అవి అందుబాటులోలేని రోజుల్లోనే ఫేజ్ థెరపీ ద్వారా చికిత్స
విదేశాల్లో ఈ విధానాన్ని పాటిస్తున్నారు
వైద్యుడి సూచన మేరకే యాంటిబయోటిక్స్ వాడాలి
క్లినికల్ ఇన్‌ఫెక్షన్ల డిసీజెస్ సొసైటీ నేషనల్ మెంబర్ డాక్టర్ కళ్యాణ్‌చక్రవర్తి
యాంటిబయోటిక్స్ అతి వినియోగంతో రోగనిరోధకత పెంచుకుంటున్న చెడు బ్యాక్టీరియా
ఫలితంగా చికిత్సల్లో పనిచేయని యాంటిబయోటిక్స్
సాక్షి, అమరావతి : ‘అవసరం ఉన్నా లేకున్నా విచ్చలవిడిగా యాంటిబయోటిక్స్ వాడకంవల్ల శరీరంలోని చెడు బ్యాక్టీరియా రోగనిరోధకత పెరుగుతోంది. దీంతో కొన్నిరకాల బ్యాక్టీరియాపై యాంటిబయోటిక్స్ పనిచేయకుండాపోతున్నాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రజారోగ్యానికి పెనువిపత్తులా మారింది. ఇలా యాంటిబయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్లకు ఫేజ్ థెరపీతో చెక్‌పెట్టొచ్చు’.. అని క్లినికల్ ఇన్‌ఫెక్షన్ డిసీజెస్ సొసైటీ (సీఐడీఎస్), యూరోపియన్ స్టడీ గ్రూప్ ఆన్ నాన్–ట్రెడిషనల్ యాంటిబయోటిక్స్ సొసైటీ (ఈఎస్‌జీఎన్‌టీఏ) సభ్యులు డాక్టర్ కళ్యాణచక్రవర్తి అన్నారు.
జార్జియా, రష్యా, అమెరికా, యూరప్ దేశాల్లో న్యూమోనియా, క్షయ, చర్మ, మూత్రనాళ, ఇతర బ్యాక్టిరియల్ ఇన్‌ఫెక్షన్లలో యాంటిబయోటిక్స్‌కు బ్యాక్టీరియా లొంగని క్రమంలో ఫేజ్ థెరపీ వినియోగిస్తున్నట్లు ఆయన వివరించారు. ప్రస్తుతం భారత్‌లోనూ అక్కడక్కడా ఇది వినియోగంలో ఉన్నా ఈ విధానం భవిష్యత్తులో పెద్దఎత్తున వాడుకలోకి వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవల ఫ్రాన్స్‌లోని లియోన్‌లో ఈఎస్‌జీఎన్‌టీఏ ఆధ్వర్యంలో ఫేజ్ థెరిపీపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో డా. కళ్యాణ్‌చక్రవర్తి పాల్గొన్నారు. బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్లకు చికిత్సల్లో ఫేజ్ థెరఫీకి సంబంధించిన అంశాలను ఆయన ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆయన ఏమన్నారంటే..
1900 దశకంలోనే..
బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్లకు చికిత్స చేయడానికి బ్యాక్టీరియా వైరస్ (ఫేజ్)లను వినియోగించడమే ఫేజ్ థెరపీ. యాంటిబయోటిక్స్ కనిపెట్టడానికంటే ముందు 1900 దశకం ప్రారంభంలో ఈ ఫేజ్ థెరపీ వినియోగంలో ఉండేది. మానవులపై దాడిచేసి వ్యాధుల బారినపడేలా చేసే బ్యాక్టీరియాను నశింపజేసే బ్యాక్టీరియా ఫేజ్‌లు ప్రకృతిలో ఉంటాయి. నీరు, మట్టి, ఇతర ప్రకృతి వనరుల నుంచి సేకరించిన బ్యాక్టీరియాను ప్రయోగశాలల్లో శుద్ధిచేసి అందులోని చెడు రసాయనాలను వేరుచేసిన అనంతరం ఫేజ్‌లను సాధారణ మందుల మాదిరిగానే చికిత్సలో వినియోగిస్తారు. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలిన్‌ను కనిపెట్టిన అనంతరం పెద్దఎత్తున యాంటిబయోటిక్ మందులు
అందుబాటులోకి రావడంతో ఫేజ్ థెరపీ కనుమరుగైంది.
రోగ నిరోధకత పెరుగుదల..
మార్కెట్‌లో ఉన్న యాంటిబయోటిక్స్‌కు లొంగకుండా బ్యాక్టీరియా రోగ నిరోధకత పెంచుకోవడంతో మందులు పనిచేయకుండాపోతున్నాయి. ఆస్ప త్రుల్లో ఇన్‌ఫెక్షన్ కంట్రోల్ ప్రమాణాలు సరిగా పాటించకపోవడం. ప్రస్తుతం ఆస్పత్రుల్లో ఐసీయూల్లో చికిత్స పొందుతున్న వారిలో 90 శాతం, ఆస్పత్రులకు వచ్చే వారిలో 50 శాతం మందిలో యాంటిబయోటిక్స్ పనిచేయని దుస్థితి నెలకొంటోంది. ఈ నేపథ్యంలో.. ప్రపంచానికి ఫేజ్ థెరపీ ప్రత్యామ్నాయంగా ఉంటోంది. కొన్నేళ్ల క్రితం నేను న్యుమోనియాతో బాధపడే 60 ఏళ్ల వృద్ధురాలికి ఈ విధానం ద్వారా నయంచేశాను. రోగుల డిమాండ్ మేరకు ఆస్పత్రుల్లోని ఎథిక్స్ కమిటీ ఆమోదంతో మన దేశంలో ఇప్పటికే ఈ విధానాన్ని వినియోగి స్తున్నారు. ఈ విధానంలో రోగుల్లో రోగనిరోధకత పెరగడంతో పాటు, త్వరగా వ్యాధుల నుంచి కోలుకుంటారని పలు పరిశో«ధనల్లో సైతం వెల్లడైంది.
మార్పు రాకపోతే కష్టం..
ప్రజలు, కొందరు వైద్యులు లెక్కలేనితనంగా యాంటిబయోటిక్స్‌ను వినియోగిస్తుండటంతో యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్) సమస్య ఉత్పన్నమవుతోంది. ఇది ప్రపంచానికి పెనుముప్పుగా అవతరించింది. ఏఎంఆర్ పెను ఆరోగ్య సమస్యగా మారి ఫేజ్ థెరపీని ఆశ్రయించాల్సిన దుస్థితి రాకుండా ఉండాలంటే ప్రజలు ముందస్తు జాగ్రత్తలు పాటించాలి. మనం పెరట్లో పెంచుకునే మొక్కకు తెగులు వస్తే ఆ తెగులు ఏంటో నిర్ధారించుకుని మందు కొని పిచికారి చేస్తాం. మొక్కకే ఇంత ప్రాధాన్యం ఇస్తున్న ప్రజలు ఆరోగ్యానికి ఇవ్వకపోతుండటం దురదృష్టకరం. జలుబు, దగ్గు, జ్వరం ఇలా ఏ చిన్నజబ్బు వచ్చినా వెంటనే మెడికల్ స్టోర్‌కు వెళ్లి వాళ్లిచ్చే యాంటిబయోటిక్స్ వాడుతున్నారు. ఈ దురలవాటును ప్రతిఒక్కరూ విడనాడాలి. సాధారణ దగ్గు, జలుబు, జ్వరానికి యాంటిబయోటిక్స్ వాడొద్దు. వైద్యుడిని సంప్రదించి, వ్యాధి నిర్ధారణ చేసుకుని, వైద్యుడి సూచన మేరకు మాత్రమే యాంటిబయోటిక్స్ వాడితే చాలావరకూ ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment