
ప్రతీ ఏడాది మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం (International women's day) జరుపుకుంటాం. వివిధ రంగాల్లో మహిళలు సాధించిన విజయాలను గుర్తించి సెలబ్రేషన్స్ జరుపుకుంటారు. అలాగ ప్రపంచంలో మహిళలు ఎదుర్కొంటున్న వివక్షతను, సవాళ్లపై విస్తృతంగా చర్చించడం వాటి పరిష్కారానికి తీసుకోవలసిన చర్యలపై సమాలోచన చేయడం. మహిళా సాధికారత, హక్కులు, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక రాజకీయ సహకారాలపై అవగాహన కల్పించడమే దీని లక్ష్యం.
ప్రతి ఏడాదీ లాగానే ఈ ఏడాది యాక్సలరేట్ యాక్షన్(Accelerate Action) అనేథీమ్‌తో మహిళా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. మహిళా సాధికారతకు, అభివృద్ధికి తోడ్పడూ వ్యూహాలు, వనరులు, చొరవలను గుర్తించి వేగంగా అమలు చేయాలనేది దీని ఉద్దేశం. ఈ సందర్బంగా ఎమ్.డి. మునీర్, సీనియర్ జర్నలిస్ట్ ప్రత్యేక వ్యాసం.
ప్రపంచంలో కోట్లాది మంది గృహిణులకు వేతనం ఎందుకు ఉండ కూడదు అనే విషయం ప్రస్తుతం చర్చానీయాంశం అయింది. చైనాలోని బీజింగ్‌లో ఒక విడాకుల కేసులో కోర్టు గత ఏడాది ఇచ్చిన తీర్పు ఈ చర్చకు దారితీసింది. అయితే ఇంటిపనులు, పిల్లల పెంపకం – సంరక్షణ లాంటివి చూసే గృహిణులకు జీతాలు ఎవరు ఇవ్వాలి అనేదే సమస్య! పురుషుల కన్నా 3 నుంచి 4 గంటలు ఎక్కువ పనిచేస్తారు గృహిణులు. వంట చేయడం, ఇంటిని, వంట సామగ్రిని శుభ్రం చేయడం, పిల్లలు, భర్త, ఇతర కుటుంబ సభ్యుల బట్టలు ఉతకడం వంటి పనులే కాక... తల్లి, భార్య, సోదరి పాత్రల్లో ఎన్నో బాధ్యతలు నిర్వహిస్తుంది. అందుకే ఆమెకు జీతం ఇవ్వాలనే డిమాండ్ ఊపందుకుంటోంది.
తమిళనాడులో గృహిణికి వేతనం అంశం సినీనటుడు కమల హాసన్ తన పార్టీ మేనిఫెస్టోలో పెట్టారు. ఇది కూడా గత ఏడాది పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. బీజింగ్ కోర్టు తన తీర్పులో 5 సంవత్సరాలు భర్తతో ఉండి ఇంటి పనులు చూసుకున్నది కాబట్టి, తన కెరీర్‌ను కోల్పోయింది కాబట్టి, రూ. 5 లక్షల పైచిలుకు పరిహారం జీతం కింద ఇవ్వాలని పేర్కొంది. ఈ తీర్పును ప్రపంచం మొత్తంలో 60 కోట్లకు పైగా జనం సోషల్ మీడియాలో చూశారు. గ్రామీణ మహిళ ప్రతి రోజు 14 గంటలు పనిలో ఉంటుంది. గ్రామీణ పురుషులతో పోలిస్తే 2.5 గంటలు ఇది ఎక్కువ అని పరిశోధకులు అంటున్నారు. ఉద్యోగం చేసే పురుషుల కన్నా మహిళల పని నాలుగింతలు ఎక్కువ. ఇంత చేస్తున్నా గుర్తింపు, ఆదాయం లేకపోగా వేధింపులు, అత్యాచారాలు, హత్యా చారాలు. క్రిమినల్ జస్టిస్ వైఫల్యం వల్ల దేశంలో ఆడబిడ్డలపై గృహహింస పెరుగుతోంది. హోమ్ మేకర్లకు జీతం వస్తే... పురుషుల ఆలోచనా విధానంలో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. గృహిణికి కుటుంబంపై ఆధారపడకుండా ఆర్థిక స్వేచ్ఛ లభిస్తుంది. రక్షణకు... ఒక గ్యారంటీ, నమ్మకం ఏర్పడుతుంది. కుటుంబంలో గౌరవం దక్కుతుంది.
Comments
Please login to add a commentAdd a comment