గుండెల నిండా హాయిగా గాలి పీల్చుకోవాలంటే భయం. మాస్కు లేకుండా ఇల్లు కదలాలంటే భయం, భయం శరీరాన్ని, మెదడుని ఆక్రమించిన కలుషిత గాలి ఇప్పుడు వ్యాధుల నుంచి బయటపడేసే సంజీవిని లాంటి యాంటీబయోటిక్స్ రెసిస్టెన్స్‌పై ప్రభావం చూపిస్తోంది. వాయు కాలుష్యంతో యాంటీబయోటిక్స్ పని చేయడం లేదని, ప్రపంచవ్యాప్తంగా ఈ కేసుల సంఖ్య పెరిగిపోతోందని తాజా అధ్యయనం హెచ్చరించింది.
ఢిల్లీకి చెందిన సమత వయసు 40 సంవత్సరాలు. ఒకరోజు హఠాత్తుగా శ్వాస తీసుకోవడం కష్టమైంది. ఆస్తమా అటాక్ అయింది. ఇంట్లో ఎవరికీ లేని ఆస్తమా ఎందుకొచ్చిందా అని ఆందోళనతో ఉంటే మందులు పని చెయ్యకపోవడంతో కుటుంబ సభ్యులు బెంబేలెత్తిపోయారు. చివరికి ఆస్పత్రిలో చేరితే వైద్యులు అతి కష్టమ్మీద ఆమె ప్రాణాలు కాపాడగలిగారు. దీనికంతటికీ కారణం వాయు కాలుష్యం. వాహనాలు, పరిశ్రమలు వెదజల్లే కాలుష్యం గాల్లో కలిసిపోయి మనుషుల ఊపిరితిత్తులు, గుండె, మెదడుకి పాకుతోంది.
వాయు కాలుష్యంతో శ్వాసకోశ సమస్యలు, గుండె వ్యాధులు, కేన్సర్, చివరికి ఆయుఃప్రమాణాలు క్షీణిస్తాయనే మనకి తెలుసు. ఇలాంటి ప్రాణాంతక వ్యాధులకు సంజీవనిలా ఉపయోగపడే యాంటీబయోటిక్స్ పని చేయకుండా వాయుకాలుష్యం చేస్తుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇది పెరిగిపోతే భవిష్యత్‌లో మనుషుల ప్రాణాలు ప్రమాదంలో పడతాయన్న ఆందోళనలున్నాయి.
కలుషిత గాలితో వచ్చే అనర్థాల్లో తాజాగా యాంటీబయోటిక్ నిరోధకత పెరిగిపోవడం ప్రమాద ఘంటికలు మోగిస్తోందని లాన్సెట్ హెల్త్ జర్నల్ అధ్యయనాన్ని ప్రచురించింది. చైనా, యూకేకు చెందిన శాస్త్రవేత్తలు వాయు కాలుష్యం ప్రభావాలపై వివిధ సంస్థలు సేకరించిన గణాంకాల ఆధారంగా యాంటీబయోటిక్స్ పనిచేయకపోవడం అతి పెద్ద పెనుముప్పుగా మారనుందని హెచ్చరించారు. 2000 నుంచి 2018 మధ్య కాలంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూరోపియన్ ఎని్వరాన్‌మెంట్ ఏజెన్సీ, వరల్డ్ బ్యాంక్ సహా 116 దేశాల డేటాను సేకరించి అధ్యయనం చేశారు.
► గాల్లోని సూక్ష్మాతి సూక్ష్మ ధూళి కణాలు పీఎం 2.5 వల్ల యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ పెరిగిపోతోంది. గాలిలో కాలుష్యం 10శాతం పెరిగితే యాంటీబయోటిక్‌ను నిరోధించే సామర్థ్యం 1.1% పెరుగుతోంది
► ప్రపంచవ్యాప్తంగా 703 కోట్ల మంది ప్రజలు పీఎం 2.5 దు్రష్పభావాలను ఎదుర్కొంటున్నారు.
► గాల్లో పీఎం 2.5 ధూళి కణాలు మనుషుల వెంట్రుక కంటే 30 రెట్లు చిన్న కణాలతో ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా యాంటీబయోటిక్ నిరోధకతను ఇవి ఎంత ప్రభావితం చూపిస్తున్నాయన్నది అర్థం చేసుకోవడం దుర్లభంగా మారింది.
► యాంటీబయోటిక్స్ పనిచెయ్యకపోవడానికి ప్రధాన కారణం వాటిని మితి మీరి వాడడం అయినప్పటికీ వాయు కాలుష్యమూ మనుషుల శరీరంలో యాంటీబయోటిక్ నిరోధక బ్యాక్టీరియాను పెంచుతోంది.
► ఆస్పత్రులు, వ్యవసాయ క్షేత్రాలు, వ్యర్థాల శుద్ధి ప్లాంట్లు వంటి వాటి నుంచి యాంటీబయోటిక్‌లు పని చెయ్యకుండా చేసే కలుషిత గాలి ఎక్కువగా వెలువడుతున్నట్టు అధ్యయనం వివరించింది.
ప్రాణం పోసే యాంటీబయోటిక్ ప్రాణమెలా తీస్తుంది?
యాంటీబయోటిక్స్‌ని మితి మీరి వాడకం వల్ల శరీరంలో సహజసిద్ధమైన రోగనిరోధక వ్యవస్థ దెబ్బతింటోంది. దీనివల్ల సూపర్ బగ్స్ ఏర్పడి మంచి బ్యాక్టీరియాను తినేస్తున్నాయి. ఫలితంగా వ్యాధులు సోకినప్పుడు మందులు వేసుకున్నా పని చేయకుండా పోతున్నాయి. యాంటీబయోటిక్స్ పని చెయ్యకపోవడం వల్ల ప్రస్తుతం ఏడాదికి లక్ష మంది మరణిస్తున్నారు. 2050 నాటికి ఈ కారణంతో ప్రపంచ దేశాల్లో అత్యధికమరణాలు సంభవించే ముప్పు ఉంది.
Comments
Please login to add a commentAdd a comment