లింగ సమానత్వం: స్కూల్లో ఏం చెబుతున్నారు?! | Gender equality: Gender equality through school | Sakshi
Sakshi News home page

లింగ సమానత్వం: స్కూల్లో ఏం చెబుతున్నారు?!

Published Sat, Jul 23 2022 4:52 AM | Last Updated on Sat, Jul 23 2022 11:05 AM

Gender equality: Gender equality through school - Sakshi

‘ఆడ–మగ సమానత్వం ఎప్పుడు సాధ్యమౌతుంది?!’ ‘ఇప్పట్లో అయితే కాదు..’ అనేది ప్రపంచంలోని అన్ని సమాజాల్లో బలంగా పాతుకుపోయిన ఒక ఆలోచన. కానీ, సాధనతో అన్నీ సమకూరుతాయనేది మనందరికీ తెలిసిందే. ఆ నమ్మకంతోనే ఐక్యరాజ్యసమితి 2030 సంవత్సరానికి గడువును నిర్ణయించింది. లింగ సమానత్వం అనేది ప్రాథమిక మానవ హక్కు మాత్రమే కాదు. శాంతియుత, సంపన్నమైన, స్థిరమైన ప్రపంచానికి అవసరమైన పునాది.

లింగ సమానత్వంలో పిల్లల వైఖరిని రూపొందించడంలో తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయులు ముఖ్య పాత్ర పోషిస్తారు. జెండర్‌ రోల్స్‌ పట్ల పిల్లల ప్రవర్తనలో మార్పులు తీసుకురావడానికి టీచర్ల శిక్షణ కచ్చితంగా సహాయపడుతుంది. అయితే, ‘అమ్మాయిలా ఏడుస్తున్నావేంటి?’ అని అబ్బాయిలను.. ‘ఏంటా వేషాలు, నువ్వేమైనా అబ్బాయివా?’ అంటూ అమ్మాయిలను.. జెండర్‌ రోల్‌ని ప్రధానంగా చూపుతూ ఉపయోగించే భాష వల్ల పిల్లల మైండ్‌సెట్‌లలో ‘వివక్ష’ ముద్రించుకుపోతున్నది కూడా వాస్తవం.

మహిళల హక్కులను ప్రోత్సహించే సామాజిక మార్పును తీసుకురావడానికి విద్య అత్యంత శక్తిమంతమైన సాధనాల్లో ఒకటి. టీచర్లు విద్యావ్యవస్థకు మూల స్తంభం కాబట్టి, పాఠశాల స్థాయి నుంచే మార్పుకు ప్రయత్నించాల్సి ఉంటుంది. అయితే, తరగతి గదుల్లో పాత మూస పద్ధతిలో భాషను ఉపయోగించకుండా, ప్రణాళికాబద్ధమైన శిక్షణ ద్వారా టీచర్లు లింగ అసమానతలను తొలగించడానికి కృషి చేయవచ్చు.

తమకు తెలియకుండానే..
కొన్ని లింగ అవగాహన చర్చల ఆధారంగా లింగ వివక్షకు దూరంగా అందరూ ఆలోచించాలని ఆశించడం వల్ల ఎలాంటి సానుకూల ఫలితాలుండవు. పిల్లల బాల్యం నుంచే ఈ విషయాన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉంది. లింగ మూస పద్ధతులను నివారించడంలో టీచర్లు కీలకపాత్ర పోషిస్తారన్నది తెలిసిందే. నిజానికి టీచర్లు విద్యార్థుల పట్ల మంచి ఉద్దేశాలను కలిగి ఉన్నప్పటికీ, వారి సాధారణ బోధనలో తరచూ తమకు తెలియకుండానే జెండర్‌ లైన్స్‌ను ఉపయోగిస్తుంటారు. మారుతున్న సమాజ ధోరణులు, భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకొని టీచర్లు ‘లింగ’ భాషను మార్చుకోవడం కూడా తప్పనిసరి అని అంగీకరిస్తున్నారు ఉపాధ్యాయులు. ఆ దిశగా తామూ ముందడుగు వేస్తున్నామంటున్నారు.

శిక్షణ అవసరం
లింగ వివక్షలో టీచర్లు ప్రాథమికాంశాలను లోతుగా తెలుసుకుంటే పిల్లల మెదళ్లలో లింగసమానత్వాన్ని పెంపొందించడానికి శ్రద్ధ వహిస్తారు. తరగతి గదిలో ‘జెండర్‌’ భాషను వాడకుండా మానవసంబంధాలలోనూ, సామాజిక పరమైన పరివర్తన తీసుకురావడానికి, లింగ వివక్ష తగ్గించడానికి టీచర్లకు నైపుణ్యం అవసరం. లింగ సమానత్వానికి అన్ని స్థాయిలలో, అన్ని దశలలోనూ శిక్షణ అవసరం.

మూస పద్ధతులకు స్వస్తి
తరగతి గదిలో అబ్బాయిలు, అమ్మాయిలకు ఒకే విధమైన బోధన అందించేటప్పుడు ‘జెండర్‌’ గురించి ప్రస్తావన వస్తే మధ్యలో తటస్థ పదాలను ఉపయోగించడం ముఖ్యం. అంటే, కథనాలలో పాత్రలను ఉదాహరణగా తీసుకుంటున్నప్పుడు గత కాలపు మూస లక్షణాలను ఉపయోగించకూడదు. ఉదాహరణకు: ‘అబ్బాయిలు ధైర్యంగా’, ‘బలంగా ఉన్నారు. ‘అమ్మాయిల్లా ఏడ్వకండి’, ‘అమ్మాయిలు సున్నితమైనవారు,’... ఇలాంటివి. వాటిని వీలైనంతవరకు తొలగించడమే మంచిది. పాఠంలోనూ, సాధనలోనూ అబ్బాయిలు–అమ్మాయిలు సమాన భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేలా చదువు ఉండాలి. వీటిని తరగతి గదుల్లోనే కాదు ఇతర నైపుణ్యాలను పెంచే కార్యక్రమాల్లోనూ భాగం చేయచ్చు.

అలాగే, కుటుంబ సభ్యుల మాటల్లోనూ, రోజువారీ పనుల్లోనూ ఈ లింగ నిబంధనలు పిల్లల మనస్సుల్లో బలంగా నాటుకుపోతాయి. అందుకని, పాఠశాలలు, కుటుంబాలు పిల్లలను లింగ సమానత్వంవైపు మళ్లించేందుకు కృషి చేయాలి. సమాజంలో లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడానికి కావల్సిన మార్పును తీసుకు రావాలంటే అన్ని స్థాయిలలో అందరూ కృషి చేయడమే దీనికి సరైన పరిష్కారం.

అవగాహన వర్క్‌షాప్స్‌
చాలావరకు ఇంటి దగ్గరే వివక్ష ఉంటుంది. చదువు అంటే తరగతి గదిలోనే కాదు ఎన్‌సిసి వంటి వాటిల్లోనూ అమ్మాయిలను పంపించేందుకు తల్లిదండ్రులు ముందుకురావాలి. పిల్లలను వయసుకు తగినట్టు గైడ్‌ చేయాలని మా టీచర్స్‌కి చెబుతుంటాం. కానీ, జెండర్‌ ని దృష్టిలో పెట్టుకొని కాదు. స్కూల్‌ పరిధులు దాటి కూడా పిల్లల నైపుణ్యాలు ఉండాలి. వివిధ రకాల వర్క్‌షాప్స్‌కి అటెండ్‌ అవ్వాలి. అందుకే.. ఆటలు, ఇంటర్‌స్కూల్‌ కాంపిటిషన్స్, ఇతర విద్యార్థులతో కలిసేలా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంటాం. పిల్లలను వేదికల మీద మాట్లాడనివ్వాలి. గెస్ట్‌ లెక్చరర్స్‌తో క్లాసులు ఇప్పించాలి. ఇవన్నీ కూడా అమ్మాయిలు–అబ్బాయిలు ఇద్దరూ సమానంగా పాల్గొనేవే. ఇలాంటప్పుడు వారిలోని ప్రతిభనే చూస్తారు తప్ప, వివక్ష అనేదానికి చోటుండదు. దీని వల్ల సమానత్వం అనేది దానికదే వస్తుంది.  
– సంగీతవర్మ, ప్రిన్సిపల్, రిచ్‌మండ్‌ హైస్కూల్, హైదరాబాద్‌

ఇద్దరూ విద్యార్థులే!
ఈ మధ్య కాలంలో స్కూల్లో ఏ కార్యక్రమాల్లో అయినా అమ్మాయిలే ముందంజలో ఉంటున్నారు. తరగతిగది వరకే కాకుండా ఇతర ఇంటరాక్టివ్‌ ప్రోగ్రామ్స్‌ కూడా ఏర్పాటు చేస్తుంటాం. కాకపోతే, గ్రామీణ స్థాయిలో అమ్మాయిలనే ఎక్కువ ఎడ్యుకేట్‌ చేయాల్సిన అవసరం ఉంది. సమానత్వం ఇంటి నుంచే మొదలవ్వాలి. తరగతిలో టీచర్‌కి అమ్మాయిలు, అబ్బాయిలు ఇద్దరూ విద్యార్థులే.
– శైలజా కులకర్ణి, టీచర్, జడ్‌పిహెచ్‌ఎస్, కల్హర్, సంగారెడ్డి

సున్నితత్త్వాన్ని ఇద్దరికీ నేర్పాలి..
‘నువ్వేమైనా అబ్బాయివా?’ అని అమ్మాయిలను. ‘నువ్వేమైనా అమ్మాయివా?’ అని అబ్బాయిలను మాటలు అనకూడదు. నాకంటే వాళ్లు ఎక్కువ, వీళ్లు తక్కువ అనే ఆలోచన కూడా రాకూడదు. సున్నితత్త్వాన్ని ఇద్దరికీ నేర్పించాలి. ఇద్దరికీ ఎదుటివారికి గౌరవం ఇవ్వడం నేర్పాలి. ఇద్దరికీ ధైర్యం నేర్పాలి. ఇద్దరికీ చదువు నేర్పాలి. ప్రపంచంలో అందరికీ సమానహక్కులు ఉన్నాయి. అన్నింటా సమానత్వం ఉండాలి. ఎదిగే క్రమంలో పడే ‘మాటలు’ వారి మనసులో బలంగా ముద్రవేస్తాయి.

మాటల ద్వారా కూడా ఇద్దరినీ వేరుగా చూడకూడదు. వీరే కాదు ఇప్పుడు ట్రాన్స్‌జెండర్లు కూడా తమ సత్తా చాటుతున్నారు. ఎవరినీ చులకన చేయకూడదు. మనం మాట్లాడే మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉమెన్‌ సేఫ్టీ, గర్ల్‌ సేఫ్టీ అని ఉంటాయి. ఎందుకో కూడా వాటిని వివరించగలగాలి. పీరియడ్స్‌ సమయంలో సెన్సిటైజ్‌ విషయంలో ప్రవర్తనలు వేరుగా ఉంటాయి. అబ్బాయిలకు కూడా ఇలాంటి విషయంలో అవగాహన కలిగించాలి. ఎదిగేక్రమంలో శరీరాకృతులు వేరుగా ఉంటాయి కానీ, మేధోపరంగా ఇద్దరూ ఒకటే. అవగాహన కల్పించడమే ముఖ్యం.  
– మేఘన ముసునూరి, ప్రిన్సిపల్, ఫౌంటెన్‌హెడ్‌ గ్లోబల్‌ స్కూల్‌ హైదరాబాద్‌

ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాలలో మహిళలు, బాలికలపై అన్ని రకాల వివక్ష, హింస, హానికరమైన పద్ధతులను అంతం చేయడం ద్వారా 2030 వరకు లింగసమానత్వాన్ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది ఎస్‌డిజి 5. మహిళల పూర్తి భాగస్వామ్యం, రాజకీయ, ఆర్థిక నిర్ణయాధికారం అన్నిస్థాయిలలో నాయకత్వానికి సమాన అవకాశాల కోసం పిలుపునిచ్చింది. 2015లో ఐక్యరాజ్యసమితి చేసిన 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో ఇది 5వది.

– నిర్మలారెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement