ఇడ్లీ, దోసె, మజ్జిగ కూడా మందులే! | Probiotics Inherently Provide Some Of The Vitamins Our Body Needs | Sakshi
Sakshi News home page

ఇడ్లీ, దోసె, మజ్జిగ కూడా మందులే!

Published Thu, Oct 31 2019 3:09 AM | Last Updated on Thu, Oct 31 2019 3:09 AM

Probiotics Inherently Provide Some Of The Vitamins Our Body Needs - Sakshi

మనం రోజూ తినే ఇడ్లీలు, దోసెలు, రోజూ తాగే మజ్జిగ కూడా మందులా ఉపయోగపడతాయంటే నమ్మగలరా? ఎన్నోరకాల జబ్బుల్నీ నయం చేస్తాయి కూడా.  మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది పూర్తిగా వాస్తవం. అలాగే కాద్దిసేపు వదిలేస్తే పులవడానికి అవకాశమున్న ఇడ్లీపిండి, దోసెపిండి, మజ్జిగ వంటి వాటిల్లో మన జీర్ణవ్యవస్థకు మేలు చేసే మంచి బ్యాక్టీరియా పుష్కలంగా ఉంటుంది. ఈ బ్యాక్టీరియానే మనం ప్రోబయోటిక్స్‌ అని పిలుస్తాం.

ప్రోబయోటిక్స్‌ ఇచ్చే సందర్భాలు...
యాంటీబయాటిక్స్‌ వాడినప్పుడు: డాక్టర్లు యాంటీబయాటిక్స్‌ ప్రిస్క్రయిబ్‌ చేసినప్పుడు అవి మనలోని హాని చేసే సూక్ష్మజీవులతో పాటు మేలు చేసేవాటినీ చంపేస్తాయి. దాంతో మనలో కొన్ని రకాల సైడ్‌ఎఫెక్ట్స్‌ కనిపిస్తాయి. అంటే కడుపులో గ్యాస్‌ పెరగడం, మజిల్‌ క్రాంప్స్‌, డయేరియా వంటివి. మనలో ఉండే ప్రోబయాటిక్స్‌ మన దేహానికి అవసరమైన కొన్ని విటమిన్లు స్వాభావికంగానే అందేలా చేస్తాయి. అయితే యాంటీబయాటిక్స్‌ కారణంగా విటమిన్లు కూడా అవసరమైన మేరకు అందని పరిస్థితి వచ్చే అవకాశాలు ఉండవచ్చు. అందుకే ఈ పరిణామాన్ని నివారించడానికి యాంటీబయాటిక్స్‌తో పాటు కొన్ని విటమిన్లు, ప్రోబయాటిక్స్‌ డాక్టర్లు ప్రిస్క్రయిబ్‌ చేస్తారు.

డయేరియాతో బాధపడేవారికి: కొన్ని ఇన్ఫెక్షన్స్‌ కారణంగా నీళ్ల విరేచనాలు అవుతున్నవారికి సైతం ప్రో–బయాటిక్స్‌ ఇస్తారు.

ఇరిటబుల్‌ బవెల్‌ సిండ్రోమ్‌ (ఐబీఎస్‌): ఈ సమస్య ఉన్నవారిలో విరేచనం సరిగా కాదు లేదా అదేపనిగా విరేచనాలు కావచ్చు. తిన్న వెంటనే టాయిలెట్‌కు వెళ్లాల్సి వస్తుంటుంది. ఇలా ఇరిటబుల్‌ బవెల్‌ సిండ్రోమ్‌ సమస్య ఉన్నవారికి ప్రో–బయాటిక్స్‌ బాగా పనిచేస్తాయి.

ఇన్‌ఫ్లమేటరీ బవెల్‌ డిసీజ్‌: అల్సరేటివ్‌ కొలైటిస్‌ లేదా క్రోన్స్‌ డిజీస్‌ ఉన్నవారికి ప్రో–బయాటిక్స్‌ మేలు చేస్తాయి.

హెలికోబ్యాక్టర్‌ పైలోరీ: కొందరిలో పేగులో పుండు పడి, పేగుకు రంధ్రం పడేలా చేసే హెలికోబ్యాక్టర్‌ పైలోరీ కారణంగా కడుపులో మంట వంటి లక్షణాలు కనిపిస్తున్నప్పుడు సైతం ప్రో–బయాటిక్స్‌ మంచి మేలు చేస్తాయి.

ఇడ్లీ, దోసె, మజ్జిగలు మందెలా అవుతాయంటే...
మన చుట్టూ సూక్ష్మజీవులైన అనేకరకాల బాక్టీరియా ఉంటుంది. మన చుట్టే కాదు.. మన చర్మంపైనా, నోట్లో, గొంతులో, మన జీర్ణవ్యవస్థ పొడవునా కోటానుకోట్ల సూక్ష్మజీవులు నివాసం ఉంటుంటాయి. ఇలా మన జీర్ణవ్యవస్థలో ఉండే బ్యాక్టీరియా మన ఆహారాలు జీర్ణం కావడానికి ఉపయోగపడటంతో పాటు కొన్ని రకాల వ్యాధులనుంచి మనల్ని రక్షిస్తుంటాయి. అంటే... పరోక్షంగా అవి మన రోగనిరోధకశక్తిని పెంపొందిస్తూ మనకు మేలు చేస్తుంటాయన్నమాట. మన ఆహార సంప్రదాయంలో మనకు తెలియకుండానే మనం ప్రో–బయాటిక్స్‌ను తీసుకుంటూ ఉంటాం. ఉదాహరణకు ఇడ్లీపిండిని రాత్రి కలుపుకుని ఆ మర్నాడు ఇడ్లీ వాయి దింపుతాం. మన దక్షిణభారతీయులు ఇడ్లీ, దోసె తింటే... గుజరాత్‌ వంటి చోట్ల ధోక్లా అనే వంటకాన్ని కూడా పిండి పులిసే వరకు ఉంచి చేసుకుంటారు.
డాక్టర్‌ శరత్‌ చంద్ర జి.
మెడికల్‌ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ అండ్‌ హెపటాలజిస్ట్,
అపోలో హాస్పిటల్స్, హైదర్‌గూడ, హైదరాబాద్‌.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement