ఐరాస వేదికగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ పునరుద్ఘాటన
ఐక్యరాజ్యసమితి: ఉత్తర ఇజ్రాయెల్ సరిహద్దు వెంట తరచూ తమపై కవి్వంపు దాడులు చేస్తున్న హెజ్‌బొల్లాపై తమ వైమానిక దాడులను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఐక్యరాజ్యసమితి సాక్షిగా సమరి్థంచుకున్నారు. హెజ్‌బొల్లా సాయుధ సంస్థపై పోరాటం ఆపబోమని, విజయం సాధించేదాకా పోరు కొనసాగుతుందని పునరుద్ఘాటించారు. న్యూయార్క్ నగరంలో ఐరాస సర్వ సభ్య సమావేశాల సందర్భంగా శుక్రవారం నెతన్యాహూ ప్రసంగించారు. హెజ్‌బొల్లాపై దాడులు ఆపబోమని చెప్పి అమెరికా జోక్యంతో పుట్టుకొస్తున్న కాల్పులవిరమణ ప్రతిపాదనలకు నెతన్యాహూ పురిట్లోనే సంధికొట్టారు. ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలు కొన్ని..
రోజూ రాకెట్ దాడులను సహించం
‘‘పొంచిఉన్న ప్రమాదాన్ని తప్పించాల్సిన కర్తవ్యం ఇజ్రాయెల్‌పై ఉంది. మెక్సికోతో సరిహద్దును పంచుకుంటున్న అమెరికా నగరాలు ఎల్ పాసో, శాండిగోలపైకి ఉగ్రవాదులు దాడులు చేస్తే జనం పారిపోయి నగరాలు నిర్మానుష్యంగా మారితే అమెరికా ఎన్ని రోజులు చూస్తూ ఊరుకుంటుంది?. మేం కూడా అంతే. దాదాపు ఏడాదికాలంగా హెజ్‌బొల్లా దాడులను భరిస్తున్నాం. మాలో సహనం నశించింది. ఇక చాలు. సొంతిళ్లను వదిలి వెళ్లిన 60,000 మంది సరిహద్దు ప్రాంతాల ఇజ్రాయెలీలను సొంతిళ్లకు చేర్చాల్సిన బాధ్యత మాపై ఉంది. సరిహద్దు వెంట ఇప్పుడు మేం చేస్తున్నది కూడా అదే. మా లక్ష్యం నెరవేరేదాకా హెజ్‌బొల్లాపై దాడులను ఆపేది లేదు’’ అని నెతన్యాçహూ అన్నారు.
అందుకే వచ్చా
‘‘నిజానికి ఈ ఏడాది ఐరాసలో మాట్లాడేందుకు రావొద్దనుకున్నా. అస్థిత్వం కోసం గాజా్రస్టిప్‌పై సైనిక చర్య మొదలయ్యాక నా దేశం యుద్ధంలో మునిగిపోయింది. అయితే ఐరాస పోడియం నుంచే పలు దేశాధినేతలు వల్లెవేస్తున్న అబద్ధాలు, వదంతులకు చరమగీతం పాడేందుకే ముక్కుసూటిగా మాట్లాడుతున్నా. ఇరాన్ శాంతిని కోరుకుంటా అంటుంది కానీ చేసేది వేరేలా ఉంటుంది. ఒక్కటి స్పష్టంగా చెబుతున్నా. మాపై ఎవరు దాడి చేస్తే వాళ్లపై దాడి చేస్తాం. ఈ ప్రాంతంలో ఎన్నో సమస్యలకు ఇరాన్ మూల కారణం’’ అని అన్నారు.
90% హమాస్ రాకెట్లు ధ్వంసంచేశాం
‘‘గాజాలో యుద్ధం తుది దశకు వచి్చంది. ఇక హమాస్ లొంగిపోవడమే మిగిలి ఉంది. ఆయుధాలు వీడి బందీలను వదిలేయాలి. లొంగిపోబోమని మొండికేస్తే గెలిచేదాకా యుద్ధంచేస్తాం. సంపూర్ణ విజయమే మా లక్ష్యం. దీనికి మరో ప్రత్యామ్నాయమే లేదు. యుద్ధబాటలో హమాస్ పయనించడం మొదలెట్టాక మాకు కూడా ఇంకో మార్గం లేకుండాపోయింది. 90 % హమాస్ రాకెట్లను ధ్వంసంచేశాం. 40వేల హమాస్ బలగాల్లో సగం మంది చనిపోవడమో లేదంటే మేం వాళ్లను బందీలుగా పట్టుకోవడమో జరిగింది అని అన్నారు.
ఓవైపు ఆశీస్సులు... మరోవైపు శాపం
ఆశీస్సులు, శాపం అనే పేర్లు పెట్టి రెండు భిన్న ప్రాంతాల భౌగోళిక పటాలను నెతన్యాహూ పట్టుకొచ్చి వివరించారు. ‘‘ ఆశీస్సులు కావాలో, శాపం కావాలో ప్రపంచదేశాలు తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది. అరబ్ దేశాలతో మైత్రి బంధం పటిష్టం చేసుకుంటూ ఇజ్రాయెల్.. ఆసి యా, యూరప్‌ల మధ్య భూతల సేతువును నిర్మిస్తూ ఇజ్రాయెల్ ఆశీర్వదిస్తోంది. ఇంకో మ్యాప్ మొత్తం శాపాలతో నిండిపోయింది.
హిందూ మహాసముద్రం నుంచి మధ్యధరాసముద్రం దాకా పరుచుకున్న ఉగ్రనీడ ఇది. ఇది ప్రపంచదేశాలకు శాపం. ఇరాన్‌లో ఇజ్రాయెల్ చేరుకోలేనంత దూరంలో ఏ భూమీ లేదు’’ అంటూ తప్పనిపరిస్థితుల్లో అవసరమైతే ఇరాన్‌పైనా దాడి చేస్తామని పరోక్షంగా హెచ్చరించారు. నెతన్యాహూ తెచి్చన మ్యాప్‌లో గాజా్రస్టిప్ మొత్తాన్నీ ఇజ్రాయెల్‌లో భాగంగానే చూపారు. హమాస్, హెజ్‌బొల్లాలపై పోరాడుతున్న తమ సైనికులను పొగుడుతూ నెతన్యాహూ చేస్తున్న ప్రసంగం వినడం ఇష్టంలేని చాలా మంది ప్రపంచ నేతలు ఆయన ప్రసంగం మొదలెట్టగానే హాల్ నుంచి వెళ్లిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment