్ (ఫాబా), ఇన్ఫెక్షన్ కంట్రోల్ ఆఫ్ ఇండియా (ఇఫ్కాయ్), వరల్డ్ యానిమల్ ప్రొటెక్షన్ (డబ్ల్యూఏపీ) వంటి అంతర్జాతీయ సంస్థలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పనిచేయనున్నాయని చెప్పారు. వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్, ఏఎంఆర్ నోడల్ అధికారి జె.నివాస్, వైద్య విద్యా శాఖ డైరెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్, డ్రగ్ కంట్రోల్ డీజీ రవిశంకర్ నారా>యణ్, ఫాబా ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ పి.రెడ్డన్న, సెక్రటరీ జనరల్ డాక్టర్ రత్నాకర్, ఇఫ్కాయ్ అధ్యక్షుడు డాక్టర్ రంగారెడ్డి పాల్గొన్నారు. -
‘పురుగులు పడితే’ బతుకుతారు..!
జంతువులు, మనుషులు.. శరీరం ఏదైనా సరే తీవ్రంగా గాయాలై తగిన చికిత్స చేయకపోతే పురుగులు పట్టడం చూస్తూనే ఉంటాం. సాధారణంగా కుళ్లిన, చనిపోయిన మాంసానికే (మృత కణాలకే) పురుగులు పడతాయి. కానీ అదే పురుగులు తీవ్రమైన గాయాలు మానడానికి తోడ్పడతాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలోనే గుర్తించిన ఈ విధానాన్ని వినియోగించడం ఇటీవల మళ్లీ పెరిగింది కూడా. మరి ఈ వివరాలు ఏమిటో తెలుసుకుందామా.. – సాక్షి సెంట్రల్ డెస్క్ యాంటీ బయాటిక్స్‌కు లొంగకుండా.. సరైన విధంగా మందులు వాడకపోవడం, పరిశుభ్రత పాటించకపోవడం, చికిత్స అందుబాటులో లేకపోవడం, పలు రకాల అనారోగ్య సమస్యలు వంటివాటి వల్ల గాయాలు మానవు. గాయాల్లో బ్యాక్టీరియా చేరి ఇన్ఫెక్షన్ మొదలవుతుంది. అవి మరింత తీవ్రమై పుండ్లు పడటం, చీమురావడం, కణాలు చనిపోయి కుళ్లిపోవడం వంటి పరిస్థితులు తలెత్తుతాయి. మరోవైపు పలురకాల బ్యాక్టీరియాలు ఔషధాలకు నిరోధకత (రెసిస్టెన్స్)ను పెంచుకోవడంతో.. చికిత్స చేసినా ఫలితం లేకపోవడం లేదా సుదీర్ఘకాలం పట్టడం జరుగుతోంది. ఈలోగా సమస్య ముదిరి.. ఆ శరీర భాగాలను తొలగించాల్సి రావడంగానీ, ఇన్ఫెక్షన్ శరీరమంతా వ్యాపించి ప్రాణాలు పోగొట్టుకోవడంగానీ జరుగుతుంది. ఇలాంటి పరిస్థితిలో ‘పురుగుల’ చికిత్సతో ఫలితం ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మొదటి ప్రపంచ యుద్ధంలోనే.. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో కాల్పులు, బాంబు దాడుల్లో లక్షలాది మంది సైనికులు గాయపడ్డారు. యుద్ధ క్షేత్రాల్లో సరైన చికిత్స అందక గాయాలు పుండ్లు పడి, ఇన్ఫెక్షన్లు పెరిగి.. అవయవాలు కోల్పోయినవారు, చనిపోయినవారు ఎందరో. అయితే యుద్ధంలో గాయపడిన ఫ్రెంచ్ సైనికుల్లో కొందరికి గాయాలపై పురుగులు పట్టడం, వారి గాయాలు త్వరగా మాని కోలుకోవడాన్ని వైద్యులు గుర్తించారు. గాయాల్లోని మృత కణాలను ఆ పురుగులు తినేయడం, అదే సమయంలో బ్యాక్టీరియాను హతమార్చే రసాయనాలను విడుదల చేయడమే దీనికి కారణమని తేల్చారు. ఇది తెలిసిన చాలా మంది వైద్యులు సైనికులకు పురుగుల చికిత్స చేశారు. కానీ తర్వాతికాలంలో యాంటీ బయాటిక్స్ రావడం, పురుగుల పట్ల ఏవగింపు వంటివి ఈ చికిత్స మరుగునపడిపోవడానికి కారణమయ్యాయి. పురుగులు ఏం చేస్తాయి? ఈగలు, తేనెటీగలు వంటి ఎగిరే కీటకాలు గుడ్డు నుంచి ఎదిగే క్రమం భిన్నంగా ఉంటుంది. అవి మొదట గుడ్డు నుంచి పురుగుల రూపంలోని లార్వాగా జన్మించి.. తర్వాత పూర్తిస్థాయి కీటకాలుగా మార్పు చెందుతాయి. ఇందులోని లార్వా దశ పురుగులనే గాయాలను మాన్పడానికి వినియోగిస్తారు. ఈ పురుగులు నేరుగా మన మృతకణాలను తినవు. ముందుగా వాటి నోటి నుంచి వివిధ ఎంజైమ్‌లు ఉండే లాలాజలాన్ని (సలైవా) విడుదల చేస్తాయి. ఈ ఎంజైమ్‌లు మృతకణాలను కరిగించి పోషక ద్రవంగా మారుస్తాయి. ఇదే సమయంలో అక్కడ ఉండే బ్యాక్టీరియాలు, ఇతర సూక్ష్మజీవులు కూడా చనిపోయి పోషక ద్రవంగా మారుతాయి. పురుగులు ఈ పోషక ద్రవాన్ని పీల్చుకుని జీవిస్తాయి. మొత్తంగా గాయంపై మృతకణాలు, బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులు నశించడంతో ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. మరోవైపు పురుగుల సలైవా వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి చురుగ్గా మారుతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనితో సమస్య నుంచి వేగంగా కోలుకున్నట్టు తేల్చారు. ఇంగ్లండ్‌లోని సౌత్‌వేల్స్‌కు చెందిన బయోమోండే సంస్థ ‘గ్రీన్ బాటిల్ బ్లోఫ్లై’ రకం ఈగల లార్వాలను టీబ్యాగ్‌ల తరహాలో ప్యాక్ చేసి అమ్ముతోంది. ఏటా 9 వేల బయోబ్యాగ్లను చికిత్సల కోసం కొంటున్నారని చెబుతోంది. నర్సుల భయమే సమస్యట! సాధారణంగా పురుగులను చూస్తే చాలా మందికి ఒళ్లు జలదరిస్తుంది. కొందరైతే భయంతో కెవ్వున కేకలు కూడా పెడుతుంటారు. ప్రస్తుతం గాయాలకు పురుగుల చికిత్సలోనూ ఇదో సమస్యగా మారిందని ఇంగ్లండ్ వైద్యులు చెప్తున్నారు. చాలా మంది నర్సులు పురుగులను చూసి అసహ్యం, భయం వ్యక్తం చేస్తున్నారని.. ఆ చికిత్స చేయడానికి ముందుకు రావడం లేదని అంటున్నారు. అందువల్ల కొందరు నర్సులకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి ఈ చికిత్సల్లో వినియోగిస్తున్నామని చెప్తున్నారు. కొన్నాళ్లుగా ఇంగ్లండ్‌లో మళ్లీ వినియోగం గాయాలు, పుండ్లకు చికిత్సలో పురుగుల వినియోగానికి ఇంగ్లండ్ నేషనల్ హెల్త్ సర్వీస్ 2004లోనే అధికారికంగా అనుమతి ఇచ్చింది. కొన్నాళ్లుగా ఈ విధానానికి ఆదరణ వస్తోందని, 2009–19 మధ్య ఈ తరహా చికిత్సలు 50శాతం పెరిగాయని ఆ దేశ అధికారులు చెబుతున్నారు. పుళ్లుపడి, చీముపట్టిన గాయాలైనా.. సాధారణంగా గాయాలు తీవ్రమై పుళ్లుపడటం, చీముపట్టడం (గ్యాంగ్రిన్) వంటివి జరిగితే.. అంతమేర ఆపరేషన్ చేసి కండరాన్ని కోసి తీసేయాల్సిందేనని వైద్యులు చెప్తుంటారు. చాలా సందర్భాల్లో ఇలాంటి కారణాలతో కాళ్లు, చేతులు, వేళ్లు వంటివి తొలగించిన ఘటనలూ మనకు కనిపిస్తుంటాయి. అలాంటి తీవ్రమైన గాయాలు కూడా మానిపోయేందుకు పురుగుల చికిత్స తోడ్పడుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏటా గ్యాంగ్రిన్ సమస్యతో 7లక్షల మంది వరకు చనిపోతున్నట్టు అంచనా. వారిలో చాలా మందిని ‘పురుగుల చికిత్స’తో కాపాడవచ్చని అంటున్నారు. ఏదో ఓ పురుగు వేసుకుంటే డేంజర్ పురుగులతో గాయం తగ్గిపోతుందికదా అని ఏదో ఒక పురుగును వేసుకుంటే మొదటికే మోసం వస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పురుగులు అంటేనే వివిధ బ్యాక్టీరియాలు, వైరస్లు, సూక్ష్మజీవులకు అడ్డాలు అని.. వాటితో మరిన్ని ఇన్ఫెక్షన్లు సోకుతాయని స్పష్టం చేస్తున్నారు. ఏవైనా ప్రత్యేకమైన ఈగ జాతులకు చెందిన గుడ్లను యాంటీ బ్యాక్టీరియల్ ద్రావణంతో శుద్ధిచేసి, ప్రయోగశాలలో వాటిని పొదిగి.. లార్వా దశకు వచ్చాక గాయాలపై వినియోగించాలని స్పష్టం చేస్తున్నారు. ఈ పురుగులను కూడా గాయాలపై నేరుగా వేయరు. టీబ్యాగ్ తరహా ప్రత్యేకమైన పలుచని రంధ్రాలున్న బయోబ్యాగ్లో వాటిని ఉంచుతారు. ఈ బ్యాగ్‌లను గాయాన్ని తాకేలా పెట్టి.. పైన వదులుగా పట్టీకడతారు. ఇలా రెండు నుంచి నాలుగు రోజులు ఉంచుతారు. -
యాంటీ‘భయో’టిక్స్!
సాక్షి, హైదరాబాద్: తుమ్మినా..దగ్గినా..నీరసమున్నా..ఆయాసమున్నా.. వొళ్లు నొప్పులు.. వైరల్ జ్వరం.. ఏదైనా ఒక్కటే మందు..యాంటీబయాటిక్. ఇలా చిన్నాచితకా రోగానికీ యాంటీబయాటిక్స్ విచ్చలవిడిగా వాడటం చాలామందికి అలవాటై పోతోంది. చివరి అస్త్రంగా వాడాల్సిన వాటిని తొలిదశలోనే వాడేస్తున్నారు. వైద్యులు సూచించక పోయినా కొందరు సొంతంగా వాడుతున్నారు. ఇది ఆందోళన కలిగించే అంశమని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఇలా ఇష్టారాజ్యంగా యాంటీబయాటిక్స్ వాడటం వల్ల, నిజంగా అవసరమైనప్పుడు వాడినా అవి పనిచేయని పరిస్థితి నెలకొనే ప్రమాదం ఉందని చెబుతున్నారు. అంటే అప్పటికే మనుషుల్లో వ్యాధులకు కారణమయ్యే సూక్ష్మ క్రిములకు యాంటీబయాటిక్స్‌ను తట్టుకునే శక్తి (యాంటీబయాటిక్స్ రెసిస్టెన్స్) వచ్చి ఉంటుందన్న మాట. వ్యవసాయ పంటలకు విచ్చలవిడిగా పురుగుమందులను (యాంటీబయాటిక్స్) చల్లుతున్నారు. అధిక పాల ఉత్పత్తి కోసం పాడి పశువులకు ఇంజెక్షన్లు (యాంటీబయాటిక్స్) ఇస్తున్నారు. ఈ విధమైన ఆహారం, పాలు తీసుకోవడం ద్వారా అప్పటికే మానవ శరీరంలో అధిక శాతం యాంటీబయాటిక్స్ ఉంటున్నాయని అధ్యయనాలు స్పష్టం చేస్తుండటం గమనార్హం. 280 కోట్ల యాంటీబయాటిక్స్ ప్యాక్‌ల విక్రయం దేశంలో 2019లో 85 రకాలకు సంబంధించిన 280 కోట్ల యాంటీబయాటిక్స్ ప్యాక్‌లు అమ్ముడుపోయినట్లు లాన్సెట్ జర్నల్ తెలిపింది. పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా, బోస్టన్ యూనివర్సిటీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ యాంటీబయాటిక్స్‌పై చేసిన అధ్యయనం ఇటీవల లాన్సెట్‌లో ప్రచురితమైంది. ఇందులో 28 యాంటీబయాటిక్స్‌ను అత్యవసర మందుల జాబితాలో పెట్టారు. మిగితావి సాధారణ జాబితాలో ఉన్నాయి. కేంద్ర ఔషధ నాణ్యత నియంత్రణ సంస్థ (సీడీఎస్‌సీవో) అనుమతి ఇచ్చిన యాంటీబయాటిక్స్ కేవలం 19 శాతమే కాగా మిగిలిన 81 శాతం రాష్ట్రాల ఔషధ నియంత్రణ సంస్థల పరిధిలో అమ్ముతున్నారు. వాస్తవానికి దేశంలోని చాలా కాంబినేషన్ యాంటీబయాటిక్స్‌ను వాడొద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది. రెండు మూడురకాలకు చెందిన యాంటీ బయాటిక్స్‌ను కలిపి (కాంబినేషన్) వాడటం సరైంది కాదని పేర్కొంది. కాంబినేషన్ మందులను కుష్టు, క్షయ వంటి వ్యాధులకు వాడాలి. కానీ మన వద్ద చిన్న చిన్న రోగాలకు కూడా కాంబినేషన్ ఔషధాలు వాడుతున్నారు. ఒకటి అవసరమైనచోట రెండు వాడటం వల్ల కూడా ఆ మందు పనిచేయని పరిస్థితి వస్తుంది. అయినా కంపెనీలు ఇష్టమొచ్చినట్లుగా మార్కెటింగ్ చేసుకుంటున్నాయి. ఔషధాల నియంత్రణలో ఉన్న లోపాలను ఆధారం చేసుకొని దందా నిర్వహిస్తున్నాయి. అమ్ముడవుతున్న యాంటీబయాటిక్స్‌లో 85–90 శాతం ప్రైవేట్ ఆసుపత్రులు, ప్రాక్టీషనర్లు రాస్తున్నవేనని అధ్యయనం తేల్చిచెప్పింది. ఆహారం ద్వారానే అత్యధిక శాతం యాంటీబయాటిక్స్! ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా అధ్యయనం ప్రకారం మన దేశంలో మాంసం, పాలు, పాల పదార్థాలు, గుడ్లు, వివిధ రకాల పంటల (ఆహార పదార్ధాలు) వినియోగం ద్వారా 80 శాతం యాంటీబయాటిక్స్ మానవ శరీరంలోకి వెళ్తున్నాయని తేల్చింది. చర్మానికి సంబంధించిన ఇన్ఫెక్షన్లు బ్లడ్ ఇన్ఫెక్షన్లుగా మారితే, అక్కడున్న పెన్సిలిన్‌కు సంబంధించిన యాంటిబయాటిక్కు లొంగని పరిస్థితులు 65 శాతం ఉంటున్నట్లు తెలిపింది. దీంతో డోసు ఎక్కువున్న యాంటీబయాటిక్స్ వాడాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. అలాగే ఉదర ఇన్ఫెక్షన్ బ్లడ్ ఇన్ఫెక్షన్గా మారితే.. యాంటీబయాటిక్స్‌కు లొంగని పరిస్థితులు 85 శాతం ఉంటున్నట్లు పేర్కొంది. శుభ్రత పాటించకపోవడంతో చేటు యాంటీబయాటిక్స్ విచ్చలవిడిగా వాడటానికి ఇన్ఫెక్షన్లే ప్రధాన కారణం. ఇప్పటికీ 54 శాతం ఇళ్లల్లో శుచీ శుభ్రత పాటించడం లేదు. సబ్బుతో చేతిని కడుక్కోలేని స్థితి ఉన్న ఇళ్లు 32 శాతం ఉన్నాయి. నీటి వసతి లేని ఆసుపత్రులు ఆరు శాతం ఉన్నాయి. పారిశుధ్యం సరిగా పాటించని ఆసుపత్రులు 22 శాతం ఉన్నాయి. వ్యర్థాలను సరిగా నిర్వీర్యం చేయని ఆసుపత్రులు 27 శాతం ఉన్నాయి. ఇలాంటి కారణాల వల్ల ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది. వివిధ దశల్లో 90 రకాల వ్యాక్సిన్లు యాంటీబయాటిక్స్ వాడకాన్ని తగ్గించేలా, ఇన్ఫెక్షన్ రాకుండా చూసేలా ప్రపంచవ్యాప్తంగా 90 రకాల వ్యాక్సిన్ల తయారీ వివిధ దశల్లో ఉంది. చాలారకాల యాంటీబయాటిక్స్‌కు లొంగని, మొండి ఇన్ఫెక్షన్లకు కారణమైన బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్‌లు రాకుండా నిరోధించేందుకు ఈ వ్యాక్సిన్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో రూపుదిద్దుకుంటున్నాయి. – డాక్టర్ కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ విభాగాధిపతి, నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ -
47 శాతం యాంటీబయోటిక్స్‌కు అనుమతుల్లేవ్
న్యూఢిల్లీ: భారత్‌లో ప్రైవేట్ రంగంలో యాంటీబయోటిక్స్ వినియోగం విచ్చలవిడిగా సాగుతోంది. సెంట్రల్ డ్రగ్ రెగ్యులేటర్ అనుమతులు లేని యాంటీబయోటిక్స్‌ను సైతం వైద్యులు యాంటీబయోటిక్స్‌ను సిఫార్సు చేస్తున్నారు. 2019లో దేశంలో ఉపయోగించిన వాటిలో 47 శాతానికి పైగా యాంటీబయోటిక్స్‌కు ఎలాంటి అనుమతులు లేవని తాజా అధ్యయనంలో తేలింది. అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీ, న్యూఢిల్లీలోని పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా నిర్వహించిన ఈ అధ్యయనం వివరాలను ‘లాన్సెట్ రీజినల్ హెల్త్–సౌత్‌ఈస్టు ఆసియా’ జర్నల్‌లో ప్రచురించారు. 2019లో అత్యధికంగా అజిత్రోమైసిన్ 500 ఎంజీ ట్యాబ్లెట్‌ను 7.6 శాతం మంది, సెఫిక్సైమ్ 200 ఎంజీ ట్యాబ్లెట్‌ను 6.5 శాతం మంది ఉపయోగించినట్లు అధ్యయనంలో తేలింది. ఇదంతా ప్రైవేట్ రంగంలో సాగిందే. ప్రభుత్వ రంగంలో వాడిన యాంటీబయోటిక్స్‌ను ఇందులో చేర్చలేదు. అనుమతుల్లేని యాంటీబయోటిక్స్ ఫార్ములేషన్స్లో తొలి మూడు స్థానాల్లో సెఫాలోస్పారిన్స్, మాక్రోలైడ్స్, పెన్సిల్సిన్స్ ఉన్నాయి. ఇండియాలో యాంటీబయోటిక్స్ వాడకంపై నిఘా పెట్టేందుకు సరైన వ్యవస్థలు లేవని హైదరాబాద్‌లోని యశోదా హాస్పిటల్లో కన్సల్టింగ్ ఫిజీషియన్, డయాబెటాలిజిస్టుగా పనిచేస్తున్న డాక్టర్ హరికిషన్ బూగూరు చెప్పారు. అనుమతి లేని ఔషధాలను విచ్చలవిడిగా వాడితే రోగులకు ముప్పు తప్పదని హెచ్చరించారు. -
యాంటీ బయాటిక్స్ ఎక్కువగా వాడుతున్నారా..? పొంచి ఉన్న మరో ముప్పు..!
యాంటీబయాటిక్స్ మన శరీరంలోని హానికరమైన బ్యాక్టీరియాను చంపేందుకు ఉపయోగపడే మందు. వీటి సహాయంతో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ను తగ్గించి, రోగి ప్రాణాలు కాపాడవచ్చన్న విషయం తెలిసిందే. అయితే... ఈ యాంటీబయాటిక్స్‌ను విచ్చలవిడిగా, విచక్షణరహితంగా వాడటం వల్ల ఎన్నో అనర్థాలు చోటు చేసుకుంటున్నాయని వైద్యనిపుణులు, శాస్త్రవేత్తలు ఎంతోకాలంగా హెచ్చరిస్తునే ఉన్నారు. అయినా ఇప్పటికీ వాటి దురుపయోగం ఆగడం లేదు. దాంతో తాజాగా ఇప్పుడు ఎంతకూ తగ్గని టైఫాయిడ్ రూపంలో మరో ముప్పు పొంచి ఉందంటూ శాస్త్రవేత్తలు ఆధారాలతో సహా నివేదిస్తున్నారు. ఈ ముప్పును గుర్తెరిగి అప్రమత్తం అయ్యేందుకు ఉపయోగపడే కథనమిది. గతంలో కొన్ని జబ్బులు చాలా తేలిగ్గా... అంటే కేవలం ఓ చిన్న యాంటీబయాటిక్ వాడగానే తగ్గిపోయేవి. అసలు కొన్ని జబ్బులైతే ఎలాంటి మందులూ / యాంటీబయాటిక్స్ వాడకపోయినా తగ్గుతాయి. కాకపోతే కొద్దిగా ఆలస్యం కావచ్చు. చాలా వ్యాధులను వ్యాప్తి చేసే వ్యాధికారక క్రిములు... ఆ మందుల పట్ల తమ నిరోధకతను పెంచుకుంటున్నాయి. తాజాగా టైఫాయిడ్‌ను వ్యాప్తి చేసే క్రిమి కూడా అలా నిరోధకత పెంచుకుంటోందని కొన్ని అధ్యయనాల్లో aతేలింది. ఆసియాలో పెరుగుతూ.. అంతర్జాతీయంగా వ్యాప్తి టైఫాయిడ్ చాలా పురాతనమైన జబ్బు. దాదాపు వెయ్యేళ్ల నుంచి మానవాళిని బాధిస్తోందన్న దాఖలాలున్నాయి. ఇలా చాలాకాలం నుంచి వేధించిన మరోపురాతనమైన జబ్బు టీబీలాగే... టైఫాయిడ్ కూడా యాంటీబయాటిక్స్ తర్వాత పూర్తిగా అదుపులోకి వచ్చింది. అభివృద్ధి చెందిన దేశాల్లో ఆనవాళ్లు లేకుండా మటుమాయమైంది. ఇది సాల్మొనెల్లా ఎంటరికా లేదా సాల్మొనెల్లా టైఫీ అనే రకాల క్రిము కారణంగా వ్యాప్తి చెందుతుంది. మనదేశంతో పాటు పొరుగు దేశాలైన నేపాల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలో నిర్వహించిన పరిశోధనల్లో ఆందోళన కలిగించే అనేక అంశాలు వెల్లడయ్యాయి. శాస్త్రవేత్తలు మనదేశంతో పాటు ఆయా దేశాల్లోని 3,489 రకాల టైఫీ స్ట్రెయిన్ల జీనోమ్ సీక్వెన్సింగ్‌ను పరిశీలించారు. దాంతో ఇప్పుడు తాజాగా యాంటీబయాటిక్స్‌కు ఓ పట్టాన లొంగని కొత్త స్ట్రెయిన్ టైఫాయిడ్ జబ్బును కలిగించే బ్యాక్టీరియా వృద్ధి చెందినట్లు తేలింది. నిపుణులు దీన్ని డ్రగ్ రెసిస్టెన్స్ టైఫాయిడ్ లేదా ‘ఎక్స్‌డీఆర్’టైఫాయిడ్‌గా పేర్కొంటున్నారు. టైఫాయిడ్ కొత్త స్ట్రెయిన్స్... ‘‘ఉత్పరివర్తనం చెందిన ‘ఎక్స్‌డీఆర్ టైఫాయిడ్’ 2016లో తొలిసారి పాకిస్తాన్లో వెలుగుచూసింది. ఆ తర్వాత ప్రపంచం మొత్తం వ్యాప్తి చెందుతున్న ఈ ‘ఎక్స్ఆర్డీ’ టైఫీ స్రెయిన్స్ వ్యాప్తి... భారత్, పాక్, నేపాల్, బంగ్లాదేశ్... ఈ నాలుగు ఆసియా దేశాలనుంచే జరుగుతోంది. ఈ సూపర్‌బగ్స్ యునైటెడ్ కింగ్డమ్ (బ్రిటన్), యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, కెనడాల్లోనూ కనిపిస్తున్నాయి. ఈ పరిణామం ఎంతో ఆందోళనకరం. అందుకే వీలైనంత త్వరగా ఈ అనర్థానికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది’’ అని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి చెంది జేసన్ ఆండ్రూస్ ప్రపంచానికి హితవు చెబుతున్నారు. ప్రతి ఏడాదీ దాదాపు కోటీ 10 లక్షల టైఫాయిడ్ కేసులు వస్తుండటం... ప్రస్తుతం ఆ వ్యాధి దాఖలాలే లేని ప్రాంతాల్లో కూడా విస్తరిస్తుండటం... అది మందులకు ఓ పట్టాన లొంగకుండా వ్యాధిగ్రస్తుల్లో 20 శాతం మంది మృత్యువాతపడుతుండటం అన్నది ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కలిగించే ఓ ఆరోగ్యాంశం అవుతుందని కూడా ఆండ్రూ హెచ్చరిస్తున్నారు. డ్రగ్ రెసిస్టెన్స్ పెంచుకుంటున్న మరికొన్ని జబ్బులు ►క్లాస్ట్రీడియమ్ డిఫిసైల్ అనే పెద్ద పేగుల్లో పెరిగే బ్యాక్టీరియా వల్ల వచ్చే నీళ్ల విరేచనాలు ఇప్పుడు పెద్దవయసు వారి ప్రాణాలకే ముప్పుగా పరిణమించేలా తయారయ్యాయి. ఈ క్లాస్ట్రీడియమ్ బ్యాక్టిరియా ఇటీవల యాంటీబయాటిక్స్‌కు నిరోధకత పెంచుకున్నట్లుగా తెలుసోది. ►గతంలో చిన్న పిల్లల్లో, పెద్దల్లో తరచూ వచ్చే సెగగడ్డలు అప్పట్లో చిన్న డోస్‌తో కేవలం మామూలు యాంటీబయాటిక్స్ తగ్గిపోయేవి. కానీ ఇప్పుడవి ఒక పట్టాన తగ్గడం లేదు. ►అప్పట్లో ట్యూబర్క్యులోసిస్ బ్యాసిల్లస్ (టీబీ), క్లెబిసిలియా నిమోనియా, సూడోమొనాస్ వంటి సూక్ష్మక్రిములు యాంటీబయాటిక్స్‌కు తేలిగ్గానే లొంగిపోయేవి. కానీ ఇప్పుడవి మరింత మొండిగా మారాయి. ► ఈ వేసవిలో మామిడిపండ్లు కాస్త ఎక్కువగానే తిన్నప్పుడు కొందరిలో విరేచనాలు అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఇలా జరగగానే కొందరు ఆన్‌కౌంటర్ మెడిసిన్ వాడుతుంటారు. ఎలాంటి మందులు వాడకపోయినా అవి మర్నాటికల్లా తగ్గిపోతాయి. ఇలా ఆన్‌కౌంటర్ మెడిసిన్స్ వాడటం వల్ల విరేచనాలే కాదు... మరెన్నో సమస్యలు మొండిగా మారుతున్నాయి. అందుకే ఆన్‌కౌంటర్ మెడిసిన్స్‌ను వాడకపోవడమే మంచిది. అందుబాటులో టైఫాయిడ్ వ్యాక్సిన్ టైఫాయిడ్‌కు వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. అంతేకాదు... మనదేశంలో పిల్లలందరికీ ఇది తప్పనిసరిగా ఇవ్వాల్సిన (మ్యాండేటరీ) వ్యాక్సినేషన్ షెడ్యూల్ జాబితాలో ఉంది. టీసీవీ వ్యాక్సిన్ రూపంలో దీన్ని 9 – 12 నెలల పిల్లలకు ఇస్తుంటారు. ఒకవేళ ఇవ్వకపోతే... రెండేళ్లు దాటిన పిల్లలకు దీన్ని ఇప్పించడం ద్వారా టైఫాయిడ్ నుంచి అనేక మంది చిన్నారుల ప్రాణాలు కాపాడవచ్చు. ఏ జబ్బుకు ఏ యాంటీ బయాటిక్... ఏ మోతాదులోనంటే? బాధితులకు వచ్చిన వైద్య సమస్య ఆధారంగా, దాని తీవ్రతను బట్టి... దానికి ఏ తర్చహా యాంటీబయాటిక్స్ వాడాలి, అది కూడా ఎంత మోతాదులో వాడాలి, దాన్ని ఎంతకాలం పాటు వాడాలన్న విషయాలు వైద్యులకే తెలుస్తాయి. ఒకవేళ మందుల మోతాదును తక్కువగా ఇస్తుంటే... రోగకారక క్రిములు క్రమంగా యాంటీబయాటిక్స్ తమపై పనిచేయని విధంగా నిరోధకత (రెసిస్టెన్స్)ను పెంచుకోవచ్చు. అందుకే డాక్టర్లు నిర్దేశించిన మేరకు మాత్రమే, వారు చెప్పిన కాల వ్యవధి వరకే వాటిని వాడాలి. దురుపయోగం చేయవద్దు... మన ప్రాణాలను రక్షించే ఈ యాంటీబయాటిక్స్ మందులను అదేపనిగా వాడటం వల్ల లేదా అవసరమైనదాని కంటే చాలా ఎక్కువ మోతాదుల్లో వాడటం వల్ల ఎన్నో దుష్పరిణామాలు ఉన్నాయి. మనకు చెడు చేసే సూక్ష్మజీవులు ఈ మందులకు నిరోధకత (రెసిస్టెన్స్) సాధిస్తే... ఆ తర్వాత మనల్ని రక్షించుకోవడం చాలా కష్టమవుతుంది. అందుకే యాంటీబయాటిక్స్‌ను దురుపయోగం చేసుకుని, వాటిని నిరుపయోగం చేసుకోకుండా, యాంటీబయాటిక్స్ పట్ల అవగాహన పెంపొందించుకోవాలి. చదవండి: Green Tea- Weight Loss: గ్రీన్ టీ ఎంత మంచిది? నిజంగానే బరువు తగ్గుతారా? -
గర్భవతులు యాంటీబయాటిక్స్ వాడకూడదు... ఎందుకంటే?
గర్భవతిగా ఉన్నప్పుడు కొన్ని రకాల మందులను వాడకూడదంటూ డాక్టర్లు ఆంక్షలు పెడతారు. అందులో యాంటీబయాటిక్స్ కూడా ఉంటాయి. నిజానికి మనం చీటికీ మాటికీ యాంటీబయాటిక్స్ వాడుతూ, సొంతవైద్యం చేసుకుంటూ ఉంటాం. కానీ అది గర్భవతుల విషయంలో ఏమాత్రం చేయకూడదు. అది వాళ్లకు ఎంతో కీడు తెచ్చిపెడుతుంది. మామూలు వ్యక్తులు సైతం ఆన్‌కౌంటర్ మందుల్లో యాంటీబయాటిక్స్ ఉపయోగించకూడదనేది వైద్యుల మాట. అందునా గర్భవతులు వాడటం వల్ల వారికి మాత్రమే కాకుండా... అది కడుపులో బిడ్డకు సైతం ఎన్నో రకాలుగా కీడు చేసే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు... కాబోయే తల్లులు టెట్రాసైక్లిన్ అనే యాంటీబయాటిక్స్ వాడటం వల్ల బిడ్డ దంతాలకు రావాల్సిన సహజమైన రంగు రాకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో బిడ్డ దంతాలు తమ సహజమైన మెరుపును కోల్పోవచ్చు. కొన్ని యాంటీబయాటిక్స్ బిడ్డ ఎముకల సాధారణ ఎదుగుదలకు అడ్డంకిగా మారవచ్చు. దాంతో బిడ్డ అవయవ నిర్మాణంలోనే లోపాలు (అనటామికల్ అబ్నార్మాలిటీస్) రావచ్చు. ఇక సల్ఫోనమైడ్స్ అనే యాంటీబయాటిక్స్ కారణంగా బిడ్డ పుట్టిన నెలలోపే వారికి కామెర్లు రావచ్చు. కాబోయే తల్లి స్ట్రెప్టోమైసిన్ వాడటం వల్ల బిడ్డకు వినికిడి లోపాలు వచ్చే అవకాశాలుంటాయి. అయితే ప్రెగ్నెన్సీలో సైతం తీసుకోదగిన కొన్ని సురక్షితమైన యాంటీబయాటిక్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అవసరమైన సందర్భాల్లో డాక్టర్లు వాటిని సూచిస్తారు. అవి మాత్రమే... అందునా డాక్టర్ల పర్యవేక్షణలోనే వాడాల్సి ఉంటుంది. -
యాంటీబయాటిక్స్‌తో భూసారానికీ ముప్పు.. అదెలా అంటే!
పశువైద్యంలో యాంటీబయాటిక్స్ అతిగా వాడటం వల్ల దీర్ఘకాలంలో మట్టి ఆరోగ్యం దెబ్బతినటమే కాకుండా భూతాపాన్ని పెంపొందించే కర్బన ఉద్గారాల బెడద సైతం పెరుగుతుందని కొలరాడో స్టేట్ యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడైంది. పశు వ్యాధుల చికిత్సలో యాంటీబయాటిక్స్ వల్ల వాటి విసర్జితాలు నేలపై పడినప్పుడు మట్టిలో శిలీంధ్రాలు, సూక్ష్మజీవుల నిష్పత్తిలో మార్పులు చోటు చేసుకుంటాయని అధ్యయనానికి సారధ్యం వహించిన డా. కార్ల్ వెప్కింగ్ అంటున్నారు. యాంటీబయాటిక్స్ దుష్ప్రభావానికి గురికాని వాతావరణం భూతలం మీద లేదన్నారు. యాంటీబయాటిక్స్ వల్ల కర్బనాన్ని పట్టి ఉంచే శక్తిని మట్టి కోల్పోతుందన్నారు. యాంటీబయాటిక్స్‌ను పశుపోషణలో అతిగా వాడటం వల్ల.. మనుషుల్లో కొన్ని రకాల సూక్ష్మక్రిములు యాంటీబయాటిక్స్‌కు లొంగని పరిస్థితి నెలకొంటున్న విషయం తెలిసిందే. చదవండి: Red Rice: ఎర్ర బియ్యం అమ్మాయి -
సూపర్‌బగ్స్ పెనుప్రమాదం.. యాంటీ బయోటిక్ ఎప్పుడు వాడాలంటే
లబ్బీపేట (విజయవాడ తూర్పు): ఏ మందునైనా అవసరమైనప్పుడు నిర్ణీత మోతాదులో వాడితేనే మంచి ఫలితం వస్తుంది. అనవసరంగా వాడితే మంచి జరగకపోగా దుష్ప్రభావాలు కనిపిస్తాయి. ఒకప్పుడు కలరా తదితర అంటువ్యాధులు ప్రబలినప్పుడు పెన్సిలిన్ వంటి యాంటీబయోటిక్స్ ప్రజల ప్రాణాలు నిలిపాయి. ఇప్పుడు పలు రకాల యాంటీబయోటిక్స్‌ను మితిమీరి వాడటం వల్ల తీవ్ర దుష్ఫలితాలు కనిపిస్తున్నాయని ఫార్మకాలజీ నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. నేడు ఏ చిన్న అనారోగ్య సమస్య తలెత్తినా యాంటీబయోటిక్స్ వాడేస్తున్నారు. విచ్చలవిడిగా ఈ మందులను వినియోగిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. దీంతో యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్‌పై అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చింది. జలుబు చేసినప్పుడు సిట్రజెన్ వంటి ఎలర్జిక్ డ్రగ్ వాడితే తగ్గిపోతుంది. దానికి కూడా యాటీబయోటిక్స్ వాడుతున్నారు. పంటి నొప్పి వంటి సమస్యలకు యాంటీబయోటిక్స్ వినియోగం మంచిది కాదని వైద్యులు స్పష్టంచేస్తున్నారు. ఈ మందులను అవసరం మేరకు మాత్రమే వినియోగించి, విచ్చలవిడితనాన్ని తగ్గించేందుకు ప్రభుత్వాలు సైతం ప్రణాళికా బద్ధంగా కృషి చేస్తున్నాయి. యాంటీ బయోటిక్ ఎప్పుడు వాడాలంటే.. మనకు ఏదైనా జబ్బు చేసినప్పుడు వైరల్ ద్వారా వ్యాప్తి చెందిందా? లేక బ్యాక్టీరియా కారణమా అన్నది నిర్ధారించుకోవాలి. బ్యాక్టీరియా కల్చర్ పరీక్ష ద్వారా నిర్ధారించుకుని అవసరం మేరకు మూడు నుంచి ఐదు యాంటీబయోటిక్స్ వాడాలి. మన శరీరంలో మంచి, చెడు బ్యాక్టీరియాలు ఉంటాయి. చెడు బ్యాక్టీరియా నివారణకు అతిగా యాంటీబయోటిక్స్ వాడటం వల్ల వాటి ప్రభావం మంచి బ్యాక్టీరియాపై పడుతుంది. ఫలితంగా శరీరంలోని వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఒక్కోసారి తీవ్రమైన నీరసం వంటి సమస్యలు తలెత్తుతాయి. యాంటీబయోటిక్స్ రెండు రకాలుగా ఉంటాయి. నేరో స్ప్రెక్టమ్ యాంటీబయోటిక్స్ ఒకే రకమైన బ్యాక్టీరియాకు పనిచేస్తాయి. బ్రాడ్ స్ప్రెక్టమ్ యాంటీబయోటిక్స్ రెండు మూడు రకాల బ్యాక్టీరియాల నివారణకు పనిచేస్తాయి. సూపర్‌బగ్స్ పెనుప్రమాదం యాంటీబయోటిక్స్ విచ్చలవిడిగా వాడటం వల్ల శరీరంలో బ్యాక్టీరియాకు డ్రగ్ రెసిస్టెన్స్ (ఔషధ నిరోధకత) ఏర్పడుతుంది. ఔషధ నిరోధకతను సంతరించుకున్న బ్యాక్టీరియా నుంచి వచ్చే తరువాతి తరాల బ్యాక్టీరియాలను సూపర్ బగ్స్ అంటారు. ఇవి సాధారణ యాంటీ బయోటిక్స్‌కు లొంగవు. ఎక్కువ డోస్ ఇవ్వాల్సి ఉంటుంది. అలా ఇవ్వడం ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంటుంది. ప్రస్తుతం కొందరిలో సూపర్ బగ్స్‌ను గుర్తిస్తున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. వ్యాధిని గుర్తించడం ముఖ్యం నిమోనియా వ్యాధి వైరల్, బ్యాక్టీరియా, ఫంగస్ వంటి మూడు కారణాలుగా వస్తుంది. వైరల్ నిమోనియా చాలా వేగంగా వ్యాప్తి చెంది తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ వ్యాధికి మందులు వాడేటప్పుడు సరైన నిర్ధారణ చేసి యాంటీబయోటిక్స్ వాడాలి. లేకుంటే నివారించడం కష్టం. నిమోనియానే కాదు ఏ వ్యాధినైనా యాంటీబయోటిక్స్ వినియోగించే సమయంలో బ్యాక్టీరియా కల్చర్, అవసరమైతే డ్రగ్ కల్చర్ పరీక్షలు చేయడం ఉత్తమం. గర్భిణుల విషయంలో జాగ్రత్తలు అవసరం గర్బిణులకు కొన్ని రకాల యాంటీబయోటిక్స్ వాడటం చాలా ప్రమాదకరమని ఫార్మకాలజీ నిపుణులు చెపుతున్నారు. వారు వైద్యుల సూచన లేకుండా యాంటీబయోటిక్స్ వాడటం వలన గర్భస్థ శిశువులో అవయవలోపాలు ఏర్పాడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. -
పశువుల్లో యాంటీబయాటిక్స్ లేని పాల ఉత్పత్తికి కొత్త పద్ధతులు..
యాంటీబయాటిక్ ఔషధాలను మనుషులకు చికిత్సలో, పశు వ్యాధుల చికిత్సలో నిర్దేశిత మోతాదుల కన్నా అధికంగా, విచక్షణా రహితంగా వినియోగిస్తున్నందు వల్ల కొన్ని సూక్ష్మక్రిములు ఈ మందులకు అలవాటు పడిపోయి ప్రాణాంతకంగా పరిణమిస్తున్నాయి. మొండికేసిన క్రిములు (సూపర్ బగ్స్) తయారవుతున్నాయి. ఇవి శక్తివంతమైన యాంటీబయాటిక్స్‌కూ లొంగటం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఏటా 7 లక్షల మంది ప్రాణాలను బలిగొంటున్న ఈ సమస్యను యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఎ.ఎం.ఆర్.)గా వ్యవహరిస్తున్నాం. చాపకింద నీరులా విస్తరిస్తున్న ఈ మహమ్మారిని అరికట్టడానికి తక్షణం స్పందించకపోతే 2050 నాటికి ఏటా కోటి మంది (ఇందులో 20 లక్షల మంది భారతీయులే) ఎ.ఎం.ఆర్. సమస్యతో చనిపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎ.ఎం.ఆర్. సమస్య వల్ల యాంటీబయాటిక్ మందులు అసమర్థంగా మారడంతో శరీరం నుంచి ఇన్ఫెక్షన్లను తొలగించడం కష్టతరంగా మారుతోంది. ఉపయోగించిన యాంటీబయాటిక్స్ పరిమాణంలో 90% విసర్జితాల ద్వారా పర్యావరణంలోకి చేరి నీరు, నేల కలుషితమవుతుంది. ఎ.ఎం.ఆర్. సమస్యను పరిష్కరించాలంటే.. మనుషులతోపాటు పాలు, గుడ్లు, మాంసం కోసం పెంచే పశుపక్ష్యాదుల కోసం యాంటీబయాటిక్స్ వినియోగాన్ని తగ్గించుకోవాలి. పాడి పశువులకు వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్తలు పాటించడం, జబ్బులు వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్‌కు బదులు సంప్రదాయ మూలికలతో కూడిన పశు ఆయుర్వేద పద్ధతులు అనుసరించడం ద్వారా ఎ.ఎం.ఆర్. సమస్య నుంచి సమర్థవంతంగా బయటపడవచ్చని శాస్త్రీయంగా రుజువు కావటం సంతోషదాయకం. బెంగళూరులోని యూనివర్సిటీ ఆఫ్ ట్రాన్స్–డిసిప్లినరీ (యు.టి.డి.) హెల్త్ అండ్ టెక్నాలజీ, తమిళనాడు వెటర్నరీ యూనివర్సిటీ నిపుణులు గత పదేళ్లుగా ఈ దిశగా చేస్తున్న విశేష కృషి సత్ఫలితాలనిచ్చింది. 10 రాష్ట్రాల్లో సంప్రదాయ పశువైద్య పద్ధతులను అధ్యయనం చేసి 441 మూలికా వైద్య మిశ్రమాలను గుర్తించారు. వీటిని పరీక్షించి 353 మందులు సురక్షితమైనవని, ప్రభావవంతమైనవని నిర్థారించారు. జాతీయ పాడి అభివృద్ధి బోర్డు (ఎన్.డి.డి.బి.) ఈ పశు ఆయుర్వేద పద్ధతులను ఐదేళ్లుగా సహకార సంఘాల ద్వారా పాడి రైతులకు పరిచయం చేసి అద్భుత ఫలితాలను రాబడుతున్నది. 24 రకాల పశు వ్యాధులను నివారించడంలో, నిరోధించడంలోనూ సంప్రదాయ మూలికా మిశ్రమాలు అత్యంత సమర్థవంతంగా పని చేస్తున్నాయని ఎన్.డి.డి.బి. నిర్థారణకు వచ్చింది. ఈ పద్ధతులను పాడి సంఘాల ద్వారా దేశవ్యాప్తంగా రైతులకు పరిచయం చేస్తోంది. ఏటా యాంటీబయాటిక్ మందుల కొనుగోలుకు రూ. 1.86 కోట్లు ఖర్చు పెట్టే ఎన్.డి.డి.బి. ఈ ఖర్చును సంప్రదాయ మూలికా వైద్యం అనుసరించడం ద్వారా రూ. 50 లక్షలకు తగ్గించుకోగలిగింది. 1,500 గ్రామాల్లో పాడి రైతులకు ఈ మూలికా చికిత్సను ఇప్పటికే నేర్పించింది. తమ పరిసరాల్లోని ఔషధ మొక్కలు, దినుసులతోనే పశు వ్యాధుల నివారణకు, చికిత్సకు ఉపయోగించుకుంటూ శాస్త్రీయంగా యాంటీబయోటిక్ మందుల వాడకాన్ని 80% తగ్గించామని ఎన్.డి.డి.బి. చైర్మన్ మీనెష్ షా ప్రకటించారు. పొదుగువాపు వ్యాధి, గాలికుంటు వ్యాధులను రసాయనిక యాంటిబయాటిక్స్ వాడకుండా నూటికి నూరు శాతం పూర్తిగా తగ్గించగలిగామని ఆయన తెలిపారు. పాలలో యాంటీబయాటిక్స్‌ను 88% తగ్గించగలిగాం: ప్రొ. నాయర్ యూనివర్సిటీ ఆఫ్ ట్రాన్స్–డిసిప్లినరీ (యు.టి.డి.)లోని మూలికా పశువైద్య పరిశోధనా విభాగం అధిపతి ప్రొ. ఎం.ఎన్. బాలకృష్ణన్ నాయర్, తన సహచరులు డా. ఎన్. పుణ్యమూర్తి, ఎస్.కె. కుమార్‌తో కలిసి పశు ఆయుర్వేద పద్ధతులపై పరిశోధనలు చేస్తున్నారు. కేరళ, తమిళనాడు, కర్ణాటకల్లో 140 మంది పాడి రైతులతో కలసి మూడేళ్లు ప్రయోగాత్మకంగా మూలికా వైద్యంపై అధ్యయనం చేశారు. పాలలో యాంటీబయాటిక్స్ అవశేషాలను 88% తగ్గించగలిగామని ప్రొ. నాయర్ ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. ఎన్.డి.డి.బి.తో కలసి ఏపీ, తెలంగాణ సహా 14 రాష్ట్రాల్లోని 30 పాల సంఘాలలో 1750 మంది పశువైద్యులకు, 30 వేల మంది పాడి రైతులకు, 560 మంది గ్రామ రిసోర్స్ పర్సన్లకు శిక్షణ ఇచ్చామని తెలిపారు. తమ యూనివర్సిటీలో రైతుల కోసం 4 రోజుల సర్టిఫికెట్ కోర్సు, పశువైద్యుల కోసం 7 రోజుల సర్టిఫికెట్ కోర్సులు ప్రవేశపెట్టామన్నారు. ఎమ్మెస్సీ, పిహెచ్డి కూడా పెట్టామన్నారు. సిక్కిం, హర్యానా, పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వాలతో ప్రత్యేక ఒప్పందాలు చేసుకొని రసాయనిక యాంటీబయాటిక్స్ అవసరంలేని పశుపోషణపై శిక్షణ ఇస్తున్నామన్నారు. తెలుగు రాష్ట్రాల్లో స్వచ్ఛంద సంస్థలు, రైతు సంఘాలు ముందుకొస్తే స్వల్ప ఫీజుతోనే ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకల పెంపకందారులకు పశు ఆయుర్వేద పద్ధతులపై శిక్షణ ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. వివరాలకు.. ప్రొ. ఎం.ఎన్. బాలకృష్ణన్ నాయర్ – 63602 04672. nair.mnb@tdu.edu.in చదవండి: World's Largest Cemetery: ఇది నగరంలోని శ్మశానం కాదు.. శ్మశానమే ఓ మహానగరంగా! ఎక్కడుందో తెలుసా? -
కరోనా చికిత్సలో ఈ మెడిసిన్ వాడేటప్పుడు జాగ్రత్త..!
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ చికిత్సలో బ్రహ్మాస్త్రం లాంటి మోనోక్లోనల్ యాంటీబాడీస్ మందును అవసరమున్న వారికే ఉపయోగించాలి తప్ప విచక్షణరహితంగా వాడొద్దని ఏఐజీ ఆస్పత్రుల చైర్మన్ డా.డి.నాగేశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇది ఖరీదైన మందు (దాదాపు రూ.70 వేలు) కావడంతో పాటు దీని వల్ల వచ్చే దుష్ప్రభావాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని పేర్కొన్నారు. అవసరం లేకపోయినా దీన్ని ఉపయోగిస్తే వైరస్ మ్యూటెంట్లు మరింత ముదిరే అవకాశం ఉందని, యాంటీబాడీ చికిత్సకు కూడా లొంగని పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఆర్టీ పీసీఆర్ టెస్ట్‌లో పాజిటివ్ వచ్చాక మూడు రోజుల్లో లేదా వారంలోనే దీన్ని తీసుకోవాలని, ఆ తర్వాత దీని ప్రభావం ఉండదని చెప్పారు. తమ ఆస్పత్రిలో ‘కసిరివిమాబ్, ఇమ్దెవిమాబ్ కాంబినేషన్లోని యాంటీబాడీస్ మందు వేయడం ప్రారంభించినట్లు తెలిపారు. గురువారం జూమ్ ద్వారా నిర్వహించిన సమావేశంలో డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి మాట్లాడారు. కోవిడ్ తొలిదశలో స్వల్ప, ఒక మోస్తరు లక్షణాలు ఉన్న వారిపైనే ఇది పనిచేస్తుందని, అయితే ఇది ఇచ్చాక త్వరగా కోలుకుంటారని చెప్పారు. ఇంజెక్షన్ రూపంలో.. ప్రస్తుతం మన దగ్గర ఇంజెక్షన్ రూపంలో దీనిని ఇస్తున్నట్టు చెప్పారు. ఈ మందు తీసుకున్నాక ఆస్పత్రుల్లో చేర్చాల్సిన అవసరం తగ్గిపోవడమే కాకుండా 70 శాతం వరకు మరణించే అవకాశాలు తగ్గి వైరల్ క్లియరెన్స్‌లోనూ చెప్పుకోదగ్గ మార్పు కనిపిస్తున్నట్లు వెల్లడైందన్నారు. ప్రస్తుతం అత్యవసర వినియోగానికి కేంద్రం అనుమతి ఇచ్చిందన్నారు. అయితే ఇండియాలో డబుల్ మ్యుటెంట్‌పై ఇది ఏ మేరకు సమర్థంగా పనిచేస్తుందన్న దానికి సంబంధించి వంద మందిపై నిర్వహిస్తున్న పరిశోధన ఫలితాలు నెలలో వెల్లడి అవుతాయని చెప్పారు. ఈ మందు తీసుకున్న వారికి కనీసం 3 నెలల ద్వారా వ్యాక్సిన్ వేయకూడదని స్పష్టం చేశారు. ప్రస్తుతం అమెరికాలో తయారవుతున్న ఈ మందును సిప్లా కంపెనీ ద్వారా దిగుమతి చేసుకునేందుకు కేంద్రం అనుమతించిందని వెల్లడించారు. దీని ఫలితాల ఆధారంగా త్వరలోనే దేశీయంగా ఉత్పత్తి చేసే అవకాశముందని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో 12 ఏళ్లకు పైబడిన పిల్లలకు కనీస బరువు 40 కిలోలు ఉన్న వారికి ఈ చికిత్సకు అనుమతిస్తారు. ఎవరెవరికి ఇవ్వొచ్చు.. 65 ఏళ్లు పైబడిన వారు. అనియంత్రిత మధుమేహం ఉన్న స్థూలకాయులు గుండెజబ్బులున్న వారు. ఇమ్యునో సప్రెషన్స్ తీసుకునే కేన్సర్, ఇతర జబ్బుల వారు. 55 ఏళ్లకు పైగా వయసున్న వారిలో అధిక రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులున్న వారికి.