International Women's Day 2025 : స్వీయ ప్రేమ ముఖ్యం | International womensday 2025, kaveriseeds directorvanajadevi special interview | Sakshi
Sakshi News home page

International Women's Day 2025 : స్వీయ ప్రేమ ముఖ్యం

Published Sat, Mar 8 2025 12:44 PM | Last Updated on Sat, Mar 8 2025 12:44 PM

International womensday 2025, kaveriseeds directorvanajadevi special interview

విత్తనంలో మహావృక్షం దాగి ఉంటుందనేది అనుభవజ్ఞులు చెప్పిన మాట. ఆ మాటలను ఆచరణలో పెట్టి ఫలాలను పంచేవారు ఎప్పుడూ సమాజంలో స్ఫూర్తిమంతంగా నిలుస్తారు. మహిళగా ఏడుపదుల అనుభవాన్ని, తన ఆలోచనలను పంచుకున్నారు సికింద్రాబాద్‌ బోయినపల్లిలో ఉంటున్న కావేరీ సీడ్స్‌ డైరెక్టర్‌ జి.వి.వనజాదేవి.  ‘కుటుంబం, సమాజం పట్ల బాధ్యతలు నిర్వర్తించాలంటే మహిళలు అన్నింటికన్నా ముందు స్వీయ ప్రేమ కలిగి ఉండటం అవసరం’ అంటున్నారామె. 

విమెన్స్‌ డే 2025 థీమ్‌మరింత వేగంగా... మరింత నిర్మాణాత్మకంగా ఈ సంవత్సరం విమెన్స్‌ డే క్యాంపెయిన్‌ థీమ్‌... యాక్సిలరేట్‌ యాక్షన్‌.లింగ సమానత్వాన్ని సాధించడానికి ఉత్తమమైన మార్గాలను ఎంచుకోవడంతో పాటు ఆ పనిని మరింత వేగంగా, నిర్మాణాత్మకంగా చేయాలి. ‘యాక్సిలరేట్‌ యాక్షన్‌’లో మహిళల పురోగతికి ఉపయోగపడే వ్యూహాలు, ఆలోచనలు ఉంటాయి. ‘లింగ సమానత్వానికి ఎన్నో అడ్డంకులు ఉన్నాయి’ అని నిరాశపడిపోవడం కంటే ఆశావహ దృక్పథంతో తగిన కార్యాచరణతో ముందుకు వెళ్లడం అవసరం. ‘యాక్సిలరేట్‌ యాక్షన్‌’కు సంబంధించిన ఒక నినాదం... సపోర్ట్‌ ది సపోర్టర్స్‌. మనకు ఎవరైతే  మద్దతు ఇస్తున్నారో వారికి మద్దతు ఇవ్వడం ద్వారా లింగ సమానత్వం కోసం వేసే అడుగులను వేగవంతం చేయవచ్చు. మహిళలకు సహాయపడేందుకు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సంస్థలు పనిచేస్తున్నాయి. వాటికి సంఘీభావం తెలియజేయాలి.

మనం ఏ రకంగా యాక్సిలరేట్‌ యాక్షన్‌లో భాగం కావచ్చు?
వివక్షను సవాలు చేయడం, మహిళల విజయాన్ని సెలబ్రేట్‌ చేసుకోవడం, మనకు తెలిసిన విషయాలను ఇతర మహిళలతో కలిసి పంచుకోవడం, మహిళల నాణ్యమైన విద్య, ఆరోగ్యం గురించి పనిచేయడం, మహిళల సృజనాత్మకతను   ప్రోత్సహించడం లాంటివి ఎన్నో ఉన్నాయి. 


గత కాలం, ప్రస్తుతం కాలం అంటూ మహిళ విషయంలో ప్రత్యేకించి చెప్పలేం. ఏ రోజుల్లోనైనా మహిళ సంఘర్షణలతోనే దోస్తీ చేస్తుంది. ఆమె ఆలోచనలన్నీ కుటుంబం చుట్టూతానే కేంద్రీకృతమై ఉంటాయి. తల్లిదండ్రులు, తోబుట్టువులు, పెళ్లయ్యాక భర్త, అత్తింటివాళ్లు, పిల్లలు .. ఒత్తిడితో కూడిన జీవనంలోనే తనని తాను నిరూపించుకోవడానికి, నిలబడటానికిపోరాటం చేస్తూనే ఉంటుంది. అయితే, ఈ క్రమంలో తనని తాను మర్చిపోతుంది. పెళ్లి తర్వాత కుటుంబపోషణలో లీనమైపోతూ తన ఆరోగ్యం గురించి పట్టించుకోదు, చక్కగా ముస్తాబు అవడాన్ని పట్టించుకోదు. నిజానికి తనని తాను ప్రేమించుకోవడం మర్చిపోతుందనిపిస్తుంది.  

చదవండి: International Women's Day 2025 : యాక్సలరేట్‌ యాక్షన్‌ అంటే? మాటలేనా!

ఆత్మస్థైర్యమే బలం
మాది కరీంనగర్‌ జిల్లాలోని గట్ల నరసింగాపూర్‌ గ్రామం. పెద్ద కుటుంబం. ఎప్పుడూ నలుగురికి పెట్టగలిగే స్థితిలోనే ఉన్నాం. ఉమ్మడి కుటుంబంలో అందరినీ కలుపుకుని ΄ోతూ, బాధ్యతలను నెరవేరుస్తూ, నా ఉనికిని కోల్పోకుండా కాపాడుకున్నాను. పెళ్లినాటికి డిగ్రీ చదువు పూర్తయ్యింది. మా వారు జి.వి.భాస్కరరావుకి వ్యవసాయ రంగం అంటే ప్రేమ. అగ్రికల్చర్‌ బీఎస్సీ చేశారు. పుట్టిన గడ్డపైన తనని తాను నిరూపించుకోవాలని తపన. అందుకు నేను మద్దతుగా నిలిచాను. కావేరీ సీడ్స్‌ మొదలుపెట్టినప్పుడు ఒడిదొడుకులు ఎదుర్కొన్నాం. సమస్య వచ్చింది కదా అని అక్కడే వదిలేస్తే ఈ రోజు కావేరీ సీడ్స్‌ ఉండేది కాదు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో 50కి పైగా మా సీడ్‌ యూనిట్స్‌ ఉన్నాయి. ఈ ఏడాది వ్యవసాయ రంగంలో విద్యార్థులను తీర్చిదిద్దడానికి కావేరీ యూనివర్శిటీ కూడా ప్రారంభించాం.

దిద్దుబాటు
కుటుంబం, పిల్లల బాగోగులు, కంపెనీలో చేదోడుగా ఉండటం .. ఒక దశ తర్వాత బాధ్యతలు తీరి కాస్త తీరిక దొరకడంతో చేయాలా అని ఆలోచిస్తున్నప్పుడు చిన్నజీయర్‌ స్వామి వారి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఆకర్షించాయి. అప్పుడే జైలుశిక్ష అనుభవిస్తున్న మహిళల గురించి తెలిసింది. ఖైదీలుగా ఉన్నవారి సమస్యలను అర్థం చేసుకోవడానికి చంచల్‌గూడ, చర్లపల్లి జైలుకు ‘వికాస తరంగిణి’సభ్యులతో కలిసి వెళ్లాను. క్రమం తప్పకుండా మహిళా ఖైదీలను కలవడం, కౌన్సెలింగ్‌ ఇవ్వడం, వారి పిల్లలను తిరిగి స్కూళ్లలో చేర్పించడం వంటి కార్యక్రమాలు చేశాం. మంచి ఫలితాలు రావడంతో కరీంనగర్, రాజమండ్రి, వరంగల్, విజయవాడ, వైజాగ్‌లలోని జైళ్లలోనూ కౌన్సెలింగ్‌ కార్యక్రమాలకు ఆహ్వానం అందింది. మహిళాఖైదీలు జైలు నుంచి విడుదలయ్యాక వారి జీవనం సానుకూలంగా గడిచే ఏర్పాట్లు చేయడం ఎంతో తృప్తిని కలిగించింది. క్యాన్సర్‌ అవగాహన కార్యక్రమాల్లో పాల్గొనడం, కాన్సర్‌ రోగులకు చికిత్స అందేలా చూడటం, మా ఊరితోపాటు చుట్టుపక్కల గ్రామాలను దత్తత తీసుకొని అభివృద్ధి చేయడం, మహిళారైతుల సమస్యలను తీర్చడం, చదువుకునే విద్యార్థులకు క్యాంపులు, మహిళలకు శిక్షణాతరగతులు నిర్వహించడం.. ఇలా సామాజిక కార్యక్రమాలలో  పాల్గొనే అవకాశాలు లభించాయి. వ్యవసాయ రంగంలో మహిళలు రావడం అంటే గత కాలం కూలీలుగానే చూసేవాళ్లం. కానీ, ఇప్పుడలా కాదు. ఉన్నతవిద్యతో వ్యవసాయం రంగంలో మార్పులు తీసుకురావడానికి యువతరం ముందుకు వస్తుంది. మా యూనివర్శిటీలో చేరిన విద్యార్థుల సంఖ్యే అందుకు నిదర్శనం. 

ముందుగా మహిళలు తమని తాము ప్రేమించుకోవాలి. ఆరోగ్యం, సంరక్షణ, చదువుతో తనకు తానుగా ఎదుగుతూనే కుటుంబ బాధ్యతలను నిర్వర్తించాలి. ఒక్కో విజయాన్ని అందుకుంటూ సమాజంలో వెనకబడినవారిని తనతో కలుపుకుంటూ ముందుకు వెళ్లాలి. దైనందిన జీవనం ప్రశాంతంగా, సంతోషంగా ఉండేలా ప్లాన్‌ చేసుకుంటే ఒత్తిడులను కూడా సులువుగా అధిగమించవచ్చు.’’ తన అనుభవసారాన్ని కళ్లకు కట్టారు వనజాదేవి.

 -నిర్మలా రెడ్డి సాక్షి, ఫీచర్స్‌ ప్రతినిధి 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement