టెలి‘కామ్‌గా’ ముంచేశారు | International calls and local calls | Sakshi
Sakshi News home page

టెలి‘కామ్‌గా’ ముంచేశారు

Published Sat, Sep 20 2014 4:43 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

టెలి‘కామ్‌గా’ ముంచేశారు - Sakshi

టెలి‘కామ్‌గా’ ముంచేశారు

  • ఇంటర్నేషనల్ కాల్స్‌ను లోకల్ కాల్స్‌గా మార్చిన వైనం
  • రూ.30 కోట్ల కుచ్చు టోపీ
  • గుట్టురట్టు చేసిన సైబరాబాద్ పోలీసులు
  • ముఠా అరె స్టు, రూ.40 లక్షల సొత్తు స్వాధీనం
  • సాక్షి, సిటీబ్యూరో: టెలి కమ్యూనికేషన్ శాఖకు సుమారుగా రూ.30 కోట్లు కుచ్చుటోపీ పెట్టిన హైటెక్ ముఠా గుట్టును సైబరాబాద్ పోలీసులు రట్టు చేశారు. ఈ ముఠా సైబరాబాద్‌లోని మూడు ప్రాంతాల నుంచి ఆరేళ్లుగా చీకటి వ్యాపారాన్ని యథేచ్ఛగా కొనసాగించింది. ఆరుగురు సభ్యులున్న ముఠాను సైబర్‌క్రైమ్, స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్‌ఓటీ) పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.40 లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నారు.

    గచ్చిబౌలిలోని కమిషనర్ కార్యాలయంలో సైబర్ క్రైమ్ ఏసీపీ జయరాంతో కలసి ఎస్‌ఓటీ ఓఎస్డీ రాంచంద్రారెడ్డి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కూకట్‌పల్లికి చెందిన దామర్ల వెంకట కృష్ణప్రసాద్, కల్లూరి కల్యాణ్ చక్రవర్తి, రావూరి దుర్గా శ్రీనివాస్, మాదాపూర్‌కు చెందిన మద్దుల సుబ్బమనోజ్ దీపక్, దేవసాని శ్రీనివాస్‌రెడ్డి, అల్వాల్‌కు చెందిన నరేష్ కుమార్ తన్నీరు ముఠాగా ఏర్పడ్డారు. వీరంతా ఉన్నత చదువులు చదివినవారే.

    అక్రమ మార్గంలో త్వరగా కోటీశ్వరులు కావాలనే ఉద్దేశంతో అంతర్జాతీయ ఫోన్ కాల్స్‌ను లోకల్ కాల్స్‌గా మార్చి, ఆరేళ్ల క్రితం చీకటి వ్యాపారాన్ని మొదలుపెట్టారు. ఈ మేరకు కూకట్‌పల్లి, అల్వాల్, మల్కాజ్‌గిరి ప్రాంతాలలో ఇళ్లను అద్దెకు తీసుకుని కావాల్సిన కంప్యూటర్లు, సెల్‌ఫోన్లు, సిమ్‌కార్డులు తదితర పరికరాలు సమకూర్చుకున్నారు. విదేశాల్లో బంధువులు ఉంటూ, నగరంలో నివాసముంటున్న వారే వీరి వినియోగదారులు. విదేశాలలో ఉన్న బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులతో తక్కువ ఖర్చుతో మాట్లాడాలనుకునే వారు ఈ ముఠాన సంప్రదిస్తారు.

    ఈ ముఠా సాంకేతిక పరిజ్ఞానం (వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్)తో ఇంటర్‌నేషనల్ ఫోన్ కాల్స్‌ను లోకల్ కాల్స్‌గా మార్చి కస్టమర్ల నుంచి డబ్బులు దండుకునే వారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న ఎస్‌ఓటీ, సైబర్‌క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగి వీరివ్యాపార స్థావరాలపై గురువారం అర్ధరాత్రి మెరుపుదాడులు చేశారు.

    ఈ దాడుల్లో రూ.40 లక్షల విలువైన నాలుగు ల్యాప్‌టాప్‌లు, ఐప్యాడ్, 11 సెల్‌ఫోన్లు, 281 సిమ్‌కార్డులు, 72 రూటర్స్, 16 వైర్‌లెస్ యాంటెన్నాలు, టెలికమ్యూనికేషన్ పరికరాలు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో టెలికాం శాఖకు వీరు సుమారు రూ.30 కోట్ల నష్టాన్ని కలిగించారని తేలింది. ఈ సమావేశంలో ఇన్‌స్పెక్టర్లు పుష్పన్‌కుమార్,  రాజశేఖరరెడ్డి, ఉమేందర్, వెంకట్‌రెడ్డి, గురురాఘవేందర్, ఎస్‌ఐలు రవి, ఆంజనేయులు పాల్గొన్నారు.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement