United Nations
-
వాడీవేడిగా ‘కాప్’ సదస్సు
బాకు/న్యూఢిల్లీ: భూతాపంలో పెరుగుదలను కట్టుదిట్టంచేసి పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా ప్రపంచదేశాలు ఒక్కతాటిమీదకొచ్చే ఐక్యరాజ్యసమితి చర్చావేదిక ‘కాప్’సదస్సు సోమవారం అజర్బైజాన్ దేశంలో ఆరంభమైంది. పర్యావరణ పరిరక్షణ కోసం భారీగా నిధులు సమీకరించడం, వెచ్చించడంసహా గత ఉమ్మడి కార్యాచరణ పటిష్ట అమలుపై సభ్యదేశాల మధ్య నెలకొన్న స్పర్థ సమసిపోవాలని ఆతిథ్య అజర్బైజాన్ దేశం ఈ సందర్భంగా కోరింది. నవంబర్ 22వ తేదీదాకా జరిగే కాన్ఫెరెన్స్ ఆఫ్ పార్టీస్(కాప్) 29వ సమావేశాలు అజర్‌బైజాన్‌లోని బాకు నగరంలో సోమవారం ప్రారంభంకాగా సభ్యదేశాల అగ్రనేతలు, ప్రతినిధి బృందాలు, పెద్దసంఖ్యలో పర్యావరణవేత్తలు పాల్గొన్నారు. శిలాజఇంధనాల అతివినియోగం దుష్ప్రభావాలను ఎదుర్కొంటున్న బాధిత గ్లోబల్ సౌత్ వర్ధమాన దేశాలకు కాలుష్యకారక సంపన్న దేశాలు రుణాలకు బదులు అధిక గ్రాంట్లు(నిధులు) ఇవ్వాలన్న ప్రధాన డిమాండ్ మళ్లీ తెరమీదకు తెచ్చారు. ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితి వాతావరణమార్పుల విభాగ కార్యనిర్వాహక కార్యదర్శి సీమన్ స్టియెల్ ప్రారంభోపన్యాసం చేశారు.‘‘అత్యధిక కర్భన ఉద్గారాలను వెదజల్లుతున్న దేశాల్లో మూడింట రెండొంతుల దేశాలు కాలుష్యాన్ని తగ్గించుకోలేకపోతే భారీమూల్యం చెల్లించుకోకతప్పదు. సరకు రవాణా గొలుసులు తెగిపోకుండానే కాలుష్యాన్ని తగ్గిస్తూ వస్తూత్పత్తిని కొనసాగించే సమర్థ చర్యల అమలుకు దేశాలు కంకణబద్దంకావాలి. లేదంటే ప్రపంచ ఆర్థికవ్యవస్థ కునారిల్లుతుంది. వాతావరణ పరిరక్షణకు నిధుల సమీకరణకు నవ్య మార్గాలను చూపించండి. ఇది ప్రతి ఒక్కదేశం బాధ్యత’’అని చెప్పారు. ఏమిటీ కాప్?వాతావరణాన్ని కాపాడేందుకు ప్రపంచదేశాలు ఒకచోట చేరి చర్చించే అంతర్జాతీయ కూటమి వేదికే కాప్. ఐరాస వాతావరణ మార్పు కూటమి(యూఎన్ఎఫ్సీసీసీ) కార్యనిర్వాహక విభాగాన్నే కాన్ఫెరెన్స్ ఆఫ్ పార్టీ(కాప్)గా పిలుస్తారు. వాతావరణ మార్పు ఒప్పందం అమలు, భవిష్యత్ కార్యాచరణ, కాలుష్యాల కట్టడి, శిలాస ఇంథనాల వాడకాన్ని కనిష్టానికి దించడం, వాతావరణమార్పుల దు్రష్పభావాల బారినపడిన పేదదేశాలకు నిధులు ఇచ్చేందుకు సంపన్న, కాలుష్యకారక దేశాలను ఒప్పించడం వంటి కీలక బాధ్యతలను కాప్ చూస్తుంది. అయితే భారీ నిధులిస్తామంటూ సమావేశాలప్పుడు భీష్మ ప్రతిజ్ఞలు చేస్తున్న సంపన్న దేశాలు తర్వాత నిధులివ్వకుండా ముఖంచాటేస్తున్నాయి. దీంతో సంపన్న దేశాల సంయుక్త ప్రకటనలు కార్యాచరణకు నోచుకోక కాగితాలకే పరిమితమవుతున్నాయి. పారిశ్రామికయుగం మొదలుకాకముందునాటితో పోలిస్తే ఉష్ణోగ్రతలో పెరుగుదలను 1.5 డిగ్రీ సెల్సియస్‌కు పరిమితం చేయాలని కాప్ కోరుకుంటోంది. కానీ అది ఈఏడాది ఏకంగా 3 డిగ్రీ సెల్సియస్ దాటి రాబోయే అతివృష్టి, అనావృష్టి, తుపాన్లు, వరదలు, కరువులు వంటి అనూహ్య వాతావరణ పరిస్థితులను సర్వసాధారణం చేసేస్తూ భావి తరాలకు భవిష్యత్తేలేకుండా చేస్తోంది. దారుణ దిశలో పయనిస్తున్నాం: కాప్ అధ్యక్షుడు కాప్29 అధ్యక్షుడు ముఖ్తార్ బాబాయేవ్ మాట్లాడారు. ‘‘మానవ కార్యకలాపాలు, అధికంగా శిలాజ ఇంధనాల వినియోగంతో భూతాపోన్నతి ఏటా 3 డిగ్రీసెల్సియస్ అధికమవుతోంది. ఈ పెడపోకడ ఇలాగే కొనసాగితే వందల కోట్ల ప్రజానీకం దారుణకష్టాల కడలిలో కొట్టుకుపోకతప్పదు. నూతన సమ్మిళిత లక్ష్యం(న్యూ కలెక్టివ్ క్వాంటిఫైడ్ గోల్–ఎన్సీక్యూజీ)ని సాధించాలంటే 2009లో ఏటా 100 బిలియన్ డాలర్ల నిధులివ్వాలన్న కాలంచెల్లిన నిధుల లక్ష్యాన్ని సవరించుకోవాల్సిందే. సమస్య తీవ్రత, విస్తృతిని దృష్టిలో ఉంచుకుని సభ్యదేశాలు మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలని, భూతాపం కట్టడిలో మెరుగైన భాగస్వామ్య పాత్ర పోషించాలి’’అని ముఖ్తార్ పిలుపునిచ్చారు. అయితే వర్ధమానదేశాలు తమ పరిధిలో కాలుష్యాన్ని తగ్గించుకునేందుకు గరిష్టంగా 6.85 ట్రిలియన్ డాలర్ల నిధులు అవసరమవుతాయని ఐరాస వాతావరణవిభాగం చెప్పడం గమనార్హం. -
నిధులు రావాలి! నిశ్చయం కావాలి!
పర్యావరణ మార్పుల సమస్యపై ప్రపంచ దేశాలు మరోసారి చర్చకు కూర్చున్నాయి. పర్యావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి (ఐరాస) శిఖరాగ్ర సదస్సు ‘కాప్–29’ అజర్‌బైజాన్‌లోని బాకూలో సోమవారం మొదలైంది. బొగ్గు, ముడిచమురు, సహజవాయువుల వినియోగం నుంచి దూరం జర గాలని చరిత్రాత్మక ఒప్పందం కుదిరిన ఏడాది తరువాత జరుగుతున్న ఈ 12 రోజుల మేధామథనం అనేక విధాల ప్రాధాన్యం సంతరించుకుంది. గడచిన 2023, ఆ వెంటనే వర్తమాన 2024... ఇలా వరుసగా రెండో ఏడాది కూడా అత్యధిక వేడిమి నిండిన వత్సరంగా రుజువవుతున్న వేళ జరుగు తున్న సదస్సు ఇది. అలాగే, అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన కొద్ది రోజులకే ఇది జరుగుతోంది. పర్యావరణ సంక్షోభం వట్టి నాటకమన్నది ఆది నుంచి ట్రంప్ వైఖరి కావడంతో మిగతా ప్రపంచమంతా బాకూ వైపు ఆసక్తిగా చూస్తోంది. నిజానికి, ఈ 2024 చరిత్రలోనే అత్యధిక ఉష్ణోగ్రతా నామ సంవత్సరం కానున్నట్లు కోపర్నికస్ క్లైమేట్ ఛేంజ్ సర్వీస్ లాంటి నివేదికలు సూచిస్తున్నాయి. పారిశ్రామికీకరణ ముందు నాటి కన్నా 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ మేర ఉష్ణోగ్రత ఎక్కువైన తొలి ఏడాదే ఇదే కానుంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, పర్యవసానంగా కరవు, తుపానులు, వరదలు ప్రపంచమంతటిపై ప్రభావం చూపుతున్నాయి. ప్రాణ నష్టం, ఆర్థిక నష్టం పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కాప్–29 జరుగుతుండడం గమనార్హం. గమనిస్తే, ప్రపంచ కాలుష్య ఉద్గారాలలో ఇప్పటికే చైనా ప్రథమ స్థానంలో, అమెరికా రెండో స్థానంలో ఉంటే, భారత్ మూడో స్థానంలో నిలిచింది. అయితే, ఈసారి సదస్సుకు అమెరికా, చైనా, భారత్, బ్రిటన్, జర్మనీ, బ్రెజిల్, ఫ్రాన్స్ దేశాల అగ్రనేతలు హాజరు కావడం లేదు. అధ్యక్షుడు బైడెన్ రావట్లేదు. కొత్తగా ఎన్నికైన ట్రంప్ ఎలాగూ రారు. అయితేనేం, అమెరికా ప్రభావం ఈ కాప్–29పై అమితంగా ఉండనుంది. నిరుటి చర్చల్లో చేసుకున్న ప్రధాన వాగ్దానానికి కట్టుబడడంలో అనేక దేశాలు విఫలమయ్యాయి. ఉదాహరణకు, అన్ని దేశాల కన్నా అత్యధికంగా ముడిచమురును ఉత్పత్తి చేస్తున్న అమెరికా తన పద్ధతి మార్చుకోనే లేదు. ఇప్పుడు ట్రంప్ గద్దెనెక్కినందున చమురు ఉత్పత్తి, వినియోగం పెరుగుతుందే తప్ప తగ్గే సూచన లేదు. పర్యావరణ పరిరక్షణ చర్యల నుంచి అమెరికా పూర్తి దూరం జరిగినా జరగవచ్చు. ఇది ప్రమాద ఘంటిక. అగ్ర దేశాలు హాజరు కాకున్నా సమస్య తీవ్రతయితే మారదు. వాతావరణ సంక్షోభ నివారణకు మరిన్ని నిధులవసరం. అందుకే, కాప్–29 కొత్త వాతావరణ పరిరక్షణనిధిని ప్రాధాన్యాంశంగా ఎంచుకుంది. వర్ధమాన దేశాలు తమ ఉద్గారాల సమస్యను దీటుగా ఎదుర్కొని, పెరుగుతున్న వాతావరణ ముప్పును వీలైనంత తగ్గించాలంటే ఆ దేశాలకు తగినంత ఆర్థిక సహాయం అవసరం. అందుకు 100 బిలియన్ డాలర్ల వార్షిక లక్ష్యాన్ని 2009లోనే నిర్ణయించారు. 2020 కల్లా దాన్ని చేరాలని భావించారు. కానీ, అంతకంతకూ పెరుగుతున్న వాతావరణ సంక్షోభ పరిస్థితుల మధ్య ఆ నిధులు ఇప్పుడు ఏ మూలకూ రావు. కాబట్టి, వర్తమాన పరిస్థితులకూ, అవసరాలకూ తగ్గట్టు దాన్ని ఇప్పుడు సవరించుకోవాల్సిన పరిస్థితి. భాగస్వామ్య పక్షాలైన 198 దేశాలకూ వీటో ఉన్న నేపథ్యంలో ఏకాభిప్రాయ సాధన సులభమేమీ కాదు. అలాగే, ఈ మొత్తంలో ఎంత మేర ప్రజాధనం సేకరించా లనేది కూడా కీలక ప్రశ్నే. అనేక దేశాలు ఆర్థిక భారంతో ఉన్న వేళ దీని పైనా అందరి వైఖరీ ఒకేలా లేదు. అయితే, చర్యలు చేపట్టడం ఆలస్యమైన కొద్దీ మరింత భారీగా నిధులు అవసరమవుతాయి. నిధులెంత కావాలన్నదే కాదు... వాటిని ఎలా సేకరించాలి, పర్యావరణ మార్పుల కష్టనష్టాల నుంచి కోలుకొనేందుకు దేశాలకు ఎలా ఆ నిధుల్ని పంచాలి, సంక్షోభ పరిష్కారానికి రూపొందించాల్సిన ఆర్థిక వ్యవస్థ ఏమిటనేది కూడా సదస్సులో కీలక చర్చనీయాంశాలే. పర్యావరణ, ఆర్థిక, మానవ నష్టాలను నిరోధించాలంటే పరిస్థితి చేతులు దాటక ముందే ఉద్గారాల్ని తగ్గించడం కీలకం. వాతావరణ ఉత్పాతాలతో విస్తృతంగా నష్టం, పర్యవసానాలు తప్పవు. నష్టం పెరిగిన కొద్దీ ఆ దేశాల పునరుజ్జీవానికి మరింత ఖర్చవుతుంది. ఇప్పటికే ఉక్కిరిబిక్కిరి అవుతున్న పుడమి పరిస్థితి మరింత క్షీణించకుండా ఉండాలంటే, తక్షణ చర్యలు అవసరం. అభివృద్ధి చెందిన దేశాలు గతంలో కోవిడ్–19 సమయంలో తమ పౌరులకూ, వ్యాపారాలకూ అండగా నిలిచేందుకు 48 నెలల్లోనే దాదాపు 8 లక్షల కోట్ల డాలర్లను అందించి, ఆ సవాలును ఎదుర్కొన్నాయి. అప్పటి కోవిడ్లానే ఇప్పుడీ పర్యావరణ మార్పు సమస్యనూ అంతే అత్యవసరంగా చూడడం ముఖ్యం. ప్రజాధనంతో పాటు ప్రైవేట్ రంగ ఆర్థిక సాయం కూడా లేకుంటే కష్టమని కాప్–29 బాధ్యులు సైతం తెగేసి చెబుతున్నారు. హరిత పర్యావరణ నిధి అంటూ పెట్టినా, సమకూరింది తక్కువే. ఇప్పటికైతే ఏటా కనీసం లక్ష కోట్ల డాలర్లు అవసరమంటున్నారు. అభివృద్ధి చెందిన దేశాలు బాధ్యతను విస్మరించి వ్యవహరిస్తుండడంతో, వర్ధమాన దేశాల స్వచ్ఛ అభివృద్ధి, దారిద్య్ర నిర్మూలనకు గండి పడుతోంది. అసలు ఆ నిధుల్లోనూ 60 శాతం పైగా రుణాలైతే, 30 శాతం పైగా ఈక్విటీలు. కేవలం 5 శాతమే గ్రాంట్లు. అసలే కునారిల్లుతున్న అనేక పేద దేశాలకు ఇది మోయలేని భారమే. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని, కాప్–29 చర్చించడం ముఖ్యం. బలమైన ఆర్థికవ్యవస్థగా రూపొందుతున్న భారత్ సైతం చొరవ తీసుకోవాలి. హరిత ఇంధన టెక్నాలజీ, పరిశోధన – అభివృద్ధి, తక్కువ ఖర్చు పరిష్కారాల వైపు ప్రపంచం దృష్టి సారించేలా చూడాలి. ఏమైనా, గండం గట్టెక్కాలంటే మరిన్ని నిధులు కావాలి. అదీ వేగంగా అందాలి. వనరుల సమీకరణ సాధ్యమేనని చరిత్ర చెబుతోంది గనక, ఇప్పుడిక రాజకీయ కృతనిశ్చయముందా అన్నదే ప్రశ్న. ఈ 12 రోజుల సదస్సులో దానికి సమాధానం స్పష్టం కానుంది. -
విజయసాయిరెడ్డికి అరుదైన అవకాశం
సాక్షి, విజయవాడ: వైఎస్సార్సీపీ నేత, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డికి అరుదైన అవకాశం దక్కింది. ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీ (UNGA) 29వ సెషన్‌కు వెళ్లే బృందంలో ఆయనకు స్థానం దక్కింది. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా తెలియజేశారాయన.న్యూయార్క్(అమెరికా)లోని యూఎన్జీఏ 29వ సెషన్లో పాల్గొనబోయే బృందంలో ఎంపిక కావడం గౌరవంగా భావిస్తున్నా. ఈ అవకాశం దక్కడం పట్ల ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.ఐరాస లాంటి గౌరవప్రదమైన వేదికపై దేశం తరఫున ప్రాతినిధ్యం వహించడంతో పాటు ప్రపంచ ఆసక్తులలో దేశ భాగస్వామ్యాలను మరింతంగా పెంచే అర్థవంతమైన చర్చల్లో పాల్గొనేందుకు ఎదురు చూస్తున్నాం అని ట్వీట్ చేశారాయన. నవంబర్ 18 నుంచి 23వ తేదీ దాకా ఈ సెషన్ జరగనుంది. -
లింగ సమానత్వంలో భారత్ ముందడుగు
న్యూఢిల్లీ: లింగ సమానత్వంలో భారత్ సాధిస్తున్న పురోగతి స్ఫూర్తిదాయకమని ఐక్యరాజ్యసమితి కొనియాడింది. అయితే సామాజిక కట్టుబాట్లు, పరిమిత శ్రామిక భాగస్వామ్యం, సరైన భద్రత లేకపోవడం లింగ సమానత్వానికి ఇంకా ఆటంకం కలిగిస్తున్నాయని అభిప్రాయపడింది. ఈ అంతరాన్ని పూడ్చడానికి ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ప్రయత్నాలు అవసరమని సూచించింది. దేశంలో మహిళల పురోగతి, సవాళ్లపై ఐరాస మహిళా వ్యూహాత్మక భాగస్వామ్యాల డైరెక్టర్ డేనియల్ సీమౌర్, భారత్‌లో ఐరాస మహిళల కంట్రీ రిప్రజెంటేటివ్ సుసాన్ జేన్ ఫెర్గూసన్ తమ అభిప్రాయాలను పంచుకున్నారు. మహిళల జీవితాలను మార్చడానికి, మహిళలు, బాలికల నిర్దిష్ట అవసరాలకు బడ్జెట్లో 6.8 శాతానికి నిధులు పెరిగాయన్నారు. ఆరోగ్యం, విద్య, ఆర్థిక రంగాల్లో అంతరాలను తొలగించడానికి బడ్జెట్ నిరంతర విస్తరణ అవసరమని నొక్కి చెప్పారు. ఈ లక్ష్యాలను పూర్తిగా చేరుకోవడానికి ప్రైవేట్ రంగ పెట్టుబడులు అవసరమని ఫెర్గూసన్ పేర్కొన్నారు. పంచాయతీలు, స్థానిక ప్రభుత్వ సంస్థల్లో మహిళల ప్రాతినిధ్యంతో నాయకత్వంలో కూడా పురోగతి కనిపిస్తోందని చెప్పారు. పార్లమెంటులో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఆమోదం పొందడం జాతీయ రాజకీయ ముఖచిత్రంపై ప్రభావాన్ని చూపుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. అయితే లింగ ఆధారిత హింస (జీబీవీ) దేశంలో నిరంతర సమస్యగా ఉందని, ఇది మహిళల భద్రత, స్వేచ్ఛకు ఆటంకం కలిగిస్తోందని అధికారులు ఎత్తిచూపారు. చట్టాలు అమల్లో ఉన్నప్పటికీ సామాజిక కట్టుబాట్లు మహిళలను అడ్డంకిగా మారాయన్నారు. మహిళల భద్రతపై దృష్టి సారించే కమ్యూనిటీ పోలీసింగ్ ప్రయత్నాలను ప్రవేశపెట్టడానికి, పోలీసులకు శిక్షణ ఇవ్వడానికి మధ్యప్రదేశ్ వంటి రాష్ట్ర ప్రభుత్వాలతో యూఎన్ ఉమెన్ సహకరిస్తోందని తెలిపారు. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2022–23 ప్రకారం దేశంలో మహిళా కార్మిక శక్తి భాగస్వామ్య రేటు 37 శాతానికి పెరిగినప్పటికీ, సవాళ్లు ఉన్నాయని, పిల్లల సంరక్షణ, సురక్షిత రవాణా, పనిప్రాంతంలో భద్రతతో మహిళలు మరిన్ని ఆర్థిక అవకాశాలు పొందగలుగుతారని సూచించారు. -
2100 నాటికి ఉష్ణోగ్రతలో... 3.1 డిగ్రీల పెరుగుదల!
వాతావరణ మార్పుల కట్టడి కోసం ప్రస్తుతం ప్రపంచ దేశాలు అమలు చేస్తున్న చర్యలు ఏమాత్రం సరిపోవని ఐక్యరాజ్యసమితి తేలి్చచెప్పింది. భూగోళంపై ఉష్ణోగ్రతల పెరుగుదలకు కారణమవుతున్న గ్రీన్హౌస్ వాయువుల ఉద్గారాలను అరికట్టడంలో ప్రపంచ దేశాలు ఘోరంగా విఫలమవుతున్నాయని ఎండగట్టింది. ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈ శతాబ్దం ఆఖరు నాటికి సగటు ఉష్ణోగ్రత మరో 3.1 డిగ్రీల సెల్సియస్(5.4 డిగ్రీల ఫారెన్‌హీట్) పెరుగుతుందని స్పష్టంచేసింది. ఈ మేరకు వార్షిక ఉద్గారాల నివేదికను ఐక్యరాజ్యసమితి ఇటీవల విడుదల చేసింది. వాస్తవానికి ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 డిగ్రీలకే(2.7 ఫారెన్‌హీట్) పరిమితం చేయాలన్న ప్రతిపాదనకు ప్రపంచదేశాలు మద్దతు పలికాయి. 2015లో పారిస్‌లో జరిగిన కాప్–21 సదస్సులో సంబంధిత ఒప్పందంపై సంతకాలు చేశాయి. భూగోళంపై జీవుల మనుగడ కొనసాగాలంటే ఉష్ణోగ్రతల పెరుగుదలను కట్టడి చేయాల్సిందేనని నిపుణులు స్పష్టంచేశారు. పారిస్ ఒప్పందంపై సంతకాలు చేసి దాదాపు పదేళ్లవుతున్నా పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా ఉండడం శోచనీయమని ఐక్యరాజ్యసమితి ఆక్షేపించింది. → ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 డిగ్రీలకు పరిమితం చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా, వాస్తవ పరిస్థితిని చూస్తే 2100 నాటికల్లా ఉష్ణోగ్రతలు 3.1 డిగ్రీల దాకా పెరిగిపోనున్నాయి. అంటే లక్ష్యం కంటే రెండింతలు కావడం గమనార్హం. ప్రభుత్వాల చర్యలు ఎంత నాసిరకంగా ఉన్నాయో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. → కర్బన ఉద్గారాలను అరికట్టడం, వాతావరణ మార్పులను నియంత్రించడం తక్షణావసరమని ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటేరస్ వెల్లడించారు. లేకపోతే మనమంతా మహావిపత్తును ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. → 2022 నుంచి 2023 దాకా ప్రపంచవ్యాప్తంగా గ్రీన్హౌస్ వాయువుల ఉద్గారాలు 1.3 శాతం పెరిగినట్లు ఒక అధ్యయనంలో వెల్లడయ్యింది. ఇది 57.1 గిగా టన్నుల కార్బన్ డయాక్సైడ్కు సమానం. → ఒకవేళ ఇప్పటినుంచి ఉద్గారాల నియంత్రణ చర్యలను పటిష్టంగా అమలు చేసినప్పటికీ ఉష్ణోగ్రతలు 2100 కల్లా 2.6 డిగ్రీల నుంచి 2.8 డిగ్రీల దాకా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. → కర్బన ఉద్గారాల్లో అధిక వాటా జీ20 దేశాలదే. వాతావరణ మార్పులను అరికట్టడంతో ఆయా దేశాలు దారుణగా విఫలమవుతున్నాయని ఐక్యరాజ్యసమితి అసంతృప్తి వ్యక్తం చేసింది. వాతావరణ లక్ష్యాల సాధనలో చాలా వెనుకంజలో ఉన్నాయని వెల్లడించింది. → ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 డిగ్రీలకు పరిమితం చేయాలంటే గ్రీన్హౌస్ వాయువుల ఉద్గారాలను 2030 నాటికి 42 శాతం, 2035 నాటికి 57 శాతం తగ్గించుకోవాల్సి ఉంటుంది. అది దాదాపు అసాధ్యమేనని నిపుణులు అంటున్నారు. → ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో కాన్ఫరెన్స్ ఆఫ్ పారీ్టస్(కాప్–29) సదస్సు వచ్చే నెలలో అజర్బైజాన్లో జరుగనుంది. వాతావరణ మార్పుల నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ దిశగా ఈ సదస్సులో కీలక తీర్మానాలు ఆమోదిస్తారని పర్యావరణ ప్రేమికులు ఆశగా ఎదురు చూస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
నానాటికీ నీరసిస్తున్న ఐక్యరాజ్యసమితి
ఇటీవల పరిణామాలను చూస్తే ఎవరికైనా ఐక్య రాజ్యసమితి ఉత్సవ విగ్రహంగా మారుతోందనే అభిప్రాయం కలుగక మానదు. యుద్ధ జ్వాలల నుంచి తమను తాము కాపాడుకోవడానికి, శాంతి యుత ప్రపంచ స్థాపనకు మానవులలో ఉన్న అకుంఠిత ఆశయాలే ఐక్య రాజ్యసమితి వంటి అంతర్జాతీయ సంస్థ స్థాపనకు దారి తీశాయి.మొదటి ప్రపంచ యుద్ధం ముగియడంతో ‘నానాజాతి సమితి’ని ఏర్పాటు చేసి ప్రపంచ శాంతిని పరిరక్షించే బాధ్యతను దానికి కట్ట బెట్టాయి పెద్ద రాజ్యాలు. ఈ సమితి ఎన్నో రకాల శాంతి మార్గాలను సూచిస్తూ అందులో ముఖ్య మైనదిగా... నిరాయుధీకరణంను సూచించింది. దానిని పెడచెవిన పెట్టిన ప్రపంచ దేశాలు ఆయు ధాలను సమీకరించుకొని ఆధిపత్య పోరు మొదలు పెట్టి, రెండవ ప్రపంచ యుద్ధం ముంగిట మాన వాళి మరోసారి నిలబడేలా చేశాయి.యుద్ధం ముగిసిన వెంటనే నానాజాతి వైఫల్యం వల్లనే రెండో ప్రపంచ యుద్ధం జరిగిందని భావించి... దాని స్థానంలో ఐక్యరాజ్య సమితిని ఏర్పాటు చేశాయి ప్రపంచ దేశాలు. ఇక్కడ గమనించవలసిన విషయమేమిటంటే... మొదటి, రెండవ ప్రపంచ యుద్ధాల ముందు ఆయా దేశాలు యుద్ధం రాబోతుందని గ్రహించి శాంతి సభలు నిర్వహించడం, చర్చలు జరపటం జరి పాయి. సంధులు చేసుకున్నాయి. అయినా ప్రపంచ యుద్ధాలు ఆగలేదు. ఇప్పుడు ఐరాసలో సభ్యులుగా 193 దేశాలు ఉన్నాయి. ఇందులో వీటో అధికారం ఉన్న 5 అగ్ర రాజ్యాలు ఉన్నాయి. 25 రకాలుగా పనిచేసే వివిధ రకాల సంస్థలు,అంతర్జాతీయ న్యాయస్థానం ఐరాస కింద పని చేస్తున్నాయి. అయినా కూడా రగిలిపోతున్న యుద్ధాలను ఆపలేకపోవడం బాధాకరం. అలా అని ఐరాస సాధించిన విజయాలు లేవని కాదు. రష్యా–ఇరాన్ , ఫ్రాన్స్– సిరియా– లెబనాన్, ఇండోనేషియా సమస్య, ఈజిప్ట్ అంశం, చెకోస్లావేకియా అంశం... ఇలా ఐరాస మధ్య వర్తిత్వంలో శాంతి ఒప్పందాల ద్వారా సమస్య లను పరిష్కరించుకున్న ఉదంతాలు చాలానే ఉన్నాయి. అలాగే అభివృద్ధి చెందుతున్న దేశాలకు వివిధ రకాల సాయం అందడానికీ ఐరాస ఎంతగానో కృషి చేస్తోంది.ఎన్ని విజయాలు సాధించినప్పటికీ ఐక్యరాజ్య సమితి అగ్రరాజ్యాల జోలికి రానంతవరకే సంస్థకు గౌరవం దక్కుతోంది. ఆ మేరకే దానికి ఆర్థిక వనరులు అందుతున్నాయి. అంతర్జాతీయ శాంతికి అడ్డంకిగా మారిన అణ్వాయుధాల తయారీ, విని యోగానికి అగ్ర రాజ్యాలు స్వస్తి పలకవలసిందిగా యూఎన్ఓ విజ్ఞప్తి చేసినప్పటికీ అవి పెడచెవిన పెడుతున్నాయి. పైగా ప్రస్తుత తరుణంలో అగ్ర రాజ్యాల షాడో దేశాల మధ్య యుద్ధం మొదలై ఆయుధ గోడౌన్ల తలుపులు తెరుచుకుంటున్నాయి. అగ్ర రాజ్యాల ప్రోద్బలంతోనే ఇవి బరిలో దిగిన ప్పుడు ఇంకా ఐరాస మాట వినే పరిస్థితి లేదనిపించక మానదు.ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ అయిన ఆంటోనియో గుటెరస్‌ను తమ దేశంలోకి రాకుండా బహిష్కరిస్తున్నాం అంటున్న ఇజ్రాయెల్‌కు అగ్రరాజ్యమైన అమెరికా, బ్రిటన్లు మద్దతుగా ఉన్న విషయం తెలిసిందే. గాజాను పూర్తిగా నేల మట్టం చేసి, లెబనాన్‌ను పావు వంతు ఆక్రమించి, ఇరాన్‌పై పూర్తిస్థాయిలో యుద్ధానికి సిద్ధం అవు తున్న ఇజ్రాయిల్‌ను అగ్రరాజ్యాలు నిలువరించ లేకపోతున్నాయి. ఓ పక్క ఇజ్రాయెల్‌పై దాడి చేస్తూనే అరబ్ దేశాలను ఏకం చేయడానికి ఇరాన్ ముమ్మర ప్రయత్నాలు చేస్తుంటే ఐరాస ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోవాల్సి వస్తోంది. అంతేకాకుండా ఉక్రెయిన్ విషయంలో కూడా అగ్రరాజ్యాలు గ్రూపులుగా సంఘటిత మవుతూ ఉంటే ఐరాస ఏమి చేయలేక చూస్తూ ఉండిపోతోంది. ఈ పరిస్థితులను చూస్తుంటే ఏ ఆశయాలతో అయితే ఐక్యరాజ్య సమితిని స్థాపించారో... వాటిని సాధించలేని స్థితికి ఐరాస చేరు కుందని చెప్పక తప్పదు.వి.వి. రమణ వ్యాసకర్త ఉపాధ్యాయులు ‘ 89198 62019 -
ప్రమాదకర యుద్ధక్రీడ
ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన దాడితో ఏడాది క్రితం అక్టోబర్ 7న పశ్చిమాసియాలో చెలరేగిన హింసాత్మక సంఘర్షణ ఇప్పుడు మరో మలుపు తీసుకుంది. ముస్లిమ్‌లలోని షియా వర్గానికి చెందిన తీవ్రవాద హెజ్బొల్లా బృందానికి 32 ఏళ్ళుగా సారథ్యం వహిస్తున్న అధినేత హసన్ నస్రల్లాను భీకర గగనతల దాడుల ద్వారా ఇజ్రాయెల్ మట్టుబెట్టిన తీరు ఒక్కసారిగా అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. లెబనాన్‌లోని ఇటీవలి పేజర్లు, వాకీటాకీల పేలుళ్ళ ఉదంతం మరువక ముందే ఇజ్రాయెల్ మరోసారి తన గూఢచర్య, సైనిక సత్తా చాటిన వైనం ముక్కున వేలేసుకొనేలా చేసింది. లెబనాన్‌లో తాత్కాలిక కాల్పుల విరమణకు అమెరికా, ఫ్రాన్స్‌లు గురువారం పిలుపునిచ్చినప్పుడు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ దాన్ని సమర్థిస్తున్నారనే అందరూ భావించారు. ఒక్క రోజు గడిచిందో లేదో... ఒకపక్క న్యూయార్క్‌లో ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ సమావేశం సాగుతుండగానే, మరోపక్క నెతన్యాహూ మాత్రం బీరుట్‌పై వైమానిక దాడికీ, హెజ్బొల్లా అధినేతను మట్టుబెట్టడానికీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశారు. ఎవరెన్ని చెప్పినా, ఐరాసలో ఎన్ని తీర్మానాలు చేసినా ఘర్షణను కొనసాగించాలనే ఇజ్రాయెల్ మంకుపట్టుతో ముందుకు పోతున్నట్టు తేటతెల్లమైంది. చిత్రమేమిటంటే, లెబనాన్‌లో కాల్పుల విరమణను బయట తోసిపుచ్చిన నెతన్యాహూ ప్రైవేటుగా మాత్రం అందుకు అంగీకరించారు. అమెరికా, ఫ్రాన్స్ అధికారులు సైతం చెప్పినమాట అదే. తీరా దాడులు మాత్రం నెతన్యాహూ కొనసాగించారు. కొన్ని నెలలుగా ఆయన తీరు అంతే. అమెరికాకు నచ్చే మాటలు పైకి చెబుతారు. కానీ, చివరకు మాత్రం తాను ఏదనుకుంటే అదే చేస్తున్నారు. అమెరికా సైతం పైకి శాంతి వచనాలు చెబుతున్నా, ఇజ్రాయెల్‌కు ఆయుధాల సరఫరా ఆపలేదు. ఆ ఆయుధాలను వాడుకుంటూ ఇజ్రాయెల్ పేట్రేగిపోతుంటే ఆపుతున్నదీ లేదు. ఇప్పటికే కొన్ని వేల మంది గాజాలో ప్రాణాలు కోల్పోయారు. గత వారంలో లెబనాన్‌లోనూ వెయ్యిమంది మరణించారు. అక్కడి జనాభాలో దాదాపు అయిదోవంతు మంది నిర్వాసితులయ్యారు. భవనాలపై బాంబు దాడులకు జడిసి, ప్రజలు వీధుల్లో నిద్రిస్తున్న పరిస్థితి. గగనతలం నుంచి బాంబులు ఆగలేదు. భూమార్గంలోనూ ముప్పు తప్పదన్న భయం తప్పడం లేదు. మరోపక్క ఇజ్రాయెల్ చేపట్టిన పని ఇంకా పూర్తి కాలేదని ఆ దేశ ప్రధాని ప్రకటించడంతో ఈ తలనొప్పి తగ్గేలా లేదు.అలాగని హెజ్బొల్లా అధినేత మరణానికి యావత్ లెబనాన్ బాధపడుతోందని అనలేం. తీవ్ర హింసకు పాల్పడి, ఎందరి మరణానికో కారణమైన నస్రల్లా పట్ల లెబనాన్, ఇజ్రాయెల్, సిరియా సహా పలు ప్రాంతాల్లో ప్రజానీకానికి పెద్దగా ప్రేమ ఏమీ లేదు. అరబ్ ప్రపంచంతో పాటు సాక్షాత్తూ లెబనాన్‌లో సైతం ఆయన మరణానికి సోషల్ మీడియాలో పెద్దయెత్తున ఆనందం వ్యక్తం కావడం గమనార్హం. సిరియన్ నియంత బషర్ అల్–అసద్‌తో చేతులు కలిపి తమ వద్ద ప్రజాస్వామ్య ఉద్యమాన్ని హెజ్బొల్లా అణిచివేయడంతో వారిలో ఆగ్రహం నెలకొంది. అందుకే ఈ రకమైన భావన వ్యక్తమైంది. లెబనీస్ ప్రభుత్వం ఏకపక్షంగా కాల్పుల విరమణ ప్రకటించి, తద్వారా లెబనీస్ సైన్యం హెజ్బొల్లా చేతుల్లోని దక్షిణ లెబనాన్‌పై నియంత్రణ సాధించి, సరిహద్దు వెంట శాంతి నెలకొల్పాల నేది వారి అభ్యర్థన. నిజానికి, ఇజ్రాయెల్‌తో యుద్ధం తాము కోరుకోకపోయినా, ఇరాన్ ఆదేశాలతో లెబనీస్‌ను నస్రల్లా దీనిలోకి లాగారని వారి వాదన. ఇలాగే సాగితే గాజా భూఖండం లాగా బీరుట్ సైతం ధ్వంసమవుతుందనీ, అంతర్యుద్ధం మళ్ళీ వస్తుందనీ లెబనీయుల భయం. ముందు ఇజ్రాయెల్, సౌదీ అరేబియా మధ్య సంబంధాలు సాధారణస్థితికి రావడం ముఖ్యం. అందుకు సౌదీలూ సిద్ధమే! కాకపోతే, రెండు దేశాల ఏర్పాటనే పరిష్కార సూత్రంతో పశ్చిమ తీరం లోని పాలెస్తీనా అథారిటీతో చర్చలు జరిపేందుకు ఇజ్రాయెల్ ముందుకు రావాలన్నది వారి షరతు. వ్యవహారం అక్కడే పీటముడి పడింది. ఇరాన్‌కు నెతన్యాహూ హెచ్చరిక, హెజ్బొల్లా నేత హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామంటూ ఇరాన్ సుప్రీమ్ లీడర్ అయతొల్లా ఖమేనీ ప్రతిజ్ఞ, ఇరాన్ అండతో పెచ్చరిల్లుతున్న ఇతర వర్గాల వ్యవహారం... అంతా చూస్తుంటే ఇక ఇది అంతులేని కథే! నిజానికి, లెబనాన్, గాజాల్లోని తీవ్రవాద వర్గాలను హతమార్చాలనే ఇజ్రాయెల్ సైనిక విధానం వల్ల తాత్కా లిక లాభాలే తప్ప, శాశ్వత ప్రయోజనం ఉండదు. ఆ మధ్య సాక్షాత్తూ ఇరాన్ రాజధాని టెహరాన్‌లో హమాస్ నేత ఇస్మాయిల్ హనీయే, ఇప్పుడు బీరుట్లో హెజ్బొల్లా అధినేత, వెంటనే అదే గ్రూపులోని మరో కీలక నేత నబిల్ కౌక్... ఇలా పలువురిని ఇజ్రాయెల్ చంపేసింది. కానీ ఇలాంటి సంస్థల్లో ఒకరు పోతే మరొకరొస్తారు. పైగా ఇజ్రాయెల్ దూకుడు వల్ల ఇరాన్‌లోని కొత్త సంస్కరణవాద సర్కారూ చేసేదేమీ లేక, తీవ్రంగా ప్రతిస్పందించక తప్పదు. అప్పుడు ముడి మరింత బిగుస్తుంది. అగ్రదేశాల స్వార్థం, ప్రపంచ శాంతికి కృషి చేయాల్సిన అంతర్జాతీయ సంస్థల సంపూర్ణ వైఫల్యం ఈ దీర్ఘకాలిక సమస్యకూ, ఏడాదిగా ఆగని మారణహోమానికీ కారణం. పాలెస్తీనాలో ఇజ్రాయెల్ దురాక్రమణకు వచ్చే ఏడాదిలోగా ముగింపు పలకాలని ఐరాస తీర్మానించిన కొద్దిరోజులకే ఇలా జరిగిందంటే ఏమనాలి! ఐరాసకు కోరలు లేని పరిస్థితుల్లో... ప్రపంచానికి సరికొత్త శాంతిసాధన వ్యవస్థ అవసరం కనిపిస్తోంది. నెతన్యాహూ ఇలాగే తన దూకుడు కొనసాగిస్తే, పశ్చిమాసియాలో పరిస్థితి మరింత దిగజారుతుంది. లెబనాన్‌లో సైతం మరో గాజాను ఇజ్రాయెల్ సృష్టించక ముందే ప్రపంచ దేశాలు కళ్ళు తెరవాలి. నిర్బంధంగానైనా కాల్పుల విరమణను సాధించాలి. లేదంటే, పశ్చిమాసియాపై యుద్ధ మేఘాలు మరింత విస్తరిస్తాయి. ప్రపంచాన్ని చీకటితో కమ్మేస్తాయి. -
ఉగ్రవాదాన్ని ఎగదోస్తే తీవ్ర పరిణామాలే
ఐక్యరాజ్యసమితి: జమ్మూకశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్యసమితిలో ప్రస్తావించిన పాకిస్తాన్‌కు భారత్ గట్టిగా బదులిచ్చింది. భారత్‌కు వ్యతిరేకంగా సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తే తీవ్ర పరిణామాలను స్వయంగా ఆహ్వానించినట్లే అవుతుందన్న సంగతి తెలుసుకోవాలని హితవు పలికింది. ప్రపంచవ్యాప్తంగా జరిగిన పలు ఉగ్రవాద దాడులపై పాకిస్తాన్ వేలిముద్రలు ఉన్నాయని స్పష్టంచేసింది. ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో శుక్రవారం భారత దౌత్యవేత్త భవిక మంగళానందన్ మాట్లాడారు. ఇదే సభలో తాజాగా పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ జమ్మూకశ్మీర్ అంశాన్ని ప్రస్తావించారు. ఆర్టికల్ 370పై మాట్లాడారు. దీనిపై భవిక మంగళానందన్ ఘాటుగా స్పందించారు. సైన్యం పెత్తనం కింద నలుగుతూ ఉగ్రవాదాన్ని ఉత్పత్తి చేసే దేశమైన పాకిస్తాన్ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ గురించి మాట్లాడడం ఏమటని నిలదీశారు. ఎన్నికల్లో విచ్చలవిడిగా రిగ్గింగ్‌లు జరిగే దేశం ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతోందని ఎద్దేవా చేశారు. భారతదేశ భూభాగాన్ని కబళించేందుకు పాక్ కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ఆటంకాలు సృష్టించడానికి ఉగ్రవాదాన్ని నమ్ముకుంటోందని ధ్వజమెత్తారు. ఉగ్రవాదానికి, మాదక ద్రవ్యాల వ్యాపారానికి, చీకటి నేరాలకు మారుపేరైన పాకిస్తాన్‌కు భారత్ గురించి నోరువిప్పే అర్హత లేదని భవిక మంగళానందన్ పరోక్షంగా హెచ్చరించారు.పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని పొరుగు దేశాలపై ఒక ఆయుధంగా ప్రయోగిస్తోందన్న సంగతి ప్రపంచం మొత్తానికి తెలుసని పేర్కొన్నారు. తమ దేశ పార్లమెంట్‌పై, ఆర్థిక రాజధాని ముంబై నగరంపై, మార్కెట్లపై, యాత్రా మార్గాలపై దాడులు చేసిన నీచ చరిత్ర పాకిస్తాన్ ఉందని నిప్పులు చెరిగారు. అలాంటి ధూర్త దేశం హింస గురించి నీతులు చెప్పడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. అల్‌ఖైదా ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్‌కు ఆశ్రయం ఇచ్చిన దేశం ఏమిటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. -
రెండు మ్యాప్‌లతో ఐరాస వేదికపై నెతన్యాహు.. భారత్ ఎటువైపు అంటే
హెజ్బొల్లాను అంతం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ తీవ్ర స్థాయిలో దాడులు జరుపుతోంది. అటు ఐక్యరాజ్యసమితి సమావేశాల్లోనూ.. లెబనాన్ సరిహద్దులో తమ లక్ష్యాలను సాధించే వరకు హెజ్బొల్లాపై పోరాటం ఆగదని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. ఇప్పటికే హమాస్ సగం బలగాలను అంతం చేశామన్నారు. వారు లొంగిపోకపోతే పూర్తి విజయం సాధించే వరకు పోరాడతామన్నారు.శుక్రవారం న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమతి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు మాట్లాడుతూ.. తన చేతుల్లో రెండు మ్యాప్‌లను ప్రదర్శించారు. అతని కుడి చేతిలోఉన్న మ్యాప్‌లో మిడిల్ ఈస్ట్‌తో పాటు ఇరాన్, ఇరాక్, సిరియా, యెమెన్ దేశాలకు నలుపు రంగు పెయింట్ వేశారు. ఆ మ్యాప్‌పై ద కర్స్(శాపం) అని రాసి ఉన్నది.ఇక ఒక ఎడమ చేతిలో ఉన్న మ్యాప్‌లో ఈజిప్ట్, సుడాన్, సౌదీ అరేబియా, ఇండియా దేశాలు ఉన్నాయి. ఈ దేశాలను హైలెట్ చేస్తూ గ్రీన్ కలర్ పెయింట్ వేశారు. ఆ మ్యాప్‌పై ద బ్లెస్సింగ్(దీవెన) అని రాసి ఉన్నది అయితే ఆ రెండు మ్యాపుల్లోనూ .. పాలస్తీనా కనిపిస్తున్న ఆనవాళ్లు లేవు. గ్రీన్ మ్యాప్ లేదా బ్లాక్ కలర్ మ్యాపుల్లో .. పాలస్తీనాను చూపించకపోవడం గమనార్హం.ప్రస్తుతం జరుగుతున్న ఘర్షణకు ఇరాన్ కారణమని నెతన్యాహు ఆరోపించారు. ఇరాన్‌తో పాటు దాని మిత్రదేశాలు యుద్ధానికి ఆజ్యం పోస్తున్నట్లు పేర్కొన్నారు. . ఇక గ్రీన్ మ్యాప్‌లో ఉన్న దేశాలు ఇజ్రాయిల్‌తో సన్నిహిత సంబంధాలు పెట్టుకుని ఉన్నట్లు తెలిపారు. లెబనాన్, సిరియా, యెమెన్ దేశాల్లో జరుగుతున్న హింసకు ఇరాన్ ప్రధాన కారణమని తెలిపారు. లెబనాన్‌లోని హిజ్బొల్లాకు, గాజాలోని హమాస్‌కు, యెమెన్‌లోని హౌతీలకు ఆర్థిక, సైనిక సహకారాన్ని ఇరాన్ అందిస్తున్నట్లు ఆరోపించారు. ఇరాన్ మిత్రదేశాల నుంచి తమ భూభాగాన్ని రక్షించుకుంటున్నట్లు ఇజ్రాయిల్ ప్రధాని పేర్కొన్నారు.ఒకవేళ మీరు దాడి చేస్తే, అప్పుడు మేం తిరిగి దాడి చేస్తామని ఇరాన్‌కు వార్నింగ్ ఇచ్చారు. యూఎన్ జనరల్ అసెంబ్లీలో నెతాన్యహూ మాట్లాడుతున్న సమయంలో కొందరు దౌత్యవేత్తలు నిరసనతో వాకౌట్ చేశారు. ఇరాన్ దూకుడు వల్లే లెబనాన్, గాజాలపై దాడి చేయాల్సి వచ్చిందని చెప్పారు. హిజ్బొల్లా యుద్ధ మార్గాన్ని ఎంచుకున్నంత కాలం.. వారిని అంతం చేయడం తప్ప ఇజ్రాయెల్‌కు వేరే మార్గం లేదని స్పష్టం చేశారునెతాన్యహూ పట్టుకున్న గ్రీన్ మ్యాప్‌లో ఇండియా ఉండడం గమనార్హం. ఇండియాతో తమకు మంచి రిలేషన్స్ ఉన్నాయని చెప్పేందుకు ఆ మ్యాప్‌లో ఇండియాను చూపించినట్లు తెలుస్తోంది. ఇటీవల ఇండియా, ఇజ్రాయిల్ మధ్య సత్సంబంధాలు నెలకొన్నాయి. డిఫెన్స్, టెక్నాలజీ రంగంలో రెండు దేశాలు వాణిజ్యం పెంచుకున్నాయి. పాలస్తీనా స్వయంప్రతిపత్తికి ఇండియా సపోర్టు ఇస్తున్నది. అయితే అదే సమయంలో ఇజ్రాయిల్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగిస్తున్నది. -
హెజ్బొల్లాపై యుద్ధం ఆగదు
ఐక్యరాజ్యసమితి: ఉత్తర ఇజ్రాయెల్ సరిహద్దు వెంట తరచూ తమపై కవి్వంపు దాడులు చేస్తున్న హెజ్బొల్లాపై తమ వైమానిక దాడులను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఐక్యరాజ్యసమితి సాక్షిగా సమరి్థంచుకున్నారు. హెజ్బొల్లా సాయుధ సంస్థపై పోరాటం ఆపబోమని, విజయం సాధించేదాకా పోరు కొనసాగుతుందని పునరుద్ఘాటించారు. న్యూయార్క్ నగరంలో ఐరాస సర్వ సభ్య సమావేశాల సందర్భంగా శుక్రవారం నెతన్యాహూ ప్రసంగించారు. హెజ్బొల్లాపై దాడులు ఆపబోమని చెప్పి అమెరికా జోక్యంతో పుట్టుకొస్తున్న కాల్పులవిరమణ ప్రతిపాదనలకు నెతన్యాహూ పురిట్లోనే సంధికొట్టారు. ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలు కొన్ని.. రోజూ రాకెట్ దాడులను సహించం ‘‘పొంచిఉన్న ప్రమాదాన్ని తప్పించాల్సిన కర్తవ్యం ఇజ్రాయెల్‌పై ఉంది. మెక్సికోతో సరిహద్దును పంచుకుంటున్న అమెరికా నగరాలు ఎల్ పాసో, శాండిగోలపైకి ఉగ్రవాదులు దాడులు చేస్తే జనం పారిపోయి నగరాలు నిర్మానుష్యంగా మారితే అమెరికా ఎన్ని రోజులు చూస్తూ ఊరుకుంటుంది?. మేం కూడా అంతే. దాదాపు ఏడాదికాలంగా హెజ్బొల్లా దాడులను భరిస్తున్నాం. మాలో సహనం నశించింది. ఇక చాలు. సొంతిళ్లను వదిలి వెళ్లిన 60,000 మంది సరిహద్దు ప్రాంతాల ఇజ్రాయెలీలను సొంతిళ్లకు చేర్చాల్సిన బాధ్యత మాపై ఉంది. సరిహద్దు వెంట ఇప్పుడు మేం చేస్తున్నది కూడా అదే. మా లక్ష్యం నెరవేరేదాకా హెజ్బొల్లాపై దాడులను ఆపేది లేదు’’ అని నెతన్యాçహూ అన్నారు. అందుకే వచ్చా ‘‘నిజానికి ఈ ఏడాది ఐరాసలో మాట్లాడేందుకు రావొద్దనుకున్నా. అస్థిత్వం కోసం గాజా్రస్టిప్‌పై సైనిక చర్య మొదలయ్యాక నా దేశం యుద్ధంలో మునిగిపోయింది. అయితే ఐరాస పోడియం నుంచే పలు దేశాధినేతలు వల్లెవేస్తున్న అబద్ధాలు, వదంతులకు చరమగీతం పాడేందుకే ముక్కుసూటిగా మాట్లాడుతున్నా. ఇరాన్ శాంతిని కోరుకుంటా అంటుంది కానీ చేసేది వేరేలా ఉంటుంది. ఒక్కటి స్పష్టంగా చెబుతున్నా. మాపై ఎవరు దాడి చేస్తే వాళ్లపై దాడి చేస్తాం. ఈ ప్రాంతంలో ఎన్నో సమస్యలకు ఇరాన్ మూల కారణం’’ అని అన్నారు. 90% హమాస్ రాకెట్లు ధ్వంసంచేశాం‘‘గాజాలో యుద్ధం తుది దశకు వచి్చంది. ఇక హమాస్ లొంగిపోవడమే మిగిలి ఉంది. ఆయుధాలు వీడి బందీలను వదిలేయాలి. లొంగిపోబోమని మొండికేస్తే గెలిచేదాకా యుద్ధంచేస్తాం. సంపూర్ణ విజయమే మా లక్ష్యం. దీనికి మరో ప్రత్యామ్నాయమే లేదు. యుద్ధబాటలో హమాస్ పయనించడం మొదలెట్టాక మాకు కూడా ఇంకో మార్గం లేకుండాపోయింది. 90 % హమాస్ రాకెట్లను ధ్వంసంచేశాం. 40వేల హమాస్ బలగాల్లో సగం మంది చనిపోవడమో లేదంటే మేం వాళ్లను బందీలుగా పట్టుకోవడమో జరిగింది అని అన్నారు.ఓవైపు ఆశీస్సులు... మరోవైపు శాపంఆశీస్సులు, శాపం అనే పేర్లు పెట్టి రెండు భిన్న ప్రాంతాల భౌగోళిక పటాలను నెతన్యాహూ పట్టుకొచ్చి వివరించారు. ‘‘ ఆశీస్సులు కావాలో, శాపం కావాలో ప్రపంచదేశాలు తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది. అరబ్ దేశాలతో మైత్రి బంధం పటిష్టం చేసుకుంటూ ఇజ్రాయెల్.. ఆసి యా, యూరప్‌ల మధ్య భూతల సేతువును నిర్మిస్తూ ఇజ్రాయెల్ ఆశీర్వదిస్తోంది. ఇంకో మ్యాప్ మొత్తం శాపాలతో నిండిపోయింది. హిందూ మహాసముద్రం నుంచి మధ్యధరాసముద్రం దాకా పరుచుకున్న ఉగ్రనీడ ఇది. ఇది ప్రపంచదేశాలకు శాపం. ఇరాన్లో ఇజ్రాయెల్ చేరుకోలేనంత దూరంలో ఏ భూమీ లేదు’’ అంటూ తప్పనిపరిస్థితుల్లో అవసరమైతే ఇరాన్‌పైనా దాడి చేస్తామని పరోక్షంగా హెచ్చరించారు. నెతన్యాహూ తెచి్చన మ్యాప్‌లో గాజా్రస్టిప్ మొత్తాన్నీ ఇజ్రాయెల్‌లో భాగంగానే చూపారు. హమాస్, హెజ్బొల్లాలపై పోరాడుతున్న తమ సైనికులను పొగుడుతూ నెతన్యాహూ చేస్తున్న ప్రసంగం వినడం ఇష్టంలేని చాలా మంది ప్రపంచ నేతలు ఆయన ప్రసంగం మొదలెట్టగానే హాల్ నుంచి వెళ్లిపోయారు. -
మైనార్టీల అణచివేత.. చైనాపై అమెరికా ఆగ్రహం
న్యూయార్క్: జిన్జియాంగ్లో ఉయిగర్ ముస్లింలు, ఇతర మైనార్టీల అణచివేతపై చర్యలు తీసుకోవాలని చైనాకు అమెరికా పిలుపునిచ్చింది. ఉయిగర్ ముస్లింలపై వివక్ష, అణచివేతను అంతం చేయాలని పేర్కొంది. జిన్జింయంగ్లో మానవ హక్కులపై ఐక్యరాజ్యసమితి నివేదిక విడుదలై రెండేళ్లు గడిచిన సందర్భంగా అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. ఉయిగర్ ముస్లింల విషయంలో ఇప్పటివరకు చైనా తీసుకుంటున్న చర్యలపై అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు.జిన్జియాంగ్లో చాలా దారుణంగా మానవ హక్కుల ఉల్లంఘటన జరుగుతోందని ఐక్యరాజ్య సమితి 2022లో నివేదిక విడుదల చేసింది. రెండేళ్ల గడిచిన సందర్భంగా మాథ్యూ విల్లర్ ఎక్స్ వేదికగా స్పందించారు.Two years since the UN High Commissioner for Human Rights released an assessment on human rights violations in Xinjiang, the U.S. continues to urge the PRC to take immediate action and end the ongoing repression of Muslim Uyghurs and other ethnic and religious minority groups.— Matthew Miller (@StateDeptSpox) August 30, 2024 ‘‘చైనాలోని జిన్జియాంగ్లో మానవ హక్కుల ఉల్లంఘనలపై ఐక్యరాజ్యసమితి హైకమిషనర్ నివేదిక విడుదల చేసి రెండేళ్లు పూర్తి అయింది. ఇప్పటికైనా పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా తక్షణ చర్యలు తీసుకోవాలి. ఉయిగర్ ముస్లింలు, ఇతర మైనార్టీల అణచివేతను అంతం చేయాలని కోరుతున్నాం’’ అని అన్నారు. అణచివేతకు గురువుతున్న వారిని విడుదల చేయాలని ఐక్యరాజ్య సమితి పిఫార్సులను చైనా అమలు చేయకపోవటంపై అమెరికా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుందని తెలిపారు. జిన్జియాంగ్లో ప్రధానంగా ముస్లిం ఉయిగర్లు ఇతర మైనారిటీలపై కొనసాగుతున్న అణచివేతపై అమెరికా తీవ్రంగా ఆందోళన చెందుతోందని అన్నారు. ఉయిగర్ ముస్లింలపై కొనసాగుతున్న అంతర్జాతీయ నేరాలు, మానవ హక్కులకు ఉల్లంఘనలు ముగింపు పలికేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని చైనాను మరోసారి కోరుతున్నామని మిల్లర్ అన్నారు. -
శాంతియత్నాలు ఆపొద్దు!
రష్యా–ఉక్రెయిన్ యుద్ధం పరిసమాప్తికి భిన్న మార్గాల్లో జరుగుతున్న ప్రయత్నాలు కాస్తా ఆ రెండు పక్షాల మొండి వైఖరులతో స్తంభించినట్టే కనబడుతోంది. రష్యాపై మరిన్ని దాడులు జరిపితే అది చర్చలకు సిద్ధపడుతుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ భావిస్తుండగా... దాన్ని పూర్తిగా లొంగ దీసుకునే వరకూ యుద్ధం ఆపే ప్రసక్తి లేదని రష్యా అధ్యక్షుడు పుతిన్ అధికార ప్రతినిధి తాజాగా తేల్చిచెప్పారు. యుద్ధం మొదలయ్యాక రెండు దేశాలతోనూ ఐక్యరాజ్యసమితితోపాటు భిన్న సంస్థలూ, దేశాలూ చర్చలు సాగిస్తూనే ఉన్నాయి. కానీ ఎవరికి వారు అంతిమ విజయం తమదేనన్న భ్రమల్లో బతుకున్నంత కాలం సమస్య తెగదు. అలాగని ఏదో మేరకు సమస్యలు పరిష్కారమవుతున్నాయన్నది వాస్తవం. ఉదాహరణకు హోరాహోరీ సమరం సాగుతున్నప్పుడు రెండేళ్ల క్రితం ఉక్రెయిన్ నుంచి ఆహారధాన్యాలు, ఎరువులు, పొద్దుతిరుగుడు నూనె ఉత్పత్తుల ఎగుమతులు నిలిచి పోగా ఐక్యరాజ్యసమితి చొరవ తీసుకుని రష్యా, ఉక్రెయిన్లతో మాట్లాడి సమస్యను పరిష్కరించింది. అప్పటికి యుద్ధం మొదలై ఆర్నెల్లు దాటింది. ఫలితంగా నిరుడు జూలై నాటికి దాదాపు మూడు న్నర కోట్ల టన్నుల ఆహారధాన్యాలు ఎగుమతయ్యాయి. ప్రపంచానికి ఆహార సంక్షోభం తప్పింది. ఇటీవలే ఈ రెండు దేశాల మధ్యా యుద్ధ ఖైదీల మార్పిడి కూడా జరిగింది. ఇరువైపులా చెరో 115 మంది సైనికులకూ చెర తప్పింది. తెర వెనక తుర్కియే సంక్షోభ నివారణకు ప్రయత్నిస్తుండగా ప్రధాని మోదీ అటు రష్యా, ఇటు ఉక్రెయిన్ సందర్శించి ఇరు దేశాల అధినేతలతోనూ మాట్లాడారు. వచ్చే నెలలో ఐక్యరాజ్యసమితి సమావేశాలకు వెళ్లినప్పుడు ఆయన మరోసారి జెలెన్స్కీని కలవ బోతున్నారు. అలాగే అక్టోబర్‌లో బ్రిక్స్ సమావేశాల కోసం రష్యా వెళ్లబోతున్నారు. మోదీ ఉక్రెయిన్ వెళ్లినందుకు పుతిన్ కినుక వహించినట్టే, అంతక్రితం రష్యా వెళ్లినందుకు జెలెన్స్కీ నిష్ఠూరాలాడారు. ఇప్పటికైతే ఉక్రెయిన్ ఒకవైపు నువ్వా నేనా అన్నట్టు రష్యాతో తలపడుతున్నా... డ్రోన్లతో, బాంబులతో నిత్యం దాడులు చేస్తున్నా చర్చల ప్రస్తావన తరచు తీసుకొస్తోంది. రష్యా చర్చలకు వచ్చి తీరుతుందని జెలెన్స్కీ ఇటీవల అన్నారు. అయితే ఇదంతా ఊహలపై నిర్మించుకున్న అంచనా. నిరంతర దాడులతో రష్యాకు గత్యంతరం లేని స్థితి కల్పిస్తే... ఆ దేశం చర్చలకు మొగ్గుచూపుతుందన్నది ఈ అంచనా సారాంశం. నిజానికి నాటో దేశాలు నిరంతరం సరఫరా చేస్తున్న మారణా యుధాలతో, యుద్ధ విమానాలతో ఉక్రెయిన్ దాదాపు మూడేళ్లుగా తలపడుతూనే ఉంది. పర్యవనసానంగా గతంలో కోల్పోయిన కొన్ని నగరాలను అది స్వాధీనం చేసుకుంది కూడా! కానీ రష్యా ప్రతిదాడులతో అవి ఎన్నాళ్లుంటాయో, ఎప్పుడు జారుకుంటాయో తెలియని స్థితి ఉంది. అత్యుత్సాహంతో ఉక్రెయిన్‌కు అత్యాధునిక ఆయుధాలను, ఎఫ్–16 యుద్ధ విమానాలను తరలించిన అమెరికా నెలలు గడుస్తున్నా వాటి వినియోగానికి ఇంతవరకూ అనుమతినివ్వనే లేదు. ఉదాహరణకు ఉపరితలం నుంచి ప్రయోగించే సైనిక వ్యూహాత్మక క్షిపణి వ్యవస్థ (ఏటీఏసీఎం) 300 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని అవలీలగా ఛేదిస్తుంది. బ్రిటన్–ఫ్రాన్స్ సంయుక్తంగా రూపొందించిన స్టార్మ్ షాడో 250 కిలోమీటర్ల దూరంలోని దేన్నయినా ధ్వంసం చేస్తుంది. ఈ రకం క్షిపణుల్ని గగనతలం నుంచి ప్రయోగిస్తారు. మరోపక్క జర్మనీ తయారీ టారస్ క్షిపణి కూడా ఇటువంటిదే. పైగా ఇది అమెరికా తయారీ క్షిపణిని మించి శక్తిమంతమైంది. 500 కిలోమీటర్లకు మించిన దూరంలోని లక్ష్యాన్ని గురిచూసి కొడుతుంది. ఇవన్నీ ఇంచుమించు ఏడాదిగా ఉక్రెయిన్ సైనిక స్థావరాల్లో పడివున్నాయి. ఎందుకైనా మంచిదని కాబోలు అమెరికా తన ఎఫ్–16లను నేరుగా ఉక్రెయిన్‌కు ఇవ్వకుండా నెదర్లాండ్స్, డెన్మార్క్‌లకు పంపి వారి ద్వారా సరఫరా చేసింది. వీటి వినియోగానికి ఉక్రెయిన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని బ్రిటన్, ఫ్రాన్స్ పట్టుబడుతుండగా అమెరికాతోపాటు జర్మనీ కూడా ఆ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అదే జరిగితే యుద్ధ తీవ్రత మరింత పెరిగి, రష్యా ఎంతకైనా తెగించే పరిస్థితి ఏర్పడొచ్చునని అమెరికా, జర్మనీ ఆందోళన పడుతున్నాయి. తన భూభాగంలోకి చొచ్చుకొచ్చి ఉక్రెయిన్ డ్రోన్ దాడులు చేస్తున్నా రష్యా నిర్లిప్తంగా ఉండిపోతుండగా ఈ అనవసర భయాలేమిటన్నది బ్రిటన్, ఫ్రాన్స్‌ల వాదన. కానీ ఒకసారంటూ ఎఫ్16లు వచ్చి పడితే, అత్యాధునిక క్షిపణులు విధ్వంసం సృష్టిస్తే రష్యా ఇలాగే ఉంటుందనుకోవద్దని పెంటగాన్ హెచ్చరిస్తోంది. తప్పనిసరైతే ఉక్రెయిన్ సరిహద్దుల ఆవల ఉన్న రష్యా స్థావరాలను లక్ష్యంగా చేసుకోమంటున్నది. ఈమధ్య క్రిమియాపై దాడికి అనుమతించింది. కానీ కూటమి మధ్య ఏకాభిప్రాయం కుదిరితే తప్ప రష్యా నగరాల జోలికి పోవద్దని చెబుతోంది. అంతగా భయపడితే అసలు ఇలాంటి ఆయుధాలు, యుద్ధ విమానాలు తరలించటం దేనికి? అవేమైనా ఎగ్జిబిషన్‌కు పనికొచ్చే వస్తువులా? వాటిని చూసి రష్యా ‘పాహిమాం’ అంటూ పాదాక్రాంతమవుతుందని అమెరికా నిజంగానే భావించిందా? యుద్ధం ఏళ్లతరబడి నిరంతరం కొనసాగుతుంటే ఎప్పుడో ఒకప్పుడు పరిస్థితి చేజారే ప్రమాదం ఉంటుంది. కనుక అమెరికా, పాశ్చాత్య దేశాలు వివేకంతో మెలగాలి. యుద్ధ విరమణకు సకల యత్నాలూ చేయాలి. దాడులతో ఒత్తిడి తెస్తే రష్యా దారికొస్తుందనుకుంటున్న ఉక్రెయిన్‌కు తత్వం బోధపడాలంటే ముందు అమెరికా సక్రమంగా ఆలోచించటం నేర్చుకోవాలి. ఉక్రెయిన్–రష్యా ఘర్షణ, గాజాలో ఇజ్రాయెల్ ఊచకోతలు ఆగనంతవరకూ ప్రపంచం సంక్షోభం అంచున ఉన్నట్టే లెక్క. అందుకే ప్రపంచ దేశాలు అప్రమత్తం కావాలి. శాంతి నెలకొల్పడానికి ప్రయత్నిస్తూనే ఉండాలి. -
పారిస్ ఒలింపిక్స్‌లో పసిడి పోరుకు.. భారత మహిళా స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్!
-
ఐరాసలో రామకథాపారాయణం
న్యూయార్క్: రామచరిత మానస్‌ను ఆధ్యాత్మిక వేత్త మొరారి బాపు న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో తొలిసారి పారాయణం చేయనున్నారు. ఐక్యరాజ్యసమితిలోని ప్రతినిధుల భోజనశాలలో 9 రోజుల పాటు ఈ పారాయణం జరగనుందని మొరారి బాపు తెలిపారు. శాంతిని పరిరక్షించడంతో పాటు మానసిక ఆరోగ్యానికి రామ కథలు మార్గం చూపుతాయన్నారు. రామాయణ సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ప్రపంచంలో సోదర భావాన్ని పెంపొందించి సరిహద్దులకు అతీతంగా ప్రజలను ఏకం చేయడమే లక్ష్యమన్నారు. రామచరిత మానస్‌ను ప్రముఖకవి తులసిదాస్ రచించారు. -
దివిసీమ బిడ్డకు ‘జగనన్న దీవెన’
మోపిదేవి(అవనిగడ్డ): పేదింటి బిడ్డలు ఉన్నతంగా జీవించాలనేదే వైఎస్ జగన్ తపన. అందులో భాగంగానే జగనన్న విదేశీ విద్యా దీవెన తెచ్చారు. ఎందరో భావి భారత పౌరులకు అందించారు. ఆ పథకాన్ని సద్వినియోగం చేసుకున్నాడు కృష్ణాజిల్లా దివిసీమ బిడ్డ. ఐక్యరాజ్య సమితిలో ఉన్నత స్థాయి రాజకీయ సమూహం ముందు ’సుస్థిర అభివృద్ధి’ అనే అంశంపై ప్రసంగించే అరుదైన అవకాశం దక్కించుకున్నాడు. అందరి చేత శెభాష్ అనిపించుకున్నాడు.వివరాల్లోకి వెళితే... కృష్ణాజిల్లా మోపిదేవి మండలం పెదకళ్లేపల్లి శివారు అడపావారిపాలెం గ్రామానికి చెందిన పండలనేని శివప్రసాద్, అన్నపూర్ణ దంపతుల రెండో కుమారుడు కృష్ణకిషోర్ ఆగస్టు 2023 నుంచి యూఎస్ఏలోని కొలంబియా యూనివర్సిటీలో స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ అండ్ పబ్లిక్ అఫైర్స్ (సీపా–ఎస్ఐపీఏ)లో మాస్టర్ ఆఫ్ పబ్లిక్ అడ్మిని్రస్టేషన్ విద్య అభ్యసిస్తున్నాడు.గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కృష్ణకిషోర్‌కు జగనన్న విదేశీ విద్యా దీవెన కింద రూ.కోటి మంజూరు చేసింది. నాటి ప్రభుత్వం అందించిన సాయానికి పూర్తి న్యాయం చేస్తూ కృష్ణకిషోర్ అమెరికాలో అదీ ఐక్యరాజ్య సమితి ఆహా్వనంతో ఉన్నత స్థాయి ప్రతినిధుల ముందు తన వాణి వినిపించే అద్భుత అవకాశాన్ని పొందాడు.న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో ఇటీవల జరిగిన సుస్థిర అభివృద్ధి (సస్టైనబుల్ డెవలప్మెంట్) అంశంపై అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఆహా్వనం అందుకున్నాడు. ఎస్ఐపీఏ స్టూడెంట్ అసోసియేషన్ అకడమిక్ చైర్మన్‌గా, సౌత్ ఏసియన్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్న కృష్ణకిషోర్ ప్రపంచ విశ్వవిద్యాలయాల అధ్యక్షులు, కార్పొరేట్ నాయకులు, సీనియర్ యునైటెడ్ నేషన్స్ అధికారులతో వేదికను పంచుకుని పది నిమిషాల పాటు ప్రసంగించి ఆకట్టుకున్నాడు.జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటాం వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటాం. ఆయన అందించిన జగనన్న విదేశీ విద్యా దీవెనతోనే మా బాబు కృష్ణకిషోర్ అమెరికా వెళ్లాడు. అటు ప్రభుత్వానికి, ఇటు మాకు పేరు ప్రతిష్టలు తీసుకురావడం ఎంతో సంతోషంగా ఉంది. – తల్లిదండ్రులు పండలనేని శివప్రసాద్, అన్నపూర్ణ -
జనశక్తి... శ్రమయుక్తి...
సగం నీళ్ళున్న గాజు గ్లాసును చూసి... సగం నిండుగా ఉందని ఆశావహ దృక్పథం అవలంబించవచ్చు. సగం ఖాళీయే అని నిరాశ పడనూవచ్చని మనస్తత్వ శాస్త్రవేత్తలు చెబుతారు. ప్రపంచ జనాభా గురించి, అందులోనూ భారత జనాభా పొంగు కుంగుల గురించి తాజాగా వెల్లడైన లెక్కల్ని చూసినప్పుడు సరిగ్గా ఇలాగే ఎవరి ఆలోచనలు, అంచనాలు వారివి. ఐక్యరాజ్యసమితి (ఐరాస) గత వారం విడుదల చేసిన ‘ప్రపంచ జనాభా దృశ్యం’ (డబ్ల్యూపీపీ) నివేదికలోని సమాచారం విస్తృత చర్చనీయాంశమైంది అందుకే! ప్రాథమికంగా ఈ నివేదిక ప్రపంచ జనసంఖ్య ఎలా మారనున్నదీ అంచనా వేసి, వివిధ ప్రాంతాలు, దేశాలపై దాని ప్రభావం ఎలా ఉండనుందో భవిష్యత్ దర్శనం చేస్తోంది. ప్రపంచ జనాభా గణనీయంగా పెరగనుందనీ, 2080ల నాటికి 1000 కోట్లు దాటుతుందనీ నివేదిక అంచనా. ఆ తరువాత నుంచి మొత్తం మీద జనాభా క్రమంగా తగ్గుతుందట. అలాగే, ఇప్పటికే ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశమని పేరుబడ్డ మన భారత్ గురించి కూడా ఈ నివేదిక కీలక అంచనాలు కట్టింది. ఫలితంగా ఈ నివేదిక ఆసక్తి రేపి, ఆలోచనలు పెంచుతోంది.అసలు 2011 తర్వాత మనం దేశంలో అధికారిక జనగణన జరగనే లేదు. దశాబ్దానికి ఒకసారి జరిపే కీలకమైన ఈ ప్రక్రియ నిజానికి 2021లోనే జరగాల్సి ఉంది. కరోనా కాలంలో ఈ బృహత్తర ప్రయత్నాన్ని ప్రభుత్వం పక్కనపెట్టింది. ఆ మహమ్మారి కథ ముగిసిన ఇన్నేళ్ళ తరువాత కూడా ఎందుకనో దానికి మోక్షం కలగనే లేదు. దేశ జనాభా స్థితిగతులపై స్పష్టమైన అవగాహన కల్పించి, పాలకులకూ, సంక్షేమ పథకాలకూ ఒక దిక్సూచిగా నిలవగలిగిన జనగణనపై ప్రభుత్వం ఎందుకనో ఇప్పటికీ ఉదాసీనత చూపుతోంది. ఈ పరిస్థితుల్లో ఐరాస వెలువరించిన ప్రతిష్ఠాత్మక డబ్ల్యూపీపీ నివేదిక మనకు మార్గదర్శి. లింగ, వయో భేదాల వారీగా వచ్చే 2100 వరకు భారత జనాభా ఎలా ఉండవచ్చనే అంచనాలను ఈ నివేదిక వివరంగా పేర్కొంది. జనసంఖ్యా సంబంధమైన సమాచారంలో ఈ ఐరాస నివేదిక ప్రపంచంలోనే అత్యంత ప్రామాణికమైనది కాబట్టి, సరిగ్గా ఉపయోగించు కుంటే భవిష్యత్ వ్యూహ రచన విషయంలో మన పాలకులకు ఇది బాగా పనికొస్తుంది. అధికారిక లెక్కలు లేకపోయినా, గడచిన 2023 జనవరి – జూలై నెలల మధ్యలోనే ప్రపంచంలోకెల్లా అత్యధిక జనాభా గల దేశంగా భారత్ అవతరించినట్టు వార్తలొచ్చాయి. గత వారపు ఐరాస లెక్క ప్రకారం ప్రస్తుతం మన దేశ జనాభా 145 కోట్లు. సమీప భవిష్యత్తులోనూ జనసంఖ్య విషయంలో చైనా కన్నా భారతే ముందుండనుంది. 2060లలో కానీ భారత జనాభాలో తగ్గుదల మొదలు కాదు. పెరుగుతున్న ఈ జనాభా తీరుతెన్నులు, మంచీచెడుల పట్ల సహజంగానే రకరకాల విశ్లేషణలు, వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. జనాభాతో పాటు పెరిగే కనీస అవసరాలను తీర్చడం అంత సులభమేమీ కాదన్నది నిజమే. అలాగని అధిక జనాభా అన్ని విధాలా నష్టమని అతిగా భయ పడాల్సిన అవసరమూ లేదు. అందుబాటులో ఉండే ఈ మానవ వనరులను సవ్యంగా వినియోగించుకోగలిగితే, ఏ దేశానికైనా దాని జనసంఖ్య అయాచిత వరమే అవుతుంది. ఐరాస నివేదిక ప్రకారం 2060ల వరకు, అంటే వచ్చే నాలుగు దశాబ్దాల పాటు భారత్‌కు అధిక జనాభా తప్పదు. దాన్ని సానుకూలంగా మార్చుకొని, ఎలా దేశాభివృద్ధికి సాధనం చేసుకోవాలన్నది కీలకం.పనిచేసే వయసు జనాభా భారత్‌లో ప్రస్తుతం 86 కోట్లుంది. 2049 వరకు ఈ సంఖ్య పెరు గుతూ పోయి, అప్పటికి వంద కోట్లు దాటుతుందట. 2047 కల్లా అభివృద్ధి చెందిన దేశంగా అవత రించాలని సంకల్పం చెబుతున్న మన పాలకులు నివేదికలోని ఈ అంచనాపై లోతుగా దృష్టి పెట్టాలి. పనిచేసే వయసులోని ఈ వంద కోట్ల మందిని ఎంత నిపుణులుగా తీర్చిదిద్దుతామన్నదాన్ని బట్టి దేశ పురోగతి ఉంటుంది. ఇటీవల గుజరాత్లో 10 ఉద్యోగాలకు 1,800 మంది – ముంబయ్‌లో 2 వేల ఉద్యోగాలకు 22 వేల మంది హాజరవడం, తొక్కిసలాట జరగడం దేశంలోని నిరుద్యోగ తీవ్రతకు మచ్చుతునక.‡ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం సమకాలీన అవసరాలకు తగ్గ నైపుణ్యాభివృద్ధిని కల్పించి, యువజనులను సరైన ఉపాధి మార్గంలో నడపడం ముఖ్యం. అలా చేయగలిగితే ఆర్థిక ముఖచిత్రమే మారిపోతుంది. లేదంటే ఇదే జనశక్తి ఆర్థిక, రాజకీయ అస్థిరతకు కారణమవుతుంది. ప్రపంచం సంగతికొస్తే రాగల దశాబ్దాల్లో సోమాలియా, రిపబ్లిక్ ఆఫ్ కాంగో సహా ప్రధానంగా ఆఫ్రికా ప్రాంతంలో జనాభా పెరగనుంది. విలువైన సహజ వనరులకు అవి నెలవైనందున భౌగోళిక రాజకీయ ప్రాబల్యం కోసం ఘర్షణలు తలెత్తవచ్చు. మన దాయాది పాకిస్తాన్ సైతం దాదాపు 39 కోట్ల జనాభాతో అమెరికాను సైతం దాటి, ప్రపంచ జనాభాలో మూడో స్థానంతో కీలకంగా మారనుంది. ఐరాస నివేదికలో మరో కీలకాంశం – ప్రపంచ జనాభా పతాక స్థాయికి చేరడానికి రెండు దశాబ్దాల ముందే 2060ల నుంచి భారత జనాభా తగ్గడం మొదలుపెడుతుంది. అదే సమయంలో పనిచేసే వయసులోని వారి సంఖ్య 2050 నుంచే తగ్గిపోనుంది. పనిచేసే వయసు (15నుంచి 65 ఏళ్ళు) కన్నా తక్కువ గానీ, ఎక్కువ గానీ ఉంటూ ఇతరులపై ఆధారపడేవారి నిష్పత్తి 2040 నుంచే పెరగనుంది. అంటే, నేటి యువశక్తి నైపుణ్యాలనూ, ఆర్జన మార్గాలనూ భవిష్యత్ అవసరాలకూ, ఆధారపడేవారికీ సరిపడేలా తీర్చిదిద్దడం ముఖ్యం. వృత్తివిద్యా శిక్షణ, అప్రెంటిస్ షిప్‌లతో మన చదువుల్ని కొంత పుంతలు తొక్కించాలి. లేదంటే, ఆధారపడేవారి సంఖ్య పెరిగాక చిక్కులు తప్పవు. ఏమైనా, రాగల మూడు దశాబ్దాలు ఇటు జనశక్తి, అటు శ్రమయుక్తితో సంఖ్యాపర మైన సానుకూలత మనదే. వాటితో ముడిపడ్డ చిక్కుల్ని ఎదుర్కొంటూ, ఈ శక్తిని సమర్థంగా వినియోగించుకోవడమే సవాలు. అందులో తడబడితే... అక్షరాలా ‘అమృతకాలం’ దాటిపోయినట్టే! -
ఆకాశంలో శాటిలైట్ల లెక్క తెలుసా?
ఇంటర్నెట్ నుంచి జీపీఎస్ దాకా..వాతావరణ అంచనాల నుంచి భూమ్మీద వనరుల అన్వేషణ దాకా.. రోజువారీ జీవితం నుంచి శాస్త్ర పరిశోధనల దాకా అన్నింటికీ శాటిలైట్లే కీలకం. ఇందుకే చాలా దేశాలు ఏటేటా మరిన్ని శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపుతూనే ఉన్నాయి. మరి మన భూమి చుట్టూ తిరుగుతున్న శాటిలైట్లు ఎన్ని?.. అవి ఎక్కడెక్కడ తిరుగుతున్నాయో ఓసారి తెలుసుకుందామా.. మూడు కక్ష్యల్లో.. ఐక్యరాజ్యసమితి ఆఫీస్ ఫర్ ఔటర్ స్పేస్ అఫైర్స్ గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది జూన్ 11వ తేదీ నాటికి భూమి చుట్టూ 11,870 శాటిలైట్లు తిరుగుతున్నాయి. అవి కూడా భూమి చుట్టూ మూడు కక్ష్యలలో తిరుగుతున్నాయి. అవి జియో స్టేషనరీ ఆర్బిట్ (జీఈఓ), మీడియం ఎర్త్ ఆర్బిట్ (ఎంఈఓ), లో ఎర్త్ ఆర్బిట్ (ఎల్ఈఓ). ఇందులో జీఈఓ కక్ష్యలోకి శాటిలైట్లను ప్రయోగించడానికి భారీ రాకెట్లు కావాలి. ఖర్చు చాలా ఎక్కువ. అందుకే అక్కడ శాటిలైట్లు బాగా తక్కువ. జీఈఓభూమికి సుమారు 35,786 కిలోమీటర్ల ఎత్తులో ఉండే కక్ష్య ఇది. పక్కాగా భూమి భ్రమణ వేగానికి సరిపడే వేగంతో శాటిలైట్లు ప్రయాణించేందుకు అనువైన ప్రాంతమిది. అంటే జీఈఓలో తిరిగే శాటిలైట్లు ఎప్పుడూ భూమ్మీద ఒకేప్రాంతంపైనే ఫోకస్ చేస్తూ స్థిరంగా ఉంటాయి. కమ్యూనికేషన్, వాతావరణ శాటిలైట్లను ఈ కక్ష్యలోనే ఉంచుతారు. ఎంఈఓభూమికి పైన 2 వేల కిలోమీటర్ల నుంచి 30 వేల కిలోమీటర్ల మధ్య ఉండే ప్రాంతం ఇది. జీపీఎస్, గ్లోనాస్ వంటి నావిగేషన్ శాటిలైట్లు, రక్షణ రంగ శాటిలైట్లు వంటివాటిని ఈ కక్ష్యల్లో తిరిగేలా చేస్తారు.ఎల్ఈఓభూమికిపైన కేవలం 150 కిలోమీటర్లనుంచి 450 కి.మీ. మధ్య ఉండే ప్లేస్ ఇది. ఇంటర్నెట్, ఫోన్ సిగ్నల్ సంబంధిత శాటిలైట్లు ఈ కక్ష్యల్లో ఉంటాయి. స్టార్ లింక్ శాటిలైట్లతో.. ప్రస్తుతమున్న శాటిలైట్లలో అత్యధికం ‘స్టార్ లింక్’శాటిలైట్ ఇంటర్నెట్ సంస్థకు చెందినవే. ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్‌్కకు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ ఆధ్వర్యంలోని స్టార్ లింక్ కోసం 6,050 శాటిలైట్లను ప్రయోగించింది. ఇవన్నీ కూడా గత ఐదేళ్లలో స్పేస్‌లోకి పంపినవే కావడం గమనార్హం. త్వరలోనే మరో 6వేల శాటిలైట్ల ప్రయోగానికి స్పేస్ ఎక్స్ సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. - సాక్షి సెంట్రల్‌డెస్క్ -
భద్రతా మండలికి పాక్
ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్యసమితిలోని ప్రధానమైన భద్రతా మండలికి శాశ్వతేతర సభ్య దేశాల కోటాలో 5 దేశాలు ఎన్నికయ్యాయి. అవి..పాకిస్తాన్, పనామా, సొమాలియా, డెన్మార్క్, గ్రీస్. ఐరాస జనరల్ అసెంబ్లీలో రహస్య బ్యాలెట్ విధానంలో గురువారం జరిగిన ఎన్నికలో ఆఫ్రికా, ఆసి యా–పసిఫిక్ ప్రాంతాలకుగాను సొమా లియా, పాకిస్తాన్‌లు, లాటిన్ అమెరికా, కరీబియన్ ప్రాంత దేశాలకుగాను పనామా, పశ్చిమ యూరప్, ఇతర దేశాలకుగాను డెన్మార్క్, గ్రీస్‌లు అత్యధిక ఓట్లు సంపాదించాయి. 2025 జనవరి నుంచి రెండేళ్ల పాటు 2026 డిసెంబర్ 31వ తేదీ వరకు ఇవి శాశ్వతేతర సభ్య హోదాలో కొనసాగుతాయి. -
రుచిగా ఉంటే తినేయడమే!
సాక్షి, అమరావతి: భారతీయుల ఆహార అలవాట్లు వేగంగా మారుతున్నాయి. ప్రపంచానికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని పరిచయం చేసిన వేద భూమి.. అనారోగ్యకర వంటకాల వైపు పరుగులు పెడుతోంది. దేశంలో 38 శాతం మంది వేయించిన, ప్రాసెస్ చేసిన పదార్థాలను అధికంగా ఆరగించేస్తున్నారు. కేవలం 28 శాతం మంది మాత్రమే ఆరోగ్యకరమైన పిండి ప్రధాన ఆహారం, కూరగాయలు, పండు, పప్పు, గింజ, మాంసాన్ని ఆహారంగా తీసుకుంటున్నారు. దేశ జనాభాలో 16.6 శాతం మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారని ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఐఎఫ్పీఆర్ఐ) తాజాగా ప్రపంచ దేశాల్లోని ఆహార అలవాట్లపై సర్వే చేసి విడుదల చేసిన ‘గ్లోబల్ ఫుడ్ పాలసీ రిపోర్టు–2024’ పేర్కొంది. భారతదేశంలో ఆహారపు అలవాట్లపై ఈ నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. పోషకాహారంతో పోలిస్తే అనారోగ్యకరమైన ఆహార వినియోగంలో గణనీయమైన పెరుగుదల నమోదైందని పేర్కొంది. కూరగాయలు, పండ్లు, ఇతర సూక్ష్మపోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకునే వారితో పోలిస్తే భారతదేశంలో ఎక్కువ మంది ఉప్పు లేదా వేయించిన స్నాక్స్ వంటి అనారోగ్యకరమైన ఆహారాన్నే ఇష్టపడుతున్నారని ప్రకటించింది. ప్రపంచంలో పెరుగుతున్న పోషకాహార లోపం చాలా దేశాలు రెట్టింపు పోషకాహార లోప భారాన్ని ఎదుర్కొంటున్నాయని గ్లోబల్ ఫుడ్ పాలసీ నివేదిక నొక్కి చెప్పింది. ఆఫ్రికా, దక్షిణాసియాలో చాలామంది ఆరోగ్యకరమైన ఆహారాన్ని పొందలేకపోతున్నారని.. రెండు బిలియన్ల కంటే ఎక్కువ మంది ప్రజలపై చేసిన పరిశోధన ద్వారా అంచనా వేసింది. ఐదేళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లల్లో సగానికి పైగా, వయోజన మహిళల్లో మూడింట రెండొంతుల మంది సూక్ష్మ పోషకాల లోపంతో బాధపడుతున్నట్టు ఐక్యరాజ్య సమితి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ తేల్చింది. భారత్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ వంటి దక్షిణాసియా దేశాల్లో పోషకాహార లోపంతో అధిక బరువు, ఊబకాయంతో పాటు సంబంధిత నాన్ కమ్యూనల్ డిసీజెస్ (ఎన్సీడీ) ప్రాబల్యం పెరుగుతున్నట్టు వెల్లడించింది. దక్షిణాసియాలో సూక్ష్మ పోషకాలు అధికంగా ఉండే ఆహారాలు ఖరీదైనవి కాగా.. ధాన్యాలు, కొవ్వులు, నూనె, చక్కెర, స్వీట్ అండ్ సాల్ట్ ఉండే చిరుతిళ్లు చౌకగా లభిస్తున్నట్టు నివేదిక పేర్కొంది. దాంతో ప్రజలు ఈ తరహా ఆహార వినియోగంపై మక్కువ చూపుతున్నట్టు తేల్చింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ఇటీవల విడుదల చేసిన ఆహార మార్గదర్శకాల ప్రకారం ప్యాకేజ్డ్ ఫుడ్‌పై అందించిన సమాచారం కూడా ప్రజలు పట్టించుకోవడం లేదని హెచ్చరించింది. సంస్థ అందించిన 17 ఆహార మార్గదర్శకాలలో సమాచారం, ఆరోగ్యకరమైన ఆహార ఎంపిక చేయడానికి ఆహార లేబుల్స్‌పై సమాచారాన్ని చదవమని ఐసీఎంఆర్ వినియోగదారులకు విజ్ఞప్తి చేసింది. అధిక కొవ్వు, చక్కెర, ఉప్పు, అ్రల్టా–ప్రాసెస్డ్ ఫుడ్స్ వినియోగాన్ని తగ్గించాలని కూడా సూచించింది. రోజువారీగా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకపోతే సమీప భవిష్యత్‌లో అనారోగ్య భారతదేశాన్ని చూడాల్సి ఉంటుందని ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తన నివేదికలో హెచ్చరించింది. నాలుగేళ్లలో ప్యాకేజ్డ్ ఫుడ్ వినియోగం రెట్టింపు నిత్యం తీసుకుంటున్న ఆహారంలో అధిక కేలరీలు గలవి, తక్కువ పోషకాలు గలవి ఎక్కువగా ఉంటున్నాయని నివేదిక పేర్కొంది. అంతేకాకుండా కూరగాయలు, ఇతర సూక్ష్మపోషకాలు అధికంగా ఉండే ఆహారాల వినియోగం తగ్గిపోతున్నట్టు కూడా హెచ్చరించింది. భారతదేశం, ఇతర దక్షిణాసియా దేశాల్లో ప్రాసెస్ చేసిన ఆహారాలు (చాక్లెట్లు, చక్కెర మిఠాయిలు, ఉప్పగా ఉండే స్నాక్స్, పానీయాలు, రెడీమేడ్ ఫుడ్) వినియోగం పెరుగుతోంది. ఆహార బడ్జెట్లో ఎక్కువ భాగం ప్యాకేజ్డ్ పాలు, స్నాక్స్ రెడీమేడ్ ఫుడ్‌కే ప్రాధాన్యం ఇస్తున్నట్టు తేల్చింది. భారతదేశంలో పోషకాహార లోపంతో బాధపడుతున్న వారు పెరుగుతున్నట్టు నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. పెద్దవారిలో అధిక బరువు పెరుగుదల 2006లో 12.9 శాతం నుంచి 2016 నాటికి 16.4 శాతానికి పెరిగింది. పోషకాహార లోపంతో బాధపడే వారి సంఖ్య పెరుగుతోంది పోషకాహార లోపంతో బాధపడే వారు 2011లో 15.4 శాతం ఉంటే.. 2021 నాటికి 16.6 శాతానికి పెరిగింది. జనాభాలో దాదాపు 17 శాతం మందికి జీవించేందుకు అవసరమైన ఆహారం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఇంటికి దూరంగా ఉంటున్నవారు ఆహారం, గృహావసరాల కోసం చేస్తున్న వార్షిక ఖర్చు 2015లో రూ.619 బిలియన్స్ ఉంటే, 2019లో అది రూ.820 బిలియన్లకు పెరిగింది. అంటే నాలుగేళ్లలో రూ.201 బిలియన్ల మేర పెరిగింది. అలాగే గృహ ఆహార బడ్జెట్లో ప్యాకేజ్డ్ (అత్యధికంగా ప్రాసెస్ చేసిన, అత్యధిక క్యాలరీలు ఉండేవి) ఆహార పదార్థాల వాటా 6.5 శాతం నుంచి 12 శాతానికి పెరిగింది. అంటే నాలుగేళ్లలో దాదాపు రెండింతలు పెరిగింది. సంపన్న కుటుంబాలు తమ ఆహార బడ్జెట్లో ఎక్కువ భాగం ప్రాసెస్ ఫుడ్‌పైనే ఖర్చు చేస్తున్నట్టు నివేదిక పేర్కొంది. -
Major Radhika Sen: కాంగోలో శాంతిదూత
భారత ఆర్మీకి చెందిన మేజర్ రాధికా సేన్‌కు ఐక్యరాజ్యసమితి 2023 సంవత్సరానికి గాను ‘మిలటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును ప్రకటించింది. ప్రతిష్టాత్మక ఈ అవార్డు కాంగోలో స్త్రీలు, బాలికల పట్ల హింస చోటు చేసుకోకుండా రాధికా సేన్ చూపిన శాంతి ప్రబోధానికి, ప్రచారానికి నిదర్శనం. రాధికాసేన్ పరిచయం.తు΄ాకీ పట్టుకొని శాంతి కోసం ప్రయత్నించడం జటిలమైన పని. అంతర్యుధ్ధం జరిగే దేశాల్లో బయటి దేశాల నుంచి వెళ్లి ఈ పని చేయాలంటే ్ర΄ాణాలతో చెలగాటం. కాని ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని పీస్ కీపింగ్ ఫోర్స్ ఆయా దేశాలలో శాంతి కోసం ΄ోరాటం చేస్తూనే ఉంటుంది. ్ర΄ాణాలకు తెగిస్తూనే ఉంటుంది. అందుకే ఈ శాంతి దళాలలో గొప్పగా పని చేసిన వారికి ఐక్యరాజ్యసమితి వివిధ విభాగాలలో అవార్డులు ఇస్తుంటుంది. లింగ వివక్ష, మహిళలపై హింసను సమర్థంగా నియంత్రించడానికి పని చేసే వారికి ‘మిలటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్’ ఇస్తోంది. 2023 సంవత్సరానికి ఆ అవార్డు మన ఆర్మీ మేజర్ రాధికా సేన్‌కు దక్కింది.ఈ కాంగోలో ఘోరాలుమధ్య ఆఫ్రికాలో రెండు కాంగోలు ఉన్నాయి. ఒకటి ‘రిపబ్లిక్ ఆఫ్ కాంగో’ (ఆర్ఓసి), రెండు ‘డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో’ (డిఆర్సి). ఆఫ్రికాలో రెండవ అతి పెద్ద దేశం డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. ఒకప్పుడు బెల్జియం వలసగా ఉన్న ఈ దేశం స్వతంత్రం ΄÷ంది ‘మొబుతు’ అనే నియంత ΄ాలనలో మగ్గింది. అతణ్ణి ప్రజలు కిందకు దించాక 1998 నుంచి అక్కడ అస్థిర ΄ాలన కొనసాగుతూ ఉంది. తరచూ అంతర్యుద్ధాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఆ దేశ తూర్పు ్ర΄ాంతాలైన ఇటురి, నార్త్ కీవోలలో రెండు సాయుధ దళాల వల్ల దాడులు జరుగుతున్నాయి. ‘ఎయిడెడ్ డెమొక్రటిక్ ఫోర్సెస్’ అనే గ్రూప్, ‘హుతూస్’ అనే మరో గ్రూప్ తమ తమ కారణాల రీత్యా తీవ్ర హింసకు ΄ాల్పడుతుంటాయి. ఈ రెండు గ్రూపుల మధ్య సామాన్య జనం నలుగుతున్నారు. వీరిని అదుపు చేయడానికి వచ్చే సైన్యం వీరి కంటే ఎక్కువ హింసకు ΄ాల్పడుతోంది. వీటన్నింటి మధ్య కనీస ఓదార్పుగా ఐక్యరాజ్య సమితి శాంతి దళాలు పని చేస్తున్నాయి.అత్యాచార పర్వంరిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని దాదాపు 30 లక్షల మంది స్త్రీలు, బాలికలు ఏదో ఒక మేర హింసకు, లైంగిక హింసకు లోనయ్యారు. అర్ధరాత్రి అపరాత్రి ప్రత్యర్థి గ్రూపులు దాడి చేసి స్త్రీలు, బాలికల మీద అత్యాచారాలు చేసి మగవారిని చంపేసి ΄ోతారు. ఇవి అక్కడ స్త్రీల మీద తీవ్రమైన మానసిక ప్రభావాన్ని ఏర్పరుస్తున్నాయి. అత్యాచారాల వల్ల వారిలో చాలామంది హెచ్.ఐ.వి/ఎయిడ్స్ బారిన పడుతున్నారు. అక్కడి చిన్నపిల్లలైతే దారుణమైన ఆకలిని ఎదుర్కొంటున్నారు. ΄ûష్టికాహారం ఊసే లేదు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని బాధిత స్త్రీలలో విశ్వాసం నింపుతూ వారి కోసం సమర్థంగా పని చేయడం వల్ల రాధికా సేన్‌ను అవార్డు వరించింది.బాధితుల కోసం దూతగా వచ్చి...ఐక్యరాజ్య సమితి శాంతి దళాలలో భాగంగా ఆర్మీ మేజర్ రాధికా సేన్ 2023 ఏప్రిల్‌లో డి.ఆర్.కాంగోకు వెళ్లింది రాధికా సేన్. ‘ఇండియన్ రాపిడ్ డి΄్లాయ్మెంట్ బెటాలియన్’కు ఆమె అక్కడ కమాండర్‌గా పని చేసింది. అక్కడ మొదటగా ఆమె చేసిన పని తన బెటాలియన్‌కు కాంగో సంస్కృతిని పరిచయం చేయడం. స్త్రీల పట్ల సుహృద్భావనతో ఎలా మెలగాలో తెలియచేయడం. వారిలో ఆత్మవిశ్వాసం ఎలా కలిగించాలో చెప్పడం. రాధికా సేన్ నార్త్ కీవోలో పని చేసింది. అక్కడ స్త్రీల కోసం హెల్త్ ఎడ్యుకేషన్, ఉ΄ాధి, లింగ సమానత్వం, కుటుంబ నిర్ణయాల్లో స్త్రీ ్ర΄ాధాన్యం వంటి అంశాలలో రాధికా సేన్ వర్క్‌షాప్‌లు నిర్వహించింది. భర్తలను, పిల్లలను కోల్పోయిన స్త్రీలలో ఆత్మవిశ్వాసం నింపేలా వారితో తరచూ ఆమె సంభాషణలు నిర్వహించేది. వారు మళ్లీ పనిలో పడేలా చూసింది. హింసను సమష్టిగా ఎలా ఎదుర్కొనాలో అవగాహన కల్పించింది. కాంగో మహిళలు రాధికా సేన్‌ను తమలోని మనిషిగా చూశారు. ఆమె ద్వారా వారి ముఖాల్లో చిరునవ్వులు వచ్చాయి. అందుకే ఐక్యరాజ్యసమితి సెక్రెటరి జనరల్ ఆంటోనియో గుటెరస్ రాధికా సేన్‌కు అవార్డు ప్రకటిస్తూ ‘రాధికా సేన్ కాంగో మహిళలను గొంతెత్తేలా చేయగలిగింది. శాంతి కోసం వారు ముందుకొచ్చేలా ఉద్యుక్తుల్ని చేసింది’ అని మెచ్చుకున్నారు. మే 30 (నేడు) రాధికా సేన్‌కు అవార్డు బహూకరించనున్నారు. -
వాళ్లను చంపేయండి!
టెల్ అవీవ్: అమాయక పాలస్తీనియన్లపై విచక్షణారహితంగా విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ సైన్యానికి అమెరికా నేతలు పూర్తి సహకారం అందిస్తున్నారని తెలిపే ఫొటో ఒకటి బహిర్గతమైంది. శాంతికాముక ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారిగా సేవలందించిన రిపబ్లికన్ పార్టీ నాయకురాలు నిక్కీ హేలీ హమాస్‌పై ఇజ్రాయెల్ దాడికి పూర్తి మద్దతు పలుకుతూ ఒక మిస్సైల్‌పై తన సందేశం రాశారు. ఇజ్రాయెల్‌లో పర్యటిస్తున్న సౌత్ కరోలినా మాజీ గవర్నర్ నిక్కీ హేలీ లెబనాన్ సరిహద్దు వెంట ఇజ్రాయెల్ స్థావరాలకు వెళ్లారు. గాజా స్ట్రిప్‌పై గగనతల దాడికి సిద్ధంగా ఉంచిన ఒక క్షిపణిపై ‘ వాళ్లను చంపేయండి. అమెరికా ఎల్లప్పుడూ ఇజ్రాయెల్‌కు తోడుగా ఉంటుంది’ అని రాసి సంతకం చేశారు. అయితే దేశాన్ని శాంతియుతంగా పాలిస్తానంటూ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యరి్థత్వం కోసం పోటీపడిన నాయకురాలు ఇలా యుద్ధజ్వాలలు మరింత రగిలించడమేంటి? అంటూ నెటిజన్లు నిక్కీ హేలీపై విమర్శలు గుప్పించారు. -
India vs China: టగ్ ఆఫ్ వార్‌లో భారత బలగాల గెలుపు
ఖార్టూమ్: చైనా బలగాలపై భారత్ సైనికులు పైచేయి సాధించారు. ఇది యుద్ధంలో కాదు..! ఐక్యరాజ్యసమితి పీస్ కీపింగ్ మిషన్‌లో భాగంగా సుడాన్లో నిర్వహించిన ‘టగ్ ఆఫ్ వార్’ పోటీలో చైనాను భారత బలగాలు ఓడించాయి. ఈ విషయాన్ని ఇండియన్ ఆర్మీ అధికారులు వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.#WATCH | Indian troops won a Tug of War that took place between them and Chinese troops during deployment in Sudan, Africa under a UN Peacekeeping mission: Army officials (Viral video confirmed by Indian Army officials) pic.twitter.com/EpnGKURPa3— ANI (@ANI) May 28, 2024 టాగ్ ఆఫ్ వార్ పోటీలో భారత్, చైనా బలగాలు పోటీ పడ్డాయి. ఈ పోటీలో భారత్ బలగాలు టీం వర్క్, అద్భుతమైన పట్టుదలతో కూడిన సామర్థాన్ని ప్రదర్శించి చైనా బలగాలను ఓడించారు. స్నేహ పూర్వకంగా జరిగిన ఈ పోటీ.. అక్కడ ఉన్న మిగతా సైనికుల్లో ఉత్సాహాన్ని నింపింది.యునైటెడ్ నేషన్స్ మిషన్ ఇన్ ద సూడాన్(UNMIS) ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి నిబంధనలతో 24 మార్చి, 2005 ఏర్పాటైంది. ఈ క్రమంలోనే సూడాన్ ప్రభుత్వం, సూడాన్ పీపుల్స్ లిబరేషన్ మూవ్మెంట్ మధ్య 9 జనవరి, 2005లో శాంతి ఒప్పందం కుదిరింది. అప్పటి నుంచి సూడాన్ శాంతి ఒప్పందానికి సంబంధించి పలు కార్యక్రమాలు చేపడుతోంది. మానవతా సాయం, మానవ హక్కుల పరిరక్షణ, ఆఫ్రికా యూనియన్ మిషన్‌కు మద్దతు పలకటం వంటి కార్యక్రమాలను చేపడుతోంది. అందులో భాగంగా నిర్వహించినదే భారత్-చైనా మధ్య నిర్వహించిన టగ్ ఆఫ్ వార్ స్నేహపూర్వక పోటీ అని అధికారులు తెలిపారు. -
వన సంపదకు పెద్ద ఆపద!
సాక్షి, అమరావతి: ప్రకృతికి మనిషి హాని తలపెడుతున్నాడు. తద్వారా తన ఉనికిని తానే దెబ్బతీసుకుంటున్నాడు. జంతుజాలాన్ని బతకనివ్వడం లేదు. మనిషి స్వార్థం వృక్షజాలాన్నీ వదలడం లేదు. తత్ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా వన్యప్రాణులు అంతరించిపోతున్నాయి. వృక్షజాలమూ బోసిపోతోంది. అక్రమ వ్యాపారుల దుశ్చర్యలకు పర్యావరణం సమతౌల్యాన్ని కోల్పోతోంది. 2015–2021 మధ్య కాలంలో 162 దేశాల్లో యథేచ్ఛగా జంతు, వృక్షజాతుల అక్రమ వాణిజ్యం జరిగినట్టు ఐక్యరాజ్య సమితి నివేదిక చెబుతోంది. దాదాపు 4 వేలకు పైగా జంతు, వృక్షజాతులు నిత్యం అక్రమ రవాణాలో పట్టుబడుతున్నట్టు ఇటీవల ఐక్యరాజ్యసమితి ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్ విడుదల చేసిన వరల్డ్ వైల్డ్ లైఫ్ క్రైమ్ రిపోర్ట్–2024లో పేర్కొంది. వీటిల్లో సుమారు 3,250 రకాలు అంతరించిపోతున్న జాతుల్లో ఉండటం కలవరపెడుతోంది. ఫ్యాషన్ ఉత్పత్తులు, గృహోపకరణాలు, అలంకరణ వస్తువుల తయారీ, ఔషధాల కోసం చట్ట విరుద్ధంగా అడవుల్లోని జీవజాలాన్ని మట్టుబెడుతున్నట్టు నివేదిక స్పష్టం చేసింది. ఖడ్గమృగం, దేవదారు వృక్షాలు అక్రమ వ్యాపారానికి ఎక్కువగా అంతరించిపోయినట్లు తేల్చింది. బ్లాక్ మార్కెట్లో ఖడ్గమృగం కొమ్ము 29 శాతం డిమాండ్‌తో అగ్ర స్థానంలో నిలిచింది. ఆ తర్వాత పాంగోలిన్ స్కేల్స్ 28 శాతం, ఏనుగు దంతాలు 15 శాతంగా ఉన్నాయి. అక్రమ రవాణాకు తెగటారిపోతున్న జంతు, వృక్షజాలం అక్రమ వ్యాపారానికి బలవుతున్న జంతు జాతుల్లో ఏనుగులు (6 శాతం), ఈల్స్ (5 శాతం), మొసళ్లు (5 శాతం), చిలుకలు, కాకాటూలు (2 శాతం), సింహాలు, పులుల వంటి ఇతర మాంసాహార జంతువులు (2 శాతం), తాబేళ్లు (2 శాతం), పాములు (2 శాతం), సీహార్స్ చేపలు (2 శాతం) ఉన్నాయి. అక్రమ రవాణాలో ధూపం, పరిమళ ద్రవ్యాలు, కలప, ఔషధాల వినియోగానికి దేవదారు, మహోగని, హోలీ వుడ్, గుయాకం వృక్ష జాతులు యథేచ్ఛగా నరికి వేస్తున్నారు. మార్కెట్లో వీటి వాటా 47 శాతంగా ఉంది. ఇంకా రోజ్‌వుడ్ 35 శాతం, ఔషధ మొక్కలు అగర్వుడ్ , రామిన్, యూకలిప్టస్ 13 శాతంగా ఉన్నాయి. సముద్ర జీవులకు ఆవాసాన్ని కల్పించడంతో పాటు తీరప్రాంతాన్ని కోత నుంచి రక్షించడంలో కీలక పాత్ర పోషించే పగడపు దిబ్బలనూ అక్రమ వ్యాపారులు తొలిచేస్తున్నారు. అక్రమ రవాణాలో ఈ పగడాల వాటా 16 శాతంగా ఉంటోంది. గత దశాబ్దంలో ఏనుగు దంతాలు, ఖడ్గమృగం కొమ్ముల వేట తగ్గినట్టు నివేదిక చెబుతోంది. మార్కెట్లోనూ ధరలు క్షీణించినట్టు తెలిపింది. కరోనా కాలంగా చైనా మార్కెట్లు మూసివేయడంతో ఇది జరిగి ఉండవచ్చని భావిస్తోంది. దేశ సరిహద్దుల్లో అక్రమ రవాణా గుర్తింపు భారత్‌లోనూ విమానాశ్రయాలు, ఓడరేవులు, దేశ సరిహద్దు రాష్ట్రాలైన మిజోరం, మణిపూర్లలో ఎక్కువగా వన్యప్రాణుల అక్రమ రవాణాను గుర్తించారు. స్మగ్లింగ్ ఇన్ ఇండియా రిపోర్టు 2022–23 ప్రకారం 1,652 క్షీరదాలు, పక్షులు, సరీసృపాలు, ఉభయచర జాతులను స్వా«దీనం చేసుకున్నట్టు డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ పేర్కొంది. వీటిల్లో 40 శాతానికి పైగా అత్యంత ప్రమాదంలో ఉన్న జాతులుగా పేర్కొంది. సజీవంగా ఉన్న జంతువులు ముఖ్యంగా పెంపుడు జంతువులకు విదేశాల్లో డిమాండ్ పెరుగుతున్నందుకు దేశంలో అక్రమ వ్యాపారం పెరిగినట్టు వన్య ప్రాణుల నేర నియంత్రణ నిపుణులు చెబుతున్నారు. -
పపువా న్యూ గినియా విషాదం..
మెల్బోర్న్: దక్షిణ పసిఫిక్ ద్వీప దేశం పపువా న్యూ గినియా శుక్రవారం కొండచరియలు విరిగి పడిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఎంగా ప్రావిన్స్‌లోని యంబాలి గ్రామంలో చోటుచేసుకున్న ఘటనలో 670 మంది వరకు చనిపోయి ఉంటారని మొదట ఐరాస విభాగం అంచనా వేసింది. అయితే, మట్టిదిబ్బల కింద రెండు వేలమందికి పైగానే గ్రామస్తులు సజీవ సమాధి అయి ఉంటారని పపువా న్యూ గినియా ప్రభుత్వం లెక్కగట్టింది. ఈ మేరకు ఐరాసకు సమాచారం పంపింది. ఈ విషాద సమయంలో తమను ఆదుకోవాలంటూ అంతర్జాతీయ సమాజానికి విజ్ఞప్తి చేసింది. అయితే, ఐరాస వలసల విభాగం మాత్రం నేలమట్టమైన 150 నివాసాలను పరిగణనలోకి తీసుకునే మృతుల సంఖ్య 670గా నిర్ణయించామని, ప్రభుత్వ గణాంకాలపై మాట్లాడబోమని తెలిపింది. మృతుల సంఖ్యను 2 వేలుగా ఏ ప్రాతిపదికన నిర్ణయించారని ప్రధాని జేమ్స్ మరాపేను మీడియా ప్రశ్నించగా ఆయన బదులివ్వలేదు. కాగా, దేశంలో దశాబ్దాలుగా జనగణన జరగలేదు. సైన్యం కాపలా మధ్య.. గ్రామంలోని 200 మీటర్ల ప్రాంతంలో ఉన్న నివాసాలను 6 నుంచి 8 మీటర్ల మేర భారీ రాళ్లు, చెట్లు, మట్టి భూస్థాపితం చేశాయి. స్థానికులే తమ వ్యవసాయ పరికరాలైన పార, గొడ్డలి వంటి వాటితో వాటిని తొలగిస్తున్నారు. ఇప్పటి వరకు ఆరు మృతదేహాలను మాత్రమే వెలికి తీయగలిగారు. స్థానిక కాంట్రాక్టర్ పంపించిన బుల్డోజర్తో ఆదివారం నుంచి పని చేయిస్తున్నారు. -
International Court of Justice: రఫాలో సైనిక చర్య ఆపండి
ది హేగ్: దక్షిణ గాజాలోని రఫా నగరంలో సైనిక చర్యను తక్షణం ఆపాలని ఇజ్రాయెల్‌ను ఐక్యరాజ్యసమితికి చెందిన ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ శుక్రవారం ఆదేశించింది. అయితే ఇజ్రాయెల్ ఈ ఆదేశాలకు కట్టుబడి ఉండకపోవచ్చు. పాలస్తీనియన్లపై దాడుల విషయంలో అంతర్జాతీయంగా మద్దతు కోల్పోతున్న ఇజ్రాయెల్‌పై కోర్టు ఆదేశాలు మరింత ఒత్తిడిని పెంచుతాయి. గాజాపై ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో 10 లక్షల పైచిలుకు పాలస్తీనియన్లు రఫాకు వలస వచ్చారు. వీరిలో చాలామంది టెంట్లలో నివసిస్తున్నారు. రఫాపై ఇజ్రాయెల్ దృష్టి సారించడంతో మిత్రదేశం అమెరికాతో సహా పలుదేశాలు వారించాయి. ఈ వారమే మూడు యూరోప్ దేశాలు తాము పాలస్తీనాను స్వతంత్రదేశంగా గుర్తిస్తున్నట్లు ప్రకటించాయి. హమాస్‌కు మిగిలిన చివరి సురక్షిత స్థావరంగా రఫా ఉందని, దానిపై దాడి చేస్తేనే వారిని తుడిచిపెట్టగలమని ఇజ్రాయెల్ అంటోంది. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ (ఐసీజే) అధ్యక్షుడు నవాఫ్ సలామ్ తీర్పు వెలువరిస్తూ ‘రఫాలో సైనిక చర్యపై తాము వెలిబుచ్చిన భయాలు నిజమయ్యాయని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ తక్షణం రఫాలో సైనిక చర్య నిలిపివేయకుంటే భారీగా ప్రాణనష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రెండు వారాల కిందట రఫాను ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ హెచ్చరికలు జారీచేసింది. సైన్యాన్ని రఫా దిశగా నడిపించి కీలకమైన సరిహద్దు మార్గాన్ని తమ ఆ«దీనంలోకి తీసుకొంది. మానవతాసాయం అందడానికి రఫా క్రాసింగ్ అత్యంత కీలకం. అందుకే రఫా క్రాసింగ్‌ను తెరిచి ఉంచాలని ఐసీజే శుక్రవారం ఇజ్రాయెల్‌ను ఆదేశించింది. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఆదేశాలు అంతర్జాతీయంగా ఇజ్రాయెల్‌కు ఎదురుదెబ్బే అయినా .. రఫాపై దాడులు చేయకుండా ఇజ్రాయెల్‌ను నిలువరించలేవు. ఎందుకంటే ఐసీజే వద్ద తమ ఆదేశాలను అమలుచేయడానికి అవసరమైన పోలీసు, సైనిక బలగాలేమీ లేవు.