World Health Organization
-
ఇక ఎయిడ్స్‌కు చరమగీతం!
ఒకప్పుడు మశూచి వ్యాధి బారిన పడి లక్షలమంది మరణించేవారు. అలాగే ప్లేగ్ వ్యాధితో కూడా! అలాంటి భయంకరమైన రోగాలు ఇప్పుడు కలికానికి కూడా లేవు. దీనికి కారణాలు ఆ రోగాలను మట్టుబెట్ట డంలో జరిగిన నిరంతర కృషి.1980వ దశకంలో ఎయిడ్స్ అంటే మరణం. దీని బారిన పడినవారు బతికి ఉన్నా, చచ్చినవారితో సమానం అన్నట్టుగా సమాజం పరిగణించిన రోజులు అవి. హెచ్ఐవీ పాజిటివ్ అని తెలియ గానే గుండెలో బండ పడినట్లే భావించి మానసికంగా మరణా నికి చేరువయ్యేవారు. ఎయిడ్స్ తాకిడికి అమెరికా లాంటి అగ్ర దేశాలు కూడా విలవిలలాడి పోయాయంటే అప్పట్లో ఈ వ్యాధి కలిగించిన భయోత్పాతాన్ని అర్థం చేసుకోవచ్చు. అది ఆనాటి ముఖచిత్రం. ఈనాడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మందే లేదనుకున్న ఈ వ్యాధికి తగిన మందులు లభిస్తున్నాయి. ఇప్పుడు ఎయిడ్స్ ఒక దీర్ఘకాలిక వ్యాధి మాత్రమే! ఎయిడ్స్‌కు గురి కాకుండా ఎలాగూ కాపాడుకోవచ్చు. ఒకవేళ వచ్చిందని తెలిసినా, 72 గంటల లోపు పోస్ట్ ప్రొఫలాక్సిస్ మందులు వాడి దాని బారి నుంచి బయటపడవచ్చు. తొమ్మిదేళ్ల క్రితమే క్యూబాలో హెచ్ఐవీ ఎయిడ్స్, సిఫిలిస్ వ్యాధులను పూర్తిగా తుడిచి పెట్టారు. తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఎయిడ్స్ గురించి భయపడాల్సిన అవసరం ఇక ఎంత మాత్రం లేదని, గట్టిగా ప్రయత్నిస్తే, మొత్తం ప్రపంచానికి ఎయిడ్స్ నుంచి విముక్తి కలిగించవచ్చనే గట్టి సందేశాన్ని ఆ దేశం ప్రపంచ దేశాలకు పంపింది. ఎయిడ్స్ పాజిటివ్ దంపతులు నేడు చికిత్స తీసుకొని, ఆ వ్యాధి లక్షణాలు లేని, ఆరోగ్యవంతమైన పిల్లలను కనవచ్చు. హెచ్ఐవీ పాజిటివ్ వాళ్ళు... ఆ వ్యాధి సోకని వాళ్ళను నిక్షేపంగా వివాహం చేసు కొని, ఎలాంటి భయ సంకోచాలూ లేకుండా హాయిగా కాపు రాలు చేసుకోవచ్చు. అనేక శాస్త్రీయ పరిశోధనల పుణ్యమా అని అలాంటి చికిత్సా పద్ధతులు, ఈనాడు సామాన్యులకు సైతం అందుబాటులోకి వచ్చాయి. బీపీ, షుగర్ బాధితులు అతి తక్కువ ఖర్చుతో ప్రతి రోజూ క్రమం తప్పకుండా మాత్రలు వాడుతూ ఆరోగ్యంగా సాధారణ జీవితం గడుపున్న మాదిరిగానే, ఎయిడ్స్ రోగులు కూడా 30 రూపాయలు ఖరీదు చేసే ఒక్క మాత్రను క్రమం తప్పకుండా రోజూ వేసుకుంటూ, తగు విశ్రాంతి, పోషకా హారం తీసుకుంటూ క్రమశిక్షణతో జీవితం గడిపితే, 80 ఏళ్ల వయస్సు వచ్చే వరకు ఆరోగ్యంగా, ఆనందంగా, ఉల్లాసంగా జీవించవచ్చు. ఈ విషయాన్ని ప్రఖ్యాత వైద్య జర్నల్ ‘లాన్ సెట్’, ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిశోధక బృందం, పలు అధ్య యన సంస్థలు అధికారికంగా ప్రకటించాయి.వైద్యపరంగా ఇంతటి భరోసా లభిస్తున్నా, ఎయిడ్స్ రోగులు మానసికమైన భయాందోళనలతో చికిత్సకు దూరంగా ఉంటూ అల్లాడిపోతున్నారు. రోజువారీ వాడాల్సిన మాత్రలు తమ దగ్గర ఉంటే పక్కవారికి తెలిస్తే, పరువు పోతుందనే భయంతో సక్రమంగా వాడకుండా కోరి ప్రమా దాన్ని తెచ్చి పెట్టుకుంటున్నారు. ఇంత ప్రగతి సాధించినా ఇప్పటికీ సామాన్యులే కాక, విద్యాధికులైన హెచ్ఐవీ రోగులు కూడా అపోహలు, మూఢ నమ్మకాలతో శాస్త్రీయంగా ఎలాంటి నిర్ధారణ కాని పొడులు, కషాయాలతో వ్యాధిని మరింత ముదరబెట్టుకొంటున్నారు. కొందరు పాము విషం తీసుకుంటే ఈ వ్యాధి తగ్గిపోతుందనే ప్రచారాలు నమ్మి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి.ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ డిసెంబర్ ఒకటవ తేదీ ప్రపంచ ఎయిడ్స్ దినం కోసం ‘అందరం కలసి శ్రమిద్దాం– ఎయిడ్స్‌ను నిరోధిద్దాం‘ అన్న నినాదాన్ని ప్రకటించింది. 2030 నాటికి ఎయిడ్స్ లేని ప్రపంచాన్ని సృష్టించడానికి, ఆధునిక చికిత్సా పద్ధతులపై ప్రజల్లో అవగాహన పెంచాలని సంకల్పించింది. హెచ్ఐవీ ఎయిడ్స్ వ్యాధి నూటికి నూరుపాళ్ళు నివారించే వీలున్న వ్యాధి కనుక నిరంతరం దీనిపై ప్రజల్లో అవ గాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండాలి. ఆత్మహత్యల నిరోధానికి కౌన్సెలింగ్ ఇస్తున్న తరహాలోనే ప్రజలకు అందుబాటులో ఎయిడ్స్ కౌన్సెలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఒక టోల్ ఫ్రీ నంబరుతో రోగులకు, సలహాలు, సూచనలు ఇచ్చే కార్యక్రమం చేపడితే మరిన్ని సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. తామెవరు అన్నది పైకి తెలిసే అవకాశం ఉండదు కనుక రోగులు నిర్భయంగా, ఎలాంటి సంకోచమూ లేకుండా వైద్యులను సంప్రతించి సక్రమంగా చికిత్స తీసుకునే వీలుంటుంది. నిర్మూలనకు మంచి అవకాశాలు ఉన్న ఎయిడ్స్ వ్యాధి ముప్పును ప్రపంచానికి పూర్తిగా తప్పించాలంటే కలసికట్టు కృషి అవసరం. ప్రభుత్వ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, వైద్యులు పరస్పర సహకారంతో ప్రజల్లో, ప్రత్యేకించి ఎయిడ్స్ బాధితుల్లో చక్కటి అవగాహన కల్పించే ప్రయత్నాలు నిరంతరం చేయగలిగితే... మశూచి, ప్లేగు వ్యాధుల మాదిరిగానే అతి త్వరలోనే ఎయిడ్స్ అనే భయంకర రోగాన్ని ప్రపంచం నుంచి తరిమివేయడం అసాధ్యం ఏమీ కాదు. అలాంటి శుభ దినం త్వరలోనే రాగలదని ఆశిద్దాం. డా‘‘ కూటికుప్పల సూర్యారావు వ్యాసకర్త ‘పద్మశ్రీ’ పురస్కార గ్రహీత, అంతర్జాతీయ ఎయిడ్స్ నివారణ సంస్థ సభ్యులు ‘ 93811 49295(నేడు ప్రపంచ ఎయిడ్స్ దినం) -
లక్ష్య సాధన కోరుతున్న చిత్తశుద్ధి
కొన్ని నివేదికలు, గణాంకాలు పాలకులైనా, ప్రజలకైనా గట్టి మేలుకొలుపులు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఇటీవల విడుదల చేసిన ‘ప్రపంచ క్షయవ్యాధి (టీబీ) నివేదిక’ అలాంటిదే. ప్రపంచవ్యాప్త టీబీ కేసుల్లో 26 శాతం భారత్‌లోనే ఉన్నాయట! ఒక్క గడచిన 2023లోనే మన దేశంలో 25.5 లక్షల కొత్త టీబీ కేసులు నమోదయ్యాయి. 1960లలో టీబీపై నియంత్రణకు ఉపక్రమించినప్పటి నుంచి ఇప్పటి దాకా ఇది అత్యధికం. ఇది మన మత్తు వదిలించే మాట. దానికి తోడు పలు ఔషధాలకు లొంగకుండా తయారైన టీబీ (మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ – ఎండీఆర్ టీబీ) సరికొత్త ప్రజారోగ్య సంక్షోభంగా తయారైంది. ఆ కేసులూ మన దేశంలోనే ఎక్కువన్న సంగతి ఆందోళన కలిగిస్తోంది. పేరుకు 85 శాతానికి పైగా టీబీ రోగులకు చికిత్స చేరువైనా, ఖరీదైన మందులతో సామాన్యుల ఇల్లు, ఒళ్ళు గుల్లవుతున్నాయి. దాదాపు 20 శాతం మంది రోగులు తమ వార్షికా దాయంలో 20 శాతం పైగా ఈ చికిత్సకే ఖర్చు చేస్తున్నారట. దీనికి తోడు కొన్నేళ్ళుగా టీబీ నియంత్రణ నిధులు కూడా 13 లక్షల డాలర్ల మేర తగ్గడం శోచనీయం. ఈ చేదు నిజాలన్నీ అత్యవసర చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని మన ప్రభుత్వాలకు గుర్తు చేస్తున్నాయి. గడచిన 2023 లెక్కల ప్రకారం భారత్‌లో దాదాపు 27 లక్షల టీబీ కేసులున్నట్టు అంచనా. వాటిలో 25.1 లక్షల మంది రోగులు మందులు వాడుతున్నారు. అలా చూస్తే టీబీ సోకినవారిలో నూటికి 85 మందికి పైగా చికిత్స పొందుతూ ఉండడం చెప్పుకోదగ్గ విషయమే. నిరుడు అత్యధిక కేసులు నమోదైన సంగతి పక్కన పెడితే... గత ఎనిమిదేళ్ళలో భారత్‌లో టీబీ కేసులు 18 శాతం తగ్గినట్టు డబ్ల్యూహెచ్ఓ చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా 8 శాతం మేర కేసులు తగ్గితే, భారత్‌లో అంతకు రెట్టింపు కన్నా ఎక్కువగా కేసులు తగ్గాయట. సంతోషకరమే. కానీ, అది సరిపోతుందా అన్నది ప్రశ్న. 2025 నాటి కల్లా దేశంలో టీబీ లేకుండా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న భారత్ అనుకున్నది సాధించాలంటే ఇది సరిపోదన్నది నిపుణులు తేల్చిచెబుతున్న నిష్ఠురసత్యం. వ్యాధి నిర్ధారణ పరీక్షల వసతుల్ని మరింత మెరుగుపరచడమే కాక, నిధుల కొరతను తీర్చడం, మరింత మందికి చికిత్స అందించడం లాంటివి చేసినప్పుడే టీబీ నిర్మూలన లక్ష్యం వైపు అడుగులు వేయగలం. ఈ వ్యాధిని కేవలం ఆరోగ్య సమస్యగానే చూడలేం. దారిద్య్రం, పౌష్టికాహార లోపం, అంతంత మాత్రపు ఆరోగ్య వసతులు లాంటి సామాజిక – ఆర్థిక కారణాలూ ఇది ముదరడానికి కారణమని విస్మరించలేం. నిజానికి, గత ఆరు దశాబ్దాల కాలంలో మన దేశంలో టీబీ నిర్మూలన కార్యక్రమం కింద లబ్ధి పొందిన రోగుల సంఖ్య తక్కువేమీ కాదు. ఆ సంఖ్య పెరుగుతోంది. అయితే, ఆర్థికంగా బాగా వెనుక బడినవారికి అందుతున్న సాయం ఇప్పటికీ అంతంత మాత్రమే. టీబీ సోకినవారిలో అయిదోవంతు కన్నా ఎక్కువ మందికి సాయం అందడం లేదని ప్రభుత్వ గణాంకాలే ఒప్పుకుంటున్నాయి. అంత కన్నా విషాదం ఏమిటంటే, టీబీ నిర్మూలన లక్ష్యం గురించి పైకి గొప్పగా చెబుతున్నా, తీరా ఆచ రణలో అందుకు కేటాయించాల్సిన నిధుల్ని గణనీయంగా తగ్గించేస్తూ ఉండడం. లెక్క తీస్తే, 2019లో మన దేశంలో ఈ నిర్మూలన కార్యక్రమానికి 43.26 కోట్ల డాలర్ల కేటాయింపులు ఉండేవి. తీరా గడచిన 2023కు వచ్చేసరికి ఆ నిధుల మొత్తాన్ని 30.28 కోట్ల డాలర్లకు తగ్గించేశారు. ఆలోచనకూ, ఆచరణకూ మధ్య ఉన్న ఈ వ్యత్యాసాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇది అచ్చంగా ‘దుత్తలో కూడు దుత్తలోనే ఉండాలి. చంకలో పిల్లాడు మాత్రం దుడ్డులా ఉండాల’న్నట్టుగా ఉంది. ఇప్పటికైనా దిద్దుబాటు చర్యలు చేపట్టాలంటున్నది అందుకే. పైగా, కరోనా అనంతరం, గత ఏడాది ఒక్కసారిగా అన్ని కొత్త టీబీ కేసులు ఎందుకు నమోదయ్యాయో లోతుగా అధ్యయనం చేయాలి. టీబీని నిర్మూలన లక్ష్యం గొప్పదే అయినా అందుకు సవాళ్ళూ అనేకం. ప్రభుత్వం అందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలి. కృతనిశ్చయంతో ఉన్నా ప్రజల్లో ఈ వ్యాధిపై తగినంత చైతన్యం తీసుకు రాలేకపోతున్నారు. మనకున్న వైద్య వసతులూ అంతంత మాత్రమే. ఇక, పౌష్టికాహార లోపం సైతం టీబీ నిర్మూలనకు పెను అవరోధంగా మారింది. కేవలం పౌష్టికాహార లోపం వల్లనే ఏటా వయోజ నుల్లో 35 నుంచి 45 శాతం మేర కొత్త టీబీ కేసులు వస్తున్నాయని నిరుడు ‘లాన్సెట్’ నివేదిక ఒకటి స్పష్టం చేయడం గమనార్హం. అలాగే, సరిగ్గా మందులు వాడకపోవడం వల్ల కీలక ఔషధాలకు పని చేయకుండా పోయిన ఎండీఆర్–టీబీ కేసుల్లోనూ కేవలం 44 శాతమే తగిన చికిత్సకు నోచుకుంటున్నాయి. అదీ మరింత ఖరీదైన, విషతుల్యమైన వాటిని దీర్ఘకాలం వాడాల్సిన అగత్యం ఏర్పడుతోంది. ఈ సవాళ్ళను అధిగమించడానికి చర్యలు చేపట్టడం అవసరం. అందుకు క్రియాశీలకంగా వ్యవహరిస్తూ, కొత్తగా ఆలోచించక తప్పదు. సరికొత్త వైద్యవిధానాల్ని ఆశ్రయించడమూ ముఖ్యమే.ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకాన్ని టీబీ రోగులకు, మరీ ముఖ్యంగా ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉన్నవారికి వర్తించేలా చేయాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఇది మంచి సూచనే. దేశంలో టీబీ నిర్మూలనకు ఇది దీర్ఘకాలంలో బాగా ఉపకరించే ఆలోచన. రోగుల విషయంలో వ్యక్తి కేంద్రితంగా సమగ్ర వైఖరిని అవలంబించాలని శాస్త్రవేత్తలు చెబుతున్న మాటకు చెవి ఒగ్గాలి. అలాగే, ఫార్మసీ రంగాన్ని పెద్ద ఆదాయ వనరుగా చూస్తున్న పాలకులు వైద్య, ఆరోగ్య రంగంలో కీలకమైన పరిశోధనలకూ, కొత్త ఔషధాలు, చికిత్సలకూ ఏపాటి ప్రోత్సాహమిస్తున్నారు? గణనీయంగా నిధులు కేటాయించి, సమన్వయంతో కృషి చేస్తేనే మన దేశంలో టీబీ నివారణ అయినా, నిర్మూలనైనా సాధ్యమవుతుంది. మానవాళిని పట్టిపీడిస్తున్న ప్రాణాంతక వ్యాధులను సమర్థంగా ఎదుర్కోవాలంటే,ప్రపంచ దేశాలన్నీ కలసికట్టుగా నిలబడడమే మార్గం. -
మొబైల్ ఫోన్‌తో బ్రెయిన్ క్యాన్సర్ రాదు
న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్ వినియోగిస్తే బ్రెయిన్ క్యాన్సర్ సోకుతుందున్న ఆందోళన ప్రపంచవ్యాప్తంగా చాలా ఏళ్లుగా ఉంది. అయితే, ఇది అపోహ మాత్రమేనని, ఎంతమాత్రం నిజం లేదని అధ్యయనాలు చెబుతున్నాయి. ఫోన్‌కు, బ్రెయిన్ క్యాన్సర్‌కు మధ్య ఎలాంటి సంబంధం లేదని పేర్కొంటున్నాయి. ఈ అంశంపై జరిగిన 5 వేలకుపైగా అధ్యయనాలను ఆ్రస్టేలియన్ రేడియేషన్ ప్రొటెక్షన్, న్యూక్లియర్ సేఫ్టీ ఏజెన్సీ(అర్పాన్సా) ఆధ్వర్యంలో అంతర్జాతీయ పరిశోధకుల బృందం నిశితంగా సమీక్షించింది. ఇందులో 63 అధ్యయనాల వివరాలు 1994 నుంచి 2022 వరకు వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. గత రెండు దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా వైర్లెస్ టెక్నాలజీ వినియోగం విపరీతంగా పెరిగింది. కానీ, బ్రెయిన్ క్యాన్సర్ కేసులు మాత్రం పెరగలేదని పరిశోధకులు గుర్తించారు. అధ్యయనాల్లో తేలిన ఫలితాల ఆధారంగా వారు ఈ నిర్ధారణకు వచ్చారు. ఇది తగిన సాక్ష్యాధారాల ఆధారంగా జరిగిన చాలా సమగ్రమైన విశ్లేషణ అని చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) సూచనతో జరిగిన ఈ విశ్లేషణ వివరాలను ఎన్విరాన్మెంట్ ఇంటర్నేషనల్ పత్రికలో ప్రచురించారు. ఫోన్ వాడకంతో తలకు, మెడకు సైతం క్యాన్సర్ సోకుతున్నట్లు ఆధారాలు లేవని వెల్లడించారు. ఒక వ్యక్తి మొబైల్ ఫోన్‌ను పదేళ్లు, అంతకంటే ఎక్కువ కాలం ఉపయోగిస్తే బ్రెయిన్ క్యాన్సర్ సోకుతుందని చెప్పలేమని స్పష్టంచేశారు. సాధారణంగా ఫోన్ల నుంచి రేడియో తరంగాలు వెలువడుతాయన్న సంగతి తెలిసిందే. ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని మాట్లాడుతుంటాం కాబట్టి బ్రెయిన్ క్యాన్సర్ సోకుతుందన్న ప్రచారం దశాబ్దాల క్రితమే మొదలైంది. దీనిపై ప్రజల్లో రకరకాల భయాందోళనలు ఉన్నాయి. ఇదిలా ఉండగా, ఫోన్ల నుంచి వెలువడే రేడియో తరంగాల వల్ల బ్రెయిన్ క్యాన్సర్ వస్తుందంటూ కొన్ని అధ్యయనాలు సైతం చెప్పాయి. 2011లో డబ్ల్యూహెచ్ఓ అనుబంధ విభాగమైన ఇంటర్నేషన్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్(ఐఏఆర్సీ) సైతం ఇదే విషయం వెల్లడించింది. అయితే, ఈ సంస్థ చాలా పరిమితమైన సమాచారంపై ఆధారపడి ఈ నిర్ధారణకు వచ్చిందని, సమగ్రమై అధ్యయనం చేయలేదని అంతర్జాతీయ పరిశోధకులు తాజాగా తేలి్చచెప్పారు. ఫోన్లతో క్యాన్సర్లు వస్తాయన్న ఆపోహ వీడాలని సూచించారు. -
Israel-Hamas war: గాజాకు 3 రోజుల ఊరట
లండన్: గాజాపై దాడులకు ఇజ్రాయెల్ తాత్కాలిక విరామం ఇచి్చంది. గాజాలో పోలియో వ్యాక్సిన్ డ్రైవ్ కోసం ఇజ్రాయెల్ ఇందుకు అంగీకారం తెలిపిందని ఐరాస ప్రకటించింది. పాతికేళ్ల తరవాత గాజాలో ఓ బాలుడిలో పోలియో వ్యాధిని గుర్తించారు. దీని నివారణకు పిల్లలకు టీకా డ్రైవ్ నిర్వహించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నిర్ణయించింది. దాంతో ఇజ్రాయెల్ ‘మానవతా విరామం’ఇచ్చినట్టు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ఈ నేపథ్యంలో ఆదివారం నుంచి మూడు రోజుల పాటు ఉదయం ఆరింటి నుంచి మధ్యాహ్నం మూడింటి దాకా యుద్ధవిరామం ఉండనుంది. ఇది విరామమే తప్ప కాల్పుల విరమణ కాదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. మూడు దశల్లో డ్రైవ్... గాజా స్ట్రిప్ అంతటా సుమారు 6.4 లక్షల మంది పిల్లలకు టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు డబ్ల్యూహెచ్ఓ సీనియర్ అధికారి రిక్ పీపర్కోర్న్ తెలిపారు. డబ్ల్యూహెచ్ఓ, యునిసెఫ్, యూఎన్ఆర్డబ్ల్యూఏ సహకారంతో పాలస్తీనా ఆరోగ్య శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఇది గాజా మధ్య, దక్షిణ, ఉత్తర భాగాల్లో మూడు దశల్లో జరుగుతుంది. గాజాలో ఇప్పటికే 12.6 లక్షల ఓరల్ పోలియో వ్యాక్సిన్ టైప్ 2 (ఎన్ఓపీవీ 2) డోసులున్నాయి. త్వరలో మరో 4 లక్షల డోసులు రానున్నాయి. వ్యాక్సిన్ ఇచ్చేందుకు 2,000 మందికి పైగా హెల్త్ వర్కర్లకు శిక్షణ ఇచ్చారు. గాజా లోపల వైరస్ వ్యాప్తిని నివారించడానికి స్ట్రిప్ అంతటా 90% వ్యాక్సిన్ కవరేజీ సాధించాలని డబ్ల్యూహెచ్ఓ భావిస్తోంది. అందుకోసం అవసరమైతే మరో రోజు యుద్ధవిరామానికి ఇజ్రాయెల్‌తో ఒప్పందం కుదిరింది. గాజాలో 2022లో 99% పోలియో వ్యాక్సినేషన్ డ్రైవ్ జరిగింది. గతేడాది 89%కి తగ్గింది. యుద్ధం వల్ల వ్యాక్సిన్ వేయక అధిక సంఖ్యలో పిల్లలు పోలియో బారిన పడే ప్రమాదముందని పాలస్తీనా ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో గాజా స్ట్రిప్‌లోని 6.5 లక్షలకు పైగా పాలస్తీనా బాలలను రక్షించడానికి అంతర్జాతీయ సంస్థలతో సహకరించేందుకు సిద్ధమని హమాస్ కూడా తెలిపింది. -
అప్పుడు కరోనా.. ఇప్పుడు డెంగీ
సాక్షి, హైదరాబాద్: కరోనా ప్రపంచాన్ని వణికించింది. దాని బారిన పడి లక్షలాది మంది మృత్యువాతపడ్డారు. కోట్లాది మంది ఆసుపత్రులపాలయ్యారు. అనేక కుటుంబాలను కోవిడ్ ఛిన్నా భిన్నం చేసింది. అటువంటి వైరస్ పీడ విరగడైంది. కానీ కరోనా తర్వాత ఇప్పుడు డెంగీ... భారత్ సహా దక్షిణా సియా దేశాలను వణికిస్తోంది. డెంగీ ప్రాణాంతకమై నదిగా పరిణమించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇంటెలిజెన్స్ నివేదిక హెచ్చరించింది. ఈ మేరకు తాజాగా నివేదిక విడుదల చేసింది. మొత్తం 47 రకాల జబ్బులపై పరిశోధన చేసి వాటిపై నివేదిక రూపొందించింది. అందులో ఎక్కువ ప్రమాదకరంగా ఉన్న మొదటి 10 వ్యాధుల పేర్లను విడుదల చేసింది. అందులో భారత్‌లో డెంగీ, నిఫా, పోలియో, డిప్తీరియా, జికా వైరస్, ఫుడ్ పాయిజనింగ్, రేబిస్ వంటివి ఉన్నాయని పేర్కొంది.ప్రజారోగ్యానికి ముప్పుగా ఉన్న వాటిల్లో అంటువ్యాధులు 80 శాతం, ప్రకృతి వైపరీత్యాలు 3 శాతం, రసాయన పరమైనవి 1 శాతం, మిగిలినవన్నీ కలిపి 16 శాతంగా ఉన్నాయి. అంటువ్యాధులే ప్రధానంగా ప్రజారోగ్యానికి పెనుసవాళ్లుగా ఉన్నాయని పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసే బులెటిన్లలో కోవిడ్ తర్వాత డెంగీపైనే అత్యధికంగా అలర్ట్ బులెటిన్లు విడుదలయ్యాయి. ఆ తర్వాత ఎబోలా ఉందని వెల్లడించింది. 2023లో ఇండియాలో మళ్లీ కలరా కేసులు వెలుగుచూశాయని తెలిపింది. డెంగీ, కలరా విజృంభి స్తున్నాయనీ... జాగ్రత్తగా ఉండాలని... మౌలిక సదుపాయాలు మెరుగుపరుచుకోవాలని సూచించింది.దక్షిణాసియాలో డెంగీనే ప్రమాదకరంభారత్ వంటి దేశాల్లో డెంగీ వల్ల ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. దక్షిణాసియా రీజియన్‌లో డెంగీనే ప్రధానమైనదిగా పరిణమించిందని పేర్కొంది. బంగ్లాదేశ్‌లో 2002తో పోలిస్తే 2023లో డెంగీ కేసులు 4.8 రెట్లు పెరిగాయి. అక్కడ మరణాలు 9.3 రెట్లు పెరిగాయి. అలాగే థాయ్‌లాండ్‌లో కేసులు 2.3 రెట్లు పెరగ్గా మరణాలు 2.5 రెట్లు పెరిగాయి. వాతావరణ మార్పులు, అకాల వర్షాలు, ఎండలు... తదితర కారణాల వల్ల కూడా డెంగీ ముప్పు పెరుగుతోంది. ఎప్పుడు వర్షాలు కురుస్తా యో.. ఎప్పుడు తీవ్రమైన ఎండలు ఉంటా యో తెలియని పరిస్థితి నెలకొంటోంది. దీనివల్ల అందుకు అవసరమైన ఏర్పా ట్లు కూడా సరిగ్గా చేసే పరిస్థితి ఉండటంలేదు. ఆకస్మిక ఉష్ణోగ్రతల వల్ల కూడా దోమల సంతతి వృద్ధి చెందుతోంది. మరోవైపు పట్టణీ కరణ పెరగడంతో డెంగీ వ్యాప్తి చెందుతోంది. నగరీకరణ వల్ల జనం గుంపులుగా ఉండటం... నీటి నిల్వ, మౌలిక సదు పాయాలు లేకపోవడం, నిర్మా ణాలు ఎక్కువకావడం...తదితర కారణాలతో డెంగీ త్వరగా పాకుతోంది. డెంగీ ఒకసారి మొదలైతే అది సులువుగా వ్యాపిస్తుంది.27 దేశాల్లో ఇన్ఫెక్షన్ వ్యాధులుసోమాలియా, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ సహా 27 దేశాల్లో ఇన్ఫెక్షన్ వ్యాధులు వస్తున్నాయి. ప్రకృతి వైపరీత్యాలతో మయన్మార్, సూడాన్ సహా 10 దేశాలు ప్రజారోగ్యంలో సమస్యాత్మకంగా ఉన్నా యి. సామాజిక సమస్యల కారణంగా ప్రజారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న దేశాలు కెమరూన్, మయన్మార్, సిరియా. కాగా, ఇన్‌ఫ్లూయెంజా కేసు లు బంగ్లాదేశ్‌లో 2023 ఆగస్టులో, థాయ్‌లాండ్‌లో అక్టోబర్‌లో వెలుగుచూశాయి. నిఫా వైరస్ కేసులు బంగ్లాదేశ్, కేరళలో 2023లో నమోదయ్యాయి. 2023లో కేరళలో ఆరు నిఫా కేసులు నమోదు కాగా రెండు మరణాలు సంభవించాయి. థాయ్‌లాండ్, ఇండోనేసియాల్లో మంకీఫాక్స్ కేసులు నమోదయ్యాయి.ఇంకా ఆ సంస్థపైనే ఆధారం.. ఏదైనా ప్రజారోగ్య సమస్య తలెత్తితే వాటిని ముందస్తుగా గుర్తించడంలో భారత్ సహా అభివృద్ధి చెందుతున్న దేశాలు వెనుక బడుతున్నాయి. ఆయా దేశాల్లోని ప్రజా రోగ్య సంస్థలు ప్రమాదాన్ని పసిగట్టడంలేదు. 2004–08 మధ్య ఇండియా వంటి దేశాల్లో ప్రజారోగ్య సమస్యలు తలెత్తితే వాటిలో 93 శాతం మొదటగా గుర్తించి అలర్ట్ చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థే. అలాగే 2009–13 మధ్య 63 శాతం, 2014–18 మధ్య కాలంలో 84 శాతం, 2019–23 వరకు 91 శాతం ప్రపంచ ఆరోగ్య సంస్థే వాటిని గుర్తించి అప్రమత్తం చేసింది. అమెరికా వంటి దేశాల్లో సగటున 60–70 శాతం వరకు సంఘటనలను ఆయా స్థానిక ప్రభుత్వాలే గుర్తించి అలర్ట్ అవుతున్నాయి. కానీ మనలాంటి దేశాల్లో అటువంటి వ్యవస్థ నేటికీ లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక వెల్లడించింది.ఇద్దరిలో ఒకరికి డెంగీ రిస్క్ప్రపంచంలో 2022తో పోలిస్తే 2023లో కోవిడ్ మరణాలు 90 శాతం తగ్గాయి. అయితే ఇప్పుడు భారత్‌లో డెంగీ వ్యాప్తి పెరిగింది. దేశంలో నిర్మాణాలు జరుగుతున్న 6 శాతం ప్రాంతాల్లో డెంగీ వ్యాప్తి జరుగుతోందని గుర్తించారు. వలసల వల్ల కూడా డెంగీ వ్యాప్తి విస్తరిస్తోంది. వాతావరణ మార్పుల కారణంగా భవిష్యత్తులోనూ ప్రజారోగ్య సమస్యలు పెరుగుతాయని, ప్రజారోగ్య వ్యవస్థను మెరుగుపరుచుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. డెంగీకి వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం పరిశోధన దశలో ఉంది. – డాక్టర్ కిరణ్ మాదల, గాంధీ మెడికల్ కాలేజీ, హైదరాబాద్ -
Monkeypox: మరో మహమ్మారి.. !
కోవిడ్ మహమ్మారి సృష్టించిన మహావిలయం నుంచి ప్రపంచం పూర్తిగా తేరుకోకముందే ఎంపాక్స్ రూపంలో మరో వైరస్ భూతం భూమండలాన్ని చుట్టేస్తోంది. తొలుత ఆఫ్రికా దేశాలకే పరిమితమైన ఈ వైరస్ తాజాగా రూపాంతరాలు చెంది ప్రాణాంతకంగా పరిణమించింది. ఆఫ్రికాలో ఇన్నేళ్లలో వందలాది మంది మరణాలతో ప్రపంచదేశాలు ఇన్నాళ్లకు అప్రమత్తమయ్యాయి. నిర్లక్ష్యం వహిస్తే మరో మహమ్మారిని స్వయంగా ఆహా్వనించిన వారమవుతామని దేశాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా హెచ్చరికలు జారీచేసింది. ఈ మేరకు బుధవారం ఆరోగ్య అత్యయిక స్థితిని ప్రకటించింది. ఆఫ్రికా ఖండాన్ని దాటి వేరే ఖండాల దేశాల్లోనూ వేగంగా వ్యాపిస్తుండటంతో 2022 ఏడాది తర్వాత తొలిసారిగా డబ్ల్యూహెచ్ఓ ‘గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ’ని ప్రకటించింది. గత ఏడాదితో పోలిస్తే ఆఫ్రికాలో ఈ 7 నెలల్లో∙15,600 కేసులు నమోదయ్యాయి. 537 మంది ఎంపాక్స్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. తాజాగా స్వీడన్, పాకిస్థాన్‌లకూ వైరస్ పాకింది. ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తి, కట్టడి, నివారణ చర్యలుసహా వ్యాధి పుట్టుపూర్వోత్తరాలను ఒకసారి తెల్సుకుందాం. ఏమిటీ ఎంపాక్స్ వైరస్? 1958లో తొలిసారిగా కోతుల్లో ఈ వైరస్‌ను కనుగొన్నారు. అందుకే ఈ వైరస్‌కు మంకీపాక్స్ పేరు స్థిరపడిపోయింది. అప్పట్లో పరిశోధన కోసం డెన్మార్క్‌కు తరలించిన కోతుల్లో కొత్త రకం వ్యాధి లక్షణాలు కనిపించడంతో ల్యాబ్ పరీక్షలు జరిపి ఈ వైరస్ ఉనికి కనిపెట్టారు. 1970లో కాంగో దేశంలో తొమ్మిదేళ్ల బాలుడికి ఈ వైరస్ సోకడంతో తొలిసారిగా మనుషుల్లో ఈ వైరస్‌ను గుర్తించారు. మనుషులు, చిట్టెలుకలకూ వైరస్ సోకడంతో ‘మంకీ’పాక్స్‌కు బదులు ఎంపాక్స్ అనే పొట్టిపేరును ఖరారుచేశారు. ఆర్థోపాక్స్ వైరస్ రకానికి చెందిన ఎంపాక్స్ సోకితే చర్మం ఎర్రగా మారి పొక్కులు వస్తాయి. సొన చేరి పొక్కులు ఇబ్బంది పెడతాయి. దశాబ్దాల క్రితం లక్షలాది మందిని పొట్టనబెట్టుకున్న మశూచి వ్యాధికి కారణమైన వైరస్, ఎంపాక్స్ ఒకే జాతికి చెందినవి. గోవులకు సోకే గోమశూచి, వసీనియా వంటి వ్యాధులను కల్గించే వైరస్ కూడా ఈ రకానిదే. వైరస్ ఎలా సోకుతుంది? → అప్పటికే వైరస్ సోకిన మనుషులు లేదా జంతువులను తాకినా, వారితో దగ్గరగా గడిపినా వైరస్ సోకుతుంది. → కుక్క లేదా ఇతరత్రా పెంపుడు జంతువులకు వైరస్ సోకితే అవి మనుషులను కరిచినా, తాకినా, వాటి లాలాజలం, రక్తం, ఇతర స్రావాలు అంటుకున్నా వైరస్ సోకుతుంది. → చర్మంపై గాయాలు, శరీర స్రావాలు, తుమ్మినపుడు పడే తుంపర్లు, నోటి లాలాజలం ఇలా వైరస్‌కు ఆవాసయోగ్యమైన ప్రతి తడి ప్రాంతం నుంచి వైరస్ సోకుతుంది → ఎక్కువసేపు ముఖాన్ని ముఖంతో తాకినా, ముద్దుపెట్టుకున్నా సోకొచ్చు → రోగి వాడిన దుస్తులు, వస్తువులను ముట్టుకున్నా, వాడినా వైరస్ సోకే అవకాశాన్ని కొట్టిపారేయలేం వేటి ద్వారా వ్యాధి వ్యాపిస్తుంది? రోగి వినియోగించిన దుస్తులు, మంచం, టవల్స్, పాత్రలు సాధారణ వ్యక్తి వాడితే అతనికీ వైరస్ వస్తుం లాలాజలం తగిలినా, కరచాలనం చేసినా సోకుతుంది. తల్లి నుంచి బిడ్డకు వైరస్ సంక్రమించవచ్చు. కొత్తగా ఏఏ దేశాల్లో విస్తరించిందికొత్తగా 13 ఆఫ్రికా దేశాల్లో వేగంగా విస్తరిస్తోందని గత వారం గణాంకాల్లో వెల్లడైంది. క్రితంతో పోలిస్తే ఇక్కడ కేసులు 160 శాతం, మరణాలు 19 శాతం పెరగడం గమనార్హం. కొత్త కేసుల్లో 96 శాతం కేసులు ఒక్క కాంగోలోనే గుర్తించారు. ఎంపాక్స్ కొత్త వేరియంట్ రోగుల్లో మరింతగా వ్యాధిని ముదిరేలా చేసి జననాంగాల వద్ద చర్మగాయాలకు కారణమవుతోంది. దీంతో తమకు ఈ వైరస్ సోకిందన్న విషయం కూడా తెలీక చాలా మంది కొత్త వారికి వైరస్‌ను అంటిస్తున్నారు. 2022 ఏడాదిలో ఎంపాక్స్ క్లాడ్2 రకం వేరియంట్ విజృంభిస్తే ఈసారి క్లాడ్1 వేరియంట్ వేగంగా సంక్రమిస్తోంది. ఈ వేరియంట్ అత్యంత ప్రమాదకరం. లక్షణాలు ఏమిటీ?→ చర్మంపై దద్దుర్లతోపాటు జ్వరం, భరించలేని తలనొప్పి, కండరాల నొప్పి, వెన్ను నొప్పి వస్తాయి. ఒళ్లంతా నీరసంగా ఉంటుంది. గొంతు ఎండిపోతుంది. → మధ్యస్థాయి పొక్కులు పైకి తేలి ఇబ్బంది కల్గిస్తాయి.→ మనుషుల్లో ఒకరి నుంచి మరొకరికి, వణ్యప్రాణుల నుంచి సోకుతుంది. 90 శాతం కేసుల్లో ముఖంపైనా, 75 శాతం కేసుల్లో అరచేతులు, పాదాల మీద, 30 శాతం కేసుల్లో జననాంగాల మీద పొక్కులు వస్తాయి. నీటి బొడిపెలుగా చిన్నగా మొదలై పెద్దవై తర్వాత సొన చేరి ఎర్రగా, నల్లగా మారి పగులుతాయి. వ్యాక్సిన్ ఉందా? అత్యల్ప లక్షణాలు కనిపిస్తే వ్యాధి దానంతట అదే తగ్గిపోతుంది. ప్రస్తుతానికి ఎంపాక్స్ సోకిన వారికి నిర్ధష్టమైన చికిత్స విధానంగానీ వ్యాక్సిన్‌గానీ లేవు. మశూచి చికిత్సలో వాడే యాంటీ వైరల్ ఔషధమైన టికోవిరమాట్(టీపీఓఎక్స్ ఎక్స్)ను ఎంపాక్స్ రోగులకు ప్రయోగాత్మకంగా వాడుతున్నారు. అమెరికాలో మశూచికి వాడే జెనియోస్ డ్రగ్స్‌నే 18 ఏళ్లు, ఆపైబడిన వయసు రోగులకు ఇస్తున్నారు. కోవిడ్ దెబ్బకు సంపన్న, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వ్యాధులు ప్రబలేలోపే నివారణ చర్యలు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, ఆరోగ్యపరంగా నిఘా కార్యక్రమాలు కొనసాగుతున్నాయిగానీ వెనుకబడిన ఆఫ్రికా దేశాల్లో అవేం లేవు. దీంతో వైరస్ వ్యాప్తి ఆగట్లేదు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
మానవుల వల్లే వైరస్ల విజృంభణ!
వాతావరణ సంక్షోభం కారణంగా ప్రపంచవ్యాప్తంగా జంతువుల నుంచి మనుషులకు వైరస్ సోకే ప్రక్రియ వేగవంతమైంది. ఉష్ణోగ్రతలు పెరిగిపోతూండటం, మంచినీటి లభ్యత తగ్గిపోతూండటం, తమ సహజ ఆవాస ప్రాంతాల నుండి బయటకు మనుషులతోపాటు జంతువులూ కదులుతూండటం వల్ల సమస్య మరింత జటిలమవుతోంది. వాతావరణ మార్పు తీవ్రతను ఎంత కనిష్ఠంగా లెక్క కట్టినా కనీసం మూడు లక్షల వైరస్లు మొట్టమొదటిసారి కొత్త జంతు అతిథిలోకి చేరతాయని అంచనా. క్షీరదాలు, పక్షుల వలస మార్గాలను కృత్రిమ మేధ సాయంతో అంచనా కట్టి... వ్యాధికారక సూక్ష్మజీవులు ఎక్కడెక్కడ అధికం అవుతాయో గుర్తించి తగిన చర్యలు తీసుకోవటం, గట్టి ఆరోగ్య వ్యవస్థను ఏర్పాటు చేసుకోవటం ఇందుకు పరిష్కారం.దేశంలో మళ్లీ ఇప్పుడు వైరస్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఒక పక్క ప్యారిస్‌లో భారీ మహోత్సవాల మధ్య ఒలింపిక్స్ జరుగుతుండగా... ఇంకోపక్క దేశంలో నిఫా, చాందీపుర వైరస్లు కూడా ఒలింపిక్స్ మాదిరిగానే వార్తల్లోకి ఎక్కుతున్నాయి. మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా కోవిడ్ కారణంగా ఇప్పటికీ మరణాలు కొనసాగుతున్నట్లు మనల్ని హెచ్చరి స్తుండటం గమనార్హం. వీటన్నింటినీ పక్కనపెట్టినా, సాధారణ జలుబు రూపంలో బోలెడన్ని వైరస్ రకాలు తెరిపి లేకుండా మనిషిని జబ్బున పడేస్తూనే ఉన్నాయి. అనేక వైరస్ వ్యాధులు జంతువుల నుంచి మనుషులకు సోకు తున్నవే. అదేదో జంతువులు మనపై కక్షకట్టి చేస్తున్న పనేమీ కాదు. మానవులు ఆక్రమించుకున్న తమ ఆవాసాలను మళ్లీ సంపాదించు కునే పనిలో ఉన్నాయనీ కాదు. అడవిలో బతికే జంతుజాలాన్ని మనం మన ఆవాసాల్లోకి చేర్చుకున్నాం కాబట్టి! అలాగే మన మధ్యలో ఉన్న జంతువులు అటవీ ప్రాంతాల్లోకి చేరేందుకు తగిన ‘మార్గం’ వేశాము కాబట్టి! అటవీ ప్రాంతాల విచ్చలవిడి విధ్వంసం, పాడి పశువులను పెద్ద ఎత్తున పెంచుతూండటం, రకరకాల పెంపుడు జంతువుల ఎగు మతి, దిగుమతులు, దేశాల మధ్య మనిషి విపరీతంగా తిరిగేస్తూండటం వంటివన్నీ వైరస్లు కూడా మనుషుల్లోకి జొరబడేందుకు అవ కాశాలు పెంచుతున్నాయి. పెరుగుతున్న వేడి... తరుగుతున్న నీరువాతావరణ సంక్షోభం కారణంగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జంతువుల నుంచి మనుషులకు వైరస్ సోకే ప్రక్రియ వేగవంతమైంది. ఉష్ణోగ్రతలు పెరిగిపోతూండటం, మంచినీటి లభ్యత తగ్గిపోతూండటం, తమ సహజ ఆవాస ప్రాంతాల నుండి బయటకు మనుషు లతోపాటు జంతువులూ కదులుతూండటం వల్ల సమస్య మరింత జటిలమవుతోంది. వైరస్లు స్వేచ్ఛగా ఒక జంతువు నుంచి ఇంకో దాంట్లోకి చేరేందుకు ఈ పరిస్థితులు వీలు కల్పిస్తున్నాయి. ఈ క్రమంలోనే సురక్షితంగా ఉండేందుకు లేదా తీవ్రస్థాయి అనారోగ్యం కలిగించేందుకు వీలు కల్పించే కొత్త కొత్త జంతు అతిథులు వైరస్‌లకు లభిస్తున్నాయి. సైన్ ్స రచయిత ఎడ్ యంగ్ ఇటీవల ‘ది అట్లాంటిక్’లో రాస్తూ... మనిషి ‘ప్యాండెమిసీన్’ యుగాన్ని సృష్టించుకున్నాడని ప్రస్తుత పరిస్థితిని అభివర్ణించారు. భూమిపై మనిషికి ముందు ఉన్న యుగాన్ని హాలోసీన్ అని, మనిషి పుట్టుక తరువాతి యుగాన్ని ఆంత్రో పసీన్ అని పిలిస్తే... ప్రస్తుత మహమ్మారుల యుగాన్ని ప్యాండెమిసీన్ (పాండమిక్ = మహమ్మారి) అని పిలిచాడన్నమాట. జార్జ్‌టౌన్ యూనివర్సిటీకి చెందిన గ్లోబల్ ఛేంజ్ జీవశాస్త్రవేత్త కాలిన్ కార్ల్సన్ ఈ మధ్యే ఈ ప్యాండెమిసీన్ కు సంబంధించి భవిష్యత్తు దర్శనం చేయించారు. వాతావరణ మార్పుల కారణంగా భవిష్యత్తులో ఎలాంటి వైరస్లు మనుషులకు సోకే అవకాశముందో అంచనా కట్టారు. ‘నేచర్’లో ప్రచురితమైన ఈ అంచనా ప్రకారం... మనిషిని ముట్టడించేందుకు అవకాశమున్న వైరస్ల సంఖ్య ఏకంగా పదివేల రకాలు! ప్రస్తుతం వీటిల్లో అత్యధికం జంతువుల్లో మాత్రమే తిరు గుతూ ఉన్నాయి. ప్రకృతి సిద్ధమైన హద్దులు చెరిగిపోతూండటంతో అవి ఇతర జంతువులకు అంటే మనుషులకు కూడా సోకే ప్రమాదం పెరిగింది. వాతావరణ సంక్షోభం కాస్తా జంతువులు, మనుషులు కొత్త ప్రాంతాలకు వలస వెళ్లేలా చేస్తూండటం గోరుచుట్టుపై రోకటిపోటు అన్న చందం అయిందన్నమాట. ఇట్లాంటి పరిస్థితులు వైరస్‌లకు జాతర లాంటిది అంటే అతిశయోక్తి కాదు. అసలు పరిచయమే లేని బోలెడన్ని వైరస్లు ఒక దగ్గర చేరితే ఎన్ని కొత్త స్నేహాలు, బంధుత్వాలు కలుస్తాయో ఊహించుకోవచ్చు.వినాశకర మార్పులువేర్వేరు వాతావరణ, భూ వినియోగ మార్పు పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని కార్ల్సన్ వేసిన అంచనాల ప్రకారం 2070 నాటికి కనీసం 3,139 క్షీరద జాతులు (పాలిచ్చి పెంచే జంతువులు) సహజ ఆవాసాలకు దూరంగా వలస వెళతాయి. ఈ మార్పు కూడా ఆఫ్రికా, ఆసియా ఖండాల్లోని ఎతై ్తన, జీవవైవిధ్య భరిత, జనసాంద్రత అధికంగా ఉన్న చోట్ల జరుగుతుంది. దీనివల్ల జీవజాతుల మధ్య వైరస్ల సంచారం నాలుగు వేల రెట్లు ఎక్కువ అవుతుందని వీరు లెక్క కట్టారు. ఒకప్పుడు పశ్చిమ ఆఫ్రికాకు మాత్రమే పరిమితమైన ఎబోలా వైరస్ ఇప్పుడు ఖండమంతా విస్తరించింది. అలాగే దక్షిణాసియా లోనూ మునుపు నిర్ధారించిన ప్రాంతాలను దాటుకుని వైరస్లు మను షులకు సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాతావరణ మార్పు తీవ్రతను ఎంత కనిష్ఠంగా లెక్క కట్టినా కనీసం మూడు లక్షల వైరస్లు మొట్టమొదటిసారి కొత్త జంతు అతిథిలోకి చేరతాయని కార్ల్సన్ బృందం అంచనా వేస్తోంది. వీటిల్లో 15,000 వరకూ క్షీరదాలు ఉంటాయి. వాస్తవానికి ఈ మార్పిడి ఇప్పటికే మొదలైందని కార్ల్సన్ హెచ్చరిస్తున్నారు. 2100 నాటికి భూమి సగటు ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీ సెల్సియస్ వరకూ పెరగవచ్చునని వాతావరణ శాస్త్రవేత్తలు ప్యారిస్ ఒప్పందంలో చెప్పిన విషయం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఉష్ణోగ్రతలు ఆ స్థాయికి చేరక ముందే పరిస్థితి ఇలా ఉంటే ఇక చేరితే ఇంకెలా ఉంటుందో ఊహించడం కష్టమే. కనిపించేది కొంతే... పొంచివున్నది ఎంతో!కార్ల్సన్ బృందం చేపట్టిన ఈ అధ్యయనం పేరు ‘ఐస్‌బర్గ్ స్టడీ’. అంటే పైకి కనిపించే భాగం మాత్రమే. కనిపించనిది ఇంకా చాలానే ఉందన్నమాట. ప్రస్తుతం ఎక్కువ అవుతున్న జూనోటిక్ వ్యాధులు రాగల ప్రమాదాలతో పోలిస్తే చిన్న భాగం మాత్రమేనని అర్థమవుతుంది. క్షీరదాల్లో గబ్బిలాలు జూనోటిక్ వైరస్ల విజృంభణలో ముందు వరసలో ఉన్నాయి. సార్స్ కోవ్–2 కూడా వూహాన్ ప్రాంతంలోని గుహల్లో ఉన్న గబ్బిలాల నుంచి మనుషులకు సోకిందే. ఎక్కువ దూరాలు ప్రయాణించగల సామర్థ్యం వల్ల ఈ గబ్బిలాలు వాతావరణ మార్పులకు వేగంగా స్పందిస్తాయి. వందల కిలోమీటర్ల దూరాన్ని దాటేస్తాయి. తమతోపాటు వైరస్‌లను కూడా మోసుకొస్తాయి.పండ్లను ఆహారంగా తీసుకుంటాయి కాబట్టి ఈ వైరస్ జాడలు పండ్ల నుంచి మనకూ సోకుతాయన్నమాట. నిఫా వైరస్ ప్రస్థానం కూడా దాదాపుగా ఇలాంటిదే. ఆగ్నేయాసియా ప్రాంతంలో గబ్బిలాల జీవ వైవిధ్యం చాలా ఎక్కువ. ఫలితంగా ఈ ప్రాంతం నుంచి సరికొత్త వ్యాధులు పుట్టుకొచ్చే, వ్యాప్తి చెందే అవకాశం కూడా ఎక్కువే. అయితే జలచరాలు, పక్షుల ద్వారా కూడా వైరస్లు మనిషికి సోక వచ్చు. ఇన్ ఫ్లుయెంజా వైరస్ రకాలకు పక్షులు ఆతిథ్యమిస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే వాతావరణ మార్పులు అనేవి వ్యవస్థ మొత్తాన్ని గందరగోళానికి గురి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ మార్పుల సమస్యను మనం మరింత తీవ్రతతో పరిష్కరించాల్సిన అవసరాన్ని ఈ ఐస్‌బర్గ్ స్టడీ స్పష్టం చేస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతిపాదించిన వన్ హెల్త్ (మనుషులతోపాటు పరిసరాల్లోని జంతువులపై కూడా పర్యవేక్షణ) మైక్రోబియల్ నిఘా వ్యవస్థ, వేర్వేరు ప్రాంతాలు, జీవజాతుల సమాచారాన్ని క్రోడీకరించడం వంటివి ముమ్మరం చేయాల్సిన అవసరం ఉంది. క్షీరదాలు, పక్షుల వలస మార్గాలను కృత్రిమ మేధ సాయంతో అంచనా కట్టి... బ్యాక్టీరియా, వైరస్ల వంటి వ్యాధికారక సూక్ష్మజీవులు ఎక్కడెక్కడ ఎక్కువ అవుతాయో గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తు అవసరాలను సరిగ్గా అంచనా కట్టే ఆరోగ్య వ్యవస్థల ఏర్పాటూ తప్పనిసరి. అప్పుడే కొత్త వ్యాధుల ఆగమనం, వాటిని అడ్డుకోవడం, సమర్థంగా తిప్పికొట్టడం సాధ్య మవుతుంది. కె. శ్రీనాథ్ రెడ్డి వ్యాసకర్త ‘పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా’ మాజీ అధ్యక్షులు (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
డెంగీ హైరిస్క్ ప్రాంతాలు 2,071
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో డెంగీ పంజా విసురుతోంది. దీంతో కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈసారి తెలంగాణలో అత్యధికంగా డెంగీ కేసులు నమోదవుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించిన నేపథ్యంలో వైద్య,ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో 2,071 డెంగీ హైరిస్క్ ప్రాంతాలను గుర్తించింది. ఆ ప్రాంతాల్లో ఏకంగా 65.62 లక్షల మంది జనాభా ఉన్నారని నిర్ధారించడం ఆందోళన కలిగిస్తోంది. గత సంవత్సరాల్లో వచి్చన డెంగీ కేసుల ఆధారంగా ఈ నిర్ధారణకు వచి్చనట్టు వైద్య,ఆరోగ్యశాఖ వెల్లడిస్తూనే, అప్రమత్తమై 33 ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేసింది.42 డెంగీ పరీక్ష కేంద్రాలు, ఆస్పత్రులు, తెలంగాణ డయాగ్నొస్టిక్ సెంటర్లను గుర్తించి వాటిల్లో సౌకర్యాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 53 బ్లడ్ బ్యాంకులను గుర్తించగా, వాటిలో 26 బ్లడ్ బ్యాంకుల్లో ప్లేట్లెట్ యూనిట్లు ఉన్నాయని తెలిపింది. అన్ని జిల్లాల్లోనూ శానిటైజేషన్, నీటినిల్వ ప్రాంతాల్లో దోమలు రాకుండా చర్యలు తీసుకునేందుకు కలెక్టర్ల ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించాలని వైద్య,ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినాజడ్.చోంగ్తు ఆదేశాలు జారీ చేశారు.ఈ మేరకు ఆమె శుక్రవారం డెంగీ, సీజనల్ వ్యాధుల పరిస్థితిపై అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, జిల్లా వైద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతీ శుక్రవారం డ్రై డే పాటించడంలో భాగంగా ఆశ, ఏఎన్ఎంలు ఇంటింటికీ వెళ్లాలని, నీటిలో డెంగీ కారక దోమల సంతానోత్పత్తిని నివారించాలని కోరారు. లార్వా వ్యాప్తి ఇతర జిల్లాల కంటే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, ఖమ్మం, నిజామాబాద్, సంగారెడ్డి, వరంగల్ వంటి కొన్ని జిల్లాల్లో ఎక్కువగా ఉన్నాయని వైద్య,ఆరోగ్యశాఖ ప్రకటించింది. జూలై నెలలోనే 800 కేసులు వాతావరణ మార్పులు, వర్షాల నేపథ్యంలో దోమల తీవ్రత కారణంగా డెంగీ బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ ఏడాది జూన్ వరకు రాష్ట్రంలో 1,078 కేసులు నమోదైతే... ఒక్క జూలైలోనే 800 వరకు కేసులు నమోదవ్వడం ఆందోళన కలిగిస్తోంది. నీటి నిల్వలు భారీగా పెరుగుతుండటం, పారిశుధ్యలోపం కారణంగా ఆగస్టు, సెపె్టంబరు నెలల్లో డెంగీ బాధితుల సంఖ్య మరింత పెరగవచ్చని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులకు డెంగీ బాధితులు వస్తున్నారు. ఔట్ పేషెంట్ల సంఖ్య కూడా పెరిగింది. ఇక గిరిజన ప్రాంతాల్లో పరిస్థితి అత్యంత దారుణంగా ఉందంటున్నారు. -
డబ్ల్యూహెచ్‌వో చెప్పినా.. పెడచెవిన..
‘ఈ సీజన్లో తెలంగాణకు డెంగీ ప్రమాదం పొంచి ఉంది. డెంగీ ప్రమాదం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ ఉండగా, డెంగీలోని నాలుగు ప్రధాన వేరియంట్లన్నీ ఇక్కడే కనిపిస్తున్నాయి. డీఈఎన్‌వీ1, డీఈఎన్‌వీ2, డీఈఎన్‌వీ3, డీఈఎన్‌వీ4 ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు రెండు మూడు వేరియంట్లు కూడా ఒకేసారి రోగులపై దాడి చేసే ప్రమాదం పొంచి ఉంది.’ – రాష్ట్రానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికసాక్షి, హైదరాబాద్: ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలకు తగ్గట్టే రాష్ట్రంపై డెంగీ పంజా విసురుతోంది. గతేడాదితో పోలిస్తే ఇప్పుడు పెద్దఎత్తున కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని..ఆస్పత్రుల్లో అవసరమైన కిట్లు, మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. కానీ ప్రజారోగ్య సంచాలకుల విభాగం మాత్రం క్షేత్రస్థాయిలో సరైన చర్యలు తీసుకోవడంలో విఫలమవుతోందన్న విమర్శలు ఉన్నాయి. గతేడాది మొదటి ఆరు నెలలతో పోలిస్తే..ఈ ఏడాది ఆరు నెలల్లో డెంగీ కేసులు అధికంగా నమోదైనట్టు వైద్యారోగ్యశాఖ నివేదిక పేర్కొంది.లక్షలాది మందికి జ్వరాలు.. ఆస్పత్రులు కిటకిటరాష్ట్రంలో లక్షలాది మందికి జ్వరాలు సోకాయని వైద్యారోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు తాజాగా ఒక నివేదికను ప్రభుత్వానికి పంపించింది. ఒక అంచనా ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 3 లక్షల మంది జ్వరాలతో బాధపడుతున్నారని ఒక వైద్యాధికారి వెల్లడించారు.దీంతో రాష్ట్రంలో జ్వరాలతో ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. మరోవైపు చికున్‌గున్యా కేసులు భారీగా నమోదయ్యాయి. చాలామంది రోగులు జ్వరంతో బాధపడుతూ ఒళ్లు నొప్పులు కూడా ఉంటున్నట్టు చెబుతున్నారు. కాగా, ఆస్పత్రుల్లో ఔట్ పేషెంట్లు పెరి గారు. హైదరాబాద్ ఫీవర్ ఆస్పత్రిలో సాధారణ రోజుల్లో 40 మంది వచ్చేవారు..కానీ ఇప్పుడు ఆ సంఖ్య వందకు పెరిగిందని డాక్టర్లు చెబుతున్నారు. గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులకు వెయ్యిచొప్పున ఓపీ ఉంటోంది.రక్తస్రావం జరిగితే ప్రమాదకరండెంగీని ముందుగా గుర్తించితే 80 శాతం వరకు ఎటువంటి ప్రమాదం లేకుండా చికిత్స పొందవచ్చు. కానీ కొందరికి తీవ్రమైన రక్తస్రావం అవుతుంది. ముక్కు నుంచి కానీ, మలం ద్వారా గానీ, బ్రష్ చేసేప్పుడు పళ్ల మధ్య నుంచి రక్తస్రావం అవుతుంది. ఇలా అధికంగా రక్తస్రావం అయితేనే ప్రమాదకరం. మహిళలకు పీరియడ్స్ సమయంలో సాధారణ రక్తస్రావం కంటే అదనంగా అయ్యే అవకాశం ఉంటుంది. దాన్ని వారు గుర్తించాలి. అలాంటి సమయాల్లో ప్లేట్లెట్ల సంఖ్య 50 వేలున్నా సరే తప్పనిసరిగా ప్లేట్లెట్లు ఎక్కించాల్సి ఉంటుంది. రక్తస్రావం కానప్పుడు 20 వేల వరకు ప్లేట్లెట్లు పడిపోయినా ప్రమాదం కాదు. అప్పుడు ప్రత్యేకంగా ప్లేట్లెట్లు ఎక్కించి రోగిని సాధారణ స్థితికి తీసుకురావొచ్చు.– డాక్టర్ కె.కృష్ణప్రభాకర్, హైదరాబాద్ -
The Lancet Planetary Health journal: ఊపిరి తీస్తున్న వాయు కాలుష్యం
న్యూఢిల్లీ: ఆయువు పోయాల్సిన వాయువు ప్రాణాలు తోడేస్తోంది. వాయువులో ప్రాణాంతకమైన కాలుష్య కారకాలు కలుస్తున్నాయి. ఊపిరి పీలిస్తే శరీరంలోకి చేరిపోయి, అవయవాలను నిర్వీర్యం చేస్తున్నాయి. ఇండియాలోని పది అతిపెద్ద నగరాల్లో సంభవిస్తున్న రోజువారీ మరణాల్లో సగటున 7.2 శాతం మరణాలకు వాయు కాలుష్యమే కారణమని తాజా అధ్యయనంలో వెల్లడయ్యింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) నిర్దేశించిన పరిమితి కంటే హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లోని గాలిలో అత్యంత సూక్ష్మమైన ‘పీఎం 2.5’ ధూళి కణాలు అధికంగా ఉన్నట్లు లాన్సెట్ ప్లానెటరీ హెల్త్ పత్రిక స్పష్టం చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో చాలా మరణాలకు వాయు కాలుష్యమే కారణమవుతున్నట్లు తెలియజేసింది. వాహనాలు, పరిశ్రమల నుంచి వెలువడుతున్న ఉద్గారాలు గాలిని విపరీతంగా కలుషితం చేస్తున్నాయని పేర్కొంది. అధ్యయనం వివరాలను పత్రికలో ప్రచురించారు. 2.5 మైక్రోమీటర్ల కంటే తక్కువ పరిమాణంలో ఉన్న ధూళి కణాలను ‘పీఎం 2.5 కణాలు’ అంటారు. → భారతదేశంలోని పెద్ద నగరాల్లో నిత్యం వెలువడుతున్న పీఎం 2.5 ధూళి కణాలతో మరణాల ముప్పు నానాటికీ పెరుగుతోందని పరిశోధకులు వెల్లడించారు. → ఇండియాలో వాయు కాలుష్యంపై వారణాసిలోని బనారస్ హిందూ యూనివర్సిటీ, ఢిల్లీలోని సెంటర్ ఫర్ క్రానిక్ డిసీజ్ కంట్రోల్‌తోపాటు పలువురు అంతర్జాతీయ పరిశోధకులు ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్, కోల్‌కతా, పుణే, సిమ్లా, వారణాసి నగరాల్లో 2008 నుంచి 2019 దాకా ఈ అధ్యయనం నిర్వహించారు. → క్యూబిక్ మీటర్ గాలిలో పీఎం 2.5 ధూళి కణాలు 10 మైక్రోగ్రాములు పెరిగితే రోజువారీ మరణాల సంఖ్య 1.4 శాతం పెరుగుతున్నట్లు గుర్తించారు. అంతేకాకుండా మరణాల మప్పు 2.7 శాతం పెరుగుతున్నట్లు తేల్చారు. → ప్రపంచ ఆరోగ్య సంస్థ విధివిధానాల ప్రకారం.. 24 గంటల వ్యవధిలో క్యూబిక్ మీటర్ గాలిలో పీఎం 2.5 కణాలు 15 మైక్రోగ్రాముల లోపు ఉంటే ప్రమాదం లేదు. అంతకంటే మించితే ముప్పు తప్పదు. → భారత వాయు నాణ్యత ప్రమాణాల ప్రకారం.. 24 గంటల వ్యవధిలో క్యూబిక్ మీటర్ గాలిలో పీఎం 2.5 ధూళి కణాలు 60 మైక్రోగ్రాముల లోపు ఉండే ప్రమాదం అంతగా ఉండదు. కానీ, ప్రస్తుతం 75 మైక్రోగ్రాముల కంటే అధికంగానే ఉంటున్నట్లు తేలింది. → క్యూబిక్ మీటర్ గాలిలో పీఎం 2.5 కణాలు 10 మైక్రోగ్రాములు పెరిగితే మరణాల రేటు సగటున 3 శాతం దాకా పెరుగుతున్నట్లు గుర్తించారు. → స్థానికంగా వెలువడే ఉద్గారాలు, కాలుష్యంతో పీఎం 2.5 కణాల ఉత్పత్తి పెద్ద ఎత్తున జరుగుతోంది. అందుకే స్థానికంగా కాలుష్యాన్ని సమర్థవంతంగా కట్టడి చేస్తే మరణాల ముప్పు చాలావరకు తగ్గుతుందని సైంటిస్టులు సూచిస్తున్నారు. -
ఒకేసారి 4 వేరియంట్ల దాడి
ఈ సీజన్లో తెలంగాణకు ‘డెంగీ’ ముప్పు పొంచి ఉందని ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరించింది. కేసుల తీవ్రత ఈసారి ఎక్కువగా ఉంటుందని తెలిపింది. దేశంలో డెంగీ ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ ఉన్నట్టు పేర్కొంది. ఈ మేరకు డెంగీ తీవ్రతపై ప్రపంచ ఆరోగ్యసంస్థ ఒక నివేదిక విడుదల చేసింది. డెంగీలోని నాలుగు ప్రధాన వేరియంట్లు తెలంగాణలోనే కనిపిస్తున్నాయని వెల్లడించింది.డీఈఎన్‌వీ1, డీఈఎన్‌వీ2, డీఈఎన్‌వీ3, డీఈఎన్‌వీ4 ప్రభావం ఎక్కువగా ఉంటున్నట్టు డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. కొన్నిసార్లు రెండుమూడు వేరియంట్లు కూడా ఒకేసారి దాడి చేసే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించింది. ఫలితంగా డెంగీ బాధితులు తీవ్రమైన ఇబ్బందులు పడతారని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, ఆస్పత్రుల్లో అవసరమైన కిట్లు, మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించింది. ఈ ఏడాది ఇప్పటివరకు 500కు పైగా డెంగీ కేసులు వెలుగు చూడడం గమనార్హం. – సాక్షి, హైదరాబాద్వైద్య పరీక్షలే కీలకం ⇒ డెంగీ నిర్ధారణలో వైద్య పరీక్షలే కీలకం. కేవలం ప్లేట్లెట్ కౌంట్, డెంగీ స్ట్రిప్ టెస్ట్, సీరమ్ టెస్ట్ వంటి వాటితో దీనిని నిర్ధారించడం శాస్త్రీయం కాదని వైద్య,ఆరోగ్యశాఖ చెబుతోంది. ⇒ విధిగా అందుబాటులో ఉండే ఐజీఎం పరీక్ష చేయించాలి. ⇒ ప్లేట్లెట్లు 20 వేలలోపు పడిపోతే అది ప్రమా దకరంగా భావిస్తారు. 15 వేల కన్నా తగ్గితే డెంగీ షాక్, డెంగీ మరణాలు సంభవిస్తాయి. ⇒ డెంగీ జ్వరం వస్తే తీవ్రతను తగ్గించేందుకు చల్ల ని నీటిలో స్పాంజీని ముంచి శరీరాన్ని తుడ వాలి. ⇒ ఎలక్ట్రాల్ పౌడర్, పండ్ల రసాలు రోగికి ఇవ్వాలి. దీనివల్ల జ్వర తీవ్రత తగ్గి ప్లేట్లెట్లు అదుపు లోకి వస్తాయి. ఇంకా తగ్గకుంటే వైద్యుని వద్దకు తీసుకెళ్లాలని వైద్య,ఆరోగ్యశాఖ సూచించింది. ⇒ వైరల్ ఫీవర్ నుంచి దూరంగా ఉండాలంటే ఫ్రైడే ను డ్రై డేగా పాటించాలి. ⇒దోమలు కుట్టకుండా జాగ్రత్త తీసుకోవాలి. రాత్రి మాత్రమే కాకుండా పగటిపూట కూడా దోమల మందులు వాడాలి. ⇒స్కూల్ పిల్లలకు దోమలు కుట్టకుండా పాఠశాల పరిసరాలు శుభ్రంగా ఉంచాలి. ⇒కాచి వడగాచిన నీటిని తాగాలి. వైరల్ ఫీవర్ వస్తే విపరీతంగా మంచినీరు తాగాలి. పండ్ల రసాలు తీసుకోవాలి. దీనివల్ల ప్లేట్లెట్లు పడిపోకుండా ఉంటుంది.డెంగీ లక్షణాలు⇒డెంగీతో ఉన్నట్టుండి తీవ్రజ్వరం, భరించలేని తలనొప్పి వస్తుంది.⇒కళ్లు తెరవడం కూడా కష్టంగా ఉంటుంది. కదిపితే నొప్పి వస్తుంది. ⇒చర్మంపై దద్దుర్లు అయినట్టు కనిపించడం, కండరాలు, కీళ్ల నొప్పులు ఉంటాయి. ⇒అధిక దాహం, రక్తపోటు పడిపోవడం ఉంటుంది.ముందుగా గుర్తిస్తే ప్రమాదమేమీ ఉండదుఇక డెంగీని ముందుగా గుర్తిస్తే 80 శాతం వరకు ఎటువంటి ప్రమాదం లేకుండా వైద్యుల చికిత్స పొందవచ్చని డాక్టర్లు అంటున్నారు. కానీ కొందరికి తీవ్రమైన రక్తస్రావం అవుతుంది. ముక్కు నుంచి కానీ, మలం ద్వారాగానీ, బ్రష్ చేసేటప్పుడు పళ్ల మధ్య నుంచి రక్తస్రావం అవుతుంది. ఇలా అధికంగా రక్తస్రావం అయితేనే ప్రమాదకరమని చెబుతున్నారు. మహిళలకు పీరియడ్స్ సమయంలో సాధారణ రక్తస్రావం కంటే అధికంగా అయ్యే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. దాన్ని వారు గుర్తించాలని సూచిస్తున్నారు.ప్రైవేట్ ఆస్పత్రుల్లో డెంగీ దోపిడీ...ఏటా డెంగీ జ్వరాలతో బాధపడేవారిని ప్రైవేట్ ఆస్పత్రులు దోపిడీ చేస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. డెంగీ విషయంలో సాధారణంగా ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకపోతే 20 వేల వరకు ప్లేట్లెట్ల సంఖ్య తగ్గినా నష్టంలేదని, అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు 50 వేల వరకు ప్లేట్లెట్లు తగ్గినా ఇబ్బంది లేదని వైద్య నిపుణులు అంటున్నారు. చాలా కేసుల్లో సాధారణ జ్వరానికి చేసే వైద్యమే సరిపోతుందని అంటున్నారు. కానీ అనేక ప్రైవేటు ఆస్పత్రులు 50 వేలకు పైగా ప్లేట్లెట్లు ఉన్నా ఐసీయూలో ఉంచి అదనంగా ప్లేట్లెట్లు ఎక్కిస్తున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. నాలుగైదు రోజులు ఉంచుకొని రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు కూడా ఫీజులు వసూలు చేసిన సంఘటనలు ఉన్నాయి. సాధారణ విష జ్వరాలకు కూడా నాలుగైదు రోజులు ఆస్పత్రుల్లో ఉంచుకొని రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. డెంగీ ఉన్నా లేకపోయినా కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లు తప్పుడు రిపోర్టులు ఇస్తున్నాయని, ప్లేట్లెట్లు ఎక్కువున్నా తక్కువ చూపిస్తున్నాయన్న ఫిర్యాదులు సర్కారుకు చేరాయి. -
ఢైలీ రొటీన్‌ను ఇలా ప్లాన్ చేయండి
ఆర్థిక విషయాలను పకడ్బందీగా నిర్వహించడం ఎంత అవసరమో ఆరోగ్య భరోసానిచ్చే దైనందిన కృత్యాలు నిర్వహించడమూ అంతే అవసరం. ఆర్‌ఎన్‌ఎ- డీఎన్ఏ మొదలు గుండె–మెదడు వరకూ ప్రతీ అణువు, కణము శరీరంలో కీలకమే. ఒక్క అణువు విచ్ఛిన్నమైనా అనారోగ్యమే. సుమారుగా 37.2 ట్రిలియన్ కణాల సమూహంతో నిర్మితమైన మానవ దేహం నిద్ర లేచింది మొదలు మళ్లీ నిద్రకు ఉపక్రమించే వరకూ.. అంతవరకూ ఎందుకు నిద్రలో సైతం నిత్య జీవ క్రియలను కొనసాగిస్తుంది. మరి అంతటి అమూల్యమైన శరీరం తన విధులను తాను సక్రమంగా నిర్వర్తించాలంటే అందుకు తగినట్లుగా మన పని విధానం ఉండాలి? అలా ఉండాలంటే మనం ఏం చేయాలి..ఏమిటా పనులు? ఎలా చేయాలి? ఇలాంటి అంశాలపై హైదరాబాదీల కోసం ప్రత్యేక కథనం...– ఆరోగ్య భరోసానిచ్చే నిత్యకృత్యాలపై దృష్టి సారించండి– అందుకు తగ్గట్లుగా మీ పని విధానం, అలవాట్లు మార్చుకోండి– శారీరక, మానసిక, ఆరోగ్య సంరక్షణపై బీ కేర్ ఫుల్– పలు అధ్యయనాల పరిశోధనల్లో ఆసక్తికర అంశాలు వెల్లడిఆహారం ఇలా... పెద్దలకు రోజుకు 1,600–3,000 కేలరీల ఆహారం అవసరం. 19–30 ఏళ్ల మధ్య వయసున్న స్త్రీలకు 1,800–2,400 కేలరీలు, పురుషులకు 2,400–3,000 కేలరీలు, 31–59 ఏళ్ల వయసున్న స్త్రీలకు 1,600–2,200 కేలరీలు, పురుషులకు 2,200–3,000 కేలరీలు అవసరం. అయితే, ఒక వ్యక్తి రోజుకు ఎన్ని కేలరీలు తినాలి అనేది ఆ వ్యక్తి జెండర్, వయస్సు, ఎత్తు, జీవనశైలిని బట్టి మారుతుంది. ఆహారంలో..క్యాల్షియం రోజుకు 1గ్రా, ఫైబర్ రోజుకు 40 గ్రా,–మెగ్నీషియం రోజుకు 410 మిగ్రా, విటమిన్ ఇ రోజుకు 15 మిగ్రా. విటమిన్ సి రోజుకు 75–90 మిగ్రా, విటమిన్ ఎ రోజుకు 600–900 గ్రా, విటమిన్ డి రోజుకు 600 ఐయూ, పొటాషియం రోజుకు 4.7 గ్రా,ప్రొటీన్ రోజుకు 46–56 గ్రా. ఐరన్ రోజుకు 15– 18 గ్రాల వరకూ కావాలి. జాతీయ పరిశోధనా సంస్థ ఐసీఎమ్ఆర్న్ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషన్) సూచనల ప్రకారం..ప్రతి రోజూ తీసుకునే ఆహరంలో ధాన్యాలు–చిరు ధాన్యాలు 250 గ్రా, పప్పులు 85 గ్రా, పాలు–పెరుగు 300గ్రా, కూరగాయలు–ఆకుకూరలు 400 గ్రా, పండ్లు 100 గ్రా, నూనెగింజలు 35 గ్రా, కొవ్వులు–నూనెలు 27 గ్రా ఉండాలి. మెదడుకు మేత కావాలి... విజా్ఞనమే కాకుండా మానసిక స్పందనలపై పుస్తక పఠనం అత్యంత ప్రభావం చూపించేది. రోజుకు 30 నిమిషాల పుస్తక పఠనం లేదా పజిల్స్ సాల్వేషన్ మెదడును యాక్టివ్‌గా ఉంచుతుంది. హైసూ్కల్, కాలేజ్ విద్యార్థులకు రోజుకు 2–3 గంటల చదువు సరిపోతుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. విరామం లేకుండా ఏకధాటిగా చదవడం ఒత్తిడిని పెంచుతుంది. ఉద్యోగాలకు సన్నద్ధమయ్యే వారి విషయంలో పఠన సమయం వేరుగా ఉంటుంది.ప్రాణవాయువు ప్రాముఖ్యత... మనిషి రోజుకు 550 లీటర్ల స్వచ్ఛమైన ఆక్సిజన్ తీసుకోవాలి. పీల్చే గాలిలో 15 శాతం ఆక్సిజన్ ఉంటుంది. కాలుష్యరహిత పరిసరాల్లో రోజూ కొంత సమయం గడపడం ద్వారా తగినంత ఆక్సిజన్ పొందవచ్చు. నవ్వు...కరిగే కొవ్వు... ఓ అధ్యయనం ప్రకారం రోజుకు 10 నుంచి 15 నిమిషాలు నవ్వడం వల్ల దాదాపు 40 కేలరీలు బర్న్ అవుతాయి. నవ్వు తర్వాత 45 నిమిషాల వరకూ కండరాలు రిలాక్స్‌గా ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచడం, ఒత్తిడి హార్మోన్లను తగ్గించడం, సహజమైన ఎండార్ఫిన్ విడుదల చేయడం, గుండెపోటు నివారణ తదితర విషయాల్లో మేలు చేస్తుంది. నవ్వడం వల్ల జీవిత కాలం పెరుగుతుందని నార్వే అధ్యయనం వెల్లడించింది. కప్పు కాఫీ... శరీరానికి కెఫిన్లు ప్రమాదకరమే అయినా రోజుకు 400 మిల్లీగ్రాముల వరకూ సురక్షితమని పలు అధ్యయనాలు వెల్లడించాయి. ఇది దాదాపు నాలుగు కప్పుల బ్రూ కాఫీ, 10 క్యాన్ల కోలా, రెండు ఎనర్జీ షాట్ డ్రింక్స్‌లతో లభిస్తుంది. ఈ కెఫిన్ మొదడు, నరాల పనితీరును మెరుగు పరుస్తుంది. అయితే ఎనర్జీ డ్రింక్స్‌లో కెఫిన్ కంటెంట్‌లో చాలా తేడా ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఇది రొ‘టీ’న్... రోజుకు సగటున 3 నుంచి 5 కప్పుల చాయ్ ఆరోగ్యకరమే. సాధారణ టీలో ఉండే సమ్మేళనాలకు శరీరం ప్రతిస్పందించే విధానంపై ఆధారపడి ఉంటుంది. అలాగే క్రమం తప్పకుండా గ్రీన్ టీ తాగడం వల్ల బరువు తగ్గడం, మధుమేహం, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి ప్రమాదాలను తగ్గించుకోవచ్చు. తాగు...ఆగు... రోజుకు 15–30 మి.లీ మించి ఆల్కహాల్ ప్రమాదకరం. బీర్, వైన్, జిన్, విస్కీ వంటి ఆల్కహాల్స్‌లో ఏదో ఒకటి మాత్రమే సేవించాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటిలో ఆల్కహాల్ పరిమాణాల్లో తేడాలుంటాయి. మహిళలకు రోజుకు ఒక పానీయం, పురుషులకు రోజుకు రెండు పానీయాల పరిమితి మించకూడదు. వేడి...రెడీ... శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం మానవ శరీరం 36 నుంచి 37.5 సె.. వరకూ వేడిని తట్టుకుంటుంది. ఇది 40సె మించితే ప్రమాదకరం. అతి వేడి డీహైడ్రేషన్‌తో పాటు ప్రాణాపాయ స్థితికి చేరుకునే అవకాశముంది. అలాగే 21 సె.డిగ్రీల వరకూ చల్లదనాన్ని తట్టుకుంటుంది. సిట్...రైట్ రోజులో 4 గంటల కన్నా మించి కూర్చుంటే ఆరోగ్య సమస్యలు ప్రారంభమై, ఇది 8 గంటలకు చేరితే తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని జస్ట్ స్టాండ్ స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది. ఉద్యోగ రీత్యా 8 నుంచి 11 గంటల వరకూ కదలకుండా కూర్చోడం వల్ల ఒబెసిటీ సహా అనేక అనారోగ్యాలు దాడి చేస్తున్నాయి.నిద్రే ఆరోగ్యం... అనేక రకాల శారీరక, మానసిక రుగ్మతలకు నిద్రలేమే ప్రధాన కారణమని పలు అంతర్జాతీయ పరిశోధనలు వెల్లడించాయి. నిద్ర అలవాట్లు, పర్యవసానాల పై మ్యాట్రెస్ మేకర్ వేక్‌ఫిట్ నిర్వహించిన సర్వేలో భాగంగా నగరంలో 56 శాతం మంది వారి పని వేళల్లో నిద్ర మత్తుతో అవస్థలు పడుతున్నారని తేల్చంది. అంతేకాకుండా నిద్ర లేవగానే రిఫ్రెష్ ఫీలింగ్ అనిపించట్లేదని నగరవాసులు పేర్కొన్నారు. ‘ది గ్రేట్ ఇండియన్ స్లీప్ స్కోర్కార్డ్ఙ్గా పిలువబడే ఈ సర్వేలో నగరంలో దాదాపు 33 శాతం మంది తమ నిద్రలేమికి కేవలం అర్థరాత్రి వరకూ డిజిటల్ స్క్రీల్లు తిలకించడమే కారణమని తద్వారా 32 శాతం మంది ఉద్యోగాలకు ఆలస్యంగా వెళ్తున్నారని తేల్చారు. ఆరోగ్యకర జీవనానికి రోజూ 7–8 గంటల నిద్ర అవసరం. అయితే వయస్సులను బట్టి కొద్దిగా వ్యత్యాసం ఉంటుంది. 4 నుంచి 12 నెలల చిన్నారులకు 12 నుంచి 16 గంటల పాటు, 1–2 ఏళ్లు... 11–14 గంటలు, 3–5 ఏళ్లు 10–13 గంటలు, 6–12 ఏళ్లు... 9–12 గంటల నిద్ర 13–18 ఏళ్లు.. 8–10 గంటలు... ఆపై వయసు వారికి 7–8గంటలు, పీరియడ్స్‌లో ఉన్న ఆడవారికి కనీసం 8 గంటల నిద్ర అవసరమని వైద్యులు చెబుతున్నారు. తాగునీరు...ఇదే తీరు... మనిషి మనుగడకు ప్రామాణికం నీరు. శరీరంలో దాదాపు 60 శాతం నీరే ఉంటుంది. ఆరోగ్యకరమైన జీవనానికి ప్రతీరోజు పురుషులు రోజూ 3.7 లీటర్లు, మహిళలు 2.7 లీటర్ల నీరు తాగాలని ఆరోగ్య నిపుణుల సూచన. ఉష్ణోగ్రత, ఆరోగ్య పరిస్థితులను బట్టి హెచ్చుతగ్గులు అవసరం. సరైన మోతాదులో శరీరానికి నీరు అందకపోవడం రోగకారకంగా మారుతుంది. కేలరీలు కరగాలి...రోజుకు కనీసం 30 నిమిషాల వ్యాయామం శరీరాన్ని చురుగ్గా మార్చుతుంది. ఇందులో భాగంగా జిమ్, ఏరోబిక్, జుంబా వంటివి ఇందుకు ఉపకరిస్తాయి. వారంలో కనీసం..150 నిమిషాలు(రోజుకి 20 ని.) వ్యాయామం చేయాలని హెల్త్ అండ్ హ్యూమన్ సరీ్వసెస్ గైడ్‌లై ప్రకటించిది. యోగా 20 నిమిషాలు. ధ్యానం 5 నుంచి 20 నిమిషాలు చేయడం మంచి ఫలితాలను అందిస్తుంది. ఇక ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల నడక ఆరోగ్యకరం. సాధారణంగా రోజుకు 10,000 అడుగులు వేయాలని సీడీసీ (సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్) సైతం సిఫార్సు చేసింది. ఈత 30 నిమిషాలు, ఆటలైతే 30 నిమిషాల పాటు, సైక్లింగ్ రోజుకు 30 నిమిషాలు సరిపోతుంది. 30 నిమిషాలకు మించి సైకిల్ తొక్కే వారికి మధుమేహం వచ్చే ప్రమాదం 40 శాతం తక్కువని ఫిన్లాండ్ పరిశోధనలో తేలింది. బీ అలర్ట్ సిటీజన్నిద్ర లేచింది మొదలు... ఏమేం పనులు చేయాలి? ఏ టైమ్‌కి ఎక్కడ ఉండాలి? ఎవర్ని కలవాలి? తదితర పనుల జాబితాను ముందు రోజే సిద్ధం చేసుకునే అలవాటుందా? ఈ ప్రశ్నకు చాలా మంది సిటిజనుల నుంచి అవును అనే సమాధానం వస్తుంది. మరి అదే విధంగా రోజూ ఎన్ని లీటర్ల నీరు తాగాలి? ఎన్ని గంటలు నిద్రపోవాలి? ఎన్ని కేలరీల ఆహారం తీసుకోవాలి? ఎన్ని కేలరీలు ఖర్చు చేయాలి? ఎన్ని గంటలు మొబైల్ చూడాలి?.. వగైరా లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నారా? అని ప్రశి్నస్తే మాత్రం అవును అని బదులిచ్చేవారు అరుదే. ‘స్మార్ట్’గా వాడాలి... మొబైల్, ల్యాప్‌టాప్ వంటి స్క్రీన్ లను రోజులో 2 గంటల కన్నా ఎక్కువ సమయం చూడటం హానికరం. ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన సూచనల ప్రకారం..సంవత్సరం కంటే తక్కువ వయస్సున్న పిల్లలు మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లకు దూరంగా ఉండాలి. ఐదేళ్లలోపు చిన్నారులు గంటకు మించి ఫోన్ వాడకూడదు. 10 మిలియన్ల రంగులను వేరు చేయగల శక్తి గల మనిషి కన్నుకు ఫోన్ హానికరమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఉప్పు.. ఎక్కువైతే ముప్పు... శరీర క్రియల కోసం ప్రతిరోజూ 500మి.గ్రా సోడియం (ఉప్పు) అవసరం. ఇది నరాలను ప్రేరేపించడంతో పాటు కండర సంకోచానికీ సహాయం చేస్తుంది. ముఖ్యంగా దేహంలోని నీరు–ఖనిజాల సమతుల్యతను కాపాడుతుంది. అతిగా వాడితే బ్లెడ్ ప్రెజర్, గుండె సమస్యలకు దారితీస్తుంది. ఆరోగ్యానికి...‘పండు’గ రోజువారీ ఆహారంలో 25 నుంచి 30 శాతం పండ్లు ఉండాలనేది ఆరోగ్య నిపుణుల మాట. ద్రవ రూపంలో తీసుకోవాలనుకుంటే... రోజూ 150 మి.లీ లోపు పండ్ల రసాలు తీసుకోవాలి. అతిగా పండ్ల రసాలు సేవించడం వల్ల శరీరంలో గ్లూకోజ్, చక్కెర స్థాయిలు పెరిగే అవకాశముంది. -
సెల్‌ఫోన్‌తో హై బీపీ!
సాక్షి, అమరావతి: మొబైల్ ఫోన్లో ఎక్కువ సేపు మాట్లాడితే అధిక రక్తపోటు (హై బీపీ) ప్రమాదం పొంచి ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. దైనందిన జీవితంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న సెల్ఫోన్లతో అంతే స్థాయి అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.వారానికి 30 నిమిషాలు, అంతకంటే ఎక్కువసేపు మొబైల్ ఫోన్లో మాట్లాడేవారిలో దుష్ప్రభావాలు తీవ్ర స్థాయిలో ఉంటున్నాయని, ముఖ్యంగా రక్తపోటు ప్రమాదాన్ని పెంచుతుందని తాజా అధ్యయనంలో తేల్చారు. ‘యూరోపియన్ హార్ట్ జర్నల్ – డిజిటల్ హెల్త్’లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. చైనాలోని గ్వాంగ్జౌలోని సదరన్ మెడికల్ వర్సిటీ పరిశోధకులు మొబైల్ ఫోన్ల నుంచి వెలువడే తక్కువ స్థాయి రేడియో ఫ్రీక్వెన్సీ శక్తి రక్తపోటు పెరుగుదలతో ముడిపడి ఉందని గుర్తించారు.130 కోట్ల మందిలో రక్తపోటు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 30–79 సంవత్సరాల వయసు గల దాదాపు 130 కోట్ల మంది అధిక రక్తపోటు సమస్య ఎదుర్కొంటున్నారు. ఇందులో 82 శాతం మంది తక్కువ, మధ్య–ఆదాయ దేశాలలో నివసిస్తున్న వారే. భారత్‌లో 120 కోట్ల మందికిపైగా మొబైల్ ఫోన్ వినియోగదారులు ఉంటే 22 కోట్ల మంది అధిక రక్తపోటు బాధితులు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. రక్తపోటు సమస్య గుండెపోటు, అకాల మరణానికి దారితీస్తుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. హైబీపీ వల్ల వచ్చే హైపర్ టెన్షన్, ఇతర సమస్యలపై అవగాహన పెంచుకోవాలని సూచిస్తున్నారు. తాజా పరిశోధనలో వారంలో 30 నిమిషాల కంటే తక్కువ సమయం ఫోన్లో మాట్లాడే వారితో పోలిస్తే మిగిలిన వారిలో రక్తపోటు వచ్చే ప్రమాదం 12 శాతం ఎక్కువగా ఉంటుందని తేల్చారు. వారానికి ఆరుగంటలకు పైగా ఫోన్లో మాట్లాడేవారిలో రక్తపోటు ప్రమాదం 25 శాతానికి పెరిగింది.కండరాలపై ఒత్తిడి..మెడ, భుజాలు, చేతుల్లో కండరాల నొప్పులు అత్యంత సాధారణ దుష్ప్రభావాలలో ఒకటిగా వైద్యులు చెబుతున్నారు. ఎక్కువ సేపు ఫోన్‌ను పట్టుకోవడంతో కండరాలు ఒత్తిడికి గురవడంతో పాటు తీవ్ర తలనొప్పికి దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. ఫోన్‌ను చెవికి చాలా దగ్గరగా పెట్టుకుని మాట్లాడటం, ఇయర్‌ఫోన్లు్ల, హెడ్ఫోన్లను నిరంతరం ఉపయోగించడంతో టిన్నిటస్ (చెవుల్లో నిరంతరం రింగింగ్ సౌండ్ వినిపించే పరిస్థితి) వంటి చెవి సమస్యలు వస్తాయంటున్నారు. ఫోన్ స్క్రీన్‌పై ఎక్కువ సేపు చూడటంతో కంటిపై ఒత్తిడి పెరిగిన కళ్లుపొడిబారడం, చూపు మసకబారడం, తలనొప్పి, ఊబకాయం వంటి సమస్యలకు దారితీస్తుందని పేర్కొంటున్నారు. -
టైముకు తినండి.. ఆరోగ్యంగా ఉండండి!
సాక్షి, అమరావతి: సరైన సమయానికి ఆహారం తీసుకోవడం ద్వారా గుండె సంబంధిత వ్యాధులను నివారించవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఉదయం 8 గంటలకు అల్పాహారం.. రాత్రి 8 గంటలకు చివరి భోజనం తీసుకోవడాన్ని తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలని చెబుతున్నారు. ఫ్రాన్స్‌లోని వర్సిటీ సోర్బన్ ప్యారిస్ నోర్డ్ అధ్యయనంలో భోజన సమయాలకు, హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాలకు మధ్య గుట్టును నిర్ధారించింది.ముఖ్యంగా కార్డియోవాసు్కలర్ డిసీజెస్ (సీవీడీ)లో భాగంగా కొరోనరీ హార్ట్ డిసీజ్, సెరెబ్రోవాసు్కలర్ డిసీజ్, రుమాటిక్ హార్ట్ డిసీజ్ ప్రమాదాలను అరికట్టడానికి క్రమబద్ధమైన ఆహారపు అలవాట్లు మేలైన మార్గమని సూచిస్తోంది. నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్‌లో ప్రచురించిన ఈ ఫ్రెంచ్ అధ్యయనం ప్రకారం రాత్రిపూట ఎక్కువసేపు ఉపవాసంతో ఉంటే హృదయ సంబంధ వ్యాధుల ప్రభావాన్ని తగ్గించవచ్చని పరిశోధకులు కనుగొన్నారు. ఇందుకు నిద్రవేళకు దగ్గరగా భారీ భోజనాన్ని తగ్గించాలని హెచ్చరిస్తున్నారు. ఖాళీ కడుపు.. శరీరంలోని వివిధ అవయవాల సిర్కాడియన్ లయలను సరి చేస్తుందని చెబుతున్నారు. ముఖ్యంగా రక్తపోటు నియంత్రణ వంటి కార్డియోమెటబాలిక్ పనితీరును ప్రభావితం చేస్తుంది. ఈ సిర్కాడియన్ రిథమ్ శరీరంలోని అంతర్గత గడియారంగా పని చేస్తుంది. లేటుగా తింటే చేటే.. అల్పాహారం దాటవేయడం, రోజులో మొదటి ఆహారాన్ని ఆలస్యంగా తీసుకోవడంతో గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని అధ్యయనం వెల్లడించింది. ఉదాహరణకు ఉదయం 8 గంటలకు తినేవారి కంటే 9 గంటలకు అల్పాహారం చేసే వ్యక్తికి హృదయ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం 6 శాతం ఎక్కువ. ఆలస్యంగా రాత్రి 8 గంటలకు బదులు 9 గంటలకు తినడం వల్ల ముఖ్యంగా మహిళల్లో పోలిస్తే స్ట్రోక్ వంటి సెరెబ్రోవాసు్కలర్ వ్యాధి వచ్చే ప్రమాదం 28 శాతం పెరుగుతుందని పరిశోధకులు గుర్తించారు. రాత్రిపూట ఎక్కువ సేపు ఉపవాస సమయం ఉంటే సెరెబ్రోవాసు్కలర్ వ్యాధి ప్రమాదాన్ని తగ్గించవచ్చని, ఉదయం ప్రారంభ భోజనం మెరుగైన ఇన్సులిన్ సెన్సిటివిటీని, ఇన్ఫ్లమేషన్ను నివారించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుందని గుర్తించారు. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచడం ద్వారా కాలక్రమేణా హృదయనాళ వ్యవస్థపై ఒత్తిడి తగ్గి గుండె పనితీరు మెరుగుపడుతుందని చెబుతున్నారు. భోజనం చేసే సమయం నిద్ర నాణ్యతను కూడా ప్రభావతం చేయడం ద్వారా గుండె సంబంధిత వ్యాధుల ముప్పు పొంచి ఉంటుందని పేర్కొన్నారు. ఐదో వంతు భారత్‌లోనే.. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2020 నివేదిక ప్రకారం హృదయ సంబంధ వ్యాధుల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా 1.80 కోట్ల మరణాలు నమోదైతే.. ఇందులో ఐదో వంతు భారత్ నుంచే ఉన్నాయి. ముఖ్యంగా భారతీయ యువతలో గుండె సంబంధిత మరణాలు ఎక్కువయ్యాయి. గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ అధ్యయనంలోనూ భారత్‌లో ఒక లక్ష జనాభాకు 272 మంది హృదయ సంబంధ మరణాలు రేటు ఉంది. ఇది ప్రపంచ సగటు 235 కంటే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. -
లావొక్కింత మితిమీరె!
ప్రపంచం లావెక్కిపోతోంది. అన్ని దేశాల్లోనూ కలిపి స్థూలకాయుల సంఖ్య ఇప్పటికే అక్షరాలా 100 కోట్లు దాటేసింది! 1990 నుంచే వీరి సంఖ్యలో ఏకంగా నాలుగు రెట్ల పెరుగుదల నమోదైంది. మూడు దశాబ్దాల క్రితం దాకా పెద్దల్లోనే ఎక్కువగా కని్పంచిన ఊబకాయ సమస్య ఇప్పుడు చిన్నారుల్లో కూడా పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు, ఆధునిక జీవితపు ఒత్తిళ్లతో పాటు పౌష్టికాహార లోపం కూడా దీనికి ప్రధాన కారణమేనని తాజా అధ్యయనంలో తేలింది. మొత్తమ్మీద ప్రపంచవ్యాప్తంగా 2022 నాటికే వయోజనుల్లో ఊబకాయుల సంఖ్య 88 కోట్లు దాటింది. అలాగే టీనేజీ లోపు వయసు వారిలోనూ 16 కోట్ల పై చిలుకు ఊబకాయంతో బాధపడుతున్నారు. టోంగా, నౌరు, సమోవా తదితర దేశాల్లో మూడొంతులకు పైగా జనం ఊబకాయులేనట! 1990 నుంచి 2022 మధ్య పలు గణాంకాలు తదితరాల ఆధారంగా అధ్యయనం సాగింది. ఈ జాబితాలో అమెరికా కూడా పురుషుల్లో పదో స్థానంలో, మహిళల్లో 36వ స్థానంలో నిలిచింది. ఈ దేశాల్లో అనారోగ్యకరమైన ఆహారపుటలవాట్లే సమస్యకు ప్రధాన కారణమని తేలినట్టు అధ్యయన బృంద సభ్యుడు ప్రొఫెసర్ మజీద్ ఎజాటి వెల్లడించారు. మరోవైపు తక్కువ బరువుతో బాధపడుతున్న వారి సంఖ్యలో 50 శాతం తగ్గదల నమోదైంది. కాకపోతే నిరుపేద దేశాలు, సమాజాల్లో ఇది ఇంకా ప్రబల సమస్యగానే ఉందని అధ్యయనం పేర్కొంది. భారత్‌లోనూ ఊబకాయుల సంఖ్య 8 కోట్లు దాటినట్టు వెల్లడించింది. తక్షణం మేల్కొనాలి... ఒకప్పుడు ప్రధానంగా పెద్దవాళ్లలోనే కన్పించిన స్థూలకాయ సమస్య ఇప్పుడు స్కూలు వయసు చిన్నారుల్లోనూ ప్రబలమవుతుండటం చాలా ఆందోళనకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ గేబ్రయేసస్ అన్నారు. చిన్న వయసులోనే గుర్తించి అరికట్టాల్సిన అవసరాన్ని తాజా సర్వే మరోసారి నొక్కిచెప్పిందని చెప్పారు. ఇందుకోసం ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు కూడా పెద్ద ఎత్తున ముందుకు రావాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆరోగ్యకరమైన ఆహారం, నియమిత వ్యాయామాలు తదితరాలను జీవన శైలిలో భాగంగా మార్చుకోవడం తప్పనిసరన్నారు. పలు దేశాల్లో ప్రధానంగా పౌష్టికాహార లోపమే స్థూలకాయానికి దారి తీస్తోందని అధ్యయనంలో పాలుపంచుకున్న మద్రాస్ డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్‌కు చెందిన డాక్టర్ గుహా ప్రదీప అభిప్రాయపడ్డారు. వాతావరణ మార్పులు, కొవిడ్ కల్లోలం, ఉక్రెయిన్ యుద్ధం వంటివన్నీ సమస్యను మరింత జటిలం చేస్తున్నాయని వివరించారు. ‘‘ఇవి ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఖరీదైన వ్యవహారంగా మార్చేస్తున్నాయి. ఫలితంగా చాలా దేశాల్లో ప్రజలకు చాలీచాలని, నాసిరకం ఆహారం అందుతోంది’’ అని ఆవేదన వెలిబుచ్చారు. ఇలా చేశారు... ► అధ్యయనంలో 1,500 మందికి పైగా రీసెర్చర్లు పాలుపంచుకున్నారు. ► ఎన్సీడీ రిస్క్ ఫ్యాక్టర్ కొలాబరేషన్ పేరిట వీరంతా ప్రపంచ ఆరోగ్య సంస్థతో పని చేశారు. ► ప్రపంచవ్యాప్తంగా 190కి పైగా దేశాల నుంచి ఐదేళ్ల పైబడ్డ 22 కోట్ల మందికి పైగా ప్రజల ఎత్తు, బరువు తదితర శారీరక కొలతలను సేకరించారు. ► ఊబకాయాన్ని నిర్ధారించేందుకు బాడీ మాస్ ఇండెక్స్‌ను ఆధారంగా తీసుకున్నారు. గణాంకాలివీ... ► ప్రపంచవ్యాప్తంగా వయోజనుల్లో 88 కోట్లు, టీనేజీ, ఆ లోపు వారిలో దాదాపు 16 కోట్ల మంది ఊబకాయులున్నారు. ► వయోజన ఊబకాయుల్లో 50 కోట్లకు పైగా పురుషులు కాగా 38 కోట్ల మంది స్త్రీలు. ► 1990లో వయోజనుల్లో ఊబకాయుల సంఖ్య 20 కోట్ల లోపే ఉండేది. ► వారిలో స్త్రీలు 13 కోట్లు కాగా 7 కోట్ల మందికి పైగా పురుషులుండేవారు. భారత్‌లోనూ... భారత్ కూడా ఊబకాయ సమస్యతో బాధపడుతోంది. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య బాగా పెరుగుతుందటం ఆందోళన కలిగిస్తోంది. వయోజన మహిళల్లో ఊబకాయులు 1990లో కేవలం 1.2 శాతముండగా 2022 నాటికి ఏకంగా 9.8 శాతానికి పెరిగారు. పురుష జనాభాలో ఊబకాయుల సంఖ్య 0.5 శాతం నుంచి 5.4 శాతానికి పెరిగింది. మొత్తమ్మీద 2022 నాటికి దేశవ్యాప్తంగా 4.4 కోట్ల మహిళలు, 2.6 కోట్ల మంది పురుషులు ఊబకాయంతో బాధపడుతున్నారు. ఇక దేశవ్యాప్తంగా 5–19 ఏళ్ల మధ్య వయసు్కన్న పిల్లల్లో దాదాపు 1.25 కోట్ల మంది ఊబకాయులేనని అధ్యయనంలో తేలింది. 75 లక్షలతో వీరిలో అబ్బాయిల సంఖ్యే ఎక్కువ. – సాక్షి, నేషనల్ డెస్క్ -
గుర్తిద్దాం... నివారిద్దాం
సాక్షి, హైదరాబాద్: కేన్సర్ మహమ్మారికి అడ్డుకట్ట వేయడంలో భాగంగా చికిత్స అందించడం కన్నా నివారణ మార్గాలే అత్యంత ప్రామాణికమని కాంటినెంటల్ ఆస్పత్రి వ్యవస్థాపకుడు, చైర్మన్ డాక్టర్ గురు ఎన్ రెడ్డి తెలిపారు. ఒకే రక్త పరీక్షతో కేన్సర్‌ను ముందస్తుగా గుర్తించేలా కాంటినెంటల్ ఆస్పత్రి ఆధ్వర్యంలో నూతనంగా ‘కేన్సర్ ప్రివెన్షన్ అండ్ ఎర్లీ కేన్సర్ డిటెక్షన్’విభాగాన్ని ఏర్పాటు చేశారు. శనివారం హైదరాబాద్‌లోని ఓ హోటల్ వేదికగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రపంచ ప్రఖ్యాత కేన్సర్ స్పెషలిస్ట్, ప్రపంచ ఆరోగ్య సంస్థ కేన్సర్ ప్రోగ్రామ్ మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ కరోల్ సికోరా ఈ విభాగాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ గురు ఎన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రపంచంలోనే ప్రఖ్యాత కేన్సర్ సెంటర్ ఎండీ అండర్సన్ కేన్సర్ ఇన్స్టిట్యూట్లో 40 ఏళ్ల పాటు పనిచేసి, ఆ అనుభవాన్నంతా దేశంలోనే సేవలందించాలనే లక్ష్యంతో కాంటినెంటల్ ఆసుపత్రిని స్థాపించానని తెలిపారు. ఇప్పటికే 40 వేల మందిని పైగా కేన్సర్ కోరల నుంచి బయటికి తీసుకొచ్చిన తమ కేన్సర్ కేర్ టీమ్... రాబోయే రోజుల్లో ఈ బ్లడ్ టెస్ట్ ద్వారా మరింత ఎక్కువ మందిని కేన్సర్ బారి నుంచి కాపాడటమే లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. లిక్విడ్ బయాప్సీ టెస్ట్‌తో కేన్సర్ గుర్తింపు ముంబయిలోని టాటా మెమోరియల్ హాస్పిటల్ వంటి సంస్థల్లో కేన్సర్ విభాగంలో 40 ఏళ్లపాటు సేవలందించిన డాక్టర్ జగన్నాథ్ నిర్వహణలో కేన్స ర్ ప్రివెన్షన్ అండ్ ఎర్లీ కేన్సర్ డిటెక్షన్ విభాగం కొనసాగుతుందని గురు ఎన్ రెడ్డి తెలిపారు. ఇందులో భాగమైన లిక్వి డ్ బయాప్సీ టెస్ట్‌తో ముందుగా కేన్సర్‌ను గుర్తించే సామర్థ్యాన్ని అందిస్తుందన్నారు. ఈ మూడు టెస్ట్‌లతో... ఆస్పత్రిలో మూడు రకాల జన్యు పరీక్షలను ప్రారంభించామని డాక్టర్ గురు ఎన్ రెడ్డి తెలిపారు మొదటగా కేన్సర్ ప్రిడిస్పోజిషన్ టెస్ట్... జన్యు అమరిక, వాటిలోని తేడాలను అర్థం చేసుకుని, భవిష్యత్‌లో ఏ రకమైన కేన్సర్ వ్యాధి బారిన పడతామో ముందుగానే గుర్తిస్తుందన్నారు. రెండోది కేన్సర్ స్క్రీనింగ్ టెస్ట్.. వంశపారంపర్యంగా వచ్చే కేన్సర్లను గుర్తించడానికి ఈ కేన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ జెనెటిక్ మేకప్‌ను సమగ్రంగా పరిశీలిస్తుందన్నారు. యూఎస్ఏలోని నేషనల్ కాంప్రహెన్సివ్ కేన్సర్ పేర్కొన్న విధంగా... రొమ్ము కేన్సర్, ఓవరిన్ కేన్సర్, పాంక్రియాటిక్ కేన్సర్, ప్రొస్టేట్ కేన్సర్, కొలొరెక్టల్ కేన్సర్ వంటి ఐదు కేన్సర్లకు కారణం అయ్యే వంశపారంపర్యంగా వచ్చే జన్యువులను ఈ టెస్ట్ ద్వారా గుర్తించవచ్చన్నారు. మూడోది నెక్స్ట్ – జనరేషన్ సీక్వెన్సింగ్ (ఎన్జీఎస్) ఆధారిత సీఎఫ్డీఎన్ఏ పరీక్ష. దీని ద్వారా రక్త ప్రవాహంలో తిరుగుతున్న సెల్ ఫ్రీ డీఎన్ఏను విశ్లేషించి కేన్స ర్ను చాలా ముందుగా గుర్తించవచ్చన్నారు. ఇలా 3 దశల్లో జన్యువులోని కేన్సర్ బారినపడ్డ, పడబోతున్న ప్రాంతాలను ఈ రక్త పరీక్ష ద్వారా చాలా కచ్చితత్వంతో తెలుసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ సమగ్ర విశ్లేషణతో కేన్స ర్ చికిత్స మరింత సులభతరం అవుతుందన్నారు. అపోహలను తొలగించాలి: కరోల్ సికోరా ప్రొఫెసర్ కరోల్ సికోరా మాట్లాడుతూ... కేన్సర్ నివారించడం సాధ్యమేనా అనుకునే అపోహలను ప్రయత్నమనే ఒక్క అడుగుతో తొలగించవచ్చన్నారు. ఇలాంటి అద్భుతమైన ప్రయత్నాన్ని మొదలుపెట్టిన కాంటినెంటల్ ఆసుపత్రికి ఆయన అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో కాంటినెంటల్ కేన్సర్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ జగన్నాధ్, డాక్టర్ రవీంద్రనాథన్, డాక్టర్ ఏవీ సురేష్, అనురాధ తదితరులు పాల్గొన్నారు. అవగాహనతో భయాందోళనలు తొలగింపు.. కేన్సర్‌ను ఆలస్యంగా గుర్తించడం వల్ల మరణాలు ఎక్కువ చోటుచేసుకుంటున్నాయని అందుకే వీటిపై అవగాహన కల్పించడానికి కాంటినెంటల్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని డాక్టర్ గురు ఎన్ రెడ్డి వెల్లడించారు. ఆస్పత్రి వైద్యుల నేతృత్వంలో ఫిబ్రవరి నెలలో వందలాది మందికి అవగాహన కల్పించామని చెప్పారు. ఆడవారిలో వచ్చే కేన్సర్లు, లక్షణాలు, జాగ్రత్తలపైన, గ్యాస్ట్రో ఇంటస్టైన్, లివర్ కేన్సర్లపైన ఊపిరితిత్తులు, తల, మెడ కేన్సర్లు, గ్లాడర్, కిడ్నీ, ప్రొస్టేట్, చర్మ కేన్సర్ల పైన అవగాహన కల్పి ంచామన్నారు. మంచి చికిత్సను అందించడమే కాకుండా కేన్సర్ రాకుండా అవగాహన కల్పించడం బాధ్యతగా అలవర్చుకున్నామన్నారు. ఇన్సూరెన్స్ సంస్థలు వారి సేవల్లో కేన్సర్ బాధితులను చేర్చాల్సిన అవసరముందని, 70 శాతం మంది బాధితులు ఆర్థిక సమస్యలతోనే మరణిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. -
వైద్యంలో ఏఐ తప్పులకు బాధ్యులెవరు?
అన్ని రంగాల మాదిరిగానే ఆరోగ్య రంగంలోనూ కృత్రిమ మేధ (ఏఐ) వాడటం మొదలైంది. వ్యాధి నిర్ధారణ, క్లినికల్ కేర్, చికిత్స, రోగుల వైద్య చరిత్రను అక్షరబద్ధం చేయడం, మందుల అభివృద్ధి వంటి పనులకు తగు జాగ్రత్తలతో ‘ఎల్ఎంఎం’లను వాడొచ్చునని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. ఆ మేరకు ఆరోగ్య సిబ్బందిపై భారం తగ్గుతుంది. మనిషి మాదిరిగానే స్పందించాలన్నది ఎల్ఎంఎంల తయారీ ఉద్దేశమన్నది తెలిసిందే. అలాంటప్పుడు వీటి ద్వారా తప్పులు జరిగితే బాధ్యత ఎవరిది? ఆరోగ్య సేవలు, ఉత్పత్తులకు అన్వయిస్తున్న నైతిక, మానవ హక్కుల ప్రమాణాలను ఏఐ టెక్నాలజీలు, టూల్స్‌కు కూడా విస్తరించాలి. భారీ స్థాయిలో ఎల్ఎంఎంలు విడుదలైన ప్రతిసారీ వీటిని కచ్చితంగా ఆడిట్ చేసే ఏర్పాట్లు చేసుకోవాలి. ఛాట్‌జీపీటీ వంటి కృత్రిమ మేధ(ఏఐ) టూల్స్ వాడకం ఇటీవల బాగా పెరిగింది. అన్ని రంగాల్లో మాదిరిగానే ఆరోగ్య రంగంలోనూ కృత్రిమ మేధ టెక్నా లజీలను వాడటం మొదలుపెట్టారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ హెచ్ఓ) ఈ విషయమై ఒక హెచ్చరిక జారీ చేసింది. ఛాట్‌జీపీటీ, బార్డ్ వంటి ఎల్ఎంఎం (లార్జ్ మల్టీ–మోడల్ మోడల్స్)లు అందించిన సమాచారం, వీడియోలకు మాత్రమే పరిమితం కాకుండా... అంతకంటే ఎక్కువ విషయాలపై వ్యాఖ్యానించగలవు. మనిషి మాదిరిగానే స్పందించాలన్నది ఎల్ఎంఎంల తయారీ ఉద్దేశమన్నది తెలిసిందే. పరిస్థితులకు తగ్గట్టుగా కొత్త విషయాలను ఎప్పటికప్పుడు నేర్చు కోవడం ఇవి చేసే పని. ఆరోగ్య రంగంలో వీటిని ఉపయోగించడం వల్ల తప్పుడు సమాచారం, ఏకపక్ష లేదా అసంపూర్తి సమాచారం అందే ప్రమాదాలు ఉంటాయనీ, ఇది మన ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చుననీ డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. శిక్షణ ఇచ్చేందుకే తప్పుడు సమాచారాన్ని ఉపయోగిస్తే పరిస్థితి మరింత అధ్వాన్న మవుతుందన్నది ఈ హెచ్చరిక సారాంశం. ముఖ్యంగా జాతి, కులం, మతం వంటి విషయాల్లో ఏఐ టెక్నాలజీలు వివక్షతో కూడిన సమాచా రాన్ని తయారు చేసే ప్రమాదముంది. ఏఐ వాడకం పెరిగిపోతున్న నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ 2021లో సాధారణ మార్గదర్శకాలు కొన్నింటిని జారీ చేసింది. అదే సమయంలోనే ఆరోగ్య రంగంలో ఏఐ వాడకంతో రాగల ప్రయోజనాలనూ గుర్తించింది. నైతికత విషయంలో కొన్ని స్థూల మార్గదర్శకాలను సిద్ధం చేసింది. వాటి ప్రకారం... ఏఐ టెక్నాలజీలు స్వయం ప్రతిపత్తిని కాపా డేలా ఉండాలి. మానవ సంక్షేమం, భద్రత, ప్రజాప్రయోజనాలు, పారదర్శకతలకు పెద్దపీట వేయాలి. తెలివిగా ప్రవర్తించడంతోపాటు వివరించేలా ఉండాలి. బాధ్యత స్వీకరించాలి. అందరినీ కలుపుకొని పోవాలి. వివక్ష లేకుండా చూసుకోవాలి. వివరించేలా ఉండటం అంటే... ఏఐ తాలూకూ డిజైన్ , వినియోగం విషయాల్లో దాపరికం లేకుండా తగినంత సమాచారం అందరికీ అందుబాటులో ఉంచడం! పారదర్శకత ఆశించగలమా? ఆరోగ్య రంగంలో ఏఐ వాడకంపై డబ్ల్యూహెచ్ఓ ఇటీవల మరి కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. ఎల్ఎంఎంల ఆవిష్కరణతో ఇవి అనివార్యమయ్యాయి. ఎల్ఎంఎంల వాడకం గురించి అర్థం చేసు కోవాలంటే ఏఐ టెక్నాలజీని సమగ్రంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇది ఎల్ఎంఎం టూల్‌ను అభివృద్ధి చేయడంతో మొదలవుతుంది. అభివృద్ధి చేసేది కార్పొరేట్ కంపెనీ, యూనివర్సిటీ, స్టార్టప్ ఏదైనా కావచ్చు. ఇవన్నీ ఆధారపడేది సమాచార లభ్యత, నైపుణ్యాల పైనే. తరువాతి దశలో అభివృద్ధి చేసిన ఎల్ఎంఎంకు ఓ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అందిస్తారు. లోటుపాట్లను సరిచేయడం, విస్తృత సమాచా రంతో శిక్షణ ఇవ్వడం అన్నమాట. ఎల్ఎంఎంను భారీ సాఫ్ట్వేర్ వ్యవస్థలో భాగం చేయడం కూడా ఈ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ను సిద్ధం చేసే థర్డ్ పార్టీ బాధ్యతే. ఈ పని చేసిన తరువాత ఈ కృత్రిమ మేధ ద్వారా సేవలు అందుతాయి. లేదా ఒక అప్లికేషన్ రెడీ అవుతుంది. ఏఐ టెక్నాలజీ అభివృద్ధి దశల్లో మూడోది వినియోగదారుడికి దీన్ని అందించే డిప్లాయర్. ఆరోగ్య రంగంలో ఈ డిప్లాయర్ ఎక్కువ సందర్భాల్లో ఆసుపత్రి, ప్రభుత్వ ఆరోగ్య సంస్థ లేదా ఫార్మా కంపెనీ అయివుంటుంది. ఈ మూడు దశల్లో నైతికత, నియంత్రణకు సంబంధించిన చాలా ప్రశ్నలు, అంశాలు ఎదురవుతాయి. చాలాసార్లు డెవలపర్ పెద్ద టెక్ కంపెనీ అయి ఉంటుంది. ఎల్ఎంఎంల తయారీకి కావాల్సినన్ని నిధులు, టెక్నాలజీ నైపుణ్యాలు వీరి వద్దే ఉంటాయి. వీటి అభివృద్ధిలో వాడే అల్గారిథమ్స్, వాటి వల్ల రాగల ప్రమాదాల గురించి సామాన్యు లకు తెలిసే అవకాశాలు తక్కువే. కార్పొరేట్ కంపెనీ కాబట్టి పార దర్శకత, నిబద్ధతలను కూడా ఆశించలేము. నియంత్రణ ఎలా? ఈ నేపథ్యంలోనే ప్రపంచవ్యాప్త ప్రభుత్వ నియంత్రణ సంస్థలకు ఒక బెంగ పట్టుకుంది. కొత్తగా అందుబాటులోకి వస్తున్న ఏఐ టూల్స్ ప్రస్తుత న్యాయ, చట్ట వ్యవస్థల్లోకి ఇముడుతాయా? మానవ హక్కు లకు సంబంధించిన అంశాలతోపాటు దేశాల డేటా పరిరక్షణ చట్టాల విషయంలోనూ ఈ సందేహముంది. ఎల్ఎంఎంల ప్రవేశం ఒక రకంగా ప్రభుత్వ, నియంత్రణ సంస్థలు ఏమరుపాటుగా ఉన్న సమయంలో జరిగిందని చెప్పాలి. యూరోపియన్ యూనియన్ విష యాన్నే తీసుకుందాం. ఎల్ఎంఎంలను చేర్చేందుకే వీరు ఆర్టిఫీషియల్ ఇంటె లిజెన్స్ చట్టాన్ని చివరి దశలో మార్చాల్సి వచ్చింది. డబ్ల్యూహెచ్ఓ నివేదిక ప్రకారం అల్గారిథమ్స్ ప్రస్తుత చట్ట, న్యాయ వ్యవస్థల పరిధిలోకి చేరే అవకాశం లేదు. మరోవైపు ఎల్ఎంఎంలు కూడా మనుషుల్లా చిత్తభ్రమలకు గురై తప్పుడు సమాచారాన్ని ఇవ్వవచ్చునని ఇప్పటికే పలు అధ్యయనాలు స్పష్టం చేశాయి. ఇంకో ఆందోళన ఏమిటంటే... ఈ ఎల్ఎంఎంల ద్వారా తప్పులు జరిగితే వాటికి బాధ్యత ఎవరిది? ఇలాంటి తప్పుల కారణంగా జరిగే నష్టం, కలిగే హాని, దుర్వినియోగాలకు ఎవరు బాధ్యులన్న విషయంపై కూడా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. పైగా ఈ ఎల్ఎంఎంలు సైబర్ సెక్యూరిటీ ముప్పులకు అతీతమేమీ కాదు. ఆరోగ్య రంగంలో వీటిని వాడితే రోగుల సమాచారం దుర్వినియోగమయ్యే అవకాశాలు ఎక్కువ. ఆరోగ్య రంగంలో ఏఏ అంశాలకు ఎల్ఎంఎంలను వాడవచ్చు నన్న విషయంపై డబ్ల్యూహెచ్ఓ ఒక స్థూల అంచనాకు వచ్చింది. వ్యాధి నిర్ధారణ, క్లినికల్ కేర్, లక్షణాలను పరిశీలించడం, చికిత్స, పరిపాలన, రోగుల వైద్య చరిత్రను అక్షరబద్ధం చేయడం వంటి పనులు... వైద్య, నర్సింగ్ శిక్షణ, శాస్త్రీయ పరిశోధన, మందుల అభివృద్ధి అన్న అంశాలకు మాత్రమే తగు జాగ్రత్తలతో ఎల్ఎంఎంలను వాడవచ్చునని సూచిస్తోంది. ఈ పనులన్నింటినీ ఎల్ఎంఎంలు చేస్తే ఆరోగ్య సిబ్బందిపై భారం అంతమేరకు తగ్గుతుంది. మరోవైపు ఓ కంపెనీ మెడికల్ ఎల్ఎంఎంను అభివృద్ధి చేసే పనిలో ఉంది. ఇది ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం, వైద్యపరమైన సమాచారాన్ని సంక్షి ప్తీకరించడం, అన్నింటినీ కలిపి వైద్యులకు స్థూల నివేదిక ఇవ్వడం వంటి పనులు చేస్తుంది. ఇలాంటివి ఎక్కువైన కొద్దీ వైద్యుడికి, రోగికి మధ్య ఉన్న సంబంధాలు దెబ్బతింటాయి. మరి ఏం చేయాలి? ఎల్ఎంఎంల వాడకాన్ని పూర్తిగా అడ్డుకోవ డమైతే కాదు. వీటిని అభివృద్ధి చేసే సమయంలో వీలైనంత ఎక్కువ పారదర్శకత తీసుకురావడం ఒకటైతే... వాడకం కూడా బాధ్యతాయు తంగా ఉండేలా చూసుకోవడం మరొకటి. ఈ దిశగా ముందు ప్రభు త్వాలు ఆరోగ్య రంగంలో వినియోగానికి తలపెట్టిన ఎల్ఎంఎంల మదింపు, అనుమతుల కోసం నియంత్రణ సంస్థలను ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ఏఐ వ్యవస్థల అభివృద్ధికి లాభాపేక్ష లేకుండా అందరికీ అందుబాటులో ఉండేలా మౌలిక సదుపాయాలను సమకూర్చాలి. శక్తిమంతమైన కంప్యూటింగ్ వ్యవస్థలు, డేటా సెట్స్ అటు ప్రభుత్వ, ఇటు ప్రైవేట్ వ్యక్తులూ వాడుకోగలిగితే తప్పు ఒప్పుల గురించి ఒక స్పష్టమైన అంచనా ఏర్పడుతుంది. ఆరోగ్య సేవలు, ఉత్ప త్తులకు ప్రస్తుతం అన్వయిస్తున్న నైతిక, మానవ హక్కుల ప్రమాణా లను ఏఐ టెక్నాలజీలు, టూల్స్‌కు కూడా విస్తరించాలి. ఆరోగ్య, వైద్య అంశాలకు సంబంధించి భారీ స్థాయిలో ఎల్ఎంఎంలు విడుదలైన ప్రతిసారి ఏఐ టూల్స్, టెక్నాలజీలను కచ్చితంగా ఆడిట్ చేసేలా ఏర్పాట్లు చేసుకోవాలి. ఏఐతో వచ్చే లాభాలపై అతిగా అంచనాలూ పెట్టుకోవద్దు; రాగల ముప్పులను తక్కువ చేసి చూడనూ వద్దు. దినేశ్ సి. శర్మ వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
World Health Organization: భారత్‌లో 9 లక్షల క్యాన్సర్ మరణాలు
న్యూఢిల్లీ: భారత్‌ను క్యాన్సర్ మహమ్మారి కబళిస్తున్న తీరును ప్రపంచ ఆరోగ్య సంస్థ తన తాజా గణాంకాల్లో వెల్లడించింది. ది ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ గణాంకాల ప్రకారం 2022లో భారత్‌లో 14.1 లక్షల క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి. క్యాన్సర్ కారణంగా 9.1 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. పురుషల్లో పెదవులు, నోటి, ఊపిరితిత్తుల క్యాన్సర్లు సర్వసాధారణమయ్యాయి. రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లు మహిళల్లో ఎక్కువయ్యాయి. మొత్తం కొత్త కేసుల్లో 27 శాతం బ్రెస్ట్, 18 శాతం సెరి్వక్స్ యుటెరీ క్యాన్సర్లు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ సోకి ఐదేళ్లుగా బాధపడుతున్న వారి సంఖ్య 5.3 కోట్లకు చేరిందని నివేదికలో పేర్కొన్నారు. -
నిబద్ధతతోనే కాలుష్య నియంత్రణ
దేశంలోని కొన్ని ప్రాంతాల్లో అరుదుగా మాత్రమే నీలి ఆకాశం కనబడుతోంది. గాలి నాణ్యత తీవ్రతకు ఇదొక సంకేతం. వాయు కాలుష్యం ఇప్పుడు జాతీయ సమస్య. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, గాల్లోని నలుసు పదార్థాల (పీఎం) సాంద్రత 2.5 పీఎం అయితే, ఒక క్యూబిక్ మీటరుకు 5 మైక్రో గ్రాములు మించకూడదు. ఇది ఢిల్లీ లాంటి నగరంలో 102. ఈ గాలిని పీల్చడం ప్రాణాంతకం. వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి తెచ్చిన ‘జాతీయ స్వచ్ఛ వాయు కార్యక్రమం’ కొంతమేరకు ఫలితమిస్తున్నా అది సరిపోదు. మానవ కణజాలంలోకి చొచ్చుకుపోయే కాలుష్య కారకాలతో మనం వ్యవహ రిస్తున్నాం. ప్రజారోగ్య దృక్కోణం నుండి చూస్తే ఎంత ప్రగతి అయినా తక్కువే. నిరంతర రాజకీయ నిబద్ధత మాత్రమే మెరుగైన ఫలితాలను ఇస్తుంది. శీతకాలపు నెలల్లో భారీ పొగమంచుతో కప్పబడి ఉండే ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో నీలి ఆకాశం, ప్రకాశవంతమైన సూర్యబింబం అరుదుగా గోచరిస్తుంటాయి. అయితే పేలవమైన గాలి నాణ్యత అనేది ఇప్పుడు జాతీయ సమస్య అయింది. కాకపోతే గత ఐదేళ్లలో, వాయు కాలుష్యం ఒక విధానపరమైన సమస్యగా కూడా గుర్తింపు పొందింది. అయిన ప్పటికీ ‘జాతీయ స్వచ్ఛ వాయు కార్యక్రమ’ (ఎన్సీఏపీ) అయిదేళ్ల అంచనాను పరిశీలిస్తే, అర్థవంతమైన, శాశ్వతమైన ప్రయోజనాలను అందించడానికి గట్టి ప్రయత్నాలు అవసరమని తెలుస్తుంది. అపఖ్యాతి పాలైన భారతదేశ గాలి నాణ్యతను పరిష్కరించడానికి తెచ్చిన మొదటి విధానం – 2019లో ప్రారంభించిన ఎన్సీఏపీ. కాలుష్య స్థాయులను, గాలిలోని నలుసు పదార్థాల గాఢతలను ప్రధాన నగరాల్లో 30 నుంచి 20 శాతం తగ్గించాలనే స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించింది. దీనికి కేంద్రం నుండి రూ. 443 కోట్లు, 15వ ఆర్థిక సంఘం నుండి రూ. 4,400 కోట్ల ప్రారంభ కేటాయింపులు జరిపారు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ)కి చెందిన నిరంతర పరిసర వాయు నాణ్యతా పర్యవేక్షణ కేంద్రాల విశ్లేషణ (భారత దేశ వాయు నాణ్యతా మానిటర్ల నెట్వర్క్) పురోగతి స్థిరంగా ఉన్నప్ప టికీ, ఎన్‌సీఏపీని అమలు చేయడంలో వ్యూహాత్మకమైన, సైన్స్ ఆధారిత మార్పుల అవసరం ఉంది. ఉదాహరణకు, ప్రపంచ ఆరోగ్య సంస్థ గాల్లోని నలుసు పదార్థాల (పర్టిక్యులేట్ మ్యాటర్) సాంద్రతకు పరిమితులు నిర్దేశించింది. 2.5 పీఎం అయితే, ఒక క్యూబిక్ మీటరుకు 5 మైక్రోగ్రాములు, 10 పీఎం అయితే ఒక క్యూబిక్ మీటరుకు 15 మైక్రోగ్రాములు మించకూడదు. ఎన్సీఏపీ అమలయ్యాక, ప్రత్యేకించి 2.5 పీఎం వారణాసిలో 96 నుంచి 26.9 మైక్రోగ్రాములకు తగ్గింది. ఆగ్రాలో 73 నుంచి 33కు, జో«ద్‌పూర్‌లో 81.8 నుంచి 40.6కు మెరుగ్గా తగ్గింది. కానీ ఢిల్లీలో మాత్రం 108 నుంచి 102కు మాత్రమే తగ్గింది. పీఎం 2.5 స్థాయుల డేటా 2019–2023 మధ్య 46 నగరాలకు మాత్రమే అందుబాటులో ఉంది. కేవలం 27 నగరాల్లో మాత్రమే తగ్గుదల మెరుగ్గా ఉంది. 10 పీఎం విషయంలో ఐదేళ్ల డేటా కేవలం 46 నగరాలకు అందుబాటులో ఉండగా, అందులో కేవలం 24 నగరాల్లో మాత్రమే మెరుగుదల కనబడింది. 50 శాతం నగరాలు గణనీయమైన అభివృద్ధిని చూపుతున్నా యనీ, ఇది ఎన్సీఏపీ విజయవంతమైన ప్రగతిని సూచిస్తోందనీ ఎవరైనా వాదించవచ్చు. కానీ మనం మానవ కణజాలంలోకి చొచ్చుకుపోయే కాలుష్య కారకాలతో వ్యవహరిస్తున్నాము. పైగా రక్తపోటు, మధుమేహం వంటివాటిని ఇవి మరింత తీవ్రతరం చేయవచ్చు. 2.5 పీఎం రక్త–మెదడు అవరోధాన్ని కూడా దాటవచ్చు. దీర్ఘకాలం అలాంటి గాలిలో మసలితే ప్రాణాంతకం అవుతుంది. కాబట్టి, ప్రజారోగ్య దృక్పథం నుండి చూస్తే మరింత కఠినమైన ప్రగతి అత్యవశ్యం. మరో సమస్య ఏమిటంటే, ఎన్సీఏపీలో సమన్వయం కొరవడింది. ఢిల్లీ లాంటి నగరంలో సరి–బేసి ట్రాఫిక్‌ను అమలు చేయడం, ‘జాతీయ రాజధాని ప్రాంతం’ నుండి నిబంధనలు పాటించని వాహనాలను తొలగించడం, వ్యర్థాలను బహిరంగంగా కాల్చడాన్ని నిరోధించడం, దుమ్మును తగ్గించడానికి రోడ్లపై నీటిని చల్లడం వంటి చర్యలు అన్నీ అమలవుతున్నాయి. అయినప్పటికీ, కాలుష్యానికి సంబంధించిన ఇవే కారణాలు ఉన్న మిగిలిన ప్రాంతాలకు విస్తరించకుంటే ఈ చర్యలు సరిపోవు. పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్‌లలో పంట అవశేషాలను తగలబెట్టడం వల్ల దట్టమైన పొగమంచుతో చలి కాలం ప్రారంభం కావడం దీనికి స్పష్టమైన ఉదాహరణ. ఢిల్లీ నగరంలో నమోదైన సుమారు 80 లక్షల వాహనాలు పరిస్థితిని మరింత దిగజార్చాయి. ఉష్ణోగ్రతలో తగ్గుదల గాలిలో నిలిచివుండే అణువుల స్థాయులను ప్రమాదకరంగా పెంచుతుంది. ఈ కాక్టెయిల్ను ఢిల్లీ నివాసులు ప్రతి సంవత్సరం కొన్ని వారాల పాటు పీల్చుకుంటున్నారు. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (గ్రాప్) ప్రతి శీతాకాలంలో ఢిల్లీ–జాతీయ రాజధాని ప్రాంతంలో ఊహించిన ప్రతిస్పందనగా అమలులోకి వస్తుంటుంది. అయితే దాని ఆధారాన్ని తగ్గించడమే లక్ష్యం కావాలి. రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సజావుగా సమన్వయం లేకపోతే ఈ సమస్య ఇలాగే కొనసాగుతుంది. జాతీయ రాజధాని వెలుపల, సీపీసీబీ పర్యవేక్షణ నెట్వర్క్ అసమానంగా ఉందని మా విశ్లేషణ చూపుతోంది. ఇది మూల్యాంకనానికి వ్యత్యాసాల పొరను జోడిస్తుంది. ముజఫర్‌పూర్, బిహార్ లాంటి రద్దీ ప్రదేశాలలో కేవలం మూడు మానిటర్లు ఉన్నాయి. అదే ఢిల్లీ అంతటా 37 స్టేషన్లు,ముంబై అంతటా 22, హైదరాబాద్‌లో 14 స్టేషన్లు ఉన్నప్పుడు మనం తప్పుడు నిర్ధారణలకు వచ్చే ప్రమాదం ఉంది. ప్రామాణిక పర్యవేక్షణ విధానంలో, పోల్చదగిన జనాభా ఉన్న నగరాలు ఒకే విధమైన లేదా కనీసం సారూప్య సంఖ్యలో గాలి నాణ్యత మానిటర్లను కలిగి ఉంటాయి. స్థానిక కాలుష్య మూలాల శాస్త్రీయ అవగాహన ఆధారంగా ఆ స్థానాలు ఉంటాయి. నగరాల కాలుష్య సాంద్రతలు ఒకే పారామి తుల సెట్లో ట్రాక్ చేయబడతాయి. ఇది వాటి గాలి నాణ్యత ధోర ణులపై ‘గ్రాన్యులర్’(కణికీయ) అవగాహనను పెంపొందించడంలో సహాయపడుతుంది. వాయు కాలుష్య ప్రయత్నాలకు సంబంధించిన నిధుల కేటాయింపుల్లో కూడా సమస్యలున్నాయి. తీవ్ర సమస్యను ఎదుర్కొంటున్న ఢిల్లీకి కేవలం రూ.38 కోట్లు మాత్రమే అందాయి. అందులో అది 10 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. గాలి నాణ్యత చర్యల కోసం వర్తించే నిధులను క్రమబద్ధీకరించడంలో ఇదొక ప్రశ్నగానే ఉండిపోతుంది. గ్రేటర్ ముంబైకి రూ.938 కోట్లు అందగా, దానిలో రూ.660 కోట్లు వినియోగించుకుంది. అయినప్పటికీ, జాతీయ స్వచ్ఛ వాయు పథకం(ఎన్సీఏపీ)లో సానుకూల అంశాలున్నాయి. వీటిలో మొదటిది 2026 నాటికి 10 పీఎం గాలి సాంద్రతలను 40 శాతానికి తగ్గించడం. ఇది ప్రతిష్ఠా త్మకమైన లక్ష్యాన్ని నిర్దేశిస్తోంది. అందుకే దీన్ని ఎన్సీఏపీ అమలు కాని నగరాలకు కూడా విస్తరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గ్రేటర్ నోయిడా (ఉత్తర ప్రదేశ్), భివాడీ (రాజస్థాన్) వంటివి తీవ్ర కాలుష్య స్థాయులను నివేదించాయి. ఇంకా, రంగాల వారీగా వివరణాత్మక చర్యలు ఉండాలి. ఇటుక బట్టీలు, నిర్మాణాలు, కూల్చివేత ప్రాజెక్టుల వంటి అత్యంత కాలుష్య కారకాలకూ... సిమెంట్, ఉక్కు కర్మాగారాలకూ భిన్నమైన విధానం అవసరం. అదేవిధంగా, ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతం మాత్రమే నిర్దిష్ట వయస్సు దాటిన పెట్రోల్, డీజిల్ వాహనాలను నిషేధించింది. కానీ దేశవ్యాప్తంగా కఠినమైన, కాలుష్య నియంత్రణ వ్యవస్థ లేక పోతే... ప్రమాణాలను అందుకోని వాహనాలను ఇతర నగరాలకు తరలించే ప్రమాదం ఉంది. అప్పుడు కాలుష్య భారం మారదు. మరీ ముఖ్యంగా, ఎన్సీఏపీ ప్రధాన అంశంగా ప్రజారోగ్యం ఉండాలి. ప్రతి కొలమానాన్ని తప్పనిసరిగా ప్రతిపాదించాలి, చర్చించాలి. అంతే గాకుండా వాయు కాలుష్య కారకాలను తగ్గించడం పట్ల నిర్మాణా త్మకంగా ఉండాలి. మనం ఎన్సీఏపీ రెండవ దశలోకి ప్రవేశించినప్పుడు చాలా ఆశించవచ్చు. ప్రభుత్వం అత్యున్నత స్థాయిలలో సమస్యను అంగీకరించడం అనేది మాత్రం ఇప్పటికి సానుకూలాంశం. కానీ నిరంతర రాజ కీయ నిబద్ధత మాత్రమే బలమైన ఫలితాలను ఇస్తుంది. ఆరతీ ఖోస్లా వ్యాసకర్త న్యూఢిల్లీలోని క్లైమేట్ ట్రెండ్స్ డైరెక్టర్ (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
డాక్టర్ల చేతికి ‘ఏఐ’స్కోప్!
సాక్షి, హైదరాబాద్: మనను పరీక్షించి, ఆరోగ్య సమస్య ఏమిటో గుర్తించే డాక్టర్లకు స్టెతస్కోప్ ఎలాంటిదో.. ఇకపై కృత్రిమ మేధ (ఏఐ) కూడా అలా అరచేతిలో ఉపకరణం కాబోతోంది. రోగ నిర్ధారణ నుంచి చికిత్సల దాకా వీలైనంత తోడ్పాటు అందించనుంది. భవిష్యత్తులో వైద్యరంగంలో ఏఐ అత్యంత కీలకంగా మారుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) పేర్కొంది. ఇప్పటికే రేడియాలజీ, టీబీ, కేన్సర్ వ్యాధుల నిర్ధారణ, చికిత్సల కోసం ఏఐని వినియోగిస్తున్నట్టు గుర్తు చేసింది. ఈ మేరకు ‘వైద్యారోగ్య రంగంలో కృత్రిమ మేధ వాడకం, నిర్వహణ, నైతికతపై డాక్యుమెంట్–2024’ను ఇటీవల విడుదల చేసింది. వ్యాధి నిర్ధారణ, క్రిటికల్ కేర్, క్లిష్టమైన కేసుల్లో వైద్యం చేయడంలో, వైద్య నిర్ధారణ పరీక్షలను సమీక్షించుకోవడంలో కృత్రిమ మేధ ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొంది. వెంటిలేటర్‌పై ఉన్న రోగులతో కూడా వారి కుటుంబ సభ్యులు ఏఐ సాయంతో మాట్లాడవచ్చని.. వారికి సంబంధించిన వైద్య నిర్ధారణ పరీక్షల నివేదికలను ఎప్పటికప్పుడు అందుకోవచ్చని తెలిపింది. వైద్యులు కేస్‌షీట్‌లో అన్ని వివరాలు రాసినా, వైద్య పరీక్షల రిపోర్టులను పరిశీలించినా.. వాటన్నింటినీ క్రోడీకరించి, అనుసంధానం చేసి చూడటం ఒకింత కష్టమని స్పష్టం చేసింది. అదే ఏఐ ద్వారా డేటా మొత్తాన్ని అనుసంధానం చేస్తే.. సరైన, కచ్చితమైన నిర్ధారణకు రావొచ్చని తెలిపింది. డబ్ల్యూహెచ్ఓ నివేదికలోని ముఖ్యాంశాలివీ.. ♦ రోగుల వివరాలు అన్నింటి నమోదులో ఏఐ ఉపయోగపడుతుంది. ♦ డాక్టర్లు, రోగులు వేర్వేరు భాషల్లో మాట్లాడితే.. ఇతర భాషల్లోకి తర్జుమా చేస్తుంది. దీంతో ప్రపంచంలో ఏ వైద్యులతోనైనా మాట్లాడవచ్చు, చికిత్స పొందవచ్చు. రోగులు వాడిన మందులు, ప్రిస్కిప్షన్లు, వచ్చిన జబ్బులు, లక్షణాలు, ఇతర వివరాలను ఏఐ సాయంతో నమోదు చేసి పెట్టవచ్చు. భవిష్యత్తులో ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే.. సులువుగా వైద్యం చేయడానికి వీలవుతుంది. ♦ వైద్య, నర్సింగ్ విద్యలో విద్యార్థుల స్థాయిని బట్టి బోధనను అందించవచ్చు. వివిధ రోగాలకు సంబంధించిన లక్షణాలను, వైద్య పరీక్షల నివేదికలను ఏఐ సాయంతో వేర్వేరుగా సృష్టించి.. ఎలాంటి పరిస్థితిలో ఏ తరహా చికిత్స ఇవ్వాలన్న శిక్షణ ఇవ్వవచ్చు. ♦ వైద్య పరిశోధన, మందుల తయారీ కోసం చాలా డేటా అవసరం. దానికోసం తీవ్రంగా శోధించాల్సి ఉంటుంది. అదే ఏఐ ఇంటర్నెట్ నుంచి సమాచారాన్ని క్రోడీకరించి అందిస్తుంది. ♦ వేల మంది రోగుల డేటా, వైద్య రిపోర్టులను ఏఐలో పొందుపర్చితే వాటన్నింటినీ విశ్లేషించి, రోగ నిర్ధారణలో సాయం చేయగలదు. ♦ ఒకేసారి లక్ష మంది చెస్ట్ ఎక్స్‌రేలను పొందుపర్చినా ఏఐ వాటన్నింటినీ విశ్లేíÙంచగలదు. డాక్టర్లకు సమయం కలసి వస్తుంది. చికిత్స సులువు అవుతుంది. స్పెషలిస్టుల కోసం ఎదురుచూడాల్సిన అవసరం తగ్గుతుంది. ♦ వెనుకబడిన, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 2030 నాటికి కోటి మంది డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది కొరత ఏర్పడుతుందని అంచనా. కృత్రిమ మేధను వాడటం వల్ల ఉన్న సిబ్బందితోనే సమస్యను అధిగమించొచ్చు. ♦ యాక్సెంచర్ కంపెనీ నివేదిక ప్రకారం.. ఏఐని సరిగా వాడితే డాక్టర్లకు 40శాతం సమయం ఆదా చేస్తుంది. రోగులకు మరింత నాణ్యమైన సమయం కేటాయించే అవకాశం వస్తుంది. ♦ 2023లో యాక్స్డ్ అనే కంపెనీ కృత్రిమ మేధ సాయంతో ప్రొటీన్‌లో ఉండే సమాచారాన్ని నిక్షిప్తం చేయడం మొదలుపెట్టింది. ఇప్పటివరకు 60కోట్ల ప్రొటీన్ల సమాచారాన్ని సేకరించింది. ఎన్నో పరిశోధనలకు ఇది ఉపయోగపడుతుంది. ♦ యూఎస్‌కు చెందిన ఒక కంపెనీ కృత్రిమ మేధకు సంబంధించిన ఒక భాషపై మోడల్‌ను తీసుకొచ్చింది. జనవరి 2023లో అది ప్రారంభం కాగా.. రెండు నెలల్లో 10 కోట్ల మంది దాన్ని వాడారు. క్లిష్టమైన కేసుల్లో రోగ నిర్ధారణ సులువు అరుదైన, క్లిష్టమైన కేసుల్లో రోగ నిర్ధారణ కష్టంగా మారుతున్న నేపథ్యంలో.. కృత్రిమ మేధ దాన్ని సులువు చేస్తుంది. వైద్య ఆవిష్కరణల వేగం గత 75 ఏళ్లలో 200 రెట్లు పెరిగింది. ఆ వేగాన్ని అందుకోవాలంటే వైద్యులకు సాయం అవసరం. కృత్రిమ మేధ ఆ లోటును పూడ్చగలదు. దీనిని సమర్థవంతంగా వాడితే వైద్యంలో కచ్చితత్వం పెరుగుతుంది. అయితే ఏఐలో కొన్ని అంశాలపై అసమగ్ర సమాచారాన్ని మనం పొందుపరిస్తే.. అది తనకుతాను ఊహించుకొని 3 నుంచి 27శాతం వరకు సొంత నిర్ణయాలు ఇచ్చే అవకాశముంది. ఈ మేరకు కొంత నష్టం వాటిల్లే ప్రమాదమూ ఉంది. ఎక్కువగా టెక్నాలజీపై ఆధారపడితే డాక్టర్లలో నైపుణ్యాలు తగ్గిపోయే అవకాశం కూడా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. – డాక్టర్ కిరణ్ మాదల, సైంటిఫిక్ కన్వినర్, ఐఎంఏ, తెలంగాణ -
70 శాతం రోగులకు యాంటీ బయోటిక్స్!
సాక్షి, హైదరాబాద్: యాంటీ బయోటిక్స్ వినియోగాన్ని పరిమితం చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)తో పాటు మరెన్నో వైద్య సంస్థలు సూచిస్తున్నప్పటికీ వాటి వినియోగం ఎంతమాత్రం తగ్గడం లేదు. దేశవ్యాప్తంగా 20 ప్రభుత్వ ఆసుపత్రులలో జాతీయ వ్యాధి నియంత్రణ సంస్థ (ఎన్సీడీసీ) నిర్వహించిన తాజా అధ్యయనంలో ఈ విషయం తేలింది. యాంటీ బయోటిక్స్ వినియోగాన్ని అంచనా వేయడానికి ఇప్పటివరకు దేశంలో నిర్వహించిన అతిపెద్ద మల్టీ సెంటర్ పీపీఎస్ (పాయింట్ ప్రెవలెన్స్ సర్వే)ల్లో ఇది ఒకటి. కాగా ఆసుపత్రుల్లో అడ్మిట్ అయిన 10 మంది రోగులలో ఏడుగురికి యాంటీ బయోటిక్స్‌ను సూచిస్తున్నట్టు (ప్రిస్క్రైబ్) ఈ సర్వే వెల్లడించింది. 70%లో కనీసం 5% మంది నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రకాల యాంటీ బయోటిక్స్ తీసుకుంటున్నారని వెల్లడైంది. వాచ్ గ్రూప్ యాంటీ బయాటిక్సే ఎక్కువ సాధారణంగా రోగులకు ఉపయోగించే 180 రకాల యాంటీబయోటిక్‌లను, వాటి సామర్థ్యాలకు అనుగుణంగా, వినియోగించాల్సిన తీరుతెన్నులను నిర్ధారించడానికి వాచ్ గ్రూప్ యాంటీ బయాటిక్స్, యాక్సెస్ గ్రూప్ యాంటీ బయాటిక్స్, రిజర్వ్ గ్రూప్ యాంటీ బయాటిక్స్ అంటూ మూడు కేటగిరీలుగా విభజించారు. వీటిలో అత్యధిక సామర్ధ్యం కలిగిన హయ్యర్ రెసిస్టెన్స్ పొటెన్షియల్ కిందకు వచ్చే వాచ్ గ్రూప్ తరహా యాంటీ బయాటిక్స్నే ఎక్కువగా సూచిస్తున్నారని సర్వే నిర్ధారించింది. అదే సమయంలో తక్కువ రెసిస్టెన్స్ పొటెన్షియల్ కలిగిన యాక్సెస్ గ్రూప్ రకాన్ని తక్కువగా సూచిస్తున్నట్టు వెల్లడించింది. యాక్సెస్ గ్రూప్ యాంటీ బయాటిక్స్ ప్రిస్క్రిప్షన్‌ను రెండు వెబ్సైట్లు మాత్రమే అధికంగా నమోదు చేశాయని తెలిపింది. యాంటీ బయాటిక్స్ కలపడం వల్ల ప్రతికూల ప్రభావం చాలా కేసుల్లో పాలీ ఫార్మసీ (బహుళ ఔషధాలను ఒకే సమయంలో వినియోగించడం) గమనించామని, రెండు యాంటీ బయాటిక్స్ కలపడం వలన ప్రతికూల ప్రభావాలు చూపేందుకు, ఔషధ పరస్పర చర్యల ప్రమాదాన్ని పెంచేందుకు అవకాశం ఉందని పేర్కొంది. ఈ సర్వే నివేదికను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య మంగళవారం విడుదల చేశారు. యాంటీ బయాటిక్స్ అధిక వాడకం వల్ల కలిగే హానిని దృష్టిలో ఉంచుకుని, రిజర్వ్ గ్రూప్ యాంటీ బయాటిక్స్ వినియోగం వీలైనంత తక్కువ స్థాయిలో ఉండేలా చూడాలని ఈ అధ్యయనం ఆసుపత్రులకు సిఫారసు చేసింది. -
భద్రం... బీ కేర్‌ఫుల్!
పారాహుషార్ గంట మరోసారి మోగింది. దేశంలో కోవిడ్ కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. మే 21 తర్వాత ఎన్నడూ లేనంత అత్యధిక స్థాయిలో 614 కొత్త కరోనా ఇన్ఫెక్షన్ కేసులు వచ్చాయి. కరోనా వైరస్ కొత్త వేరియంట్ జెఎన్.1 కేసు తొలిసారిగా కేరళలో బయటపడిన కొద్దిరోజుల్లోనే ఆ రాష్ట్రంలో నలుగురు బలయ్యారు. ఒక్క బుధవారమే దేశవ్యాప్తంగా 341 కొత్త కోవిడ్ ఇన్ఫెక్షన్ కేసులు నమోదు కావడం, అందులో 292 కేసులు కేరళ నుంచి వచ్చినవే కావడంతో తక్షణమే అప్రమత్తత అవసరమైంది. ఈ నేపథ్యంలోనే వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రతినిధులతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి బుధవారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించాల్సి వచ్చింది. భయాందోళనలకు గురి కానక్కర్లేదు కానీ, జాగ్రత్తలు మాత్రం తప్పవనేది ఇప్పుడు మన ఆరోగ్య మంత్రం. సరిగ్గా మూడేళ్ళ క్రితం మొదలైన కరోనా ఇప్పటికీ ఏదో ఒక రూపంలో మానవాళిని వేధిస్తూనే ఉంది. చిన్నాచితకా అలల్ని పక్కనపెడితే, రెండు ప్రధాన కరోనావేవ్లు మన దేశంలో జన జీవితాన్ని ఎంతగా అతలాకుతలం చేశాయో అందరికీ అనుభవైకవేద్యం. అప్పుడు నేర్చిన పాఠాలే ఇప్పుడు మార్గదర్శకాలు. ఈ మూడేళ్ళ కాలంలో అనేక కరోనా వైరస్ వేరియంట్లు వచ్చాయి. ఆ వరుసలోదే భారత్‌లో తాజాగా కనిపించిన జెఎన్.1 వేరియంట్. బీఏ.2.86 కుటుంబానికి చెందిన ఈ వైరస్ ఉత్పరివర్తనం ఏడాది పైచిలుకుగా రూపుదిద్దుకొంటూ వచ్చిందట. ఇది ఇప్పటికే సుపరిచితమైన ఒమిక్రాన్‌లో బలవత్తరమైన వేరియంట్ అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వివిధ దేశాల్లో ఇప్పటికే ఇది తన విజృంభణ చూపుతోంది. డిసెంబర్ 3 ముందు వారంలో 32 వేల మందికి కరోనా సోకితే, ఆ తరువాతి వారంలో 56 వేల మందికి ఇన్ఫెక్షన్ వచ్చిందని సింగపూర్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. మన దేశంలోని కేరళలో ర్యాండమ్ శాంపిళ్ళకు ఆర్టీ–పీసీఆర్ టెస్టులు చేస్తుండగా ఈ జెఎన్.1 వేరియంట్‌ను గుర్తించారు. మన దగ్గర ఈ వేరియంట్ తొలిసారిగా బయటపడి, కేసులు పెరుగుతుండగానే రాష్ట్రాలన్నిటికీ కేంద్రం తాజాగా మార్గదర్శకావళిని జారీ చేయడం గమనార్హం. పలు రాష్ట్రాలు అప్రమత్తమై ఇప్పటికే సమీక్షా సమావేశాలు జరిపి, మార్గదర్శ కాలను ప్రకటించాయి. కేరళలో పరిస్థితులు, కొత్త జెఎన్.1 వేరియంట్ కేసుల భయంతో కర్ణాటక సర్కార్ 60 ఏళ్ళ పైబడిన వారికి, అనారోగ్య సమస్యలున్నవారికి మాస్కు ధరించడం తప్పని సరి చేసింది. కేరళ సరిహద్దు జిల్లాలలను అప్రమత్తం చేసింది. ప్రజల రాకపోకలు, సమావేశాలపై నియంత్రణలు విధించ లేదన్న మాటే కానీ, కోవిడ్ లక్షణాలున్న వారికి పరీక్షలు చేయించడం పెంచింది. వివిధ దేశాల్లో ఈ వేరియంట్ కనిపిస్తుండడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ తాజా పరిస్థితులపై దృష్టి సారించింది. దీన్ని ఆసక్తికరమైన వేరియంట్‌గా పేర్కొంది. ఒమిక్రాన్ తరగతికి చెందినప్పటికీ ఈ వేరియంట్ మరీ ప్రాణాంతకమైనదేమీ కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కోవిడ్ టీకా వేసుకోని వారికి సైతం ఈ వేరియంట్ వల్ల ప్రాణహాని ఉండదనీ భరోసా ఇస్తున్నారు. అది కొంత ఊరటనిచ్చే అంశం. అలాగని అశ్రద్ధచూపలేం, అజాగ్రత్త వహించలేం. ఎవరెన్ని చెప్పినా ఆరోగ్యం, ప్రాణరక్షణకు సంబంధించిన విషయం గనక సహజంగానే ఈ వేరియంట్ పట్ల మన దేశంలో ఆరోగ్య నిపుణుల్లో, ప్రజల్లో ఆందోళన నెలకొనడం సహజమే. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాలు తొందరపడి, కఠిన నియంత్రణలు పెట్టనక్కరలేదు కానీ, మాస్కు ధారణ, చేతుల పరిశుభ్రత, సామాజిక దూరం పాటించడం లాంటి కనీస జాగ్రత్తలు పాటించడమే ప్రజారోగ్యానికి శ్రీరామరక్ష. అసలే వ్యాధినిరోధక శక్తి తగ్గే చలికాలం. దానికి తోడు శబరిమల యాత్ర, క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి సెలవులతో ప్రయాణాల సీజన్. పైగా వచ్చేది సార్వత్రిక ఎన్నికల సీజన్. ర్యాలీలు, బహి రంగ సభల హంగామా. కరోనా వ్యాప్తికి కలిసొచ్చే ఇన్ని అంశాల మధ్య జాగ్రత్తలను విస్మరించడం ఎలాచూసినా రిస్కే. కట్టుదిట్టమైన ఆరోగ్యవ్యవస్థ, పరీక్షల వల్ల కేరళలో ఎప్పటికప్పుడు భారీగా కరోనా కేసులు బయటపడుతున్నాయి కానీ, అంతటి పరీక్షలు, నిఘా లేని చోట పరిస్థితులు చాప కింద నీరులా ఉండివుండవచ్చు. దురదృష్టమేమంటే, మన దేశంలోనే కాక అనేక ప్రపంచ దేశాల్లో సైతం ఆ మధ్య కోవిడ్ కేసులు తగ్గాక, అధికారికంగా మహమ్మారి ముగిసినట్టు ప్రకటించారే తప్ప తర్వాతి జాగ్రత్తలు తీసుకోవట్లేదు. జీనోమిక్ ప్రాసెసింగ్ టెస్ట్‌లు సహా వివిధ రూపాల్లో నిఘాను విస్మరించారు. భారత్‌లో లేబరేటరీ నెట్వర్క్ ‘ఇన్సాకాగ్’ (ఇండియన్ సార్స్–కోవ్–2 జీనోమిక్స్ కన్సార్టియమ్) తగిన స్థాయిలో పనిచేయకపోవడమే అందుకు ఉదాహరణ. గత మూడేళ్ళలో దేశంలో 4.5 కోట్ల మంది కరోనా బారినపడ్డారనీ, 5.33 లక్షల మంది మరణించారనీ సర్కారు వారి తాజా లెక్క. ఈ అధికారిక లెక్కలకు అందని, సామాన్య బాధితుల సంఖ్య ఇంతకు అనేక రెట్లు ఎక్కువే. ఈ పరిస్థితుల్లో టెస్ట్‌లు ఎంత ఎక్కువగా చేస్తే, కరోనా విజృంభణను అంత త్వరగా పసిగట్టి, చర్యలు చేపట్టవచ్చు. అలాగే, కొత్త వేరియంట్లకు ఇప్పుడున్న టీకాలు ఏ మేరకు పనిచేస్తాయో పరీక్షించాలి. వివిధ దేశాలు ఇప్పటికే కొత్తవాటికి తగ్గట్టు టీకాలను మెరుగు చేస్తు న్నాయి. మన దేశానికీ వాటి అవసరం ఉందేమో శాస్త్రీయ సలహా స్వీకరించాలి. ముంచుకొచ్చే దాకా ఆగకుండా మూడు నెలలకోసారి ఆసుపత్రుల్లో మాక్ డ్రిల్లు చేయడం మంచిది. అలసత్వం దూర మవుతుంది. అలాగే, కరోనాపై నిరంతర నిఘా సరేసరి. ప్రజానీకానికి సమాచారం చేరవేస్తూ, పొంచివున్న ముప్పుపై అవగాహన పెంచడం ముఖ్యం. ప్రజారోగ్యంపై అన్ని రాష్ట్రాలూ, ప్రభుత్వాలు ఏకతాటిపైకి రావాలి. రాజకీయాలకు అతీతంగా, సమన్వయంతో ఏకోన్ముఖ వైఖరిని అవలంబించాలి. ప్రయాణాలు, జనసమ్మర్దం పెరిగే రానున్న వారాలు కీలకం గనక సన్నద్ధతే సగం మందు! -
గాజా ఒడ్డున విపత్తు వంటకం
సంధి గడువు ముగియగానే... గాజాపై ఇజ్రాయెల్ ఉద్దేశాలు ఎలా ఉండబోతున్నాయన్నది ప్రాధాన్యం సంతరించుకుంది. బెంజమిన్ నెతన్యాహూ ప్రభుత్వం ప్రస్తుతం దక్షిణ గాజాలో తలదాచుకున్న దాదాపు 20 లక్షల మంది గాజా పౌరులను కేవలం 2.5 కిలోమీటర్ల వెడల్పు, 4 కిలోమీటర్ల పొడవు ఉన్న అల్–మవాసి అనే చిన్న ముక్క లాంటి భూభాగంలోకి నెట్టివేయడం గురించి ఆలోచిస్తోందని తెలుస్తోంది. దీన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ ఒక నిర్దిష్ట ఫలితానికి దారితీసే ‘విపత్తు వంటకం’గా అభివర్ణించారు. 1948లో వెస్ట్ బ్యాంక్ నుంచి తమను తరిమేసినప్పుడు తొలిసారి శరణార్థులుగా మారిన గాజా ప్రజలు... ఇప్పుడు అల్–మవాసిలో చిక్కువడిపోతే కనుక రెండోసారి శరణార్థులుగా మారతారు. ఇప్పటివరకు అర్థం అవుతున్నదానిని బట్టి మన దృష్టి ఇజ్రాయెల్‌కూ, గాజాలోని పాలస్తీనా ప్రజలకూ మధ్య సంబంధాలపైన మాత్రమే కేంద్రీకతం అయి ఉంది. యుద్ధ సమయంలో ఇది అనివార్యంగా జరిగేదే. అయితే మీరు కనుక ఇజ్రాయెలీలకు, పాలస్తీనియన్లకు మధ్య గల విస్తృతమైన సంబంధాన్ని అర్థం చేసుకోవాలనుకుంటే మాత్రం ఇజ్రాయెల్ తన లక్షల మంది పాలస్తీనా పౌరులను, వారితో పాటుగా 1967 నుంచి చట్టవిరుద్ధంగా తన ఆక్రమణలో ఉంచుకున్న వెస్ట్‌బ్యాంక్ ప్రాంత పాలస్తీనియన్లతో ఎలా వ్యవహరిస్తూ వస్తున్నదో కూడా తెలుసు కోవలసిన అవసరం ఉంది. ఇక్కడ ఇస్తున్న కొన్ని వాస్తవాలు బహుశా మీకు తెలిసి ఉండకపోవచ్చు. మొదటిది, ఇజ్రాయెల్ ప్రజాస్వామ్య దేశం. కానీ అది యూదు పౌరులకు మాత్రమే. అక్కడి ‘నేషనల్ స్టేట్ చట్టం – 2018’ యూదు పౌరులకు, దేశంలోని పాలస్తీనా జాతీయులకు మధ్య వివక్షను పాటిస్తోంది. ఉదాహరణకు, ఇజ్రాయెల్‌లోని ‘పునరాగమన చట్టం’ (లా ఆఫ్ రిటర్న్) ప్రపంచంలోని ఏ మూల నుండి వచ్చిన యూదులైనా అప్రమేయంగా ఇజ్రాయెల్ పౌరసత్వం పొందేందుకు అనుమతిని ఇస్తోంది. కానీ అక్కడే పుట్టి, 1948 నక్బా (జాతి ప్రక్షాళన) విపత్తులో, 1967 యుద్ధ సమయంలో ఇజ్రాయెల్‌ను వదిలి వెళ్లిన పాలస్తీనా కుటుంబాల వారికి మాత్రం ఈ హక్కును నిరాకరిస్తుంది. తరలిపోయిన అన్ని పాలస్తీనా కుటుంబాలు తిరిగి స్వదేశానికి వచ్చేందుకు హక్కును కల్పిస్తున్న ఐక్యరాజ్య సమితి 194వ తీర్మానాన్ని ధిక్కరించడమే ఇది. రెండవది–ఎటువంటి అభియోగమూ లేకుండా పాలస్తీనియన్లను నిర్బంధంలోకి తీసుకునేందుకు అనుమతినిచ్చే ‘అడ్మినిస్ట్రేటివ్ డిటెన్షన్ లా’ను ఇజ్రాయెల్ కలిగి ఉంది. ‘అల్ జజీరా’ చెబుతున్న ప్రకారం, ఇజ్రాయెల్ జైళ్లలో 7,200 మంది పాలస్తీనా ఖైదీలు ఉంటే వారిలో 2,200 మంది ఎలాంటి అభియోగమూ లేకుండా అరెస్ట్ అయినవారే. గత వారాంతంలో కాల్పుల విరమణ సందర్భంగా, ఇజ్రాయెల్ ఈ వైపు నుంచి 240 మందిని విడుదల చేస్తూనే, ఆ వైపు నుంచి 310 మందిని నిర్బంధంలోకి తీసుకుంది. 3,100 మంది లేదా 7,200లో 43 శాతం మంది అక్టోబర్ 7 తర్వాత (ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేసిన రోజు) అరెస్ట్ అయినవారే. ఇక, వెస్ట్ బ్యాంకు వైపు వెళ్దాం. 1967 నుండి 7,50,000 మంది ఇజ్రాయెలీలు వెస్ట్ బ్యాంక్ అనే పాలస్తీనా భూభాగాన్ని ఆక్రమించి, లోపలి వాళ్లను ఖాళీ చేయించి తాము అక్కడ స్థిరపడిపోయారు. ఇజ్రాయెల్ సైన్యం ఆక్రమణదారులను అడ్డుకోక పోగా, వారికి రక్షణ కల్పించింది. దీనిని నెతన్యాహూ ప్రభుత్వం కూడా ప్రోత్సహించింది. ఐక్యరాజ్యసమితి గుర్తింపు ఉన్న పాలస్తీనాను కుట్టడానికి వీలుకాని అతుకుల బొంతలా మార్చింది. వెస్ట్ బ్యాంక్‌కు వలస వచ్చి స్థిరపడిపోయిన ఇజ్రాయెలీలతో ఈ ఏడాది అక్టోబర్ 7 నుంచి జరుగుతున్న హమాస్ ఘర్షణల్లో 240 మంది పాలస్తీనియన్లు మరణించినట్లు ‘అల్ జజీరా’ నివేదించింది. ‘‘వెస్ట్ బ్యాంక్‌లో పాలస్తీనియన్లపై జరుగుతున్న తీవ్రవాద హింస ఆగాలని, హింసకు పాల్పడేవారిని జవాబుదారులను చేసి తీరాలని’’ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయెల్ నాయకులకు నొక్కి చెప్పి నట్లు ‘వాషింగ్టన్ పోస్ట్’ కథనం పేర్కొంది. కానీ బైడెన్ మాటలను నెతన్యాహూ లెక్క చేయలేదు. ‘‘స్థిరపడిన వారి కదలికల గురించి చేసిన ఆరోపణలన్నీ నిరాధారమని అధ్యక్షుడు బైడెన్‌కు చెప్పాను’’ అని పత్రికా సమావేశంలో అన్నారాయన. చివరిగా, çసంధి గడువులన్నీ ఒకసారి ముగిశాక గాజాపై ఇజ్రా యెల్ ఉద్దేశాలు ఎలా ఉంటాయన్నది చూడాల్సిన అంశం. నెత న్యాహూ ప్రభుత్వం ప్రస్తుతం దక్షిణ గాజాలో తలదాచుకున్న సుమారు 20 లక్షల మంది గాజా పౌరులను కేవలం 2.5 కిలోమీటర్ల వెడల్పు, 4 కిలోమీటర్ల పొడవు ఉన్న అల్–మవాసి అనే చిన్న ముక్క లాంటి భూభాగంలోకి నెట్టివేయడం గురించి ఆలోచిస్తూ ఉందన్న విషయాన్ని ఇజ్రాయెల్ సైన్యం ప్రతినిధిని ఉటంకిస్తూ ‘బీబీసీ’ దౌత్య సంబంధాల ప్రతినిధి పాల్ ఆడమ్స్ బహిర్గతం చేశారు. 1948లో వెస్ట్ బ్యాంక్ నుంచి తమను తరిమేసినప్పుడు గాజా ప్రజలు తొలిసారి శరణార్థులుగా మారారు. ఇప్పుడు వారు అల్–మవాసిలో చిక్కు పడిపోతే కనుక రెండోసారి శరణార్థులుగా మారతారు. నిజంగా ఇది అధ్వాన్నమైన స్థితి. పాలస్తీని యన్ల సంక్షేమం కోసం పని చేస్తుండే ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ యు.ఎన్.ఆర్.డబ్లు్య.ఎ. కమ్యూనికేషన్్స డైరెక్టర్ జూలియెట్ తౌమా... అల్– మవాసి గురించి చెబుతూ ‘అక్కడ ఏమీ లేదు. కేవలం ఇసుక దిబ్బలు, తాటి చెట్లు మాత్రమే’ అని అన్నారు. ఆఖరికి ఇజ్రాయెల్ రక్షణ దళాల ప్రతినిధి అయిన లెఫ్ట్‌నెంట్ కల్నల్ హెక్ట్ కూడా ‘‘అల్–మవాసి భయానకం కాబోతోంది’’ అన్నారు. అల్–మవాసీలో అవసరం అయిన మౌలిక సదుపాయాలు లేవు. ఆసుపత్రులు లేవు. అంతే కాదు, అత్యధికులు గుడారాలలో నివసించవలసి వస్తుంది. చలికాలం మొదలయ్యాక చలి గజగజ లాడిస్తుంది. తరచు వర్షాలు పడుతుంటాయి. అయినప్పటికీ కూడా... ‘‘మీ ప్రియమైన వారికి అల్–మవాసి అనుకూలమైన పరిస్థితులనే అంది స్తుంది’’ అని ఇజ్రాయెల్ రక్షణ దళానికి చెందిన మరొక ప్రతినిధి అవిచే ఆడ్రయీ చెబుతున్నారు. ‘‘అల్–మవాసికి సదుపాయాలు అందేలా చేయడం సహాయక సంస్థల బాధ్యతే’’నని ఇజ్రాయెలీ అధికారులు అన్నట్లు ‘బీబీసీ’ నివే దించింది. దీనిని బట్టి గాజావాసులను వారి కర్మకు వారిని ఇజ్రాయెల్ వదిలేయబోతున్నట్లు స్పష్టం అవుతోంది. కానీ ఆ మాటను వారు ఒప్పుకోడానికి సుముఖంగా లేరు. ‘‘గాజాలో జరగబోయే ఎలాంటి సురక్షిత ప్రాంత ఏర్పాటులోనూ మేము పాల్పంచుకోబోమని ‘ఐ.రా.స.’కు చెందిన 18 సంస్థలు, ఎన్జీవోలకు చెందిన అధినేతలు ఇప్పటికే ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ ఈ అల్–మవాసి ప్రతి పాదనను... ఒక నిర్దిష్ట ఫలితానికి దారితీసే ‘‘విపత్తు వంటకం’’ అని అభివర్ణించారు. ‘‘సదుపాయాలు, సేవలు అందుబాటులో లేని అంత చిన్న ప్రదేశంలోకి అసంఖ్యాకంగా మనుషులను చేర్చడానికి ప్రయ త్నించడం వల్ల ఇప్పటికే ప్రమాదపుటంచున ఉన్న గాజా పౌరుల ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పు వాటిల్లుతుంది’’ అని హెచ్చరించారు. ఇక్కడితో నేను ఆగిపోతాను. మీకు చేరని వాస్తవాలను, మన మీడియా వెల్లడించని ఇజ్రాయెల్ ఆలోచనలను మీకు తెలియ జేయడమే నా ఉద్దేశం. ఈసారి ఇజ్రాయెల్‌ను ఒక వర్ణవివక్ష రాజ్యం అని అనవలసి వచ్చినప్పుడు ఈ మాటలను దన్నుగా చేసుకోండి. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ఎక్కువ పనిగంటలు ప్రమాదకరం!
యువత వారానికి 70 గంటలు పనిచేయాలని ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి అన్న మాటలపై ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అసలు భారత కార్మిక చట్టం, ఫ్యాక్టరీ చట్టం వంటివి ఏం చెబుతున్నాయి, రోజుకి 8 గంటలు పైబడి పని చేస్తే పర్యవసనాలు ఏమిటి వంటి అనేక విష యాలు చర్చించవలసిన అవసరం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో 49 పని గంటల విధానం అమల్లో ఉంది. మన దేశంలో రోజువారి విశ్రాంతి సమయం, వార్షిక సెలవులు కలిపి వారానికి 48 పనిగంటలు మించకుండా ఉండేలా చట్టాలు ఉన్నాయి. మనిషికీ మనిషికీ పని గంటల్లో తేడా; అలాగే డబ్బు, ప్రాంతం, సంస్కృతి, జీవన విధానం వంటి అనేక అంశాలతో పాటు ముఖ్యంగా జీతాలు, లాభాలు ఆధారంగా కూడా ఈ పని గంటలు మారుతూ ఉంటాయి. ప్రైవేటు, ప్రభుత్వ సంస్థల్లో వారి వారి అంగీ కారాన్ని బట్టి కూడా పని గంటలు నిర్దిష్టంగా ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా నియమిత పని గంటలు వారానికి 40 నుంచి 44గా అమలులో ఉన్నాయి. తాత్కాలిక, బదిలీ ఉద్యోగులకు ఒకలాగా; పర్మినెంట్ ఉద్యోగులకు ఒకలాగా, అలాగే రోజుకి ఇన్ని గంటలని వారానికి మొత్తంగా 48 గంటలు మించకుండా పనిగంటలు ఉండాలని అంతర్జాతీయ కార్మిక సంస్థ చెబుతుంది. ప్రపంచ వ్యాప్తంగా తక్కువ పని గంటలు వున్న దేశం జర్మనీ. ఇక్కడ సంవత్సరానికి 1340 గంటలు పని గంటలుగా ఉంటాయి. మెక్సికో, కొలంబియా, కోస్టారికాలలో ఎక్కువ పనిగంటలు (1886) ఉన్నాయి. భారతదేశం బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు అప్పటి వైస్రాయ్ కౌన్సిల్లో లేబర్ మెంబర్‌గా ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కార్మికులకూ, ఉద్యో గులకూ రోజుకు 8 పని గంటలు ఉండాలని 1942లో మొదటిసారి డిమాండ్ చేశారు. అనేక వాదోపవాదాలూ, తర్జనభర్జనల మధ్య వైస్రాయ్ కౌన్సిల్ 9 పనిగంటలు ఉండాలనీ, దీనిలో 30 నిమిషాలు రెండు దఫాలుగా విశ్రాంతి ఉండాలనీ నిర్ణయించారు. ‘1948 ఫ్యాక్టరీ చట్టం’ సెక్షన్ 54 ప్రకారం ఈ తొమ్మిది గంటల పని, విశ్రాంతి సమయాన్ని అంబేడ్కర్ కార్మికుల పక్షాన పోరాడి సాధించారు. ఇటీవల మన దేశంలో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ‘కర్ణాటక ఫ్యాక్టరీస్ అమెండ్మెంట్ యాక్ట్ బిల్లు – 2023’ను ఆమోదించడం ద్వారా రోజుకు 12 పని గంటలు ఉండాలని నిర్ణయిం చింది (వారానికి 48 గంటలు మించకుండా). అలాగే భారత కార్మిక మంత్రిత్వ శాఖ రోజుకు12 పనిగంటలు ఉండాలని పార్లమెంట్లో చట్టం చేసినప్పటికీ... ‘ఇండియన్ ఫ్యాక్టరీస్ యాక్ట్ –1948’ ఓవర్ టైంతో కలిపి 50 నుంచి 60 పని గంటలు దాటకూడదనే నిబంధన కచ్చితంగా పాటించాలని చెప్పింది. 2016లో ప్రపంచ ఆరోగ్య సంస్థ, అంత ర్జాతీయ కార్మిక సంస్థ అధ్యయనం, అంచనాల ప్రకారం ఎవరైతే వారానికి 55 గంటలు దాటి పని చేస్తారో వారిలో ప్రతి పది మందిలో ఒక కార్మి కుడు గుండె పోటుతో మరణిస్తున్నట్లు తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా 745,000 మంది కార్మికులు గుండెపోటుతో మరణించినట్లు నివేదిక తెలిపింది. దీనికి కారణం ఎక్కువ పని చేయడమేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ, అంతర్జాతీయ కార్మిక సంస్థల సంయుక్త నివేదిక చెబుతున్నటువంటి సత్యం. పైన ఉదాహరించిన ఎక్కువ గంటలు పని చేయడం వల్ల జరిగిన మరణాలను పరిశీలిస్తే, యువత వారానికి 70గంటలు పని చేస్తే జరిగే నష్టం అంచనా వేయొచ్చు. స్వతంత్ర భారతదేశంలో ఎవరి అభిప్రాయాలు వారు స్వేచ్ఛగా చెప్పవచ్చు. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి ఆయన రంగంలో ఆయన ఆదర్శప్రాయులు. వయస్సు రీత్యా కూడా పెద్దవారు. ఇప్పటికే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో యువత అనేక ఆరోగ్య, మానసిక, కుటుంబ సమస్యలు ఎదుర్కొంటున్నట్లు అనేక వార్తలు నిత్యం చూస్తూనే ఉన్నాం. ఆయన తన అభిప్రాయాలు మెజారిటీ మనోభావాలు దెబ్బతినే విధంగానూ, అశాస్త్రీ యంగానూ వ్యక్తపరిస్తే ఆ ప్రభావం సమాజం మీద కచ్చితంగా ఉంటుంది. యువత మానసిక స్థితి మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక దారుఢ్యం, కుటుంబ నేపథ్యం, పెరిగిన వాతా వరణం వంటివాటిని బట్టి ఉంటుంది. కాబట్టి విధాన నేర్ణేతలు వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవాలి. – డా‘‘ గుబ్బల రాంబాబు, ఎల్ఐసీ ఉద్యోగుల సంఘం ఉభయ గోదావరి జిల్లాల అధ్యక్షుడు, ఏపీ -
ఆమెపై ఆగని అకృత్యాలు
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్ : ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం అని గొప్పగా చెప్తున్నా.. ఆధునికంగా ప్రపంచం ఎంత వేగంగా ముందుకు పయనిస్తున్నా.. మహిళలపై వేధింపులు, హింస తగ్గడం లేదు. వివక్ష అంతరించడం లేదు. పరువు హత్య లు, వరకట్న హత్యలు, అత్యాచారాలు, వేధింపులు.. ఎక్కడా మహిళలకు రక్షణ లేని దుస్థితి. తాజాగా మధ్యప్రదేశ్ రాజధాని ఉజ్జయినిలో జరిగిన సంఘటన దీనికి మరో నిదర్శనం. అత్యాచారానికి గురైన పన్నెండేళ్ల బాలిక భయంతో వణికిపోతూ, అర్ధనగ్నంగా కిలోమీటర్ల దూరం సాయం కోసం పరుగెత్తడం.. సమాజం తలదించుకోవాల్సిన పరిస్థితి. మణిపూర్‌లో ఇద్దరు మహిళలపై అత్యాచారం చేసి నగ్నంగా ఊరేగించిన ఘట నా ఇలాంటిదే. పోలీసు వ్యవస్థ ఎంత ఆధునిక పోకడలు పోతున్నా.. దేశంలో ఇంకా అనాగరిక దుష్కృత్యాలు కొనసాగడం ఆందోళనకరం. 2011–2021 మధ్య 87 శాతం పెరుగుదల.. గత దశాబ్దంలో మహిళలపై హింసాత్మక సంఘటనలు దాదాపు 87 శాతం మేర పెరగడం ఏ అభివృద్ధికి సంకేతమన్న అభిప్రాయాలు నెలకొన్నాయి. మన దేశంలోనేగాక ప్రపంచవ్యాప్తంగా మహిళలపై హింస/వేధింపులు కొనసాగడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఆందోళన వ్యక్తం చేసింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) గణాంకాల ప్రకారం.. పోలీస్స్టేషన్లలో నమోదైన కేసుల సంఖ్య ఆధారంగానే 2011లో 2,28,650 మంది మహిళలపై హింసాత్మక ఘటనలు జరిగితే.. 2021నాటికి ఈ సంఖ్య 4,28,478కు అంటే.. 87శాతం మేర పెరగడం ఆందోళనకరం. అయితే దీనిని పోలీసు యంత్రాంగం మరో విధంగా చూస్తున్నట్టు సమాచారం. గతంలో మహిళలు కేసులు పెట్టడానికి ముందుకు వచ్చేవారు కాదని.. పెరిగిన విద్యావకాశాలు, పోలీసుల ఔట్రీచ్ కారణంగా ముందుకొచ్చి కేసులు పెడుతున్నారని అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. దేశ మహిళా జనాభాలో 7.5శాతం పశ్చిమ బెంగాల్లో ఉంటే.. అక్కడ మహిళలపై జరిగిన నేరాలు 12.7 శాతమని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మహిళలు హింసను భరించాలని దేశంలోని దాదాపు 65శాతం మంది పురుషులు అభిప్రాయంతో ఉన్నారని ‘ఇంటర్నేషనల్ మెన్ అండ్ విమెన్ జెండర్ ఈక్వాలిటీ సర్వే (ఇమేజెస్)’స్పష్టం చేసింది. కుటుంబం కలసి ఉండాలంటే మహిళలు ఈ హింసను భరించాల్సిందేనన్న ధోరణి ప్రమాదకరంగా మారుతోందని పేర్కొంది. ఇక గృహ హింసకు సంబంధించి కుటుంబ పరువు పేరిట చాలా వరకు మహిళలు కేసులు పెట్టడం లేదని నిపుణులు చెప్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం.. ప్రపంచ మహిళా జనాభాలో కనీసం 33.7% మంది ఏదో ఒక సమయంలో నేరాలు/వేధింపులకు గురైనవారే. పరువు పేరిటహత్యలెన్నో.. దేశంలో ఇటీవలి కాలంలో పరువు హత్యలు పెరిగిపోయాయి.కుటుంబ పెద్దల అంగీకారం లేకుండా ప్రేమించి కుల, మతాంతర వివాహాలు చేసుకుంటున్నవారిని.. పరువుకు భంగం కలిగించారనే భావనతో వారి కుటుంబాలే హత్య చేయిస్తున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో అయితే ఖాప్ పంచాయతీలు నిర్వహించి మరీ మరణ శాసనాలు లిఖిస్తున్నారు. ప్రధానంగా ఉత్తరప్రదేశ్, హరియాణా, రాజస్థాన్, బీహార్, జార్ఖండ్, హిమాచల్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఇలాంటివి ఎక్కువగా జరుగుతున్నాయి. తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లోనూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. అత్యాచార దారుణాలు.. మహిళలు, బాలికలపై అత్యాచార ఘటనలూ దారుణంగా పెరుగుతున్నాయి. ఎన్సీఆర్బీ గణాంకాల ప్రకారం.. గత దశాబ్దకాలంలో ఇలాంటి దారుణాలపై కేసులు బాగా పెరిగాయి. 2008లో దేశంలో 21,467 అత్యాచార కేసులు నమోదవగా.. 2021లో ఈ సంఖ్య 31,677కు పెరిగింది. జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదులు కూడా.. తమపై వేధింపులకుసంబంధించి జాతీయ మహిళా కమిషన్‌కు వస్తున్న ఫిర్యాదులూపెరిగాయి. 2022లో మొత్తం 33,906 నేరాలకు సంబంధించిన ఫిర్యాదులు అందాయి. ఇందులో అత్యధికంగా ఒక్క ఉత్తరప్రదేశ్ నుంచే 54.5 శాతం ఫిర్యాదులు ఉండగా.. తర్వాతి స్థానాల్లో ఢిల్లీ, మహారాష్ట్ర, బిహార్, హరియాణావంటి రాష్ట్రాలు ఉన్నాయి. ప్రజల్లో చైతన్యం పెరిగితేనే ప్రయోజనం దేశంలో మహిళలపై అకృత్యాలు, అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. ఇటీవలి కాలంలో మహిళలపై హింస మరింత పెరిగి క్రూరమైన రూపాలను సంతరించుకుంటోంది. కరోనా లాక్డౌన్ కాలంలో స్త్రీలపై హింస విపరీతంగా పెరిగినట్టు మేం గమనించాం. మతం పేరిట, ఇతర రూపాల్లో ద్వేషం, విషపూరిత వాతావరణం నెలకొని గతంలోని స్నేహపూర్వక పరిస్థితి లేకుండా పోయింది. ఇది అన్నిరకాల హింసలకూ దారితీస్తోంది. నిర్భయ చట్టం తీసుకొచ్చినపుడు.. స్త్రీల హక్కులేమిటి? వారిపై హింసకు ఎందుకు పాల్పడకూడదన్న అంశాలపై అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.వెయ్యికోట్లు కేటాయించింది. ఇప్పుడైతే మహిళల హక్కులు అనే స్పృహ లేకుండా చేస్తున్నారు. మíహిళలకు సంబంధించిన రంగాలు, అంశాలపై బడ్జెట్ కేటాయింపులను కూడా తగ్గించడం దురదృష్టకరం. మహిళలపై ఎలాంటి దాడులకు పాల్పడినా తమకేమీ కాదులే అన్న మొండి ధైర్యం హింసకు దారితీస్తోంది. చట్టాలను అమలుచేయాల్సిన పోలీసు, ఇతర వ్యవస్థలు అవినీతితో పారదర్శకతను కోల్పోతున్నాయి. ప్రజల్లో చైతన్యం పెరిగినప్పుడే చట్టాలను అమలు చేసేందుకు ప్రభుత్వాలు దిగొస్తాయి. - వి.సంధ్య సామాజిక కార్యకర్త,పీవోడబ్ల్యూ