
అంతర్జాతీయమహిళాదినోత్సవం అంటే మహిళాహక్కుల గురించి చర్చించుకోవడం. వారి హక్కులరక్షణ, మహిళా సాధికారతను సాధించడం ఎలా దానిపై అవగాహన కలిగిఉండటం. ఈ ఏడాది థీమ్ ‘యాక్సలరేట్ యాక్షన్’ అంటే...లింగ సమానత్వానికి సంబంధించిన చర్యల్ని వేగవంతం చేయడం. అంటే మహిళా విద్యా అవకాశాలను మెరుగుపర్చడం, ఉద్యోగ అవకాశాలను మరిన్ని కల్పించడం. సమిష్టిగా, లింగ సమానత్వం కోసం చర్యలను వేగవంతం చేయడం.
ప్రపంచ ఆర్థిక వేదిక డేటా ప్రస్తుత పురోగతి రేటు ప్రకారం, పూర్తి లింగ సమానత్వాన్ని చేరుకోవడానికి 2158 వరకు పడుతుంది. అంటే ఇప్పటి నుండి దాదాపు ఐదు తరాలు పడుతుంది దీనికి సంబంధించి అసలు యాక్సలరేట్ యాక్షన్ అనేది ఎలా ఉండాలి అనే అంశంపై పాపులేషన్ ఫస్ట్ డైరెక్టర్ డాక్టర్ ఎ.ఎల్. శారదతో సాక్షి. కామ్ సంభాషించింది. ఆ వివరాలు మీకోసం...
యాక్సలరేట్ యాక్షన్ అంటే మహిళలకు విలువైన సేవలను, వనరులను మరింత వేగంగా, నిర్మాణాత్మకంగా అధికంగా అందుబాటులోకి తీసుకు రావడం. సపోర్ట్ ది సపోర్టర్స్ అనే నినాదానికి కనుగుణంగా ఉమ్మడిగా సాగిపోవడం అన్నారామె. అది మాత్రమే కాకుండా, నాణ్యమైన సేవలను అందించడం అనే లక్ష్యంగా ఈ కార్యాచరణ సాగాలి. వారికి మరిన్ని అవకాశాలను కల్పించడం అనేది ప్రధానంగా ఉండాలి. ఇది సామూహికంగా సాగాలి. నామమాత్రపు చర్యలుగా గాకుండా చిత్తశుద్ధిగా సాగాలి. కేవలం మాటలు, వాగ్దానాలకు పరిమితం గాకుండా, చేతలు, చర్యలుగా ఉండాలి.
గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు కూడా ఉపయోగపడేలా చర్యల్ని వేగవంతం చేయాలంటే వివిధ సంస్థలు, వ్యక్తులతో కలిసి జమిలిగా పనిచేయాలి. అపుడు మాత్రమే ఆశించిన ఫలితాలు సాధించగలం. కానీ మహిళలకు సేవలను అందుబాటులోకి తీసుకు రావడం అంటే.. మహిళల అభివృద్ధి అంటే ఆడబిడ్డల పెళ్లికి ఎంతో కొంత డబ్బులు ఇవ్వడం, లేదా ఇతర ఉచిత పథకాలు అనుకుంటాయి ప్రభుత్వాలు. కానీ ఇలాంటి పథకాల వల్ల ఆయా పార్టీలకు ఓట్లు వస్తాయోమోగానీ, మహిళలకు పెద్దగా ఒరిగేదేమీ ఉండదు.
మహిళల నాణ్యమైన విద్య, ఆరోగ్యం, క్రియేటివిటీ, నైపుణ్య శిక్షణ, వనరులను అందుబాటులోకి తీసుకు రావడం లాంటివి జరగాలి. ప్రాక్టికల్‌గా లింగ వివక్షను రూపు మాపేందుకు, అందుకు తగిన మెరుగైన అవకాశాలు కల్పించేందుకు కృషి చేయాలి. సాధికారత సాధించేలా వారికి తోడ్పాటు అందించాలి. వారి జీవన పరిస్థితుల మెరుగుదలకు కావాల్సిన వనరులు కల్పించాలి. దీంతోపాటు వనరుల రక్షణలో మహిళలకు శిక్షణ ఇవ్వాలి. ఉదాహరణకు నీటి వసతి కల్పించాలి అంటే తాతాల్కిక పరిష్కారాలతోపాటు నీటి నిల్వలను ఎలా కాపాడాలి, బావులను తవ్వడం లాంటి అంశాలపై దీర్ఘకాలిక ప్రణాళిక ఉండాలి. దీనిపై మహిళలకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలి. సమస్య ఏదైనా పరిష్కారం మూలాల్లోకి వెళ్లాలి. సమాజంలో వివిధ కమ్యూనిటీలు, వ్యక్తులను ఇందులో భాగస్వామ్యులను చేయాలి. బాలికల అక్షరాస్యత శాతం ఎందుకు పడిపోతోంది అనే పరిశోధన జరగాలి. ప్రాంతీయ భాషల్లో అర్థమయ్యేలా విద్యాబోధన జరగాలి. ఇది శాస్త్రీయపరంగా, ఆధునిక బోధనా పద్దతులు ద్వారా జరగాలి. అపుడు మాత్రమే పిల్లలకు చదువుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది.
చర్యలు ఏమైనా ప్లాన్ ఓరియెంటెడ్‌గా గాకుండా, పీపుల్ ఓరియెంటెడ్‌గా ఉండాలి. ఆయా సమస్యల పరిష్కారానికి సంబంధించిన అంశాలపై దృష్టి పెట్టాలి. వాటిపై అవగాహన కల్పించాలి. జంగా చర్యల్ని వేగవంతం చేయడం అంటే పేపర్‌మీద లెక్కలుగా గాకుండా ఫలితాలు, వాస్తవంగా ప్రయోజనకరంగా ఉండాలి. అపుడు మాత్రమే ఈ థీమ్‌కు సాఫల్యత చేకూరుతుంది. ఆ దిశగా ప్రభుత్వాలు కృషి చేయాలి. మహిళా హక్కుల కోసం పనిచేస్తున్న వ్యక్తులు, సంస్థలు,నెట్‌వర్క్‌తో గ్రూపులతో చర్చించి చర్యలు తీసుకోవాలి అన్నారు. పాపులేషన్ ఫస్ట్ ఆధ్వర్యంలో తాము ఇలాంటి సేవలనే అందిస్తున్నామని, అనేక మంది సంస్థలు, వ్యక్తులతో జమిలిగా పనిచేసి, ఫలితాలు సాధిస్తున్నామని శారద చెప్పారు.
అలాగే లింగ వివక్ష నిర్మూలన సమాన అవకాశాల్లో ఎంత సాధించాం అనేది ఒక్కసారి ఆలోచించుకుంటే.. చాలామార్పును సాధించాం అనడంలో ఎలాంటి సందేహం లేదు. పురుషాధిక్య భావజాలం, ఆధిపత్యం ఇంకా కొనసాగుతున్నప్పటికీ, జరుగుతున్న అన్యాయాలపై, హక్కులపై అవగాహన పెరిగింది. ఎందుకిలా అని ప్రశ్నించే తత్వం, పోరాట స్ఫూర్తి పెరిగింది. నిజం చెప్పాలంటే మహిళలు చాలా అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో కూడా చాలా ముందుకు పోతున్నారు. కానీ గుణాత్మకమైన మార్పు సాధించాలంటే ఇది సరిపోదు. 90 శాతం మహిళలు ఇంకా వెనుకబడే ఉన్నారన్నారు. వీరి పురోగతి రేటును వేగవంతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలను, చిత్తశుద్ధిగా, నిబద్ధతతో మరింత వేగవంతం చేయాల్సింది ఉందన్నారు శారద.
పాపులేషన్ ఫస్ట్
పాపులేషన్ ఫస్ట్ అనేది మహిళా సాధికారత, లింగ సమానత్వం ,సమాజ సమీకరణ కోసం అంకిత భావంతో పనిచేస్తున్న సంస్థ. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుండి సోషియాలజీలో డాక్టరేట్ చేసిన డా. శారద పాపులేషన్ ఫస్ట్ ఫౌండర్ డైరెక్టర్‌గా ఉన్నారు. శారద నేతృత్వంలోని పాపులేషన్ ఫస్ట్ జెండర్ సెన్సిటైజేషన్‌ను గుర్తించి, దాని కోసం పనిచేసే అనేకమంది (ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా) జర్నలిస్టులకు ‘లాడ్లీ’ మీడియా పేరుతో అవార్డులు అందించి ప్రోత్సహిస్తుంది. ఇంకా అవగాహనా వర్క్‌షాప్‌లు నిర్వహిస్తుంది. ఫెలోషిప్‌లు అందిస్తుంది. డా.శారద సెంట్రల్ బోర్డ్ ఫర్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) సభ్యురాలిగా కూడా ఉన్నారు. గత మూడు దశాబ్దాలుగా బాలికా విద్యా , మహిళా హక్కులు, సమానత్వం కోసం కృషి చేస్తున్నారు.
మహిళామూర్తులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు