
నిమోనియా, మెనింజైటిస్ వంటి వ్యాధులొస్తే యాంటీబయాటిక్‌ల వాడకం తప్పనిసరి. వ్యాధి కారక బ్యాక్టీరియాలను ఈ మందులు చంపేస్తాయి. ఈ క్రమంలో కొన్ని మందులకు నిరోధకతను పెంచుకుంటాయి. మరికొన్ని అటు నిరోధకత పెంచుకోవడంతోపాటు ఇటు ఆ మందులను ఆహారంగానూ మార్చేస్తున్నాయి! ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే అంటున్నారు వాషింగ్టన్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు. పదేళ్ల క్రితం బ్యాక్టీరియా యాంటీబయాటిక్‌లను తినేసే అవకాశముందని తాము చెప్పినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారని తాజా పరిశోధనలను బట్టి చూస్తే ఈ బ్యాక్టీరియా కర్బనం కోసం ఇలా చేస్తున్నట్లు స్పష్టమవుతోందని పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త గౌతమ్ దంతాస్ తెలిపారు.
యాంటీబయాటిక్ నిరోధకత అన్నది ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లలో అతి ముఖ్యమైందని, కొత్త మందుల అభివృద్ధి జరగక ముందే నిరోధకత పెరిగిపోతే ప్రాణనష్టం తీవ్రమవుతుందని గౌతమ్ అన్నారు. ఈ నేపథ్యంలో యాంటీబయాటిక్‌లను కొన్ని రకాల బ్యాక్టీరియా ఎలా తట్టుకుంటుందో తెలుసుకునేందుకు ప్రయత్నించామని, నేలలో ఉండే నాలుగు రకాల బ్యాక్టీరియా పై పరిశోధనలు జరిపినప్పుడు అవన్నీ పెన్సిలిన్‌పై ఆధారపడి బతుకుతున్నట్లు తెలిసిందని వివరించారు. ఈ పరిశోధనల ఆధారంగా భవిష్యత్తులో మెరుగైన యాంటీబయాటిక్‌లను తయారుచేయడం సాధ్యమవుతుందని అంచనా.