equality
-
ఆ న్యాయస్థానంలో అందరూ జవాబుదారులే!
దైవ ప్రవక్త ముహమ్మద్ (స) ఇలా అంటుండేవారు: మీలో ప్రతి ఒక్కడూ సంరక్షకుడే, జవాబుదారుడే. సావధానంగా వినండి: మీలో ప్రతి ఒక్కడూ (తమ తమ పరిధుల్లో) యజమానినే, సంరక్షకుడే. మీలో ప్రతి ఒక్కరిని, వారి సంరక్షణలో ఉన్న వారి బాపతు అడగడం జరుగుతుంది.వివరణ: ముస్లిం సమాజంలోని ప్రతి వ్యక్తి అనేక బాధ్యతలకు కట్టుబడి ఉన్నాడు. తనకు అందుబాటులో ఉన్నది, తాను ఖర్చు చేసే ప్రతి విషయం అల్లాహ్ అతనికి ప్రసాదించిన ఓ అమానతు. దైవానికి దాసునిగా ఉంటానని ప్రతిజ్ఞ చేసినందువల్ల అల్లాహ్ తనకు అందించిన ఆ అమానుతును కొల్లగొట్టకుండా దాన్ని ఎంతో మేళకువగా పరిరక్షించేందుకు కట్టుబడి ఉన్నాడు. ఎందుకంటే మరణానంతరం ఈ భూమిలో తనకు లభించిన ప్రతి వరాన్ని, ప్రతి శక్తిని, సామర్థ్యాన్ని గురించి ఎలాంటి మొహమాటం లేకుండా అక్కడ అడగడం జరుగుతుంది. ఒక ముస్లింగా మనిషి తాను పని చేసే పరిధిలో, శక్తి సామర్థ్యాల్లో స్వతంత్రుడు ఎంత మాత్రం కాడు, సరి కదా ఆ వరాలన్నింటికీ అతను సంరక్షకుడు. దైవ న్యాయస్థానం లో బాధ్యతలు, సంరక్షణకులకు సంబంధించిన పూర్తి రికార్డు ప్రశ్నల రూపంలో ఎదురవుతుంది. ఇస్లామీయ దేశాధ్యక్షుణ్ణి నేరుగాను, ఇస్లామీయ పాలనా వ్యవస్థలో, న్యాయవ్యవస్థలో పనిచేసే ప్రతి చిన్నా, పెద్దా అధికారుల్ని, ఉద్యోగుల్ని పరోక్షంగానూ హెచ్చరించడం జరిగింది. ఈ హెచ్చరిక ఏమిటంటే మీరు ఏ హోదాల్లోనైతే పనిచేస్తున్నారో లేక ఏ ఏ ప్రభుత్వ శాఖలకు ఇన్చా ర్జీలుగా ఉన్నారో ఎంతో న్యాయంగా దైవభీతి కలిగి మీ బాధ్యతలను నెరవేర్చే ప్రయత్నం చేయండి.పరలోకంలో అల్లాహ్ ఏర్పరిచిన న్యాయస్థానంలో మిమ్మల్ని నిలబెట్టి మీరు భూలోకంలో ఏ బాధ్యతలను నిర్వహించారో మీకు ఏ అమానతు అయితే అప్పగించడం జరిగిందో దాన్ని పూర్తిగా నిర్వర్తించారా లేదా అని అడగడం జరుగుతుంది జాగ్రత్త.ప్రతివాడు తన భార్య పిల్లల నైతికతలకు, విద్యాబుద్ధులకు కాపలాదారుడు. భార్య తన శీల సంపదకు, తన పిల్లల శిక్షణకు, భర్త ఆస్తికి, ఇంటిని నడిపేందుకు బాధ్యురాలు. భార్యాభర్తలను ఒకరి విషయాల్లో మరొకరిని బాధ్యులుగా, కాపరదారులుగా చేయడం జరిగింది. మొత్తానికి ప్రళయ దినం నాడు ప్రతివ్యక్తి తన జీవిత కర్మల చిట్టా చేతబట్టి అల్లాహ్ న్యాయస్థానంలో నిలబడవలసి ఉంది.ఇస్లామీయ రాజ్య పాలకుడు ఓ సంరక్షకుడు. అతనితో అతని రాజ్యంలోని ప్రజానీకం గురించి అడగడం జరుగుతుంది. ప్రతివాడు తన భార్య, పిల్లలకు యజమాని. అతడు తన బాధ్యతలను గురించి దేవునికి జవాబు చెప్పుకోవాల్సి ఉంది. ∙స్త్రీ (భార్య), తన భర్త ఇంటికి (అతని సంతానానికి) బాధ్యురాలు. గృహ సంబంధమైన బాధ్యతల గురించి ఆమెను ప్రశ్నించడం జరుగుతుంది. ∙నౌకరు తన యజమానికి; కుమారుడు తన తండ్రి ఆస్తికి సంరక్షకుడు. దేవుడు వారి బాధ్యతలను గురించి అడుగుతాడు. – మొహమ్మద్ అబ్దుల్ రషీద్ -
చీర, గాజులా..?! తీరు మారదా? మాట వరుస మారదా?
ఇటీవల ఒక నాయకుడు మరో నాయకుడిని దూషించాడు. ఆ దూషణ మహిళలను కించపరిచే అర్థంలో సాగింది. అసమర్థతకు సమానార్థకంగా చీర, గాజులను ప్రస్తావించాడు. దూషణలో ఒక కులాన్ని ప్రస్తావిస్తే కేసు పెట్టడానికి చట్టాలున్నాయి. స్త్రీల గౌరవానికి భంగం కలిగే ఇలాంటి వ్యాఖ్యలకు గట్టి చట్టాలెక్కడ? సమాజంలో నెలకొని ఉన్న వివక్షపూరిత భావజాలానికి అడ్డకట్ట ఎప్పుడు? ఈక్వాలిటీ అంటే ఇదేనా? రాజ్యాంగం స్త్రీపురుషులిద్దరికీ సమానమైన గౌరవాలనే చెప్పింది. వివక్షకు తావులేని నిబంధనలున్నా వివక్ష తప్పలేదు. ఐక్యరాజ్య సమితి 1975 ఉమెన్స్ ఇయర్‌గా ప్రకటించి, అధ్యయనానికి కమిటీని వేసింది. ఆ కమిటీ 1977లో ‘టూవార్డ్స్ ఈక్వాలిటీ’ నివేదిక సమర్పించింది. మహిళల సంక్షేమం కోసం ఒక మంత్రిత్వ శాఖనే ఏర్పాటు చేశాం కదా, ఇంకా ఏం కావాలి అనే అభి్ర΄ాయంలో ఉన్న మన పాకుల కళ్లు తెరిపించింది ఆ నివేదిక. దీనికి కొనసాగింపుగా 1985 వరకు మహిళాభివృద్ధి కోసం పని చేయాలని కూడా సూచించింది ఐక్యరాజ్య సమితి. మహిళ సాధికారత సాధనలో ముందడుగు వేస్తున్న క్రమంలో 2001 సంవత్సరాన్ని ‘ఉమెన్స్ ఎంపవర్మెంట్ ఇయర్’గా ప్రకటించింది మన భారత ప్రభుత్వం. ఇన్ని జరుగుతున్నా సమాజం మాత్రం పితృస్వామ్య భావజాలం నుంచి బయటపడడం లేదు. ఒక మగవాడు సాటి మగవాడిని మాటలతో దాడి చేయాల్సి వచ్చినప్పుడు ‘చీర కట్టుకో, గాజులు వేసుకో’అంటున్నారు. ఎదుటి వ్యక్తి మీద అసమర్థత, అనైతికత ఆరోపణలు చేయడానికి స్త్రీత్వాన్ని ఆపాదించడం, స్త్రీల వస్త్రధారణతో గేలి చేయడం వంటి ప్రాక్టిస్ ఏ మాత్రం సరికాదు. ప్రజాజీవితంలోకి వచ్చే వాళ్లు ముందు దయచేసి రాజ్యాంగాన్ని చదవాలి. - ప్రొఫెసర్ తోట జ్యోతి రాణి (రిటైర్డ్), వరంగల్ మౌనంగా ఉంటే మరింత దిగజారుతుంది! ‘ఇక్కడెవరూ గాజులు తొడుక్కుని కూర్చోలేదు’ అనే మాట సమాజంలో వినిపిస్తూనే ఉంది. మగవాళ్ల నుంచే కాదు మహిళల నుంచి కూడా. ‘తాము అసమర్థులం కాదు, సమర్థులమే’ అని చెప్పుకోవడానికి మగవాళ్లు గాజులు, చీరలను మాట్లాడుతుంటారు. నిరక్షరాస్యుల్లో తరచూ వినిపిస్తుంటే చదువుకున్న వాళ్లలో అరుదుగా వినిపిస్తుంటుంది. అంతే తేడా. మరికొందరు ఎదుటి వారి మీద దుమ్మెత్తి పోయడానికి, అసమర్థుడివని దెప్పి పొడవడానికి, ‘నీకు చీర, గాజులు పంపిస్తా’ అనడాన్ని కూడా చూస్తున్నాం. మగవాళ్లు ఇలా అన్నప్పుడు ఆడవాళ్లు మౌనంగా ఉంటే ఆ మాటలను, వారి భావాన్ని, అభి్ర΄ాయాన్ని సమ్మతించి నట్లవుతుంది. అందుకే మహిళలు ప్రతిస్పందించాలి. మహిళ మౌనం వహిస్తే పరిస్థితి ఇంకా దిగజారే ప్రమాదం ఉంది. తప్పు చేసిన వాళ్లను ఒకప్పుడు గుండు గీయించి, సున్నం బొట్లు పెట్టి ఊరంతా తిప్పేవాళ్లు. ఇలా నోటి దురుసుగా మాట్లాడిన వాళ్ల వ్యాఖ్యలను ఖండించి, తగిన విధంగా తిప్పికొడుతూ ఉండాలి. అప్పుడే సమాజంలో తరతరాలుగా పాతుకు΄ోయిన ఇలాంటి మాటలకు అడ్డుకట్ట పడుతుంది. – ఎం. అమ్మాజీ, సీనియర్ జర్నలిస్ట్, విజయవాడ మాట వెనక్కి తీసుకోవాలి! ఇలాంటి మాటలు ఏ మాత్రం సమ్మతించదగినవి కావు. మగవాళ్లు ఒకరినొకరు తిట్టుకోవడానికి ‘... కొడకా’ అంటూ ఆడవాళ్లనే నిందిస్తారు. వాటి మీద మా తరమంతా పోరాడాం, పోరాడుతూనే ఉన్నాం. స్త్రీల కట్టు, బొట్టుతో గేలి చేయడమూ ఎక్కువైంది. ఒక మగవాడు మరో మగవాడిని అవహేళన చేయాలంటే స్త్రీలతో పోల్చడం, స్త్రీలలాగ వస్త్రధారణ చేసుకోమని గేలిచేయడం అంటే వాళ్ల దృష్టిలో చేతకానివాళ్లకు ప్రతీక స్త్రీలే అనే అభిప్రాయం స్థిరంగా ఉందని అర్థం. ఆ మాటలను వెనక్కి తీసుకోమని డిమాండ్ చేయాలి. మాట వెనక్కి తీసుకునే వరకు పోరాడాలి. ప్రొఫెసర్ గూడూరు మనోజ (రిటైర్డ్), హైదరాబాద్ ఇదీ చదవండి: వంటిట్లోని స్క్రబ్బర్, స్పాంజ్లతో ముప్పు : టాయిలెట్ కమోడ్‌కు మించి బ్యాక్టీరియా -
2036 కల్లా పెరగనున్న లింగ నిష్పత్తి
న్యూఢిల్లీ: భారత్‌లో లింగ నిష్పత్తి 2036 సంవత్సరాలికల్లా కొద్దిగా మెరుగుపడనుంది. ప్రతి వెయ్యి మంది పురుషులకు 952 మంది మహిళలు ఉంటారని గణాంక, ప్రణాళిక అమలు శాఖ సోమవారం విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. 2011లో మన దేశంలో లింగ నిష్పత్తి 1000: 943గా ఉంది. లింగ సమానత్వం దిశగా సానుకూల ధోరణిని ఇది సూచిస్తోందని నివేదిక పేర్కొంది. 2036 కల్లా భారత జనాభా 152.2 కోట్లకు చేరుకుంటుందని తెలిపింది. అదే సమయంలో జనాభాలో మహిళల శాతం స్వల్పంగా పెరిగి 48.8 శాతానికి చేరుకుంటుందని వివరించింది. 2011లో భారత జనాభాలో మహిళ శాతం 48.5 మాత్రమే కావడం గమనార్హం. 2011తో పోలిస్తే 2036లో పదిహేనేళ్ల లోపు వయసున్న వారి సంఖ్య తగ్గుతుందని, జననాలు తగ్గుముఖం పట్టడమే దీనికి కారణమని పేర్కొంది. మరోవైపు ఇదేకాలంలో 60 ఏళ్లు పైబడిన వృద్ధుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని తెలిపింది. -
‘ఆడామగా సమానమే, కానీ పురుషుల్లో..’ సుధామూర్తి కీలక వ్యాఖ్యలు
ప్రముఖ రచయిత్రి, రాజ్యసభ ఎంపీ సుధామూర్తి లింగ సమానత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. జీవితం అనే బండికి చక్రల్లాంటివారు. జీవన యానం సాఫీగా సాగాలంటే ఇద్దరూ ఉండాలి.. తన దృష్టిలో స్త్రీపురుషులిద్దరూ సమానమే కానీ, వేర్వేరు మార్గాల్లో అన్నారు.లింగ సమానత్వం అంటే ఏమిటో వివరిస్తూ ఒక వీడియోను ఎక్స్‌లో షేర్ చేశారు. స్త్రీ, పురుషులు సైకిల్‌కి రెండు చక్రాల్లాంటివారు. వీరిలో ఎవరూ లేకపోయినా బండి ముందుకు సాగదు.. అని ఇన్ఫోసిస్ మాజీ చైర్పర్సన్ శ్రీమతి మూర్తి పేర్కొన్నారు.In my view, men and women are equal but in different ways. They complement each other like two wheels of a bicycle; you can't move forward without the other. pic.twitter.com/MMShEOtg9Q— Smt. Sudha Murty (@SmtSudhaMurty) June 27, 2024మహిళలు పురుషులు ఇద్దరూ ఒకరికొకరు భిన్నం. ఇద్దరిలోనూ ప్లస్, మైనస్‌లు ఉంటాయి. అయితే పురుషులతో పోలిస్తే మహిళలకు చాలా భాష తెలుసు. మేనేజ్మెంట్లో వారు చాలా అద్భుతం. పుట్టుకతోనే వారు మంచి మేనేజర్లు. ప్రేమ, జాలి కరుణ ఎక్కువ. అమ్మ, నాన్న, తోబుట్టువులు, అత్తమామలు, వదినలు, పిల్లలు ఇలా సన్నిహిత బంధువులు అందరికీ చక్కటి ప్రేమను పంచుతారు. మరోవైపు పురుషులు మహిళలంత భావోద్వేగులు కాదు. కొంచెం భిన్నం. పురుషుల్లో మంచి ఐక్యూ ఉండివచ్చు కానీ,మంచి ఈక్యూ (ఎమోషనల్ కోషెంట్) ఉండదని ఆమె అభిప్రాయపడ్డారు. -
పాఠ్యపుస్తకాల్లో లింగసమానత్వ చిత్రాలు
కొచ్చి: వంటగది అనగానే అమ్మ వండుతున్నట్లు చూపే ఫొటోలు పాఠ్యపుస్తకాల్లో ముద్రిస్తుంటారు. ఇలాంటి ధోరణికి చెల్లుచీటి ఇస్తూ కేరళ ప్రభుత్వం లింగసమానత్వ చిత్రాలకు పాఠశాల పాఠ్యపుస్తకాల్లో చోటు కలి్పంచింది. అమ్మ అంటే ఉద్యోగం చేయదని, ఇంట్లోనే ఉంటుందనే భావన బడిఈడు పిల్లల్లో నాటుకుపోకుండా ఉండేందుకు, సమానత్వాన్ని వారి మెదడులో పాదుకొల్పేందుకు కేరళ సర్కార్ కృషిచేస్తోంది. ఈ ప్రయత్నానికి ఉపాధ్యాయుల నుంచి మద్దతు లభిస్తోంది. మూడో తరగతి మలయాళం మాధ్యమం పాఠ్యపుస్తకం పేజీలను కేరళ సాధారణ విద్యాశాఖా మంత్రి వి.శివాన్కుట్టి సోషల్‌మీడియాలో షేర్చేశారు. తండ్రి వంటింట్లో కూర్చుని పచ్చి కొబ్బరి తురుము తీస్తున్నట్లు ఒక పేజీలో డ్రాయింగ్ ఉంది. తన కూతురు కోసం తండ్రి అల్పాహారం సిద్ధంచేస్తున్నట్లు మరో పేజీలో డ్రాయింగ్ ఉంది. ఇంటి పనిలో పురుషులు ఎంత బాధ్యతగా ఉండాలని ఈ చిత్రాలు చాటిచెబుతున్నాయని నెటిజన్లు మెచ్చుకున్నారు. -
లింగసమానత్వమే మహిళల ఎజెండా
మహిళా ఓటర్లు రాజకీయ పార్టీలకు కీలకంగా మారారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో, పురుషుల భాగస్వామ్యాన్ని మహిళా ఓటర్ల సంఖ్య అధిగమించింది. రానున్న సాధారణ ఎన్నికల్లో దాదాపు 47 కోట్ల మంది మహిళలు ఓటు వేయనున్నట్లు భారత ఎన్నికల సంఘం అంచనా వేసింది. మగవారి ఆదేశాల మేరకే మహిళలు ఓటు వేస్తారనే భావన క్రమంగా తన విలువను కోల్పోతోంది. పూర్తి స్పృహతో వారి ఎంపికలు ఉంటున్నాయి. సమానత్వం, గౌరవ ప్రదమైన జీవితం తప్ప మహిళలకు మరేదీ అంగీకారం కాదు. వీటిని సాధించే జెండర్ మేనిఫెస్టో తక్షణావసరం. లింగ సమాన ప్రపంచాన్ని సాధించ డానికి కొత్త పుంతలు తొక్కాలనే సంకల్పం ఉంటే ఇదేమీ అసాధ్యం కాదు. భారతదేశం సార్వత్రిక ఎన్నికల వైపు వెళుతున్నందున, నేను గత కొన్ని వారాలుగా మహిళలు, ఎల్జీబీటీక్యూ+ వ్యక్తులతో మాట్లాడి తదుపరి ప్రభుత్వంపై వారి అంచనాలను జెండర్ మేనిఫెస్టోలో పొందుపరిచాను. గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2023 ప్రకారం, భారతదేశం ప్రస్తుతం లింగ సమానత్వంలో 146 దేశాలలో 127వ స్థానంలో ఉంది. ఈ విషయంలో కొన్ని చిన్న, కొన్ని భారీ అడుగులు పడ్డాయి. కానీ ఇది సరిపోదు. రాజ్యాంగ ప్రవేశిక పౌరులందరికీ న్యాయం, స్వేచ్ఛ, సమా నత్వానికి కట్టుబడి ఉంది. భారతదేశ జనాభాలో సగానికి పైగా, ముఖ్యంగా అట్టడుగు వర్గాలకు చెందిన వారు ఇప్పటికీ ఈ ప్రాథమిక హామీలను పొందేందుకు కష్టపడుతున్నారు. జెండర్ మేనిఫెస్టో కోసం సంప్రదింపుల ప్రక్రియను మొత్తంగా చూస్తే, భారతదేశంలోని మహి ళలు సమానత్వం, గౌరవప్రదమైన జీవితాన్ని తప్ప మరేమీ కోరు కోవడం లేదని స్పష్టమైంది. హక్కుల కోసం పోరాడాలా? చారిత్రకంగా నేరపూరితమైన సంచార, డీనోటిఫైడ్ తెగల (నేరస్థ తెగల చట్టం నుండి మినహాయించిన) జనాభాలో ఎక్కువ మందికి, ప్రత్యేకించి మహిళలకు ప్రభుత్వ గుర్తింపు పత్రాలు లేవని అధ్యయనాలు చెబుతున్నాయి. అదేవిధంగా, ట్రాన్స్ జెండర్ వ్యక్తులు ఇప్పటికీ, వారి ‘మృత పేర్లను‘ (లింగ పరివర్తన తర్వాత ఉపయోగంలో లేనటువంటి వారి పుట్టుక పేర్లు) కలిగి ఉన్న రాతపనిని నవీకరించడానికి అధిగమించలేని సవాళ్లను ఎదుర్కొంటున్నారు. వారి గుర్తింపు హక్కు చాలా కాలంగా నిరాకరించబడింది. 2024లో, ఉనికిలో ఉండే హక్కు ఏ వ్యక్తికైనా పోరాటం కాకూడదు. అన్ని వర్గాలకు చెందిన మహిళలు, ఎల్జీబీటీక్యూ+ వ్యక్తుల ఆశలు, ఆశయాలను గుర్తించే జెండర్ ఎజెండాను అనుసరించడం మన రాజ కీయ పార్టీల కర్తవ్యం కావాలి. ఈ ఎజెండా కోసం ఇక్కడ కొన్ని సిఫార్సులు: రాజ్యాంగం సమానత్వానికి హామీ ఇస్తుండగా, లింగ నిర్ధారిత కోణం నుండి చూసినప్పుడు వ్యక్తిగత హక్కులు తక్కువగా ఉంటున్నాయి. వివాహం చేసుకునే ప్రాథమిక హక్కు పౌరులకు లేదని గతేడాది సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఎల్జీబీటీక్యూ+ వ్యక్తులకు తమ భాగస్వాములను ఎంచుకునే హక్కును తిరస్కరించినట్లయితే మనం సమానత్వాన్ని ప్రకటించుకోలేం. వీలైనంత త్వరగా పార్లమెంటు దీనిపై చట్టం చేయాలి. ప్రతిరోజూ, మహిళలు తీవ్రమైన భద్రతా సవాళ్లను ఎదుర్కొంటున్నారు. వాటిలో కొన్ని ఇంట్లో ప్రారంభమవుతాయి. శిక్షాస్మృతిలో వైవాహిక అత్యాచారం మినహాయింపుగా ఉండటం అనాలోచితం. తదుపరి ప్రభుత్వం ఈ చట్టాన్ని తొలగించి, లింగ ఆధారిత హింస పట్ల జీరో–టాలరెన్స్(ఏమాత్రం సహించని) విధానాన్ని అనుసరించాలి. చాలామంది మహిళలు డీప్ ఫేక్ (మార్ఫింగ్ వీడియోలు), ఆన్ లైన్ దుర్వినియోగం పట్ల ఉన్న వారి భయాల గురించి నాతో మాట్లా డారు. పెరుగుతున్న ముప్పును ఎదుర్కోవడానికి ప్రస్తుత శాంతి భద్రతల యంత్రాంగాలు తగినంతగా సన్నద్ధంగా లేవు. మహిళలు ఆన్లైన్లో, ఆఫ్‌లైన్‌లో సురక్షితంగా ఉండేలా చేయడానికి వీటిని తప్పనిసరిగా సంస్కరించాల్సి ఉంది. లింగ అపోహలు తొలగాలి అన్నిరకాల సామాజిక కలయికలు పెరగాలంటే, లింగ అపోహలను వదిలించుకోవాలి. ముఖ్యంగా పిల్లలు తమ పరిసరాలలో లింగ పరమైన సామాజికీకరణ కారణంగా పితృస్వామ్య పద్ధతులను అవలంబిస్తారు. లింగపరమైన మూస పద్ధతులను తొలగించడానికి పాఠశాల పాఠ్యపుస్తకాలను సమీక్షించడం, తిరగరాయడం తక్షణ అవసరం. అదనంగా, లింగపరమైన సున్నితత్వాన్ని బోధించే వర్క్ షాప్‌లను పాఠశాల పాఠ్యాంశాలలో చేర్చాలి. తరువాత, పిల్లల సంరక్షణ అనేది తల్లిదండ్రుల ఉమ్మడి బాధ్యత అని మనం గుర్తించాలి. అన్ని అధికారిక సంస్థలలో వేతన చెల్లింపుతో కూడిన పితృత్వ సెలవును తప్పనిసరి చేయాలి. ఒక దృష్టాంతాన్ని నెలకొల్పడానికి, అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో ‘క్రెష్’(శిశు సంరక్షణ కేంద్రం)లను కూడా ఏర్పాటు చేయాలి. తద్వారా పనిచేసే తల్లిదండ్రులు, లింగ భేదం లేకుండా పిల్లల సంరక్షణలో పాల్గొనేలా చేయాలి. కోవిడ్ తర్వాత, ఆరోగ్య హక్కుపై ఎక్కువ దృష్టి పడింది. అయితే, మహిళలు తమ ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వడం లేదని అధ్యయనాలు కనుగొన్నాయి. ఆరోగ్య హక్కును కీలకమైనదిగా పరిగ ణించాలి. లింగపరమైన దృష్టితో విధానాలను రూపొందించాలి. గత కేంద్ర బడ్జెట్లో, గర్భాశయ క్యాన్సర్‌ను నివారించడానికి టీకాలు వేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రకటించింది. తప్పనిసరిగా రొమ్ము, గర్భా శయ క్యాన్సర్‌కు ఉచిత పరీక్షలు చేయాలి. ఇంకా, జాతీయ ఆహార భద్రతా చట్టం 2013 ప్రకారం, గర్భిణులకు, పాలిచ్చే తల్లులకు ద్రవ్యోల్బణంతో సరిపోయేలా ఆర్థిక సహాయాన్ని తప్పనిసరిగా పెంచాలి. మహిళలకు ఆర్థిక శ్రేయస్సును అందించడం తదుపరి ప్రభుత్వానికి ఒక ముఖ్యమైన సవాలు. మహిళల నేతృత్వంలోని స్టార్టప్‌లకు నిర్దిష్ట నిధులను తప్పనిసరిగా కేటాయించాలి. మహిళా రైతులను గుర్తించకపోవడం, తక్కువ మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యం మహిళలకు సంబంధించినంతవరకు రెండు ప్రధాన బాధాకరమైన అంశాలు. తదుపరి ప్రభుత్వం మహిళా రైతుల హక్కుల బిల్లు, 2011ను తప్పనిసరిగా అమలులోకి తేవాలి. కార్మిక శక్తిలో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే ఆర్థిక విధానాలను, ముఖ్యంగా ఉత్పాదక రంగంలో అమలు చేయాలి. తమ సిబ్బందిలో 20 శాతం కంటే ఎక్కువ మంది మహిళలను నియమించుకునే సంస్థలకు పన్ను రాయితీలు మంజూరు చేయడం ఒక మార్గం. ప్రభుత్వం అతిపెద్ద ఉద్యోగ కల్పనా దారులలో ఒకటి కాబట్టి, 30 లక్షలుగా అంచనా వేసిన ప్రస్తుత ఖాళీ స్థానాలను త్వరగా భర్తీ చేయాలి. ఈ ఉద్యోగాలకు మహిళా రిజర్వేషన్ ను తప్పనిసరిగా విస్తరించాలి. చట్టం చేయాల్సిన ఆవశ్యకత భారతదేశంలో మహిళల రాజకీయ హక్కులకు సంబంధించి గత సంవత్సరం చాలా ముఖ్యమైనది. మూడు దశాబ్దాలకు పైగా జరిగిన ఉద్యమాల తర్వాత మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందింది. ప్రభుత్వానికి దృఢ సంకల్పం ఉంటే లింగ సమానత్వం వైపు చరిత్రాత్మక అడుగు వేయవచ్చని ఇది సూచిస్తోంది. అయితే, చట్టం అమలులో లేకపోవడం మనందరినీ నిరాశకు గురిచేస్తోంది. రాబోయే ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ ను వీలైనంత త్వరగా అమలు చేసేలా చూడాలి. ఇది జనాభా లెక్కలను పూర్తి చేయడానికి లోబడి ఉండ కూడదు. పైగా, ప్రాతినిధ్యం అనేది ఎగువ మరియు దిగువ సభలు రెండింటిలోనూ ప్రతిబింబించే ఆదర్శం. రాజ్యసభ, లెజిస్లేటివ్ కౌన్సి ల్లలో ప్రాతినిధ్యం లేని వర్గాలకు రిజర్వేషన్ల నిబంధనలపై పార్లమెంటు తప్పనిసరిగా చట్టం చేయాలి. భారతదేశం లింగ సమానత్వాన్ని సాధించడానికి ఒక శతాబ్దానికి పైగా కాలం పడుతుంది. గత స్త్రీవాద ఉద్యమాలు మన ప్రధాన లక్ష్యాల సాధనలో పట్టుదలతో కొనసాగుతూనే, చిన్నపాటి విజయా లను జరుపుకోవాలని బోధించాయి. పైన పేర్కొన్న సిఫార్సులు కీలక మైనవి, దూరదృష్టితో కూడుకున్నవి. ముఖ్యంగా, తదుపరి ప్రభుత్వా నికి దాని పదవీకాలంలోనే సాధించదగినవి. మనకు కావలసిందల్లా లింగ–సమాన ప్రపంచాన్ని సాధించడానికి కొత్త పుంతలు తొక్కాలనే నిస్సందేహమైన సంకల్పం మాత్రమే. ఏంజెలికా అరిబమ్ వ్యాసకర్త ‘ఫెమ్మె ఫస్ట్’ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు -
వనిత ప్రగతి పరుగు?!
"ఆడాళ్ళు మీకు జోహార్లు .. ఓపిక,ఒద్దిక మీ పేర్లు- మీరు ఒకరి కంటే ఒకరు గొప్పోళ్ళు.." - ఆచార్య ఆత్రేయ. అది అక్షరాలా నిజం. 'క్షమయా ధరిత్రి' అన్న ఆర్యోక్తికి మరోరూపం ఇచ్చారు ఆచార్యులవారు. ప్రతి రంగంలోనూ ఒకరిని మించి మరొకరు దూసుకెళ్తునే ఉన్నారు. ముళ్ళపూడి వెంకటరమణ ఇలా చమత్కరించారు. "ఆడవాళ్లు - మగవాళ్లు ఇద్దరూ సమానమే,కాకపోతే మగవాళ్ళు కాస్త ఎక్కువ సమానం". ముళ్ళపూడివారి మాటలు కూడా నిజాన్ని ప్రతిబింబించేవే. 'ఆకాశంలో సగం' అనే మాట వినడానికి అందంగానే ఉంటుంది కానీ, ఆచరణలో అన్నింటా ఆడవాళ్లకు సగభాగం దొరుకుతోందన్నది అర్ధసత్యం. ఇప్పటికీ ప్రపంచంలో స్త్రీ ఎక్కువ గౌరవాలు పొందుతున్నది మన భరతభూమిలో అన్నది కాదనలేని నిజం. కొంత ఛాందసాలు, చాదస్తాలు రాజ్యమేలుతున్నా, మన వివాహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థలు మనల్ని మిగిలినవారి కంటే భిన్నంగా నిలుపుతున్నాయి. బంధాలు, బాంధవ్యాల వీచికలు ఇంకా వీస్తూనే ఉన్నాయి. ప్రతి మార్చి 8వ తేదీ 'అంతర్జాతీయ మహిళా దినోత్సవం' జరుపుకోవడంతోనే సరిపోదు. నిజమైన పండుగ వారి గుండె గుడిలో నిండుగ ఉదయించాలి. ఈ వేడుకను ఒకొక్క దేశంలో ఒకొక్క రకంగా జరుపుకుంటున్నారు. ప్రపంచ దేశాల్లో ఈ ఉత్సవాలు ప్రారంభం కాకమునుపే అమ్మను అమ్మవారుగా నిత్యం కొలిచే ఆచారం మనకు వేళ్లూనుకొని వుంది.అదే సమయంలో కష్టాలు,కన్నీళ్లు,బానిసత్వం, అణగదొక్కే విధానం,ఆచారాల పేరిట అసమానతలు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. ఆధునిక సమాజంలోనూ ఆటవిక పోకళ్ళు వదలడం లేదు.'నిర్భయ' చట్టాల వంటివి ఎన్ని వచ్చినా,ఆడపిల్లలు నిర్భయంగా తిరిగే రోజులు ఇంకా రాలేదు. అక్షరాస్యత పెరుగుతున్నా,అరాచకాలు ఆగడంలేదు.ఉద్యోగిత పెరుగుతున్నా సమానత ఇంకా సాధ్యమవ్వలేదు. ఓటు హక్కు వచ్చినా,చట్ట సభల్లో మహిళలు ఇంకా ఆమడ దూరంగానే ఉన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం లభించినా, ఆచరణకు ఏళ్ళుపూళ్ళు పట్టేలా వుంది. శాసనాలు చేసే అధికారం రావాలంటే ఇంకా చాన్నాళ్ళు ఆగాల్సిందే.అప్పటిదాకా శాసించే శక్తి మగవాళ్ల దగ్గరే వుంటుంది. ప్రజాస్వామ్యం,రాజ్యాంగం అందించిన అవకాశాలతో మహిళామణులు రాష్ట్రపతి , స్పీకర్ వంటి అత్యున్నత పదవులను అందుకున్నా, అది సరిపోదు.సమత, సమతుల్యత ఇంకా సాధించాల్సి వుంది. ఇంకొక వైపు వరకట్నపు చావులు, అత్తారింటి వేదింపులు ఆగకుండా సాగుతూనే ఉన్నాయి. 'స్త్రీలకు స్త్రీలే శత్రువులు' అన్నది ఇంకా వీడడం లేదు. లింగవివక్ష నుంచి పూర్తిగా బయటపడే తరుణం కోసం తరుణులంతా ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఆర్ధిక స్వేచ్ఛ,సమానత్వం కోసం ఎదురుతెన్నులు కాస్తూనే ఉన్నారు.కార్మిక సంఘాలు ఏర్పడినా,చట్టాలు వచ్చినా మహిళా కార్మికులు,కర్షకుల వేతనాల చెల్లింపుల్లో అన్యాయం జరుగుతూనే ఉంది.1991లో భారతదేశం సరళీకరణ ఆర్ధిక విధానాల వల్ల ప్రైవేట్ రంగం ఎంతో బలపడింది.ఉద్యోగ అవకాశాలు మెరుగుపడ్డాయి కానీ, ఎంపిక ప్రక్రియలో అసమానత అలాగే ఉంది.సాఫ్ట్ వేర్ రంగం మాత్రం కాస్త నయం.అమ్మాయిలను తరలించే (విమెన్ ట్రాఫికింగ్) విషవ్యాపారం,బాలికలపై అత్యాచారాలు యదేచ్ఛగా సాగుతూనే ఉన్నాయి. గ్రామీణ మహిళా సాధికారత ఎంతో పెరగాల్సి ఉంది. పేదరిక విముక్తి, ఆకలి నిర్మూలనకు ముగింపు వాక్యాలు పలకాల్సి ఉంది. 'పని సంస్కృతి' (వర్క్ కల్చర్ ) మారుతున్న క్రమంలో ఎదురవుతున్న ఇబ్బందులకు తగినట్లుగా సౌకర్యాలు పెరగాలి. 100 సంవత్సరాల పై నుంచీ 100 దేశాలకు పైగా 'అంతర్జాతీయ మహిళా దినోత్సవం' జరుపుకుంటున్నాయి. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క నినాదాన్ని వినిపిస్తున్నారు. అవి నినాదాల దశ దాటి ఆచరణ దశకు చేరుకోవడం లేదు. కొంత అభివృద్ధి, ప్రగతి చోటుచేసుకున్నప్పటికీ సమగ్రత,సంపూర్ణత సాధించాల్సి ఉంది. 'లింగ సమానత్వం సాధించడం' 2022 సంవత్సరంలో ఎజెండాగా పెట్టుకున్నారు. ఈ డిజిటల్ యుగంలో, 'నవీనత్వం - సాంకేతికతలో లింగ వివక్షలేని సమానత్వం' 2023 ఎజెండాగా కల్పన చేసుకున్నారు. ' ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్ - యాక్సలరేట్ ప్రోగ్రెస్ '- 2024 ఎజెండాగా పెట్టుకున్నారు. మహిళా సాధికారితను సాధించడానికి ఇంకెన్నాళ్లు పోరాడాలి? అనుకున్నది జరగాలి, ఈ పోరాటం ఆగాలి అన్నది మహిళాలోకం కోరుకుంటున్నది. మహిళా ప్రగతి వేగం పెరగాలని ఈ ఏటి ప్రధాన ఎజెండా. వినడానికి ఎజెండాలు ఎప్పుడూ బాగానే వుంటాయి. ఆచరణలో ఎక్కడ? అనే ప్రశ్నలు ఉదయించడం మానడంలేదు. మరోపక్క...స్త్రీలు అబల దశ నుంచి సబల దశకు చేరుకుంటూనే ఉన్నారు.అనేక రంగాల్లో పురుషులతో పోటీ పడుతున్నారు. కొన్ని రంగాల్లో మించి పోతున్నారు. ఇది పూర్తిగా మహిళామణుల స్వయంకృషి,పట్టుదల, దీక్షాదక్షతలు మాత్రమే. అందివచ్చిన ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ఎదుగుతున్నారు. సవాళ్లు, దాడులు ఎదుర్కొని నిలుస్తున్నారు.కాకపోతే, సమానత్వంలో సమగ్రత సాధించాలి. మహిళాలోకం వెలగాలి, వెలుగులు పంచాలి (అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సీనియర్ జర్నలిస్టు మా శర్మ స్పెషల్ స్టోరీ..) - మాశర్మ, సీనియర్ జర్నలిస్టు -
జెండర్ ఈక్వాలిటీ అంటే అది!'దటీజ్ జపాన్'
ఇటీవల జూన్ 24, 25 తేదీల్లో లింగ సమానత్వం, మహిళ సాధికారతపై జీ7 దేశాల శిఖరాగ్ర సదస్సు జరిగింది. దీనికి జపాన్ ఆతిధ్య ఇచ్చింది. ఈ సదస్సులో ఏడుగురు మంత్రుల బృందం సమావేశమై ప్రతిజ్ఞ చేసింది. ఆ మంత్రులంతా మహిళా కార్యనిర్వాహకులకు మద్దతు ఇస్తామని, నిర్వాహక పాత్రలలో మహిళల ప్రాతినిధ్యాన్ని విస్తరింపజేస్తామని ప్రతిజ్ఞ చేశారు. అయితే ఆ మంత్రుల సదస్సు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల దృష్టిని తెగ ఆకర్షించింది. అసాధారణరీతిలో లింగ సమానత్వ మహిళా మంత్రులు సదస్సులో ఒకే ఒక్క మగ మంత్రి తన దేశం తరుపున ప్రాతినిధ్య వహించడం విశేషం. ఈ సమావేశానకి ఆతిధ్యమిచ్చిన జపాన్ దేశమే మహిళ సాధికారతపై జరగుతున్న సదస్సుకు తన దేశం తరుఫు నుంచి ఓ ఫురుషుడిని పంపి అందర్నీ ఆశ్చర్యపర్చింది. జెండర్ ఈక్వాలిటీ అంటే అర్థం ఏమిటో చెప్పకనే చెప్పింది. పైగా చెప్పడం కాదు చేసి చూపడం లేదా ఆచరించి చూపడం అని చాచిపెట్టి కొట్టినట్లు చెప్పింది. "దటీజీ జపాన్" అని సగర్వంగా ఎలుగెత్తి చెప్పింది. ఇక ఆ సమావేశంలో తన దేశం తరుఫున పాల్గొన్న జపాన్‌కు చెందిన రాజకీయ ప్రముఖుడు, కేబినేట్ మంత్రి మసనోబు ఒగురా మీడియా సమావేశంలో మాట్లాడుతూ..ఆ సమావేశంలో ఏకైక పురుష డెలిగేట్ అయ్యినందుకు ఎలా భావిస్తున్నారని అడుగగా..లింగ సమానత్వం కోసం పురుషులు ఇంకాస్త చొరవ తీసుకుని ముందుకొచ్చి నాయకత్వం వహించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పాడు. ఇతర దేశాల సహకారంతో మహిళల చురుకైన భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేలా పని చేస్తున్నట్లు చెప్పాడు. అలాగే లింగ సమానత్వమే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పాడు. ఇదిలా ఉండగా, టైమ్ మ్యాగ్జైన్ ప్రకారం..వరల్డ్ ఎకనామిక్ ఫోరం తన తాజా వార్షిక గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్‌ను విడుదల చేసిన కొద్ది రోజులకే జపాన్‌లో నిక్కోలో ఈ జీ7 శిఖారాగ్ర సమావేశం జరగడం గమనార్హం. కాగా, ఈ ఎకనామిక్ ఫోరం ఆర్థిక భాగస్వామ్యం, అవకాశం, విద్యాసాధన, ఆరోగ్యం, మనుగడ, రాజకీయ సాధికారత తదితర కీలక కొలమానాల ఆధారంగా ఈ జెండర్ గ్యాప్ ఇండెక్స్‌ని అంచనా వేస్తుంది. (చదవండి: ఎవరి ఆలోచనో అది!..'స్నేహితుల బెంచ్') -
విశ్వ సమానత్వాన్ని తిరస్కరిస్తారా?
జాతి, మతం, లింగం, లైంగిక ధోరణితోపాటు కుల ప్రాతిపదికన వివక్షను నిషేధించే చట్టాలు అమెరికా, కెనడాల్లోని కొన్ని రాష్ట్రాలు ఆమోదించాయి. వీటిని ఆర్ఎస్ఎస్, బీజేపీ మేధావులు వ్యతిరేకించారు. అమెరికాలో హిందూ ప్రతిభ పురోగతిని అడ్డుకునేందుకు కుట్ర పన్నుతున్నారనీ, ప్రపంచంలో హిందూ మతానికి హాని కలిగించడానికే ఈ వివక్షా కార్డును ఉపయోగిస్తున్నారనీ వారు ఆరోపించారు. భారతీయ వలసల్లో కుల వివక్ష ఎలా పనిచేస్తోందని అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యూరప్ దేశాల్లో ఇప్పటికే కొన్ని అధ్యయనాలు జరిగాయి. సాధారణంగా మానవ సమానత్వం వైపు, ప్రపంచంలో ఎక్కడ నివసిస్తున్నప్పటికీ భారతీయులు సమానత్వం వైపు నిలబడుతున్నట్లయితే, ఎవరైనా అలాంటి శాసనాలను ఎందుకు వ్యతిరేకించాలి? అమెరికాలో పలువురు వలస భారతీయుల కేంద్రంగా ఉన్న సుసంపన్న రాష్ట్రం కాలిఫోర్నియా సెనేట్‌లో 2023 మార్చి 22న కుల వివక్ష వ్యతిరేక బిల్లును ప్రవేశపెట్టారు. ఇది ఆమోదం పొందినట్లయితే, ప్రపంచంలోనే కులాన్ని మరింత మౌలికంగా చర్చించే మొదటి చట్టం అవుతుంది. భారత రాజ్యాంగం అస్పృశ్యతను రద్దు చేసింది కానీ కులాన్ని కాదు. హిందుత్వ ప్రవాసులు ఇలాంటి కీలక పరిణామం చోటు చేసుకోబోదని భావించారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, బీజేపీ శక్తులు కూడా అలాంటి ఘటన జరగకూడదని భావించాయి. కానీ ప్రపంచం వీరి పరిధిని దాటిపోయింది. జాతి, మతం, లింగం, లైంగిక ధోరణితోపాటు కుల ప్రాతిపదికన పౌరులు, పెద్దలు లేదా పిల్లలపై వివక్షను నిషేధించే చట్టాన్ని సియాటిల్ సిటీ కౌన్సిల్(అమెరికా), టొరొంటో డిస్ట్రిక్ట్ స్కూల్ బోర్డ్(కెనడా) ఆమోదించినప్పుడు పలువురు ఆర్ఎస్ఎస్, బీజేపీ మేధావులు వ్యతి రేకించారు. ఇలాంటి శాసనాలను ‘హిందూఫోబియా’గా వారు ఖండించారు.అటువంటి శాసనాలను వ్యతిరేకిస్తూ పలు పత్రికలు, సోషల్ మీడియా వేదికల్లో రాశారు, మాట్లాడారు. సాధారణంగా మానవ సమానత్వం వైపు, ప్రపంచంలో ఎక్కడ నివసిస్తున్నప్పటికీ భారతీయుల సమానత్వం వైపు నిలబడుతున్నట్లయితే, అలాంటి శాస నాలను ఎందుకు వ్యతిరేకించాలి? వివక్షకు సమర్థనా? సియాటిల్ సిటీ కౌన్సిల్ ఇటీవలే ఆమోదించిన తీర్మానంలో వివక్ష వ్యతిరేక చట్టాలకు కులాన్ని కూడా జోడించడాన్ని ఆర్ఎస్ఎస్ అనుబంధ పత్రిక పాంచజన్య ‘సంస్థాగత మార్గం ద్వారా అమెరికాలో హిందూఫోబియాను ప్రోత్సహిస్తున్నారు, అమెరికాలో హిందూ ప్రతిభ పురోగతిని అడ్డుకునేందుకు కుట్ర పన్నుతున్నారు’ అని పేర్కొన్నట్టుగా ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ రాసింది. ఆర్ఎస్ఎస్ సీనియర్ నాయకుడు రామ్ మాధవ్ ఈ వాదననే మరింత ముందుకు తీసుకు పోయారు. కుల వివక్షకు సంబంధించిన ఈ తప్పుడు జెండాను ఎత్తుతున్న బృందాలు సాధారణంగా హిందూభయంతో ఉంటు న్నాయని ఆయన ఒక జాతీయ దినపత్రికలో రాశారు. ప్రపంచంలో హిందూ మతానికి హాని కలిగించడానికే ఈ వివక్షా కార్డును ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. అమెరికా కేంద్రంగా వ్యవహరించే పరిశోధనా సంస్థ ‘ఈక్వాలిటీ ల్యాబ్’నూ, అలాగే అమెరికా, కెనడా, యూరప్ తదితర ప్రాంతాల్లో అలాంటి కుల వ్యతిరేక చట్టాలు, శాస నాలపై పనిచేసే పౌర సమాజ బృందాలనూ పశ్చిమ దేశాల్లోని హిందూఫోబిక్ గ్రూపులుగా రామ్ మాధవ్ తప్పుపట్టారు. పాంచజన్య ఆరెస్సెస్ అధికార పత్రిక. వివక్షా వ్యతిరేక చట్టం హిందూఫోబియాకు సంకేతమనీ, భారతీయ ప్రతిభ పురోగతిని అడ్డుకునే కుట్ర అనీ అది పేర్కొంటోంది. భారత్ లేదా ప్రపంచంలో గణనీయ సంఖ్యలో భారతీయులు నివసిస్తున్న చోట సంస్థాగత శాసనాలను రూపొందించకుండా కులవివక్ష సమస్యను పరిష్కరించడం ఎలా? వివక్షను ప్రదర్శిస్తున్న వారు అలాంటి వివక్షా వైఖరి తప్పు అని ఎన్నడూ భావించరు. ఒక వ్యక్తి లేదా వర్గ మానసిక లక్షణాల్లో వివక్షా పూరితమైన ప్రవర్తన భాగమవుతుంది. హిందూ మతానికి సంబంధించి, అలాంటి వివక్షను ఆధ్యాత్మిక పాఠ్య గ్రంథాల ద్వారా సమర్థిస్తున్నారు. దానికి పవిత్రతను కల్పిస్తున్నారు. వివక్షాపూరిత అనుభవాలెన్నో! భారతీయ వలసల్లో కుల వివక్ష ఎలా పనిచేస్తోందని అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యూరప్ దేశాల్లో ఇప్పటికే కొన్ని అధ్యయనాలు జరిగాయి. స్కూల్, కాలేజీ, పిల్లలు, యువత రోజువారీగా అను భవిస్తున్న వేదనకు సంబంధించిన ఇవి గాథలను వర్ణించాయి. వ్యక్తుల కుల నేపథ్యాన్ని తెలుసుకోవడానికి, అమలవుతున్న వివక్షా పద్ధతు లను కనుగొనడానికి సంబంధించిన యంత్రాంగాలను పలు నివేది కలు వెలికి తెచ్చాయి. ఉదాహరణకు, తెన్ మొళి సౌందరరాజన్ తాజా పుస్తకం ‘ద ట్రామా ఆఫ్ కాస్ట్ – ఎ దళిత్ ఫెమినిస్ట్ మెడిటేషన్ ఆన్ సర్వైవర్‌షిప్, హీలింగ్, అబాలిషన్’ అమెరికాలోని భారతీయ వలస ప్రజలలో వివక్షకు సంబంధించిన అసంఖ్యాక ఘటనలను గుది గుచ్చింది. ఈమె రెండో తరం భారతీయ అమెరికన్ దళిత మహిళ. టొరొంటో శాసనాలను రూపొందించిన తర్వాత, కెనడాలోని ఒక కాలేజీ విద్యార్థి త్రినా కుమార్ తన జీవితంలో ఎదుర్కొన్న ఒక అనుభవాన్ని సమగ్రంగా వర్ణించారు. తమ వేదనా గాథలను చెబు తున్న, భవిష్యత్తును ప్రేమిస్తున్న యువ మహిళగా ఆమె కనిపిస్తారు. ‘‘గ్రేటర్ టొరొంటో పాఠశాలల్లో కులపరమైన వేధింపును చాలానే ఎదుర్కొన్నాను. ఈ వేధింపు నాకు అయోమయం కలిగించింది. ప్రత్యేకించి మేమంతా కెనడియన్లమే అయినప్పటికీ నా తోటి క్లాస్ మేట్లకు కులం అంటే ఇంత ప్రాధాన్యం ఎందుకు అని నేను ఆశ్చర్య పడ్డాను’’ అని ఆమె చెబుతున్నారు. ‘‘వారి అగ్రకుల సంప్రదాయా లను నేను అనుసరించలేదు, దళిత క్రిస్టియన్ గా ఉంటున్నందుకు వారు నన్ను ఆటపట్టించేవారు’’ అని ఆమె చెప్పారు. క్రిస్టియన్లు మెజారిటీగా ఉంటున్న దేశంలో వారు ఇలా చేస్తున్నారు. ఇది క్రిస్టోఫోబియా కాదా? పాశ్చాత్య కులతత్వ వలస ప్రజల్లో ఈక్వాలిటీ ల్యాబ్స్ ఒక సంక్షోభాన్ని సృష్టించింది. అయితే, అమెరికాలో కుల వివక్షపై ఈక్వా లిటీ ల్యాబ్స్ అధ్యయనాన్ని రామ్ మాధవ్ తోసిపుచ్చారు. ఇలాగైతే, మొత్తంగా గోధుమవర్ణపు భారతీయులు తమ మీద శ్వేత అమెరికన్లు వివక్ష ప్రదర్శిస్తారని ఎలా ఆరోపించగలరు? సమానత్వం కోసం పనిచేస్తున్న గ్రూపులెన్నో! అమెరికా, కెనడాల్లో కుల వివక్షా వ్యతిరేక చట్టాలపై ఈక్వాలిటీ ల్యాబ్స్ ఒక్కటే పనిచేయలేదు. ఉత్తర అమెరికా అంబేడ్కర్ అసోసి యేషన్, బోస్టన్ స్టడీ గ్రూప్, పెరియార్ అంబేడ్కర్ స్టడీ సర్కిల్,అంబేడ్కర్ బుద్ధిస్ట్ అసోసియేషన్, అంబేడ్కర్ కింగ్ స్టడీ సర్కిల్, అంబేడ్కర్ ఇంటర్నేషనల్ మిషన్ వివక్షను ఎండగట్టడానికీ, పీడిత కుల వలస ప్రజలను చైతన్యవంతం చేయడానికీ కృషి చేశాయి. భారత్‌లో కులం, మానవ అస్పృశ్యత ఎలా పనిచేస్తున్నాయో, దాన్ని అమెరికా, యూరప్, కెనడా, ఆస్ట్రేలియాల్లో ఎలా విస్తరింపజేస్తున్నారో పాశ్చాత్య సమాజాలకు తెలియపర్చేందుకు ఈ సంస్థలు బహుముఖ కార్యక్రమాలను చేపడుతూ వచ్చాయి. ఎక్కడ ఉన్నా సరే... కుల అణచివేత, దాని కార్యకలాపాలు ఎంత అమానుషంగా ఉంటు న్నాయో ఈ దేశాల్లోని నల్లవారికీ, శ్వేత జాతీయులకూ తెలియజెప్పేందుకు ఈ సంస్థలు తమ వనరులనూ, మానవ శ్రమనూ చాలా వెచ్చించాయి. కులవ్యవస్థ గురించి, దాని అమానుషమైన ఆచరణ గురించి ప్రపంచానికి అవగాహన కల్పించడంలో తప్పేముంది? మానవ సమా నత్వం కోసం నిలబడకుండా ఆర్ఎస్ఎస్, బీజేపీ ప్రజాస్వామ్యం కోసం ఎలా నిలబడతాయి? జాతి వివక్ష, ఇతర దేశాల పట్ల దురభిప్రాయం, దానికి సంబంధించిన అసహనాలకు వ్యతిరేకంగా డర్బన్ లో ఐక్యరాజ్యసమితి సదస్సు జరిగిన 2001 నుంచి ప్రపంచం చాలా దూరం పయనించింది. ఆనాటి సదస్సులో జాతి సమస్యతోపాటు కుల సమస్యను కూడా చర్చించడానికి అనుమతించలేదు. ఆనాడు ఐ.రా.స. అంగా లకు కుల వ్యవస్థ గురించి ఏమీ తెలియదనే చెప్పాలి. కుల సమస్యను అంతర్గత అంశం అని ప్రకటించి, దానిపై ఎలాంటి చర్చను కూడా అనుమతించడానికి బీజేపీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం సుముఖత చూపడం లేదు. హిందూఫోబియా పేరిట వివక్షను, అసమాన త్వాన్ని, జాతి హత్యాకాండను విశ్వగురువు ఎందుకు ప్రేమిస్తున్నారు? హిందూయిజం మానవ సమానత్వాన్ని కోరుకోవడం లేదని దీని అర్థం కాదా? ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
ఆమె పోరాడింది.. టాప్‌లెస్ సమానత్వం సాధించింది
జర్మనీ రాజధాని నగరం బెర్లిన్‌లోని బహిరంగ ప్రదేశాల్లోని స్విమ్మింగ్ పూల్స్‌లో ఇకపై ఆడామగా తేడా లేకుండా టాప్‌లెస్‌గా ఈత కొట్టొచ్చు. ఈ మేరకు గురువారం ఆదేశాలు జారీ చేశారు అధికారులు. దీనికి ఓ మహిళ చేసిన పోరాటమే కారణం. తాజాగా నగరంలోని ఓ స్విమ్మింగ్ పూల్ వద్ద టాప్‌లెస్‌గా సన్‌బాత్ చేసింది ఒకావిడ. అది గమనించిన నిర్వాహకులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఆమెను బలవంతంగా బయటకు పంపించేశారు. దీంతో ఆమె సెనేట్ ఆంబుడ్స్పర్సన్ ఆఫీస్‌ను సంప్రదించింది. మగవాళ్లతో సమానంగా ఆడవాళ్లను చూడాలని.. టాప్‌లెస్‌గా ఈతకు అనుమతించాలని పోరాటానికి దిగింది. ఆమె డిమాండ్‌కు అధికారులు దిగొచ్చారు. వివక్షకు పుల్‌స్టాప్ పెడుతున్నట్లు బెర్లిన్ అధికారులు ప్రకటించారు. బెర్లిన్‌లో స్మిమ్మింగ్ పూల్స్ నిర్వాహణ చూసుకునే బెర్లినర్ బేడర్బెట్రీబే.. తమ నిబంధనలను సవరిస్తూ గురువారం ఆదేశాలు జారీ చేశాయి. అయితే ఆ మహిళ వివరాలను మాత్రం బయటకు వెల్లడించలేదు. జర్మనీ సాధారణంగా న్యూడిటీ విషయంలో పెద్దగా పట్టింపులు లేని దేశం. కాకపోతే పూర్తి నగ్నత్వాన్ని మాత్రం ఎట్టిపరిస్థితుల్లో ప్రోత్సహించదు. -
International Womens Day: వాణిజ్య వాహనాల డ్రైవర్లుగా మహిళలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వాహన తయారీ దిగ్గజం అశోక్ లేలాండ్ ఎంబ్రేస్ ఈక్విటీ పేరుతో ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మహిళలకు సమాన అవకాశాలను అందించే ప్రయత్నంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. అశోక్ లేలాండ్‌కు చెందిన ట్రైనింగ్ సెంటర్లో భారీ వాణిజ్య వాహనాలు, బస్‌లు నడపడంపై శిక్షణ పొందేందుకు 100 మంది మహిళలను న్యూఢిల్లీకి ఆహ్వానించింది. ‘వాస్తవానికి భారీ వాణిజ్య వాహనాల డ్రైవింగ్ అనేది పురుషుల బలమనే ప్రచారం ఉంది. ఎంబ్రేస్ ఈక్విటీ ద్వారా దీనిని ఛేదించాలనేది కంపెనీ ఆలోచన’ అని అశోక్ లేలాండ్ తెలిపింది. ఢిల్లీ ప్రభుత్వం చేపట్టిన మిషన్ పరివర్తన్ కార్యక్రమం కోసం ఇటీవల భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు కంపెనీ తెలిపింది. దీనిలో భాగంగా 180 మంది మహిళలకు డ్రైవింగ్‌లో శిక్షణ కల్పించింది. వీరిలో చాలా మంది ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లో డ్రైవర్లుగా నియామకం అందుకున్నారని అశోక్ లేలాండ్ వెల్లడించింది. -
లింగ సమానత్వానికి మరో 300 ఏళ్లు పడుతుంది: గుటేరస్
న్యూయార్క్: ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న లింగ అసమానతలపై ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఆవేదన వ్యక్తం చేశారు. లింగ సమానత్వం మన కళ్ల ముందే కనుమరుగు అవుతోందని పేర్కొన్నారు. మహిళలు, పురుషుల మధ్య అంతరాలు తగ్గడానికి ఇంకో 300 ఏళ్లు పడుతుందని, ఇది బాధాకరం అన్నారు. మహిళల హోదా విషయంపై ఐరాస సెషన్లో సోమవారం మాట్లాడుతూ గుటేరస్ ఈ వ్యాఖ్యలు చేశారు. మహిళల హక్కులను అవహేళన చేస్తూ, ప్రమాదంలోకి నెడుతూ, ఉల్లంఘిస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. లింగసమానత్వంపై సాధించిన దశాబ్దాల పురోగతి మన కళ్ల ముందే కనుమరుగు కావడం ఆలోచించాల్సిన విషయమన్నారు. అఫ్గానిస్తాన్‌లో మహిళల హక్కులను తాలిబన్ ప్రభుత్వం కాలరాస్తున్న విషయాన్ని కూడా గుటెరస్ ప్రస్తావించారు. సాధారణ ప్రజా జీవితానికి వాళ్లను దూరం చేశారని చెప్పారు. చాలా దేశాల్లో మహిళల లైంగిక, పునరుత్పత్తి హక్కులను కూడా హరించివేస్తున్నారని తెలిపారు. కొన్ని దేశాల్లో పాఠాశాలకు వెళ్లే చిన్నారులను కిడ్నాప్ చేసి దాడులు చేస్తున్నారని, మరికొన్ని దేశాల్లో మహిళలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే వాళ్లపై దారుణాలకు పాల్పడుతున్నారని వివరించారు. లింగ సమానత్వ అంతరం రోజురోజుకు మరింత పెరుగుతోందన్నారు. చదవండి: అంటార్కిటికా కరిగిపోతోంది! -
ఒకే దేశం, ఒకే చట్టం... సాధ్యమయ్యేనా?
ఉమ్మడి పౌరస్మృతి (యూనిఫాం సివిల్ కోడ్–యూసీసీ) మరోసారి తెరపైకి వచ్చింది. ఒకే దేశం ఒకే చట్టం ఎజెండాతో గతంలో ఉత్తరాఖండ్ ఎన్నికలప్పుడు యూసీసీ అమలుకు బీజేపీ సర్కారు కమిటీ వేయడం తెలిసిందే. తాజాగా గుజరాత్ కూడా అదే బాట పట్టింది. బీజేపీ పాలిత రాష్ట్రాలు ఇలా వరసగా యూసీసీ అమలుకు సై అంటూ ఉండడంపై చర్చ మొదలైంది. విభిన్న పరిస్థితులున్న దేశంలో ఒకే చట్టం ఎలా సాధ్యమన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి... కుల, మత, జాతి, ప్రాంత, లింగ భేదాలు లేకుండా దేశ పౌరులందరికీ ఒకే విధమైన చట్టాలను అమలు చేయడమే ఉమ్మడి పౌరస్మృతి. ఇది అమల్లోకి వస్తే పెళ్లిళ్లు, విడాకులు, వారసత్వ హక్కులు, జనన మరణాలు, దత్తత ప్రక్రియకు సంబంధించి పౌరులందరికీ ఒకే చట్టం వర్తిస్తుంది. పౌరులందరికీ ఒకే చట్టాన్ని అమలు చేయడానికి ప్రభుత్వాలు కృషి చేయాలని, అప్పుడే సమానత్వ హోదా దక్కుతుందని రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 కూడా చెబుతోంది. హిందూత్వ ఎజెండాతో రాజకీయాలు చేస్తున్న బీజేపీ ఉమ్మడి పౌరస్మృతిని ఎన్నడో తన మేనిఫెస్టోలో చేర్చింది. తన రాజకీయ ఎజెండాలో ఆగ్రభాగాన ఉన్న అయోధ్య రామ మందిర నిర్మాణం చేపట్టింది. కశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్ 370ను రద్దు చేసింది. ఇప్పుడు ఉమ్మడి పౌరస్మృతిపై దృష్టి సారించింది. దేశవ్యాప్తంగా ఒకేసారి అమలు చేయకుండా ముందు తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల నుంచి మొదలు పెట్టే వ్యూహంతో ముందుకు వెళ్తోంది. బీజేపీ పాలిత యూపీ, హిమాచల్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్ యూసీసీని దేశవ్యాప్తంగా అమలు చేయాలని గట్టిగా డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. అనుమానాలూ లేకపోలేదు... అయితే యూసీసీపై హిందువుల్లోనే కాస్త వ్యతిరేకత వచ్చే ఆస్కారముందా అన్న అనుమానాలూ లేకపోలేదు. ‘‘భిన్న మతాలకు చెందిన వారికి వేర్వేరు లా బోర్డులున్నాయి. హిందూ మతానికి చెందినవారు కూడా వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు ఆచారాలు పాటిస్తున్నారు. వాటన్నింటికీ ఏకరూపత ఎలా సాధ్యం?’’ అన్నది ఒక వాదన. కేవలం మెజార్టీ ఓటు బ్యాంకును ఏకమొత్తంగా కొల్లగొట్టేందుకేనని ఒక వర్గం ఆరోపిస్తోంది. ఇది బీజేపీ ఎన్నికల స్టంటని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తదితర నేతలు అంటున్నారు. అందరికీ ఒకే చట్టాల్లేవా...? ప్రస్తుతం దేశంలో ముస్లింలు, క్రిస్టియన్లు, పార్సీలకు వారి మత సంప్రదాయాలకు అనుగుణంగా వ్యక్తిగత చట్టాలున్నాయి. ముస్లింలకు షరియా చట్టాలకు అనుగుణంగా ముస్లిం పర్సనల్ లా అమలవుతోంది. దాని ప్రకారం ముస్లిం పురుషులకు నాలుగు పెళ్లిళ్లు చేసుకోవడానికి అనుమతి ఉంది. వేరే మతస్తులకు మాత్రం చట్టప్రకారం ఒక్క భార్యే ఉండాలి. సివిల్ అంశాల్లో కాంట్రాక్ట్ చట్టం, సివిల్ ప్రొసీజర్ కోడ్ వంటి అనేకానేక ఉమ్మడి చట్టాలనూ పలు రాష్ట్రాల్లో భారీగా సవరించారు. గోవాలో 1867 నాటి కామన్ సివిల్ కోడ్ అమల్లో ఉన్నా అక్కడా కేథలిక్కులకు, ఇతర మతాలకు భిన్నమైన నియమాలు పాటిస్తున్నారు. నాగాలాండ్, మిజోర, మేఘాలయాల్లోనైతే హిందూ చట్టాల్లో కూడా భిన్నత్వం ఉంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ర్యాంకులు పోనాయండీ!
ప్రపంచవ్యాప్తంగా ఇది ఆందోళనకర అంశం, తక్షణ దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిన విషయం. ఐరాస లెక్క ప్రకారం వరుసగా రెండో ఏడాదీ పలు దేశాల ‘మానవాభివృద్ధి సూచిక’ (హెచ్‌డీఐ) స్కోరు కిందకు పడింది. మన దేశపు ర్యాంకు మునుపటితో పోలిస్తే రెండు స్థానాలు కిందకు పడింది. ఐరాస అభివృద్ధి సంస్థ (యూఎన్డీపీ) 2021–22 మానవాభివృద్ధి నివేదిక (హెచ్డీఆర్) ‘అనిశ్చిత పరిస్థితులు, అస్థిర జీవితాలు – మారుతున్న ప్రపంచంలో భవిష్యత్ రూప కల్పన’ ఈ చేదునిజాన్ని బయటపెట్టింది. తొంభై శాతానికి పైగా దేశాలు 2020లో కానీ, 2021లో కానీ హెచ్‌డీఐ స్కోరులో వెనకబడ్డాయి. నలభై శాతానికి పైగా దేశాలైతే ఆ రెండేళ్ళూ ర్యాంకుల్లో కిందికి వచ్చేశాయి. గత వారం విడుదలైన ఈ నివేదిక ప్రకారం మానవాభివృద్ధిలో మొత్తం 191 దేశాల్లో మన దేశం రెండు స్థానాలు కిందకొచ్చి, 132వ ర్యాంకుకు చేరింది. గడచిన 32 ఏళ్ళలో ఇలా వరుసగా రెండేళ్ళు సూచికలో దిగజారడం ఇదే తొలిసారి. మానవాభివృద్ధి పరామితుల ప్రకారం బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంకల కన్నా మనం వెనకబడే ఉన్నాం. దేశం సుభిక్షంగా ఉంది, స్థూల జాతీయోత్పత్తిలో బ్రిటన్ను దాటేశాం లాంటి కబుర్లతో కాలక్షేపం చేస్తున్న వారికి ఇది కనువిప్పు. హెచ్డీఐలో వివిధ దేశాల ర్యాంకులు పడిపోవడానికి కనివిని ఎరుగని సంక్షోభాలు కారణం. గత పదేళ్ళలో ఆర్థికపతనాలు, వాతావరణ సంక్షోభాలు, కరోనా, యుద్ధం లాంటి గడ్డు సమస్యల్ని ప్రపంచం ఎదుర్కొంది. ప్రతి సంక్షోభం ప్రపంచాభివృద్ధిపై ప్రభావం చూపింది. అయితే, అందులో కరోనాది అతి పెద్ద పాత్ర అని ఐరాస నివేదిక సారాంశం. ప్రపంచాన్ని వణికించిన ఈ మహమ్మారితో మానవ పురోగతి కనీసం అయిదేళ్ళు వెనక్కి వెళ్ళింది. అంతటా అనిశ్చితి ప్రబలింది. హెచ్‌డీఐకి లెక్కలోకి తీసుకుంటున్న అంశాల్లో లోపాలున్నాయని కొన్ని విమర్శలు లేకపోలేదు. అయితే, మరే సూచికా లేని వేళ ప్రతి దేశపు సగటు విజయాన్నీ లెక్కించడానికి ఉన్నంతలో ఇదే మెరుగైనదని ఒప్పుకోక తప్పదు. ఆర్థిక అసమానత్వం, లైంగిక అసమానత్వం, బహుముఖ దారిద్య్రం లాంటి ఆరు వేర్వేరు మానవాభివృద్ధి సూచీల ద్వారా ఈ ర్యాంకులు లెక్కకట్టారు. స్విట్జర్లాండ్ 0.962 స్కోరుతో ప్రథమ ర్యాంకు దక్కించుకుంది. భారత్ కేవలం 0.633 స్కోరుతో అగ్రశ్రేణికి సుదూరంగా నిలిచిపోయింది. విషాదమేమిటంటే, మానవాభివృద్ధిలో మన స్కోరు ప్రపంచ సగటు 0.732 కన్నా తక్కువ. పొరుగున ఉన్న చైనా హెచ్‌డీఐ స్కోర్ 1990 నుంచి ఏటా పెరుగుతుంటే, మన పరిస్థితి తద్భిన్నంగా ఉంది. మన దేశంలో ఆర్థిక అసమానతలూ ఎక్కువే. జనాభాలో అతి సంపన్నులైన 1 శాతం మంది ఆదాయ వాటా, నిరుపేదలైన 40 శాతం మంది వాటా కన్నా ఎక్కువని తాజా లెక్క. ఇంతటి అసమానత చైనా, స్విట్జర్లాండ్లలో లేదు. లింగపరంగా చూస్తే, మన దేశ తలసరి ఆదాయంలో పురుషుల కన్నా స్త్రీలు చాలా వెనుకబడి ఉన్నారు. విద్య, వైద్యం, జీవన ప్రమాణాల ప్రాతిపదికన లెక్కకట్టే బహుముఖ దారిద్య్రం లోనూ భారత్ పరిస్థితి గొప్పగా ఏమీ లేదు. 2019 నాటి యూఎన్డీపీ అంచనాల ప్రకారం... ప్రపంచంలో అత్యధిక జనాభా గల చైనాలో 5.4 కోట్ల మంది బహుముఖ దారిద్య్రంలో ఉంటే, రెండో అత్యధిక జనాభా ఉన్న భారత్‌లో ఆ సంఖ్య 38.1 కోట్ల పైచిలుకే. అయితే, 2019 – 2020 మధ్య మన దేశంలో లింగ అసమానత దారుణంగా పెరగగా, తాజా నివేదికలో ఆ కోణంలో కొద్దిగా మెరుగుదల సాధించడం ఉపశమనం. మొత్తానికి, అన్నీ కలిపి చూస్తే మానవాభివృద్ధిలో మన స్కోరునూ, దరిమిలా ఇతర దేశాల మధ్య మన ర్యాంకునూ కిందకు గుంజాయి. అయితే, సంతోషించదగ్గ అంశం ఏమంటే – కరోనాలో ఏడాది లోపలే భారత్ టీకాను అభివృద్ధి చేయడం, ధనిక దేశాలకు సైతం కరోనా నిరోధానికి సహకరించడం! ఇది మన మానవ సామర్థ్యమే! అదే సమయంలో కనీస ఆదాయ హామీకై దేశంలో జరుగుతున్న ప్రయత్నాలూ యూఎన్డీపీ ప్రశంసలు అందుకున్నాయి. అలాగే కరోనా అనంతరం ఆర్థికంగా మన దేశపు పనితీరు పొరుగు దేశాల కన్నా మెరుగ్గా ఉండడం ఆశాకిరణం. అభివృద్ధి అజెండా అమలుకు నిధులు వెచ్చించే వీలుంటుంది. అయినా, ఇప్పటికీ అనేక అంశాల్లో ఇతర దేశాలు మెరుగ్గా ఉన్నాయనేది నిష్ఠురసత్యం. పౌష్టికలోప జనాభా, బాలల మరణాల రేటు తదితర అంశాలతో లెక్కించే ‘ప్రపంచ ఆకలి సూచి’ (2020) ప్రకారం కూడా 107 దేశాల్లో మనది 94వ స్థానం. వీటికి తోడు ఇప్పుడు ఉక్రెయిన్‌లో యుద్ధం, ప్రపంచాన్ని పూర్తిగా వదిలిపోని కరోనా, భూతాపోన్నతి ముప్పేటదాడి చేస్తున్నాయి. అన్నీ కలసి ప్రపంచ ఆహార సంక్షోభానికి దారి తీయవచ్చని ఐరాస హెచ్చరిస్తోంది. నిలకడైన అభివృద్ధి, సామాజిక భద్రత, సత్వర సాంకేతిక ఆవిష్కరణలపై దృష్టి పెడితేనే అనిశ్చితి నుంచి బయటపడగలమంటోంది. ఐరాస మాట చద్దిమూట. పాలకులు దీన్ని పరిగణనలోకి తీసుకొని, పకడ్బందీగా మానవాభివృద్ధి ప్రణాళికలు రచించాలి. పర్యావరణ సంక్షోభ నివారణ లక్ష్యాలను చేరుకొనేందుకూ కృషి చేయాలి. ద్రవ్యోల్బణం, ధరలు పెరుగుతూ, ఉపాధి హామీ తగ్గుతున్న సమయంలో ఎన్నికల వ్యూహాలు కాస్త ఆపి, నిలకడగా చేతల్లోకి దిగాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంతరాలు తగ్గించుకొని, సమన్వయంతో సాగాలి. కానీ, పైచేయి కోసం ప్రయత్నాలతో ఢిల్లీ నుంచి గల్లీ దాకా సహకార స్ఫూర్తి కొరవడుతున్న వేళ ప్రగతి బాటలో కలసి సాగడానికి మన పాలకులు సిద్ధమేనా? -
సమానత్వంలో ఆరోగ్యమూ కీలకమే!
2047 నాటికి అందరికీ మెరుగైన ఆరోగ్య సేవలు అందించే దేశంగా భారత్ ఎదగాలంటే ముందుగా మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఎంత సమర్థంగా పనిచేయించగలమో చూసుకోవాలి. వ్యక్తులు, వారి అవసరాలే కేంద్రంగా ఆరోగ్య వ్యవస్థ నిర్మాణం జరగాలి. ఆరోగ్య రంగాన్ని విస్మరిస్తే వ్యాధులు, ఆరోగ్య సమస్యలపై పెట్టాల్సిన ఖర్చులు అలవి కానంతగా పెరుగుతాయి. ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో మూడోది నేరుగా ఆరోగ్యానికి సంబంధించినదే. అలాగే తొలి రెండు లక్ష్యాలైన అందరికీ ఆహారం, పేదరిక నిర్మూలనకూ ఆరోగ్యంతో సంబంధం ఉన్నది. ఇంకోలా చెప్పాలంటే ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలను తీర్చకుండా ఈ రెండు లక్ష్యాలను సాధించడం కష్టం. స్వాతంత్య్ర 75వ వార్షికోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఇప్పుడు అందరి దృష్టి స్వాతంత్య్రం వచ్చి 100 ఏళ్లయ్యే సువర్ణ ఘడియలపైనే ఉంది. భారతదేశం అప్పటికి ఎలా తయారవ్వాలి? నా దృష్టిలో అందరికీ సమాన అవకాశాలున్న దేశంగా; విద్య, ఆరోగ్యం అందరికీ అందుబాటులో ఉన్న దేశంగా ఉండాలి! కులమతాలకు అతీతంగా... వ్యవ సాయం, పాడి పరిశ్రమలు పుష్టిగా సాగుతుండాలి. నాణ్యతే ప్రధానంగా పరిశ్రమలు వస్తువులను అందించాలి. ఇవన్నీ కూడా అందరికీ సమాన అవకాశాలు అన్న లక్ష్యాన్ని సాధించేందుకు ఉపయోగపడేవే. ప్రతి సమాజానికి విద్య, ఆరోగ్యం పునాదుల్లాంటివి. ఈ రెండు విషయాల్లోనూ దేశం సాధించిన ప్రగతికి ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి. భారతీయ విద్యావిధానం అంతర్జాతీయ స్థాయి సీఈవోలను సిద్ధం చేస్తూంటే... భారతీయ ప్రైవేట్ రంగ ఆరోగ్య వ్యవస్థలు ప్రపంచం నలుమూలల్లోని వారికి మెడికల్ టూరిజంతో వైద్యసేవలు అందిస్తున్నాయి. అయితే ఈ రెండు ఉదాహరణలను మినహాయిం పులుగానే చూడాలి. పైగా ఈ రెండింటిలో అవకాశాలు కొందరికే. పిల్లలు తమ మేధోశక్తిని సంపూర్ణంగా ఉపయోగించుకునేందుకు మొట్ట మొదటి పునాది ఇంట్లోనే పడుతుంది. పసివాళ్లతో తగురీతిలో మాటలు కలపడం, ఇంద్రియజ్ఞానానికి సంబంధించిన పనులు చేయించడం వంటి పనుల ప్రాధాన్యతను తల్లిదండ్రులు అర్థం చేసుకుంటే విద్యభ్యాసానికి గట్టి పునాది పడినట్లే. తల్లిదండ్రులిచ్చిన ఈ ప్రాథమిక విద్యకు సుశిక్షితులైన ఉపాధ్యాయులతో నడిచే పాఠశాల కూడా తోడైతే బాలల వికాసం పెద్ద కష్టమేమీ కాదు. ఉమ్మడి కుటుం బమైనా... చిన్న కుటుంబమైనా సరే... సాంఘిక, ఆర్థిక పరిస్థితులే పిల్లలకు దక్కే విద్య నాణ్యతను నిర్ణయిస్తాయి. పాఠశాల వాతా వరణం సాంఘిక, ఆర్థిక లేమి ప్రభావాన్ని కొంతవరకూ తగ్గించ గలదు కానీ... ఇది జరగాలంటే పాఠశాలలు సక్రమంగా పనిచేస్తూం డాలి. దీనర్థం భవనాలు, పరిపాలన వ్యవస్థలు సరిగా ఉండాలని కాదు. నిబద్ధతతో పనిచేసే ఉపాధ్యాయులు కావాలి. అణగారిన వర్గాల పిల్లల జీవితాలను మార్చడం మూకుమ్మడిగా జరగాల్సిన వ్యవహారం. ఈ మార్పు తీసుకు రావడం సాధ్యమనీ, అందుకోసం ఏమైనా చేయగలమనీ ఉపాధ్యాయులు సంకల్పించు కోవడం అవసరం. అయితే ఈ మార్పు రాత్రికి రాత్రి వచ్చేదేమీ కాదు. ప్రభుత్వాల ఆదేశాలతో సాధ్యమయ్యేదీ కాదు. విద్యాబోధనలో గిరిజన సంస్కృతుల నుంచి పాఠాలు నేర్చుకోవడం లేదా తర్క బద్ధమైన అభ్యాసాలను ప్రవేశపెట్టడమైనా సరే... పాఠశాలల్లో విద్యా ర్థుల మదింపు అనేది అందరికీ ఒకేలా ఉండటం సరికాదు. ఈ వాదనలకు ప్రతివాదనలూ లేకపోలేదు. భారత దేశం విశాలమైనదనీ, అన్ని రాష్ట్రాల్లోనూ ఏకరీతి విద్యాబోధన అవసరమనీ అనేవాళ్లూ ఉన్నారు. ప్రభుత్వం వనరుల కొరతను ఎదుర్కొంటోందని ఇంకొందరు అంటారు. విద్యార్థుల జీవితాల్లో మార్పులు తీసుకురావడం దశాబ్దాల దీర్ఘకాలిక ప్రక్రియ అని అంటారు. ఈ ప్రతివాదనలను విస్మరించాల్సిన అవసరమేమీ లేదు. కానీ విద్య ప్రాథమికమైన బాధ్యత సామాజిక వృద్ధి మాత్రమే కాదనీ, సమానతను సృష్టించేం దుకూ ఉపయోగపడాలనీ వీరు గుర్తించాలి. విద్య ద్వారా లింగవివక్షను తగ్గించడం వంటి అనేక లాభాలూ ఉన్నాయని తెలుసుకోవాలి. పాఠశాల విద్యను అభివృద్ధి చేస్తూనే... దీనికి సమాంతరంగా వృత్తి విద్య, పారిశ్రామిక శిక్షణ కేంద్రాలను కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే... ఈ రెండు రకాల సంస్థలు ఉద్యోగాలు సంపాదించుకునేందుకు అవసరమైన నైపుణ్యాలను అందిస్తాయి. అదే సమయంలో తక్కువ విద్యార్హతలతోనే అర్థవంతమైన ఉద్యోగం సంపాదించుకోవచ్చు. ఆయా రంగాల్లో నిష్ణాతులు ఈ దేశానికి గతంలోనూ ఉన్నారు... భవిష్యత్తులోనూ పుట్టుకొస్తారు. ఇది సహజసిద్ధంగా జరిగే ప్రక్రియగానే చూడాలి. అందరికీ సమాన అవకాశాలు కల్పించాలంటే విద్యా వ్యవస్థలో కొత్త కొత్త అవకాశాలను సృష్టించడం... అవి అందరికీ నిత్యం అందుబాటులో ఉండేలా చూడటం అత్యవసరం. ఈ క్రమంలోనే విద్యనభ్య సించేందుకు డబ్బు ఒక ప్రతిబంధకం కాకుండా జాగ్రత్త పడాలి. సుమారు ఇరవై ఏళ్ల క్రితం నాటి మాట. ఆరోగ్యకరమైన సమాజానికి ఆడపిల్లలు విద్యావంతులై ఉండటం ఎంతో అవసరమని ప్రపంచబ్యాంకు నివేదిక ఒకటి విస్పష్టంగా పేర్కొంది. తక్కువమంది పిల్లల్ని కనడం, సురక్షిత కాన్పులు, పిల్లల ఆరోగ్య పరిస్థితుల్లో మెరుగుదల, సమాజంలో స్థాయి పెరగడం వంటి సానుకూల అంశాలకూ ఆడపిల్లలు, మహిళల చదువుకు దగ్గర సంబంధం ఉందని అలవోకగా అనేస్తారు కానీ... ఆరోగ్యం విషయానికి వస్తే అది కాన్పులు, పిల్లల సంరక్షణ పరిధిని దాటి బహుముఖంగా విస్తరించాల్సి ఉంది. రెండు మూడు దశాబ్దాల క్రితంతో పోలిస్తే చాలా వ్యాధులను మనం సమర్థంగా నియంత్రించగలుగుతున్నాం. కాబట్టి ప్రజల ఆరోగ్య సంరక్షణ, ప్రాణాంతక వ్యాధుల నివారణ, రోగులకు మెరుగైన చికిత్స వంటివాటికి ఇప్పుడు ప్రాధాన్యం ఇవ్వాలి. ఐక్యరాజ్య సమితి 2030 నాటికి సాధించాలని ప్రపంచదేశాలకు నిర్దేశించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు పూర్తిస్థాయిలో నెరవేరడం 2047 నాటికి కానీ సాధ్యమయ్యే అవకాశాలు కనిపించడం లేదు. పైగా ఆరోగ్య రంగాన్ని విస్మరిస్తే వ్యాధులు, ఆరోగ్య సమస్యలపై పెట్టాల్సిన ఖర్చులు అలవికానంతగా పెరుగుతాయి. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో మూడోది నేరుగా ఆరోగ్యానికి సంబంధించినదే. అలాగే తొలి రెండు లక్ష్యాలైన అందరికీ ఆహారం, పేదరిక నిర్మూలనకూ ఆరోగ్యంతో సంబంధం ఉన్నది. ఇంకోలా చెప్పాలంటే ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలను తీర్చకుండా ఈ రెండు లక్ష్యాలను సాధించడం కష్టం. 2047 నాటికి అందరికీ మెరుగైన ఆరోగ్య సేవలు అందించే దేశంగా భారత్ ఎదగాలంటే ముందుగా మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఎంత సమర్థంగా పనిచేయించగలమో చూసుకోవాలి. ఆరోగ్యంపై పెట్టే ఖర్చులు తగ్గించడం, వ్యాధుల నివారణలపై శ్రద్ధ పెట్టడం జరగాలి. చాలా వ్యాధుల చికిత్సకు ఆసుపత్రుల అవసర ముండదు. ఆరోగ్య కార్యకర్తలను రోగులకు అందుబాటులో ఉంచి, భౌతిక, డిజిటల్ సౌకర్యాలు తగినన్ని ఏర్పాటు చేస్తే సరిపోతుంది. అలాగే అత్యవసర పరిస్థితులకు వేగంగా స్పందించగల, అందరికీ అందుబాటులో ఉండేలా రెఫరెల్ ఆసుపత్రుల వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. చికిత్స ఆలస్యం అవడం వల్ల రోగులకు అనవసరమైన ఇబ్బందులు ఎదురు కారాదు. ఇది సాధ్యం కావాలంటే తగిన వనరులు, సిబ్బంది మాత్రమే కాదు... ఇవన్నీ అవసరమైన చోట ఉండేలా చూడాలి. తగిన పద్ధతులను అమల్లోకి తేవడమూ అవ సరమే. ఇంకోలా చెప్పాలంటే వ్యక్తులు, వారి అవసరాలే కేంద్రంగా ఆరోగ్య వ్యవస్థ నిర్మాణం జరగాలి. భారీ మొత్తాలు చెల్లించాల్సిన అవసరం లేకుండానే ఈ వ్యవస్థ రోగుల అవసరాలను తీర్చగలగాలి. అయితే ఇలాంటి వ్యవస్థ ఏర్పాటు చేయాలంటే.. ప్రైవేట్ రంగాన్ని నియంత్రించక తప్పదు. సుశిక్షితులైన, చిత్తశుద్ధితో పనిచేసే సిబ్బందితో కేవలం చౌక మందులు, టీకాలతోనే మన వ్యవస్థను రోగి ప్రధానంగా పనిచేయించవచ్చు. ప్రాథమిక ఆరోగ్య పరిరక్షణలో అక్కడక్కడ అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్న వారు ఉన్నారు. క్లిని కల్ సర్వీసుల విషయంలోనూ ఇదే జరుగుతోంది. వీటిని సుస్థిర అమలు దిశగా మళ్లించాలి. 2047 అంటే ఇంకో పాతికేళ్లు కావచ్చు కానీ... స్వతంత్ర భారత చరిత్రలో ఇంకో శతాబ్దానికి బలమైన పునాది వేసేందుకు ఈ 25 ఏళ్లలో విద్య, ఆరోగ్యంపై మనం పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. ఈ పెట్టుబడులు కూడా సమాజంలోని ఉన్నత వర్గాల కోసం కాదు. అందరికీ. అయితే ఈ పెట్టుబడుల రాబడులు మాత్రం కొన్ని తరాలవారు అందుకుంటారు. గగన్‌దీప్ కాంగ్, వ్యాసకర్త సీనియర్ వైరాలజిస్ట్ (‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ సౌజన్యంతో) -
సమానతా భారత్ సాకారమయ్యేనా?
స్వాతంత్య్రం ప్రతి ఒక్కరికీ అవకాశాలిస్తుంది. ఉదాహరణకు, ఒక మతానికి కట్టుబడి ఉండటం, నచ్చిన విధంగా జీవించడం, దేశ సంపద సృష్టిలో పాలుపంచుకోవడం వంటివి. అయితే ప్రస్తుతం మతపరమైన వివక్ష, జనాభాలో 10 శాతం మంది చేతుల్లోనే సంపద కేంద్రీకృతం కావడం వంటివి కనిపిస్తున్నాయి. దీనికి కారణం అందరికీ సమాన అవకాశాలు, సామాజిక న్యాయం అనే చోదక శక్తుల లేమి. దేశాభివృద్ధి ప్రయాణంలో లోటుపాట్లను ఎత్తి చూపే భావవ్యక్తీకరణ స్వాతంత్య్రం ఉన్నప్పుడే అన్ని రంగాల్లో నిజమైన అభివృద్ధి సాధ్యం. కానీ విమర్శకులు ఈరోజు జైలుపాలవుతున్నారు. నూరు సంవత్సరాల భారత్... అంటే అది నాకు సంబంధించినంత వరకు శక్తిమంత మైన ఆలోచన. బంగాళాఖాతాన్ని నేను చూస్తున్నప్పుడు, సముద్రం దాని ధ్రువాన్ని లేదా అంచును తాకడానికి సాగుతున్నట్లు కనిపిస్తుంది. ఈ తీరం నుంచే నా కోరికల జాబితా ఆకాశాన్ని తాకుతుంటుంది. సహజంగానే ఇక్కడ అనేక ప్రశ్నలున్నాయి. వృద్ధి అనేది ఎంత సమ్మిశ్రితంగా ఉంటుంది? మన సమాజంలో మార్పు సామాజిక న్యాయ పంథాలో సాగుతోందా? సమానత్వం అనేది సమాజ చలనసూత్రానికి కేంద్ర బిందువుగా ఎలా ఉండబోతోంది? ఈ ప్రశ్నలను ఆధారంగా చేసుకుని, మన సమాజ వృద్ధి, పురోగమన చలనం అనే ఒక సంక్లిష్ట వ్యవహారంగా మారు తున్నాయి. జాతీయ పురోగతికి నారీ శక్తిని అనుసంధానించడం ద్వారా మూలాలు అత్యున్నత శిఖరాలను చేరుకున్నట్లుంది. ప్రధాని ఈ ఆకాంక్షను చక్కగా పసిగట్టారు కదా! స్వాతంత్య్రం సిద్ధించి నూరేళ్లు పూర్తయ్యే సమయానికి అనేక ప్రభావిత రంగాల్లో భారత్ అత్యంత చోదక శక్తుల్లో ఒకటిగా ఉంటుందనడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. కొన్ని అంతర్జాతీయ సంభాషణల్లో భారత్ ఒక తప్పనిసరిగా వినాల్సిన స్వరంగా ఉంటోంది. కానీ 2047 నాటికి ఇదే స్వరం మరి కొన్ని వందల డెసిబెల్స్ స్థాయిలో మార్మోగుతుందని నేను భావిస్తున్నాను. వాతావరణ మార్పు, పెరుగుతున్న అసమానతా స్థాయులు, భౌగోళిక రాజకీయ మండలాల్లో ఎగుడుదిగుడులు వంటి అంతర్జాతీయ సవాళ్లను చూసినట్లయితే... భారత యూనియన్ లోపల ఇప్పుడు అవసరమైన స్నేహభావాన్ని సులభమైన పదాల్లో వివరించలేం. ఈ ప్రయాణం కోసం ఇండియా ప్రాజెక్టు మూల్యం చెల్లించవలసి ఉంటుంది. అది ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. 140 కోట్ల జనాభా ఉన్న ఈ దేశ సంపద సృష్టిలో 33 శాతం వాటా కలిగిన... ఒక్క శాతం మంది దీని సంగతి చూసుకుంటారని కొందరనవచ్చు గాక. కానీ అనేక ఏళ్లుగా ప్రజా జీవితంలో గడిపిన నేను ఇది చాలదని అనుకుంటున్నాను. ప్రతి వ్యక్తీ భారత్ చెల్లించవలసిన మూల్యంలో భాగస్వామి అయినప్పుడే ఈ చెల్లింపు సాధ్యమవుతుంది. ఏ దేశమైనా సరే, అభివృద్ధి సాధించాలంటే అందరికీ సమాన అవకాశాలు, సామాజిక న్యాయం అనే రెండు ప్రధాన పాత్ర పోషి స్తాయి. మందబలం ఉన్న వారి భుజబల ప్రదర్శనకు వ్యతిరేకంగా వైఖరి తీసుకోవడంలో సమాజ ఇంగిత జ్ఞానానికి సంబంధించినంత వరకు చరిత్రలో ఈ క్షణం ఒక శంఖారావం లాంటిది. నిరంకుశ చట్టాలతో స్వారీ చేయడం, సమాజం ముక్కలుగా చీల్చివేయడాన్ని తారస్థాయికి తీసుకెళుతున్నారు. జనాభాలో 10 శాతం మంది దేశ సంపదలో 64.6 శాతం సంపదను సృష్టిస్తున్నారు. అదే దిగువ భాగంలో ఉంటున్న 50 శాతం మంది ప్రజలు కేవలం 5.9 శాతం సంపదను మాత్రమే సృష్టిస్తున్నారు. ఆర్థిక వృద్ధి ఇంకా సమ్మిశ్రితం కాలేదు. అంటే అన్ని వర్గాల ప్రజల భాగస్వామ్యం దీంట్లో ఇంకా సాకారం కాలేదు. ఫలితంగా అసమానతలను ఇది ఇంకా విస్తృతం చేస్తుందన్నమాట. కాబట్టే ఇండియా ప్రాజెక్టును ఇంకా విభిన్న స్థాయికి తీసుకెళ్లడంలో ఇది మార్గదర్శకంగా పనిచేస్తుంది. దేశం శాఖో పశాఖలుగా చీలిపోతే చరిత్రలో అంధకార యుగాలతోనే పోల్చి చూడగలం. ఆర్ఎస్ఎస్ స్వాతంత్య్రానికి పెద్దగా దోహదం చేయ లేదని డి. రాజా చెప్పారు. కానీ ఇప్పుడు అదే ఆరెస్సెస్ స్వాతంత్య్ర సమర వారసత్వాన్నే ప్రమాదంలో పడవేస్తోంది కదా? సామాజిక న్యాయం గురించి ఇంకా విస్తృత స్థాయిలో సంభాషిం చడానికి ఇది తిరిగి మేల్కొల్పవలసిన సమయం. ఇంత పెద్ద రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యంలో దార్శనిక పత్రంలో సామాజిక న్యాయానికి ఎలాంటి ప్రత్యామ్నాయమూ లేదు. రాజ్యాంగ ప్రవేశిక తొలి భాగమే ఏం చెబుతోందంటే ‘‘...పౌరులందరికీ న్యాయం, సామాజిక, ఆర్థిక, రాజకీయ హక్కులను పదిలపర్చడం...’’ సామా జిక న్యాయం సమానత్వానికి హామీ ఇస్తుంది. తదుపరి 25 సంవత్స రాలు ఆ తర్వాత ఒక్కొక్క రోజు గడిచే కొద్దీ సమాజంలో సానుకూల మార్పుకు ఉత్ప్రేరకం ఏమిటంటే, సమగ్రవృద్ధికి హామీ పడటమేనని ఇది భారత పౌరులకు తెలుపుతుంది. సామాజిక న్యాయంలో మూలాలు కలిగిన అభివృద్ధికి విజయవంతంగా పునాది వేయడం వల్లనే తమిళనాడులో కొన్ని దశాబ్దాలుగా సాధించిన వృద్ధి సాధ్యమైంది. పెరియార్‌తో సహా, కామరాజర్, సీఎన్ అన్నాదురై, కలైజ్ఞర్ ఎం. కరుణానిధి వంటి నేతలు ప్రజా స్వామ్య సమ్మిశ్రిత స్వభావానికి ప్రతినిధులుగా ఉంటూ వచ్చారు. ఉదాహరణకు, తమిళనాడులో ప్రభుత్వ వైద్య కళాశాలలను స్థాపించ డానికి కరుణానిధి తీసుకున్న చొరవ ఆనాటికి వెనుకబడివున్న ప్రతి ఒక్కరికీ అవకాశాలను కల్పించింది. తక్కువ ఫీజులతో వైద్య విద్య చదవాలనుకున్న ప్రతి ఒక్క పిల్లాడికీ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈరోజు ‘నీట్’ ఆ వ్యవస్థను విధ్వంసం చేయడానికి ప్రవేశించింది. మన చరిత్ర శకలం పితృస్వామిక రంగుతో రూపొందింది. దీనివల్లే మార్పులు చోటు చేసుకోవడం కష్టమవుతోంది. ఈ దేశంలో 18 శాతం మంది మహిళలు మాత్రమే నేటికీ వేతన రూపంలోని ఆదాయాలను ఆర్జిస్తున్నారు. ఉద్యోగాల లేమి, నైపుణ్య స్థాయుల విషయంలో... వ్యవస్థ దురభిమానాలు, వేతనం చెల్లించని కుటుంబ విధుల వంటివి మహిళలకు ప్రాధాన్యం లేకుండా చేస్తున్నాయి. 2047 నాటికి మార్పు వస్తుందని నేను భావిస్తున్నాను. 33 శాతం రిజర్వేషన్ అనేది వాస్తవమవుతుందని భావిస్తున్నా. అప్పుడు 50 శాతం వాటా కోసం బలంగా కృషి చేయాలి. ప్రాథమిక స్థాయిలో శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం వల్ల ఉత్పత్తిలో గణనీయంగా పెరుగుదల నమోదు అవుతోంది. కానీ మీరు లోతుకు వెళ్లే కొద్దీ మరింత ఉత్తమంగా ఉంటుందని మీరు అర్థం చేసుకుంటారు. ఈ ప్రభావం ఆర్థికవ్యవస్థపై గణనీయంగా ఉంటుందని ఆర్థికవేత్తలంటుంటారు. దీని ప్రతిఫలనం ప్రతి ఒక్కరికీ ప్రయోజనం కలిగిస్తుంది. స్వాతంత్య్రం దాని స్వభావ రీత్యానే ప్రతి ఒక్కరికీ అవకాశాలు ఇస్తుంది. ఉదాహరణకు, ఒక మతానికి కట్టుబడి ఉండే అవకాశం. తమకు నచ్చిన మతాన్ని ఆచరించేందుకు వ్యక్తులు ఎంపిక చేసుకో వచ్చు. వ్యక్తి స్థాయిలో స్వాతంత్య్రానికి చెందిన నిజమైన అర్థం ఏమి టంటే, అస్తిత్వాలకు అతీతంగా ప్రత్యేకించి మైనారిటీ అస్తిత్వాలకు అతీతంగా హక్కులు, సౌకర్యాలను పంపిణీ చేయడం. 2047 నాటికి, ఎల్జీబీటీక్యూ+ కమ్యూనిటీ... అంటే సమాజంలోని అత్యంత వెనుకబడిన వర్గాలలో ఒకటి ఎలాంటి తిరోగమన నిబంధనల ద్వారా సవాలు చేయబడకుండానే సామాజిక, రాజకీయ పరిధిలో జీవితాన్ని సాగిస్తుంది. వ్యవస్థలో సహానుభూతి లేకపోవడం వల్ల, మైనారిటీ లను వారికి అర్హమైన గౌరవంతో వ్యవస్థ వ్యవహరించదు. సమా నత్వం, సామాజిక న్యాయం ఉన్న చోటే వారి స్వరాలు వినిపిస్తాయి, వారి సమస్యలు ప్రతిధ్వనిస్తాయి. మన పంథాలో దిద్దుబాటు అవసరం. అప్పుడే మన భవిష్యత్ తరాలు స్వేచ్ఛాయుతమైన, సంపద్వంతమైన సమాజాన్ని చూడగలు గుతాయి. మన రిపబ్లిక్ పౌరులందరినీ కాపాడేలా, శాస్త్రీయ ధృతితో ఈ ప్రయాణంలో తనిఖీకేంద్రాలను అప్రోచ్ అయ్యేలా మనం జాగ్రత్త వహించాలి. చరిత్రను విజేతలే రాస్తారనే ప్రసిద్ధ సూక్తిని నేను గుర్తు చేసుకుంటాను. ఆశావహుల ద్వారా భవిష్యత్తు లిఖితమవుతుందని నా భావన. ఆశావహులకు భావవ్యక్తీకరణ స్వాతంత్య్రం ఉన్నప్పుడే వారు ఆ పని చేస్తారు. భావవ్యక్తీకరణ స్వాతంత్య్రం లేకుండా పోయిన అనేకమంది ఆశావహులు ఈరోజు జైల్లో ఉంటున్నారు. నిరంకుశ రాజ్యవ్యవస్థలో ఈ నిరాకరణకు మూలాలు ఉన్నాయి. కానీ సాహస పదాలను రాయడాన్ని, గట్టిగా మాట్లాడటాన్ని, 2047 వరకు మాట్లాడుతుండటాన్ని మనం కొనసాగిస్తుంటాం. దీనికోసం తమిళ కవి సుబ్రహ్మణ్య భారతీయార్ మాటలను మనసులో ఉంచుకోవాలి. దారిద్య్రంలో లేదా బానిసత్వంలో ఏ ఒక్కరూ ఉండకూడదు. కులం పేరుతో దేశంలో ఎవరూ అణిచివేతకు గురికాకూడదు. విద్యా సంపదను ప్రశంసించుదాం. సంతోషంలో మునిగి తేలుదాం. మనం అందరం ఒకటే అనే విధంగా సమానత్వంలో జీవిద్దాం. కనిమొళి కరుణానిధి, డీఎంకే పార్లమెంట్ సభ్యురాలు -
లింగ సమానత్వం: స్కూల్లో ఏం చెబుతున్నారు?!
‘ఆడ–మగ సమానత్వం ఎప్పుడు సాధ్యమౌతుంది?!’ ‘ఇప్పట్లో అయితే కాదు..’ అనేది ప్రపంచంలోని అన్ని సమాజాల్లో బలంగా పాతుకుపోయిన ఒక ఆలోచన. కానీ, సాధనతో అన్నీ సమకూరుతాయనేది మనందరికీ తెలిసిందే. ఆ నమ్మకంతోనే ఐక్యరాజ్యసమితి 2030 సంవత్సరానికి గడువును నిర్ణయించింది. లింగ సమానత్వం అనేది ప్రాథమిక మానవ హక్కు మాత్రమే కాదు. శాంతియుత, సంపన్నమైన, స్థిరమైన ప్రపంచానికి అవసరమైన పునాది. లింగ సమానత్వంలో పిల్లల వైఖరిని రూపొందించడంలో తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయులు ముఖ్య పాత్ర పోషిస్తారు. జెండర్ రోల్స్ పట్ల పిల్లల ప్రవర్తనలో మార్పులు తీసుకురావడానికి టీచర్ల శిక్షణ కచ్చితంగా సహాయపడుతుంది. అయితే, ‘అమ్మాయిలా ఏడుస్తున్నావేంటి?’ అని అబ్బాయిలను.. ‘ఏంటా వేషాలు, నువ్వేమైనా అబ్బాయివా?’ అంటూ అమ్మాయిలను.. జెండర్ రోల్‌ని ప్రధానంగా చూపుతూ ఉపయోగించే భాష వల్ల పిల్లల మైండ్సెట్లలో ‘వివక్ష’ ముద్రించుకుపోతున్నది కూడా వాస్తవం. మహిళల హక్కులను ప్రోత్సహించే సామాజిక మార్పును తీసుకురావడానికి విద్య అత్యంత శక్తిమంతమైన సాధనాల్లో ఒకటి. టీచర్లు విద్యావ్యవస్థకు మూల స్తంభం కాబట్టి, పాఠశాల స్థాయి నుంచే మార్పుకు ప్రయత్నించాల్సి ఉంటుంది. అయితే, తరగతి గదుల్లో పాత మూస పద్ధతిలో భాషను ఉపయోగించకుండా, ప్రణాళికాబద్ధమైన శిక్షణ ద్వారా టీచర్లు లింగ అసమానతలను తొలగించడానికి కృషి చేయవచ్చు. తమకు తెలియకుండానే.. కొన్ని లింగ అవగాహన చర్చల ఆధారంగా లింగ వివక్షకు దూరంగా అందరూ ఆలోచించాలని ఆశించడం వల్ల ఎలాంటి సానుకూల ఫలితాలుండవు. పిల్లల బాల్యం నుంచే ఈ విషయాన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉంది. లింగ మూస పద్ధతులను నివారించడంలో టీచర్లు కీలకపాత్ర పోషిస్తారన్నది తెలిసిందే. నిజానికి టీచర్లు విద్యార్థుల పట్ల మంచి ఉద్దేశాలను కలిగి ఉన్నప్పటికీ, వారి సాధారణ బోధనలో తరచూ తమకు తెలియకుండానే జెండర్ లైన్స్‌ను ఉపయోగిస్తుంటారు. మారుతున్న సమాజ ధోరణులు, భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకొని టీచర్లు ‘లింగ’ భాషను మార్చుకోవడం కూడా తప్పనిసరి అని అంగీకరిస్తున్నారు ఉపాధ్యాయులు. ఆ దిశగా తామూ ముందడుగు వేస్తున్నామంటున్నారు. శిక్షణ అవసరం లింగ వివక్షలో టీచర్లు ప్రాథమికాంశాలను లోతుగా తెలుసుకుంటే పిల్లల మెదళ్లలో లింగసమానత్వాన్ని పెంపొందించడానికి శ్రద్ధ వహిస్తారు. తరగతి గదిలో ‘జెండర్’ భాషను వాడకుండా మానవసంబంధాలలోనూ, సామాజిక పరమైన పరివర్తన తీసుకురావడానికి, లింగ వివక్ష తగ్గించడానికి టీచర్లకు నైపుణ్యం అవసరం. లింగ సమానత్వానికి అన్ని స్థాయిలలో, అన్ని దశలలోనూ శిక్షణ అవసరం. మూస పద్ధతులకు స్వస్తి తరగతి గదిలో అబ్బాయిలు, అమ్మాయిలకు ఒకే విధమైన బోధన అందించేటప్పుడు ‘జెండర్’ గురించి ప్రస్తావన వస్తే మధ్యలో తటస్థ పదాలను ఉపయోగించడం ముఖ్యం. అంటే, కథనాలలో పాత్రలను ఉదాహరణగా తీసుకుంటున్నప్పుడు గత కాలపు మూస లక్షణాలను ఉపయోగించకూడదు. ఉదాహరణకు: ‘అబ్బాయిలు ధైర్యంగా’, ‘బలంగా ఉన్నారు. ‘అమ్మాయిల్లా ఏడ్వకండి’, ‘అమ్మాయిలు సున్నితమైనవారు,’... ఇలాంటివి. వాటిని వీలైనంతవరకు తొలగించడమే మంచిది. పాఠంలోనూ, సాధనలోనూ అబ్బాయిలు–అమ్మాయిలు సమాన భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేలా చదువు ఉండాలి. వీటిని తరగతి గదుల్లోనే కాదు ఇతర నైపుణ్యాలను పెంచే కార్యక్రమాల్లోనూ భాగం చేయచ్చు. అలాగే, కుటుంబ సభ్యుల మాటల్లోనూ, రోజువారీ పనుల్లోనూ ఈ లింగ నిబంధనలు పిల్లల మనస్సుల్లో బలంగా నాటుకుపోతాయి. అందుకని, పాఠశాలలు, కుటుంబాలు పిల్లలను లింగ సమానత్వంవైపు మళ్లించేందుకు కృషి చేయాలి. సమాజంలో లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడానికి కావల్సిన మార్పును తీసుకు రావాలంటే అన్ని స్థాయిలలో అందరూ కృషి చేయడమే దీనికి సరైన పరిష్కారం. అవగాహన వర్క్‌షాప్స్ చాలావరకు ఇంటి దగ్గరే వివక్ష ఉంటుంది. చదువు అంటే తరగతి గదిలోనే కాదు ఎన్సిసి వంటి వాటిల్లోనూ అమ్మాయిలను పంపించేందుకు తల్లిదండ్రులు ముందుకురావాలి. పిల్లలను వయసుకు తగినట్టు గైడ్ చేయాలని మా టీచర్స్‌కి చెబుతుంటాం. కానీ, జెండర్ ని దృష్టిలో పెట్టుకొని కాదు. స్కూల్ పరిధులు దాటి కూడా పిల్లల నైపుణ్యాలు ఉండాలి. వివిధ రకాల వర్క్‌షాప్స్‌కి అటెండ్ అవ్వాలి. అందుకే.. ఆటలు, ఇంటర్‌స్కూల్ కాంపిటిషన్స్, ఇతర విద్యార్థులతో కలిసేలా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంటాం. పిల్లలను వేదికల మీద మాట్లాడనివ్వాలి. గెస్ట్ లెక్చరర్స్‌తో క్లాసులు ఇప్పించాలి. ఇవన్నీ కూడా అమ్మాయిలు–అబ్బాయిలు ఇద్దరూ సమానంగా పాల్గొనేవే. ఇలాంటప్పుడు వారిలోని ప్రతిభనే చూస్తారు తప్ప, వివక్ష అనేదానికి చోటుండదు. దీని వల్ల సమానత్వం అనేది దానికదే వస్తుంది. – సంగీతవర్మ, ప్రిన్సిపల్, రిచ్మండ్ హైస్కూల్, హైదరాబాద్ ఇద్దరూ విద్యార్థులే! ఈ మధ్య కాలంలో స్కూల్లో ఏ కార్యక్రమాల్లో అయినా అమ్మాయిలే ముందంజలో ఉంటున్నారు. తరగతిగది వరకే కాకుండా ఇతర ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేస్తుంటాం. కాకపోతే, గ్రామీణ స్థాయిలో అమ్మాయిలనే ఎక్కువ ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. సమానత్వం ఇంటి నుంచే మొదలవ్వాలి. తరగతిలో టీచర్‌కి అమ్మాయిలు, అబ్బాయిలు ఇద్దరూ విద్యార్థులే. – శైలజా కులకర్ణి, టీచర్, జడ్పిహెచ్ఎస్, కల్హర్, సంగారెడ్డి సున్నితత్త్వాన్ని ఇద్దరికీ నేర్పాలి.. ‘నువ్వేమైనా అబ్బాయివా?’ అని అమ్మాయిలను. ‘నువ్వేమైనా అమ్మాయివా?’ అని అబ్బాయిలను మాటలు అనకూడదు. నాకంటే వాళ్లు ఎక్కువ, వీళ్లు తక్కువ అనే ఆలోచన కూడా రాకూడదు. సున్నితత్త్వాన్ని ఇద్దరికీ నేర్పించాలి. ఇద్దరికీ ఎదుటివారికి గౌరవం ఇవ్వడం నేర్పాలి. ఇద్దరికీ ధైర్యం నేర్పాలి. ఇద్దరికీ చదువు నేర్పాలి. ప్రపంచంలో అందరికీ సమానహక్కులు ఉన్నాయి. అన్నింటా సమానత్వం ఉండాలి. ఎదిగే క్రమంలో పడే ‘మాటలు’ వారి మనసులో బలంగా ముద్రవేస్తాయి. మాటల ద్వారా కూడా ఇద్దరినీ వేరుగా చూడకూడదు. వీరే కాదు ఇప్పుడు ట్రాన్స్జెండర్లు కూడా తమ సత్తా చాటుతున్నారు. ఎవరినీ చులకన చేయకూడదు. మనం మాట్లాడే మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉమెన్ సేఫ్టీ, గర్ల్ సేఫ్టీ అని ఉంటాయి. ఎందుకో కూడా వాటిని వివరించగలగాలి. పీరియడ్స్ సమయంలో సెన్సిటైజ్ విషయంలో ప్రవర్తనలు వేరుగా ఉంటాయి. అబ్బాయిలకు కూడా ఇలాంటి విషయంలో అవగాహన కలిగించాలి. ఎదిగేక్రమంలో శరీరాకృతులు వేరుగా ఉంటాయి కానీ, మేధోపరంగా ఇద్దరూ ఒకటే. అవగాహన కల్పించడమే ముఖ్యం. – మేఘన ముసునూరి, ప్రిన్సిపల్, ఫౌంటెన్హెడ్ గ్లోబల్ స్కూల్ హైదరాబాద్ ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో మహిళలు, బాలికలపై అన్ని రకాల వివక్ష, హింస, హానికరమైన పద్ధతులను అంతం చేయడం ద్వారా 2030 వరకు లింగసమానత్వాన్ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది ఎస్డిజి 5. మహిళల పూర్తి భాగస్వామ్యం, రాజకీయ, ఆర్థిక నిర్ణయాధికారం అన్నిస్థాయిలలో నాయకత్వానికి సమాన అవకాశాల కోసం పిలుపునిచ్చింది. 2015లో ఐక్యరాజ్యసమితి చేసిన 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో ఇది 5వది. – నిర్మలారెడ్డి -
భారత్‌లో లింగ సమానత్వానికి ఎన్నేళ్లు పడుతుందో తెలుసా?
జెనీవా: భారత్ శాస్త్ర సాంకేతిక రంగాల్లో దూసుకెళ్తున్నా లింగ సమానత్వంలో మాత్రం వెకబడిపోయింది. జెనీవాలోని ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యూఈఎఫ్) 'వార్షిక లింగ అంతర నివేదిక 2022' ప్రకారం భారత్ 135వ స్థానంలో నిలిచింది. గతేడాదితో పోలిస్తే ఒక స్థానం మెరుగైనా.. ఇంకా అట్టడుగునే కొనసాగుతోంది. ఐలాండ్స్ మరోమారు లింగ సమానత్వంలో తన తొలిస్థానాన్ని నిలబెట్టుకుంది. ఆ తర్వాతి స్థానాల్లో ఫిన్లాండ్, నార్వే, న్యూజీలాండ్, స్వీడన్లు ఉన్నాయి. మరో 132 ఏళ్లు.. మొత్తం 146 దేశాలకు ర్యాంకులు కేటాయించగా.. భారత్ అట్టడుగున 135వ స్థానంలో నిలవటంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారత్ కన్నా అఫ్గానిస్థాన్, పాకిస్థాన్, ఇరాన్, ఛాడ్ వంటి 11 దేశాలు మాత్రమే వెనబడి ఉన్నాయి. జీవన వ్యయం పెరిగిపోతుంటటం వల్ల ప్రపంచవ్యాప్తంగా స్త్రీ, పురుషుల మధ్య అంతరం పెరిగిపోతోందని డబ్ల్యూఈఎఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. దాని ప్రకారం భారత్‌లో స్త్రీపురుషులు సమానంగా మారేందుకు మరో 132 ఏళ్లు(2021లోని 136వ ర్యాంకు ప్రకారం) పడుతుందని అంచనా వేసింది. కరోనా మహమ్మారి సైతం లింగ అంతరంలో ఓ తరం వెనక్కు వెళ్లేలా చేసిందని తెలిపింది. గడిచిన 16 ఏళ్లలో భారత ర్యాంకు 7 స్థానాలు ఎగబాకినా.. ఇంకా అట్టుడుగునే ఉందని ఆందోళన వ్యక్తం చేసింది డబ్ల్యూఈఎఫ్.' భారత్‌లోని సుమారు 662 మిలయన్ల మంది మహిళ జనాభాతో ప్రాంతీయ ర్యాంకులపై ప్రభావం పడుతోంది. 2021తో పోలిస్తే.. ఆర్థిక కార్యక్రమాల్లో భాగస్వామ్యం, అవకాశాల్లో మెరుగైనప్పటికీ.. కార్మిక శక్తిలో మరింత కిందకు పడిపోయింది. శాసనకర్తలు, ఉన్నతాధికారులు, మేనేజర్స్ విభాగాల్లో మహిళలు 14.6 శాతం నుంచి 17.6 శాతానికి చేరుకున్నారు. సాంకేతిక, వృత్తి నిపుణుల్లో మహిళలు 29.2 నుంచి 32.9 శాతానికి చేరారు. వారి ఆదాయం పెరిగింది. అయితే.. మగవారితో పోలిస్తే వారికి అందే గౌరవంలో మాత్రం అంకా వెనకబడే ఉన్నారు. కొన్ని సందర్భాల్లో మగవారి కోసం వారిని తిరస్కరిస్తున్నారు.' అని పేర్కొంది నివేదిక. ఆ విభాగంలో ఊరట.. మహిళల రాజకీయ సాధికారతలో భారత్ 48వ స్థానంలో నిలిచింది. గత యాభై ఏళ్లుగా మహిళలకు రాజకీయాల్లో దక్కుతున్న స్థానం చాలా తక్కువ. దాంతో ఈ ర్యాంకు మరింత పడిపోయినట్లు డబ్ల్యూఈఎఫ్ తెలిపింది. మరోవైపు.. ఆరోగ్యం, జీవన విధానంలో భారత్ 146వ స్థానానికి పరిమితమైంది. లింగ అంతరం 5 శాతానికిపైగా ఉన్న ఐదు దేశాల్లో ఒకటిగా నిలిచింది. అయితే.. భారత్‌కు ఊరట కలిగించే విషయం ఏంటంటే ప్రాథమిక పాఠశాలల నమోదులో లింగ సమానత్వంలో టాప్‌లో నిలిచింది. ఇదీ చూడండి: ప్లాస్టిక్‌ను తినేసే 'రోబో ఫిష్'.. సముద్రాల స్వచ్ఛతలో కీలక అడుగు! -
సర్వమానవ సమానత్వానికే..
సాక్షి, హైదరాబాద్: రామానుజాచార్య సర్వ మానవ సమానత్వం కోసం కృషి చేశారని, జాతి, కుల, మత, లింగ వివక్షలు కూడదని బోధించారని అందుకే దీనిని సమతా పండుగ (ఫెస్టివల్ ఆఫ్ ఈక్వాలిటీ)గా పిలుస్తున్నామని త్రిదండి చినజీయర్ స్వామి తెలిపారు. విశ్వమంతా ఒకే కుటుంబం అనే భావనను, వసుదైవ కుటుంబం స్ఫూర్తిని అందించేందుకే ఈ పండుగ నిర్వహిస్తున్నామని చెప్పారు. శంషాబాద్‌లోని ముంచింతల్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సమతా స్ఫూర్తి కేంద్రంలో రామానుజాచార్యుల వెయ్యేళ్ల జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని సహస్రాబ్ది సమారోహం సంరంభం బుధవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ మహోత్సవాలకు చినజీయర్ స్వామి సారథ్యం వహించారు. తాము తలపెట్టిన మహా యజ్ఞం నుంచి వెలువడే పొగ, పరిమళాల వల్ల మానవాళి ఆరోగ్యానికి, పర్యావరణానికి మేలు కలుగుతుందన్నారు. ఈ మహా క్రతువులో వేలాది మంది పాల్గొంటుండడం ఆనందంగా ఉందన్నారు. ఆధ్యాత్మిక పారవశ్యంలో భక్తులు తొలుత రామానుజాచార్యుల శోభాయాత్రను కనుల పండుగగా నిర్వహించారు. సాయంత్రం ప్రపంచంలోనే మున్నెన్నడూ జరగనంత భారీ స్థాయిలో లక్ష్మీనారాయణ మహా యజ్ఞానికి అంకురార్పణ చేశారు. కనీవినీ ఎరుగని రీతిలో 5 వేల మంది రుత్వికులు, 1,035 హోమ కుండాలు, 144 హోమశాలలు, 2 ఇష్టి శాలలు ఈ మహా క్రతువులో భాగం అయ్యాయి. యాగానికి సిద్ధం చేయడంలో భాగంగా భూమి శుద్ధి చేసి విష్వక్సేనుడి పూజ చేశారు. అలాగే హోమద్రవ్యాల శుద్ధి, వాస్తు శాంతిలో భాగంగా వాస్తు పురుషుడిని ప్రతిష్టించి పూజ నిర్వహించారు. యాగశాలల్లో రుత్వికులు వేద మంత్రోచ్ఛారణ చేస్తూ, మంత్రరాజంగా పేరొందిన అష్టాక్షరి మహా మంత్రాన్ని పఠిస్తూ, ఇతిహాసాలు, పురాణాలు, ఆగమాలు పారాయణం చేస్తూ.. ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులలో ఆధ్యాత్మిక పారవశ్యాన్ని నింపారు. అష్టాక్షరి మహామంత్ర జపం 12 రోజుల పాటు నిర్విరామంగా సాగనుంది. ఉత్సవాలు ముగిసే సమయానికి మొత్తంగా కోటిసార్లు జపించాలనే భారీ లక్ష్యాన్ని చేరుకోనుంది. తరలివచ్చిన స్వాములు, విదేశీ భక్తులు, ప్రముఖులు ఈ సమతా పండుగకు దేశ విదేశాల నుంచి భక్తులు, రుతి్వకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అహోబిల జీయర్‌స్వామి, దేవనాథ జీయర్ స్వామి, రామచంద్ర జీయర్ స్వామి, రంగ రామానుజ జీయర్ స్వామి, అష్టాక్షరి జీయర్ స్వామి, వ్రతధర జీయర్ స్వామి తదితర అతిరథ మహారథులనదగ్గ స్వాములు తరలివచ్చారు. రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఏపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, తదితర ప్రముఖులు పాల్గొన్నారు. అమెరికా నుంచి వందలాదిగా భక్తులు, 20 మంది రుత్వికులు రావడం విశేషం. యూరప్ నుంచి, ఆస్ట్రేలియా, యూఏఈ నుంచి కూడా భక్తులు హాజరయ్యారు. విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న నగర యువత సైతం ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సెలవు పెట్టి మరీ వాలంటీర్లుగా ఇక్కడ సేవలు అందిస్తుండడం విశేషం. -
Viral: షేర్వాణీ ధరించి పెళ్లి కూతురు గుర్రపు స్వారీ!
పెళ్లి వేడకలు ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా జరుగుతుంటాయి. సంప్రదాయం ఏదైనా వివాహ వేడుకను ఘనంగా నిర్వహిస్తారు. అయితే కొన్ని ప్రాంతాల్లో వరుడు షేర్వాణీ ధరించి గుర్రం మీద పెళ్లికూతురు ఇంటి వద్ద ఏర్పాటు చేసిన వివాహ వేడుకకు వస్తాడు. అయితే వరుడు వచ్చినట్లుగానే వధువు.. షేర్వాణీ ధరించి గుర్రం మీద తన ప్రీ-వెడ్డింగ్ కార్యక్రమంలో పాల్గొంటుంది. రాజస్థాన్‌లోని సికర్ జిల్లాలో రనోలి గ్రామానికి చెందిన వధువు కార్తిక గుర్రంపై వచ్చి.. ప్రీ-వెడ్డింగ్ ‘బండోరి’ వేడుకల్లో అందరినీ దృష్టిని ఆకర్షించింది. తాము జెండర్ ఇక్వాలిటీ పాటిస్తామని కొడుకు అయినా కూతురైనా ఒకేలా చూస్తామని ఆమె కుటుంబసభ్యులు తెలిపారు. అందుకోసమే కార్తిక వివాహం సందర్భంగా ఇలా ప్లాన్ చేసినట్లు పేర్కొన్నారు. ఆమె వివాహం సోమవారం జరగాల్సి ఉంది. ‘బండోరి’ వేడుక కోసం కార్తిక స్వయంగా షేర్వాణీ తయారు చేయటం విశేషం. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘గుర్రంపై వరుడి కంటే వధువు వస్తేనే బాగుంటుంది’.. ‘జెండర్ ఇక్వాలిటీకి ఇది ఓ ముందడుగు’ అని ఈ వీడియోను చూసిన నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. -
అదృష్టం సరే అర్హతను కల్పిస్తున్నామా?
ఒక ఆలోచన ఆడపిల్లను చిట్టి తల్లి బంగారు తల్లి అంటాం మనం. అదృష్టం అంటాం మనం. అమ్మాయిది లక్ష్మీ పాదం అని మురిసిపోతాం. తల్లులకు తండ్రులకు సాధారణ స్థాయిలో ఈ మురిపెం ఉంటుంది. అయితే దీనికి ఆవల ఈ అదృష్ట దేవతకు సకల అర్హతలు అందే వీలు కల్పించడం జరుగుతున్నదా? ఆడపిల్ల చేత డబ్బు ఇచ్చి బీరువాలో దాచి పెట్టించే సెంటిమెంటు పాటించే తల్లిదండ్రులు తమ ఆర్థిక, వ్యాపార వారసత్వాలలో ఆమెకు మగ పిల్లలతో పాటు సమాన అవకాశం ఇవ్వొచ్చనే ఆలోచనకు వస్తున్నారా? ఆడపిల్ల కొన్నింటికే యోగ్యురాలు, కొన్నింటికే పరిమితం అనే ఆలోచనా చట్రం ఉన్నంత కాలం ఆమెను అదృష్టానికి చిహ్నమని ఎంత భావించినా అసలైన అదృష్టం ఆమెకు దక్కుతుందా? ఆమె అదృష్టం ఆమెతో అదృష్టం ఆమెకు సమాన అవకాశాలను కల్పించడంలోనే ఉంటుందని ఇటీవలి ఒక చర్చ సూచిస్తోంది. ఇటీవల ట్విట్టర్లో ఒక వీడియో నెటిజన్లను ఆకట్టుకుంది. ఒక తండ్రి కొత్తగా కొన్న ట్రాక్టర్ మీద తన చిన్న కుమార్తె అదృష్టానికి చిహ్నంగా ఆమె పాదముద్రలను ముద్రించాడు. కుమార్తెకు విలువనిచ్చినందుకు ఆ తండ్రిని చాలా మంది ప్రశంసించారు. ఎందుకంటే మన కుటుంబాల్లోని ఆడపిల్లలను అదృష్టానికి గుర్తుగా చూస్తారు. ఆడపిల్ల పాదం ఇటు పుట్టింటికీ, అటు అత్తగారింటికీ అత్యంత శుభాన్ని కలిగిస్తుందని విశ్వసిస్తారు. ఉత్తర భారతదేశంలో ఘరోండా (దీపావళి సందర్భంగా జరుపుకునే పూజ) సమయంలో కుటుంబంలో ఆడపిల్లలు ఉంటే దేవతలు ఆశీర్వదిస్తారని నమ్మకం ఉంది. అందులో భాగంగానే ఈ వీడియోను ట్విట్టర్ వేదికగా ఓ తండ్రి పంచుకున్నాడు. ఈ నమ్మకాలు ఆడపిల్ల ఎంత విలువైనదో చెప్పేందుకు పెద్దలు ఏర్పరిచిన సంకేతాలు అనుకోవచ్చు. ఇవి ఆడ శిశుహత్యల రేటుకు విరుద్ధంగా సానుకూల సంకేతాలను ఇస్తాయి. అయితే, రచయిత్రి, నెటిజన్ రుద్రాణి గుప్త ఈ వీడియోపై స్పందిస్తూ కొన్ని ప్రశ్నలు వేశారు. ఇవీ ఆ ప్రశ్నలు... ‘ఒక తండ్రి తన కుమార్తెను అధికంగా ప్రేమిస్తూండవచ్చు. ఆ తండ్రి మనసును మనం వేనోళ్లగా కొనియాడవచ్చు. అయితే, ఆ తండ్రి ఆమెను తన కుటుంబ వ్యాపారానికి అదృష్టంగా మాత్రమే చూసుకుంటే సరిపోతుందా?! స్త్రీని డబ్బుకు, శ్రేయస్సుకి దేవతగా కొనియాడిన తల్లిదండ్రులు నిజ జీవితంలో ఆమె ఆర్థిక సాధికారతకు మార్గం వేస్తున్నారా? కూతురును లక్ష్మీగా భావించే కుటుంబాలు తమ కుటుంబ వ్యాపారాలలో ఆమెను వారసురాలిగా, యజమానిగా ఉంచాలనే ఆలోచన కలిగి ఉన్నారా?!’ ఇవీ నెటిజన్ రుద్రాణి గుప్త సంధించిన ప్రశ్నలు. వీటితో పాటు తన కుటుంబంలోనే జరిగిన ఓ సంఘటననూ ఆమె పంచుకున్నారు. వ్యాపారానికి వారసురాలు అవగలదా?! ‘‘ఈ వీడియో నా ఇంట్లో జరిగిన ఇలాంటి సంఘటనను ఒకటి గుర్తు చేసింది. నా తండ్రి తన ట్రక్కు ఎక్కి డ్రైవర్ సీటుపై కూర్చోవడానికి నా చెల్లెలికి సహాయం చేశాడు. ఆమె వల్ల వచ్చిన అదృష్టంగా భావించి, ఆమె పుట్టినరోజున ఆ ట్రక్కు కొన్నాడు. ఆ క్షణంలో సరదాగా కొన్ని సెల్ఫీలు తీసుకున్నారు. ఎప్పుడైనా ఆమె ఆ ట్రక్కు లేదా వ్యాపారాన్ని సొంతం చేసుకుంటుందా అనే ఆలోచన నా తండ్రి ఊహల్లో కూడా వస్తుందంటే నేను నమ్మను. ‘ఆమె’ ఎప్పుడైనా వ్యాపారానికి వారసత్వంగా ఉంటుందా? ‘ఆమె’ సంపాదనతో కుటుంబం నడుస్తుందని గర్వంగా చెప్పుకునే స్థితి ఉంటుందా? ఆమె ఆత్మవిశ్వాసంతో కుటుంబ వ్యాపారాన్ని నడుపుతుందా? అంటే మనలో చాలా మంది దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే నా చెల్లెలు వివాహం చేసుకుని మరొక కుటుంబానికి పంపబడుతుందనే భావనలో నా కుటుంబం ఇప్పటికే ఉంది. అప్పుడు వ్యాపారాన్ని ఆమెకు అప్పగించే పాయింట్ ఎలా చేరుతుంది? నేను మరింత వాదించడానికి ముందు, ఓ విషయం గమనించాను. నా సోదరుడు అప్పటికే నా తండ్రి రోలింగ్ కుర్చీపై కూర్చోవడానికి వారసుడిగా సిద్ధంగా ఉన్నాడు. (నా చెల్లెలు అత్తింటికి వెళ్లినా అక్కడి వ్యాపారాల్లోనూ ఆమె ఎప్పటికీ కీలకం కాలేదు.. ఎక్కడో అరుదుగా ఎంతో శ్రమ పడితే తప్ప. అది మరో గమనించాల్సిన విషయం) సామర్థ్యం ఎంపిక కూతురికేనా?! వీడియో చూశాక రేపు ఆ కుమార్తె పెద్దయ్యాక, తండ్రి ఆమెను ట్రాక్టర్ నడపడానికి అనుమతిస్తాడా అనే ప్రశ్న దగ్గరే నా ఆలోచన ఆగిపోయింది. ఆమె ఎర్రటి పాదముద్రలతో అలంకరించబడిన ట్రాక్టర్ ఎప్పుడైనా ఆమె సాధికారతకు మాధ్యమంగా మారుతుందా? తల్లితండ్రుల ఆస్తిలో ‘ఆమె’ వాటా ఉంటుందా అని నేను నా తల్లిని అడిగినప్పుడు, ఆమె వెంటనే దానిని ఖండించింది. ఆమె సోదరుడు ఆస్తికి నిజమైన వారసుడని, దానిలో ఆమె వాటా ఐచ్ఛికమని చెప్పింది. చట్ట ప్రకారం కుమార్తె వారసురాలు అయితే, ఆమెలో సామర్థ్యం ఉందా, లేదా అని వేరొకరు ఎందుకు నిర్ణయించాలి? ఒక కొడుకు తన సామర్ధ్యం లేదా ఎంపికతో సంబంధం లేకుండా, అప్పటికే వారసుడిగా భావించబడుతున్నప్పుడు, కుమార్తె వారసురాలిగా తన సమర్థతను ఎందుకు నిరూపించుకోవాలి?! నిరుపేద కూతురు..?! మన కుటుంబాలు కుమార్తెను లక్ష్మిగా వర్ణిస్తాయన్నది కాదనలేని నిజం. కానీ, నిరుపేద కుటుంబాల్లో కూతురు చదువుకోవడానికంటే ముందు పని చేయాల్సి వస్తే ఆ కుటుంబాల్లో లక్ష్మి స్థానం ఏంటి?! కుటుంబానికి సహాయంగా పనిచేసే చాలా మంది మహిళలు, కూలీలు తమ కుమార్తెలను అదే పనిలోకి లాగడం వల్ల వారు ఆ పనుల్లోనే నైపుణ్యాలను నేర్చుకుంటున్నారు. ఆమె వయస్సు 18 ఏళ్ళకు మించి ఉంటే, కుమార్తె తనకు నచ్చిన విద్య, ఉపాధిని పొందడం కంటే కుటుంబం కోసం సంపాదించాలనే ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఇంటి లక్ష్మి కావడం అంటే ఒక స్త్రీ తన కుటుంబానికి.. ఆ కుటుంబ ఆనందానికి, సంప్రదాయాలకు ప్రాధాన్యత ఇవ్వాలి అనీ ఆ పేరుతో ఇంటి గడప లోపలే ఉండిపోవాలి అనేనా సమాజపు ఆలోచన? ద్వంద్వ ప్రమాణాలు ఎందుకు? ప్రియమైన తల్లిదండ్రులారా మీ కుమార్తెలను అదృష్టదేవతగా చూసే బదులు ఆమెను కుటుంబంలో నిజమైన వారసురాలిగా పరిగణించండి. ఆమెను ఆర్థికంగా స్వతంత్రంగా ఎదగనివ్వండి. దాని కోసం ఆమె చేపట్టే మార్గం కూడా ఆమెకు నచ్చినదిగా ఉండాలి. ఆమెను ఎదగనివ్వండి, ఎన్నుకోనివ్వండి, సంపాదించనీయండి, పాలించనీయండి. అదృష్ట స్వరూపం అని ఓ వైపు అంటూనే మరోవైపు ‘నీకు ఇందులో హక్కు లేదు’, ‘నీవు ఆడ..పిల్లవు’ అని అంతర్లీనంగా హెచ్చరికలు జారీచేయడం ఎందుకు. ద్వంద్వ ప్రమాణాల(డబుల్ స్టాండర్స్)తో కన్ఫ్యూజ్ చేయడం ఎందుకు. ఆడపిల్లను ఆడపిల్లగానైనా ఎదగనివ్వండి.’’ ఇటీవల కోర్టులో నానుతున్న వల్లి అరుణాచలం కేసు విషయమే తీసుకుందాం. తమిళనాడులోని అంబాడి ఇన్వెస్ట్మెంట్ బోర్డ్‌లో వల్లి అరుణాచలంను నియమించాలనే ప్రతిపాదనకు వ్యతిరేకంగా మురుగప్ప (ఆమె పుట్టింటివారే) కుటుంబ సభ్యులే అధికంగా ఓటువేశారు. భారత రాజ్యాంగం ప్రకారం కుమార్తెకు తన కుటుంబం ఆస్తి, వ్యాపారాన్ని వారసత్వంగా పొందటానికి సమాన హక్కులు ఉన్నాయి. కానీ, వల్లి అరుణాచలం వంటి ప్రభావవంతమైన, విద్యావంతురాలైన స్త్రీ తన రాజ్యాంగ హక్కులను పొందటానికి సమర్థతను నిరూపించుకోవడానికి సుదీర్ఘ పోరాటం చేయవలసి వస్తే, సాధారణ కుటుంబాలు మరింత శ్రద్ధగా ఉంటాయని ఆశించవచ్చా?! వల్లి అరుణాచలం కొత్తగా కొనుగోలు చేసి ట్రాక్టర్ మీద కుమార్తె పాదముద్రలను ముద్రిస్తున్న తండ్రి – సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
దేశానికి ఎంత గర్వకారణం.. అయినా వివక్ష
ఒక కుండలో నీళ్లు ఉన్నాయి. ఇద్దరు ఎండనపడి వచ్చారు. ఒక స్త్రీ.. ఒక పురుషుడు. నడిచొచ్చింది సమాన దూరం. మోసుకొచ్చింది సమాన భారం. పురుషుడికి గ్లాసు నిండా నీళ్లిచ్చి.. స్త్రీకి అరగ్లాసు ఇస్తే ఏమిటర్థం?! ఆమెది నడక కాదనా? ఆమెది బరువు కాదనా? ఆమెసలు మనిషే కాదనా? ఎండ ఈక్వల్ అయినప్పుడు.. కుండా ఈక్వల్ అవాలి కదా! ఇప్పుడు కొంచెం నయం. ఉండండి, 83 శాతం అంటే కొంచెం కాకపోవచ్చు. చాలా నయం. ఎనభై మూడు శాతం క్రీడాంశాలలో స్త్రీ, పురుషులన్న వ్యత్యాసం చూపకుండా ‘ఈక్వల్ పేమెంట్’ ఇస్తున్నారు! బి.బి.సి. రిపోర్ట్ ఇది. బి.బి.సి. మీడియాలో కూడా ఆమధ్య ఒకరిద్దరు పైస్థాయి మహిళా ఉద్యోగులు జాబ్‌ని వాళ్ల ముఖాన కొట్టేసి బయటికి వచ్చేశారు. జార్జికి వంద పౌండ్లు ఇస్తూ, అదే పనికి ఒలీవియాకు 60 పౌండ్లు ఇస్తుంటే ఎవరైనా అదే పని చేస్తారు. ఇదిగో, ఇలా అడిగేవాళ్ల వల్లనే ఎప్పటికైనా మహిళలకు సమాన ప్రతిఫలం వస్తుంది. ఫురుషులతో సమానంగా. మన దేశంలో ఇలా అడిగినవాళ్లు.. స్పోర్ట్‌లో.. ఐదుగురు మహిళలు ఉన్నారు. తక్కినవాళ్లూ ‘పేమెంట్‌లో ఏంటీ పక్షపాతం!’ అని అంటూనే ఉన్నా.. ప్రధానంగా సానియా మీర్జా, దీపికా పల్లికల్, అతిది చౌహన్, అపర్ణా పపొట్, మిథాలీరాజ్ ఎప్పటికప్పుడు ఈ ఎక్కువతక్కువల్ని గుర్తు చేస్తూ వస్తున్నారు. ఐపీఎల్‌నే తీస్కోండి. పురుషులు ఆడేదీ అదే ఆట, స్త్రీలు ఆడేదీ అదే ఆట. వచ్చే క్యాష్ మాత్రం స్త్రీలకు తక్కువ. టెన్నిస్, ఫుట్‌బాల్, బ్యాడ్మింటన్, స్క్వాష్.. ఏదైనా వీళ్లకు వచ్చేది వాళ్లకు ఇచ్చే దాంట్లో నాలుగింట ఒక వంతు తక్కువే! ‘‘మీకు న్యాయంగా అనిపిస్తోందా.. తక్కువ చేసి ఇవ్వడానికి’’ అని ఉమెన్ ప్లేయర్స్ అడిగితే.. ‘‘స్పాన్సరర్స్ రాకుంటే మేమైనా ఏం చేస్తాం. పురుషులు ఆడితే చూసినంతగా, స్త్రీలు ఆడితే చూడరు. ఉమెన్ ఈవెంట్లకు ఖర్చు తప్ప, లాభం ఎక్కడిది!’’ అని సమాధానం. నిజమే కదా పాపం అనిపించే అబద్ధం ఇది. డబ్బులు బాగానే వస్తాయి. డబ్బులు ఇవ్వడానికే మనసు రాదు. ∙∙ మార్చిలో ఒక సర్వే రిపోర్ట్ వచ్చింది. అదీ బి.బి.సి. వాళ్లదే. పురుషులతో సమానంగా మహిళలకూ పారితోషికం, ఇతరత్రా బెనిఫిట్స్ ఇవ్వాలని ఎక్కువమంది ఇండియన్ క్రీడాభిమానులు అంటున్నారట. అంటే వాళ్లు స్పోర్ట్స్‌ని చూస్తున్నారు కానీ, స్పోర్ట్స్ ఉమన్ అని స్పోర్ట్మన్ అనీ చూడ్డం లేదు. పైగా పద్నాలుగు రాష్ట్రాల్లో జరిగిన ఈ సర్వేలో నాలుగింట మూడొంతుల మంది.. ఆటల్ని ఇష్టపడేవాళ్లే. సినిమాలు, పొలిటికల్ న్యూస్ లేకున్నా బతికేస్తాం కానీ, కళ్లముందు ఏదో ఒక స్పోర్ట్స్ ఈవెంట్ లేకుంటే ఆ పూటకు బతికినట్లే ఉండదని కూడా చెప్పారట. వాళ్లకు కోహ్లీ అని, మిథాలీ అని కాదు. క్రికెట్ కావాలి. సెరెనా అనీ, జకోవిచ్ అని కాదు. టెన్నిస్ కావాలి. ‘కోహ్లీనే కావాలి’ అని వాళ్లు అడిగినా మిథాలీకి రెమ్యునరేషన్ తగ్గించడం కరెక్టు కాదు. గెలిచేందుకు పెట్టే ఎఫర్ట్.. ఆ కష్టం.. వాటికి మనీని తగ్గించి ఇవ్వడం క్రీడాకారిణుల ప్రతిభను, తపనను, శ్రమను తక్కువగా చూడటమే. ఈ అసమానత్వాన్ని ప్రశ్నించకుండా రిటైర్ అయిపోతే, తమకు తాము అన్యాయం చేసుకోవడం మాత్రమే కాదు, కొత్తగా వచ్చేవాళ్లకూ అన్యాయం చేసినట్లే. అందుకే క్రీడాకారిణులు గళం విప్పుతున్నారు. తమ స్వరం వినిపిస్తున్నారు. ఇప్పటికే విదేశీ క్రీడా క్లబ్బులు, ఆసోసియేషన్లు, ఫెడరేషన్లు, కౌన్సిళ్లు, లీగ్‌లు, బోర్డులు, కమిటీలు.. ‘ఈక్వల్ పే’ అమలు చెయ్యడానికి అతి కష్టం మీదనైనా ఒళ్లొంచుతున్నాయి. నాలుగేళ్లు నిరసన భారతదేశపు అత్యుత్తమస్థాయి స్క్వాష్ క్రీడాకారిణి దీపికా పల్లికల్.. ప్రైజ్ మనీలోని అసమానతలకు నిరసనగా 2012 నుంచి 2015 వరకు వరుసగా నాలుగేళ్లు ‘నేషనల్ స్క్వాష్ చాంపియన్ షిప్’ను బాయ్‌కాట్ చేశారు. ‘స్పోర్ట్స్‌మ్యాన్ స్పిరిట్ లేదు. డబ్బే ముఖ్యమా!’ అని ఆమెపై విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ తన నిర్ణయం మీద తను ఉన్నారు. స్త్రీ పురుషులిద్దరికీ ప్రైజ్ మనీ సమానంగా ఉండేంత వరకు నేషనల్స్ ఆడేది లేదని కూడా స్పష్టంగా చెప్పారు. ఆమె ర్యాంకింగ్ పురుషుల కంటే కూడా ఎక్కువగా ఉండేది! నేటికీ తక్కువే మేరీ కోమ్, సైనా నెహ్వాల్, పి.వి.సింధు.. దేశానికి ఎంత గర్వకారణం! అయినా వివక్ష ఉంటోంది. స్త్రీ పురుష సమానత్వం, సాధికారత అని ఎంత మాట్లాడుకున్నా మనమింకా పురుష ప్రపంచంలోనే జీవిస్తున్నట్లుగా అనిపిస్తుంటుంది నాకు. మన క్రీడా ప్రతిభ మెరుగైంది కానీ, క్రీడాకారిణులకు ఇచ్చే ప్రైజ్ మనీ పురుషులకు వచ్చే మొత్తం కన్నా తక్కువగానే ఉంటోంది. – సానియా మీర్జా, టెన్నిస్ స్టార్ (నిరుడు ‘ఫిక్కీ’ చర్చా వేదికపై) ఆటతో సాధించొచ్చు ఈక్వల్ పే ఉండాలి. ఈక్వల్ ప్రైజ్ మనీ ఉండాలి. ఆట తీరుతో కూడా వీటిని సాధించవచ్చు. గుడ్ బ్రాండ్ క్రికెట్ ఆడితే మంచి మార్కెటింగ్ జరుగుతుంది. మ్యాచిల వల్ల ఆదాయం వస్తుంది. పురుషుల ఆటల్లో వచ్చే లాభాల్లోంచి మాకేం పంచి పెట్టనక్కర్లేదు. మా విజయాల్లోని షేర్‌ను తీసుకోడానికే మేము ఇష్టపడతాం. మొత్తానికైతే పారితోషికాల విషయంలో మునుపటి కన్నా కొంత బెటర్ అయ్యాం. – మిథాలీ రాజ్, స్టార్ క్రికెటర్ (ఒక జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో) నమ్మకంగా చెప్పలేం ఆర్థికంగా కొంచెం మెరుగయినట్లే ఉంది. అయితే ఈక్వల్ ప్లేకి ఈక్వల్ పే ఉందా అని నమ్మకంగా చెప్పగలిగిన పరిస్థితి అయితే లేదు. పురుషులకు సమానంగా స్త్రీలకు ప్రైజ్ మనీ ఇవ్వాలి. – అపర్ణా పొపట్, బాడ్మింటన్ (గత ఏడాది ఎకనమిక్ టైమ్స్ ‘పనాచ్’ రౌండ్ టేబుల్ చర్చలో) పోలికే లేదు ప్రైజ్ మనీలోనే కాదు, అన్నిట్లోనూ మహిళా జట్లు, మహిళా క్రీడాకారులకు వివక్ష ఎదురౌతోంది. పురుషుల ఫుట్‌బాల్‌తో మహిళల ఫుట్‌బాల్‌ను పోల్చనే లేము. వాళ్ల లీగ్‌తో మా లీగ్‌ను పోల్చలేం. లెవల్ ప్లేయింగ్ ఫీల్డ్‌ని (సక్సెస్ అయ్యేందుకు ఉండే అవకాశం) కూడా కంపేర్ చెయ్యలేం. ప్రతి దాంట్లోనూ ఇంతని చెప్పలేనంత అసమానత్వం ఉంది. – అదితి చౌహాన్, ఫుట్‌బాల్ గోల్ కీపర్ -
మారిపోయేది ధర్మమ్,మారనిది సత్యమ్
స్త్రీ పురుషుడి శాంతికి కారణమవుతుంది. ఆమె పరిమితి, ఆమె ఉపాసన ఈ దేశంలో, ఈ ధర్మంలో ఒక అద్భుతం. ‘ధర్మము’ అనే మాటను చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ధర్మం ఎప్పుడూ కూడా అవతలి వారిని బట్టి ఉండదు. ధర్మం అంటే వ్యావహారికంలో ఒక దీనుడికి జేబులోనుంచి ఒక రూపాయి ఇస్తే ధర్మం చేసాడు అంటూంటారు... ఇది అది కాదు. ధర్మం అంటే–ఎలా ప్రవర్తించమని పరమేశ్వరుడు వేదంలో చెప్పాడో తెలుసుకుని అలా ప్రవర్తించడానికి ‘ధర్మము’ అని పేరు. అందుకే ఏది ధర్మం? అని చెప్పే సాధికారత ఒక్క వేదానికే ఉంది. వేదం తరువాత అటువంటి అధికారం స్మృతికి ఉంది. తరువాత వరుసగా పురాణం, శిష్టాచారాలు, అంతరాత్మ. ఈ అయిదూ ప్రమాణాలు. ‘ధర్మం ఇది’ – అని చెప్పడానికి ఆరవ ప్రమాణం లేదు. ధర్మాన్ని అనుష్ఠించేటప్పుడు తనకి దేశకాలాల్లో ఏది విధింపబడిందో దాన్ని అవతలివారి ప్రమేయం లేకుండా చేస్తారు. అప్పడు అది ధర్మమవుతుంది. అందుకే ధర్మం ఎప్పుడూ ఒక్కలా ఉండదు. కానీ సత్యం మాత్రం మార్పు లేకుండా ఒక్కలాగే ఉంటుంది. మనం సినిమా చూడ్డానికి వెడతాం. ముందు ఒక తెర ఉంటుంది. ఆ తెర మారదు. 50 సంవత్సరాలపాటు ఆ సినిమా హాలు అలాగే ఉన్నా, అందులో ఇప్పటికి ఏడువేల సినిమాలు వేసినా...ఎంతో మంది ఏడ్చిన వాళ్ళున్నారు, నవ్వినవాళ్ళు ఉన్నారు...పరమానందంతో వెళ్ళిపోయిన వాళ్ళున్నారు... కథలు మారాయి, పాత్రలు మారాయి, బుద్ధులు మారాయి...కానీ తెర మాత్రం అలాగే ఉంది. సత్యమూ అంతే. సత్యం మారదు. మారని దానిని సత్యము అంటారు. మారిపోయే దానిని ధర్మం అంటారు. మారిపోయే ధర్మాన్ని శాస్త్ర విహితంగా ఎవడు పట్టుకున్నాడో వాడు మారని సత్యంగా మారిపోతాడు. అదే మోక్షం.ధర్మం దేశ, కాల, వర్ణ, ఆశ్రమాలనే నాలుగింటినిబట్టి మారిపోతూ ఉంటుంది. ఒక దేశంలో(ప్రాంతంలో అని) ఉన్న ధర్మం మరొక దేశంలో ఉండదు. నేనింట్లో ఎంత పూజ చేస్తానో దానిలో పదోవంతు నేను పై ఊరు వచ్చినప్పుడు కూర్చుని చేస్తే చాలు. ఏకాదశినాడు ఉపవాసం ధర్మం, ద్వాదశినాడు తినడం ధర్మం. దేశాన్నిబట్టి, కాలాన్ని బట్టి ధర్మం మారిపోతుంది. అలాగే వర్ణం కూడా. యజ్ఞోపవీతం ఉన్నవాడికి సంధ్యావందనం ధర్మం. అదిలేనంతమాత్రం చేత తక్కువ వారు కాదు. సూర్యనమస్కారం చేసి సూర్యస్తుతి చదివితే చాలు, వారికది ధర్మం. ఒక్కొక్క ఆశ్రమానికి ఒక్కొక్క ధర్మం. బ్రహ్మచారికి చదువుమీద దృష్టి పెట్టడం ధర్మం. ఆయనకు ఉపవాసం లేదు. గృహస్థు భార్యతో సహజీవనం చేస్తాడు. భవిష్యత్ అవసరాలకోసం ఇల్లు కట్టుకుంటాడు. ఆయనకా అధికారం ఉంది. వానప్రస్థు భార్యను తీసుకుని అరణ్యంలోకి వెళ్ళి ఒక కుటీరం కట్టుకుని ఎప్పుడూ తనలో తాను ఆత్మవిచారం చేస్తుంటాడు. పుణ్యకార్యాలు చేస్తూ భగవంతుని చేరడానికి ప్రయత్నిస్తాడు. చిట్టచివరిదయిన తురీయాశ్రమంలో ఇక దేనితో సంబంధం ఉండదు. కాబట్టి ఒక్కొక్క ఆశ్రమానికి ఒక్కొక్క ధర్మం. బ్రహ్మచారిలా గృహస్థు బతక కూడదు. గృహస్థులా వానప్రస్థు బతకకూడదు. ఒకరిలా మరొకరు బతకరు. ఎవరు ఏ ఆశ్రమంలో ఉన్నారో దాన్ని బట్టి ధర్మం మారిపోతుంటుంది మారిపోతున్న ధర్మాన్ని పట్టుకునేటప్పుడు అవతలివాడి వలన ఇవతలివాడి ధర్మం మారదు. -
సమానత్వానికి ఆమడ దూరంలో!
కుల అసమానత్వానికి, అగౌరవానికి పరిష్కారం కులాంతర వివాహమేనని చాలామంది సామాజిక సిద్ధాంతవేత్తలు భావిస్తుంటారు. కాని అన్ని కులాల మధ్య ఆధ్యాత్మిక సమానత్వం ఏర్పర్చనట్లయితే, మరే ఇతర కులవ్యతిరేక చర్యలూ పెద్దగా సాధించేదంటూ ఏదీ ఉండదు. మనుషుల్లో కులాలను దేవుడు సృష్టించలేదని ప్రతి ఆలయంలోనూ పూజారి ప్రకటించి ఉంటే, దేశంలో కొద్దిగా అయినా సాధ్యపడుతున్న కులాంతర వివాహాలు యువతీయువకుల హత్యలకు దారితీసి ఉండేవికావు. మనం ఆలయంలోనే సమానత్వాన్ని కోల్పోయాం. అది పోలీసు స్టేషన్లో దొరుకుతుందని వెతుకుతున్నాం. ఆలయం సృష్టించిన సమస్యను పోలీసు స్టేషన్ పరిష్కరించలేదు. ఉమ్మడి వ్యవస్థలుగా ఆలయం, పాఠశాల మాత్రమే దీన్ని పరిష్కరించాలి. 21వ శతాబ్దిలోనూ భారత్‌లో మానవ సంబంధాలు అంతరాలు, అసమానతల మధ్యే కొనసాగుతున్నాయి. నా బాల్యంలోనూ, ప్రస్తుతం కూడా మా గ్రామంలో ఓ సాధారణ ప్రక్రియ జరుగుతూ వస్తోంది. ప్రతి వృత్తినీ ఒక్కో సామాజిక బృందం మాత్రమే నిర్వహిస్తూంటుంది. ప్రతి కమ్యూనిటీకీ ఒక్కో పేరు ఉంటుంది. పొలాలను దున్నడం, గొర్రెలు కాయడం లేదా పశువుల పెంపకం, చేపలుపట్టడం, కల్లుగీత, కుండల తయారీ, బట్టలు ఉతకడం, నేతపని, క్షురక వృత్తి, చెప్పుల తయారీ, జంతువులు లేక మనుషుల మృతదేహాలకు అంతిమసంస్కారం నిర్వహించడం వంటి ఒక్కో పనిని ఒక్కో కులం ప్రత్యేకంగా చేసేది. గ్రామంలో ఏదైనా వృత్తి చేతులు మారుతూ ఉంటుందంటే అది పొలం దున్నడం మాత్రమే. ఇతర వృత్తులన్నీ వేర్వేరు కులాల చేతుల్లోనే ఉంటాయి. నా బాల్యంలో అన్ని కులాలూ కలిసి భోజనం చేసే పద్ధతి ఉండేది కాదు. ఇప్పుడు అన్ని కులాలు కలిసి భోంచేయడం సాధ్యపడుతోంది కానీ, కులాంతర వివాహం ఇప్పటికీ కష్టసాధ్యమే. మార్పు ఏదైనా జరిగిందంటే అది పైపైన మాత్రమే జరుగుతోంది తప్ప వ్యవస్థాగతంగా కాదు. అంతరాల పరమైన అసమానత్వం ఇప్పటికీ అలాగే ఉంది. బ్రాహ్మణ, వైశ్య కులాలు ఇప్పటికీ ప్రత్యేకంగా ఉంటూ మిగతా కులాలకంటే అగ్రస్థానంలో ఉంటున్నాయి. కులపరమైన సమానత్వం గ్రామంలోనూ లేదు. నగరంలోనూ లేదు. 72 సంవత్సరాల స్వాతంత్య్రం తర్వాత కూడా దేశంలో ప్రజాజీవితంలో సమానత్వం లేనేలేదు. 20వ శతాబ్ది మధ్య నుంచి, 21వ శతాబ్ది ప్రారంభం వరకు భారతదేశంలో మానవ సంబంధాలు అంతరాలు, అసమానతల మధ్యే కొనసాగుతున్నాయి. స్త్రీపురుషులతో సహా మనుషులందరినీ సమానంగా సృష్టించాడని చెబుతున్న దేవుడు నేటికీ మా సామాజిక చట్రంలోకి ప్రవేశించలేకున్నాడు. ప్రతి గ్రామంలోనూ పశువుల, మనుషుల మృతదేహాలకు అంతిమ సంస్కారం నిర్వహించే వారిని అంటరానివారిగా గుర్తిస్తుం టారు. ఇక రజకులు, క్షురకులను కూడా హీనంగా చూస్తుంటారు. దాదాపుగా దేశంలోని ప్రతి గ్రామంలోనూ ఇదే పరిస్థితి. ఉత్తరాదిన ఇది కఠినంగా అమలవుతుంటే దక్షిణాదిలో కాస్త తక్కువ స్థాయిలో అమలవుతోంది. ఆర్ఎస్ఎస్/బీజేపీ ఉత్తరాదిన బలంగానూ, దక్షిణాదిలో బలహీనంగానూ ఉండటానికి ఇదే కారణం. గ్రామాల్లో ఉమ్మడి పాఠశాలల వ్యవస్థ ఉనికిలోకి రాకముందు చారిత్రకంగా చూస్తే, అన్ని వృత్తులను ఐక్యం చేసేది ఒక్క ఆలయం మాత్రమే. దేవుడు మనుషులందరినీ సమానంగా సృష్టించాడన్న భావంతో గ్రామంలోని ఆలయం అన్ని కులవృత్తుల వారికి ఉమ్మడి స్థలంగా ఉండేది. భారతీయ గ్రామాలు చాలా విభిన్నమైనటువంటివి. ఆలయ పూజారి వారికి ఏం చెబుతాడన్నది ఊహించుకోండి మరి. మీ వృత్తిపరంగా ఉండే మీ విధులను నిర్వహించండి, అన్ని వృత్తులూ మన మనుగడ కోసం అవసరమైనట్టివే, మీరూ మీ వృత్తిపరమైన విధులూ దేవుడి రా>జ్యంలో సమానమైనవే. కానీ దీనికి భిన్నంగా గ్రామీణ పూజారి గ్రామస్థులకు ఏం చెబుతూ వచ్చాడో తెలుసా? అసమానత్వాన్ని, అంటరానితనాన్ని పాటించడం మీ పవిత్ర ధర్మం. ఎందుకంటే దేవుడు లేక దేవుళ్లు మిమ్మల్ని అసమానంగానే సృష్టించారు అనే. దేవుడి ప్రతినిధిగా భావించే వ్యక్తే గ్రామీణులకు ఇలా చెబుతూ వస్తే దేశంలో ఆధ్యాత్మిక, సామాజిక సమానత్వం ఎలా వస్తుంది? ఉమ్మడి బోధనా స్థలంగా పాఠశాల గ్రామాల్లో ప్రవేశించడానికి ముందు ఆలయం ఒక ఉమ్మడి సామాజిక స్థలంగా ఉండాలి. గ్రామ దేవాలయానికి సమానత్వమే సూత్రమైతే, ఆ సమానత్వం గ్రామీణ జీవితంలో భాగమై ఉండాలి. అన్ని కులవృత్తుల ప్రజలూ పక్కపక్కనే కూర్చుని ఆహారాన్ని ఆరగించాలని గ్రామ దేవాలయం మొదటినుంచి ప్రబోధించి ఉంటే, గ్రామాల్లో అసమానత్వం అసలు ఉండేది కాదు. కుల అసమానత్వానికి, అగౌరవానికి పరిష్కారం కులాంతర వివాహమేనని చాలామంది సామాజిక సిద్ధాంతవేత్తలు భావిస్తుం టారు. కాని అన్ని కులాల మధ్య ఆధ్యాత్మిక సమానత్వం ఏర్పర్చనట్లయితే, మరే ఇతర కులవ్యతిరేక చర్యలతో పెద్దగా సాధించేదంటూ ఏదీ ఉండదు. మనుషుల్లో కులాలను దేవుడు సృష్టించలేదని ప్రతి ఆలయంలోనూ పూజారి ప్రకటించి ఉంటే, దేశంలో కొద్దిగా అయినా సాధ్యపడుతున్న కులాంతర వివాహాలు ప్రస్తుతం జరుగుతున్నట్లుగా యువతీయువకుల హత్యలకు దారితీసి ఉండేవికావు. అలాంటి వాతావరణంలో ఆర్టికల్ 15 వంటి సినిమా ఏదీ మనకు అవసరమై ఉండేది కాదు. మనం ఆలయంలోనే సమానత్వాన్ని కోల్పోయాం. అది పోలీసు స్టేషన్లో దొరుకుతుందని వెతుకుతున్నాం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 15 ఆలయం గురించి పేర్కొనలేదు. ఆలయం సృష్టించిన సమస్యను పోలీసు స్టేషన్ పరిష్కరించలేదు. ఉమ్మడి వ్యవస్థలుగా ఆలయం, పాఠశాల మాత్రమే దీన్ని పరిష్కరించాలి. మన వివాహ వ్యవస్థలో మార్పు తీసుకురావడానికి అర్చక కులం సిద్ధపడనంతవరకు కులాంతర వివాహాలు మన దేశంలో విజయవంతం కావు. అర్చకత్వం అనేది కుల వృత్తిగా కాకుండా వ్యక్తులు చేసే వృత్తిగా మారనంతవరకు మన వివాహ వ్యవస్థ మారదు. కుల సంబంధాలు మారవు. అప్పుడు మాత్రమే శ్రమను గౌరవించడం మన కుటుంబ సంస్కృతిలో సాధ్యపడుతుంది. ఈ ప్రాథమిక అంశాలను మనం సాధించి ఉంటే, ఇస్లామిక్ మసీదు మన గడ్డపైకి అడుగుపెట్టగలిగేదే కాదు. అలాగే క్రిస్టియన్ చర్చి కూడా భారతదేశంలోకి వచ్చేది కాదు. ముస్లిం ఆక్రమణదారులు కానీ, క్రిస్టియన్ వలసపాలకులు కానీ వచ్చి ఉన్నా, వారు భారత్‌లో ఇంతటి విజయాలు సాధించి ఉండేవారు కాదు. మరోమాటలో చెప్పాలంటే, ఆధునిక కాలంలో మన సమాజాలన్నింటిలోనూ మానవ సమానత్వానికి ఆధ్యాత్మికపరమైన ప్రజాస్వామ్య వ్యవస్థే నిజమైన పునాదిగా ఉంటోంది. మన దేశంలో అలాంటి ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యాన్ని బ్రాహ్మణ పండితులే ప్రతిపాదించి ఉండాలి. ఆధ్యాత్మిక సమానత్వ సూత్రాన్ని దేవుడు ప్రసాదించిన సూత్రంగా ఆలయం ఆచరించి ఉంటే మన దేశం మరో విభిన్న దశలో సాగి ఉండేది. సాధారణంగా మన కాలేజీల్లో, యూనివర్సిటీల్లో రాజకీయ సమానత్వం పట్లే చర్చలు సాగుతుంటాయి. కానీ గ్రామ స్థాయినుంచి మానవ సంబంధాలన్నింటినీ ఆధ్యాత్మిక సమాజమే పూర్తిగా నియంత్రిస్తున్నప్పుడు మన పౌర సమాజ పొరల్లోకి రాజకీయ సమానత్వాన్ని తీసుకురావడం ఎలా సాధ్యం? మానవ సమానతా సమాజాన్ని నిర్మించాలంటే ఇక్కడే ఆలయం, చర్చి, మసీదు కీలకపాత్ర పోషించాల్సి ఉంది. పరిశుద్ధమైన శాకాహార తత్వమే జాతీయ ఆహా రంగా హిందుత్వ శక్తులు చాలాకాలంగా పేర్కొంటూ వస్తున్నాయి. వీరి అభిప్రాయం ప్రకారం మాంసాహారులు ఎవ్వరు భారతీయులు కారు. అందుకే ఇప్పుడు శాకాహారులైన బ్రాహ్మణులు, వైశ్యులు, ఆరెస్సెస్ కంటే శూద్ర, దళిత, ఆదివాసీ మాంసాహారులను తక్కువజాతికింద పరిగణిస్తున్నారు. ఇప్పుడు అసమానత్వాన్ని నిర్మూలించడానికి బదులుగా అసమానత్వాన్ని పెంచి పోషించే అత్యంత శక్తివంతమైన నూతన శాకాహార కులంగా ఆరెస్సెస్ అవతరించింది. జాతీయవాదాన్ని ప్రజల ఆహార ఆర్థికవ్యవస్థకు అనుసంధానించడం తగదంటూ.. ఆరెస్సెస్‌లో వివిధ స్థాయిల్లో పనిచేస్తున్న ఏ శూద్రకులానికి చెందిన కార్యకర్త కూడా నొక్కి చెప్పలేరు. ఎందుకంటే రుగ్వేద కాలం నుంచి శూద్రులను బౌద్ధికంగా తక్కువస్థాయి కలిగినవారిగా గుర్తిస్తూ వస్తున్నారు. శాకాహారమే తమ ఆహారంగా ఉండినట్లయితే 5 వేల సంవత్సరాల క్రితమే హరప్పా వాసులు మన గొప్ప నాగరికతను నిర్మించి ఉండేవారు కాదని ఆరెస్సెస్‌కు అర్థం కావడం లేదు. వెయ్యి సంవత్సరాల క్రితం వరకు భారతదేశంలో శాకాహార ఉత్పత్తి జరిగి ఉండలేదు. ఆహారంతో సహా అన్ని రంగాల్లోనూ సమానత్వాన్ని రద్దు చేసిపడేశారు. హిందూ కుల అంతరాల వ్యవస్థకే కాదు. భారతీయ ఇస్లాం, భారతీయ క్రిస్టియానిటీకి కూడా ఇది పెద్ద సమస్యగానే ఉంటోంది. మన గ్రామాల్లో నేటికీ గుణాత్మకమైన మార్పు జరగలేదు. ఆలయం అదే కులధర్మంతో నడుస్తోంది. కులాంతర వివాహాలు చేసుకున్న యువతీయువకులను చంపేయడాన్ని, గర్భగుడిలోకి ప్రవేశించిన దళితులపై దాడి చేయడాన్ని అది ఆమోదిస్తోంది. హిందూ దేవుళ్ల కంటే ఓటుహక్కే దళితులను కాపాడుతోంది. పూజారి వైఖరి మాత్రం కులధర్మాన్ని ఆచరిస్తూనే సాగుతోంది. ఇదే అన్ని అసమానతలకు తల్లివంటిది. మనం ఆలయాన్ని మార్చలేనట్లయితే, ప్రతి పాఠశాలలో ఉదయం ఇలా ప్రార్థన చేయవలసిందిగా మన విద్యార్థులను కోరదాం. ఆలయ దేవుడు సమానత్వం తేనట్లయితే, పాఠశాల దేవుడు దేశంలో సమానత్వాన్ని తెచ్చేలా చేద్దాం. దేవుడా మమ్మల్ని సమానులుగా సృష్టించావు దేవుడా స్త్రీపురుషులను సమానులుగా సృష్టించావు దేవుడా మాలో కులాలు లేకుండా సృష్టించావు దేవుడా మామధ్య అంటరానితనం లేకుండా చేశావు దేవుడా పనిచేసి జీవించమని మా అందరికీ చెప్పావు దేవుడా మా తల్లిదండ్రులను గౌరవించమని చెప్పావు దేవుడా గర్విస్తున్న భారతీయులుగా మేం నిన్ను ప్రార్థిస్తున్నాం దేవుడా భారతీయులందరినీ సమానులుగా సృష్టించావు వ్యాసకర్త: ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ డైరెక్టర్, సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సోషల్ ఎక్స్‌క్లూజన్ అండ్ ఇంక్లూజివ్ పాలసీ -
అధికారం అందరిదీ...
సాక్షి, గుంటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీద బడుగు బలహీన వర్గాల పక్షపాతి అని మరోసారి రుజువైంది. బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదని బ్యాక్ బోన్ క్లాస్ అని కొత్త అర్థాన్నిచ్చిన వైఎస్ జగన్ బీసీలకు రాజ్యాధికారం కట్టబెట్టే దిశగా అడుగులు వేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం విడుదల చేశారు. సీట్ల కేటాయింపులో బీద, బడుగు, బలహీన వర్గాలకు పెద్దపీట వేశారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 175 అసెంబ్లీ సీట్లలో 41 సీట్లు బీసీలకు కట్టబెట్టి తాను వారి పక్షపాతినని రుజువు చేసుకున్నారు. అసెంబ్లీ సీట్ల కేటాయింపులో బీసీ, మహిళలకు సముచిత స్థానం కల్పించారు. జిల్లాలో 17 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా మూడు సీట్లను బీసీలకు కేటాయించారు. ఈ నేపథ్యంలో గుంటూరు వెస్ట్ నియోజకవర్గం నుంచి వడ్డెర సామాజిక వర్గానికి చెందిన మాజీ డీఐజీ చంద్రగిరి ఏసురత్నం, రేపల్లె నుంచి మత్స్యకార సామాజికవర్గానికి చెందిన మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, చిలకలూరిపేట నుంచి రజక సామాజికవర్గానికి చెందిన విడదల రజని బరిలో నిలుస్తున్నారు. మహిళలకు సైతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీట్ల కేటాయింపులో సముచిత స్థానం ఇచ్చింది. మహిళలకు మూడు సీట్లు కేటాయించగా, ఆ మూడు ఎస్సీ, బీసీ మహిళలకు ఇవ్వడం గమనార్హం. గత ఎన్నికల్లోనూ ముగ్గురు మహిళలకు సిట్లు ఇచ్చింది. ఇది బీసీ, ఎస్సీ, ఎస్టీలపై వైఎస్ జగన్‌కు ఉన్న గౌరవానికి నిదర్శనమని మహిళా సంఘాల నాయకులు అంటున్నారు. ఒక్క సీటూ కేటాయించని టీడీపీ.. ‘ఆడది ఇంట్లో ఉండాలి.. కారు షెడ్లో ఉండాలి’.. అంటూ శాసన సభ స్పీకర్ కోడెల శివప్రసాద్, ‘కోడలు మగ బిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా’ అంటూ సీఎం చంద్రబాబు మహిళను కించపరుస్తూ మాట్లాడిన విషయం తెలిసిందే. ప్రస్తుత అసెంబ్లీ, పార్లమెంట్ సీట్ల కేటాయింపులో కూడా టీడీపీ మహిళలపై వివక్ష చూపింది. జిల్లాలో ఇటీవల 14 సీట్లు కేటాయించిన సీఎం ఒక్క సీటు కూడా మహిళలకు ఇవ్వలేదు. గత ఎన్నికల్లో సైతం వారికి మొండిచేయి చూపారని మహిళా సంఘాలు విమర్శిస్తున్నాయి. బీసీ సీటును లాక్కున్న లోకేష్.. ‘మాదీ బీసీల పార్టీ’అంటూ గొప్పలు చెప్పుకునే చంద్రబాబు సీట్ల కేటాయింపులో బీసీల తీరని ద్రోహం చేశారు. జిల్లాలో ఇప్పటి వరకూ 14 సీట్లు కేటాయించగా ఒక్క సీటు మాత్రమే చంద్రబాబు బీసీకి కేటాయించారు. మంగళగిరి నియోజకవర్గంలో గత ఏడాది బీసీ వర్గానికి చెందిన గంజి చిరంజీవి టీడీపీ నుంచి పోటీ చేశారు. అయితే ఈ సారి ఆ సీటును చంద్రబాబు తన తనయుడు లోకేశ్‌కు కేటాయించి ద్రోహం చేయడంతో బీసీలు మండిపడుతున్నారు. మమ్మల్ని గుర్తించిన నేత జగన్ బీసీ కులాల్లో అట్టడుగు స్థానంలో ఉన్న వడ్డెర సామాజికవర్గాన్ని గుర్తించిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్. మా సామాజికవర్గానికి చెందిన చంద్రగిరి ఏసురత్నానికి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం సీటు కేటాయించి రాజకీయ గుర్తింపునిచ్చారు. వడ్డెర మహిళను గుంటూరు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్‌గా ఎంపిక చేశారు. – వేముల శివ, వడ్డెర సంక్షేమసంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి మహిళలంటే అంత అలుసా.. మహిళలంటే టీడీపీ ప్రభుత్వానికి అంత అలుసా. ఒక్క సీటూ కేటాయించలేదు. వివక్ష చూపుతూ మాది సామాజిక న్యాయం పాటించే పార్టీ అని ఎలా ప్రచారం చేసుకుంటారు. బీసీలు, మహిళలలు, బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చిన ఏకైక వ్యక్తి, పార్టీ ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, జగన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. టీడీపీకి బుద్ధి చెబుతాం. – బత్తుల మృదుల, మహిళ, బ్రాహ్మణపల్లి