
సమాజానికి ఉక్కు కవచం
శరీరంలో ఐరన్ లేమి స్త్రీలను బాధిస్తూ ఉంటుంది. గర్భధారణ, ప్రసవ సమయాలలో ఎంతో కీలకమైన ఐరన్ కోసం స్త్రీలు ఆహారం, మందుల మీద ఆధారపడుతుంటారు. ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ అంచనా ప్రకారం నేడు ప్రపంచ వ్యాప్తంగా 15 నుంచి 49 ఏళ్ల మధ్య ఉన్న స్త్రీలు 50 కోట్ల మంది ఐరన్ డెఫిషియెన్సీతో బాధ పడుతున్నారు.
కాని వీరు తమ స్వభావంలో ఉక్కుగుణాన్ని మాత్రం ఎన్నడూ వదులుకోరు. వీరు మాత్రమే కాదు ప్రతి స్త్రీ తన జీవనంలో, పరిస్థితులను ఎదుర్కొనడంలో ఉక్కు మహిళే. ఆ మహిళ తెలుగు నాట మారుమూల పల్లెలో ఉండొచ్చు. ప్రపంచంలో వేరే మూలన మరో గూడెంలో ఉండొచ్చు. మహిళా దినోత్సవం ‘స్థానికం’గా నిర్వహించే తంతు కాదు.
ఇది అంతర్జాతీయ వేడుక. ప్రపంచ మహిళలను ఏకం కావాలని కోరే సందేశ సందర్భం. 1910లో కోపెన్‌హెగెన్‌లో 17 దేశాల నుంచి వచ్చిన 99 మంది మహిళలు ‘శ్రామిక మహిళల హక్కుల దినోత్సవం’ కోసం పిలుపు ఇచ్చినప్పుడు అది అంతర్జాతీయ మహిళా దినోత్సవం కావాలనే కోరుకున్నారు. కారణం భూమ్మీద ఏ మూలన ఉన్న స్త్రీ అయినా స్థూలంగా ఎదుర్కొనే సమస్యలు ఒకటేనని భావించడం. అందరూ కలిసి సమస్యల పై పోరాడాలని కోరుకోవడం.
ఇన్నేళ్లు గడిచినా రూపంలో, సారంలో స్త్రీలు అనేక సవాళ్లను ఎదుర్కొంటూనే ఉన్నారు. యుద్ధాలు వస్తే వారు తమ ఇంటిని, భర్తను, సంతానాన్ని కోల్పోతున్నారు. ప్రభుత్వాలు అభివృద్ధి పేరుతో చేసే తవ్వకాలు, కట్టే పెను కట్టడాలు, ప్రకటించే సుందరీకరణాలు మొదటగా స్త్రీలు శ్రమపడి అల్లిన గూళ్లనే ధ్వంసం చేస్తున్నాయి. చట్టపరమైన అనుమతి కలిగిన వ్యసనాలు... మద్యపానం, ధూమపానం పురుషుల ఆరోగ్యాన్ని దెబ్బ తీసి స్త్రీల మీద పెను ఒత్తిడి పెడుతున్నాయి.
తాజాగా ఆన్‌లైన్ ట్రేడింగ్ అడిక్షన్ లక్షల కొద్ది అప్పును కుటుంబం మీద కుమ్మరించేలా చేస్తోంది. కడుపున పుట్టిన సంతానం పాలిట డ్రగ్స్, గంజాయి పెను పడగలు విప్పి ఉన్నాయి. స్త్రీ తన చేతులతో ఒండి పెట్టాల్సిన ఆహారం కలుషితాలను కలిగి బతుక్కు ఏమాత్రం గ్యారంటీ ఇవ్వలేకపోతోంది. నిత్యావసర ఖర్చులను స్త్రీయే అజమాయిషీ చేసి ఎంత పొదుపు చేయాలనుకున్నా అనారోగ్య ఖర్చు, చదువు ఖర్చు స్త్రీల ప్రధాన కార్యక్షేత్రమైన ‘ఇంటిని’ పూర్తిగా సంక్షోభంలో పడేస్తున్నాయి.
దేశం సరిహద్దులోని సైన్యం, కేంద్ర, రాష్ట్రాలలో ప్రభుత్వ యంత్రాంగం వల్ల మాత్రమే నడుస్తోంది అనుకుంటే పొరపాటు. వీటన్నింటి మధ్య ఉక్కుగుణాన్ని వదుల్చుకోని స్త్రీలే దేశాన్ని నడుపుతున్నారు. అయినప్పటికీ వీరి స్థయిర్యాన్ని దెబ్బ తీయడానికి తగిన పీడనలను ఈ సమాజం వదులుతూనే ఉంది. లైంగిక వేధింపులు, సామూహిక అత్యాచారాలు, యాసిడ్ దాడులు, ప్రేమకు ‘నో’ చెప్తే హత్యలు, ఉద్యోగ ఉపాధి రంగాల్లో జీతభత్యాల వివక్ష, చట్ట సభల్లో ఇంకా దొరకని వాటా, గృహ హింస, వరకట్నం, తీరికే ఇవ్వని ఇంటి చాకిరి, పిల్లల పెంపకం, ఆడపిల్ల జననానికి అననుకూలత... ఇవన్నీ ప్రపంచవ్యాప్త స్త్రీలతో పాటు భారతీయ మహిళలకు మూగదెబ్బలుగా మారుతున్నాయి.
నిజానికి ఇప్పుడు వారి బాధ్యత ఇంకా పెరిగింది. స్త్రీలు ముందుకు వస్తే తప్ప సరికాని సమస్యలు పెరుగుతున్నాయి. పురుషులు తెస్తున్న దేశాల మధ్య యుద్ధం, పర్యావరణ విధ్వంసం, ΄పౌర హక్కుల విఘాతం, న్యాయ వివక్ష, మత విద్వేషం, తప్పుడు వాట్సప్ సమాచారాల పంపిణి, బలహీనులపై బెదిరింపు... ఇవన్నీ మొదట ఎవరో మనకు తెలియని స్త్రీ ఇంటికే హాని కలిగించవచ్చుగాని కాలక్రమంలో అవి ప్రతి ఇంటికీ చేరుతాయి.
స్త్రీలు తాము నివసించే ఇంటి లోపలి, బయటి ఆవరణాలను ప్రజాస్వామ్య స్వభావంతో ఉంచడానికి... సుహృద్భావన పెంచడానికి... పిల్లలకు అందరూ కలిసి ఆడే ఆటస్థలాలు ఇవ్వడానికి... సంపద కాస్తయినా దిగువ వర్గాలకు అందేలా చూడటానికి... విద్య, వైద్యంలో అతి డబ్బు ప్రమేయాన్ని నిరోధించడానికి.... ఆచార వ్యవహారాలు గుదిబండలుగా మారకుండా, రాజ్యాంగస్ఫూర్తిని రక్షించుకోవడానికి మరింత ఆలోచన, చైతన్యం కలిగించుకోవాలి. మరింత ఉక్కుగుణం సముపార్జించుకోవాలి.
ప్రతి స్త్రీకి తను, తన కుటుంబం, తన సమాజం, తన దేశం, తన ప్రపంచం... ఇవన్నీ ముఖ్యం. దుర్మార్గం అనేది కేవలం ఇతరుల పాలిట జరిగితే ఊరుకోగలిగేది కాదు. దుర్మార్గం అందరూ ఖండించదగ్గది. పురుష సమాజం తన దుర్మార్గాలకు అడ్డెవరు నిలుస్తారులే అనుకుంటే జవాబు స్త్రీల నుంచే వస్తుంది. స్త్రీలకు ఇంటిని చక్కదిద్దుకోవడమే కాదు... పరిస్థితులను చక్కదిద్దడం కూడా తెలుసు. ఉక్కు మహిళలకు స్వాగతం.
అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా నేటి నుంచి సాక్షి ఫ్యామిలీలో వారం రోజుల పాటు విశిష్ట కథనాలను అందించనున్నాం.
Comments
Please login to add a commentAdd a comment