Kaveri Seeds
-
కావేరీ సీడ్ షేర్ల బైబ్యాక్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విత్తన తయారీ సంస్థ కావేరీ సీడ్ కంపెనీ షేర్ల బైబ్యాక్ ప్రకటించింది. టెండర్ ఆఫర్ రూట్లో రూ.325 కోట్ల విలువైన షేర్లను బైబ్యాక్ చేసేందుకు బోర్డు నిర్ణయం తీసుకుంది. 9% ప్రీమియంతో ఒక్కో షేరు ధరను రూ.725గా నిర్ణయించారు. గరిష్టంగా 44.82 లక్షల షేర్లను కంపెనీ కొనుగోలు చేయనుంది. ప్రస్తుతం కంపెనీలో ప్రమోటర్లు, ప్రమోటర్ గ్రూప్‌నకు 59.9% వాటా ఉంది. బైబ్యాక్ వార్తల నేపథ్యంలో కావేరీ సీడ్స్ షేరు ధర బీఎస్ఈలో శుక్రవారం 1.18% ఎగసి రూ.662.60 వద్ద స్థిరపడింది. -
అదానీ గ్రీన్ - కావేరీ సీడ్.. భల్లేభల్లే
కొద్ది రోజులుగా దేశీ స్టాక్ మార్కెట్లు ఆటుపోట్ల మధ్య కదులుతున్నప్పటికీ విభిన్న వార్తల నేపథ్యంలో రెండు కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. ఫలితంగా మరోసారి ర్యాలీ బాటలో సాగుతున్నాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రపంచంలోనే అతిపెద్ద సౌర విద్యుదుత్పత్తి టెండర్‌ను గెలుచుకోవడంతో అదానీ గ్రీన్ ఎనర్జీ దూకుడు చూపుతోంది. మరోవైపు గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో అగ్రికల్చర్ కంపెనీ కావేరీ సీడ్ షేరు స్పీడందుకుంది. వివరాలు చూద్దాం.. అదానీ గ్రీన్ ఎనర్జీ ప్రయివేట్ రంగ విద్యుదుత్పత్తి కంపెనీ అదానీ గ్రీన్ ఎనర్జీ వరుసగా 10వ రోజు 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. అమ్మేవాళ్లు కరువుకాగా.. కొనుగోలుదారులు అధికమై రూ. 382 సమీపంలో ఫ్రీజయ్యింది. ఇది 52 వారాల గరిష్టంకావడం గమనార్హం! అదానీ గ్రూప్‌లోని పునరుత్పాదక ఇంధన కంపెనీ అదానీ గ్రీన్ గత మూడు నెలల్లో 210 శాతం ర్యాలీ చేసింది. ఇదే సమయంలో సెన్సెక్స్ 10 శాతమే లాభపడింది. ఈ నెల 9న 8 గిగావాట్ల ఫొటోవోల్టాయిక్ పవర్ ప్లాంటుతోపాటు.. 2 గిగావాట్ల సోలార్ సెల్ మాడ్యూల్ తయారీ సామర్థ్యాన్ని ఏర్పాటు చేసేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం నుంచి టెండర్‌ను పొందింది. ఇందుకు రూ. 45,000 కోట్లను ఇన్వెస్ట్ చేయవలసి ఉంటుంది. కంపెనీ ఇప్పటికే 2.5 గిగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని అందుకోగా.. మరో 3.5 జీడబ్ల్యూ సామర్థ్యంగల ప్లాంట్లను ఏర్పాటు చేస్తోంది. దీనికితోడు గతేడాది క్యూ4లో ఆకర్షణీయ పనితీరు చూపడం ఈ కౌంటర్‌కు జోష్‌నిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. కావేరీ సీడ్ కంపెనీ గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో అగ్రికల్చరల్ ప్రొడక్టుల కంపెనీ కావేరీ సీడ్ పటిష్ట ఫలితాలు సాధించింది. ఫలితంగా ఈ కౌంటర్ ఇటీవల ర్యాలీ బాటలో సాగుతోంది. ఎన్ఎస్ఈలో తొలుత ఈ షేరు 5 శాతం జంప్‌చేసి రూ. 630కు చేరింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. ప్రస్తుతం కాస్త వెనకడుగు వేసి స్వల్ప లాభంతో రూ. 610 వద్ద ట్రేడవుతోంది. ఈ నెలలో ఇప్పటివరకూ కావేరీ సీడ్ షేరు 50 శాతం జంప్‌చేయడం విశేషం! గత 13 ట్రేడింగ్ సెషన్లలో 58 శాతం ఎగసింది. కాగా.. క్యూ4లో కంపెనీ టర్న్అరౌండ్ సాధించి రూ. 7.6 కోట్ల నికర లాభం ఆర్జించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అంతక్రితం ఏడాది(2018-19) క్యూ4లో రూ. 11 కోట్ల నికర నష్టం ప్రకటించింది. నికర అమ్మకాలు సైతం 18 శాతం పెరిగి రూ. 63 కోట్లను అధిగమించాయి. ఈ క్యూ4లో రూ. 18 కోట్ల నిర్వహణ లాభం ఆర్జించగా.. అంతక్రితం క్యూ4లో రూ. 3 కోట్ల నష్టం నమోదైంది. -
కావేరీ సీడ్స్ లైసెన్స్ తాత్కాలిక రద్దు
అమరావతి: కావేరీ సీడ్స్ లైసెన్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా రద్దు చేసింది. కావేరీ సీడ్స్‌కు చెందిన ‘జాదూ’ పత్తి విత్తనాల నాణ్యత సరిగ్గా లేదని గుంటూరు జిల్లా చిలకలూరిపేట, అచ్చంపేట మండలాల రైతులలు వ్యవసాయశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టిన వ్యవసాయశాఖ అధికారులు నివేదిక తయారుచేశారు. ఈ నివేదికను ఆధారంగా చేసుకొని కావేరీ సీడ్స్ లెసైన్స్‌ను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యేవరకు రద్దు ఆదేశాలు అమలులో ఉంటాయని తెలిపింది. -
కావేరి సీడ్స్‌లో ఎఫ్‌పీఐల వాటా పెంపునకు ఆర్బీఐ ఓకే
ముంబై: విత్తన తయారీ సంస్థ కావేరి సీడ్స్‌లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) వాటాను 49 శాతానికి పెంచుకునేందుకు ఆర్బీఐ అనుమతినిచ్చింది. 2015 మార్చి చివరి నాటికి కంపెనీలో ఎఫ్ఐఐల వాటా 22.26 శాతం ఉంది. వాటా కొనుగోలుకు ఉన్న పరిమితులను తొలిగిస్తున్నట్టు ఆర్బీఐ వెల్లడించింది. పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ కింద ఎఫ్ఐఐలు లేదా ఆర్‌ఎఫ్‌పీఐలు 49 శాతం వరకు పెట్టుబడి పెట్టొచ్చని తెలిపింది. ఎఫ్ఐఐల పరిమితిని ప్రస్తుతమున్న 24 నుంచి 49 శాతానికి చేర్చేందుకు బోర్డుతోపాటు వాటాదారుల నుంచి కంపెనీ మే నెలలో సమ్మతి పొందింది. -
కాంట్రాక్ట్ వ్యవసాయానికి ధరలే అడ్డంక
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కాంట్రాక్టింగ్ వ్యవసాయంలో అవకాశాలు చాలా ఉన్నప్పటికీ ఉత్పత్తి ధరను నిర్ణయించడం అనేది ప్రధాన అడ్డంకిగా ఉందని ఫిక్కి సీఈవో కాన్క్లేవ్ పేర్కొంది. కాంట్రాక్ట్ వ్యవసాయంలో పంటకు ధరను మార్కెట్ రేటును బట్టి నిర్ణయిస్తారా లేక జరిగిన వ్యయానికి లాభం కలిపి ఇస్తాయా అన్న విషయంలో స్పష్టత ఏర్పడితేనే ఈ విధానం విజయవంతం అవుతుందని రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఐవిఆర్ కృష్ణారావు పేర్కొన్నారు. వ్యవసాయంలో ‘నెక్స్ వేవ్ ఆఫ్ ఆపర్చునిటీస్’ అనే అంశంపై ఫిక్కి ఏర్పాటు చేసిన సీఈవో సదస్సులో పలు కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. కావేరీ సీడ్స్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ మితున్ చాంద్ మాట్లాడుతూ ప్రస్తుతం దేశీయ వ్యవసాయ రంగం నీరు, విద్యుత్ అనే రెండు ప్రధాన సమస్యలను ఎదుర్కొంటోందని, వీటిని పరిష్కరించగలిగితే పప్పు దినుసులను దిగుమతి చేసుకునే అవసరం ఉండదన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనపర్చిన వారికి ‘ఫుడ్ 360’ అవార్డులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి అందచేశారు. జోరుగా పీఈ, వీసీ నిధుల ప్రవాహం... కాగా భారత వ్యవసాయ-వ్యాపార కంపెనీల్లో ప్రైవేట్ ఈక్విటీ(పీఈ), వెంచర్ క్యాపిటల్(వీసీ) నిధుల ప్రవాహం జోరుగా సాగనున్నది. ఈ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడానికి పీఈ, వీసీ ఫండ్స్ ఆసక్తిగా ఉన్నాయని కేపీఎంజీ-ఫిక్కి తాజా నివేదిక వెల్లడించింది. సదస్సు సందర్భంగా ఈ నివేదిక వెలువడింది.