kalyan chakravarthy
-
లొంగని బ్యాక్టీరియాకు విరుగుడు
సాక్షి, అమరావతి : ‘అవసరం ఉన్నా లేకున్నా విచ్చలవిడిగా యాంటిబయోటిక్స్ వాడకంవల్ల శరీరంలోని చెడు బ్యాక్టీరియా రోగనిరోధకత పెరుగుతోంది. దీంతో కొన్నిరకాల బ్యాక్టీరియాపై యాంటిబయోటిక్స్ పనిచేయకుండాపోతున్నాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రజారోగ్యానికి పెనువిపత్తులా మారింది. ఇలా యాంటిబయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు ఫేజ్ థెరపీతో చెక్‌పెట్టొచ్చు’.. అని క్లినికల్ ఇన్ఫెక్షన్ డిసీజెస్ సొసైటీ (సీఐడీఎస్), యూరోపియన్ స్టడీ గ్రూప్ ఆన్ నాన్–ట్రెడిషనల్ యాంటిబయోటిక్స్ సొసైటీ (ఈఎస్జీఎన్టీఏ) సభ్యులు డాక్టర్ కళ్యాణచక్రవర్తి అన్నారు.జార్జియా, రష్యా, అమెరికా, యూరప్ దేశాల్లో న్యూమోనియా, క్షయ, చర్మ, మూత్రనాళ, ఇతర బ్యాక్టిరియల్ ఇన్ఫెక్షన్లలో యాంటిబయోటిక్స్‌కు బ్యాక్టీరియా లొంగని క్రమంలో ఫేజ్ థెరపీ వినియోగిస్తున్నట్లు ఆయన వివరించారు. ప్రస్తుతం భారత్‌లోనూ అక్కడక్కడా ఇది వినియోగంలో ఉన్నా ఈ విధానం భవిష్యత్తులో పెద్దఎత్తున వాడుకలోకి వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవల ఫ్రాన్స్‌లోని లియోన్‌లో ఈఎస్జీఎన్టీఏ ఆధ్వర్యంలో ఫేజ్ థెరిపీపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో డా. కళ్యాణ్‌చక్రవర్తి పాల్గొన్నారు. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు చికిత్సల్లో ఫేజ్ థెరఫీకి సంబంధించిన అంశాలను ఆయన ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆయన ఏమన్నారంటే.. 1900 దశకంలోనే..బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడానికి బ్యాక్టీరియా వైరస్ (ఫేజ్)లను వినియోగించడమే ఫేజ్ థెరపీ. యాంటిబయోటిక్స్ కనిపెట్టడానికంటే ముందు 1900 దశకం ప్రారంభంలో ఈ ఫేజ్ థెరపీ వినియోగంలో ఉండేది. మానవులపై దాడిచేసి వ్యాధుల బారినపడేలా చేసే బ్యాక్టీరియాను నశింపజేసే బ్యాక్టీరియా ఫేజ్‌లు ప్రకృతిలో ఉంటాయి. నీరు, మట్టి, ఇతర ప్రకృతి వనరుల నుంచి సేకరించిన బ్యాక్టీరియాను ప్రయోగశాలల్లో శుద్ధిచేసి అందులోని చెడు రసాయనాలను వేరుచేసిన అనంతరం ఫేజ్లను సాధారణ మందుల మాదిరిగానే చికిత్సలో వినియోగిస్తారు. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలిన్‌ను కనిపెట్టిన అనంతరం పెద్దఎత్తున యాంటిబయోటిక్ మందులు అందుబాటులోకి రావడంతో ఫేజ్ థెరపీ కనుమరుగైంది.రోగ నిరోధకత పెరుగుదల..మార్కెట్లో ఉన్న యాంటిబయోటిక్స్‌కు లొంగకుండా బ్యాక్టీరియా రోగ నిరోధకత పెంచుకోవడంతో మందులు పనిచేయకుండాపోతున్నాయి. ఆస్ప త్రుల్లో ఇన్ఫెక్షన్ కంట్రోల్ ప్రమాణాలు సరిగా పాటించకపోవడం. ప్రస్తుతం ఆస్పత్రుల్లో ఐసీయూల్లో చికిత్స పొందుతున్న వారిలో 90 శాతం, ఆస్పత్రులకు వచ్చే వారిలో 50 శాతం మందిలో యాంటిబయోటిక్స్ పనిచేయని దుస్థితి నెలకొంటోంది. ఈ నేపథ్యంలో.. ప్రపంచానికి ఫేజ్ థెరపీ ప్రత్యామ్నాయంగా ఉంటోంది. కొన్నేళ్ల క్రితం నేను న్యుమోనియాతో బాధపడే 60 ఏళ్ల వృద్ధురాలికి ఈ విధానం ద్వారా నయంచేశాను. రోగుల డిమాండ్ మేరకు ఆస్పత్రుల్లోని ఎథిక్స్ కమిటీ ఆమోదంతో మన దేశంలో ఇప్పటికే ఈ విధానాన్ని వినియోగి స్తున్నారు. ఈ విధానంలో రోగుల్లో రోగనిరోధకత పెరగడంతో పాటు, త్వరగా వ్యాధుల నుంచి కోలుకుంటారని పలు పరిశో«ధనల్లో సైతం వెల్లడైంది. మార్పు రాకపోతే కష్టం..ప్రజలు, కొందరు వైద్యులు లెక్కలేనితనంగా యాంటిబయోటిక్స్‌ను వినియోగిస్తుండటంతో యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్) సమస్య ఉత్పన్నమవుతోంది. ఇది ప్రపంచానికి పెనుముప్పుగా అవతరించింది. ఏఎంఆర్ పెను ఆరోగ్య సమస్యగా మారి ఫేజ్ థెరపీని ఆశ్రయించాల్సిన దుస్థితి రాకుండా ఉండాలంటే ప్రజలు ముందస్తు జాగ్రత్తలు పాటించాలి. మనం పెరట్లో పెంచుకునే మొక్కకు తెగులు వస్తే ఆ తెగులు ఏంటో నిర్ధారించుకుని మందు కొని పిచికారి చేస్తాం. మొక్కకే ఇంత ప్రాధాన్యం ఇస్తున్న ప్రజలు ఆరోగ్యానికి ఇవ్వకపోతుండటం దురదృష్టకరం. జలుబు, దగ్గు, జ్వరం ఇలా ఏ చిన్నజబ్బు వచ్చినా వెంటనే మెడికల్ స్టోర్‌కు వెళ్లి వాళ్లిచ్చే యాంటిబయోటిక్స్ వాడుతున్నారు. ఈ దురలవాటును ప్రతిఒక్కరూ విడనాడాలి. సాధారణ దగ్గు, జలుబు, జ్వరానికి యాంటిబయోటిక్స్ వాడొద్దు. వైద్యుడిని సంప్రదించి, వ్యాధి నిర్ధారణ చేసుకుని, వైద్యుడి సూచన మేరకు మాత్రమే యాంటిబయోటిక్స్ వాడితే చాలావరకూ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది. -
కరోనాకు కాక్ టెయిల్ యాంటీబాడీ ఇంజక్షన్‌తో చెక్
గుంటూరు మెడికల్: కోవిడ్–19 సోకి రోజుల తరబడి ఆస్పత్రుల్లో చికిత్స పొందకుండా కేవలం ఒకే ఒక్క ఇంజక్షన్ ద్వారా ఒక్కరోజులోనే కోవిడ్ నుంచి కోలుకోవచ్చని సమిష్ట హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ (శ్రీ) మేనేజింగ్ డైరెక్టర్, ఇన్ఫెక్షన్ డిసీజెస్ స్పెషలిస్ట్ డాక్టర్ కోగంటి కళ్యాణ్ చక్రవర్తి చెప్పారు. ఆస్పత్రుల్లో అడ్మిట్ అవకుండా డే కేర్ ట్రీట్మెంట్ సర్వీసెస్ ద్వారా ఇంటి వద్దే ఉండి కరోనా నుంచి కోలుకోవచ్చన్నారు. గుంటూరులోని శ్రీ హాస్పిటల్లో శనివారం ఆయన విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఏపీలో మొట్టమొదటిసారిగా తమ ఆస్పత్రిలో కరోనా సోకిన రోగికి అంతర్జాతీయంగా ఇటీవల మార్కెట్లోకి వచ్చిన రీజెనర్ ఆన్ కాక్టెయిల్ యాంటీబాడీ ఇంజక్షన్ చేశామన్నారు. గుంటూరుకు చెందిన 56 ఏళ్ల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌కు జ్వరం సోకి అది తగ్గకపోగా పెరిగిపోతూ సీఆర్పీ ఒక్కరోజులోనే నాలుగు రెట్లు పెరిగిందన్నారు. కోవిడ్ చికిత్స కోసం తమ వద్దకు రాగా శుక్రవారం ఆయనకు కాక్టెయిల్ యాంటీబాడీ ఇంజక్షన్ చేశామన్నారు. ఇతర మందులు ఏమీ ఇవ్వలేదని, 164 ఉన్న సీఆర్పీ ఒక్కసారిగా 75కు వచ్చిందన్నారు. శరీరంలో వైరస్ శాతం పెరిగితే సీఆర్పీ పెరుగుతుందని, ఒక్క ఇంజక్షన్‌తోనే సీఆర్పీ తగ్గుముఖం పట్టిందనే విషయం తమ ఆస్పత్రిలో రోగికి చేసిన ఇంజక్షన్ ద్వారా నిరూపితమైందన్నారు. కోవిడ్ వైరస్‌ను నిలువరించేవి శరీరంలోని యాంటీ బాడీలేనని, సాధారణంగా కోవిడ్ సోకిన వారికి యాంటీ బాడీలు శరీరంలో తయారవటానికి 10 నుంచి 15 రోజుల సమయం పడుతుందన్నారు. ఈ లోగా కోవిడ్ తీవ్రమయ్యే ప్రమాదముందని, ఆస్పత్రిలో చేరాల్సి వస్తుందన్నారు. మూడు నుంచి ఐదు రోజుల్లోగా ఇంజక్షన్ వ్యాధి పెరగకుండా, ఆస్పత్రిలో చేరాల్సిన పనిలేకుండా కోవిడ్ సోకిన మూడు నుంచి ఐదు రోజుల వ్యవధిలోగా కాక్టెయిల్ ఇంజక్షన్ ఇవ్వటం ద్వారా కరోనా నుంచి త్వరగా కోలుకుంటారని డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి చెప్పారు. ఒక్క రోగికి ఇంజక్షన్‌కు రూ.60 వేలు ఖర్చు అవుతుందని, కరోనాపై పోరాటం చేసేందుకు ఈ ఇంజక్షన్ రోగికి బలాన్ని ఇస్తుందన్నారు. ఇంజక్షన్ చేయించుకున్నవారిలో 75 శాతం మంది ఆస్పత్రుల్లో చేరకుండా ఇళ్లలోనే ఉండి వ్యాధిని జయించవచ్చని తెలిపారు. స్టెమ్ సెల్ థెరపీ కూడా కోవిడ్ సోకిన రోగుల్లో మంచి ఫలితాలను ఇస్తుందని, శ్రీ హాస్పిటల్లో 12 మందికి స్టెమ్‌సెల్ థెరపీ ద్వారా చికిత్స అందించి వ్యాధి నుంచి కోలుకునేలా చేశామన్నారు. సమావేశంలో శ్రీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ యార్లగడ్డ రవితేజ, డాక్టర్ నారాయణరెడ్డి పాల్గొన్నారు. -
కెనడా రోడ్డు ప్రమాదంలో తెలుగువాసి మృతి
మేడ్చల్: కెనడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జిల్లావాసి మృతిచెందారు. కీసర మండలం నాగారం గ్రామానికి చెందిన మునగాల కల్యాణ్ చక్రవర్తి(30) కెనడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందినట్లు కుటుంబసభ్యులకు సమాచారం అందింది. దీంతో అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
టెలి‘కామ్‌గా’ ముంచేశారు
ఇంటర్నేషనల్ కాల్స్‌ను లోకల్ కాల్స్‌గా మార్చిన వైనం రూ.30 కోట్ల కుచ్చు టోపీ గుట్టురట్టు చేసిన సైబరాబాద్ పోలీసులు ముఠా అరె స్టు, రూ.40 లక్షల సొత్తు స్వాధీనం సాక్షి, సిటీబ్యూరో: టెలి కమ్యూనికేషన్ శాఖకు సుమారుగా రూ.30 కోట్లు కుచ్చుటోపీ పెట్టిన హైటెక్ ముఠా గుట్టును సైబరాబాద్ పోలీసులు రట్టు చేశారు. ఈ ముఠా సైబరాబాద్‌లోని మూడు ప్రాంతాల నుంచి ఆరేళ్లుగా చీకటి వ్యాపారాన్ని యథేచ్ఛగా కొనసాగించింది. ఆరుగురు సభ్యులున్న ముఠాను సైబర్‌క్రైమ్, స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ) పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.40 లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. గచ్చిబౌలిలోని కమిషనర్ కార్యాలయంలో సైబర్ క్రైమ్ ఏసీపీ జయరాంతో కలసి ఎస్ఓటీ ఓఎస్డీ రాంచంద్రారెడ్డి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కూకట్‌పల్లికి చెందిన దామర్ల వెంకట కృష్ణప్రసాద్, కల్లూరి కల్యాణ్ చక్రవర్తి, రావూరి దుర్గా శ్రీనివాస్, మాదాపూర్‌కు చెందిన మద్దుల సుబ్బమనోజ్ దీపక్, దేవసాని శ్రీనివాస్‌రెడ్డి, అల్వాల్‌కు చెందిన నరేష్ కుమార్ తన్నీరు ముఠాగా ఏర్పడ్డారు. వీరంతా ఉన్నత చదువులు చదివినవారే. అక్రమ మార్గంలో త్వరగా కోటీశ్వరులు కావాలనే ఉద్దేశంతో అంతర్జాతీయ ఫోన్ కాల్స్‌ను లోకల్ కాల్స్‌గా మార్చి, ఆరేళ్ల క్రితం చీకటి వ్యాపారాన్ని మొదలుపెట్టారు. ఈ మేరకు కూకట్పల్లి, అల్వాల్, మల్కాజ్గిరి ప్రాంతాలలో ఇళ్లను అద్దెకు తీసుకుని కావాల్సిన కంప్యూటర్లు, సెల్ఫోన్లు, సిమ్‌కార్డులు తదితర పరికరాలు సమకూర్చుకున్నారు. విదేశాల్లో బంధువులు ఉంటూ, నగరంలో నివాసముంటున్న వారే వీరి వినియోగదారులు. విదేశాలలో ఉన్న బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులతో తక్కువ ఖర్చుతో మాట్లాడాలనుకునే వారు ఈ ముఠాన సంప్రదిస్తారు. ఈ ముఠా సాంకేతిక పరిజ్ఞానం (వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్)తో ఇంటర్నేషనల్ ఫోన్ కాల్స్‌ను లోకల్ కాల్స్‌గా మార్చి కస్టమర్ల నుంచి డబ్బులు దండుకునే వారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న ఎస్ఓటీ, సైబర్‌క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగి వీరివ్యాపార స్థావరాలపై గురువారం అర్ధరాత్రి మెరుపుదాడులు చేశారు. ఈ దాడుల్లో రూ.40 లక్షల విలువైన నాలుగు ల్యాప్‌టాప్‌లు, ఐప్యాడ్, 11 సెల్ఫోన్లు, 281 సిమ్‌కార్డులు, 72 రూటర్స్, 16 వైర్లెస్ యాంటెన్నాలు, టెలికమ్యూనికేషన్ పరికరాలు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో టెలికాం శాఖకు వీరు సుమారు రూ.30 కోట్ల నష్టాన్ని కలిగించారని తేలింది. ఈ సమావేశంలో ఇన్స్పెక్టర్లు పుష్పన్‌కుమార్, రాజశేఖరరెడ్డి, ఉమేందర్, వెంకట్‌రెడ్డి, గురురాఘవేందర్, ఎస్ఐలు రవి, ఆంజనేయులు పాల్గొన్నారు. -
టీవీ నటుడు కల్యాణ్ చక్రవర్తి ఆత్మహత్య
భీమవరం : బుల్లితెర ఆర్టిస్ట్ కల్యాణ్ చక్రవర్తి ఆత్మహత్య చేసుకున్నారు. తన స్వస్థలం అయిన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆయన ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్లే కల్యాణ చక్రవర్తి ఆత్మహత్య చేసుకున్నారని స్థానికులు అంటున్నారు. తహసిల్దార్ గా పనిచేసి పదవీ విరమణ చేసిన కల్యాణ్ చక్రవర్తి తల్లి రెండేళ్ల క్రితమే మరణించారు. వీళ్లకు ఉన్న ఇల్లు కూడా కొన్నాళ్ల క్రితం అమ్మేసినట్లు తెలిసింది. ఈయనకు ఇంకా పెళ్లి కాలేదు. టీవీ సీరియళ్లతో పాటు కొన్ని సినిమాల్లో కూడా కల్యాణ్ చక్రవర్తి నటించినట్లు చెబుతున్నారు. ఇటీవలి ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కావడంతో అవి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారని స్థానికులు అంటున్నారు.