
న్యూస్‌మేకర్
వ్యక్తిగత కార్యదర్శి బాధ్యత జటిలమైనది. బాస్ చెప్పింది అర్థం చేసుకుని చెప్పబోయేది గ్రహించి చెబుతున్నది అమలు చేయాలి. మరి ఆ బాస్ ప్రధాని అయితే?
అలాంటి జటిలమైన బాధ్యతకు ఎంపికైంది నిధి తివారి. వారణాసికి చెందిన ఈ ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఆఫీసర్ పి.ఎం.ఓ.లో అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ స్థాయికి వచ్చారు. ఆమె వ్యక్తిత్వం, వ్యక్తిగత వివరాలు.
వారణాసి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ స్వీట్లు పంచుతున్నారు. ఉత్తర ప్రదేశ్ ప్రజలు కూడా తమ రాష్ట్రానికి చెందిన అమ్మాయి ఈ స్థానానికి చేరిందే అని గర్వంగా చూస్తున్నారు. ప్రధానికి ప్రయివేట్ సెక్రటరీగా నియమితురాలైన నిధి తివారి సొంత ఊరు వారణాసి అయితే సొంత రాష్ట్రం ఉత్తర ప్రదేశ్. మరి ఈ హర్షం సహజమే కదా. ఏ పార్లమెంట్ స్థానం నుంచి ప్రధానిప్రాతినిధ్యం వహిస్తున్నారో ఆ స్థానానికి చెందిన మహిళకే ప్రధాని ఈ అవకాశం ఇవ్వడం వారణాసి ప్రజలకు నచ్చింది. ప్రధాని రోజువారి కార్యక్రమాల సమన్వయం చూసే వ్యక్తిగా నిధి తివారి పని చేయడం అంటే సామాన్యమా? సన్నివేశం కొంచెం అటు ఇటుగా మనం సినిమాల్లో చూసినట్టే ఉంటుంది.
ప్రధాని ముందు రోజు అడుగుతారు– ‘రేపటి నా కార్యక్రమాలు ఏమిటి?’
నిధి తివారి చెప్తారు: ‘సర్.. ఫలానా శాఖకు చెందిన మంత్రి మిమ్మల్ని కలవడానికి వస్తారు. ఫలానా శాఖ డైరెక్టర్ వచ్చి నివేదిక అందజేస్తారు. ఫలానా కార్యక్రమంప్రారంభోత్సవానికి వెళతారు. అయితే ఈ కార్యక్రమాలు ఫిక్స్‌డ్ కాదు. ఇంత పెద్ద దేశంలో ఎన్నో తక్షణ సమస్యలు వస్తాయి. వివిధ రాష్ట్రాల నుంచి ప్రధానిని అర్జెంట్‌గా కలవాలని ముఖ్యమంత్రుల దగ్గరి నుంచి ఉన్నత అధికారులు, ప్రతిపక్ష నాయకులు, వ్యాపారవేత్తలు అపాయింట్‌మెంట్లు అడుగుతారు. దేశాల నుంచి ఆహ్వానాలు వస్తుంటాయి. వాటన్నింటినీ సమన్వయం చేసి, ప్రధాని ప్రాధాన్యాలు గమనించి కార్యక్రమాల రూపకల్పన చేయాల్సి ఉంటుంది. ఈ కత్తి మీద సాముకే నిధి తివారి ఎంపికైంది.
ఎవరు ఈ నిధి?
నిధి తివారి.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వినిపిస్తున్న పేరు. దేశ ప్రధాని నరేంద్ర మోదీకి వ్యక్తిగత కార్యదర్శి (ప్రైవేట్ కార్యదర్శి)గా ఇటీవల ఆమె నియమితులవడంలో ‘పిఎంఓ’లో స్త్రీలప్రాధాన్యం పెరుగుతున్నదనడానికి మరో ఆనవాలుగా పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. 2022 నవంబర్ నుంచి ప్రధానమంత్రి కార్యాలయంలో డిప్యూటీ సెక్రటరీగా పని చేస్నున్న నిధి ఇప్పుడు ప్రధాన వ్యక్తిగత కార్యదర్శిగా ప్రమోట్ అయ్యారు. వారణాసిలోని మెహమర్‌గంజ్‌లో పుట్టి పెరిగిన నిధి బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ చేశారు. ఆ యూనివర్సిటీలోనే పరిచయమైన దియోరియా జిల్లాకు చెందిన వైద్యుడు డా.సుశీల్ జైస్వాల్‌ను 2006లో వివాహం చేసుకున్నారు.
పెళ్లి తర్వాత సివిల్స్
సివిల్ సర్వీసెస్‌లో చేరి దేశానికి తనవంతు సేవ చేయాలనేది చిన్ననాటి నుంచి నిధి లక్ష్యం. ’వివాహం విద్య నాశాయ’ అన్న మాటను అబద్ధం చేస్తూ కష్టపడి చదివి, వారణాసిలో అసిస్టెంట్ కమిషనర్ (కమర్షియల్ ట్యాక్స్) ఉద్యోగం సాధించారు. ఆ ఉద్యోగం చేస్తూనే సివిల్స్‌కి సన్నద్ధమయ్యారు. కొడుకు పుట్టినా ఆమె తన లక్ష్యం వీడలేదు. 2013 సివిల్స్ ఫలితాల్లో 96వ ర్యాంకు సాధించారు. ఐఎఫ్‌ఎస్ అధికారిణిగా 2016లో శిక్షణలో ఉన్న సమయంలోనే ఆమె చూపిన ప్రతిభకు గుర్తింపుగా ’అంబాసిడర్ విమల్ సన్యాల్ స్మారక పతకం’ అందుకున్నారు.
మొదటి మహిళ
మోది ప్రధాని అయ్యాక ఈ 11 ఏళ్లలో వ్యక్తిగత కార్యదర్శులుగా వివేక్ కుమార్, హార్దిక్ సతీష్ చంద్ర షా విధులు నిర్వహించారు. ప్రస్తుతం ఆ స్థానంలో నిధి తివారీ మొదటి మహిళగా నియమితులయ్యారు. ప్రధాని వ్యక్తిగత కార్యదర్శిగా ఉన్న ఆమెకు నెలకు రూ.1.44 లక్షల వేతనంతోపాటు ఇతర సదుపాయాలన్నీ అందుతాయి. ప్రతిభ, సామర్థ్యం ఉంటే స్త్రీల ఉన్నతికి ఆకాశమే హద్దు అని నిరూపించేందుకు నిధి తివారి మరో గొప్ప ఉదాహరణగా నిలిచారు.
అజిత్ దోవల్ టీమ్‌లో
ప్రధానమంత్రి కార్యాలయంలో పని చేయడానికి ముందు ప్రభుత్వం ఆమెను విదేశీ వ్యవహారాల శాఖలో ’నిరాయుధీకరణ, అంతర్జాతీయ భద్రతా వ్యవహారాలు’ (డిజార్మమెంట్ అండ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ అఫైర్స్) విభాగంలో అధికారిగా నియమించింది. దాంతోపాటు రాజస్థాన్‌కు సంబంధించిన పలు అంశాలపైనా ఆమె పనిచేశారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఆధ్వర్యంలో ఆమె చూపిన ప్రతిభ ఆమెపై గౌరవాన్ని పెంచింది. దేశ భద్రత, అణుశక్తి, విదేశీ వ్యవహారాల వంటి అంశాలను ఆమె చాకచక్యంగా నిర్వహించగలదన్న నమ్మకం కుదిరింది. ఆ తర్వాత 2023లో భారత్‌లో తొలిసారి జరిగిన జీ20 శిఖరాగ్ర సమావేశంలో నిధి తివారీ చురుకుదనం, వ్యవహార శైలి, దీక్ష, పట్టుదలపై ప్రధానికి ఆమె మీద విశ్వాసం ఏర్పడింది.